వెల్లింగ్‌టన్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడంలో విజయవంతమై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కించుకున్న న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్నెర్డ్ త్వరలోనే పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ టెలివిజన్ హోస్ట్ గేఫ్లోర్డ్‌తో గతేడాది ఆమెకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంటకు రెండేళ్ల కూతురు కూడా ఉంది. ఇక అభ్యుదయ భావాలతో, అసమాన పాలనాదక్షతతో ముందుకు సాగుతున్న జెసిండా ఆర్డెర్న్.. గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే.
తద్వారా రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న జెసిండా ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించడంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆమె త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. పెళ్లి చేసుకోడానికి తమకు ఇప్పుడు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. ‘‘మా జీవితంలోని అత్యంత ముఖ్యమైన వేడుక గురించి, మా స్నేహితులు, బంధువులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. సమయం వచ్చినపుడు ఆ వివరాలు మీతో పంచుకుంటా’’ అని ఆమె వ్యాఖ్యానించారు. (చదవండి: ఎవరీ ప్రియాంక రాధాకృష్ణన్?!)
ఏడేళ్ల పరిచయం.. ప్రేమ
టీవీ ఫిషింగ్ షో హోస్ట్ క్లార్క్ గేఫోర్డ్, జెసిండాలకు ఏడేళ్ల క్రితం పరిచయమైంది. న్యూజిలాండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతీయ భద్రతా చట్టంలో మార్పులు తీసుకువస్తుందన్న వార్తల నేపథ్యంలో.. ఆ విషయం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన క్లార్క్, అక్కడ జెసిండాను కలుసుకున్నారు. ఈ జంట 2018, జూలైలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా జెసిండా రికార్డుకెక్కారు. క్లార్క్ కొన్నాళ్లుగా తన జాబ్‌కు దూరంగా ఉంటూ కూతురును చూసుకుంటుండగా.. జెసిండా ప్రధానిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment