క్రైస్ట్‌చర్చ్ : ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారంట్(28) అనే ఉగ్రవాది ఇటీవల న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో కాల్పులకు పాల్పడి దాదాపు 50 మంది అమాయకులకు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై న్యూజిలాండ్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి జసిండా ఆర్డెన్ ప్రసంగించారు. ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్‌లో మరణహోమం సృష్టించిన ఉగ్రవాది పేరును తాను ప్రస్తావించబోనని తేల్చి చెప్పారు. ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తి అనైతికంగా ప్రవర్తించి బీభత్సం సృష్టించాడని, అతని పేరును తాను ఎప్పుడూ ప్రస్తావించనని చెప్పారు. దేశ ప్రజలు కూడా అతని పేరును ఉచ్చరించొద్దని కోరారు. కాల్పుల్లో ప్రాణాలను కోల్పోయిన వారి పేర్లను బయటకు చెప్పండి కానీ.. ఆ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి పేరును ఎక్కడ ఉచ్చరించకూడదని చెప్పారు. అతనో ఉగ్రవాది, క్రిమినల్, తీవ్రవాది అని, తాను మాట్లాడుతున్నప్పుడు అతని పేరును ప్రస్తావించబోనన్నారు. దేశంలోని చట్టాల ప్రకారం అతన్ని కఠినంగా శిక్షిస్తామన్నారు.
జాత్యహంకారంతో ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రెంటన్ టారంట్ అనే వ్యక్తి గత శుక్రవారం న్యూజిలాండ్‌లోని అల్ నూర్, లిన్‌వుడ్ మసీదుల వద్ద ఈ కాల్పులు జరిపి 50 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ దురాగతం మొత్తాన్ని వీడియో తీస్తూ ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టాడు. వీడియో ప్రకారం దుండగుడు మసీదు పక్కన కారు పార్కు చేసి తుపాకీ తీశాడు. కారుడిక్కీలోంచి మరో గన్ తీసుకుని మసీదులోకి నడిచాడు. ద్వారం వద్ద ఉన్న ఓ వ్యక్తిని కాల్చాడు. అక్కడి నుంచి రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మసీదులోపలికి వెళ్లాడు. కాల్పుల్లో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. (న్యూజిలాండ్‌లో నరమేధం)
Comments
Please login to add a commentAdd a comment