సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 10 మున్సిపల్ కార్పొరేషన్లన్నింటిపై పార్టీ జెండాను ఎగరేసేందుకు టీఆర్‌ఎస్ వ్యూహం రచిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్లలో భారీ విజయంపై ఆ పార్టీ గురిపెట్టింది. మున్సిపాలిటీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో శనివారం తెలంగాణభవన్‌లో సమావేశమైన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, నేతలతో సమావేశమయ్యారు.
అన్ని మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవాల్సిందేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లు చాలా కీలకమైనవని, భౌగోళికంగా పెద్దగా ఉండే ఈ పురపాలికల్లో పార్టీ గెలుపు ముఖ్యమన్నారు. కార్పొరేషన్లలో గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని, ఎలాంటి అలసత్వం ప్రదర్శించొద్దని హెచ్చరించారు. మున్సిపాలిటీలతో పోల్చితే, కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున అధిక సంఖ్యలో నామినేషన్లు వేసిన నేపథ్యంలో బీ ఫారాలు పొందే అభ్యర్థులు మినహా రెబెల్స్ ఎవరూ పోటీలో ఉండకుండా చూడాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బడంగ్‌పేట్, మీర్‌పేట్, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లలో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఆయా కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడారు. ప్రస్తుతం నామినేషన్లు వేసిన అభ్యర్థుల సంఖ్యతో పాటు నగరాల్లో ప్రచారం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గతంలో వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి కార్పొరేషన్లకు ప్రత్యేకంగా బడ్జెట్‌లో నిధులిచ్చి ఆయా నగరాల అభివృద్ధికి తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని కోరారు. కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్ల అభివృద్ధికి కూడా ప్రభుత్వం మద్దతునిస్తుందన్నారు.
ఆ పార్టీల తీరును ఎండగట్టండి..
రామగుండం కార్పొరేషన్‌లో పార్టీ గెలుపు కోసం మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారాన్ని తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు కేటీఆర్ సూచించారు. రామగుండంలోని నేతలతో మంత్రి కొప్పులకు ఉన్న సంబంధాలు ఈ ఎన్నికల్లో విజయానికి ఉపయుక్తంగా ఉంటాయన్నారు. హైదరాబాద్ శివార్లలోని కార్పొరేషన్లలో పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేయాలని మంత్రి మల్లారెడ్డికి సూచించారు. శివారు కార్పొరేషన్లలో పార్టీ స్థితిగతులు, ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. శివార్లలో పురపాలికలను ఏర్పాటు చేయకముందు ప్రజలకు ఎదురైన ఇబ్బందులను వారి దృష్టికి తీసుకుపోవాలన్నారు.
కార్పొరేషన్ల ఏర్పాటుతో వచ్చే మౌలిక వసతులు, అభివృద్ధితో కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల ఎన్నికలపై సైతం కేటీఆర్ చర్చించారు. ఈ 2చోట్లలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, లోపాయికారీగా ఆ రెండు పార్టీలు కలసి పనిచేస్తున్న తీరును ప్రజల ముందు పెట్టాలన్నారు. ఈ రెండు పార్టీలు టీఆర్‌ఎస్‌ను స్వయంగా ఎదుర్కోలేకపోతున్నాయని, టీఆర్‌ఎస్ గెలుపునకు ఇవే సూచనలన్నారు. ఈ పార్టీల అనైతిక తీరును ఎత్తిచూపాలని ఎమ్మెల్యే గణేశ్ బిగాలకు సూచించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment