మిలటరీ దుస్తుల్లో ఉన్న నిందితుడిని అరెస్ట్‌చేసిన పోలీసులు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న వైద్యసిబ్బంది
క్రైస్ట్‌చర్చ్: ప్రపంచంలోనే ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్‌లో మారణహోమం. ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం న్యూజిలాండ్‌లోని మసీదుల్లో నరమేధం చోటుచేసుకుంది. క్రైస్ట్‌చర్చ్ సిటీలోని రెండు మసీదులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 49 మంది అమాయకులు అసువులు బాశారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 9 మంది భారతీయుల జాడ తెలీడంలేదని న్యూజిలాండ్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం తెలిపింది. ఈ దాడి ఉగ్రవాద చర్యేనని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ధ్రువీకరించారు. కాల్పులు జరిగిన అల్ నూర్ మసీదు, లిన్‌వుడ్ అవెన్యూ మసీదుల మధ్య దూరం దాదాపు ఐదు కిలోమీటర్లు కాగా, రెండు చోట్లా కాల్పులు వేర్వేరు సమయాల్లో చోటుచేసుకున్నాయి. దీంతో రెండు మసీదుల్లో కాల్పులు జరిపింది ఒక్క ఉగ్రవాదేనా లేక ఇద్దరున్నారా అన్న విషయంపై స్పష్టతరాలేదు. కాగా, కాల్పుల ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు త్రుటిలో తప్పించుకుంది. వారంతా అల్‌నూర్ మసీదుకు బస్సులో వెళ్తుండగా, బస్ మసీదు వద్దకు చేరాక, ఆటగాళ్లు ఇంకా బస్‌లో ఉండగానే కాల్పులు ప్రారంభమైనట్లు సమాచారం.
పక్కా ప్రణాళికతోనే ఈ దాడి: ప్రధాని జసిండా
న్యూజిలాండ్‌లో ముస్లింలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని తెలుస్తోంది. ప్రధాని జసిండా మాట్లాడుతూ ‘ఇది ఉగ్రవాద దాడేనన్న విషయం స్పష్టమవుతోంది. న్యూజిలాండ్‌కు అత్యంత చీకటిరోజుల్లో ఇదొకటి. ఇది పక్కాగా ప్రణాళిక రచించి జరిపిన దాడి’ అని చెప్పారు. ఎంత మంది ఉగ్రవాదులు కాల్పులు జరిపారన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ తాము ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని జసిండా వెల్లడించారు. రెండు భారీ పేలుడు పరికరాలను మిలిటరీ గుర్తించి నిర్వీర్యం చేసిందన్నారు. ఇది అసాధారణ, ఎవరూ ఊహించని హింసాత్మక ఘటన అని ఆమె పేర్కొన్నారు. అల్ నూర్ మసీదు వద్ద 41 మంది, లిన్‌వుడ్ అవెన్యూ మసీదు వద్ద ఏడుగురు చనిపోయారనీ, ఇంకొకరు ఎక్కడ చనిపోయిందీ స్పష్టత లేదని పోలీసులు చెప్పారు. ముందు జాగ్రత్తగా న్యూజిలాండ్‌లో శుక్రవారం ముస్లింలెవరూ మసీదులకు వెళ్లవద్దని పోలీసులు కోరారు.
9 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు
కాల్పుల ఘటన తర్వాత మొత్తం 9 మంది భారతీయులు లేదా భారత సంతతి ప్రజల ఆచూకీ గల్లంతయిందని న్యూజిలాండ్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం వెల్లడించింది. అయితే ఇంకా అధికారిక సమాచారమేదీ రాలేదని తెలిపింది. భారత హై కమిషన్ అక్కడి స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందనీ, కాల్పుల ఘటన వల్ల అక్కడ ఎవరైనా భారతీయులు ఏ రకంగానైనా ప్రభావితులయ్యుంటారని అనుమానం ఉంటే వారి బంధువులు నేరుగా భారత హై కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని విదేశాంగ శాఖ కోరింది. ఇందుకోసం 021803899, 021850033 అనే రెండు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ చెప్పారు.
మోదీ దిగ్భ్రాంతి.. న్యూజిలాండ్ ప్రధానికి లేఖ
న్యూజిలాండ్‌లో కాల్పుల ఘటనపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాదాన్ని, దానికి మద్దతిచ్చే వారిని భారత్ ఖండిస్తోందని మోదీ పునరుద్ఘాటించారంది. కష్టకాలంలో న్యూజిలాండ్‌కు సంఘీభావం తెలుపుతూ ఆ దేశ ప్రధాని జసిండాకు మోదీ ఓ లేఖ రాశారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘భిన్నత్వంతో కూడిన ప్రజాస్వామ్య సమాజాల్లో హింస, ద్వేషాలకు తావు లేదు. ఈ ఘటనతో నష్టపోయిన కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారంది.
మనుషులని ఎలా పిలుస్తారు?: ఆస్ట్రేలియా ప్రధాని
రెండింటిలో ఒక మసీదు వద్ద కాల్పులు జరిపింది తమ దేశంలో పుట్టిన వాడేనని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ వెల్లడించారు. ఇలాంటి ద్వేష, హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని మనుషులని ఎలా పిలుస్తారో తనకు అర్థం కాదని ఆయన అన్నారు. ఈ ఘటనలో అతని పాత్రపై విచారణ ప్రారంభమైందని మారిసన్ చెప్పారు. ఉగ్రవాదుల దుశ్చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
వలసదారులంటే ద్వేషం.. యూరప్ దాడులతో కలత!
సిడ్నీ: మసీదు నరమేధంలో పాల్గొన్న వ్యక్తిని ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టర్రంట్(28)గా అధికారులు గుర్తించారు. వలసదారుల్ని తీవ్రంగా ద్వేషించే బ్రెంటన్, యూరప్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులతో కలత చెందాడని తెలిపారు. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న నిందితుడు ఈ దారుణానికి తెగబడ్డాడని వ్యాఖ్యానించారు. గతంలో ఆస్ట్రేలియాలోని గ్రాఫ్టన్ సిటీలో ‘బిగ్ రివర్ జిమ్’లో పర్సనల్ ట్రైనర్‌గా బ్రెంటన్ పనిచేశాడు. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. బ్రెంటన్ తండ్రి రోడ్నీ(49) కేన్సర్‌తో 2010లో కన్నుమూశారు. స్కూలు పూర్తిచేశాక బ్రెంటన్ 2009–11 మధ్యకాలంలో జిమ్ ట్రైనర్‌గా చేశాడు. తర్వాత ‘బిట్‌కనెక్ట్’ అనే క్రిప్టోకరెన్సీ ద్వారా నగదును సమీకరించి ప్రపంచమంతా పర్యటించాడు.
ఇందులో భాగంగా ఆసియా, యూరప్‌లోని పలుదేశాలను సందర్శించాడు. పశ్చిమయూరప్ పర్యటనలో ఉండగా 2017లో ఐసిస్ ఉగ్రమూకలు చేపట్టిన దాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని బ్రెంటన్ నిర్ణయించుకున్నాడు. ప్రపంచంలోనే మారుమూల ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్ కూడా సురక్షితం కాదని చాటిచెప్పేందుకే నిందితుడు ఈ దారుణానికి తెగబడినట్లు అధికారులు భావిస్తున్నారు. అలాగే న్యూజిలాండ్‌కు భారీగా వలసలు సాగుతుండంపై బ్రెంటన్ ఆగ్రహంతో రగిలిపోయినట్లు అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్‌లో హత్యలు చాలా అరుదుగా జరుగుతాయి. న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం న్యూజిలాండ్‌లో 2017లో 35 హత్యలు జరిగాయి. అలాగే తుపాకీ హత్యలు కూడా చాలా అరుదుగా జరుగుతాయని నివేదిక పేర్కొంది.
ఘటనాస్థలివద్ద రక్తమోడుతున్న జహంగీర్, కాల్పుల్లో గాయపడ్డ ఫరాజ్ (ఫైల్)
ఇద్దరు హైదరాబాదీలకు గాయాలు
తీవ్రంగా గాయపడ్డ జహంగీర్‌కు వెంటనే శస్త్రచికిత్స
సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చిలో దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు చిక్కుకున్నారు. మహమ్మద్ జహంగీర్ (49) అక్కడ హోటల్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జహంగీర్‌కు శరీరంలో బుల్లెట్లు దిగాయి. అతనికి ఆదివారం శస్త్రచికిత్స చేయనున్నారని న్యూజిలాండ్ అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 15 ఏళ్ల క్రితమే న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డ జహంగీర్ ఈ ఏడాదిలో రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చాడు. జనవరి 19న ఒకసారి, అదేనెల 30వ తేదీన మరోసారి హైదరాబాద్‌కు వచ్చాడు. ఈమేరకు హైదరాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ విభాగపు స్టాంపులు కూడా ఆయన పాస్‌పోర్టుపై ముద్రించి ఉన్నాయి. ఇదే దుర్ఘటనలో టోలీచౌకీ నదీమ్ కాలనీకి చెందిన హసన్ ఫరాజ్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. ఘటన జరిగిన సమయంలో ఫరాజ్ అక్కడ నమాజ్ చేయడానికి వెళ్లినట్లు స్నేహితులు చెబుతున్నారు. 9 ఏళ్ల క్రితం ఉన్నతవిద్య కోసం ఫరాజ్ న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడ్డాడు.
సాయం చేయండి: అసదుద్దీన్ ఒవైసీ
మహమ్మద్ జహంగీర్‌ను కలుసుకునేందుకు వెంటనే వారి కుటుంబ సభ్యులను అనుమతించాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విదేశాంగ శాఖ, ఆ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ట్విట్టర్‌లో విజ్ఞప్తి చేశారు. జహంగీర్ సోదరుడు ఇక్బాల్ న్యూజిలాండ్ వెళ్లేందుకు సొంతంగా అన్ని ఖర్చులూ భరించుకుంటాడనీ, వెంటనే వీసా మాత్రం ఇప్పించి సాయం చేయాలని ఒవైసీ కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్ తప్పకుండా జహంగీర్ కుటుంబ సభ్యులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కాల్పులు జరుపుతూ ఫేస్‌బుక్ లైవ్
కాల్పులు జరిపిన ఆస్ట్రేలియా వ్యక్తి ఈ దురాగతం మొత్తాన్ని వీడియో తీస్తూ ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టాడు. శుక్రవారం ఉదయమే తాను జరపబోయే కాల్పుల గురించి 74 పేజీల ‘మేనిఫెస్టో’ను దుండగుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. కాగా, శరీరంపై కెమెరా అమర్చుకుని ప్రార్థనలు చేసుకుంటున్న వారిని ఒక్కో గదిలోకి వెళ్తూ దగ్గరి నుంచి కాల్పులు జరిపాడు. వీడియో ప్రకారం దుండగుడు మసీదు పక్కన కారు పార్కు చేసి తుపాకీ తీశాడు. కారుడిక్కీలోంచి మరో గన్ తీసుకుని మసీదులోకి నడిచాడు. ద్వారం వద్ద ఉన్న ఓ వ్యక్తిని కాల్చాడు. అక్కడి నుంచి రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మసీదులోపలికి వెళ్లాడు.
కాల్పులకు భయపడి పరుగులు తీస్తున్న జనంపై బులెట్ల వర్షం కురిపించాడు. దుండగుడు పోస్ట్ చేసిన మేనిఫెస్టోకు ‘ది గ్రేట్ రిప్లేస్‌మెంట్’అని పేరు పెట్టాడు. ఫ్రాన్స్‌లో ఆవిర్భవించిన కుట్ర సిద్ధాంతమే ఈ ది గ్రేట్ రిప్లేస్‌మెంట్. దీని ప్రకారం స్వస్థలాల్లో ఎక్కువ జనన రేటు ఉన్న వలసదారులు వచ్చి యూరోపియన్లను వెళ్లగొడుతున్నారని నమ్ముతారు. ఫ్రెంచ్ నేత మారిన్ లె పెన్ 2017 ఎన్నికల్లో ఓడిపోవడం, 2017లో స్టాక్‌హోం ట్రక్ దాడిలో 11 ఏళ్ల ఎబ్బా అకర్‌లాండ్ బాలిక మరణం తనను అతివాదిగా మార్చాయని పేర్కొన్నాడు. కాల్పులు జరిగిన కొద్ది సేపటికే దుండగుడి ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం ఖాతాలను తొలగించినట్లు ఫేస్‌బుక్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment