Sakshi Editorial Special Story On New Zealand PM Jacinda Ardern Resigns - Sakshi
Sakshi News home page

Jacinda Ardern Resigns: జసిండా అసాధారణ ఒరవడి

Published Sat, Jan 21 2023 12:17 AM | Last Updated on Sat, Jan 21 2023 9:32 AM

Sakshi Editorial On New Zealand PM Jacinda Ardern Resigns

కాదు పొమ్మని ప్రజలు తీర్పిచ్చినా అధికారం కోసం ఎంతకైనా తెగించే డోనాల్డ్‌ ట్రంప్, బోల్సెనారో వంటివారిని చూసి విస్తుపోయిన ప్రపంచాన్ని న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెన్‌ తాజా నిర్ణయం ఆశ్చర్యపరిచి ఉండొచ్చు. పదవీకాలం ముగియడానికి పది నెలల ముందే ప్రధాని పదవి నుంచి తప్పుకొంటున్నట్టు ఆమె ప్రకటించటం ఆ దేశ ప్రజలకే కాదు... అంతర్జాతీయ సమాజానికి కూడా ఊహకందనిది. రెండేళ్ల క్రితం అమెరికాలో ట్రంప్, మొన్నటికి మొన్న బ్రెజిల్‌లో బోల్సెనారో ఏం చేశారో అందరూ చూశారు. జనం అధికారం ఇవ్వలేదని తెలిసి కూడా దాన్ని ప్రత్యర్థుల నుంచి బల ప్రయోగంతో కాజేయడానికి ప్రయత్నించారు. కానీ జసిండా వీరికి భిన్నం. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించటం అసాధ్యమనుకున్న వెంటనే ఆమె రాజీనామా చేశారు. ఇప్పటికీఅత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ముందంజలో ఉన్న ఆమె ఇలా ఆలోచించటం ఊహాతీతం.

పదవీకాలం ముగియడానికి ముందే తప్పుకోవటం న్యూజిలాండ్‌కు కొత్తగాదు. ఆమెకు ముందు పనిచేసిన నేషనల్‌ పార్టీ నేత జాన్‌ కీ కూడా 2017 వరకూ పదవీకాలం ఉన్నా ఏడాది ముందే వైదొలగి డిప్యూటీ ప్రధాని బిల్‌ ఇంగ్లిష్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే సంక్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు ఆయన వ్యవహారశైలికీ, జసిండా తీరుకూ చాలా వ్యత్యాసముంది. జాన్‌ కీ అప్పట్లో అన్నిటా వైఫల్యాలు చవిచూసి పార్టీలో ఒత్తిళ్లు పెరిగి తప్పనిసరై తప్పుకోవాల్సి వచ్చింది. కానీ జసిండా అలా కాదు. పార్టీలో ఆమె పట్ల సానుకూలత చెక్కుచెదరలేదు. సంక్షోభ సమయాల్లో ఆమె దృఢంగా ఉండటమే, సమస్యలను అధిగమించటమే అందుకు కారణం. కరోనా విజృంభి స్తున్నప్పుడు అన్ని దేశాలూ లాక్‌డౌన్‌తో సహా అనేక ఆంక్షలు విధించి పౌర జీవనాన్నిస్తంభింపజేస్తే ఆమె మాత్రం నిబ్బరంగా ఎదుర్కొన్నారు. పరిమిత ప్రాంతాల్లో మాత్రమే స్వల్ప స్థాయి ఆంక్షలు విధించారు.

చైనానుంచి స్వదేశానికి పోయిన ఫిలిప్పీన్స్‌ పౌరుడొకరు 2020 ఫిబ్రవరి 2న కరోనా వైరస్‌ బారినపడి మరణించినట్టు వార్త రాగానే చైనానుంచి రాకపోకలు నిలిపేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. యూరప్‌ దేశాల్లో కరోనా మరణాలు నమోదు కావడం మొదలుకాగానే అక్కడి నుంచి కూడా విమానాలు నిలిపివేశారు. ఈ ఆంక్షలపై ఇంటా, బయటా విమర్శలొస్తున్నా లెక్క జేయలేదు. అయితే ఆమె తక్షణ స్పందనవల్ల ప్రపంచ దేశాల్లో వేలాదిమంది కరోనా బారినపడిన తరుణంలో న్యూజిలాండ్‌లో కేవలం రెండే కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత సైతం రెండంకెల సంఖ్యకు మించి కరోనా కేసులు లేవు. పౌరుల సాధారణ జీవనానికి అంతరాయం కలగలేదు. ప్రజలను భయభ్రాంతులను చేయడంకాక వారు అప్రమత్తంగా ఉండేలా, ఆత్మవిశ్వాసంతో మెలి గేలా సూచనలు చేయడంవల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం జసిండాను ప్రశంసించింది. కరోనా సంబంధ కేసుల సమాచారాన్ని తొక్కిపట్టివుంచటం కాక పారదర్శకంగా వ్యవహరించటం ఆ మహమ్మారిని సునాయాసంగా ఎదుర్కొనడానికి దోహదపడింది.

అయితే జసిండా పాలనపై ప్రజానీకంలో ఇటీవల కొంత అసంతృప్తి ఏర్పడిన మాట వాస్తవం. సర్వేల్లో విపక్ష నేషనల్‌ పార్టీ ముందంజలో ఉంది. అయితే ప్రధాని పదవికి అర్హులని భావిస్తున్న నేతల్లో ఇప్పటికీ ఆమే అందరికన్నా ముందున్నారు. కరోనా అనంతర పరిస్థితులు, ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధం న్యూజిలాండ్‌ను కూడా సంక్షోభంలోకి నెట్టాయి. ఉపాధి కల్పనలో పురోగతి లేదు. ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ పరిణామాలన్నీ పౌరులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతోపాటు 2019లో క్రైస్ట్‌ చర్చి నగరంలో రెండు మసీదుల్లోకి చొరబడి ఒక దుండగుడు 51 మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతాన్ని జనం ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. ప్రపంచంలో ఐస్‌లాండ్‌ తర్వాత అత్యంత శాంతియుత దేశంగా ఎప్పుడూ రెండో స్థానంలో ఉండే న్యూజిలాండ్‌కు ఈ ఉదంతాలు ఊహకందనివి. అయితే ఆ సమయంలో జసిండా వ్యవహరించిన  తీరు ఆదర్శ ప్రాయమైనది. వెనువెంటనే దేశ ప్రజలనుద్దేశించి ఆమె చేసిన ప్రసంగం, బాధితులపట్ల ఆమె చూపిన దయార్ద్రత అందరినీ చలింపజేసింది. ఆ తర్వాత మారణాయుధాల విషయంలో ఉదారంగా ఉండే దేశ చట్టాలను ఆమె సవరించారు. ఈ క్రమంలో పెద్దయెత్తున వ్యతిరేకత వచ్చినా లెక్కజేయలేదు.

దృఢంగా వ్యవహరించటమంటే నిరంకుశంగా పాలించటం కాదని సమస్యలపై సకాలంలో స్పందించి, అవసరమైతే కఠినమైన నిర్ణయాలు తీసుకోవటమని తన ఆరేళ్ల పాలనలో జసిండా నిరూపించారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లేబర్‌ పార్టీ సామ్యవాద విధానాలు ఆమెకు ప్రజాదరణ తెచ్చిపెట్టి ఉండొచ్చు. కానీ దేశం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ఒక మహిళగా మనసుపెట్టి ఆలోచించిన తీరు, తీసుకున్న సృజనాత్మక నిర్ణయాలు ఆమెను విలక్షణ నేతగా నిలిపాయి. ముఖ్యంగా నవజాత శిశువులున్న కుటుంబాలకు 2018లో ప్రత్యేక ప్యాకేజీ  ప్రకటించటం, తాజాగా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఆ కుటుంబాలకు నెలనెలా అదనపు ఆర్థిక సాయం అందించటం అందరినీ ఆకట్టుకుంది. వేతనాల్లో లింగ వివక్షను నిషేధించి, సమాన పనికి సమాన వేతనం లభించేలా తీసుకొచ్చిన చట్టం కూడా ప్రశంసలు పొందింది. అధికారమే పరమావధవుతున్న వర్తమానంలో జసిండా వంటì వారు చాలా అరుదు. వచ్చే అక్టోబర్‌ ఎన్నికల్లో విజేతలెవరో కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోయినా ఆమెకు సాటిరాగల నేతలు పాలక, ప్రతిపక్షాల్లో ఎవరూ లేరన్నది వాస్తవం. ఎందుకంటే ఆమె నెలకొల్పిన పాలనా ప్రమాణాలు అటువంటివి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement