
పురపాలక ఎన్నికల్లో పార్టీని ఘన విజయం వైపు నడిపించిన కేటీఆర్‌కు మంగళ హారతితో స్వాగతం పలుకుతున్న కూతురు అలేఖ్య. చిత్రంలో కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ, కొడుకు హిమాన్షు
సాక్షి, హైదరాబాద్: వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించే ప్రతీ విజయం వెనుక రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తలున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదున్నరేళ్లుగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి ఆమోదం లభించిందన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారనీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలో ప్రతిపక్షానికి ప్రజలు బుద్ధి చెబుతూనే ఉన్నారని తెలిపారు.
ప్రస్తుత ఫలితాలతో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవుపలికారు. పార్టీ ఘన విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రభు త్వం చేసిన పనులను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎండగట్టిన సోషల్ మీడియా సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికల్లో, ప్రజలు పార్టీకి ఘనవిజయం కట్టబెడుతూ, తమపైన బాధ్యత పెంచారన్న కేటీఆర్.. రానున్న నాలుగేళ్ల పాటు ఎలాంటి ఎన్నికలు లేవని, పరిపాలనపై పూర్తి దృష్టి సారించి, ప్రజల సంక్షేమానికి పునరంకితమవుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment