ఎవరి సత్తా ఏంటో గల్లీలో తేలుతది | KTR Exclusive Interview With Sakshi Over Municipal Elections | Sakshi
Sakshi News home page

ఎవరి సత్తా ఏంటో గల్లీలో తేలుతది

Published Wed, Jan 15 2020 1:22 AM | Last Updated on Wed, Jan 15 2020 11:56 AM

KTR Exclusive Interview With Sakshi Over Municipal Elections

  • తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలు కావాలన్న గిరిజనుల ఆశలను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు దక్కుతుంది. వికేంద్రీకరణ ద్వారానే పాలనా ఫలితాలు సామాన్యుల వరకు చేరతాయనే ఉద్దేశంతోనే ఇదంతా జరిగింది.
  • గతంలో కలెక్టర్ల దగ్గరకు ప్రజలు, అధికారులు వెళ్లాలంటే 60–100 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రజల ముంగిట్లోకి అధికారులను తీసుకొచ్చాం. 
  • గతంలో కార్పొరేషన్లు అంటే హైదరాబాద్‌ మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు వరంగల్‌కు రూ. 300 కోట్లు, ప్రతి కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు ఇస్తున్నాం. కార్పొరేషన్లకు బడ్జెట్‌లో నిధులు పెట్టి ఇస్తున్న కొత్త సంస్కృతిని తెచ్చింది... పట్టణ ప్రాంతాలను ప్రగతిబాట పట్టించింది టీఆర్‌ఎస్సే.
  • మేమెవరికీ బీ–టీం కాదు.. తెలంగాణ ప్రజలకు ఏ–టీం. మాకు ఢిల్లీలో బాసులు లేరు. గల్లీలో జరిగే ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలుతుంది. 
     

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు తమ వైపే ఉంటారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మున్సిపల్‌ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) ధీమా వ్యక్తం చేశారు. పాలనాదక్షుడైన సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని సమర్థించే రాష్ట్ర ప్రజలు ఎప్పటిలాగే ఈసారి కూడా తమకు అండగా ఉండి ఘన విజయం చేకూరుస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ బీ–ఫారాల కోసం అభ్యర్థులు పోటీ పడుతుంటే ప్రతిపక్షాల తరఫున పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు దొరకలేదంటేనే ప్రజల మూడ్‌ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ గింజుకున్నా... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ మొత్తుకున్నా గెలిచేది తామేనని వ్యాఖ్యానించారు. పట్టణాలను ప్రగతిబాట పట్టించింది... కార్పొరేషన్లకు బడ్జెట్‌ ద్వారా నిధులు తెచ్చే సంస్కృతిని తెచ్చింది కూడా టీఆర్‌ఎస్సేనన్నారు. గత ఐదున్నరేళ్లలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని, అధికార వికేంద్రీకరణ ద్వారా గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన చెప్పారు. ప్రణాళికాబద్ధమైన పురోగతి, పచ్చదనంతో కూడిన పట్టణాలు, పారిశుద్ధ్యం, పారదర్శక పౌర సేవలే లక్ష్యంగా పనిచేస్తున్న తమకు ప్రజలు మున్సిపల్‌ ఎన్నికల్లో మద్దతు, ఆశీర్వాదం అందించాలని కేటీఆర్‌ కోరారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో కేటీఆర్‌ ఏమన్నారంటే... 

క్షేత్రస్థాయికి అధికార వికేంద్రీకరణ... 
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 68 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు మాత్రమే ఉండేవి. కానీ రాష్ట్రం ఏర్పాటే పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ కోసం జరిగింది కనుక రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలకు పాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాం. కొత్త రాష్ట్రమే కాదు... కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. దశాబ్దాలుగా ప్రజలు ఆశించిన సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట, మంచిర్యాల లాంటి ప్రాంతాలను జిల్లాలు చేశాం. మా తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలు కావాలన్న గిరిజనుల ఆశలను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు దక్కుతుంది. వికేంద్రీకరణ ద్వారానే పాలనా ఫలితాలు సామాన్యుల వరకు చేరతాయనే ఉద్దేశంతోనే ఇదంతా జరిగింది. అందుకే 68గా ఉన్న పురపాలికల సంఖ్యను 141కి పెంచాం. 

అధికారులను ప్రజల ముంగిటికి తెచ్చాం
తెలంగాణ వచ్చాక తొలిసారి జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికలివి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏం జరిగిందన్నది పరిశీలిస్తే మేమెప్పుడూ నేల విడిచి సాము చేయలేదన్నది అర్థమవుతుంది. ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పన, పౌర సేవలపైనే దృష్టి పెట్టి పనిచేశాం. జనగామ, గద్వాల, నారాయణపేట, నాగర్‌ కర్నూల్, భూపాలపల్లి, ములుగు లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో జిల్లాల ఏర్పాటు తర్వాత గణనీయ అభివృద్ధి జరిగింది. ఇది మన కళ్ల ముందే ఉంది. మేమెప్పుడూ ఆకాశంలో విహరించలేదన్న దానికి మరో ఉదాహరణగా మరో విషయం చెప్పుకోవచ్చు. గతంలో కలెక్టర్ల దగ్గరకు ప్రజలు, అధికారులు వెళ్లాలంటే 60–100 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రజల ముంగిట్లోకి అధికారులను తీసుకొచ్చాం. గతంలో కరెంటు కోతలు, 14 రోజులకోసారి మంచినీళ్లు వచ్చే ప్రాంతాలు కూడా ఉండేవి. గుక్కెడు నీళ్ల కోసం సామాన్యుడి గొంతెండిన రోజులు చూశాం. కానీ ఇప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదు.

ప్రతిరోజూ లేదా మరుసటి రోజు నీళ్లు వస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో ఉత్తమ పాలనా భవన ప్రాంగణాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్కులు వచ్చాయి. గతంలో ట్యాంక్‌బండ్‌ అంటే హైదరాబాద్‌ మాత్రమే ఉండేది. ఇప్పుడు నాగర్‌ కర్నూల్, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట... ఇలా చెప్పుకుంటూ పోతే 90 పట్టణాల్లో మినీ ట్యాంక్‌బండ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌ (టీయూఎఫ్‌ఐడీసీ) ద్వారా రూ. 2,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. గతంలో కార్పొరేషన్లు అంటే హైదరాబాద్‌ మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు వరంగల్‌కు రూ. 300 కోట్లు, ప్రతి కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు ఇస్తున్నాం. కార్పొరేషన్లకు బడ్జెట్‌లో నిధులు పెట్టి ఇస్తున్న కొత్త సంస్కృతిని తెచ్చింది... పట్టణ ప్రాంతాలను ప్రగతిబాట పట్టించింది టీఆర్‌ఎస్సే. 

సమ ప్రేమ... సమ న్యాయం 
పరిపాలనలో మేమెప్పుడూ వివక్ష చూపించలేదు. వివక్ష, పక్షపాతం లేకుండా పనిచేశాం. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ లాంటి పథకాలు అన్ని ప్రాంతాల్లో అమలు చేశాం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంత గింజుకున్నా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ ఎంత మొత్తుకున్నా ఎవరికి ఓట్లేస్తే అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు తెలుసు. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు ఘన విజయాన్ని కట్టబెడతారన్న విశ్వాసం ఉంది. మా ప్రత్యర్థులకు పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు లేరు. 700 వార్డుల్లో బీజేపీ, 400 వార్డుల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేక నామినేషన్లు వేయలేదంటేనే ప్రజల మూడ్‌ అర్థం చేసుకోవచ్చు. నేను అహంకారంతో ఈ మాటలు చెప్పడం లేదు. కాంగ్రెస్, బీజేపీలు చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితులకు పొంతన లేదని చెబుతున్నా. క్షేత్రస్థాయిలో బలముంటేనే ఎవరైనా పోటీ చేసేందుకు ముందుకొస్తారు. మా బీ–ఫారాల కోసం పోటీ పడుతూ ఇతర పార్టీల బీ–ఫారాలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారంటే అర్థం ఏమిటి? మా పార్టీ తరఫున కూడా 95 శాతం రెబెల్స్‌ తగ్గిపోయారు. మేం చేసిన కృషి ఫలితం కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థులపై పోటీలో ఉండే రెబెల్స్‌ విషయంలో కఠినంగానే వ్యవహరిస్తాం. 

శ్వేతపత్రం ఇవ్వమనండి... 
రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధికి నిధుల మంజూరు విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా మాట్లాడుతున్నాయి. మేం అధికారంలోకి రాకముందు పదేళ్లు కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలో ఉంది. ఆ పదేళ్లలో ఎన్ని నిధులిచ్చారో ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని శ్వేతపత్రం విడుదల చేయమనండి. మేం ఈ ఐదున్నరేళ్లలో ఎన్ని నిధులిచ్చామో చెప్పారు. కాంగ్రెస్‌ ఇచ్చిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఇచ్చాం. గత ఐదేళ్లలో కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో ఎన్ని మున్సిపాలిటీలను ఉద్ధరించిందో బీజేపీ నేతలను చెప్పమని ప్రశ్నిస్తున్నా. ఎవరేం చేశారో క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే తెలుస్తుంది. 

టీఆర్‌ఎస్‌ కేంద్రంగానే ఎన్నికలు... 
ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ కేంద్రంగానే జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు మాపై చేసే విమర్శలు చూస్తుంటే వారి ఆలోచనలన్నీ మా చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. మేమెవరికీ బీ–టీం కాదు.. తెలంగాణ ప్రజలకు ఏ–టీం. మాకు ఢిల్లీలో బాసులు లేరు. తెలంగాణ గల్లీలో జరిగే ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేలుతుంది. మేం బీజేపీని చూసి భయపడుతున్నామని లక్ష్మణ్‌ అంటున్నారు. 104 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు రానందుకు, 700 మంది అభ్యర్థులు దొరకనందుకు మేం బీజేపీని చూసి భయపడుతున్నామా? అతిగా ఊహించుకోవడం మంచిది కాదు. అడ్డిమారి గుడ్డిదెబ్బలో నాలుగు ఎంపీ సీట్లు వస్తేనే ఎగిరెగిరి పడుతున్నారు. మరి అక్కడే జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరిగితే ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేదు? నేను గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా. 1980–90లలో నేను స్కూల్లో ఉన్నప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటో ఇప్పుడూ అదే పరిస్థితి. అందుకే మా ప్రత్యర్థి కాంగ్రెస్‌ అని చెబుతున్నా. బీజేపీని ఎక్కువ, తక్కువ చేయడం లేదు. అయితే కాంగ్రెస్‌ మాకు సుదూరంలో ఉంది. దాని వెనుక బీజేపీ ఉంది. 

అట్టహాసం వద్దని సీఎం చెప్పారు
ఈ ఎన్నికలు మా పనితీరుకు నిదర్శనమని నేను చెబితే అలాంటప్పుడు ప్రచారానికి వెళ్లొద్దని కాంగ్రెస్‌ నేత కోదండరెడ్డి నన్ను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన మాటలను ఆహ్వానిస్తున్నా. నేనెక్కడికీ ప్రచారానికి వెళ్లడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు, నేతలే అంతా చూసుకుంటారు. సిరిసిల్ల, వేములవాడల్లో మాత్రమే నేను ప్రచారం చేస్తా. 50–60 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారానికి రావాలని ఆహ్వానించినా నేను వెళ్లడం లేదు. ఆర్భాటం, అట్టహాసం వద్దని సీఎం స్వయంగా చెప్పారు. ఇంటింటి ప్రచారం చేయాలని, చేసిన పనిని చెప్పాలని సూచించారు. అదే చేస్తాం. అయినా మాకు విశ్వాసం ఉంది. కేసీఆర్‌ స్థిరమైన, దృఢమెన, దక్షుడైన నాయకుడని ప్రజలకు తెలుసు. ప్రణాళికాబద్ధమైన పురోగతి, పచ్చదనంతో కూడిన పట్టణాలు, పారిశుద్ధ్యం, పారదర్శక పౌర సేవలే లక్ష్యంగా పనిచేస్తున్న మాకు ఈ ఎన్నికల్లో ప్రజలు మద్దతు, ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నా.

తెలంగాణ భవన్‌లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పతంగి ఎగురవేస్తున్న కేటీఆర్‌

దుబారా తగ్గించాం...
పురపాలక సంస్థలకు ఆర్థిక స్వావలంబన సమకూర్చడమే కాకుండా దుబారా ఖర్చు తగ్గించేందుకు విప్లవాత్మక మార్పులు చేశాం. ఒక్క హైదరాబాద్‌లోనే 4 లక్షల వీధి దీపాలకు ఎల్‌ఈడీ లైట్లు, రాష్ట్రవ్యాప్తంగా 3.75 లక్షల వీధి దీపాలకు ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసి కరెంటు ఖర్చును 35–40 శాతం తగ్గించాం. మున్సిపాలిటీల ఆర్థిక పరపతి పెంచాం. విద్యుత్‌ ఆదాలో తెలంగాణ మున్సిపాలిటీలు టాప్‌ అని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖే చెప్పింది. చెరువులు, పార్కులు, రోడ్లు, కరెంటు, మంచినీరు, పారిశుద్ధ్యం విషయంలో రాష్ట్రంలో ఏం జరుగుతోందో కాంగ్రెస్, బీజేపీలు ఆలోచించుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ద్వితీయశ్రేణి పట్టణాలకు ఐటీ రంగాన్ని తీసుకెళ్లింది మేమే. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం లాంటి పట్టణాల్లో ఐటీ టవర్లు ఏర్పాటవుతున్నాయంటే అది టీఆర్‌ఎస్‌ సాధించిన విజయం కాదా? వికేంద్రీకరణ ఫలితం కాదా? సీఎం కేసీఆర్‌ కార్యదక్షత కాదా?

పల్లె ప్రగతికి దీటుగా...
నేను మున్సిపల్‌ మంత్రిగా చెబుతున్నా. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న పల్లె ప్రగతికి దీటుగా ‘పట్టణ ప్రగతి’కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేస్తాం. రాష్ట్రంలోని గ్రామాలకు నెలకు ఠంచనుగా రూ. 339 కోట్లు ఇస్తున్న విధంగానే పట్టణాలకు కూడా నిధులిస్తాం. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ చట్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు మూడు నెలలపాటు శిక్షణ ఇస్తాం. సరిగ్గా విధులు నిర్వహించని వారిపై చర్యలు తీసుకుంటాం. విధుల నుంచి తొలగించే కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌తోనే ప్రారంభిస్తాం. అధికారులు కూడా పారదర్శకంగా పనిచేయాలి. లేదంటే సర్వీసు నుంచి డిస్మిస్‌ చేసేంత వరకు వెళ్తాం. ఈ ఎన్నికల తర్వాత ఇక ఎన్నికలు లేవు. రానున్న నాలుగేళ్లు నా దృష్టంతా పరిపాలన.. పురపాలనపైనే.

కెలికి కయ్యం పెట్టుకుంది చంద్రబాబే...
తెలుగు రాష్ట్రాలనే కాదు... పొరుగు రాష్ట్రాలన్నింటితో మేం సఖ్యతగానే ఉంటున్నాం. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తోపాటు ఇక్కడా కాంగ్రెస్‌ పార్టీ అ«ధికారంలో ఉన్నా గోదావరి జలాల వినియోగంలో మనకు న్యాయం జరగలేదు. కానీ ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా వారితో మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ తెచ్చుకున్నాం. లివ్‌.. లెట్‌ లివ్‌ విధానం మాది. అది కేసీఆర్‌ రాజనీతిజ్ఞత. చంద్రబాబుతో కూడా మేం సత్సంబంధాలనే కోరుకున్నాం. గిల్లికజ్జాలు పెట్టుకోవాలనుకోలేదు. అమరావతికి పిలిస్తే వెళ్లాం. తెలంగాణలో యాగానికి ఆహ్వానించాం. కానీ కెలికి కయ్యం పెట్టుకుంది చంద్రబాబే. ఓటుకు నోటుతో ఎమ్మెల్సీని కొనాలని రూ. 50 లక్షలిస్తూ దొరికిపోయాడు. కానీ తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినా కలసి ఉండాలన్నది మా ఆకాంక్ష. అందుకే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డితో కూడా అవే సంబంధాలు కొనసాగిస్తున్నాం. ఇది కొందరికి నచ్చడం లేదు. అది వారి ఖర్మ. మేం చేయగలిగిందేమీ లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement