
జెసిండా అర్డెర్న్
ఆక్‌లాండ్: న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. లెక్కించిన ఓట్లలో లేబర్ పార్టీకి దాదాపు 49 శాతం ఓట్లు లభించగా, ప్రధాన ప్రతిపక్షం నేషనల్ పార్టీకి 27 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుత ప్రధాని జెసిండా అర్డెర్న్ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ ఎన్నికల్లో ఒక పార్టీకి ఇంతలా ఘనవిజయం దక్కడం దాదాపు ఐదు దశాబ్దాల్లో ఇదే తొలిసారని జెసిండా వ్యాఖ్యానించారు. ఆ దేశంలో ప్రపోర్షనల్ ఓటింగ్ విధానం ఉంది. ఈ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఒక పార్టీకే పూర్తి మెజార్టీ రావడం ఇదే తొలిసారి.
ఎన్నికల ఫలితాలు అస్థిరతను తొలగించేలా ఉన్నాయని జెసిండా అన్నారు. న్యూజిలాండ్‌లో ఎన్నికల ప్రచారం ఆరంభమైన్పటినుంచే జెసిండా హవా పూర్తిగా కొనసాగుతూ వచ్చింది. ఆమె ఎక్కడ ప్రచారానికి వెళ్లినా జననీరాజనాలు కనిపించాయి. ముఖ్యంగా దేశాన్ని కరోనా రహితంగా మార్చడంలో ఆమె కృషికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. 2017లో సంకీర్ణ ప్రభుత్వానికి సారధిగా జెసిండా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో గతేడాది జరిగిన మసీదులపై దాడుల వేళ ఆమె సమర్ధవంతంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. అలాగే దేశంలో సెమీ ఆటోమేటిక్ ఆయుధాల్లో ప్రమాదకర రకాలను నిషేధించారు.
Comments
Please login to add a commentAdd a comment