Karnataka election results 2023: కాంగ్రెస్ ప్రభంజనం | Karnataka election results 2023: Congress set to win 136 seats in Karnataka | Sakshi
Sakshi News home page

Karnataka election results 2023: కాంగ్రెస్ ప్రభంజనం

Published Sun, May 14 2023 4:03 AM | Last Updated on Sun, May 14 2023 4:03 AM

Karnataka election results 2023: Congress set to win 136 seats in Karnataka - Sakshi

రాజస్తాన్‌లోని బికనేర్‌లో కాంగ్రెస్‌ శ్రేణుల సంబరాలు

సాక్షి, బెంగళూరు: కన్నడ ఓటరు కాంగ్రెస్‌కే జై కొట్టాడు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించే నాలుగు దశాబ్దాల ఆనవాయితీని కొనసాగిస్తూ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారును ఇంటికి సాగనంపాడు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్‌ ఉచిత హామీల ముందు మోదీ మేజిక్‌ ఏమాత్రం పని చేయలేదు. కార్యకర్త స్థాయి నుంచి అగ్ర నాయకత్వం దాకా సమష్టిగా చేసిన కృషి ఫలించి కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది.

హంగ్‌ ఊహాగానాలకు, హోరాహోరీ తప్పదన్న విశ్లేషణలకు చెక్‌ పెడుతూ తిరుగులేని మెజారిటీ సాధించింది. 224 సీట్ల అసెంబ్లీలో మెజారిటీకి 133 సీట్లు కావాల్సి ఉండగా ఏకంగా 136 స్థానాలను హస్తగతం చేసుకుంది. తద్వారా పదేళ్ల తర్వాత రాష్ట్రంలో సొంతంగా మెజారిటీ సాధించి సంబరాల్లో మునిగిపోయింది. ఇండియాటుడే వంటి ఒకట్రెండు సంస్థలు తప్ప మిగతా ఎగ్జిట్‌ పోల్స్‌ ఏవీ కాంగ్రెస్‌కు ఇంతటి విజయాన్ని ఊహించలేకపోయాయి.

కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీపై విపక్షాల ఉమ్మడి పోరుకు నేతృత్వం వహించేందుకు అత్యవసరమైన నైతిక బలాన్ని ఈ విజయం ద్వారా కాంగ్రెస్‌ కూడగట్టుకుంది. అంతేగాక వరుస ఎన్నికల్లో బీజేపీ చేతిలో కోలుకోలేని దెబ్బలు తింటూ ఓ పెద్ద రాష్ట్రంలో నికార్సైన గెలుపు కోసం ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న పార్టీకి ఈ ఘనవిజయం ఎంతో ఊరటనిచ్చింది. మరోవైపు కర్ణాటక వంటి కీలక రాష్ట్రంలో ఇంతటి పరాభవం బీజేపీకి గట్టి ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు.

ఈ ఓటమితో దక్షిణాదిన ఏకైక రాష్ట్రం కూడా కమలం పార్టీ చేజారింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ఈసారి 39 స్థానాలు కోల్పోయింది. 78 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి ఏకంగా మరో 58 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక జేడీ(ఎస్‌) ఇంటి గోలతో చిర్రెత్తిన ఓటరు ఈసారి ఆ పార్టీకి గట్టిగానే వాత పెట్టాడు. హంగ్‌ వస్తే ఎప్పట్లా కింగ్‌మేకర్‌ కావాలని ఆశపడ్డ ఆ పార్టీ దారుణంగా చతికిలపడింది.

2018లో గెలిచిన 37 సీట్లలో ఏకంగా 18 స్థానాలు కోల్పోయి చిక్కి ‘సగ’మైంది. 2018లో కాంగ్రెస్, జేడీ(ఎస్‌) ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని 14 నెలలకే బీజేపీ పడగొట్టింది. ఆ రెండు పార్టీల్లోని 17 మంది ఎమ్మెల్యేలను లాగేసింది. వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల్లో 15 సీట్లు గెలిచి మెజారిటీ సాధించి గద్దెనెక్కింది. ఈ గోడ దూకుళ్లతో విసిగిన కన్నడ జనం ఈసారి సుస్థిర ప్రభుత్వానికి జై కొట్టారు. ఫలితాల సరళి స్పష్టమవుతూనే బెంగళూరు నుంచి హస్తిన దాకా కాంగ్రెస్‌ కార్యాలయాల్లో సంబరాలు మిన్నంటాయి.

బీజేపీ కార్యాలయాలు కళ తప్పి కన్పించాయి. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. ఘనవిజయం సాధించిన కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇది విద్వేష రాజకీయాలపై ప్రేమ సాధించిన విజయమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. తృణమూల్, ఎన్సీపీ సహా దేశవ్యాప్తంగా పలు విపక్ష పార్టీలు కాంగ్రెస్‌ విజయం పట్ల హర్షం వెలిబుచ్చాయి. బీజేపీ నియంతృత్వ పోకడలకు, కక్షసాధింపు రాజకీయాలకు ఇదో గుణపాఠమన్నాయి.

ఆద్యంతం హస్తం హవా...
కర్ణాటక అసెంబ్లీకి బుధవారం ఒకే దశలో పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఏకంగా 73.19 శాతం పోలింగ్‌ నమోదైంది. శనివారం ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రారంభం నుంచే కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఏ దశలోనూ వెనక్కు తగ్గకుండా దూసుకుపోయింది. ఆద్యంతం వెనుకంజలోనే కొనసాగిన బీజేపీ ఎక్కడా కోలుకోలేకపోయింది.

6 ప్రాంతాల్లో నాలుగింట్లో కాంగ్రెసే
కర్ణాటకలోని ఆరు ప్రాంతాల్లో నాలుగింట్లో కాంగ్రెస్‌ హవాయే కొనసాగింది. జేడీ(ఎస్‌) కంచుకోట పాత మైసూరుతో పాటు ముంబై కర్ణాటక, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతం హైదరాబాద్‌ కర్ణాటక, సెంట్రల్‌ కర్ణాటకల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. బీజేపీ కేవలం కోస్తా కర్ణాటకలోనే పై చేయి సాధించగా బెంగళూరులో కాంగ్రెస్‌కు సమవుజ్జీగా నిలిచింది. రాహుల్‌ గాంధీ ఇటీవలి భారత్‌ జోడో పాదయాత్రలో భాగంగా కర్ణాటకలో నిడిచిన 20 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 15 చోట్ల కాంగ్రెస్‌ నెగ్గడం విశేషం.

బీజేపీకి తగ్గింది 0.2 శాతం ఓట్లే...
పోయిందేమో 39 సీట్లు!
బీజేపీకి మొత్తమ్మీద ఓట్ల శాతం తగ్గకపోయినా ఏకంగా 39 సీట్లు చేజారడం విశేషం. ఆ పార్టీకి 2018లో 36.22 శాతం రాగా ఈసారి కూడా 36 శాతం సాధించింది. అప్పుడు 38 శాతం సాధించిన కాంగ్రెస్‌ ఈసారి ఏకంగా 43 శాతం ఒడిసిపట్టింది. 5 శాతం అదనపు ఓట్లతో అదనంగా 58 సీట్లు కొల్లగొట్టింది. 1999లో కాంగ్రెస్‌ 132 సీట్లు గెలిచింది. ఆ తర్వాత దాదాపు పాతికేళ్లకు అంతకంటే మెరుగైన విజయం సాధించింది. జేడీ(ఎస్‌) ఓట్ల శాతం 18.36 నుంచి 13.2కు తగ్గింది. రద్దవనున్న అసెంబ్లీలో బీజేపీకి 117 సీట్లు, కాంగ్రెస్‌కు 69, జేడీ(ఎస్‌)కు 29, బీఎస్పీకి 1, స్వతంత్రులకు 2 సీట్లున్నాయి. 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

కాంగ్రెస్‌కు అభినందనలు
‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆ పార్టీ కృషి చేస్తుందని ఆశిస్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అహర్నిశలు శ్రమించిన బీజేపీ కార్యకర్తలకు అభినందనలు. రానున్న రోజుల్లో మరింత దీక్షతో కర్ణాటక ప్రజలకు సేవలందిస్తాం’’
– ప్రధాని నరేంద్ర మోదీ

ఇది ప్రజల విజయం
‘‘ఇది ప్రజా గెలుపు. సమష్టి కృషి. బీజేపీ నాయకుల అహంకారమే వారిని ఓడించింది. కాంగ్రెస్‌ను అఖండ మెజారిటీతో గెలిపించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. ఈ గెలుపుతో దక్షిణ భారతదేశం బీజేపీరహితంగా మారింది. రాజ్యాంగ రక్షణకు ప్రజలిచ్చిన విజయమిది. కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు గ్యారెంటీల అమలుకు తొలి కేబినెట్‌ భేటీలోనే చర్యలు తీసుకుంటాం. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర చేసిన 99 శాతం ప్రాంతాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది’’
– కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

గెలుపోటములను సమానంగా చూస్తా
‘‘రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తా ను. నాకు, మా పార్టీకి ఇవేమీ కొత్తకాదు. ఈ ఓటమి నాకు గానీ, మా పార్టీకి గానీ అంతిమం కాదు. మా పోరాటం ఆగదు. ప్రజలకు తోడుగా నిలుస్తాం. పార్టీని బలోపేతం చేస్తాం. ఈ ఫలితాలతో ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మా కార్యకర్తలను కోరుతున్నా. మా పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు’’    
– జేడీ(ఎస్‌) నేత కుమారస్వామి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement