ఓ ట్రాన్స్జెండర్ విజయగాథ.. | Transgender politician victory in historic elections in Philippines | Sakshi
Sakshi News home page

ఓ ట్రాన్స్జెండర్ విజయగాథ..

Published Wed, May 11 2016 9:09 AM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

ఓ ట్రాన్స్జెండర్ విజయగాథ..

ఓ ట్రాన్స్జెండర్ విజయగాథ..

మనీలా: వారంటే సమాజంలో చిన్నచూపు, హేళన.. మనుషుల మధ్యే జీవిస్తున్నా ఎంతో అంతరం.. పేరుకు మనుషులే అయినా ఇతరుల్లాగా హక్కులుండవు.. చట్టంతో పాటు మతాచారాలు అడ్డు.. ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులు, విమర్శలను ఎదుర్కొని ఓ ట్రాన్స్జెండర్ చరిత్రాత్మక విజయం సాధించింది. ఫిలిప్పీన్స్కు చెందిన గెరాల్డినె రోమన్ విజయగాథ ఇది..

ఫిలిప్పీన్స్ చట్టసభ కాంగ్రెస్కు ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్గా 49 ఏళ్ల రోమన్ చరిత్ర సృష్టించింది. ఆ దేశ రాజధాని మనీలాకు వాయవ్య ప్రాంతంలో ఉన్న బటాన్ ప్రావిన్స్ నుంచి ఆమె విజయబావుటా ఎగురవేసింది. మతదురాచారాలు, ద్వేషం, లింగబేధంతో కూడిన రాజకీయాలు విజయం సాధించలేదని.. ప్రేమ, గౌరవం, అంగీకార రాజకీయాలదే విజయమని ఆమె ఉద్వేగంతో చెప్పింది. రోమన్ విజయాన్ని ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్) సమాజం తమ విజయంగా భావిస్తోంది. ఫిలిప్పీన్స్లో వారికి వ్యతిరేకంగా కఠిన చట్టాలున్నాయి. సేమ్ సెక్స్ వివాహాలు నిషేధం. తమ హక్కుల కోసం రోమన్ పోరాడుతుందని ఆశిస్తున్నారు.

 పిలిప్పీన్స్లో పలువురు ట్రాన్స్జెండర్లు రాజకీయాల్లో ఉన్నా రోమన్దే అగ్రస్థానం. 'ఈ విజయం చాలా సంతోషం కలిగిస్తోంది. రాజకీయ నేతగా సేవ చేయడానికి ఉత్సుకతో ఉన్నాను. ఎల్జీబీటీ సమాజం ఎన్నో అవమానాలను ఎదుర్కొంటోంది. మా హక్కుల గురించి పోరాడుతా' అని రోమన్ చెప్పింది. రోమన్ కుటుంబం కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంది. ఆమె తల్లిదండ్రులు కాంగ్రెస్కు ప్రాతినిధ్య వహించారు.

1990ల్లో లింగమార్పిడి చేయించుకున్న రోమన్ చట్టబద్దంగా తన పేరు మార్చుకుంది. ఆమె రెండు దశాబ్దాలుగా మహిళగానే, మహిళ వేషధారణలో జీవిస్తోంది. స్పానిష్ న్యూస్ ఏజెన్సీలో సీనియర్ ఎడిటర్గా పనిచేసింది. స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు మాట్లాడగలదు. స్పెయిన్ చదువుకునేందుకు స్కాలర్షిప్ సంపాదించిన రోమన్ అక్కడ తన పార్టనర్ను కలుసుకుంది. ఫిలిప్పీన్స్లో ట్రాన్స్జెండర్లకు వ్యతిరేకంగా రూపొందించిన కఠిన చట్టాలను రద్దు చేయాలని కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఇప్పుడు చట్టసభకు ఎన్నిక కావడంతో ట్రాన్స్జెండర్ల హక్కులు సాధించడంతో పాటు బటాన్ ప్రజల సంక్షేమం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందేలా కృషి చేస్తానని చెబుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement