victory in election
-
దక్షిణ కొరియా అధ్యక్షునికి ఎదురుదెబ్బ
సియోల్: పీపుల్ పవర్ పార్టీ నేత, దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రెఫరెండంగా భావిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు తాజా సమాచారం ప్రకా రం 300 సీట్లకుగాను విపక్షాల కూటమి 175 చోట్ల విజయం సాధించింది. అధికార పీపుల్ పవర్ పార్టీ, దాని మిత్రపక్షం కలిపి 109 చో ట్ల గెలిచాయి. ప్రతిపక్షం గెలుపుతో అ ధ్యక్షుడిగా యూన్ సుక్కు కష్టాలు మొదలయ్యాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిప త్యం పెరిగిన నేపథ్యంలో అధ్యక్షుడికి కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. -
US presidential election 2024: మరో ప్రైమరీలో ట్రంప్ గెలుపు
లాస్‌వెగాస్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. మరో రాష్ట్రంలో గెలుపు సొంతం చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడడానికి ట్రంప్ అవకాశాలు మెరుగవుతున్నాయి. గురువారం నెవడా రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికలో ఆయన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీ పడుతున్న మరో నేత నిక్కీ హేలీ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. నెవడాలోని మొత్తం 26 మంది డెలిగేట్లు ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా బరిలో నిలవాలంటే మొత్తం 1,215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం. ఇప్పటిదాకా ట్రంప్ 62 మంది, నిక్కీ హేలీ 17 మంది డెలిగేట్ల మద్దతు కూడగట్టారు. -
మామా.. సీఎం మామా!
మధ్యప్రదేశ్‌లో బీజేపీ సాధించిన ఘనవిజయం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్‌తో హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ గెలవవచ్చని భావించినా, ఈ స్థాయి విజయం మాత్రం అనూహ్యమే. ఎందుకంటే మధ్యలో 15 నెలల కాంగ్రెస్ పాలనను మినహాయిస్తే రాష్ట్రంలో 20 ఏళ్లుగా బీజేపీదే అధికారం. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం దాకా కూడా కొట్టొచ్చినట్టుగా కని్పంచిన ప్రభుత్వ వ్యతిరేకతను ఆ పార్టీ, ముఖ్యంగా సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సమర్థంగా అధిగమించిన వైనం అబ్బురపరిచేదే. రాష్ట్ర ప్రజలు ప్రేమగా ‘మామ’ అని పిలుచుకునే చౌహాన్ ఈ విషయంలో ముందునుంచే పక్కాగా వ్యవహరిస్తూ వచ్చారు. ఒక్కొక్కటిగా పలు ప్రజాకర్షక పథకాలను తెరపైకి తెస్తూ ప్రజల్లో అసంతృప్తిని తగ్గించగలిగారు. ప్రధాని నరేంద్ర మోదీ మేనియా, బూత్ స్థాయి నుంచి పక్కా ఎన్నికల ప్రణాళిక, పారీ్టపరంగా వ్యవస్థాగతమైన బలం వంటివన్నీ అందుకు తోడయ్యాయి. వ్యక్తిగతంగా శివరాజ్‌కు ఉన్న మంచి పేరు కూడా బాగా కలిసొచ్చింది. వివాదాలకు దూరంగా నిరాడంబర వ్యక్తిత్వంతో రాష్ట్ర ప్రజల మనసుల్లో ఆయన పట్ల మొదటి నుంచీ ఉన్న సానుకూల భావన ఓట్ల రూపంలోనూ ప్రతిఫలించింది. ఇక సమన్వయరాహిత్యం కాంగ్రెస్ పార్టీని ఈసారి బాగా దెబ్బ తీసింది. పీసీసీ చీఫ్ కమల్‌నాథ్, అగ్ర నేత దిగి్వజయ్‌సింగ్ మధ్య విభేదాలు ప్రచార పర్వంలో పలుసార్లు తెరపైకి వచ్చాయి. ‘లాడ్లీ’ సూపర్ హిట్... ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలు ప్రజాకర్షక పథకాలకు శివరాజ్ తెర తీస్తూ వచ్చారు. అధికారంలోకి వస్తే నారీ సమ్మాన్ నిధి పేరిట ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్న కాంగ్రెస్ హామీకి ప్రతిగా లాడ్లీ బెహనా యోజన తీసుకొచ్చారు. ప్రతి మహిళకు నెలకు రూ.1,250 చొప్పున ఇచ్చే ఈ పథకం బాగా హిట్టయింది. ఈ మొత్తాన్ని క్రమంగా నెలకు రూ.3,000కు పెంచుతానని కూడా శివరాజ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 2.72 కోట్ల మహిళా ఓటర్లుంటే, ఏకంగా కోటిన్నర మంది మహిళలు దీని లబి్ధదారులు! ఇది బీజేపీకి బాగా కలిసి వచి్చందని భావిస్తున్నారు. అంతేగాక శివరాజ్‌పై అధిష్టానం అభిప్రాయాన్ని మార్చడం ద్వారా ఆయన్ను తిరిగి సీఎం అభ్యర్థి రేసులో బలంగా నిలిపింది. అంతర్గత సమస్యలను అధిగమిస్తూ... ఎన్నికల వేడి మొదలయ్యే నాటికి మధ్యప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి అంత ఆశాజనకంగా కూడా ఏమీ లేదు. సుదీర్ఘ కాలంగా సీఎంగా ఉన్న 64 ఏళ్ల శివరాజ్ పని కూడా అయిపోయిందని, ఈ ఎన్నికలతో ఆయన రాజకీయ కెరీర్‌కు తెర పడ్డట్టేనన్న ప్రచారమూ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకునేందుకు అధిష్టానం కూడా ఆయన ప్రాధాన్యతను క్రమంగా తగ్గిస్తూ వచి్చంది. సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించలేదు. ఇటు బీజేపీలో అంతర్గతంగా కూడా పరిస్థితులు గొప్పగా లేవు. నేతల గ్రూపు తగాదాలతో పాటు కార్యకర్తల్లోనూ నిస్తేజం ఆవహించిన పరిస్థితి! అలాంటి స్థితిని క్రమంగా బీజేపీకి అనుకూలంగా మార్చడంలో, నేతల్లో ఐక్యత సాధించడంతో పాటు కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంలో శివరాజ్ విజయం సాధించారు. తనను సీఎం అభ్యరి్థగా ప్రకటించకపోయినా ఎన్నికల బాధ్యతలను తలకెత్తుకుని నడిపించారు. మేరా బూత్, సబ్ సే మజ్బూత్... 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీకి స్వల్ప దూరంలో ఆగిపోయిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి బీజేపీ ముందునుంచే చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచి్చంది. గత జూలై నుంచే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా, మరో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఆయనకు డిప్యూటీగా నియమించింది. ఇంకోమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ కనీ్వనర్‌గా వేసి ప్రతి విషయంలోనూ ముందునుంచే శ్రద్ధ తీసుకుంది. ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాని మోదీ సూచించిన ‘మేరా బూత్, సబ్ సే మజ్బూత్’ కార్యక్రమం మధ్యప్రదేశ్‌లో ఈసారి బీజేపీకి మంచి ఫలితాలిచి్చంది. బలమైన స్థానిక నేతల్లో ఒక్కొక్కరికి ఒక్కో బూత్ పరిధిలో పార్టీ అవకాశాలను బలోపేతం చేసే బాధ్యతను నాయకత్వం అప్పగించింది. వారి పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ ప్రోత్సహించింది. దీనికి తోడు మోదీ కూడా రాష్ట్రంలో ప్రచారంతో హోరెత్తించారు 14 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆయన ప్రసంగాలకు యువతతో పాటు మహిళలు విపరీతంగా స్పందించారు. ‘ఎంపీ (మధ్యప్రదేశ్) మనసులో మోదీ, మోదీ మనసులో ఎంపీ’ నినాదం బాగా ప్రజల్లోకి వెళ్లింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Karnataka election results 2023: హస్తానికి బూస్టర్ డోసు
న్యూడిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన అఖండ విజయం కాంగ్రెస్‌లో నూతనోత్సాహాన్ని నింపింది. కీలకమైన రాష్ట్రంలో పాగా వేయడంతో పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. చాలాఏళ్లుగా గెలుపు రుచి లేకుండా నీరసించిపోయిన కాంగ్రెస్‌కు ఇది నిజంగా ఒక బూస్టర్ డోసు. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు ఇది దివ్యౌషధంగా పనిచేయనుంది. కేంద్రంలో అధికార బీజేపీని ఢీకొట్టే ప్రధాన ప్రతిపక్షం ఎవరన్న ప్రశ్నకు కొంతవరకు సమాధానం దొరికినట్లే. బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి సాకారం కావడం లేదు. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమి అనే ప్రయత్నాలకు బ్రేక్ పడొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో విజయం నేపథ్యంలో ఇతర పార్టీలు కాంగ్రెస్ ఛత్రఛాయలోకి చేరే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోనే ఏకైక విపక్ష కూటమి ఏర్పాటైనా ఆశ్చర్యం లేదు. ఇక నాలుగు రాష్ట్రాలపై గురి లోక్‌సభ సభ్యుడిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఇటీవలే అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసం నుంచి ఆయనను బలవంతంగా ఖాళీ చేయించడం కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుభూతి కలిగించాయి. రాహుల్ బీసీల వ్యతిరేకి అంటూ బీజేపీ చేసిన ప్రచారం ఫలించలేదు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. కర్ణాటకలో స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారితోనే ఎక్కువగా ప్రచారం చేయించడం కాంగ్రెస్‌కు లాభించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో 15కు పైగా సీట్లు సాధించింది. బీజేపీ ప్రభుత్వ అవినీతిని కాంగ్రెస్ ఎండగట్టింది. కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు. ఈ ఏడాది తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో మళ్లీ నెగ్గడంతోపాటు తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోనూ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. కర్ణాటకలో విజయంతో ఆ పార్టీ ఇక మరింత దూకుడుగా వ్యవహరించనుంది. ఈ గెలుపు జాతీయ స్థాయిలో తమ పార్టీ పునర్వైభవానికి దోహదపడుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ చెప్పారు. -
Karnataka election results 2023: కాంగ్రెస్ ప్రభంజనం
సాక్షి, బెంగళూరు: కన్నడ ఓటరు కాంగ్రెస్‌కే జై కొట్టాడు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించే నాలుగు దశాబ్దాల ఆనవాయితీని కొనసాగిస్తూ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారును ఇంటికి సాగనంపాడు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్ ఉచిత హామీల ముందు మోదీ మేజిక్ ఏమాత్రం పని చేయలేదు. కార్యకర్త స్థాయి నుంచి అగ్ర నాయకత్వం దాకా సమష్టిగా చేసిన కృషి ఫలించి కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. హంగ్ ఊహాగానాలకు, హోరాహోరీ తప్పదన్న విశ్లేషణలకు చెక్ పెడుతూ తిరుగులేని మెజారిటీ సాధించింది. 224 సీట్ల అసెంబ్లీలో మెజారిటీకి 133 సీట్లు కావాల్సి ఉండగా ఏకంగా 136 స్థానాలను హస్తగతం చేసుకుంది. తద్వారా పదేళ్ల తర్వాత రాష్ట్రంలో సొంతంగా మెజారిటీ సాధించి సంబరాల్లో మునిగిపోయింది. ఇండియాటుడే వంటి ఒకట్రెండు సంస్థలు తప్ప మిగతా ఎగ్జిట్ పోల్స్ ఏవీ కాంగ్రెస్‌కు ఇంతటి విజయాన్ని ఊహించలేకపోయాయి. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీపై విపక్షాల ఉమ్మడి పోరుకు నేతృత్వం వహించేందుకు అత్యవసరమైన నైతిక బలాన్ని ఈ విజయం ద్వారా కాంగ్రెస్ కూడగట్టుకుంది. అంతేగాక వరుస ఎన్నికల్లో బీజేపీ చేతిలో కోలుకోలేని దెబ్బలు తింటూ ఓ పెద్ద రాష్ట్రంలో నికార్సైన గెలుపు కోసం ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న పార్టీకి ఈ ఘనవిజయం ఎంతో ఊరటనిచ్చింది. మరోవైపు కర్ణాటక వంటి కీలక రాష్ట్రంలో ఇంతటి పరాభవం బీజేపీకి గట్టి ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు. ఈ ఓటమితో దక్షిణాదిన ఏకైక రాష్ట్రం కూడా కమలం పార్టీ చేజారింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ఈసారి 39 స్థానాలు కోల్పోయింది. 78 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఏకంగా మరో 58 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక జేడీ(ఎస్) ఇంటి గోలతో చిర్రెత్తిన ఓటరు ఈసారి ఆ పార్టీకి గట్టిగానే వాత పెట్టాడు. హంగ్ వస్తే ఎప్పట్లా కింగ్‌మేకర్ కావాలని ఆశపడ్డ ఆ పార్టీ దారుణంగా చతికిలపడింది. 2018లో గెలిచిన 37 సీట్లలో ఏకంగా 18 స్థానాలు కోల్పోయి చిక్కి ‘సగ’మైంది. 2018లో కాంగ్రెస్, జేడీ(ఎస్) ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని 14 నెలలకే బీజేపీ పడగొట్టింది. ఆ రెండు పార్టీల్లోని 17 మంది ఎమ్మెల్యేలను లాగేసింది. వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల్లో 15 సీట్లు గెలిచి మెజారిటీ సాధించి గద్దెనెక్కింది. ఈ గోడ దూకుళ్లతో విసిగిన కన్నడ జనం ఈసారి సుస్థిర ప్రభుత్వానికి జై కొట్టారు. ఫలితాల సరళి స్పష్టమవుతూనే బెంగళూరు నుంచి హస్తిన దాకా కాంగ్రెస్ కార్యాలయాల్లో సంబరాలు మిన్నంటాయి. బీజేపీ కార్యాలయాలు కళ తప్పి కన్పించాయి. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. ఘనవిజయం సాధించిన కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇది విద్వేష రాజకీయాలపై ప్రేమ సాధించిన విజయమని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. తృణమూల్, ఎన్సీపీ సహా దేశవ్యాప్తంగా పలు విపక్ష పార్టీలు కాంగ్రెస్ విజయం పట్ల హర్షం వెలిబుచ్చాయి. బీజేపీ నియంతృత్వ పోకడలకు, కక్షసాధింపు రాజకీయాలకు ఇదో గుణపాఠమన్నాయి. ఆద్యంతం హస్తం హవా... కర్ణాటక అసెంబ్లీకి బుధవారం ఒకే దశలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఏకంగా 73.19 శాతం పోలింగ్ నమోదైంది. శనివారం ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రారంభం నుంచే కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఏ దశలోనూ వెనక్కు తగ్గకుండా దూసుకుపోయింది. ఆద్యంతం వెనుకంజలోనే కొనసాగిన బీజేపీ ఎక్కడా కోలుకోలేకపోయింది. 6 ప్రాంతాల్లో నాలుగింట్లో కాంగ్రెసే కర్ణాటకలోని ఆరు ప్రాంతాల్లో నాలుగింట్లో కాంగ్రెస్ హవాయే కొనసాగింది. జేడీ(ఎస్) కంచుకోట పాత మైసూరుతో పాటు ముంబై కర్ణాటక, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతం హైదరాబాద్ కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకల్లో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. బీజేపీ కేవలం కోస్తా కర్ణాటకలోనే పై చేయి సాధించగా బెంగళూరులో కాంగ్రెస్‌కు సమవుజ్జీగా నిలిచింది. రాహుల్ గాంధీ ఇటీవలి భారత్ జోడో పాదయాత్రలో భాగంగా కర్ణాటకలో నిడిచిన 20 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 15 చోట్ల కాంగ్రెస్ నెగ్గడం విశేషం. బీజేపీకి తగ్గింది 0.2 శాతం ఓట్లే... పోయిందేమో 39 సీట్లు! బీజేపీకి మొత్తమ్మీద ఓట్ల శాతం తగ్గకపోయినా ఏకంగా 39 సీట్లు చేజారడం విశేషం. ఆ పార్టీకి 2018లో 36.22 శాతం రాగా ఈసారి కూడా 36 శాతం సాధించింది. అప్పుడు 38 శాతం సాధించిన కాంగ్రెస్ ఈసారి ఏకంగా 43 శాతం ఒడిసిపట్టింది. 5 శాతం అదనపు ఓట్లతో అదనంగా 58 సీట్లు కొల్లగొట్టింది. 1999లో కాంగ్రెస్ 132 సీట్లు గెలిచింది. ఆ తర్వాత దాదాపు పాతికేళ్లకు అంతకంటే మెరుగైన విజయం సాధించింది. జేడీ(ఎస్) ఓట్ల శాతం 18.36 నుంచి 13.2కు తగ్గింది. రద్దవనున్న అసెంబ్లీలో బీజేపీకి 117 సీట్లు, కాంగ్రెస్‌కు 69, జేడీ(ఎస్)కు 29, బీఎస్పీకి 1, స్వతంత్రులకు 2 సీట్లున్నాయి. 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు అభినందనలు ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆ పార్టీ కృషి చేస్తుందని ఆశిస్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అహర్నిశలు శ్రమించిన బీజేపీ కార్యకర్తలకు అభినందనలు. రానున్న రోజుల్లో మరింత దీక్షతో కర్ణాటక ప్రజలకు సేవలందిస్తాం’’ – ప్రధాని నరేంద్ర మోదీ ఇది ప్రజల విజయం ‘‘ఇది ప్రజా గెలుపు. సమష్టి కృషి. బీజేపీ నాయకుల అహంకారమే వారిని ఓడించింది. కాంగ్రెస్‌ను అఖండ మెజారిటీతో గెలిపించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. ఈ గెలుపుతో దక్షిణ భారతదేశం బీజేపీరహితంగా మారింది. రాజ్యాంగ రక్షణకు ప్రజలిచ్చిన విజయమిది. కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారెంటీల అమలుకు తొలి కేబినెట్ భేటీలోనే చర్యలు తీసుకుంటాం. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేసిన 99 శాతం ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గెలుపోటములను సమానంగా చూస్తా ‘‘రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తా ను. నాకు, మా పార్టీకి ఇవేమీ కొత్తకాదు. ఈ ఓటమి నాకు గానీ, మా పార్టీకి గానీ అంతిమం కాదు. మా పోరాటం ఆగదు. ప్రజలకు తోడుగా నిలుస్తాం. పార్టీని బలోపేతం చేస్తాం. ఈ ఫలితాలతో ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మా కార్యకర్తలను కోరుతున్నా. మా పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు’’ – జేడీ(ఎస్) నేత కుమారస్వామి -
Gujarat assembly elections 2022: గుజరాత్ ఎన్నికల్లో గెలుపు మాదే: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలుపు ఖాయమని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నాటికి పాత పింఛను విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని, తమకు ఓటేసి గెలిపించాలని ప్రభుత్వ ఉద్యోగులను ఆయన కోరారు. సూరత్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో మాదిరిగానే గుజరాత్ విషయంలోనూ అంచనాలు నిజమవుతాయని, ఆప్ అధికారంలోకి వస్తుందంటూ ఆయన కాగితంపై రాసి చూపారు. 27 ఏళ్ల తర్వాత గుజరాత్ ప్రజలు బీజేపీ దుష్టపాలన నుంచి విముక్తి కాబోతున్నారని అన్నారు. పాత పింఛను విధానం సహా ఇతర డిమాండ్లను తీరుస్తామని, తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలని ప్రభుత్వ ఉద్యోగులను కోరారు. -
Gujarat Assembly Elections 2022: ప్రతి బూత్ బీజేపీదే కావాలి
వెరవాల్/ధొరాజి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లోనూ బీజేపీకే విజయం అందించాలని గుజరాత్ ప్రజలను ప్రధాని మోదీ కోరారు. ఎన్నికల రోజు ఓటర్లంతా భారీగా పోలింగ్ బూత్‌లకు తరలివచ్చి, గత రికార్డులను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. ‘బీజేపీకే ఓటేయాలని మిమ్మల్ని అడగడం లేదు. ప్రతి పౌరుడూ ఈ ప్రజాస్వామ్య వేడుకలో భాగస్వామిగా మారాలి’అని కోరారు. ‘తరచూ వచ్చే కరువు పరిస్థితులు వంటి కారణాలతో గతంలో రాష్ట్రాన్ని అందరూ చిన్నచూపు చూసేవారు. కానీ, అభివృద్ధిమార్గంలో పయనిస్తోంది. యావత్తు ఉత్తరభారతం నుంచి ఉత్పత్తులు రాష్ట్రంలోని రేవుల నుంచే ప్రపంచదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశ సౌభాగ్యానికి ఈ ఓడరేవులే ద్వారాలుగా మారాయి’అని ప్రధాని చెప్పారు. నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్ శనివారం మహారాష్ట్రలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడవడంపై ఆయన స్పందించారు. సౌరాష్ట్రకు జలాలను అందించే నర్మదా డ్యామ్ ప్రాజెక్టును 3 దశాబ్దాలపాటు అడ్డుకున్న వారితో అంటకాగుతున్న కాంగ్రెస్‌కు ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని మోదీ ప్రజలను కోరారు. కాంగ్రెస్‌కు వేసిన ఓటు వృధాయే అన్నారు. గిర్ సోమ్‌నాథ్, రాజ్‌కోట్ జిల్లాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని ప్రసంగించారు. అంతకుముందు ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయంలో పూజలు చేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 1, 5వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
US Midterm Elections 2022: అమెరికా సెనేట్‌పై పట్టు నిలుపుకున్న డెమొక్రాట్లు
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌లో అత్యంత కీలకమైన ఎగువ సభ సెనేట్‌పై డెమొక్రాట్లు పట్టు నిలుపుకున్నారు. మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింట్లో డెమొక్రాటిక్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. నెవడాకు చెందిన డెమొక్రాటిక్ సెనేటర్ కేథరిన్ కార్టెజ్ మాస్‌తో తన రిపబ్లికన్ ప్రత్యర్థి ఆడం లక్సల్ట్పై విజయం సాధించారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఆడం ఓటమి ట్రంప్‌కు వ్యక్తిగతంగా ఎదురు దెబ్బే. అరిజోనాలోనూ డెమొక్రాటిక్ సెనేటర్ మార్కె కెల్లీ గెలిచారు. దీంతో 100 మంది సభ్యులున్న సెనేట్‌లో డెమొక్రాట్ల సంఖ్య 50కి చేరింది. రిపబ్లికన్లకి 49 మంది సభ్యుల బలముంది. జార్జియాలో ఫలితం వెలువడాల్సి ఉంది. -
న్యూజిలాండ్‌లో లేబర్ పార్టీ గెలుపు
ఆక్లాండ్: న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. లెక్కించిన ఓట్లలో లేబర్ పార్టీకి దాదాపు 49 శాతం ఓట్లు లభించగా, ప్రధాన ప్రతిపక్షం నేషనల్ పార్టీకి 27 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుత ప్రధాని జెసిండా అర్డెర్న్ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ ఎన్నికల్లో ఒక పార్టీకి ఇంతలా ఘనవిజయం దక్కడం దాదాపు ఐదు దశాబ్దాల్లో ఇదే తొలిసారని జెసిండా వ్యాఖ్యానించారు. ఆ దేశంలో ప్రపోర్షనల్ ఓటింగ్ విధానం ఉంది. ఈ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఒక పార్టీకే పూర్తి మెజార్టీ రావడం ఇదే తొలిసారి. ఎన్నికల ఫలితాలు అస్థిరతను తొలగించేలా ఉన్నాయని జెసిండా అన్నారు. న్యూజిలాండ్‌లో ఎన్నికల ప్రచారం ఆరంభమైన్పటినుంచే జెసిండా హవా పూర్తిగా కొనసాగుతూ వచ్చింది. ఆమె ఎక్కడ ప్రచారానికి వెళ్లినా జననీరాజనాలు కనిపించాయి. ముఖ్యంగా దేశాన్ని కరోనా రహితంగా మార్చడంలో ఆమె కృషికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. 2017లో సంకీర్ణ ప్రభుత్వానికి సారధిగా జెసిండా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో గతేడాది జరిగిన మసీదులపై దాడుల వేళ ఆమె సమర్ధవంతంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. అలాగే దేశంలో సెమీ ఆటోమేటిక్ ఆయుధాల్లో ప్రమాదకర రకాలను నిషేధించారు. -
విజయం దిశగా మహింద రాజపక్స
కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అయిన మహింద రాజపక్స మరోసారి కీలకంగా మారనున్నారు. ఆయన నేతృత్వం వహిస్తున్న శ్రీలంక పొదుజన పెరుమణ(ఎస్ఎల్పీపీ) పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఫలితాలు వెలువడిన 16 సీట్లకుగాను 13 చోట్ల 60 శాతం పైగా ఓట్లు సాధించింది. తమిళులు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఉత్తర ప్రాంతంలో కూడా ఎస్ఎల్పీపీ అభ్యర్థులే విజయం దిశగా సాగిపోతున్నారు. మొత్తం 22 జిల్లాలకుగాను 17 జిల్లాల్లో ఎస్ఎల్పీపీ తిరుగులేని ఆధిక్యం సంపాదించినట్లు అనధికార ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 225 సీట్లున్న అసెంబ్లీలో ఎస్ఎల్పీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ గెలుపు అధికార పార్టీ సాధించిన అద్భుత విజయమని మహింద సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స పేర్కొన్నారు. ఈ గెలుపుపై మహింద రాజపక్సకు భారత ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్–19 భయం పొంచి ఉన్నప్పటికీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారనీ, ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారని అభినందించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకునేందుకు, ప్రత్యేకమైన అనుబంధాన్ని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఈ ఫలితాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. భారత ప్రధానికి మహింద రాజపక్స కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంక, భారత్‌లు స్నేహితులు, బంధువులు కూడా అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
కార్యకర్తల కృషి వల్లే విజయం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వరుస ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించే ప్రతీ విజయం వెనుక రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తలున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదున్నరేళ్లుగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి ఆమోదం లభించిందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారనీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలో ప్రతిపక్షానికి ప్రజలు బుద్ధి చెబుతూనే ఉన్నారని తెలిపారు. ప్రస్తుత ఫలితాలతో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవుపలికారు. పార్టీ ఘన విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రభు త్వం చేసిన పనులను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎండగట్టిన సోషల్ మీడియా సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికల్లో, ప్రజలు పార్టీకి ఘనవిజయం కట్టబెడుతూ, తమపైన బాధ్యత పెంచారన్న కేటీఆర్.. రానున్న నాలుగేళ్ల పాటు ఎలాంటి ఎన్నికలు లేవని, పరిపాలనపై పూర్తి దృష్టి సారించి, ప్రజల సంక్షేమానికి పునరంకితమవుతామన్నారు. -
ఫ్యాన్ హోరుకు కొట్టుకుపోయిన ‘సైకిల్’
ఆయన ధైర్యమే ఒక సైన్యమయ్యింది.. ఒదిగి ఉన్న ఓర్పే అగ్ని కణమై మండింది.. పెను నిశ్శబ్దమే.. దిక్కులు పిక్కటిల్లేలా విజయనాదం మోగించింది.. అణచివేసే అన్యాయాన్ని అంతం చేసేలా.. బడుగు జీవుల ఆశా దీపమై.. కన్నీళ్లు తుడిచే నాయకుడిగా నిలబెట్టింది..ఆ జన నాయకుడికి కృష్ణా తీరం సాహో అంటూ జై కొట్టింది. కనీవినీ ఎరుగని రీతిలో ఓట్ల తు‘ఫ్యాన్’ను సృష్టించింది. ఉద్దండులను సైతం మట్టికరిపిస్తూ గెలుపు పతాక ఎగరవేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ సత్తా చాటింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకంగా 14 కైవసం చేసుకుంది. సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ సత్తా చాటింది. ఫ్యాన్ సునామీకి సైకిల్ ముక్కచెక్కలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆధిక్యం దక్కింది. బెజవాడ ఇక అభివృద్ధి పథంలో పయనించనుంది. ఓట్లతోనే మాట్లాడారు.. పల్లె, పట్టణ ఓటర్లు ఏకమయ్యారు. ఫ్యాన్‌పై అభిమానం చూపారు. ఓట్ల వర్షం కురిపించారు. రూ. కోట్లు కుమ్మరించిన వారిని ఓట్లతో తిప్పి కొట్టారు. తిరుగులేని రీతిలో జవాబిచ్చారు. రైతు వర్గాల్లో, పల్లె జనాల్లో తమకే పట్టు ఉందని బీరాలు పలికిన టీడీపీ సైకిల్‌కు పంచరు చేశారు. మచిలీపట్నం, ఏలూరు ఎంపీ అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించారు. బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు. విజయవాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి.. కేవలం రెండు నియోజకవర్గాలతో సరిపెట్టుకున్న టీడీపీ.. గన్నవరం నియోజకవర్గంలో కొద్దిపాటి మెజార్టీతో బయటపడింది. ఆది నుంచి మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత కనబర్చిన వైఎస్సార్సీపీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్య నాయకులుగా చెలామణి అయిన కొల్లురవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎస్ జవహర్, బొడె ప్రసాద్ లాంటి వారికి ఓటమి తప్పలేదు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11న జరిగాయి. 16 నియోజకవర్గాల నుంచి 205 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అలాగే రెండు పార్లమెంటు స్థానాల్లోనూ 27 మంది పోటీలో నిలిచారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జిల్లాలో స్తబ్దుగా ఉన్న వాతావరణం నిన్నటి నుంచి వేడిగా మారింది. ఎన్నికలు ముగిశాక కౌంటింగ్‌కు 43 రోజులు వేచి చూసిన అభ్యర్థులు గురువారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠగా ఫలితాల సరళిని గమనించారు. కంచుకోటకు బీటలు.. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కృష్ణా జిల్లా ఆ పార్టీకి అండగానే నిలుస్తూ వస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలతోపాటు 10 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరో స్థానంలోనూ ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీని గెలిపించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో వాణిజ్య నగరమైన విజయవాడ భాగమవడం.. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడంతో జిల్లా అభివృద్ధిపై ప్రజలు ఎన్నో ఊహించుకున్నారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రజాహిత కార్యక్రమాలు ఏమీ చేపట్టకపోవడంతో ప్రజలు ఆపార్టీకి దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతకు ఓట్లతో హారతి పట్టారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు మాదిరిగానే 13 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ స్పష్టమైన మెజార్టీ రావడంతో దేశం కోట ముక్కచెక్కలైంది. ఆధిక్యం దోబూచులాట.. గన్నవరం అసెంబ్లీ స్థానం లెక్కింపు కేంద్రంలో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్, వైఎస్సార్సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ల మధ్య ఆధిక్యం దోబూచులాడగా.. వెంకట్రావ్ మొదటి నుంచి ఫలితాల సరళిని గమనించారు. అయితే కౌంటింగ్ కేంద్రానికి రాని వంశీ చివరలో మొరాయించిన ఈవీఎంలు లెక్కింపు విషయంలో కలెక్టర్ ఇంతియాజ్‌తో మాట్లేందుకు సాయంత్రం కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. చివరకు ఈవీఎంల స్థానంలో వీవీప్యాట్లలోని స్లిప్‌లను లెక్కిం చగా 820 ఓట్లతో వంశీ బయటపడ్డారు. హోరాహోరీ.. సెంట్రల్ అసెంబ్లీ స్థానం లెక్కింపు కేంద్రంలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమా, వైఎస్సార్సీపీ అభ్యర్థి మల్లాది విష్టుల నడుమ నువ్వా నేనా అన్నట్లు హోరాహోరి పోరు జరిగింది. మొదట కొన్ని రౌండ్లపాటు ఆధిక్యంలో ఉన్న వైఎస్సార్సీపీ 15 రౌండ్ ముగిసే సరికి 64 ఓట్లతో టీడీపీ అభ్యర్థి బొండా ముందంజలోకి వచ్చారు. ఇక అప్పటి నుంచి రౌండు రౌండ్‌కూ ఆయన ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చారు. చివరకు 17వ రౌండ్ వచ్చే సరికి 1659 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. చివరి మూడు రౌండ్లలో మెజార్టీ నీదా నాదా అన్నట్లు సాగి.. చివరకు మల్లాది విష్ణు 19 ఓట్లతో గెలుపొందారు. -
బీజేపీకి హామీల సవాళ్లు!
న్యూఢిల్లీ: వరుసగా రెండోసారి కేంద్రంలో విజయదుందుభి మోగించిన బీజేపీకి ఎన్నికల హామీల అమలు సవాల్‌గా మారనుంది. వాగ్దానాల అమలుకు రూ. లక్షలాది కోట్ల నిధులను సమీకరించాల్సి ఉండటమే అందుకు కారణం. బీజేపీ సంకల్ప పత్ర పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో భారీగా హామీలు గుప్పించింది. ముఖ్యంగా 2025 నాటికి దేశ ఆర్థిక రంగాన్ని 5 లక్షల కోట్ల డాలర్లకు, 2032 నాటికి 10 లక్షల కోట్ల డాలర్లకు చేరుస్తామని, వ్యవసాయ రంగంలో రూ. 25 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని, రూ. లక్ష వరకు వడ్డీలేని సాగు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చింది. 60 వేల కి.మీ. జాతీయ రహదారులను నిర్మిస్తామని, 100 కొత్త ఎయిర్‌పోర్టుల కార్యకలాపాల ప్రారంభం, 400 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, పన్నుల తగ్గింపు, మౌలిక వసతుల రంగంలో 2024 నాటికి రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని పేర్కొంది. దేశానికి స్వాతంత్య్రం లభించి వందేళ్లు పూర్తయ్యే 2047కి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. 2018–19 సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టానికి 7 శాతంగా నమోదవడం ప్రతికూలంశంగా పరిణమించనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల అమలుకు కమలదళం ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. -
కచ్చితంగా 100 స్థానాల్లో గెలిచి తీరతాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విపక్ష కూటమి ఎన్ని కుట్రలు పన్నినా.. 100 సీట్లతో తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలు టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం పనితీరును ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ కాసేపు మాట్లాడారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాకోర్టే అంతిమమని.. ప్రభుత్వం పనితీరును అక్కడే తేల్చుకుంటామని కేటీఆర్ చెప్పారు. రాహుల్ గాంధీ ఎక్కడ ప్రచారం చేసినా.. కాంగ్రెస్ పని ఖతమేనని ఎద్దేవా చేశారు. ‘సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి. పేదలతో ఆయనకు భావోద్వేగ బంధం కుదిరింది. ఏపీ సీఎం చంద్రబాబు లాగా ఎన్నికలు వస్తున్నాయంటే.. తూతూమంత్రంగా పథకాలను అమలు చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు. మొదటి కేబినెట్ భేటీలోనే ఏకంగా 42 అంశాలపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాలే.. సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో అచంచలమైన విశ్వాసాన్ని పెంచాయి’అని కేటీఆర్ తెలిపారు. అన్ని పనులు ముఖ్యమంత్రే చేయాలనేది కరెక్టు కాదని.. పథకాల అమలు బాధ్యత అధికార యంత్రాంగానిదేనన్నారు. ‘కేసీఆర్ గురించి అందరికీ అన్నీ తెలుసు. 17 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఆయన్ను గమనిస్తున్నారు. కేసీఆర్ భాష, అలవాట్లు, ఆరోగ్యం వంటి వాటిపై ఎంత దుష్ప్రచారం చేసినా.. ఆయనే సీఎంగా ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారు. ఇప్పుడూ అదే జరుగుతుంది’అని ఆయన ధీమాగా చెప్పారు. కూటమి లెక్కలు కుదరవు ‘రాజకీయాల్లో ఒకటి, ఒకటి కలిస్తే రెండు కాదు. ఇదే రూల్.. మహాకూటమికి కూడా వర్తిస్తుంది. 2009లో కూటమి అంచనాలు తప్పింది. అప్పుడు టీడీపీతో పొత్తు విషయంలో కేసీఆర్ విముఖత చూపారు. మేమే ఒప్పించి పొత్తు పెట్టుకోవాలని సూచించాం. అయితే కూటమి దారుణంగా విఫలం చెందింది. పైస్థాయిలో పొత్తులు పెట్టుకుంటే కింది స్థాయిలో నేతలు, కార్యకర్తలు కలిసి పని చేయలేరు. 2009లో రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగలేదు. ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. మా పార్టీ కేవలం 10 సీట్లకు పరిమితమైంది’అని కేటీఆర్ గుర్తుచేశారు. ఆవిర్భావం నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న టీడీపీ.. ఇప్పుడు ఆ పార్టీతో కలిసి పోటీ చేయడం క్షేత్రస్థాయిలో బెడిసికొడుతుందన్నారు. ‘కూటమిలో సీట్ల పంచాయితీ తెగేట్టులేదు. నర్సంపేట వంటి చోట్ల.. ఏ పార్టీ బరిలో ఉండాలనేది సమస్యగా మారింది. కోదండరాం 2014 ఎన్నికల నుంచే కాంగ్రెస్ లైన్లో ఉన్నారు. సోనియాగాంధీని రహస్యంగా కలిసి ఇద్దరు, ముగ్గురికి టిక్కెట్ ఇప్పించుకున్నారు’అని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను దించాలనే ఏకైక ప్రచారాంశంతో విపక్షాలు ముందుకెళ్తున్నాయని.. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా ఉండదన్నారు. ‘కాంగ్రెస్‌లో విశ్వసనీయత ఉన్న నేతలు లేరు. వాళ్ల హామీలను ప్రజలు నమ్మడం లేదు. గత ఎన్నికల సమయంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ చెప్పింది. రాహుల్ గాంధీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ప్రజలు టీఆర్ఎస్నే దీవించారు’అని కేటీఆర్ చెప్పారు. కొంతైనా అసంతృప్తి తప్పదు! ‘పనితీరు విషయంలో ప్రతి ఎమ్మెల్యేపైనా ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. మన ఇంట్లోనే అందరూ మన విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉండరు. కాంగ్రెస్ మాజీ ఉప ముఖ్యమంత్రి భార్య (పరోక్షంగా దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డిని ప్రస్తావిస్తూ) సైతం వాళ్ల మేనిఫెస్టోపై సంతృప్తిగా లేరు. అభివృద్ధి, సంక్షేమం, సామూహిక పనుల విషయంలో ఎంత చేసినా.. వ్యక్తిగత పనుల విషయంలో కొందరికి అసంతృప్తి ఉంటుంది. ఆశించినవి జరగలేదనే అసంతృప్తి వేరు. కానీ.. ఎన్నికల విషయంలో మాత్రం ప్రజలు.. ఇప్పటిదాకా జరిగిన పనినే చూస్తారు. రాష్ట్రంలో ఎటు చూసినా టీఆర్ఎస్ గాలి వీస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల పరంగా చూస్తే.. 60 సీట్లతో గెలవడంలో సంతృప్తి లేదు’అని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఉలికిపాటెందుకు? ‘కాంగ్రెస్‌ను ముందుపెట్టి తెలంగాణలో పెత్తనం చెలాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగాక చంద్రబాబుకు ఇంకా ఇక్కడేం పని. ఈ విషయంలో వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ స్పష్టంగా ఉన్నారు. చంద్రబాబు మాత్రం అప్పుడు ఎమ్మెల్యేకు కోటి రూపాయలు ఇచ్చి మా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నించాడు. ఇప్పుడు వంద కోట్లు పెట్టి కాంగ్రెస్‌లో ఉన్న తోలుబొమ్మలను ఆడించాలనుకుంటున్నాడు. వెన్నెముకలేని కాంగ్రెస్.. చంద్రబాబు చెప్పినట్లు చేసేందుకు సిద్ధమైంది. చంద్రబాబు విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏపీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ని తెస్తానని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ)దాడులను తెచ్చారు. ఈ దాడుల విషయంలో చంద్రబాబు ఎందుకు ఉలికిపడుతున్నారు. వ్యాపారవేత్తలైన సీఎం రమేశ్, నారాయణ ఆస్తులపై జరిగిన దాడుల విషయంలోనూ రాద్ధాంతం చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల హామీల విషయంలో చంద్రబాబు వైఖరిని అందరూ పరిశీలించాలి’అని కేటీఆర్ అన్నారు. అత్యుత్తమ మేనిఫెస్టో... ‘టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే స్ఫూర్తితో ఎన్నికల మేనిఫెస్టో అద్భు తంగా ఉంటుంది. ఆసరా పింఛన్ల పెంపు కూడా జాబితాలో ఉంది. దసరా తర్వాతే మేనిఫెస్టో వెల్లడిస్తాం. మా ప్రభుత్వం రుణమాఫీని విజయవంతంగా అమలు చేసింది. రూ. 2 లక్షల పంట రుణాలు ఉన్న రైతుల సంఖ్య తెలంగాణ వ్యాప్తంగా 1–2% మాత్రమే. నాలుగేళ్ల పాలనపై ఆడియో, వీడియో ప్రచార ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే విషయంలో నేనేమీ నిర్ణయించుకోలేదు. కొన్ని నియోజకవర్గాలకు వెళ్లొస్తున్నా.. దసరా తర్వాత సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహిస్తారు’ అని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి ఒక్క సీటు రాదు ‘తెలంగాణ కోసం బీజేపీ ఒక్క మేలూ చేయలేదు. బయ్యారం, ఐటీఐఆర్, హైకోర్టు విభ జన విషయాలను పట్టించుకోలేదు. మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు కలిపి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నాలుగేళ్లలో బీజేపీ పేదల కోసం ఒక్క పథకం, కార్యక్రమం చేపట్టలేదు. నోట్ల రద్దుతో అమలుతోనూ పెద్దగా ఏమీ జరగలేదు. పైగా మహిళల పోపుల పెట్టెలోని డబ్బులను తీసుకునేలా చేసింది. తెలంగాణలో కులం, మతంతో నిమిత్తం లేకుండా ప్రజలు తీర్పు ఇస్తారు. బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. వారి స్థానాల్లో మా అభ్యర్థులు బలంగా ఉన్నారు’ అని కేటీఆర్ అన్నారు. -
మహారాష్ట్రలో బీజేపీ విజయకేతనం
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని జామ్నర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 25 కార్పొరేషన్లలోనూ అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన రాష్ట్ర జలవనరులు, వైద్యశాఖ మంత్రి గిరీశ్ మహాజన్ భార్య సాధనా మహాజన్ ఎన్సీపీ అభ్యర్థి అంజలి పవార్‌పై 8400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గిరీశ్ మహాజన్.. అన్నాహజారే దీక్ష, మహా రైతుల ర్యాలీ సమయంలో ఏర్పడిన సవాళ్లను ఎదుర్కోవడంలో ఫడ్నవిస్‌కు సలహాలు ఇవ్వడం ద్వారా ట్రబుల్ షూటర్‌గా పేరు పొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన భార్య గెలుపొందడం ద్వారా మహా రాజకీయాల్లో పట్టు సాధించడం ఆయనకు మరింత సులభంగా మారింది. సొంత పార్టీలోనే శత్రువుగా భావించే ఏక్నాథ్ ఖడ్సేపై పై చేయి సాధించినట్టయింది. ఇది ప్రజా విజయం : గిరీశ్ మహాజన్ జామ్నర్ మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై గిరీశ్ మాట్లాడుతూ.. జామ్నర్లో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారన్నారు. ఎన్సీపీ నాయకుల కుల రాజకీయాలు ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ఓటుకు 5 వేల రూపాయలు ఇచ్చారు : ఎన్సీపీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార పార్టీ డబ్బు వెదజల్లిందని ఎన్సీపీ నాయకులు ఆరోపించారు. గిరీశ్ మహాజన్ ఇంటింటికీ తిరిగి ఓటుకు 5 వేల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. ఓడిపోతామనే భయంతోనే దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. -
ఓ ట్రాన్స్‌జెండర్ విజయగాథ..
మనీలా: వారంటే సమాజంలో చిన్నచూపు, హేళన.. మనుషుల మధ్యే జీవిస్తున్నా ఎంతో అంతరం.. పేరుకు మనుషులే అయినా ఇతరుల్లాగా హక్కులుండవు.. చట్టంతో పాటు మతాచారాలు అడ్డు.. ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులు, విమర్శలను ఎదుర్కొని ఓ ట్రాన్స్‌జెండర్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన గెరాల్డినె రోమన్ విజయగాథ ఇది.. ఫిలిప్పీన్స్ చట్టసభ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా 49 ఏళ్ల రోమన్ చరిత్ర సృష్టించింది. ఆ దేశ రాజధాని మనీలాకు వాయవ్య ప్రాంతంలో ఉన్న బటాన్ ప్రావిన్స్ నుంచి ఆమె విజయబావుటా ఎగురవేసింది. మతదురాచారాలు, ద్వేషం, లింగబేధంతో కూడిన రాజకీయాలు విజయం సాధించలేదని.. ప్రేమ, గౌరవం, అంగీకార రాజకీయాలదే విజయమని ఆమె ఉద్వేగంతో చెప్పింది. రోమన్ విజయాన్ని ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) సమాజం తమ విజయంగా భావిస్తోంది. ఫిలిప్పీన్స్‌లో వారికి వ్యతిరేకంగా కఠిన చట్టాలున్నాయి. సేమ్ సెక్స్ వివాహాలు నిషేధం. తమ హక్కుల కోసం రోమన్ పోరాడుతుందని ఆశిస్తున్నారు. పిలిప్పీన్స్‌లో పలువురు ట్రాన్స్జెండర్లు రాజకీయాల్లో ఉన్నా రోమన్దే అగ్రస్థానం. 'ఈ విజయం చాలా సంతోషం కలిగిస్తోంది. రాజకీయ నేతగా సేవ చేయడానికి ఉత్సుకతో ఉన్నాను. ఎల్జీబీటీ సమాజం ఎన్నో అవమానాలను ఎదుర్కొంటోంది. మా హక్కుల గురించి పోరాడుతా' అని రోమన్ చెప్పింది. రోమన్ కుటుంబం కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. ఆమె తల్లిదండ్రులు కాంగ్రెస్‌కు ప్రాతినిధ్య వహించారు. 1990ల్లో లింగమార్పిడి చేయించుకున్న రోమన్ చట్టబద్దంగా తన పేరు మార్చుకుంది. ఆమె రెండు దశాబ్దాలుగా మహిళగానే, మహిళ వేషధారణలో జీవిస్తోంది. స్పానిష్ న్యూస్ ఏజెన్సీలో సీనియర్ ఎడిటర్‌గా పనిచేసింది. స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు మాట్లాడగలదు. స్పెయిన్ చదువుకునేందుకు స్కాలర్షిప్ సంపాదించిన రోమన్ అక్కడ తన పార్టనర్‌ను కలుసుకుంది. ఫిలిప్పీన్స్‌లో ట్రాన్స్జెండర్లకు వ్యతిరేకంగా రూపొందించిన కఠిన చట్టాలను రద్దు చేయాలని కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఇప్పుడు చట్టసభకు ఎన్నిక కావడంతో ట్రాన్స్జెండర్ల హక్కులు సాధించడంతో పాటు బటాన్ ప్రజల సంక్షేమం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందేలా కృషి చేస్తానని చెబుతోంది.