ఫిరాయింపు రాజకీయాలపై కేరళ ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక పార్టీపై గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లాలనుకుంటే గనుక ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని రాజకీయ నేతలకు సూచించింది.
కూథట్టుకులమ్ మున్సిపల్ కౌన్సిలర్ కళా రాజును అపహరించి, దాడి చేసిన కేసులో ఐదుగురికి ఆ రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా.. జస్టిస్ పివి కున్హికృష్ణన్ ఫిరాయింపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు వారిని ఎన్నుకున్న ప్రజల అభీష్టానికి కట్టుబడి ఉండాల్సిందేనని వ్యాఖ్యానించారాయన.
‘‘ఒక ప్రతినిధి రాజకీయ విధేయతను మార్చుకోవాలనుకుంటే(పార్టీ మారాలనుకుంటే).. ఆ వ్యక్తి మొదట రాజీనామా చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో నైతిక కోణం. అప్పుడే ఓటర్ల నమ్మకాన్ని ఏకపక్షంగా విచ్ఛిన్నం చేయకుండా ఉంటారు. అలా జరగకుంటే.. ప్రజల ప్రజల అభీష్టాన్ని అవమానించడమే అవుతుంది. అలాంటి ప్రజాప్రతినిధిని తర్వాతి ఎన్నికల్లో ఓడించం ద్వారా ప్రజలు తమ సత్తా చాటగలరు. ప్రజాస్వామ్యానికి ఉన్న అందం అదే కూడా’’ అని న్యాయమూర్తి అన్నారు.
ప్రస్తుత కేసులో.. ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యను పరిష్కరించుకోకుండా ఇరు వర్గాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధిని ఓడించాలంటే అది ఎన్నికల ద్వారానే.. హింస ద్వారా కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది.
తెలంగాణలో బీఆర్‌ఎస్ మీద నెగ్గిన ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన వ్యహారం సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు ఇంకెంత టైం కావాలంటూ తెలంగాణ స్పీకర్‌పై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఇటు.. కేరళ హైకోర్టు కూడా ఫిరాయింపులపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.
కేసు ఏంటంటే..
సీపీఎం కౌన్సిలర్‌గా నెగ్గిన కళా రాజు ఆ తర్వాత యూడీఎఫ్‌లో చేరారు. అయితే అవిశ్వాస తీర్మానం వేళ.. ఓటేయకుండా తనను అడ్డుకున్నారని, బలవంతంగా ఎత్తుకెళ్లి మరీ దాడికి పాల్పడ్డారని సీపీఎం నేతల మీద ఆరోపణలకు దిగారామె. ఆ ఆరోపణలను సీపీఎం ఖండించింది కూడా. అయితే ఈ ఘటనపై కళా రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 45 మందిపై కేసు నమోదు చేశారు. వాళ్లలో ఐదుగురు ముందస్తు బెయిల్ కోరగా.. షరతులతో మంజూరు చేసింది కేరళ హైకోర్టు.
Comments
Please login to add a commentAdd a comment