‘లోకల్‌’ మేనిఫెస్టోలు ప్రకటించండి | KTR Teleconference With TRS Municipal Candidates Over Municipal Elections 2020 | Sakshi
Sakshi News home page

‘లోకల్‌’ మేనిఫెస్టోలు ప్రకటించండి

Published Fri, Jan 17 2020 1:19 AM | Last Updated on Fri, Jan 17 2020 9:35 AM

KTR Teleconference With TRS Municipal Candidates Over Municipal Elections 2020 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు స్థానిక అవసరాల మేరకు వార్డు, పట్టణ మేనిఫెస్టోలు ప్రకటిం చాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె. తారక రామారావు ఆదేశించారు. రానున్న 4 రోజుల్లో ఇంటింటికీ కనీసం 3 నుంచి 5సార్లు వెళ్లి ప్రచారం నిర్వహించాలని, ప్రభుత్వ కార్యక్రమాలు వివరించి ఓట్లు అడగాలన్నారు. పార్టీ బీ–ఫారం కోసం ప్రయత్నించిన తోటి నాయకులను కలుపుకొని ఐక్యంగా ప్రచా రం నిర్వహించాలని సూచించారు. గెలుపు తమదేననే ధీమాతో ప్రచారంలో అలసత్వం ప్రదర్శించొద్దని ఆయన కోరారు. పార్టీ కేంద్ర కార్యాలయం టీఆర్‌ఎస్‌ భవన్‌ నుంచి గురువారం ఆయన పార్టీ అభ్యర్థులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టణాలను దేశంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్త మున్సిపల్‌ చట్టం తెచ్చామన్నారు. దీంతో ప్రజలకు పారదర్శకతతో కూడిన వేగవంతమైన పౌర సేవలందిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తే సరిపోతుందని, ప్రజలు టీఆర్‌ ఎస్‌కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పెన్షన్లు, కేసీఆర్‌ కిట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సాగునీటి ప్రాజెక్టులు, కొత్త జిల్లాల ఏర్పాటు వంటి ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.

గత ఆరేళ్లుగా ప్రభుత్వం అమలుపరిచిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల అనుభవంలో ఉన్నాయన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరతను తగ్గించామన్నారు. పట్టణాల్లో మిషన్‌ భగీరథ (అర్బన్‌) పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో 3,75,000 ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయడంతో మున్సిపాలిటీలపై విద్యుత్‌ బిల్లుల భారం తగ్గిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో పురపాలికలకు ప్రత్యేక నిధులిస్తున్నామన్నారు. తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్‌ఐడీసీ) ద్వారా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 2,500 కోట్ల ప్రత్యేక నిధులిచ్చామన్నారు. స్వచ్ఛ, హరిత పట్టణాల కోసం చెత్త తరలింపు ఆటోలు, ఇతర వాహనాలను సమకూర్చామని, ప్రతి పట్టణానికి నర్సరీని ఏర్పాటు చేయడంతోపాటు హరితహారం కార్యక్రమాన్ని భారీగా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పార్టీ అభ్యర్థులకు కేటీఆర్‌ సూచించారు.

కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు లేదు...
మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల్లేక కాంగ్రెస్, బీజేపీలు అన్ని చోట్లలో పోటీచేయడం లేదన్నారు. ఆ పార్టీలకు పట్టణాల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసిన నిధులను పోల్చుకుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పది రేట్లు అధికంగా పట్టణాలకు కేటాయించిందన్నారు. కాంగ్రెస్‌ కాలంలో జరిగిన అభివృద్ధి, టీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని ఓట్లు వేయాలని ప్రజలను కోరాలని అభ్యర్థులకు కేటీఆర్‌ సూచించారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చినా, ఇప్పటిదాకా పట్టణాలకు ఒక్క రూపాయి ప్రత్యేక నిధిని కేటాయించలేదన్నారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుంటుందని, ఎక్కడైనా సమన్వయం అవసరమైతే పార్టీ సహకరిస్తుందన్నారు. తాజా నివేదికల ప్రకారం టీఆర్‌ఎస్‌ గెలుపు తథ్యమన్నారు. ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థులందరితో మరోసారి సమావేశం అవుతానన్నారు. ఈ సందర్భంగా ఆయన 10 మంది అభ్యర్థులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రచారం ఎలా ఉంది... ఇప్పటివరకు ఎంత మందిని కలిశారు.. ఎమ్మెల్యేలు ఎలా సహకరిస్తున్నారు... తదితర అంశాలపై ఆరా తీశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement