ఫరాజ్ (ఫైల్)
హైదరాబాద్/త్రిసూర్: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పుల్లో మృతిచెందిన 49 మందిలో ముగ్గురు భారతీయులున్నట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. అందులో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హసన్ ఫరాజ్(31), రెస్టారెంట్ వ్యాపారి మహ్మద్ ఇమ్రాన్ ఖాన్(47) కాగా, మరొకరు కేరళలోని త్రిసూర్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ ఆన్సీ అలీగా గుర్తించారు. కాల్పుల ఘటన తరువాత గల్లంతైనట్లు వార్తలొచ్చిన ఫరాజ్ మృతిచెందినట్లు శనివారం ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
తన సోదరుడు చనిపోయినట్లు న్యూజిలాండ్ నుంచి ఫోన్ వచ్చిందని ఆయన అన్న కశీఫ్ హసన్ మీడియాకు వెల్లడించారు. ఈ షాకింగ్ వార్త తెలియగానే టోలిచౌకిలోని వారి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. దాడిలో మరణించిన 47 ఏళ్ల మరో హైదరాబాదీ ఇమ్రాన్‌ఖాన్ కుటుంబంతో కలిసి క్రైస్ట్‌చర్చ్‌లో నివాసముంటూ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. గాయపడిన అహ్మద్ ఇక్బాల్ జహంగీర్ అనే హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి కోలుకుంటున్నారు. జహంగీర్‌కు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారని, ప్రమాదమేమీ లేదని ఆయన సోదరుడు మహ్మద్ ఖుర్షీద్ వెల్లడించారు.
పీజీ చదువుతున్న ఆన్సీ..
క్రైస్ట్‌చర్చ్ కాల్పుల ఘటనలో గాయపడిన ఆన్సీ అలీ మృతిచెందినట్లు శనివారం కేరళ పోలీసులు ప్రకటించారు. గతేడాదే భర్త అబ్దుల్ నాజర్‌తో కలిసి న్యూజిలాండ్ వెళ్లిన ఆన్సీ దాడి జరిగిన మసీదు సమీపంలో ఉంటున్నారు. క్రైస్ట్‌చర్చ్‌లో ఆమె భర్త ఉద్యోగం చేస్తుండగా, ఆమె పీజీ చదువుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, క్రైస్ట్‌చర్చ్‌లో గల్లంతైన గుజరాతీల గురించి ఎలాంటి సమాచారం అందలేదని ఆ రాష్ట్ర పోలీసులు చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో ఆ రెండు మసీదుల్లో గుజరాత్‌కు చెందిన కనీసం నలుగురు ముస్లింలు ఉన్నట్లు వార్తలొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment