mosque shooting
-
మసీదులో కాల్పులు..
ఓవాగడౌగౌ: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో కాల్పుల కలకలం చెలరేగింది. ఓవాగడౌగౌ నగరంలోని మసీదులో జరిగిన ఈ దాడిలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆయుధాలు ధరించిన కొందరు ఉగ్రవాదులు శుక్రవారం సాయంత్రం మసీదులో ప్రవేశించి కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్రెంచ్, ఆమెరికన్, కెనడియన్, జర్మన్ బలగాలు తమ ప్రాంతంలో ప్రవేశించి ఉగ్రవాదులతో పోరాడుతున్నామని చెబుతున్నాయని, అయితే విదేశీయులు తమ దేశంలో ఉండటం ఇష్టం లేని ఉగ్రమూకలు ఈ దాడులకు తెగబడుతున్నాయని ఓ స్థానికుడు తెలిపారు. -
‘పుల్వామా అమరులు ఇప్పుడు సంతోషిస్తారు’
దుబాయ్ : న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ మసీదులో గత శుక్రవారం జరిగిన మారణకాండపై ఓ వ్యక్తి అభ్యంతరకర కామెంట్ చేసి చిక్కుల్లో పడ్డాడు. దుబాయ్ కేంద్రంగా పనిచేసే ట్రాన్స్‌గార్డ్ సెక్యురిటీ సంస్థ ఉద్యోగి ఒకరు .. 50మంది ప్రాణాలు కోల్పోయిన న్యూజిలాండ్ కాల్పుల ఘటనపై ఫేస్బుక్లో రెచ్చగొట్టే పోస్టు చేశాడు. ‘పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు న్యూజిలాండ్ మసీదు ఘటనతో సంతోష పడతారు. ప్రతి శుక్రవారం మసీదులపై ఇలాంటి దాడులు జరిగేలా చూడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. భారత్‌లో కూడా ఇదే తరహా ఘటనలు జరగాలి. ఆ మతస్తులను ఎప్పుడూ నమ్మలేం’ అంటూ రాసుకొచ్చాడు. రోణి సింగ్ పేరుతో పేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ సృష్టించి మత విద్వేషం ప్రదర్శించాడు. ఈ పోస్టు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ట్రాన్స్‌గార్డ్ అప్రమత్తమైంది. అంతర్గత విచారణ చేపట్టి నిందితున్ని గుర్తించింది. అతన్ని సంబంధిత అధికారులకు అప్పగించింది. (న్యూజిలాండ్ సంచలన నిర్ణయం) ‘జీరో టాలరెన్స్ పాలసీ ఉన్న దుబాయ్‌లో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదు. అందుకే న్యూజిలాండ్ ఘటనపై అభ్యంతరకర కామెంట్లు చేసిన సదరు వ్యక్తిని అధికారులకు అప్పగించాం. అతను చట్టపరంగా విచారణ ఎదుర్కోక తప్పదు’ అని ట్రాన్స్‌గార్డ్ సెక్యురిటీ సంస్థ ఎండీ గ్రెగ్ వార్డ్ స్పష్టం చేశాడు. అయితే, సదరు వ్యక్తి పేరు, వివరాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. (చదవండి : న్యూజిలాండ్ కాల్పుల కలకలం.. 49 మంది మృతి) -
‘ఆమె ఇక రాదు.. నువ్వు ఇంటికి వెళ్లు’
క్రైస్ట్‌చర్చ్ : బంగ్లాదేశ్‌కు చెందిన హుస్నా తన 19 ఏట ఫరీద్ అహ్మద్‌ను వివాహం చేసుకుని తొలిసారి న్యూజిలాండ్ గడ్డ మీద అడుగు పెట్టింది. గత పాతికేళ్లుగా వారిద్దరు ఎంతో అన్యోనంగా జీవిస్తూ.. ప్రేమ, సంతోషం అనే పునాదుల మీద ఓ అందమైన పొదరింటిని నిర్మించుకున్నారు. మాతృ దేశాన్ని విడిచి.. న్యూజిలాండ్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి దాన్నే తన సొంత ఇంటిగా భావించి.. ప్రేమించింది హుస్నా. ఆర్నెళ్లు గడిచేలోపే ఇంగ్లీష్ నేర్చుకుంది. కొత్త స్నేహితులను పరిచయం చేసుకుంది. భర్తకు అన్ని వేళలా చేదోడువాదోడుగా నిలుస్తూ.. కుటుంబాన్ని ప్రేమగా చూసుకునేది. ఫరీద్ ఇంట్లోనే హోమియోపతి మందుల దుకాణాన్ని నడుపుతుండేవాడు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. వారి అన్యోన్యతను చూసి విధికి సైతం కన్ను కుట్టింది. అందుకే ఉగ్రదాడి రూపంలో వారి పాతికేళ్ల దాంపత్య జీవితాన్ని ముక్కలు చేసింది. ఎప్పటిలానే దైవ ప్రార్థనల నిమిత్తం మసీదుకెళ్లిన హుస్నాను మరణం ఉన్మాది రూపంలో వెంటాడింది. ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం పూట న్యూజిలాండ్‌లోని మసీదుల్లో నరమేధం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత వారం జరిగిన ఈ దారుణ సంఘటనలో 49 మంది అమాయకులు అసువులు బాశారు. ఇలా మరణించిన వారిలో ఫరీద్ భార్య హుస్నా కూడా ఉన్నారు. ప్రార్థనల నిమిత్తం మసీదుకు వెళ్లినప్పుడు.. జరిగిన నరమేధంలో ఉగ్రవాది హుస్నాను ఫుట్‌పాత్ మీదనే కాల్చేశాడు. గతంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా వీల్ చైర్‌కే పరిమితమైన ఫరీద్ మసీదులో కాకుండా బయట ఉండే చిన్న గదిలో ప్రార్థనలు చేసుకుంటుండటం వల్ల ఈ దారుణం నుంచి తప్పించుకోగలిగాడు. పేలుళ్ల శబ్దం వినిపడగానే సంఘటనా స్థలానికి వచ్చిన ఫరీద్‌కు అతని స్నేహితులు, ఇరుగుపొరుగు వారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు కనిపించాయి. కొందరు గాయాలతో బాధపడుతుండగా.. మరి కొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. వారిలో హుస్నా కూడా ఉన్నారు. జరిగిన దారుణం అర్థం కావడానికి కాస్త సమయం పట్టింది ఫరీద్‌కు. ఈ లోపు ఒక స్త్రీ వచ్చి.. ‘మీ భార్య ఇక ఎన్నటికి తిరిగి రారు. మీరు రాత్రంతా ఇక్కడే వేచి ఉండటం వల్ల ఎటువంటి లాభం లేదు. ఇంటికి వెళ్లండి’ అని చెప్పింది. ఆ మాట వినగానే మూగ బోయాడు ఫరీద్. తన ప్రపంచమే కుప్పకూలిపోయిందంటూ విలపించాడు. (‘క్షమించండి.. మేము అలాంటి వాళ్లం కాదు’) జరిగిన దారుణం గురించి ఫరీద్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు హుస్నా మాటలు, నవ్వులతో కిలకిలలాడే నా ఇళ్లు ఈ రోజు మూగబోయింది. కానీ ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని నేను క్షమిస్తున్నాను. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి, అతనిలానే ఆలోచించే అతని స్నేహితులకు నేనిచ్చే సందేశం ఇదే. ఇప్పటికి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని కౌగిలించుకుని.. మీ ముఖంలోకి చూస్తూ.. నా మనస్పూర్తిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేను ఇప్పటికి.. ఎప్పటికి మిమ్మల్ని ద్వేషించను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక తన భార్య గురించి మాట్లాడుతూ.. ‘ఆమె నాకు తల్లి, తండ్రి, నేస్తం. ఇతరుల మేలు కోరే వ్యక్తి తను. వేరొకరి జీవితాన్ని కాపాడ్డం కోసం ఆమె చనిపోవడానికి కూడా సిద్ధపడుతుంది’ అంటూ భార్యను తల్చుకుని కన్నీటి పర్యంతమయ్యాడు ఫరీద్. ఈ నరమేధానికి పాల్పడిన వారిలో ఒకరిని ఆస్ట్రేలియాకు చెందిన బ్రెటంన్ టారంట్(28)గా గుర్తించారు పోలీసులు. (చదవండి : ‘అతని పేరును ఎవరూ పలకరాదు’) -
‘అతని పేరును ఎవరూ పలకరాదు’
క్రైస్ట్‌చర్చ్ : ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారంట్(28) అనే ఉగ్రవాది ఇటీవల న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో కాల్పులకు పాల్పడి దాదాపు 50 మంది అమాయకులకు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై న్యూజిలాండ్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి జసిండా ఆర్డెన్ ప్రసంగించారు. ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్‌లో మరణహోమం సృష్టించిన ఉగ్రవాది పేరును తాను ప్రస్తావించబోనని తేల్చి చెప్పారు. ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తి అనైతికంగా ప్రవర్తించి బీభత్సం సృష్టించాడని, అతని పేరును తాను ఎప్పుడూ ప్రస్తావించనని చెప్పారు. దేశ ప్రజలు కూడా అతని పేరును ఉచ్చరించొద్దని కోరారు. కాల్పుల్లో ప్రాణాలను కోల్పోయిన వారి పేర్లను బయటకు చెప్పండి కానీ.. ఆ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి పేరును ఎక్కడ ఉచ్చరించకూడదని చెప్పారు. అతనో ఉగ్రవాది, క్రిమినల్, తీవ్రవాది అని, తాను మాట్లాడుతున్నప్పుడు అతని పేరును ప్రస్తావించబోనన్నారు. దేశంలోని చట్టాల ప్రకారం అతన్ని కఠినంగా శిక్షిస్తామన్నారు. జాత్యహంకారంతో ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రెంటన్ టారంట్ అనే వ్యక్తి గత శుక్రవారం న్యూజిలాండ్‌లోని అల్ నూర్, లిన్‌వుడ్ మసీదుల వద్ద ఈ కాల్పులు జరిపి 50 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ దురాగతం మొత్తాన్ని వీడియో తీస్తూ ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. వీడియో ప్రకారం దుండగుడు మసీదు పక్కన కారు పార్కు చేసి తుపాకీ తీశాడు. కారుడిక్కీలోంచి మరో గన్ తీసుకుని మసీదులోకి నడిచాడు. ద్వారం వద్ద ఉన్న ఓ వ్యక్తిని కాల్చాడు. అక్కడి నుంచి రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మసీదులోపలికి వెళ్లాడు. కాల్పుల్లో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. (న్యూజిలాండ్‌లో నరమేధం) -
నోరు జారాడు... కోడిగుడ్డుతో సమాధానం
క్రైస్ట్‌చర్చ్ : న్యూజీలాండ్‌లో జరిగిన దాడులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ సెసేటర్కు ఊహించని అవమానం జరిగింది. క్రైస్ట్‌చర్చ్ సిటీలోని రెండు మసీదులపై జరిగిన దాడిలో 49 మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు ముస్లింలే కారణమంటూ ఆస్ట్రేలియన్ సెనేటర్ ఫ్రేజర్ అన్నింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆగ్రహం చెందిన ఓ టీనేజర్.. అన్నింగ్పై గుడ్డుతో దాడి చేశాడు. ప్రసుత్తం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. మసీదులపై దాడి అనంతరం అన్నింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈరోజు న్యూజిలాండ్‌లో జరిగిన రక్తపాతానికి ముస్లింలే కారణం. న్యూజిలాండ్ ముస్లిం వలసదారులకు స్వర్గధామంగా మారింది. వారి జనాభా పెరిగిపోవడం వల్లే ఇలా జరిగింది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా మాట్లాడిన మరుసటి రోజే అన్నింగ్ మెల్బోర్న్లో మీడియాతో మాట్లాడుతుండగా ఓ బాలుడు వెనక నుంచి వచ్చి అన్నింగ్ తలపై గుడ్డు పగలకొట్టాడు. అంతటితో ఊరుకోక ఈ తతంగాన్నంతా స్వయంగా వీడియో కూడా తీశాడు. అనుకోని సంఘటనకు షాక్‌కు గురయిన అన్నింగ్ వెంటనే ఆ యువకుడిపై దాడికి దిగాడు. అనంతరం బాలున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు జనాలు. After the Christchurch terrorist attack, Australian senator Fraser Anning released a statement saying, "Let us be clear, while Muslims may have been the victims today, usually they are the perpetrators..." So, a 17-year-old smacked him with an egg.pic.twitter.com/P8wEv6GR4F — UberFacts (@UberFacts) March 16, 2019 అయితే అన్నింగ్ తీరుపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఆయనను సెనేట్ నుంచి తొలగించాలని ఇప్పటికే కొన్ని పిటిషన్లు సిద్ధమయ్యాయి. ఇందులో 2,25,000 మంది సంతకాలు కూడా చేశారు. (మృతుల్లో ఐదుగురు భారతీయులు) -
మృతుల్లో ఐదుగురు భారతీయులు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో శుక్రవారం రెండు మసీదుల వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులున్నారని న్యూజిలాండ్‌లోని భారత హై కమిషన్ ఆదివారం ధ్రువీకరించింది. ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రెంటన్ టారంట్ అనే వ్యక్తి జాత్యహంకారంతో అల్ నూర్, లిన్‌వుడ్ మసీదుల వద్ద ఈ కాల్పులు జరపగా, 50 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత క్రైస్ట్‌చర్చ్‌లో 9 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైందని శుక్రవారమే హై కమిషన్ కార్యాలయం వెల్లడించింది. ఐదుగురు భారతీయులు ఈ కాల్పుల్లో చనిపోయారని తాజాగా ధ్రువీకరించింది. మరణించిన భారతీయులను మహబూబ్ ఖోఖర్, రమీజ్ వోరా, అసీఫ్ వోరా, అన్సీ అలిబవ, ఓజైర్ ఖదీర్‌గా గుర్తించామంది. వీరిలో ఓజైర్ ఖదీర్ హైదరాబాద్ వాసి. కాగా, మరో ఇద్దరు హైదరాబాదీలు హసన్ ఫరాజ్, మహ్మద్ ఇమ్రాన్ ఖాన్లు కూడా మృతి చెందినట్లు శనివారం సమాచారం వచ్చినా, ఆదివారం హై కమిషన్ విడుదల చేసిన జాబితాలో వీరి పేర్లు లేకపోవడం గమనార్హం. క్రైస్ట్ చర్చ్ బాధితుల కుటుంబ సభ్యులకు వీసాలను త్వరగా మంజూరు చేసేందుకు న్యూజిలాండ్ ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిందని హై కమిషన్ కోరింది. కాగా, తమ కుటుంబ సభ్యుడు టారంట్ ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం తమకు విభ్రాంతి కలిగించిందనీ, తాము ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నామని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం టారంట్ సోదరి, తల్లిపై ఎవరూ దాడి చేయకుండా పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారని టారంట్ నానమ్మ చెప్పారు. కాగా, టారంట్ కాల్పుల ఘటనను ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని అడ్డుకోలేకపోవడంపై ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమ సంస్థల నుంచి సమాధానాల కోసం వేచి చూస్తున్నానని ప్రధాని జసిండా తెలిపారు. బుల్లెట్లు లేని తుపాకీతో తరిమాడు కాల్పుల సమయంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి గుండ్లు లేని తుపాకీతో హంతకుడిని తరిమిన ఓ వ్యక్తిపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి వచ్చి న్యూజిలాండ్‌లో శరణార్థిగా ఉంటున్న అబ్దుల్ అజీజ్.. లిన్‌వుడ్ మసీదులో హంతకుడు టారంట్ మరింత మందిని కాల్చకుండా నిలువరించి ఈ ఘటనలో హీరోగా నిలిచాడు. కాల్పుల శబ్దం వినపడగానే అజీజ్ తొలుత కేవలం క్రెడిట్ కార్డులను స్వైప్ చేసే మిషన్‌ను తీసుకెళ్లి టారంట్ పైకి విసిరి అతని దృష్టిని మళ్లించాడు. అనంతరం టారంట్ కాల్పులు జరిపి, బుల్లెట్లు అయిపోవడంతో పడేసిన తుపాకీ ఒకటి అతనికి దొరికింది. ఆ తుపాకీతో అజీజ్ బెదిరించడంతో టారంట్ తన తుపాకీని కింద పడేశాడు. టారంట్‌ను అజీజ్ వెంటాడుతూ వెళ్లి, కారులో పారిపోతుండగా, కారు వెనుక అద్దాన్ని పగులగొట్టాడు. అజీజ్ ఈ సాహసం చేయకపోయుంటే మరింతమంది ప్రాణాలు కోల్పోయేవారంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. -
‘క్రైస్ట్‌చర్చ్’ మృతుల్లో ఇద్దరు హైదరాబాదీలు
-
కోర్టు హాల్లో బ్రెంటన్ వెకిలినవ్వులు
-
‘క్రైస్ట్‌చర్చ్’ మృతుల్లో ఇద్దరు హైదరాబాదీలు
హైదరాబాద్/త్రిసూర్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పుల్లో మృతిచెందిన 49 మందిలో ముగ్గురు భారతీయులున్నట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. అందులో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హసన్ ఫరాజ్(31), రెస్టారెంట్ వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ ఖాన్(47) కాగా, మరొకరు కేరళలోని త్రిసూర్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ ఆన్సీ అలీగా గుర్తించారు. కాల్పుల ఘటన తరువాత గల్లంతైనట్లు వార్తలొచ్చిన ఫరాజ్ మృతిచెందినట్లు శనివారం ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన సోదరుడు చనిపోయినట్లు న్యూజిలాండ్ నుంచి ఫోన్ వచ్చిందని ఆయన అన్న కశీఫ్ హసన్ మీడియాకు వెల్లడించారు. ఈ షాకింగ్ వార్త తెలియగానే టోలిచౌకిలోని వారి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. దాడిలో మరణించిన 47 ఏళ్ల మరో హైదరాబాదీ ఇమ్రాన్‌ఖాన్ కుటుంబంతో కలిసి క్రైస్ట్‌చర్చ్‌లో నివాసముంటూ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. గాయపడిన అహ్మద్ ఇక్బాల్ జహంగీర్ అనే హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి కోలుకుంటున్నారు. జహంగీర్‌కు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారని, ప్రమాదమేమీ లేదని ఆయన సోదరుడు మహ్మద్ ఖుర్షీద్ వెల్లడించారు. పీజీ చదువుతున్న ఆన్సీ.. క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఘటనలో గాయపడిన ఆన్సీ అలీ మృతిచెందినట్లు శనివారం కేరళ పోలీసులు ప్రకటించారు. గతేడాదే భర్త అబ్దుల్ నాజర్‌తో కలిసి న్యూజిలాండ్ వెళ్లిన ఆన్సీ దాడి జరిగిన మసీదు సమీపంలో ఉంటున్నారు. క్రైస్ట్‌చర్చ్‌లో ఆమె భర్త ఉద్యోగం చేస్తుండగా, ఆమె పీజీ చదువుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, క్రైస్ట్‌చర్చ్‌లో గల్లంతైన గుజరాతీల గురించి ఎలాంటి సమాచారం అందలేదని ఆ రాష్ట్ర పోలీసులు చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో ఆ రెండు మసీదుల్లో గుజరాత్‌కు చెందిన కనీసం నలుగురు ముస్లింలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. -
భారత్ యూరప్ శత్రువు
క్రైస్ట్‌చర్చ్: కొత్త తరహా నాజీ విధానాలు, యూరప్ దేశాలకు పెరుగుతున్న వలసలే క్రైస్ట్‌చర్చ్ మసీదుల్లో మారణకాండ సృష్టించడానికి తనను పురికొల్పాయని 49 మందిని పొట్టనబెట్టుకున్న దుండగుడు తెలిపాడు. యూరప్‌లో తమ జనాభాను పెంచుకుంటూ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్, చైనా, టర్కీ దేశాలు యూరప్‌కు శత్రువులని అభివర్ణించాడు. దాడికి పాల్పడే ముందు 28 ఏళ్ల బ్రెంటన్ టారంట్..‘ది గ్రేట్ రిప్లేస్మెంట్’ పేరిట ఆన్లైన్లో ఉంచిన పోస్ట్‌లో ఈ జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడు. శ్వేతేతర వలసదారులు శ్వేతజాతీయుల స్థానాలను ఆక్రమిస్తున్నారని పేర్కొన్నాడు. శ్వేతజాతీయుల గుర్తింపునకు సరికొత్త చిహ్నంగా నిలిచిన ట్రంప్‌కు మద్దతు తెలుపుతున్నానన్న టారంట్..జాతీయవాద అతివాదులే తనకు స్ఫూర్తి అని చాటుకున్నాడు. ‘వలసదారులు ఎక్కడి నుంచి వచ్చినా వారిని అంతమొందించాలి. ఇండియా, టర్కీ, రోమా(భారత్ నుంచి యూరప్‌కు వలసెళ్లిన సంచార జాతులు), యూదులు, ఆఫ్రికా దేశాల ప్రజలు మనవాళ్లు కాకున్నా ఇక్కడ నివసిస్తున్నారు. వారిని చంపేయాల్సిందే. మారణహోమానికి రెండేళ్లుగా ప్రణాళికలు వేస్తున్నా. 2017 ఏప్రిల్ లేదా మే నెలల్లో ఫ్రాన్స్ లేదా ఇతర ఉత్తర ఐరోపా దేశాల్లో దాడికి పాల్పడాలని అనుకున్నా. మూడు నెలల క్రితమే క్రైస్ట్‌చర్చ్‌ను ఎంచుకున్నా’ అని టారంట్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు, క్రైస్ట్‌చర్చ్ కాల్పుల తరువాత గల్లంతైన ఏడుగురు భారతీయులు, ఇద్దరు భారత సంతతి వ్యక్తుల జాడ తెలుసుకోవడానికి స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు భారత హైకమిషన్ వెల్లడించింది. టారంట్‌పై హత్యానేరం.. క్రైస్ట్‌చర్చ్ దాడి అనుమానితుడు బ్రెంటన్ టారంట్‌పై కోర్టు శనివారం హత్యానేరం మోపింది. ఏ మాత్రం పశ్చాత్తాపం చెందని అతడు అదే అహంకారంతో ‘ఓకే’ అని వెటకారంగా సంకేతాలిచ్చాడు. బెయిల్‌కు కూడా విజ్ఞప్తి చేసుకోలేదు. అతనికి జీవితఖైదు పడే అవకాశాలున్నాయి. టారంట్‌ను పోలీస్ కస్టడీకి పంపిన కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 5కు వాయిదా వేసింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయిన అల్ నూర్ మసీదు సమీపంలో ఏర్పాటుచేసిన స్మారకం వద్ద ప్రజలు పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. క్రైస్ట్‌చర్చ్ వచ్చిన ప్రధాని జెసిండా బాధిత కుటుంబాలను ఓదార్చారు. ‘తుపాకీ’ చట్టాలు మారుస్తాం.. దేశంలో తుపాకీ వినియోగ చట్టాన్ని కఠినతరం చేస్తామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ప్రకటించారు. క్రైస్ట్‌చర్చ్ దాడి అనుమానితుడు చట్టబద్ధంగానే ఆయుధాలు కొనుగోలు చేశాడని తేలింది. టారంట్ ఆయుధ కొనుగోలు విషయాలు తెలిశాక ప్రజలు సంబంధిత చట్టంలో మార్పులు కోరుకుంటున్నారని, ఈ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాడికి ముందు ఆన్లైన్లో విద్వేషపూరిత పోస్టు పెట్టినా కూడా టారంట్‌తో పాటు అరెస్ట్ అయిన అతని ఇద్దరు సహచరులపై నిఘా వర్గాల వద్ద సమాచారం లేదని తెలిపారు. క్రైస్ట్‌చర్చ్ కాల్పుల మృతులకు వెల్లింగ్టన్లో పుష్పాలతో నివాళులు -
న్యూజిలాండ్‌లో నరమేధం
క్రైస్ట్‌చర్చ్: ప్రపంచంలోనే ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్‌లో మారణహోమం. ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం న్యూజిలాండ్‌లోని మసీదుల్లో నరమేధం చోటుచేసుకుంది. క్రైస్ట్‌చర్చ్ సిటీలోని రెండు మసీదులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 49 మంది అమాయకులు అసువులు బాశారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 9 మంది భారతీయుల జాడ తెలీడంలేదని న్యూజిలాండ్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం తెలిపింది. ఈ దాడి ఉగ్రవాద చర్యేనని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ధ్రువీకరించారు. కాల్పులు జరిగిన అల్ నూర్ మసీదు, లిన్‌వుడ్ అవెన్యూ మసీదుల మధ్య దూరం దాదాపు ఐదు కిలోమీటర్లు కాగా, రెండు చోట్లా కాల్పులు వేర్వేరు సమయాల్లో చోటుచేసుకున్నాయి. దీంతో రెండు మసీదుల్లో కాల్పులు జరిపింది ఒక్క ఉగ్రవాదేనా లేక ఇద్దరున్నారా అన్న విషయంపై స్పష్టతరాలేదు. కాగా, కాల్పుల ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు త్రుటిలో తప్పించుకుంది. వారంతా అల్నూర్ మసీదుకు బస్సులో వెళ్తుండగా, బస్ మసీదు వద్దకు చేరాక, ఆటగాళ్లు ఇంకా బస్‌లో ఉండగానే కాల్పులు ప్రారంభమైనట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి: ప్రధాని జసిండా న్యూజిలాండ్‌లో ముస్లింలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని తెలుస్తోంది. ప్రధాని జసిండా మాట్లాడుతూ ‘ఇది ఉగ్రవాద దాడేనన్న విషయం స్పష్టమవుతోంది. న్యూజిలాండ్‌కు అత్యంత చీకటిరోజుల్లో ఇదొకటి. ఇది పక్కాగా ప్రణాళిక రచించి జరిపిన దాడి’ అని చెప్పారు. ఎంత మంది ఉగ్రవాదులు కాల్పులు జరిపారన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ తాము ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని జసిండా వెల్లడించారు. రెండు భారీ పేలుడు పరికరాలను మిలిటరీ గుర్తించి నిర్వీర్యం చేసిందన్నారు. ఇది అసాధారణ, ఎవరూ ఊహించని హింసాత్మక ఘటన అని ఆమె పేర్కొన్నారు. అల్ నూర్ మసీదు వద్ద 41 మంది, లిన్‌వుడ్ అవెన్యూ మసీదు వద్ద ఏడుగురు చనిపోయారనీ, ఇంకొకరు ఎక్కడ చనిపోయిందీ స్పష్టత లేదని పోలీసులు చెప్పారు. ముందు జాగ్రత్తగా న్యూజిలాండ్‌లో శుక్రవారం ముస్లింలెవరూ మసీదులకు వెళ్లవద్దని పోలీసులు కోరారు. 9 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు కాల్పుల ఘటన తర్వాత మొత్తం 9 మంది భారతీయులు లేదా భారత సంతతి ప్రజల ఆచూకీ గల్లంతయిందని న్యూజిలాండ్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం వెల్లడించింది. అయితే ఇంకా అధికారిక సమాచారమేదీ రాలేదని తెలిపింది. భారత హై కమిషన్ అక్కడి స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందనీ, కాల్పుల ఘటన వల్ల అక్కడ ఎవరైనా భారతీయులు ఏ రకంగానైనా ప్రభావితులయ్యుంటారని అనుమానం ఉంటే వారి బంధువులు నేరుగా భారత హై కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని విదేశాంగ శాఖ కోరింది. ఇందుకోసం 021803899, 021850033 అనే రెండు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ చెప్పారు. మోదీ దిగ్భ్రాంతి.. న్యూజిలాండ్ ప్రధానికి లేఖ న్యూజిలాండ్‌లో కాల్పుల ఘటనపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాదాన్ని, దానికి మద్దతిచ్చే వారిని భారత్ ఖండిస్తోందని మోదీ పునరుద్ఘాటించారంది. కష్టకాలంలో న్యూజిలాండ్‌కు సంఘీభావం తెలుపుతూ ఆ దేశ ప్రధాని జసిండాకు మోదీ ఓ లేఖ రాశారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘భిన్నత్వంతో కూడిన ప్రజాస్వామ్య సమాజాల్లో హింస, ద్వేషాలకు తావు లేదు. ఈ ఘటనతో నష్టపోయిన కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారంది. మనుషులని ఎలా పిలుస్తారు?: ఆస్ట్రేలియా ప్రధాని రెండింటిలో ఒక మసీదు వద్ద కాల్పులు జరిపింది తమ దేశంలో పుట్టిన వాడేనని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ వెల్లడించారు. ఇలాంటి ద్వేష, హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని మనుషులని ఎలా పిలుస్తారో తనకు అర్థం కాదని ఆయన అన్నారు. ఈ ఘటనలో అతని పాత్రపై విచారణ ప్రారంభమైందని మారిసన్ చెప్పారు. ఉగ్రవాదుల దుశ్చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వలసదారులంటే ద్వేషం.. యూరప్ దాడులతో కలత! సిడ్నీ: మసీదు నరమేధంలో పాల్గొన్న వ్యక్తిని ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టర్రంట్(28)గా అధికారులు గుర్తించారు. వలసదారుల్ని తీవ్రంగా ద్వేషించే బ్రెంటన్, యూరప్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులతో కలత చెందాడని తెలిపారు. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న నిందితుడు ఈ దారుణానికి తెగబడ్డాడని వ్యాఖ్యానించారు. గతంలో ఆస్ట్రేలియాలోని గ్రాఫ్టన్ సిటీలో ‘బిగ్ రివర్ జిమ్’లో పర్సనల్ ట్రైనర్‌గా బ్రెంటన్ పనిచేశాడు. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. బ్రెంటన్ తండ్రి రోడ్నీ(49) కేన్సర్‌తో 2010లో కన్నుమూశారు. స్కూలు పూర్తిచేశాక బ్రెంటన్ 2009–11 మధ్యకాలంలో జిమ్ ట్రైనర్‌గా చేశాడు. తర్వాత ‘బిట్‌కనెక్ట్’ అనే క్రిప్టోకరెన్సీ ద్వారా నగదును సమీకరించి ప్రపంచమంతా పర్యటించాడు. ఇందులో భాగంగా ఆసియా, యూరప్‌లోని పలుదేశాలను సందర్శించాడు. పశ్చిమయూరప్ పర్యటనలో ఉండగా 2017లో ఐసిస్ ఉగ్రమూకలు చేపట్టిన దాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని బ్రెంటన్ నిర్ణయించుకున్నాడు. ప్రపంచంలోనే మారుమూల ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్ కూడా సురక్షితం కాదని చాటిచెప్పేందుకే నిందితుడు ఈ దారుణానికి తెగబడినట్లు అధికారులు భావిస్తున్నారు. అలాగే న్యూజిలాండ్‌కు భారీగా వలసలు సాగుతుండంపై బ్రెంటన్ ఆగ్రహంతో రగిలిపోయినట్లు అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్‌లో హత్యలు చాలా అరుదుగా జరుగుతాయి. న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం న్యూజిలాండ్‌లో 2017లో 35 హత్యలు జరిగాయి. అలాగే తుపాకీ హత్యలు కూడా చాలా అరుదుగా జరుగుతాయని నివేదిక పేర్కొంది. ఘటనాస్థలివద్ద రక్తమోడుతున్న జహంగీర్, కాల్పుల్లో గాయపడ్డ ఫరాజ్ (ఫైల్) ఇద్దరు హైదరాబాదీలకు గాయాలు తీవ్రంగా గాయపడ్డ జహంగీర్‌కు వెంటనే శస్త్రచికిత్స సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చిలో దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు చిక్కుకున్నారు. మహమ్మద్ జహంగీర్ (49) అక్కడ హోటల్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జహంగీర్‌కు శరీరంలో బుల్లెట్లు దిగాయి. అతనికి ఆదివారం శస్త్రచికిత్స చేయనున్నారని న్యూజిలాండ్ అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 15 ఏళ్ల క్రితమే న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డ జహంగీర్ ఈ ఏడాదిలో రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చాడు. జనవరి 19న ఒకసారి, అదేనెల 30వ తేదీన మరోసారి హైదరాబాద్‌కు వచ్చాడు. ఈమేరకు హైదరాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ విభాగపు స్టాంపులు కూడా ఆయన పాస్‌పోర్టుపై ముద్రించి ఉన్నాయి. ఇదే దుర్ఘటనలో టోలీచౌకీ నదీమ్ కాలనీకి చెందిన హసన్ ఫరాజ్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. ఘటన జరిగిన సమయంలో ఫరాజ్ అక్కడ నమాజ్ చేయడానికి వెళ్లినట్లు స్నేహితులు చెబుతున్నారు. 9 ఏళ్ల క్రితం ఉన్నతవిద్య కోసం ఫరాజ్ న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడ్డాడు. సాయం చేయండి: అసదుద్దీన్ ఒవైసీ మహమ్మద్ జహంగీర్‌ను కలుసుకునేందుకు వెంటనే వారి కుటుంబ సభ్యులను అనుమతించాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విదేశాంగ శాఖ, ఆ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. జహంగీర్ సోదరుడు ఇక్బాల్ న్యూజిలాండ్ వెళ్లేందుకు సొంతంగా అన్ని ఖర్చులూ భరించుకుంటాడనీ, వెంటనే వీసా మాత్రం ఇప్పించి సాయం చేయాలని ఒవైసీ కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్ తప్పకుండా జహంగీర్ కుటుంబ సభ్యులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాల్పులు జరుపుతూ ఫేస్బుక్ లైవ్ కాల్పులు జరిపిన ఆస్ట్రేలియా వ్యక్తి ఈ దురాగతం మొత్తాన్ని వీడియో తీస్తూ ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. శుక్రవారం ఉదయమే తాను జరపబోయే కాల్పుల గురించి 74 పేజీల ‘మేనిఫెస్టో’ను దుండగుడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కాగా, శరీరంపై కెమెరా అమర్చుకుని ప్రార్థనలు చేసుకుంటున్న వారిని ఒక్కో గదిలోకి వెళ్తూ దగ్గరి నుంచి కాల్పులు జరిపాడు. వీడియో ప్రకారం దుండగుడు మసీదు పక్కన కారు పార్కు చేసి తుపాకీ తీశాడు. కారుడిక్కీలోంచి మరో గన్ తీసుకుని మసీదులోకి నడిచాడు. ద్వారం వద్ద ఉన్న ఓ వ్యక్తిని కాల్చాడు. అక్కడి నుంచి రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మసీదులోపలికి వెళ్లాడు. కాల్పులకు భయపడి పరుగులు తీస్తున్న జనంపై బులెట్ల వర్షం కురిపించాడు. దుండగుడు పోస్ట్ చేసిన మేనిఫెస్టోకు ‘ది గ్రేట్ రిప్లేస్మెంట్’అని పేరు పెట్టాడు. ఫ్రాన్స్‌లో ఆవిర్భవించిన కుట్ర సిద్ధాంతమే ఈ ది గ్రేట్ రిప్లేస్మెంట్. దీని ప్రకారం స్వస్థలాల్లో ఎక్కువ జనన రేటు ఉన్న వలసదారులు వచ్చి యూరోపియన్లను వెళ్లగొడుతున్నారని నమ్ముతారు. ఫ్రెంచ్ నేత మారిన్ లె పెన్ 2017 ఎన్నికల్లో ఓడిపోవడం, 2017లో స్టాక్‌హోం ట్రక్ దాడిలో 11 ఏళ్ల ఎబ్బా అకర్లాండ్ బాలిక మరణం తనను అతివాదిగా మార్చాయని పేర్కొన్నాడు. కాల్పులు జరిగిన కొద్ది సేపటికే దుండగుడి ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం ఖాతాలను తొలగించినట్లు ఫేస్బుక్ తెలిపింది. -
కెనడా మసీదులో కాల్పులు... ఆరుగురు మృతి
క్వీబెక్ సిటీ: కెనడా క్వీబెక్ సిటీ మసీదులో ఇద్దరు సాయుధులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. మరో 17 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి ముసుగు లు ధరించిన ఇద్దరు వ్యక్తులు తుపాకులతో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపా రని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతులం తా 35–70 ఏళ్ల మధ్య వయస్కులన్నారు. ఇది ఉగ్రవాదుల చర్యని, దేశ నిర్మాణంలో కీలకమైన ముస్లింలపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం చెప్పారు. ప్రార్థనలు, శరణార్థులకు ఆశ్రయంగా ఉన్న కేంద్రంపై దాడికి పాల్పడటం దారుణమని, ఇలాంటి అర్థరహిత చర్యలకు దేశంలో స్థానం లేదని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు ప్రతినిధి క్రిస్టియన్ కౌలంబ్ చెప్పారు. పోలీసులు కూడా దీన్ని ఉగ్రవాద చర్యగానే భావి స్తున్నారు. ఇందులో మరొకరి ప్రమేయం కూడా ఉందని అనుమాని స్తున్నారు. ఈ దాడి వెనుక ఉద్దేశమేమిటన్నది ఇంకా స్పష్టం కాలేదు. -
అది ఉగ్రవాద దాడే.. ప్రధాని ఖండన!
కెనడా: క్యుబెక్ నగరంలోని మసీదులో సాయుధులు కాల్పులకు తెగబడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ఘటనను కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో, క్యుబెక్ ప్రీమియర్ ఫిలిప్పె కోయిలార్డ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఉగ్రవాద ఘటనేనని ట్రుడో స్పష్టం చేశారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిషేధం విధించిన నేపథ్యంలో కెనడాలో ఈ ఉగ్రవాద దాడి జరగడం గమనార్హం. 'ప్రార్థన మందిరంలో ముస్లింలపై జరిగిన ఈ ఉగ్రవాద దాడిని మేం ఖండిస్తున్నాం. అక్కడ మతిలేని హింసాత్మక ఘటన జరగడం గుండెల్ని పిండేస్తోంది. కెనడియన్లుగా భిన్నత్వమే మనం బలం. మత సహనం మన విలువ' అని ట్రుడో పేర్కొన్నారు. 'మన జాతి నిర్మాణంలో ముస్లిం-కెనడియన్లు ఒక కీలకమైన భాగం. మన కమ్యూనిటీలో, మన నగరాల్లో, దేశంలో ఇలాంటి మతిలేని దాడులకు తావులేదు' అని ఆయన అన్నారు. ఈ సాయుధ దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి శిక్షిస్తారని, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సాయంత్రం ప్రార్థనలు నిర్వహిస్తుండగా మసీదులో చొరబడిన సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సుమారు ముగ్గురు సాయుధ దుండగులు కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది. కాల్పులు జరిగిన సమయంలో మసీదు ఉన్న భవనంలో దాదాపు 40 మంది ఉన్నారు. ఫాయ్ స్ట్రీట్‌లో ఉన్న క్యుబెక్ సిటీ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో అలర్ట్ అయిన కెనడా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేరుకొని సంఘటనాస్థలిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కాల్పులకు తెగబడిన ఇద్దరు సాయుధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కెనడా రేడియో ప్రకటించింది. -
మసీదులో సాయుధదాడి ఐదుగురు హతం!