న్యూఢిల్లీ, సాక్షి: అసంఘటిత రంగాల ఉద్యోగులకు(గిగ్ వర్కర్లకు) కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్(Union Budget 2025) ద్వారా వాళ్లకు గుర్తింపుతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్స్‌కు లాభం చేకూరనుంది.
ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశంతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన బడ్జెట్ ప్రసంగంలో వినిపించారు. ఈ నిర్ణయంతో గిగ్ వర్కర్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వనున్నారు. అలాగే.. ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన(PM-JAY) కింద ఉద్యోగి కుటుంబానికి ఏడాది ఐదు లక్షల దాకా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తారు.
అలాగే గిగ్ వర్కర్ల సామాజిక భద్రత త్వరలో కోసం ప్రత్యేక పథకం తీసుకురానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటితో పాటు ఆయుష్మాన్ భారత్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలనూ వర్తింపజేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారామె.
గిగ్ వర్కర్లు అంటే..
తాత్కాలికంగా.. తమకు ఉన్న వీలును బట్టి ఉద్యోగాలను చేసేవాళ్లను గిగ్ వర్కర్లు అంటారు. ప్రత్యేకించి.. యాప్‌ల ద్వారా సేవలందించే ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఉన్నారు. డెలివరీ యాప్‌లు, రైడ్ యాప్‌లతో పని చేసే ఉద్యోగులతో పాటు ఫ్రీలాన్సర్లు, ఆన్‌లైన్ ట్యూటర్లు ఈ విభాగంలోకి వస్తారు.
అయితే.. సంప్రదాయ ఉద్యోగులకు ఉన్నట్లు వీళ్లకు ఉద్యోగ భద్రత లేదు. అది కల్పించాలని ఉద్యమాలు నడుస్తున్నా.. ఈ తరహా ఉద్యోగాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వాలు ఇంతకాలం తీవ్రంగా భావించాలేదు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయాలు.. రాబోయే రోజుల్లో వాళ్లకు మంచి రోజులు వస్తాయనే సంకేతాలు అందించాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా.. పది కోట్లకు పైగా గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. 2030 నాటికి ఆ సంఖ్య 23 కోట్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది. కిందటి బడ్జెట్‌లో గిగ్ వర్కర్ల కోసం కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. అయితే ఈసారి బడ్జెట్‌లో కచ్చితమైన నిర్ణయాలు ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment