Jacinda Ardern
-
Jacinda Ardern Resigns: జసిండా అసాధారణ ఒరవడి
కాదు పొమ్మని ప్రజలు తీర్పిచ్చినా అధికారం కోసం ఎంతకైనా తెగించే డోనాల్డ్ ట్రంప్, బోల్సెనారో వంటివారిని చూసి విస్తుపోయిన ప్రపంచాన్ని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ తాజా నిర్ణయం ఆశ్చర్యపరిచి ఉండొచ్చు. పదవీకాలం ముగియడానికి పది నెలల ముందే ప్రధాని పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ఆమె ప్రకటించటం ఆ దేశ ప్రజలకే కాదు... అంతర్జాతీయ సమాజానికి కూడా ఊహకందనిది. రెండేళ్ల క్రితం అమెరికాలో ట్రంప్, మొన్నటికి మొన్న బ్రెజిల్లో బోల్సెనారో ఏం చేశారో అందరూ చూశారు. జనం అధికారం ఇవ్వలేదని తెలిసి కూడా దాన్ని ప్రత్యర్థుల నుంచి బల ప్రయోగంతో కాజేయడానికి ప్రయత్నించారు. కానీ జసిండా వీరికి భిన్నం. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించటం అసాధ్యమనుకున్న వెంటనే ఆమె రాజీనామా చేశారు. ఇప్పటికీఅత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ముందంజలో ఉన్న ఆమె ఇలా ఆలోచించటం ఊహాతీతం. పదవీకాలం ముగియడానికి ముందే తప్పుకోవటం న్యూజిలాండ్‌కు కొత్తగాదు. ఆమెకు ముందు పనిచేసిన నేషనల్ పార్టీ నేత జాన్ కీ కూడా 2017 వరకూ పదవీకాలం ఉన్నా ఏడాది ముందే వైదొలగి డిప్యూటీ ప్రధాని బిల్ ఇంగ్లిష్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే సంక్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు ఆయన వ్యవహారశైలికీ, జసిండా తీరుకూ చాలా వ్యత్యాసముంది. జాన్ కీ అప్పట్లో అన్నిటా వైఫల్యాలు చవిచూసి పార్టీలో ఒత్తిళ్లు పెరిగి తప్పనిసరై తప్పుకోవాల్సి వచ్చింది. కానీ జసిండా అలా కాదు. పార్టీలో ఆమె పట్ల సానుకూలత చెక్కుచెదరలేదు. సంక్షోభ సమయాల్లో ఆమె దృఢంగా ఉండటమే, సమస్యలను అధిగమించటమే అందుకు కారణం. కరోనా విజృంభి స్తున్నప్పుడు అన్ని దేశాలూ లాక్‌డౌన్‌తో సహా అనేక ఆంక్షలు విధించి పౌర జీవనాన్నిస్తంభింపజేస్తే ఆమె మాత్రం నిబ్బరంగా ఎదుర్కొన్నారు. పరిమిత ప్రాంతాల్లో మాత్రమే స్వల్ప స్థాయి ఆంక్షలు విధించారు. చైనానుంచి స్వదేశానికి పోయిన ఫిలిప్పీన్స్ పౌరుడొకరు 2020 ఫిబ్రవరి 2న కరోనా వైరస్ బారినపడి మరణించినట్టు వార్త రాగానే చైనానుంచి రాకపోకలు నిలిపేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. యూరప్ దేశాల్లో కరోనా మరణాలు నమోదు కావడం మొదలుకాగానే అక్కడి నుంచి కూడా విమానాలు నిలిపివేశారు. ఈ ఆంక్షలపై ఇంటా, బయటా విమర్శలొస్తున్నా లెక్క జేయలేదు. అయితే ఆమె తక్షణ స్పందనవల్ల ప్రపంచ దేశాల్లో వేలాదిమంది కరోనా బారినపడిన తరుణంలో న్యూజిలాండ్‌లో కేవలం రెండే కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సైతం రెండంకెల సంఖ్యకు మించి కరోనా కేసులు లేవు. పౌరుల సాధారణ జీవనానికి అంతరాయం కలగలేదు. ప్రజలను భయభ్రాంతులను చేయడంకాక వారు అప్రమత్తంగా ఉండేలా, ఆత్మవిశ్వాసంతో మెలి గేలా సూచనలు చేయడంవల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం జసిండాను ప్రశంసించింది. కరోనా సంబంధ కేసుల సమాచారాన్ని తొక్కిపట్టివుంచటం కాక పారదర్శకంగా వ్యవహరించటం ఆ మహమ్మారిని సునాయాసంగా ఎదుర్కొనడానికి దోహదపడింది. అయితే జసిండా పాలనపై ప్రజానీకంలో ఇటీవల కొంత అసంతృప్తి ఏర్పడిన మాట వాస్తవం. సర్వేల్లో విపక్ష నేషనల్ పార్టీ ముందంజలో ఉంది. అయితే ప్రధాని పదవికి అర్హులని భావిస్తున్న నేతల్లో ఇప్పటికీ ఆమే అందరికన్నా ముందున్నారు. కరోనా అనంతర పరిస్థితులు, ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధం న్యూజిలాండ్‌ను కూడా సంక్షోభంలోకి నెట్టాయి. ఉపాధి కల్పనలో పురోగతి లేదు. ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ పరిణామాలన్నీ పౌరులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతోపాటు 2019లో క్రైస్ట్ చర్చి నగరంలో రెండు మసీదుల్లోకి చొరబడి ఒక దుండగుడు 51 మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతాన్ని జనం ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. ప్రపంచంలో ఐస్లాండ్ తర్వాత అత్యంత శాంతియుత దేశంగా ఎప్పుడూ రెండో స్థానంలో ఉండే న్యూజిలాండ్‌కు ఈ ఉదంతాలు ఊహకందనివి. అయితే ఆ సమయంలో జసిండా వ్యవహరించిన తీరు ఆదర్శ ప్రాయమైనది. వెనువెంటనే దేశ ప్రజలనుద్దేశించి ఆమె చేసిన ప్రసంగం, బాధితులపట్ల ఆమె చూపిన దయార్ద్రత అందరినీ చలింపజేసింది. ఆ తర్వాత మారణాయుధాల విషయంలో ఉదారంగా ఉండే దేశ చట్టాలను ఆమె సవరించారు. ఈ క్రమంలో పెద్దయెత్తున వ్యతిరేకత వచ్చినా లెక్కజేయలేదు. దృఢంగా వ్యవహరించటమంటే నిరంకుశంగా పాలించటం కాదని సమస్యలపై సకాలంలో స్పందించి, అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవటమని తన ఆరేళ్ల పాలనలో జసిండా నిరూపించారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లేబర్ పార్టీ సామ్యవాద విధానాలు ఆమెకు ప్రజాదరణ తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ దేశం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ఒక మహిళగా మనసుపెట్టి ఆలోచించిన తీరు, తీసుకున్న సృజనాత్మక నిర్ణయాలు ఆమెను విలక్షణ నేతగా నిలిపాయి. ముఖ్యంగా నవజాత శిశువులున్న కుటుంబాలకు 2018లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించటం, తాజాగా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఆ కుటుంబాలకు నెలనెలా అదనపు ఆర్థిక సాయం అందించటం అందరినీ ఆకట్టుకుంది. వేతనాల్లో లింగ వివక్షను నిషేధించి, సమాన పనికి సమాన వేతనం లభించేలా తీసుకొచ్చిన చట్టం కూడా ప్రశంసలు పొందింది. అధికారమే పరమావధవుతున్న వర్తమానంలో జసిండా వంటì వారు చాలా అరుదు. వచ్చే అక్టోబర్ ఎన్నికల్లో విజేతలెవరో కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోయినా ఆమెకు సాటిరాగల నేతలు పాలక, ప్రతిపక్షాల్లో ఎవరూ లేరన్నది వాస్తవం. ఎందుకంటే ఆమె నెలకొల్పిన పాలనా ప్రమాణాలు అటువంటివి. -
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అనూహ్య రాజీనామా
వెల్లింగ్టన్: పదవీ కాలం ఇంకా పది నెలలుంది. ప్రజా బలమూ ఉంది. అయినా ఆమె పదవి కోసం తాపత్రయపడలేదు. బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలనా, లేదా అనే ఆలోచించారు. ప్రధాని పదవి వీడాల్సిన సమయం వచ్చిందంటూ హుందాగా తప్పుకున్నారు. ఆమె ఎవరో కాదు. ప్రగతి శీల పాలనకు పెట్టింది పేరైన న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్. ఆమె వయసు 42 ఏళ్లు మాత్రమే. రాజకీయంగా ఎంతో భవిష్యత్ ఉంది. సమర్థ పాలకురాలిగా, శక్తిమంతమైన నాయకురాలిగా పేరుంది. కరోనా సంక్షోభం, మైనార్టీ ఊచకోత, ప్రకృతి వైపరీత్యాలు సవాల్ ఏదైనా ఆ సమయంలో ఆమె చూపించిన సంయమనం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ప్రధానమంత్రి పదవికి జకిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. ప్రధానమంత్రిగా ఫిబ్రవరి 7 తన ఆఖరి రోజని కన్నీళ్లని అదిమిపెట్టుకుంటూ గురువారం లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో ప్రకటించి ప్రపంచ దేశాలను షాక్‌కి గురి చేశారు. ‘‘నేనూ మనిషినే. ఎంత కాలం చెయ్యగలమో అంతే చేస్తాం. అప్పుడు సమయం వస్తుంది. ఇప్పుడు నా సమయం వచ్చింది. ఒక దేశాన్ని నడిపించడం సర్వోన్నతమైన పని. అంతే సవాళ్లతో కూడుకున్నది. అనూహ్యంగా వచ్చే సవాళ్లను, పదవితో సంక్రమించిన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో సమర్థంగా నిర్వహించలేనప్పుడు ఎవరూ ఆ పదవిలో ఉండకూడదు. ఉండలేరు కూడా. ప్రధాని పదవిలో ఉండడానికి మీరు సరైన వ్యక్తా, కాదా అన్నది తెలుసుకోవడం కూడా మీ బాధ్యతే. ఇంక ఈ పదవికి నేను న్యాయం చెయ్యలేనని నాకు అనిపిస్తోంది. అందుకే తప్పుకుంటున్నాను. నేనేదో వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని ఈ పదవిని వీడడం లేదు. ఆ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే సత్తా మనకుంది’’ అని పార్టీ సభ్యులతో ఆమె ఉద్విగ్నభరితంగా చెప్పారు. గత ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన జెసిండా హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఎందరో మహిళలకు స్ఫూర్తి జెసిండా 2017లో 37 ఏళ్లకే ప్రధాని అయ్యారు. అత్యంత పిన్న వయసులో ఆ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రపంచమంతటా రైట్ వింగ్ ప్రభుత్వాలున్న నేపథ్యంలో వామపక్ష భావజాలం కలిగిన ఆమె కొత్త తరానికి ప్రతినిధిగా నిలిచారు. ప్రధానిగా ఉంటూనే బిడ్డకు జన్మనిచ్చారు! కుటుంబ బాధ్యతలు కూడా ముఖ్యమేనని ఈ తరం అమ్మాయిలకు సందేశమిచ్చారు. పొత్తిళ్లలో పాపతోనే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సమావేశంలో పాల్గొన్నారు. బిడ్డను లాలించే తల్లికే ప్రజల్ని పాలించడం బాగా తెలుస్తుందన్న సామెతను నిజం చేస్తూ, సంక్షోభం ఎదురైన ప్రతిసారీ తానేంటో ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చారు. న్యూజిలాండ్ చరిత్రలోనే చీకటి రోజుల్ని 2019 మార్చిలో ఎదుర్కొన్నారు. క్రిస్టిచర్చ్‌లో రెండు మసీదులపై ఒక దుండగుడు దాడి చేసి ప్రార్థనలు చేసుకుంటున్న 51 మంది ముస్లింల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసినప్పుడు చలించిన హృదయంతో బాధితుల పట్ల ఆమె చూపించిన దయ, సానుభూతి ప్రజలందరి మనసుల్లో చెరగని ముద్ర వేసింది. కాల్పులు జరిగిన కొద్ది వారాల్లోనే సెమీ ఆటోమేటిక్ తుపాకుల్ని నిషేధిస్తూ ఆమె కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 50 వేలకిపైగా తుపాకుల్ని, ఏఆర్–15 స్టైల్ రైఫిల్స్‌ని ధ్వంసం చేశారు. ఇక కరోనా సంక్షోభాన్ని ఆమె ఎదుర్కొన్న తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కరోనా వైరస్ సరిహద్దుల్లోనే కట్టడి చేయడానికి ఆమె తీసుకున్న చర్యలకు అందరూ భేష్ అన్నారు. వాతావరణ మార్పులే ప్రపంచ దేశాలకు అసలైన సవాల్ అని నమ్మిన ఆమె కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించడానికి 2050ని లక్ష్యంగా నిర్ణయిస్తూ విధానపరమైన నిర్ణయాలు ప్రకటించారు. ప్రధానిగా ఆమె తెగువ, శక్తి సామర్థ్యాలకు ప్రజలు ఫిదా అయ్యారు. 2020 ఎన్నికల్లో రికార్డు విజయం ఆమెకు కట్టబెట్టారు. -
న్యూజిలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు
వెల్లింగ్టన్: ఓటు హక్కు అర్హతను 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశ పెడతామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ చెప్పారు. దేశ సుప్రీంకోర్టు కూడా 16 ఏళ్ల వారికి ఓటు హక్కు కల్పించడంపై సానుకూలంగా స్పందించడంతో సోమవారం ఆమె ఈ ప్రకటన చేశారు. రాబోయే నెలల్లో ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చిస్తామన్నారు. రాజ్యాంగం ప్రకారం ఇలాంటి వాటిపై పార్లమెంట్‌లోని 75% మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే, రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుండటంతో ‘16 ఏళ్లకే ఓటు’ ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశాల్లేవు. కాగా, 16 ఏళ్ల వారికీ ఓటు హక్కు కల్పించిన దేశాల్లో ఆస్ట్రియా, మాల్టా, బ్రెజిల్, క్యూబా, ఈక్వెడార్ ఉన్నాయి. -
తగ్గేదేలే.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు మానవహక్కుల సమాఖ్య నుంచి రష్యాను సస్పెండ్ చేసే తీర్మానానికి ఐరాస ఆమోదం లభించింది. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో మొత్తం 193 సభ్యుల ఓటింగ్‌కుగానూ.. రష్యాను తొలగించాలంటూ 93 ఓట్లు వచ్చాయి. 24 వ్యతిరేక ఓట్లు రాగా.. 58 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. రష్యాను సస్పెండ్ చేయడంపై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేయగా.. క్రెమ్లిన్ మాత్రం సీరియస్ కామెంట్స్ చేసింది. పూర్తి అక్రమ, రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించింది. ఇదిలా ఉండగా.. యుద్ధం వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రధానులపై రష్యా నిషేధం విధించింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, న్యూజిలాండ్ పీఎం జెసిండా ఆర్డెర్న్‌లు తమ దేశంలో ప్రవేశించడానికి వేళ్లేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ఇప్పటికే రష్యాపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆంక్షలు విధించిందిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్ ఇస్తూ రష్యా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఆ రెండు దేశాల ప్రధానులతో పాటుగానే ఆస్ట్రేలియాకు చెందిన మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది, న్యూజిలాండ్‌కు చెందని 130 మందితో కూడిన నిషేధితుల జాబితాను విడుదల చేసింది. కాగా, తర్వలోనే ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్తలు, నిపుణులు, మిలిటరీని కూడా బ్లాక్ లిస్టులో చేరుస్తామని రష్యా హెచ్చరించింది. -
సంచలన నిర్ణయం.. సిగరెట్లపై జీవితకాల నిషేధం!
For Future Generations New Zealand To Ban Cigarettes: రాబోయే తరాల ఆయుష్షు పెంచేందుకు, ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీనేజర్లు సిగరెట్లు కొనడానికి, టీనేజర్లకు సిగరెట్లు అమ్మడాన్ని నిషేధిస్తూ చట్టం చేయనుంది అక్కడి ప్రభుత్వం. వచ్చే ఏడాది నుంచి అమలు కానున్న ఈ చట్టంలోని ‘మెలిక’ ద్వారా అక్కడ యువత జీవితాంతం పొగతాగడానికి దూరం కావడం ఖాయం!. న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకురాబోయే యాంటీ స్మోకింగ్ బిల్లు వచ్చే ఏడాది చట్టం కానుంది. 14 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు వాళ్లకు సిగరెట్లు అమ్మడాన్ని అక్రమ కార్యకలాపంగా భావిస్తుంది అక్కడి ప్రభుత్వం. అంటే 2008 తర్వాత పుట్టిన వాళ్లెవరూ సిగరెట్లు కొని తాగడానికి, వాళ్లకు ఎవరూ సిగరెట్లు అమ్మడానికి వీల్లేదు. ఈ మేరకు 2027 నుంచి ఈ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలనే ప్రతిపాదన చేసింది. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏడాది సిగరెట్ కొని తాగేందుకు నిర్ధారించిన కనీస వయసును పెంచుకుంటూ పోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఆ వ్యక్తి జీవిత కాలం సిగరెట్ కొని తాగడానికి.. దుకాణదారులు ఆ వ్యక్తిని సిగరెట్ అమ్మడానికి వీల్లేకుండా పోతుంది. టార్గెట్ విఫలం కావడంతోనే.. యువత ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు తమ జీవిత కాలంలో సిగరెట్ కాల్చకుండా.. వాళ్లకు ఎవరూ అమ్మకుండా ఇలా కఠిన చట్టం తీసుకురాబోతోందన్నమాట. గురువారం ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది న్యూజిలాండ్ ప్రభుత్వం. నిజానికి స్మోకింగ్ అలవాటును తగ్గించే ప్రయత్నాల్లో న్యూజిలాండ్ సర్కార్ ఎప్పటి నుంచో గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్లేయిన్ సిగరెట్ ప్యాకింగ్ తప్పనిసరి చేసిన 17 దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. అలాగే పద్దెనిమిదేళ్ల లోపు వాళ్లకు సిగరెట్లు అమ్మడం నిషేధం అక్కడ. అయినప్పటికీ 2025 నాటికి అడల్ట్ స్మోకింగ్ రేటు కనీసం 5 శాతం తగ్గించాలన్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఇలా కఠిన చట్టం ఆలోచన చేసింది. స్మోకింగ్ అలవాటుతో న్యూలాండ్‌లో సాలీనా ఐదు వేల మంది చనిపోతున్నారు. అంతేకాదు నికోటిన్‌కు అలవాటు పడ్డ పేషెంట్ల కోసం భారీగానే ఖర్చు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. అందుకే యుక్తవయసులోనే అలవాటుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది చివరికల్లా కొత్త చట్టం సిద్ధం అవుతుంది. ఆ తర్వాత దశలవారీగా అమలు చేస్తారు. 2024 నాటికల్లా.. సిగరెట్ స్టోర్ల సంఖ్యను తగ్గించి(8 వేల నుంచి 500కి తగ్గించాలనే ఆలోచనలో ఉంది).. అమ్మకాల్ని తగ్గుముఖం పట్టేలా చేస్తారు. 2025 నుంచి నికోటిన్ లెవల్ తక్కువ ఉండే సిగరెట్లను మాత్రమే అమ్మాలనే కఠిన నిబంధన అమలు చేయనుంది. ఇక 2027 నుంచి స్మోక్ ఫ్రీ జనరేషన్ నినాదంతో కఠిన చట్టం అమలు చేస్తారు. నిషేధాన్ని ఎలా అమలు చేస్తారు? ఏయే రిటైలర్స్‌ను అమ్మకాలకు దూరంగా ఉంచుతారు? ఎవరికి అనుమతులు ఉంటాయి?.. అనే ప్రణాళిక ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నారు. మిగతా వివరాలపై బిల్లు తీసుకొచ్చే టైంలోనే స్పష్టత ఇవ్వనున్నారు. న్యూజిలాండ్ ఇంత టఫా? అఫ్కోర్స్. కానీ, న్యూజిలాండ్ కంటే భూటాన్ సిగరెట్ నిషేధాన్ని కఠినాతికఠినంగా అమలు చేస్తోందని తెలుస్తోంది. అయితే భారత్ నుంచి బ్లాక్ మార్కెట్ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకు ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేసినట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. పక్కాగా అమలు యువతలో పెరిగిపోతున్న పొగతాగే అలవాటు-మరణాలపై మవోరి తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులతో పాటు మవోరి టాస్క్‌ఫోర్స్ ‘లైఫ్‌టైం స్మోకింగ్ బ్యాన్’ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇక ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా, రిటైలర్స్‌కు నష్టం వాటిల్లకుండా దశల వారీగా చర్యలతో నష్టనివారణ చేపట్టే దిశగా ప్రయత్నాలు చేయనున్నారు. ఉపాధి కోల్పోకుండా ఆ 1500 స్టోర్లను ప్రత్యామ్నాయ స్టోర్లుగా ప్రభుత్వమే నడిపించనుంది. మరీ ముఖ్యంగా స్మోక్ ఫ్రీ జనరేషన్ చట్టం ద్వారా ప్రజా ఆరోగ్య, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ఖర్చు చేస్తున్న 3.6 బిలియన్ అమెరికన్ డాలర్లను ఆదా చేయాలని భావిస్తోంది. -
పాకిస్తాన్లో భద్రత లేదంటూ... కివీస్ పర్యటన రద్దు!
రావల్పిండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓ పెద్ద జట్టు మా దేశ పర్యటనకు వచి్చందన్న ఆనందం ఆవిరైంది. న్యూజిలాండ్ ఇంకాసేపట్లో తొలి వన్డే కోసం బరిలోకి దిగాల్సివుండగా... మ్యాచ్‌నే కాదు ఏకంగా సిరీస్‌నే రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది. ఈ ఊహించని హఠాత్పరిణామానికి పీసీబీ ఉలిక్కిపడింది. ఒక్కసారిగా అయోమయంలో పడింది. ఉన్నపళంగా ఈ నిర్ణయానికి గల కారణం ఏంటో చెప్పాలంది. లోపాలుంటే సరిదిద్దుకుంటామంది. భద్రత ఏర్పాట్లను మరింత పటిష్టపరుస్తామంది. అసలేం జరిగింది? శుక్రవారం మ్యాచ్ కోసం ఇరు జట్లు బస చేసిన హోటల్ నుంచి స్టేడియానికి చేరాల్సివుంది. ఆటగాళ్లేమో గదుల నుంచి బయటికి రావడం లేదు. వారి కోసం బస్సులు ఎదురుచూస్తున్నాయి. న్యూజిలాండ్ వర్గాల నుంచి ఒక ప్రకటన మాత్రం బయటికి వచి్చంది. ‘ఈ పర్యటన ఇక ఏమాత్రం ముందుకు సాగదు. మా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో మేం ఆడటం సాధ్యపడదు. ఈ నిర్ణయం పీసీబీకి మింగుడుపడదని మాకు తెలుసు. ఘనమైన ఆతిథ్య ఏర్పాట్లు ఎన్నో చేశారు. అయితే మా ఆటగాళ్ల భద్రత దృష్ట్యానే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ సీఈఓ డేవిడ్ వైట్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో పీసీబీ వర్గాలకు ఊపిరి ఆగినంత పనైంది. వెంటనే దిగ్గజ కెపె్టన్ అయిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. కివీస్ ప్రధాని జసిండా అర్డెర్న్‌కు ఫోన్ చేశారు. ఆటగాళ్ల భద్రతకు హామీ ఇచ్చారు. కానీ ఆమె ఆటగాళ్లను పాక్‌లో ఉంచేందుకు ససేమిరా అని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత కివీస్ మూడు వన్డేలు, ఐదు టి20ల సిరీస్ కోసం పాక్ పర్యటనకు ఈ నెల 11న ఇక్కడికి వచి్చంది. ఆతిథ్య, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వెలిబుచ్చింది. ఇంతలోనే ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మూడు రోజుల క్రితమే పీసీబీ చీఫ్ పదవి చేపట్టిన రమీజ్ రాజా న్యూజిలాండ్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. ఐసీసీ పేషీలోనే తేల్చుకుంటామని ట్విట్టర్లో ప్రకటించారు. మేమూ సమీక్షిస్తాం: ఈసీబీ వచ్చే నెల పాక్ పర్యటనకు వెళ్లాల్సిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా తమ నిర్ణయాన్ని సమీక్షించుకుంటామని చెప్పింది. ‘ఒకట్రెండు రోజుల్లో చర్చించుకొని టూర్ ప్రణాళికను వెల్లడిస్తాం’ అని ఈసీబీ తెలిపింది. వచ్చే నెల 13, 14 తేదీల్లో ఇంగ్లండ్ రావలి్పండి వేదికగా రెండు టి20లు ఆడేందుకు వెళ్లాల్సివుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి నెలల్లో ఆసీస్ కూడా పాక్‌లో పర్యటించాల్సివుంది. కానీ అనిశి్చత పరిస్థితుల దృష్ట్యా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. -
ఆస్పత్రిలో ‘కరోనా రోగి శృంగారం’పై మీ సమాధానం.. షాక్‌కు గురైన ప్రధాని
ఆక్లాండ్: మహమ్మారి కరోనా వైరస్‌ను న్యూజిలాండ్ సమర్ధవంతంగా ఎదుర్కొని పారదోలింది. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా విజృంభణ తగ్గిపోయింది. కరోనా కట్టడి చర్యలు పటిష్టంగా అమలు కావడంతో ఆ దేశంలో మహమ్మారి కనుమరుగవుతోంది. ప్రస్తుతం కరోనా రహిత దేశంగా అడుగులు వేస్తోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జసిండా ఆర్డర్న్పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె పనితీరును అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు హాజరవగా ఆమెకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్న వినడంతోనే ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొద్దిసేపు ఆగింది.. అనంతరం దీటుగా జవాబిచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్ ఆరోగ్య శాఖ డ్రైరెక్టర్ జనరల్ ఆష్లే బ్లూమ్ ఫీల్డ్‌తో కలిసి ఇటీవల ఓ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా విలేకరి ‘ఆక్లాండ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా బాధితుడిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా శృంగారంలో పాల్గొన్నదనే వార్తలు వచ్చాయి. ఇది అత్యంత ప్రమాదకరం కాదా?’ అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విని ప్రధాని జసిండా అవాక్కయ్యారు. కొన్ని సెకన్ల అనంతరం తేరుకుని ‘కరోనా పరిస్థితుల్లోనే కాదు.. సాధారణ రోజుల్లో కూడా ఆస్పత్రిలో అలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు’ అని ప్రధాని సమాధానమిచ్చారు. పక్కన ఉన్న ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఆష్లే కూడా ఈ ప్రశ్న విని అవాక్కయ్యాడు. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు PM Jacinda Ardern says sexual relations, regardless of Covid status, shouldn’t “generally be part of [hospital] visiting hours.” Ashley Bloomfield: “It’s a high risk activity, potentially.” pic.twitter.com/VeRVXg7QjU — Aaron Dahmen (@dahmenaaron) September 9, 2021 -
New Zealand: ముగ్గురి పరిస్థితి విషమం: ప్రధాని జెసిండా
న్యూజిలాండ్ ఉగ్రదాడిలో గాయపడిన ఏడుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ప్రకటించారు. శనివారం ఉదయం మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. భావోద్వేగానికి లోనయ్యారు. దాడి జరిగిన క్షణాల్లోనే తీవ్రవాదిని పోలీసులు మట్టుబెట్టినట్లు ఆమె వివరించారు. ఆక్లాండ్ సీటి న్యూలిన్ షాపింగ్ మాల్లోని కౌంట్‌డౌన్ సూపర్ మార్కెట్లో శుక్రవారం (సెప్టెంబర్ 3న) ఓ తీవ్రవాది కత్తితో విచక్షణరహితంగా జనాలపై దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిలో మొత్తం ఏడుగురు గాయపడగా అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దాడి సమయంలో అప్రమత్తమైన పోలీసులు తీవ్రవాదిని కాల్చి చంపారు. తీవ్రవాది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు చెందిన ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాది అని, శ్రీలంక నుంచి న్యూజిలాండ్‌కు వచ్చాడని, కోర్టు ఆదేశాల మేరకు ఇంతకు మించి పూర్తి వివరాలను వెల్లడించలేమని జెసిండా అన్నారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపే క్రమంలో ఆమె కంటతడి పెట్టారు. కత్తుల అమ్మకం బంద్ తాజా ఉగ్రదాడి నేపథ్యంలో కౌంట్‌డౌన్ సూపర్ మార్కెట్.. కత్తులను అమ్మకాల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దాడికి పాల్పడే ముందు షాపింగ్ చేసినట్లు నటించిన ఉగ్రవాది.. అక్కడి కత్తితోనే దాడికి పాల్పడడం విశేషం. ఇక దాడికి ముందు ఉగ్రవాది బస చేసినట్లుగా భావిస్తున్న ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. చదవండి: తాలిబన్ల సంబరాలు.. అమాయకుల మృతి -
ఆన్లైన్ ఉగ్రవాదంపై పోరుకు అమెరికా మద్దతు
ప్యారిస్: ఆన్లైన్ ద్వారా పెరిగిపోతున్న హింసాత్మక అతివాదాన్ని నిరోధించే లక్ష్యంతో మొట్టమొదటి సారిగా అగ్రరాజ్యం అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు దిగ్గజ టెక్ సంస్థలు శుక్రవారం వర్చువల్‌గా ఒకే వేదికపైకి చేరాయి. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో న్యూజిల్యాండ్ ప్రధాని ఆర్దెర్న్ మాట్లాడుతూ..భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూ ఆన్లైన్లో అతివాద భావజాలం విస్తరించకుండా నివారించే విషయంలో మరింత స్పష్టత అవసరమన్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సానుకూలంగా స్పందించినందుకు ఆర్దెర్న్తోపాటు ఫ్రాన్సు అధ్యక్షుడు మేక్రాన్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఇతరులను ప్రేరేపించేందుకు, అతివాదంలోకి లాగేందుకు ఇంటర్నెట్ను ఉపయోగించుకోకుండా చూడటం ప్రథమ ప్రాథామ్యమని అమెరికా అధ్యక్ష భవనం ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. తమ దేశాల్లో జరిగిన తీవ్ర దాడుల నేపథ్యంలో మొదటిసారిగా 2019లో న్యూజిల్యాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్దెర్న్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ దీనిని ప్రారంభించారు. వీరి ప్రయత్నాలకు క్రైస్ట్‌చర్చి పిలుపుగా పేరు వచ్చింది. 2019లో న్యూజిల్యాండ్‌లోని క్రైస్ట్‌చర్చిలోని ఒక మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిపై ఒక తీవ్రవాది జరిపిన కాల్పుల్లో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఈ ఘటన ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం కావడం తీవ్ర సంచలనం రేపింది. ఇప్పటి వరకు 50కి పైగా దేశాలు, గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు కూడా క్రైస్ట్‌చర్చి పిలుపునకు మద్దతు ప్రకటించాయి. తాజాగా అమెరికాతోపాటు నాలుగు దేశాలు వీరికి తోడయ్యాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు, టెక్ సంస్థలు ఆన్లైన్లో ఉండే హింసను ప్రేరేపించే అతివాద సంబంధ సమాచారాన్ని గుర్తించే విషయంలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. చదవండి: గాజా నుంచి శివార్లకు తరలిపోతున్న పాలస్తీనియన్లు -
ప్రధాని పెళ్లి డేట్ కొద్ది గంటల క్రితమే ఫిక్స్ అయింది!
న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ పెళ్లి డేట్ కొద్ది గంటల క్రితమే ఫిక్స్ అయింది! అయితే పెళ్లికి పిలవకపోయినా నొచ్చుకోని వారి జాబితా ఖరారు అయ్యాక మాత్రమే ఆ తేదీని జసిండా వెల్లడిస్తారట!! అందుకు కరోనా ఒక కారణం కావచ్చు. అంతేకాదు, ‘‘ఈ వయసులో పెళ్లి గౌనులో కనిపించడం ఎబ్బెట్టుగా ఉంటుంది అని అనుకుంటున్నాను కనుక పెళ్లి ముస్తాబులు ఏమీ ఉండవు’ అని కూడా ఆమె ప్రకటించారు. జసిండాకు రెండేళ్ల కూతురు ఉంది. ప్రధానిగా ఉండగా తల్లి అయిన రెండో మహిళ బెనజీర్ భుట్టో తర్వాత జసిండానే! ఇప్పుడామె తన బాయ్ ఫ్రెండ్, బిడ్డ తండ్రి అయిన వ్యక్తినే వివాహమాడబోతున్నారు. వచ్చే జూన్ 21 న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ కూతురు నీవ్ తియారహ మూడో పుట్టిన రోజు. మూడు నిండి నాలుగు వస్తుంది. ఈ తల్లికూతుళ్లతో కలిసి వెల్లింగ్టన్లోని అధికార నివాసం ‘ప్రీమియర్ హౌస్’లో క్లార్క్ గేఫోర్డ్ అనే వ్యక్తి కూడా ఉంటారు. జసిండా కూతురు నీవ్కి అతడే తండ్రి. అయితే జసిండాకు అతడు భర్త కాడు. ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండే ఆ చిన్న కుటుంబంలో అతడి స్థానం ప్రస్తుతానికైతే.. ‘డొమెస్టిక్ పార్ట్నర్’. జసిండా, క్లార్క్ ఇంతవరకు పెళ్లి చేసుకోక పోవడం వల్ల ‘ఇంటి సభ్యుడు’గా మాత్రమే అతడు ఆమె జీవితంలో ఉన్నారు. తాజా ‘బ్రేకింగ్ న్యూస్’ని బట్టి తెలుస్తున్నది ఏమిటంటే వచ్చే సమ్మర్లో జసిండా, క్లార్ పెళ్లి చేసుకోబోతున్నారు! మన సమ్మర్ కాదు. వాళ్ల సమ్మర్. న్యూజీలాండ్‌లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వేసవి నెలలు. ఆ మూడు నెలల్లో ఏదో ఒక రోజు క్లార్క్.. ‘ఇంటి సభ్యుడు’ అనే హోదా నుంచి జెసిండా భర్త హోదా పొందబోతున్నారు. పెళ్లి తేదీ ఫిక్స్ అయింది. అయితే పెళ్లికి పిలకవక పోయినా నొచ్చుకోని ఆత్మీయులు ఎవరైతే ఉంటారో ఆ జాబితాను తయారు చేశాక మాత్రమే పెళ్లి తేదీని బహిర్గతం చేస్తామని ‘కోస్ట్ రేడియో’ ప్రతినిధితో జసిండా అన్నట్లు ‘న్యూజీలాండ్ హెరాల్డ్’ పత్రిక మంగళవారం నాడు వార్త మోసుకొచ్చి ఇంటింటికీ పెళ్లి పత్రికలా పంచి వెళ్లింది. రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న పెళ్లి ఇది! 2019 ఈస్టర్ సెలవుల్లోనే జసిండా, క్లార్క్‌ల నిశ్చితార్థం జరిగింది. నిజానికి నిశ్చితార్థం కూడా వాయిదా పడుతూ వస్తోంది! 2017 అంతా జసిండా బిజీ. ఆ ఏడాదే, జసిండా తన ముప్పై ఆరేళ్ల వయసులో న్యూజీలాండ్ ప్రధాని అయ్యారు. ఆ దేశానికి అతి చిన్న వయసులో ప్రధాని అయిన తొలి మహిళ జసిండా. తర్వాత 2018 అంతా బిజీ. తల్లి కావడం, ప్రధాని బాధ్యతలతో పాటు తల్లి బాధ్యతల్నీ నెరవేర్చడం! బిడ్డ పుట్టాక నిశ్చితార్థం జరిగినా, పెళ్లి వరకు రావడానికి మళ్లీ ఒక ఆటంకం! కరోనా కట్టడిలో జసిండా బిజీ అయిపోయారు. దేశంలోని యాభై లక్షల మంది జనాభాను కరోనా నుంచి కాపాడేందుకు క్షణం తీరిక లేకుండా పనిచేశారు. ప్రజలకు ఆమె ఒకటే మాట చెప్పారు. ‘‘యాక్ట్ లైక్ యు హ్యావ్ కరోనా వైరస్’’. మీకొస్తుందని తలుపు వేసుకోకండి. వచ్చిందని వేసుకోండి. అప్పుడు కరోనా ఎవరి తలుపూ కొట్టదు అని! బాధ్యతను నెత్తి మీద పెట్టకుండా బాధ్యులను చేయడం అది. కరోనా కంట్రోల్ అయింది! అదయ్యాక మళ్లీ ఎన్నికలు. న్యూజిలాండ్‌లో మూడేళ్లకొకసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. 2020 ఎన్నికల్లో జసిండా మళ్లీ ప్రధాని అయ్యారు. ఈ మధ్యలో ఎక్కడా పెళ్లికి గ్యాప్ దొరకలేదు. ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లి ఆలోచన చేసే సమయం.. అదీ ఆలోచన వరకే.. దొరికినట్లుంది. ప్రధానిగా జసిండా మాత్రమే కాదు, క్లార్క్ గేఫోర్డ్ కూడా పెళ్లికి ఒక డేట్‌ని ఫిక్స్ చేసుకోడానికి ప్లాన్ చేస్తూనే ఉన్నారు. ఎన్నాళ్లని ‘ప్రధానికి కాబోయే భర్త’గా ఉండటం. కానీ అతడికీ కుదరడం లేదు. క్లార్క్ రేడియో బ్రాడ్‌కాస్టర్, టెలివిజన్ ప్రెజెంటర్. ‘ఫిష్ ఆఫ్ ది డే’ డాక్యుమెంటరీ షోతో బాగా పాపులర్. మీడియాలో పెద్ద స్థాయిలో ఉన్నవారికి సహజంగానే పని ఎక్కువగా ఉంటుంది. ఆయన ‘ఫిష్’ సీరీస్ కొన్నిటిని నేషనల్ జియోగ్రఫిక్ చానెల్ కూడా అడిగి తీసుకుని ప్రపంచమంతటా ప్రసారం చేస్తుంటుంది. పార్లమెంటులో జసిండా, చేపల కార్యక్రమాల షూటింగులతో క్లార్క్ ఎవరికి వారు బిజీగా ఉంటుంటే పెళ్లి చేసుకోవడం తర్వాతి సంగతి. అసలు కలుసుకునేదెప్పుడు? మాట్లాడుకోవడం ఎప్పుడు? చివరికి వాళ్లిద్దర్నీ కలిపి ఒకచోట ఉంచేందుకే పాప పుట్టినట్లుంది. పగలంతా ఎక్కడున్నా సాయంత్రానికి ఇద్దరూ ఇంటికి చేరుతున్నారు. ఇక ఈ పెళ్లి తొందర కూడా పాప కోసమే కావచ్చు. ఆ చిన్నారిని ప్లే స్కూల్లోనో, ప్రీ స్కూల్లోనో చేర్చే సమయం దగ్గర పడుతోంది మరి. అడ్మిషన్ ఫారమ్‌లో తండ్రి పేరు ఉండాలంటే.. తండ్రిగా అతడు ఉండాలి. తండ్రిగా ఉండాలంటే ముందు భర్తగా ఉండాలి. పెళ్లికి తను మాత్రం వధువుగా అలంకరించుకోనని జసిండా చెప్పేశారు! ‘‘ఈ వయసులో పెళ్లి గౌనులో కనిపించడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా’’ అంటారామె. క్లార్క్దేముందీ, కోటు వేసుకుంటే చాలు.. పెళ్లి కళ వచ్చేసినట్లే. ఆమె వయసు 40. అతడి వయసు 44. ఆమె పలుచగా ఉంటే, అతడు దృఢంగా ఉంటాడు. చక్కటి జోడీ అని ఆక్లాండ్ సిటీ హాస్పిటల్ నర్సింగ్ హోమ్ నుంచి డిశ్చార్జి అయి పాపతో బయటికి వస్తున్నప్పుడు తొలిసారి వీళ్లిద్దర్నీ చూసినప్పుడే ఆ దేశ ప్రజలు అనుకున్నారు. చక్కటి సాంగత్యమే కాదు, చక్కటి సంస్కారం కూడా ఈ జంటది. ఆ మధ్య గేఫోర్డ్‌తో కలసి రెస్టారెంట్‌కి వెళితే టేబుల్స్ ఖాళీ లేక బయటే కాసేపు నిలబడ్డారు జసిండా. వేరే రెస్టారెంట్‌కి వెళ్లబోతుంటే అప్పుడు టేబుల్ ఒకటి ఖాళీ అయిందని చెబితే లోపలికి వెళ్లారు. నేను ప్రధానిని కదా అని ఆమె అనుకోలేదు. నేను ప్రముఖ ప్రెజెంటర్‌ని కదా అని అతడూ అనుకోలేదు. ఒకరికొకరం అనుకున్నారంతే. హోదాల్ని పక్కన పెట్టి, కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడిపేందుకు కాస్త సమయమే వాళ్లకు కావలసింది. ఆ సమయం ఎప్పుడొస్తే మాత్రం ఏముంది? రావడమే అపురూపం. లవ్ ఉంది.. స్టోరీనే లేదు! కాలిన్ జెఫ్రీ అని న్యూజీలాండ్ మోడల్, యాక్టర్, టెలివిజన్ హోస్ట్ ఒకాయన ఉన్నారు. ఆయన ద్వారా 2012లో తొలిసారి జసిండా, క్లార్క్ ఒకరికొకరు పరిచయం అయ్యారు. అప్పుడామె లేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. పరిచయం తర్వాత కొన్నాళ్లకు క్లార్క్ జసిండాను కలిశారు. వివాదాస్పద ‘గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ సెక్యూరిటీ బ్యూరో బిల్’ గురించి వివరాల కోసం వచ్చారు ఆయన. మీడియా కనుక ఏదో స్టోరీ పని మీద అయుండొచ్చు. అలా వాళ్ల స్నేహం మొదలైంది. ఆమె ఫెమినిస్టు. ఆయన హ్యూమనిస్టు. స్థూలంగా ఇద్దరూ ఒకటే. ఏడేళ్ల స్నేహం తర్వాత 2019లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన నేటికీ నెరవేరలేదు! జసిండా, కాబోయే భర్త క్లార్క్ -
రెండేళ్లుగా వాయిదా.. త్వరలో పెళ్లికూతురవనున్న ప్రధాని
ఆక్లాండ్: పాపం న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌కు పెళ్లి చేసుకుందామంటే సమయమే దొరకడం లేదట. గత రెండేళ్లుగా ఆమె పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు జెసిండా. ఈ వేసవిలో పెళ్లికి సిద్ధమవతున్నారట ప్రధాని. అయితే డేట్, టైం ఇంకా ఫిక్స్ చేయలేదని స్థానిక మీడియా తెలిపింది. జెసిండా కోస్ట్ రేడియోతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి నాకు టైం దొరికింది. ఈ వేసవిలో నేను, నా భాగస్వామి క్లార్కే గేఫోర్డ్ వివాహం చేసుకోవాలని భావిస్తున్నాం. టైం, డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఎవరికి చెప్పకుండా వివాహం చేసుకోవాలని మేం కోరుకోవడం లేదు. కొద్ది మందిని తప్పక ఆహ్వానిస్తాం’’ అని ప్రధాని తెలిపినట్లు మీడియా వెల్లడించింది. ఇక జెసిండా ఆర్డెర్న్(40)కు, క్లార్కే(44)కు 2019లో నిశ్చితార్థం అయ్యింది. ఆ ఏడాది ఈస్టర్ సెలవుల్లో వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి రెండు సంవత్సరాల కుమార్తె ఉంది. అయితే ఇప్పటి వరకు వీరు వివాహం చేసుకోలేదు. పలు కారణాల వల్ల వీరి పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ వేసవిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు జెసిండా. దక్షిణార్థగోళంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెలల్లో వేసవి ఉంటుంది. ఆ సమయంలో వివాహం చేసుకోవాలని జెసిండా నిర్ణయించుకున్నారు. ఇక సంప్రాదాయబద్దంగా తన పెళ్లి జరగదని జెసిండా తెలిపారు. అలా చేయడం తనకు ఇష్టం లేదని జెసిండా వెల్లడించినట్లు మీడియా ప్రచురించింది. ఇక జెసిండా 2017లో న్యూజిలాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. గతేడాది అక్టోబర్‌లో తిరిగి మరోసారి ప్రధాని పీఠం చేజిక్కుంచుకున్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో బిడ్డకు జన్మనిచ్చారు జెసిండా. ఇక కోవిడ్‌ను కంట్రోల్ చేయడంలో జెసిండా ప్రపంచదేశాధ్యక్షులకు స్ఫూర్తిగా నిలిచారు. చదవండి: భూకంపం వచ్చినా ఇంటర్వ్యూ ఆపని ప్రధాని -
నో ఎంట్రీ : జెసిండా ఆర్డెర్న్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రెండో దశలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య లక్షను దాటేసిన నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రయాణాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే తమ పౌరులను కూడా అనుమతించేది లేదంటూ మీడియా సమావేశంలో వెల్లడించారు. (కరోనా ప్రమాద ఘంటికలు: సోనూసూద్ స్పెషల్ డ్రైవ్) విదేశాల నుంచి న్యూజిలాండ్‌కు వచ్చిన ప్రయాణికుల్లో 23 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.. వీరిలో 17 మంది భారత్ నుంచి వచ్చిన వారే ఉన్నారు . దీంతో తాత్కాలికంగా రెండు వారాలపాటు ఇండియానుంచి ఎవరూ తమదేశానికి రాకుండా నిషేధం విధించారు. వైరస్ లోడ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు కేసుల తీవ్రతను బట్టి నిషేధాన్ని పొడిగించే అవకాశం కూడా లేకపోలేదన్నారు. ఏప్రిల్ 11 సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్ 28 వరకు అమల్లో ఉండనుంది. (కోవిషీల్డ్ టీకా: సీరమ్‌కు ఎదురు దెబ్బ!) కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నిలువరించ గలిగిన దేశాల్లో ఒకటిగా జెసిండా నేతృత్వంలోని న్యూజిలాండ్ నిలిచింది. గత 40 రోజులుగా కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. మరోవైపు ఇండియాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. గురువారం నాటికి లక్షా 26 వేల కేసులతో హైయ్యస్ట్ రికార్డును తాకిన సంగతి తెలిసిందే. -
ప్రధాని సంచలన నిర్ణయం: ఉచితంగా ప్యాడ్స్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థినిలకు ఉచితంగా నెలసరి కిట్‌ను అందించనున్నట్లు ప్రకటించారు. జూన్ నుంచి దశల వారీగా ఈ పంపిణీ ప్రారంభమవుతుందేని పేర్కొన్నారు. పాఠశాలలు, ఇంటర్మీడియట్, సెకండరీ స్కూల్స్‌లో ఈ కిట్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపారు. కాగా పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా 15 పాఠశాలల్లోని 3200 మంది విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ సహా మరికొన్ని ఉత్పత్తులను అందించారు. ఇది విజయవంతం కావడంతో వాటిని దేశవ్యాప్తంగా ఫ్రీగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు దాదాపు 25 మిలియన్ల న్యూజిలాండ్ డాలర్లు ఖర్చు కానున్నాయి. శానిటరీ న్యాప్కిన్ల ధర ఎక్కువగా ఉండటంతో పేద బాలికలు వాటిని కొనలేకపోతున్నారని, దీంతో రుతుక్రమం సమయంలో వారు స్కూలుకు వెళ్లడమే మానేస్తున్నారని ఓ అధ్యయనం పేర్కొంది. దీంతో నెలసరి సమస్యల వల్ల అమ్మాయిలు చదువుకు దూరం కావద్దనే ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్లు జెసిండా చెప్పుకొచ్చారు. "పీరియడ్ పావర్టీ"ని తగ్గించాలనేదే తన లక్ష్యమని తెలిపారు. శానిటరీ కిట్ల ఉచిత పంపిణీ మూడేళ్ల వరకు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ఇలా మహిళల రుతుక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికోసం నెలసరి కిట్లను ఉచితంగా అందించిన తొలి దేశంగా స్కాట్లాండ్ ఇదివరకే చరిత్రకెక్కింది. నెలసరి సమయంలో మహిళలకు అవసరమయ్యే వస్తువులన్నింటినీ ఉచితంగా అందించాలని స్కాట్లాండ్ ప్రభుత్వం నిర్ణయించడమే కాక గతేడాది నవంబర్ నుంచే దాన్ని అమల్లోకి తెచ్చింది. చదవండి: త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ప్రధాని జెసిండా! వైరల్: వంటకు సాయం చేస్తున్న కోతి! -
త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ప్రధాని!
వెల్లింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడంలో విజయవంతమై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకున్న న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్నెర్డ్ త్వరలోనే పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ టెలివిజన్ హోస్ట్ గేఫ్లోర్డ్తో గతేడాది ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంటకు రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఇక అభ్యుదయ భావాలతో, అసమాన పాలనాదక్షతతో ముందుకు సాగుతున్న జెసిండా ఆర్డెర్న్.. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. తద్వారా రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న జెసిండా ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆమె త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. పెళ్లి చేసుకోడానికి తమకు ఇప్పుడు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ‘‘మా జీవితంలోని అత్యంత ముఖ్యమైన వేడుక గురించి, మా స్నేహితులు, బంధువులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. సమయం వచ్చినపుడు ఆ వివరాలు మీతో పంచుకుంటా’’ అని ఆమె వ్యాఖ్యానించారు. (చదవండి: ఎవరీ ప్రియాంక రాధాకృష్ణన్?!) ఏడేళ్ల పరిచయం.. ప్రేమ టీవీ ఫిషింగ్ షో హోస్ట్ క్లార్క్ గేఫోర్డ్, జెసిండాలకు ఏడేళ్ల క్రితం పరిచయమైంది. న్యూజిలాండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయ భద్రతా చట్టంలో మార్పులు తీసుకువస్తుందన్న వార్తల నేపథ్యంలో.. ఆ విషయం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన క్లార్క్, అక్కడ జెసిండాను కలుసుకున్నారు. ఈ జంట 2018, జూలైలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా జెసిండా రికార్డుకెక్కారు. క్లార్క్ కొన్నాళ్లుగా తన జాబ్‌కు దూరంగా ఉంటూ కూతురును చూసుకుంటుండగా.. జెసిండా ప్రధానిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఎవరీ ప్రియాంక రాధాకృష్ణన్?!
వెల్లింగ్టన్/తిరువనంతపురం: న్యూజిలాండ్ మంత్రిగా ఎన్నికైన భారత సంతతి తొలి మహిళగా ప్రియాంక రాధాకృష్ణన్ సోమవారం చరిత్ర సృష్టించారు. అభ్యుదయ భావాలతో, అసమాన పాలనాదక్షతతో ముందుకు సాగుతున్న ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కేబినెట్లో కమ్యూనిటీ అండ్ వాలంటరీ సెక్టార్ మంత్రిగా, సామాజికాభివృద్ధి, ఉద్యోగకల్పన సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించనున్నారు. ఉన్నత చదువుల కోసం కివీస్ దేశానికి వెళ్లి అక్కడే స్థిరపడి.. రాజకీయపరంగా ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక రాధాకృష్ణన్‌కు సంబంధించిన ఆసక్తికర అంశాలు.. స్వస్థలం కేరళ ప్రియాంక రాధాకృష్షన్(41) స్వస్థలం కేరళలోని ఎర్నాకులం జిల్లా. వారి పూర్వీకులు ఉత్తర పరావూర్కు చెందినవారు. ఆమె తండ్రి పేరు ఆర్ రాధాకృష్ణన్. ఆయన ఉన్నత విద్యావంతులు. కాగా ఉన్నత విద్య కోసం తొలుత సింగపూర్‌కు వెళ్లిన ప్రియాంక, ఆ తర్వాత న్యూజిలాండ్‌కు వెళ్లి డెవలప్మెంట్ స్టడీస్‌లో మాస్టర్స్ చేశారు. ఈ క్రమంలో ఆక్లాండ్‌లో సామాజిక కార్యకర్తగా జీవితం ఆరంభించిన ఆమె.. 2006లో వామపక్ష భావజాలం గల లేబర్ పార్టీలో చేరారు. 2017లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. జెసిండా నేతృత్వంలోని లేబర్‌పార్టీలో కీలక నేతగా ఎదిగి మంత్రిగా పనిచేసే అవకాశం దక్కించుకున్నారు.(చదవండి: జెసిండా మరో సంచలనం) తాతయ్య నుంచి వారసత్వంగా..! ప్రియాంకకు రాజకీయాలేమీ కొత్తకాదు. ఆమె ముత్తాత(తల్లి తరఫున) డాక్టర్ సీఆర్ క్రిష్ణ పిళ్లై కమ్యూనిస్టు పార్టీ నేతగా కేరళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. కాగా తన కూతురి రాజకీయ జీవితం గురించి ప్రియాంక తండ్రి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మాసే యూనివర్సిటీ స్టూడెంట్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫీసర్‌గా పోటీ చేసి తొలిసారి విజయం అందుకున్న ప్రియాంక, లెఫ్ట్‌పార్టీ నేతల అండతో న్యూజిలాండ్‌లో రాజకీయ జీవితం ఆరంభించినట్లు వెల్లడించారు. న్యూజిలాండ్ కోడలు అయ్యారు! ఇక అభ్యుదయ భావాలు గల ప్రియాంక న్యూజిలాండ్ పౌరుడు రిచర్డ్సన్ను వివాహం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. గృహ హింస బాధితుల తరఫున పోరాడే ఓ ఎన్జీవోలో భాగమైన ప్రియాంకతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. ఆయన కూడా ఇటీవలే లేబర్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. కాగా ప్రియాంక సాధించిన విజయం పట్ల భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్, కేరళ మంత్రి శైలజ, తెలంగాణ ఐటీశాఖా మంత్రి కె.తారకరామారావు వంటి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాభినందనలు తెలియజేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం.. కేరళ మూలాలున్న ప్రియాంక సాధించిన విజయం పట్ల తనకెంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. Congratulations to @priyancanzlp on becoming the first NewZealand Cabinet Minister of Indian origin. Keralites taking great pride in this news!https://t.co/nUpRfahYZZ. — Shashi Tharoor (@ShashiTharoor) November 2, 2020 Congratulations to Priyanka Radhakrishnan, who is given charge for social development, youth welfare and the volunteer sector in the @jacindaardern Cabinet. Priyanka is a native of Paravur, Ernakulam. This is the first time an Indian has become a minister in New Zealand. pic.twitter.com/UbJDQSGAOW — Shailaja Teacher (@shailajateacher) November 2, 2020 It gives us immense happiness to learn that Priyanca Radhakrishnan (@priyancanzlp) became the first-ever Indian-origin minister of New Zealand. The Labour party leader has her roots in Kerala. On behalf of the people of the State, we extend our warmest greetings. — Pinarayi Vijayan (@vijayanpinarayi) November 3, 2020 -
జెసిండా మరో సంచలనం
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మరో సంచలననిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన పార్లమెంటులలో ఒకటిగా తీర్చి దిద్దుతున్నారు. మాజీ ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ను ఉప ప్రధానమంత్రిగా ప్రకటించారు. అంతేకాదు విదేశాంగ మంత్రిగా నానియా మహూతాను నియమించారు. 20మంది సభ్యుల మంత్రివర్గంలో ఐదుగురు కొత్త మంత్రులను తీసుకున్నారు. కరోనా వైరస్‌తో ఏర్పడిన లాక్డౌన్ వల్ల ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం చేస్తున్న సమయంలో హెలికాప్టర్ మనీ (ప్రజలకు నేరుగా ఉచితంగా డబ్బును పంపిణీ) అంటూ తీవ్రచర్చకు తెరతీసిన గ్రాంట్ రాబర్ట్సన్ మరోసారి ఆర్థిక మంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు విదేశాంగ మంత్రిగా నానియా మహూతా గడ్డం మీద సాంప్రదాయ మావోరి మోకో కాయే పచ్చబొట్టుతో నాలుగేళ్ల క్రితం (1996లో) దేశంలోని మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలిగా ఖ్యాతి గడించిన మహూతా తాజాగా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. విదేశాంగమంత్రి పదవి చేపట్టనున్న తొలి స్వలింగ సంపర్కురాలు మెహుతా. మునుపటి విదేశాంగ మంత్రి విన్‌స్టన పీటర్స్ కూడా మావోరికి చెందిన వారే కావడం విశేషం. భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ మరోవైపు భారత సంతతికి చెందిన ప్రియాంకా రాధాకృష్ణన్ (41) జెసిండా మంత్రివర్గంలో చోటు సంపాదించారు. కమ్యూనిటీ, వాలంటరీ సెక్టార్ మంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించ నున్నారు. గృహ హింస బాధిత మహిళలు, వలస కార్మికుల తరపున పోరాడుతున్న ప్రియాంకా 2017లో తొలిసారి లేబర్ పార్టీ తరపున పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికల్లో రెండోసారి ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించిన జెసిండా తాజాగా తన క్యాబినెట్‌ను విభిన్నంగా తీర్చిద్దిదారు. ప్రతిభ, యోగ్యత కలిగినవారికే తన మంత్రివర్గంలో చోటిచ్చామని ఇందుకు చాలా గర్వంగా ఉందని ఆమె ప్రకటించారు. రాబోయే మూడేళ్ళు తాము సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ప్రధాని జెసిండా వెల్లింగ్టన్లో విలేకరులతో అన్నారు. కరోనా మహమ్మారి సంక్షోభంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారుకుందని, ఈ ప్రభావం తమపై కూడా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆర్థిక పునరుద్ధరణను వేగవంతం చేయనున్నామనే విశ్వాసాన్ని ఆమె వెల్లడించారు. -
కరోనాపై విజయమే గెలిపించింది
అక్లాండ్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడమే తన విజయానికి కారణాలని రెండోసారి న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన జెసిండా అర్డెర్న్(40) చెప్పారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ కృషిని ప్రజలు గుర్తించారని, అందుకే ఈ విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. కరోనా మహమ్మారిని న్యూజిలాండ్ నుంచి పూర్తిగా తరిమికొట్టడమే లక్ష్యమన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో అర్డెర్న్‌కు చెందిన లిబరల్ లేబర్ పార్టీ 49 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ నేషనల్ పార్టీకి కేవలం 27 శాతం ఓట్లు దక్కాయి. అంచనాలకు మించి తమకు ఓట్లు పడ్డాయని అర్డెర్న్ చెప్పారు. న్యూజిలాండ్‌లో 24 ఏళ్ల క్రితం దామాషా ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక పార్టీ పార్లమెంట్లో స్పష్టమైన మెజారిటీ సాధించడం ఇదే మొదటిసారి. ప్రధానిగా అర్డెర్న్ ఈ ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేశారు. దీంతో దేశంలో కరోనా వ్యాప్తి భారీగా తగ్గిపోయింది. ఇది ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అర్డెర్న్ 2017లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అర్డెర్న్‌కు ప్రధాని మోదీ అభినందనలు జెసిండా అర్డెర్న్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబం«ధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి అర్డెర్న్‌తో కలిసి పనిచేస్తానని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
న్యూజిలాండ్‌లో లేబర్ పార్టీ గెలుపు
ఆక్లాండ్: న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. లెక్కించిన ఓట్లలో లేబర్ పార్టీకి దాదాపు 49 శాతం ఓట్లు లభించగా, ప్రధాన ప్రతిపక్షం నేషనల్ పార్టీకి 27 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుత ప్రధాని జెసిండా అర్డెర్న్ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ ఎన్నికల్లో ఒక పార్టీకి ఇంతలా ఘనవిజయం దక్కడం దాదాపు ఐదు దశాబ్దాల్లో ఇదే తొలిసారని జెసిండా వ్యాఖ్యానించారు. ఆ దేశంలో ప్రపోర్షనల్ ఓటింగ్ విధానం ఉంది. ఈ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఒక పార్టీకే పూర్తి మెజార్టీ రావడం ఇదే తొలిసారి. ఎన్నికల ఫలితాలు అస్థిరతను తొలగించేలా ఉన్నాయని జెసిండా అన్నారు. న్యూజిలాండ్‌లో ఎన్నికల ప్రచారం ఆరంభమైన్పటినుంచే జెసిండా హవా పూర్తిగా కొనసాగుతూ వచ్చింది. ఆమె ఎక్కడ ప్రచారానికి వెళ్లినా జననీరాజనాలు కనిపించాయి. ముఖ్యంగా దేశాన్ని కరోనా రహితంగా మార్చడంలో ఆమె కృషికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. 2017లో సంకీర్ణ ప్రభుత్వానికి సారధిగా జెసిండా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో గతేడాది జరిగిన మసీదులపై దాడుల వేళ ఆమె సమర్ధవంతంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. అలాగే దేశంలో సెమీ ఆటోమేటిక్ ఆయుధాల్లో ప్రమాదకర రకాలను నిషేధించారు. -
న్యూజిలాండ్ ఎన్నికల్లో జెసిండా ఘన విజయం
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్(40)మరోసారి విజయ పతాకాన్ని ఎగుర వేశారు. న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికలలో ఆమె ఘన విజయం సాధించారు. కరోనాను విజయవంతంగా అరికట్టడంలో ఆమె చేసిన కృషి, సమర్ధవంతమైన పాలన ఆమెకు అఖండ విజయాన్ని సాధించి పెట్టాయి. దేశంలోని ఏకసభ్య పార్లమెంటులో 120 స్థానాల్లో 64 స్థానాల్లో మెజార్టీతో దూసుకుపోతోంది. పార్టీ. సగానికి పైగా సీట్లు గెలిస్తే, లేబర్ పార్టీ తొలి సింగిల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర సృష్టించనుంది. దీంతో ఓటమిని అంగీకరించిన ప్రధాన ప్రతిపక్ష జాతీయ పార్టీ నాయకుడు జుడిత్ కాలిన్స్ ఆర్డెర్న్‌ను అభినందించారు. విజయం అనంతరం ఆక్లాండ్‌లో తన మద్దతుదారులతో జెసిండా మాట్లాడారు. రాబోయే మూడేళ్ళలో తాను చేయవలసిన పని చాలా ఉందని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం, సామాజిక అసమానతల పరిష్కారం తనముందున్న సవాళ్లని ఆమె పేర్కొన్నారు. గతంకంటే మరింత ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందని, అయితే కరోనా సంక్షోభం నుంచి చాలా వేగంగా బయటపడతామన్న ధీమాను వ్యక్తం చేశారు. కోవిడ్-19 కట్టడిలో తమ ప్రభుత్వానికి ప్రజాభిప్రాయ సేకరణలాంటిదంటూ లేబర్ పార్టీ ఘన విజయంపై ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ సంతోషం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్డెర్న్ లేబర్ పార్టీ 49 శాతానికి పైగా ఓట్ షేర్ ను దక్కించుకుంది.1930 తరువాత ఇదే అతిపెద్ద ఓట్ షేర్ అని భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేషనల్ పార్టీ 27 శాతానికి పరిమితమైంది. జెసిండా ప్రజాదరణ, మానియాకు ఇది నిదర్శనమని పొలిటికల్ వెబ్సైట్ డెమోక్రసీ ప్రాజెక్ట్ విశ్లేషకుడు జెఫ్రీ మిల్లెర్ వ్యాఖ్యానించారు. ఆమె సూపర్ స్టార్ బ్రాండ్‌కు లభించిన వ్యక్తిగత విజయమని పేర్కొన్నారు. వెల్లింగ్టన్ విక్టోరియా విశ్వవిద్యాలయానికి చెందిన రాజకీయ వ్యాఖ్యాత బ్రైస్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ, 80 సంవత్సరాలలో న్యూజిలాండ్ ఎన్నికల చరిత్రలో ఇదే అతిపెద్ద విజయమని వ్యాఖ్యానించారు. -
కరోనా: కృష్ణుని గుడిలో న్యూజిలాండ్ ప్రధాని
-
హిందూ ఆలయంలో న్యూజిలాండ్ ప్రధాని పూజలు?
వెల్లింగ్టన్: కరోనాను కట్టడి చేసిన దేశంగా న్యూజిలాండ్ పేరు మార్మోగిపోయింది. 102 రోజులుగా ఒక్క కరోనా కేసు లేకపోవడంతో ఓరకంగా పండగ వాతావరణమే నెలకొంది. అయితే కరోనాను నిర్మూలించినందుకుగానూ ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డర్న్ ఆక్లాండ్‌లోని రాధాకృష్ణుల ఆలయాన్ని సందర్శించారంటూ తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కష్ణాష్టమి సందర్భంగా ఈ వార్త మరింత ప్రాధాన్యం సంతరించుచుకుంది. ఇందులో ఆమె ఆలయంలోకి ప్రవేశించే ముందు తన పాదరక్షలను బయటే వదిలి గుడిలోకి అడుగు పెట్టారు. హారతి పూజలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే ఆమె భారతీయ సాంప్రదాయ వంటకమైన పూరీ, పప్పును తింటున్న ఫొటో సైతం నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. అయితే గతంలోనే న్యూజిలాండ్‌ను కోవిడ్ ఫ్రీగా ప్రకటించే సమయంలో జెసిండా హిందూ ఆలయానికి వెళ్లారని మరో ప్రచారమూ జరుగుతోంది. (మానవాళికి మంచిరోజులు! ) నిజంగానే జెసిండా ఆర్డర్న్ గుడికి వెళ్లారు. కానీ కరోనా కట్టడికి, ఆలయ సందర్శనకు ఎలాంటి సంబంధమూ లేదు. వచ్చే నెలలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆమె ఆలయానికి వెళ్లారు. అంతేకాక న్యూజిలాండ్ గతంలో కోవిడ్ ఫ్రీ దేశంగా ప్రకటించుకున్నప్పటికీ జూన్ 8న మళ్లీ కొత్తగా కరోనా కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత 100 రోజులపాటు కరోనా ఊసే కనిపించకుండా పోగా మంగళవారం మళ్లీ కొత్త కేసులు బయటపడ్డాయి. కాబట్టి కరోనాను నియంత్రించిన ఆనందంలో ఆ దేశ ప్రధాని గుడిని సందర్శించలేదు. ఎందుకంటే, న్యూజిలాండ్ ఇప్పుడు కరోనా ఫ్రీ దేశం కాదు. ఇదిలా వుండగా 2018 జనాభా లెక్కల ప్రకారం న్యూజిలాండ్‌లో నివసించే భారతీయుల సంఖ్య 2.44 లక్షలుగా ఉండగా, అందులో హిందువుల సంఖ్య 1.23 లక్షలుగా ఉంది. (న్యూజిలాండ్‌లో కరోనా జీరో) వాస్తవం: కరోనాను కట్టడి చేసినందుకుగానూ న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ హిందూ ఆలయాన్ని సందర్శించలేదు. -
న్యూజిలాండ్‌లో కరోనా జీరో
వెల్లింగ్టన్: ప్రపంచమంతా కోవిడ్ కోరల్లో విలవిల్లాడుతోంటే న్యూజిలాండ్ మాత్రం కోవిడ్‌ను జయించినట్టు ఆ దేశం ప్రకటించింది. కనీసం తాత్కాలికంగానైనా న్యూజిలాండ్ కోవిడ్ మహమ్మారిని అరికట్టగలగడంతో ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చిట్టచివరి కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తికూడా కోలుకున్నట్టు వైద్య అధికారులు సోమవారం ప్రకటించారు. దీంతో దేశంలో కరోనా వైరస్ జీరో అయింది. గత పదిహేడు రోజులుగా 40,000 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 50 లక్షల జనాభాగలిగిన న్యూజిలాండ్‌లో మొత్తం 3లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి చివరినుంచి చూస్తే సోమవారం న్యూజిలాండ్‌లో ఒక్క యాక్టివ్ కేసుకూడా లేదని ప్రధాని ప్రకటించారు. ‘‘కరోనాను కట్టడిచేశామన్న వార్త వినగానే నేను నా కూతురు నేవ్ ఎదుట డాన్స్ చేశాను’’ అని ప్రధాని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతానికైతే న్యూజిలాండ్ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగింది. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇది నిరంతర ప్రక్రియ’ అని మీడియా సమావేశంలో ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలో మళ్ళీ కేసులు బయటపడే అవకాశం కూడా లేకపోలేదనీ, అంత మాత్రాన మనం కరోనా కట్టడిలో విఫలమైనట్టు కాదనీ, అది వైరస్ వాస్తవికతగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అర్థరాత్రి నుంచి దేశంలో కోవిడ్ ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తున్నట్టు ప్రధాని ఆర్డెర్న్ ప్రకటించారు. న్యూజిలాండ్ భౌగోళిక స్వరూపం రీత్యా ప్రత్యేకంగా ఉండడం వంటి అనేక కారణాల రీత్యా కరోనాని కట్టడిచేయగలిగారని నిపుణులంటున్నారు. దేశంలో 1,500 మందికి కరోనా సోకగా, అందులో 22 మంది మరణించారు. వైరస్‌ని కట్టడిచేసినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లోనే ఉంది. పాక్ రాజకీయ నేతల్లో కరోనా కలకలం పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి షాహిద్ ఖ్వాక్వాన్ అబ్బాసి, ప్రస్తుత రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌లకు జరిపిన ఆరోగ్య పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. పాకిస్తాన్లో మొత్తం లక్ష మందికి కరోనా వైరస్ సోకింది. రైల్వే శాఖా మంత్రి షేక్ రషీద్ అహ్మద్‌కి కరోనా నిర్ధారణ అయ్యింది. నలుగురు చట్టసభ సభ్యులు కరోనాతో మృతి చెందారు. -
కరోనా పోరులో విజయం: సంబరపడొద్దు
వెల్లింగ్టన్ : ప్రాణాంతక కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు కంటిమీద కునుకులేకుండా గడుపుతున్న తరుణంలో న్యూజిలాండ్ ఓ శుభవార్తను పంచుకుంది. దేశంలో కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడిచేశామని, పాజిటివ్ కేసుల సంఖ్య తొలిసారి ‘జీరో’గా నమోదు అయ్యాయని ఆదేశ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ప్రకటించింది. దేశంలో కరోనా వైరస్ వెలుగుచూసిన ఫిబ్రవరి 28 నుంచి జీరో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని తెలిపింది. కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు, ప్రజలు భౌతిక దూరం పాటించడం మూలంగానే వైరస్‌ను కట్టడి చేయగలిగామని స్పష్టం చేసింది. ఇక వైరస్‌పై పోరులో విజయం సాధించిన ఆ దేశ వైద్య విభాగాన్ని ప్రధాని జెసిండా ఆర్డర్న్ ప్రశంసల్లో ముంచెత్తారు. వైద్యుల శ్రమ, కృషి, త్యాగం ఫలితంగానే నేడు విముక్తి లభించిందని అభినందనలు తెలిపారు. ఇదే పోరాట పటిమను మరికొన్నాళ్ల పాటు కొనసాగిస్తామని పేర్కొన్నారు. (కేసులు 70 లక్షలు..మృతులు 4 లక్షలు) కాగా 50 లక్షల జనాభా గల న్యూజిలాండ్‌లో ఇప్పటి వరకు 1,154 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కేవలం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మే 22 తరువాత చివరి కేసు అక్కడ నమోదు కాగా.. జూన్ 8 నాటికి వైరస్ సోకిన చివరి బాధితుడు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో కరోనా ఫ్రీ దేశంగా న్యూజిలాండ్ నిలిచింది. కరోనాపై యుద్ధంలో విజయం సాధించిన ఆ దేశానికి పొరుగు దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రపంచ దేశాల నుంచి వ్యక్తమవుతున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కరోనాను పూర్తిగా జయించామని ఇప్పుడే సంబరపడొద్దని ఆ దేశ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో వైరస్ తొలుత తగ్గుముఖం పట్టినప్పటికీ మరోసారి బయటపడటం ఆందోళనకరమైని గుర్తుచేస్తున్నారు. అయితే అతి తక్కువ జనాభా కలగడం, ప్రజలు తప్పని సరిగా భౌతికదూరం పాటించడం, కఠిన లాక్డౌన్ అమలు వంటి అంశాలు ఆ దేశానికి కొంత ఊరటనిస్తున్నాయి. (చిప్పీగర్ల్.. జెసిండా) ఇక కరోనాపై విజయంలో ఆదేశ ప్రధాని జెసిండా ఆర్డర్ పాత్ర ఎంతో కీలకమైనదని ప్రజలు ప్రశంసిస్తున్నారు. వైరస్ వెలుగుచూసిన తొలినుంచే లాక్డౌన్ విధించడం, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంలో జెసిండా విజయవంతం అయ్యారని కొనియాడుతున్నారు. వైరస్‌పై పోరులో ఆమె చూపిన తెగువ, నాయకత్వం పటిమ న్యూజిలాండ్ వాసులను సురక్షిత తీరాలకు చేర్చిందని అభినందిస్తున్నారు. ఇక ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా, బ్రెజిల్, భారత్ లాంటి దేశాలు కరోనా నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడుతున్న తరుణంలో న్యూజిలాండ్ సాధించింది గొప్ప విజయమే అని చెప్పక తప్పదు. -
ఆ దేశంలో చివరి కరోనా పేషెంట్ డిశ్చార్జ్
వెల్లింగ్టన్: అనుకోకుండా ముంచుకొచ్చిన కరోనా విపత్తు వల్ల ఇప్పటికీ ఎన్నో దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇలాంటి విషమ పరిస్థితుల మధ్య న్యూజిలాండ్ దేశం శుభవార్త తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న చివరి బాధితుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించింది. కాగా న్యూజిలాండ్ దేశంలో గత వారం రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో బుధవారం కరోనా బారి నుంచి బయటపడ్డ చిట్టచివరి పేషెంట్‌ను ఆక్లండ్‌లోని మిడిల్‌మోర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. (భూకంపం వచ్చినా ఇంటర్వ్యూ ఆపని ప్రధాని) న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డన్స్ అనుసరించిన విధివిధానాలు, ఆమె సమర్థవంతమైన నాయకత్వమే ప్రాణాంతక వైరస్‌తో సాగిన పోరాటంలో గెలుపుకు కారణమైందని ప్రజలు ఆమెకు జేజేలు పలుకుతున్నారు. కరోనా ఉనికి కనబడగానే లాక్డౌన్ విధించడం, ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం ఈ గెలుపుకు దోహదపడ్డాయంటున్నారు. ఆ దేశంలో ఆరు కరోనా కేసులు నమోదవగానే దేశ ప్రజలందరూ రెండు వారాలపాటు సెల్ఫ్ ఐసోలేట్‌లో ఉండాలని ప్రధాని జెసిండా పిలుపునిచ్చారు. బాధితుల సంఖ్య 28కు చేరుకునే సమయానికి విదేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించారు. అంతేకాక దేశంలో 2,67,435 కరోనా పరీక్షలు నిర్వహించడం విశేషం. ఇప్పటివరకు అక్కడ 1504 కేసులు నమోదవగా 22 మంది చనిపోయారు, మిగతా అందరూ కోలుకున్నారు. (గుక్కతిప్పుకోని ప్రధాని) -
చిప్పీగర్ల్.. జెసిండా
అక్క సైంటిస్ట్. అక్కలా సైంటిస్ట్ అయితే! సీరియస్ జాబ్. పోనీ, అందర్నీ నవ్విస్తుండే క్లౌన్ అయిపోతే? అదింకా సీరియస్. ఈ రెండూ కాకుండా.. వేరే ఏముంది? పాలిటిక్స్ అయితే? ఎస్.. పాలిటిక్స్..! జెసిండా పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. పాలిటిక్స్ మాత్రం సీరియస్ కాదా?! కావచ్చు. జెసిండాకు అది.. ‘చిప్పీ’లో పని! నవ్వుతూ సర్వ్ చేసేస్తారు పాలిటిక్స్‌ని కూడా. ఏరి, ఎంపిక చేసి పెట్టుకున్న మేలురకం చేపల్ని శుభ్రంగా కడిగి, ముక్కలుగా కోసి, ఉప్పూకారం పెట్టి వేయించి విక్రయించే రెస్టారెంట్ ‘ఫిష్ అండ్ చిప్ షాప్’లో జెసిండా తొలి ఉద్యోగం. తొలి ఉద్యోగం అంటే.. న్యూజిలాండ్‌లోని వైకాటో విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ స్టడీస్ (బిసిఎస్) ఇన్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్‌లో పట్టభద్రురాలు అయి బయటికి వచ్చాక చేసిన ఉద్యోగం కాదు. స్కూల్లో ఉండగానే, పార్ట్ టైమ్‌గా చేసిన జాబ్. ‘ఫిష్ అండ్ చిప్ షాప్’ దుకాణం ఒకటే ఉండదు. డోమినోస్లా, కేఎఫ్సీలా, మెగ్డీలా.. న్యూజిలాండ్, ఐర్లండ్.. ఇంకా ఆ బెల్టు మొత్తంలో గొలుసు రెస్టారెంట్లలా ‘ఫిష్ అండ్ చిప్ షాపులు’ విస్తరించి ఉంటాయి. లోకల్‌గా వాటిని ‘చిప్పీ’లనీ, ‘చిప్పర్’ లనీ అంటారు. (గుక్కతిప్పుకోని ప్రధాని) తను ఉన్న ప్రాంతంలోనే ఇంటికి, స్కూలుకు మధ్య ఒక చిప్పీని ఎంపిక చేసుకుని అందులో చేరిపోయారు జెసిండా. పాకెట్ మనీ వచ్చేది. ఆమె ముఖం వెలిగిపోయేది. పాకెట్ మనీకి కాకుండా ఇంక దేనికైనా ఆమె ముఖం వెలిగిందంటే ఎవరో ఒక పొలిటికల్ లీడర్ని ఆవేళ దగ్గరగా చూసిందనే! ఆ వయసుకే పాలిటిక్స్ ఇష్టమైపోయాయి జెసిండాకు. ‘ఫిష్ అండ్ చిప్ షాప్’లో పని ఇష్టం అవడానికి మాత్రం బహుశా వాళ్ల అమ్మగారు కారణం కావచ్చు. ఒక స్కూల్లో కేటరింగ్ అసిస్టెంట్ ఆమె. పెట్టే చెయి, పెట్టే బుద్దీ రెండూ వచ్చాయి కూతురికి తల్లి నుంచి. జెసిండా తండ్రి పోలీస్ ఆఫీసర్. ఆయన్నుంచి ఏమీ తీసుకోలేదు జెసిండా. ముఖ్యంగా డ్యూటీ అయ్యాక ఇంటికొస్తూ ఆయన మోసుకొచ్చే కోపాన్ని అస్సలు తన లోపలికి తీసుకోలేదు జెసిండా. ∙∙∙ చిన్నప్పుడంతా ఆపిల్తోటలోని ఫామ్ హౌస్‌లోనే గడిపింది జెసిండా. ట్రాక్టర్ నేర్చుకుంది. ఆ తర్వాత కారు. స్కూల్లో ఆమె తీసుకున్న ప్రాజెక్టు ‘పాలిటిక్స్’! ‘ఏం చేస్తావ్ అందులో ప్రాజెక్టు?’ అన్నారు టీచర్స్. మారిలిన్ వారింగ్ని ఇంటర్వ్యూ చేస్తానంది. ఢమాల్మన్నారు. మారిలిన్.. పార్లమెంటు సభ్యురాలు. ఆమె ఇంటర్వ్యూ దొరకదని కాదు. ఈ పిల్ల పిచ్చుక ఏం ప్రశ్నలు అడుగుతుందోనని. మారిలిన్ వట్టి ఎంపీ అయినా సరిపోయేది. పెద్ద ప్రొఫైల్ ఆవిడది. ఫెమినిస్టు, విద్యావేత్త, రచయిత్రి, హక్కుల కార్యకర్త, పర్యావరణ ఉద్యమకారిణి.. ఇలా చాలా ఉన్నాయి. ఎన్నుంటే ఏమిటి? ఇంటర్వ్యూ చేసింది జెసిండా. మారిలిన్ ముగ్ధురాలు అయ్యారు. ‘ఊ.. నువ్వు పాలిటిక్స్‌లోకి రావచ్చు’ అన్నారు నవ్వుతూ. జెసిండా చిప్పీలో పని చేస్తున్న కాలం కూడా అది. ‘వస్తే, సర్వ్ చేయడం తప్ప ఏమీ చేయలేను’ అని సాహసించి ఒక మాట అంది జెసిండా. ‘సర్వ్ చేయడానికే రమ్మంటున్నాను’ అన్నారు మారిలిన్. ఏళ్లు గడిచాయి. 40 ఏళ్ల జెసిండా ఇప్పుడు న్యూజి లాండ్కు 40వ ప్రధాని. ‘లేబర్ పార్టీ’ లీడర్. ∙∙∙ ప్రజలే ఈ ప్రధాని పర్సనల్ లైఫ్! మరీ పర్సనల్‌గా ఒక వ్యక్తి ఉన్నారు. క్లార్క్ గేఫోర్డ్. గత ఏడాది ఎంగేజ్మెంట్ అయింది. ఆ ముందు ఏడాది జూన్‌లో వీళ్లకో పాప పుట్టింది. బేనజీర్ భుట్టో తర్వాత.. ప్రజా ప్రతినిధిగా ఎంపికై, పదవిలో ఉండగా తల్లి అయిన రెండో మహిళ జెసిండా. ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చేయరు జెసిండా. ఏం కావాలో అడిగి అదిస్తారు. ప్రభుత్వోద్యోగుల పని గంటల కుదింపు గానీ, సంక్షేమ పథకాలను గానీ, సంక్షోభాలను గట్టెక్కించే సంస్కరణలను గానీ కాలయాపన జరగకుండా సర్వేలు చేయించి అమలు చేసేస్తుంటారు. జెసిండాపై డేవిడ్ హిల్ రాసిన బొమ్మల పుస్తకం ‘టేకింగ్ ద లీడ్’ ముఖచిత్రం కవర్ పేజీ. పుస్తకం ఈ ఏడాది మార్చిలో విడుదలైంది కరోనాను కూడా చక్కగా కట్టడి చేశారు. ప్రజలలో తనూ ఒకరు అన్నట్లుగానే ఉంటారు తప్ప ప్రధానిగా కనిపించరు. ఈమధ్య గేఫోర్డ్‌తో కలసి రెస్టారెంట్‌కి వెళితే టేబుల్స్ ఖాళీ లేక బయటే కాసేపు నిలబడ్డారు. వేరే రెస్టారెంట్‌కి వెళ్లబోతుంటే అప్పుడు టేబుల్ ఒకటి ఖాళీ అయిందని చెబితే లోపలికి వెళ్లారు. జెసిండా ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. భూకంపం వచ్చినా! ఆ సంగతి నిన్న మీరు చదివే ఉంటారు. సోమవారం టీవీ ఇంటర్వ్యూ లైవ్‌లో ఉండగా న్యూజిలాండ్‌లో ప్రకంపనాలు వచ్చాయి. జెసిండా నిలబడి ఉన్న గది గోడలు కూడా షేక్ అయ్యాయి. ‘షేక్ అవుతున్నాయి చూస్తున్నారా?’ అని టీవీ యాంకర్‌తో నవ్వుతూ అంటూ.. ఇంటర్వ్యూని కొనసాగించారు జెసిండా. ∙∙∙ జెసిండాకు సర్వ్ చేయడం ఇష్టం. డిగ్రీ అయ్యాక టూర్లకు వెళ్లినప్పుడు న్యూయార్క్‌లోని ‘సూప్ కిచెన్’లలో కొన్నాళ్లు పని చేశారు. నిరుపేదలకు, నిరుద్యోగులకు, ఇల్లు లేని వారికి ఉచితంగా ఆహారాన్ని అందించే యుద్ధకాలాల నాటి కొనసాగింపు కేంద్రాలు అవి. వాటిల్లో వాలంటీర్‌గా ఉన్నారు జెసిండా. సంగీతం అంటే ఇష్టం. ముఖ్యంగా బీటిల్స్. ఒక విషయమైతే జెసిండా గురించి తప్పక చెప్పుకోవాలి. తన విశ్వాసానికి విరుద్ధంగా ఉన్నాడని దేవుణ్ణే కాదనుకున్నారు ఆవిడ! చాలా ధైర్యం కావాలి కదా. ‘గే హక్కులను నిరాకరించే ప్రవచనాలేవో కనిపించాయట. చర్చిని వదిలి బైటికి వచ్చేశారు. ఇప్పుడామె ‘యాగ్నాటిస్ట్’. దేవుడు ఉన్నాడో లేడో తెలియని, తెలుసుకోవాలనే ప్రయత్నం చేయని మనిషి. అది నిజం కాకపోవచ్చు. అభాగ్యుల సేవలో ఆమె ఎప్పుడూ దేవుణ్ణి దర్శించుకుంటూ ఉన్నట్లే కనిపిస్తారు మరి!!