
విజయవాడ, సాక్షి: ఎన్డీయే కూటమి సర్కార్‌లో టీడీపీ, జేడీయూలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి. బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. వీలుచిక్కినప్పుడల్లా ఆర్థికంగా ప్యాకేజీలు ఇస్తూ వస్తోంది. అదే ఏపీ విషయంలో అటు ప్రత్యేక హోదా, ఇటు ప్యాకేజీ రెండూ ఇవ్వడం లేదు. కానీ, బాబు సర్కార్‌కు అప్పులిప్పించడంలో సాయం చేస్తోంది. ప్చ్.. ఇప్పుడు బడ్జెట్‌లోనూ ఇదే వివక్ష ప్రదర్శించింది.
నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్(Union Budget 2025) ప్రసంగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కానరాలేదు. పోనీ.. రాష్ట్రాల వారీగా విడుదల చేసిన జాబితాలోనూ ఏపీ పేరు ఉందా? అంటే అదీ లేదు. కొత్త ప్రాజెక్టులేవీ ప్రకటించలేదు. సరికదా.. అమరావతి, మెట్రో రైల్.. లాంటి కీలకాంశాల గురించి ప్రస్తావించలేదు.
టీడీపీ(TDP)కి ప్రస్తుతం 21 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం.. చంద్రబాబు మీదే ఆధారపడి నడుస్తోందంటూ టీడీపీ గప్పాలు కొట్టుకుంటోంది. అలాంటిది ప్రత్యేక కేటాయింపులను సాధించడంలో ఇటు చంద్రబాబు, అటు బీజేపీకి దగ్గరైన పవన్ కల్యాణ్‌లు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బిహార్ విషయంలో.. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా రహదారుల అభివృద్ధి, గంగానది రెండు లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలు ఇచ్చింది. ఏపీకి మాత్రం అరకోర నిధులను పడేస్తోంది.

Comments
Please login to add a commentAdd a comment