Free schemes
-
అమెరికాలోనూ ఉచిత తాయిలాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఉచితాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే విద్యుత్తు చార్జీలను సగానికి తగ్గిస్తానంటూ అక్కడి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీని శుక్రవారం ఆయన ‘ఎక్స్’లో ప్రస్తావించారు. ట్రంప్ ట్వీట్‌ను ఆయన రీ ట్వీట్ చేస్తూ.. ‘విద్యుత్తు బిల్లులు సగానికి తగ్గిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. ఉచిత తాయిలాలు అమెరికా వరకూ వెళ్లాయి’అంటూ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. విద్యుత్, వైద్యం, విద్య ఉచితమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ పక్షాలు కేజ్రీవాల్‌పై మండిపడుతుండటం తెలిసిందే. కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైతే 12 నెలల్లో కరెంట్ బిల్లులతో పాటు ఇంధన బిల్లులను 50 శాతానికి తగ్గిస్తానని, దీనివల్ల అమెరికాలో వ్యాపారావకాశాలు పెరుగుతాయని ట్రంప్ ట్వీట్ చేశారు. విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు పర్యావరణ అనుమతులను వేగవంతం చేస్తానని కూడా ట్రంప్ ప్రకటించారు. -
బాబూ.. ఉచిత గ్యాస్, బస్సు ఎప్పుడు?: ఉషాశ్రీ చరణ్
సాక్షి, సత్యసాయి: ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్. చంద్రబాబు పాలనలో వంద రోజుల్లో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది కాబట్టే తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ సోమవారం సత్యసాయి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఒక పెన్షన్ తప్ప.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే పరిస్థితుల్లో లేదు. రాష్ట్రంలో వంద రోజుల్లో ఏమీ చేయలేకపోయారు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్‌లో తిరుపతి లడ్డుపై దుష్ప్రచారం చేశారు. సనాతన ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం మంచిది కాదని కోర్టు మొట్టికాయలు వేసింది.విశాఖ ఉక్కు, పెనుగొండలో గవర్నమెంట్ ఆసుపత్రుల ప్రైవేటీకరణను ఆపాలి. మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ గ్యాస్, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు ఖాతాలో జమ అంటూ ఏ ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. మన జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సవితమ్మ 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ ఇస్తామంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పటివరకు అమలు చేయలేక మంత్రి విఫలమయ్యారు. వైఎస్ జగనన్నను మళ్లీ సీఎం చేసుకునే వరకు, ప్రజలకు మంచి జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్!: వైఎస్సార్సీపీ -
‘ఉచిత హామీ’లపై విచారణ జరుపుతాం
న్యూఢిల్లీ: రాజకీయ పారీ్టలు ఎన్నికల వేళ ఇస్తున్న ఉచిత హామీలపై తప్పకుండా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు బుధవా రం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు ఉచితాలపై హామీలు గుప్పించడం.. అత్యంత ము ఖ్యమైన అంశమని, వాటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జే.బి.పారి్థవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఉచితాలను సవాల్ చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ బుధవారం బిజినెస్ లిస్టులో ఈ పిటిషన్లు ఉన్నాయని, వాటిని విచారణకు స్వీకరించాలని కోరారు. తమ పిల్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం లేదని, దీన్ని మరో తేదీన విచారించడానికి వీలుగా జాబితాలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. ఇది అత్యంత ముఖ్యమైన అంశం. దీన్ని కాజ్ లిస్టులో నుంచి తొలగించబోం’అని చెప్పారు. -
Lok sabha elections 2024: ఉచిత వాగ్దానాలపై పిల్
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత వాగ్దానాలను తప్పుబడుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ‘ఓటర్ల నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు పార్టీలు చేస్తున్న ఈ ఉచిత తాయిలాల ప్రకటనలు, వాగ్దానాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. వీటిపై నిషేధం విధించేలా కేంద్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి’ అంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్‌ను దాఖలుచేశారు. ఈయన తరఫున సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా బుధవారం సుప్రీంకోర్టులో వాదించారు. ‘ ఉచిత వాగ్దానాలిచ్చే రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి, ఆయా పార్టీల ఎన్నికల గుర్తులను స్తంభింపజేయాలి’ అని కోరారు. ‘ ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ పిటిషన్‌ను వీలైనంత త్వరగా విచారిస్తాం. ఏ తేదీన విచారించాలన్న దానిపై గురువారం బోర్డ్‌లో చర్చిస్తాం’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ఉచితాలపై పిల్ దాఖలవడం గమనార్హం. ‘‘ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలు ప్రకటించడంతో ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో ప్రభావితమయ్యే అవకాశం చాలా ఎక్కువ. పోటీ పార్టీల విజయావకాశాలనూ ఇవి దెబ్బతీస్తాయి. పారదర్శకమైన ఎన్నికల క్రతువుకు ఇది విఘతం. ఉచితాలు ప్రజాస్వామ్య విలువల మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. ‘‘ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఈ ఉచితాలు ఒక రకంగా ఓటర్లకు లంచాలు ఇవ్వడం లాంటిదే. అధికార పార్టీ మళ్లీ అధికారంలో కొనసాగడానికి ఇది ఒక మార్గంలా పనికొస్తోంది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఇలాంటి ధోరణులకు చెక్ పెట్టాల్సిందే. ఇందులోభాగంగా ఎన్నికల గుర్తుల(రిజర్వేషన్, అలాట్మెంట్) ఉత్తర్వు, 1968లోని సంబంధిత పేరాలో అదనపు షరతులను ఈసీ జతచేయాలి. ఎన్నికలకు ముందు ప్రజాధనంతో నిర్హేతుక ఉచితాల వాగ్దానాలు చేయొద్దని పార్టీలకు షరతు విధించాలి’ అని పిటిషనర్ కోర్టును కోరారు. -
అందరిదీ ఉచిత జపమే!
దేశానికి హృదయ స్థానమైన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఉచితాల జాతరను తలపిస్తోంది. ప్రజలకు ఉచిత పథకాలు ప్రకటించడంలో ప్రధాన పార్టీలైన అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ రెండూ నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు ఎవరిని ‘సముచితంగా ఆదరిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది... మధ్యప్రదేశ్‌లో దీర్ఘకాలంగా బీజేపీ, కాంగ్రెస్ ద్విముఖ పోరు కొనసాగుతూ వస్తోంది. ఈసారి బీఎస్పీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలో ఉన్నా ప్రధాన పోరు మాత్రం మళ్లీ ఆ రెండింటి మధ్యేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయం కోసం సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ (64), పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ (76) సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ముఖ్యంగా దక్షిణాదిన తాము అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక కాంగ్రెస్‌కు చేజారిన అనంతరం జరుగుతున్న కీలక అసెంబ్లీ ఎన్నిక కావడంతో దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రులతో పాటు పలువురు సీనియర్ ఎంపీలను కూడా ఇప్పటికే అసెంబ్లీ బరిలో దింపింది. తద్వారా మధ్యప్రదేశ్‌లో విజయం తనకెంత ముఖ్యమో చెప్పకనే చెప్పింది. వీటన్నింటికీ మోదీ చరిష్మా తోడై ఈసారి కూడా గట్టెక్కిస్తుందని ఆశిస్తోంది. ‘ఎంపీ కే మన్ మే మోదీ...’నినాదంతో ఊరూవాడా హోరెత్తిస్తోంది. అంతేగాక సీనియర్లలో విభేదాలు తలెత్తకుండా, ప్రభుత్వ వ్యతిరేకత నేరు గా పార్టీ విజయావకాశాలపై పడకుండా చూసేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే చౌహాన్‌ను సీఎం అభ్యర్థిగా కూడా ప్రచారం చేయకుండా గుంభనంగా వ్యవహరిస్తోంది. నిన్నటితరం బీజేపీ దిగ్గజాలై న ఎల్కే అద్వానీ కాలానికి చెందిన నేటికీ బీజేపీలో చురుగ్గా ఉన్నది బహుశా ఆయనొక్కరే. ఇక కాంగ్రెస్ కూడా వర్గాలవారీగా ఓట్ల వేటలో పడింది. దళితుడైన పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే 35 ఎస్సీ స్థానాలపై లోతుగా దృష్టి సారించినట్టు సమాచారం. ప్రచారంలో పెద్దలు... రాష్ట్రంలో ఎన్నికల ప్రచార బరిలో అన్ని పార్టీల నుంచీ అగ్రనేతలు ఇప్పటికే బరిలో దిగారు. బీజేపీ నుంచి ప్రధానిమోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రచార భారాన్ని ఖర్గేతో పాటు రాహు ల్, ప్రియాంక మోస్తున్నారు. కమల్‌నాథ్‌కు దన్ను గా వెటరన్ నేత దిగ్విజయ్ సింగ్ నిలుస్తున్నారు. ఆప్ నుంచి కేజ్రీవాల్, భగవంత్ మాన్ మరిన్ని సభలూ, సమావేశాలకు ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఏ చిన్న అవకాశాన్నీ వదలకూడదన్న అభిప్రాయంలో బీజేపీ ఉంది. అందుకే గిరిజన, ఓబీసీ, మహిళా... ఇలా ఓటర్లను సెగ్మెంట్లవారీగా విభజించుకుని మరీ లోతుగా దృష్టి పెడుతోంది. వీటికి తోడుగా హిందూత్వ కార్డు ఎలాగూ అండగా ఉంటుందని ఆశిస్తోంది. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రధానంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని పలు ఉచిత పథకాలు ప్రకటించారు. లాడ్లీ బెహనా యోజన కింద రాష్ట్రంలోని 1.32 కోట్ల మహిళలకు అందుతున్న నెలవారీ ఆర్థికసాయాన్ని ఏకంగా రూ.3,000కు పెంచుతామని పేర్కొన్నారు. గత జూన్‌లో ఈ పథకాన్ని మొదలు పెట్టినప్పుడు ఈ సాయం తొలుత రూ.1,000 ఉండగా రూ.1,250కి, తర్వాత రూ.1,500కు పెంచారు. ఆర్థికంగా వెనకబడ్డ మహిళలకు ఉద్దేశించిన ఈ పథకంపై సర్కారు ఇప్పటికే ఏకంగా ఏటా రూ.16,000 కోట్లు వెచ్చిస్తోంది. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్.. పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ కూడా వరుసబెట్టి ఇప్పటికే పలు ఉచిత పథకాలు ప్రకటించారు. ఓ బీసీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళలకు నారీ సమ్మాన్ నిధి’పేరుతో నెలకు రూ.1,500 అందజేస్తామని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రకటించారు. ప్రతి ఇంటికీ రూ.500కే ఎల్పీజీ సిలిండర్ అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తెస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఏకంగా 45 శాతమున్న ఓబీసీలకు రిజర్వేషన్లను 14 శాతం నుంచి 27 శాతానికి పెంచుతామని కమల్‌నాథ్ ప్రకటించారు. ఆయన సీఎంగా ఉండగా ఈ మేరకు నిర్ణయం తీసుకోగా కోర్టు దాన్ని కొట్టేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని కూడా ప్రకటించారు. పార్టీల భక్తి బాట... ఓట్ల వేటలో భాగంగా మధ్యప్రదేశ్‌లో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఈసారి భక్తి బాట పట్టడం విశేషం. ఆలయాల పునరి్నర్మాణం, సుందరీకరణపై చౌహాన్ పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఇందుకు రూ.3,000 కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రఖ్యాత ఉజ్జయినీ మహాకాళేశ్వర మందిరాన్ని, దాని అనుబంధ మ్యూజియాలను మెరుగు పరుస్తున్నారు. ఖాండ్వా జిల్లాలోని ప్రఖ్యాత ఓంకారేశ్వర్‌లో 108 అడుగులతో ఆది శంకరుల విగ్రహాన్ని ఇటీవలే ఆవిష్కరించారు. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కూడా ఇటీవల జబల్పూర్లో నర్మదా నదిలో పాల్గొన్నారు. జై నర్మద, జై బజరంగ బలి అంటూ నినాదాలతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ కూడా పలు మతపరమైన కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఆప్, బీఎస్పీ కూడా... ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ కూడా ఈసారి బలంగా ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఆ పార్టీ పాలిత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి రాష్ట్రంలో నాలుగుసార్లు పర్యటించారు. ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ఉచిత విద్య, వైద్యం, కరెంటు అందిస్తామని ఆప్ ప్రకటించింది. -
‘ఉచితాల’పై సుప్రీంకోర్టు నోటీసు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఓటర్లపై ఉచితాల వల విసురుతున్నాయి. మళ్లీ అధికారం అప్పగిస్తే ఉచిత పథకాలు అమలు చేస్తామని, ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తామని హామీ ఇస్తున్నాయి. ప్రజాధనాన్ని దురి్వనియోగం అవుతోందని, ఈ ఉచిత పథకాలను అడ్డుకోవాలని కోరుతూ భట్టూలాల్ జైన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. -
‘గ్యారంటీ కార్డు’
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ కోటలో పాగా వేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రయత్నాలు ప్రారంభించింది. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ శనివారం రాయ్‌పూర్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల కోసం 10 ఉచిత హామీ పథకాలను ప్రకటించారు. గృహాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు నిరుద్యోగులకు రూ.3,000 భృతి, స్కూలు విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, నిరుపేద మహిళలకు నెలకి రూ.1,000, తదితర 10 హామీలతో గ్యారంటీ కార్డును విడుదల చేశారు. త్వరలో రైతులకు హామీ ప్రకటిస్తామని చెప్పారు. ఆప్ మొదటి సారిగా 2018 ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకుగాను 85 స్థానాల్లో పోటీకి దిగి అన్ని చోట్లా «డిపాజిట్లు కోల్పోయింది. -
Karnataka election results 2023: కాంగ్రెస్ ప్రభంజనం
సాక్షి, బెంగళూరు: కన్నడ ఓటరు కాంగ్రెస్‌కే జై కొట్టాడు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించే నాలుగు దశాబ్దాల ఆనవాయితీని కొనసాగిస్తూ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారును ఇంటికి సాగనంపాడు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్ ఉచిత హామీల ముందు మోదీ మేజిక్ ఏమాత్రం పని చేయలేదు. కార్యకర్త స్థాయి నుంచి అగ్ర నాయకత్వం దాకా సమష్టిగా చేసిన కృషి ఫలించి కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. హంగ్ ఊహాగానాలకు, హోరాహోరీ తప్పదన్న విశ్లేషణలకు చెక్ పెడుతూ తిరుగులేని మెజారిటీ సాధించింది. 224 సీట్ల అసెంబ్లీలో మెజారిటీకి 133 సీట్లు కావాల్సి ఉండగా ఏకంగా 136 స్థానాలను హస్తగతం చేసుకుంది. తద్వారా పదేళ్ల తర్వాత రాష్ట్రంలో సొంతంగా మెజారిటీ సాధించి సంబరాల్లో మునిగిపోయింది. ఇండియాటుడే వంటి ఒకట్రెండు సంస్థలు తప్ప మిగతా ఎగ్జిట్ పోల్స్ ఏవీ కాంగ్రెస్‌కు ఇంతటి విజయాన్ని ఊహించలేకపోయాయి. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీపై విపక్షాల ఉమ్మడి పోరుకు నేతృత్వం వహించేందుకు అత్యవసరమైన నైతిక బలాన్ని ఈ విజయం ద్వారా కాంగ్రెస్ కూడగట్టుకుంది. అంతేగాక వరుస ఎన్నికల్లో బీజేపీ చేతిలో కోలుకోలేని దెబ్బలు తింటూ ఓ పెద్ద రాష్ట్రంలో నికార్సైన గెలుపు కోసం ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న పార్టీకి ఈ ఘనవిజయం ఎంతో ఊరటనిచ్చింది. మరోవైపు కర్ణాటక వంటి కీలక రాష్ట్రంలో ఇంతటి పరాభవం బీజేపీకి గట్టి ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు. ఈ ఓటమితో దక్షిణాదిన ఏకైక రాష్ట్రం కూడా కమలం పార్టీ చేజారింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 104 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ఈసారి 39 స్థానాలు కోల్పోయింది. 78 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ ఈసారి ఏకంగా మరో 58 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక జేడీ(ఎస్) ఇంటి గోలతో చిర్రెత్తిన ఓటరు ఈసారి ఆ పార్టీకి గట్టిగానే వాత పెట్టాడు. హంగ్ వస్తే ఎప్పట్లా కింగ్‌మేకర్ కావాలని ఆశపడ్డ ఆ పార్టీ దారుణంగా చతికిలపడింది. 2018లో గెలిచిన 37 సీట్లలో ఏకంగా 18 స్థానాలు కోల్పోయి చిక్కి ‘సగ’మైంది. 2018లో కాంగ్రెస్, జేడీ(ఎస్) ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వాన్ని 14 నెలలకే బీజేపీ పడగొట్టింది. ఆ రెండు పార్టీల్లోని 17 మంది ఎమ్మెల్యేలను లాగేసింది. వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికల్లో 15 సీట్లు గెలిచి మెజారిటీ సాధించి గద్దెనెక్కింది. ఈ గోడ దూకుళ్లతో విసిగిన కన్నడ జనం ఈసారి సుస్థిర ప్రభుత్వానికి జై కొట్టారు. ఫలితాల సరళి స్పష్టమవుతూనే బెంగళూరు నుంచి హస్తిన దాకా కాంగ్రెస్ కార్యాలయాల్లో సంబరాలు మిన్నంటాయి. బీజేపీ కార్యాలయాలు కళ తప్పి కన్పించాయి. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. ఘనవిజయం సాధించిన కాంగ్రెస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇది విద్వేష రాజకీయాలపై ప్రేమ సాధించిన విజయమని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. తృణమూల్, ఎన్సీపీ సహా దేశవ్యాప్తంగా పలు విపక్ష పార్టీలు కాంగ్రెస్ విజయం పట్ల హర్షం వెలిబుచ్చాయి. బీజేపీ నియంతృత్వ పోకడలకు, కక్షసాధింపు రాజకీయాలకు ఇదో గుణపాఠమన్నాయి. ఆద్యంతం హస్తం హవా... కర్ణాటక అసెంబ్లీకి బుధవారం ఒకే దశలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఏకంగా 73.19 శాతం పోలింగ్ నమోదైంది. శనివారం ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు మొదలైంది. ప్రారంభం నుంచే కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఏ దశలోనూ వెనక్కు తగ్గకుండా దూసుకుపోయింది. ఆద్యంతం వెనుకంజలోనే కొనసాగిన బీజేపీ ఎక్కడా కోలుకోలేకపోయింది. 6 ప్రాంతాల్లో నాలుగింట్లో కాంగ్రెసే కర్ణాటకలోని ఆరు ప్రాంతాల్లో నాలుగింట్లో కాంగ్రెస్ హవాయే కొనసాగింది. జేడీ(ఎస్) కంచుకోట పాత మైసూరుతో పాటు ముంబై కర్ణాటక, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతం హైదరాబాద్ కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకల్లో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. బీజేపీ కేవలం కోస్తా కర్ణాటకలోనే పై చేయి సాధించగా బెంగళూరులో కాంగ్రెస్‌కు సమవుజ్జీగా నిలిచింది. రాహుల్ గాంధీ ఇటీవలి భారత్ జోడో పాదయాత్రలో భాగంగా కర్ణాటకలో నిడిచిన 20 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 15 చోట్ల కాంగ్రెస్ నెగ్గడం విశేషం. బీజేపీకి తగ్గింది 0.2 శాతం ఓట్లే... పోయిందేమో 39 సీట్లు! బీజేపీకి మొత్తమ్మీద ఓట్ల శాతం తగ్గకపోయినా ఏకంగా 39 సీట్లు చేజారడం విశేషం. ఆ పార్టీకి 2018లో 36.22 శాతం రాగా ఈసారి కూడా 36 శాతం సాధించింది. అప్పుడు 38 శాతం సాధించిన కాంగ్రెస్ ఈసారి ఏకంగా 43 శాతం ఒడిసిపట్టింది. 5 శాతం అదనపు ఓట్లతో అదనంగా 58 సీట్లు కొల్లగొట్టింది. 1999లో కాంగ్రెస్ 132 సీట్లు గెలిచింది. ఆ తర్వాత దాదాపు పాతికేళ్లకు అంతకంటే మెరుగైన విజయం సాధించింది. జేడీ(ఎస్) ఓట్ల శాతం 18.36 నుంచి 13.2కు తగ్గింది. రద్దవనున్న అసెంబ్లీలో బీజేపీకి 117 సీట్లు, కాంగ్రెస్‌కు 69, జేడీ(ఎస్)కు 29, బీఎస్పీకి 1, స్వతంత్రులకు 2 సీట్లున్నాయి. 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు అభినందనలు ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆ పార్టీ కృషి చేస్తుందని ఆశిస్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. అహర్నిశలు శ్రమించిన బీజేపీ కార్యకర్తలకు అభినందనలు. రానున్న రోజుల్లో మరింత దీక్షతో కర్ణాటక ప్రజలకు సేవలందిస్తాం’’ – ప్రధాని నరేంద్ర మోదీ ఇది ప్రజల విజయం ‘‘ఇది ప్రజా గెలుపు. సమష్టి కృషి. బీజేపీ నాయకుల అహంకారమే వారిని ఓడించింది. కాంగ్రెస్‌ను అఖండ మెజారిటీతో గెలిపించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. ఈ గెలుపుతో దక్షిణ భారతదేశం బీజేపీరహితంగా మారింది. రాజ్యాంగ రక్షణకు ప్రజలిచ్చిన విజయమిది. కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారెంటీల అమలుకు తొలి కేబినెట్ భేటీలోనే చర్యలు తీసుకుంటాం. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేసిన 99 శాతం ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది’’ – కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గెలుపోటములను సమానంగా చూస్తా ‘‘రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమం. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తా ను. నాకు, మా పార్టీకి ఇవేమీ కొత్తకాదు. ఈ ఓటమి నాకు గానీ, మా పార్టీకి గానీ అంతిమం కాదు. మా పోరాటం ఆగదు. ప్రజలకు తోడుగా నిలుస్తాం. పార్టీని బలోపేతం చేస్తాం. ఈ ఫలితాలతో ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మా కార్యకర్తలను కోరుతున్నా. మా పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు’’ – జేడీ(ఎస్) నేత కుమారస్వామి -
Karnataka assembly elections 2023: కొన్ని పార్టీలకు రాజకీయాలంటే అవినీతి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. వారికి దిశానిర్దేశం చేశారు. కర్ణాటకలో ఓటర్లకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ వారంటీ ఎప్పుడో ముగిసిపోయిందని, ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలకు అర్థంపర్థం లేదని ఎద్దేవా చేశారు. ఉచిత పథకాలపై మోదీ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రాలు దివాలా తీయడం ఖాయమని చెప్పారు. భవిష్యత్తు తరాలకు దక్కాల్సిన ప్రయోజనాలను ఈ ఉచిత పథకాలు మింగేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితాల సంస్కృతికి తెరపడాలని మోదీ స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు కోరుతా.. ‘మన దేశంలో రాజకీయాలు అంటే అర్థం అధికారం, అవినీతిగా కొన్ని పార్టీలు మార్చేశాయి. అధికారం కోసం ఆయా పార్టీలు సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నాయి. దేశ భవిష్యత్తు గురించి, కర్ణాటకలోని యువత, మహిళల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు’అని మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు బీజేపీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఈ నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల వల్ల దక్కే లాభాలను బూత్‌స్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేస్తానని చెప్పారు. ఒక కార్యకర్తగా కర్ణాటక ప్రజల వద్దకు వెళ్లి, వారి ఆశీస్సులు కోరుతానని వివరించారు. ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ షార్ట్‌కట్‌లను తాము నమ్ముకోవడం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆత్యాధునిక భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నామని గుర్తుచేశారు. ఎఫ్‌డీఐ అంటే తమకు ‘ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్’ కాదని, ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ అని వివరించారు. ఐదేళ్ల పాలనా కాలం గురించి యోచించడం లేదని, దేశం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ కాదు, దేశమే తమకు ముఖ్యమని చెప్పారు. -
Karnataka assembly elections 2023: వాగ్దానాల నుంచి కోటా దాకా... కీలకాంశాలివే...!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నామినేషన్ల సమర్పణ, పరిశీలన, ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. ప్రచారమూ జోరందుకుంది. ఆయా పార్టీల నేతలు ఊరూవాడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల ఉచిత వాగ్దానాలతో పాటు రెబెల్స్ వంటి పలు అంశాలు ఈసారి ఎన్నికలను గట్టిగానే ప్రభావితం చేసేలా కన్పిస్తున్నాయి... – సాక్షి, బెంగళూరు వాగ్దానాలు, తాయిలాలు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈసారి కూడా పోటాపోటీగా ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 అందిస్తామని కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ తక్షణం ప్రతిస్పందించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు రూ.3,000 ప్రకటించింది. మహిళా వ్యవసాయ కూలీలకు నెలకు రూ.1,000తో పాటు 30 లక్షల మంది మహిళలకు, 8 లక్షల మంది విద్యార్థినులకు ఉచిత బస్ పాస్ హామీలిచ్చింది. కాంగ్రెసేమో కుటుంబానికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం, పట్టభద్రులకు రూ.3,000 నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని పేర్కొంది. ఇక జేడీ(ఎస్) పేద మహిళలకు నెలకు రూ.2,000 జీవన భృతి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తదితర వాగ్దానాలు చేసింది. తొలిసారి రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న ఆప్ కూడా ఏమీ వెనకబడలేదు. ఉచిత విద్యుత్, తాగునీరు, సాగు రుణ మాఫీ, పట్టణ ప్రాంత మహిళలకు ఉచిత బస్ పాస్ వంటి హామీలిచ్చింది. పాల ప్యాకెట్లో తుఫాన్ స్థానిక నందిని డెయిరీని దెబ్బతీసేందుకు గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీ వచ్చి పడుతోందన్న ప్రచారం బీజేపీకి తలనొప్పిగా మారింది. దీన్ని అస్త్రంగా మలుచుకున్నాయి. కర్ణాటకలో అమూల్, నందిని కలసి పనిచేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పదేపదే ప్రస్తావిస్తోంది. దీనివల్ల దేశంలో రెండో అతి పెద్ద డెయిరీ సహకార వ్యవస్థ అయిన కర్ణాటక పాల సమాఖ్య మనుగడే ప్రమాదంలో పడుతుందంటూ ప్రచారం చేస్తోంది. దాంతో దిమ్మెరపోయిన బీజేపీ కీలకమైన డెయిరీ రైతుల ఓట్లు చేజారకుండా చూసుకునేందుకు కిందామీదా పడుతోంది. ‘అవినీతి’ పై కాంగ్రెస్ ఆశలు బొమ్మై ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ప్రధానంగా అస్త్రాలు ఎక్కుపెడుతోంది. 40 శాతం కమిషన్ సర్కారు అంటూ చేస్తు న్న ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయ ని నమ్ముతోంది. ప్రభుత్వ పెద్దలే ప్రతి పనిలోనూ 40 శాతం కమీషన్లు, ముడుపులు తీసుకుంటున్నారంటూ హో రెత్తిస్తోంది. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ అధికారంలో ఉండగా కర్ణాటకను ఆ పార్టీ అధిష్టానం అచ్చం ఏటీఎం మాదిరిగా వాడుకుందంటూ బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. ‘కోటా’తో బీజేపీ ఆట ఎన్నికల వేళ బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడమే గాక బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్‌లు, ఒక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున బ దలాయించింది. ఊహించినట్టే ముస్లింల నుంచి దీనిపై భారీ నిరసన ఎదురైనా ఈ ఎత్తుగడ హిందూ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటితం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పెంచి ఆయా కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతోపాటు హిజాబ్, టిప్పు సుల్తాన్ అంశాలూ ప్రభావం చూపనున్నాయి. కింగ్(మేకర్) ఆశల్లో జేడీ(ఎస్) 2013లో మినహాయించి గత 20 ఏళ్లలో కన్నడ ఓటరు ఎప్పుడూ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. హోరాహోరి పోరు నేపథ్యంలో ఈసారి కూడా ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. 224 సీట్లలో కాంగ్రెస్ 100కు అటూ ఇటుగా, బీజేపీ 90లోపు, జేడీ(ఎస్) 30 నుంచి 40 గెలుస్తాయని అంచనా. అదే జరిగితే కింగ్‌మేకర్‌గా మరోసారి చక్రం తిప్పాలని జేడీ(ఎస్) ఆశపడుతోంది. పాత మైసూరులోని 89 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 30కి పైగా గెలుస్తామని ధీమాగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెబల్స్ తద్వారా మరిన్ని స్థానాలు తెచ్చిపెడతారని భావిస్తోంది. గుండెల్లో రె‘బెల్స్’ ► బీజేపీ కనీసం 20కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ► సీనియర్లకు ఉద్వాసన పలికి కొత్తవారికి, యువతకు చాన్సివ్వాలన్న అధిష్టానం నిర్ణయం కాస్త బెడిసికొట్టినట్టు కన్పిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ► మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదితో పాటు చాలామంది సీనియర్లు టికెట్ రాక పార్టీని వీడారు. ► వారిని కాంగ్రెస్ సాదరంగా ఆహ్వానించి టికెట్లిచ్చింది. ఇది ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో బీజేపీని బాగా దెబ్బ తీస్తుందంటున్నారు. ► రెబెల్స్ దెబ్బకు బీజేపీ ఓటు బ్యాంకుకు చిల్లి పడేలా కన్పిస్తోంది. ► మరీ నామినేషన్ల దాకా ఆగకుండా ఏ మూడు నెలల ముందో సీనియర్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్న భావన వ్యక్తమవుతోంది. -
ఉచితాలని ప్రజలను అవమానించొద్దు.. మోదీకి కేజ్రీవాల్ కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: ఉచితాల నుంచి విముక్తి కల్పించాలని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై వివర్శలు గుప్పించారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. రాజకీయ నాయకులకు కూడా ఎన్నో ఉచితాలు అందుతున్నాయని గుర్తు చేశారు. కోటీశ్వరుల బ్యాంకు రుణాల మాటేమిటని ప్రశ్నించారు. పదే పదే ఉచితాలు రద్దు చేయాలంటు సామాన్యులను అవమానించవద్దని మండిపడ్డారు. ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఔషధాలు ఇస్తే తప్పేంటని కేజ్రీవాల్ మోదీని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఆదివారం హిందీలో ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో పీఎం ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల గృహప్రవేశాలను శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి ఉచితాల నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఎంతో మంది పన్నుచెల్లింపుదారులు తనకు ఈవిషయంపై చాలా లేఖలు పంపారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ షేర్ చేస్తూ.. మోదీపై విమర్శలకు ఎక్కుపెట్టారు కేజ్రీవాల్. लोग महंगाई से बहुत ज़्यादा परेशान हैं। जनता को मुफ़्त शिक्षा, मुफ़्त इलाज, मुफ़्त दवाइयाँ, बिजली क्यों नहीं मिलनी चाहिए? नेताओं को भी तो इतनी फ्री सुविधायें मिलती हैं। कितने अमीरों के बैंकों के क़र्ज़े माफ़ कर दिये। बार बार मुफ़्त रेवड़ी बोलकर जनता का अपमान मत कीजिए https://t.co/oWMa5p9KjF — Arvind Kejriwal (@ArvindKejriwal) October 23, 2022 చదవండి: ‘ఉచితాల’ నుంచి దేశానికి విముక్తి కావాలి -
ఎన్నికల హామీలకు నిధులెలా తెస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉచితాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా మోడల్ కోడ్‌ను(ఎన్నికల ప్రవర్తనా నియమావళి) సవరించాలని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఓటర్లకు చెప్పాలని, ఈ ప్రతిపాదనపై ఈ నెల 19వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని పేర్కొంది. ఈ మేరకు గుర్తింపు పొందిన అన్ని జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలకు మంగళవారం లేఖ రాసింది. మేనిఫెస్టోల్లో ప్రకటించిన ఎన్నికల వాగ్దానాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ఓటర్లకు అందజేయాలని లేఖలో స్పష్టం చేసింది. మోడల్ కోడ్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఆర్థిక వనరులు ఏమిటో కూడా ఓటర్లకు తెలియచేయాలని వెల్లడించింది. పార్టీ ఇచ్చే ఎన్నికల హామీల విషయంలో తాము కళ్లు మూసుకొని కూర్చోలేమని తేల్చిచెప్పింది. బూటకపు వాగ్దానాలతో విపరిణామాలు రాజకీయ పార్టీలు ఇచ్చే బూటకపు వాగ్దానాలు విపరిణామాలకు దారితీస్తాయని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయకుండా తాము అడ్డుకోలేకపోనప్పటికీ, ఓటర్లకు సమాచారం ఇచ్చే హక్కు ఉందని పేర్కొంది. ఇకపై దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నిర్దిష్ట ఫార్మాట్లో పార్టీల వ్యయాల వివరాలను అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల వివరాలను ఓటర్లకు చెప్పే అంశాన్ని ఎన్నికల ప్రవర్తనా నియామావళి(ఎంసీసీ)లోని పార్ట్–8లో (ఎన్నికల మేనిఫెస్టోపై మార్గదర్శకాలు) చేరుస్తూ ఎంసీసీని సవరించాలని ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. దీని ప్రకారం మేనిఫెస్టోల్లో ఇచ్చే హామీల అమలుకు నిధులు సేకరించే మార్గాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అదనపు పన్నులు, ఖర్చుల హేతుబద్దీకరణ, కొన్ని పథకాల్లో కోత, మరిన్ని అప్పులు తీసుకురావడం వంటి వివరాలు వెల్లడించాలి. ఓటర్లకు ఉచితాలు పంచే సంస్కృతికి రాజకీయ పార్టీలు చరమగీతం పాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే పిలుపునిచ్చారు. దీనిపై అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సైతం జరిగింది. ఉచితాలపై సర్వోన్నత న్యాయస్థానంలో సైతం ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఏది ఉచితం? ఏది అనుచితం?
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న రాయితీలను, సబ్సిడీలను ఉచితాలుగా ప్రకటించి... వాటిని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచనలు, సలహాలు ఇస్తూ ప్రకటన చేసింది. ఏవి ఉచితాలో, వేటిని ఉపసంహరించుకోవాలో స్పష్టంగా చెప్పలేదు. ఉచితం అంటే పూర్తి సబ్సిడీగా ఇచ్చేది. ఎలాంటి శ్రమ, ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేది. ఈరోజు దేశంలో 80 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన బతుకుతున్నారు. వారికి కనీస పౌష్టికాహారం అందుబాటులో లేదు. ఐదేళ్ల లోపు పిల్లలు వెయ్యికి 40 మంది మరణిస్తున్నారు. ఉత్పత్తి ధర చెల్లించి కొనుగోలు చేసే శక్తి ప్రజలలో లేదు. అలాంటి ప్రజలకు రాయితీలు ఇవ్వాలి. శ్రమ చేయడానికి శక్తిలేని వారు, వయస్సు మళ్లినవారు, ఆనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వం ఉచితంగా సహకారం అందించాలి. ప్రస్తుతం రాష్ట్రాలు చౌక డిపోల ద్వారా బియ్యం ఇస్తున్నాయి. వీటికి తోడు ఆసరా పింఛన్లు, భరోసా పింఛన్లు వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్నారు. వీటితోనే వీరు బతుకుతున్నారు. ఈ ఉచితాలు రద్దు చేస్తే వీరిలో చాలామంది బతకలేరు. వ్యవసాయ రంగానికి ఎరువులు, విత్తనాలు, విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పేర్లతో రాయితీలు ఇస్తున్నారు. వ్యవసా యోత్పత్తులకు పెట్టిన పెట్టుబడిని శాస్త్రీయంగా ప్రభుత్వం లెక్కించడంలేదు. చివరికి మార్కెట్లలో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక దేశంలో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఏదో రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన ప్రజలకు సబ్సిడీల పేరుతో రాయితీలు ఇస్తూనే ఉన్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ రాయితీలన్నింటినీ రద్దు చేయాలని సలహా ఇస్తున్నది. వార్షిక తలసరి ఆదాయం దేశంలో రూ. 1,50,326గా కేంద్రం ప్రకటించింది (2021–22). అంతకు తక్కువ వచ్చిన వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రాయితీలను గమనించి ఆహార సబ్సిడీ (రూ. 2,06,831 కోట్లు), ఎరువుల సబ్సిడీ (రూ. 1,06,222 కోట్లు), గ్యాస్ (రూ. 8,940 కోట్లు), పెట్రోల్ సబ్సిడీ (రూ.3.30 లక్షల కోట్లు) ఏటా ఇస్తున్నది. ఈ మధ్య రైతు కుటుంబానికి రూ. 6,000 చొప్పున కిసాన్ సమ్మాన్ పేర రూ.68,000 కోట్లు, వడ్డీమాఫీకి రూ. 19,500 కోట్లు, పంట బీమాకు రూ. 15,500 కోట్లు... మొత్తం రూ.1,03,000 కోట్లు సబ్సిడీగా ఇస్తున్నది. దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ కార్పొరేషన్లు, ఆయా వర్గాలకు 20 శాతం సీడ్‌మనీ పేర సబ్సిడీలు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నారు. వాటితో ఉపాధి చాలామంది సంపాదించుకుంటున్నారు. రాష్ట్రాలు రాయితీలను రద్దు చేయాలంటున్న కేంద్రం ఈ రాయితీలను కూడా రద్దు చేయాల్సి ఉంటుంది! పేదలు తమ పిల్లలను బడికి పంపకుండా కూలీకి తీసుకుపోవడంతో అక్షరాస్యత పెరగడం లేదు. అక్ష్యరాస్యతను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద కుటుంబాలకు సంవత్సరానికి ఉచితంగా రూ. 12,500 ఇవ్వడంతో వారు పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారు. ఆ విధంగా విద్య వ్యాప్తి జరుగుతున్నది. మరి ఈ సహాయాన్ని ఆపాలంటారా? కాలేజీలలోగానీ, యూనివర్సిటీలలో గానీ పేదలకు అనేక రాయితీలు ఉన్నాయి. వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పేరుతో ఉచిత వైద్యం చేయిస్తున్నారు. ఈ ఉచితాలన్నింటినీ లెక్కవేసినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లలో 15 శాతానికి మించవు. కానీ, కార్పొరేట్ సంస్థలు ఈ రాయితీలను రద్దు చేయాలనీ, తమకు అనుకూల విధానాలు తేవాలనీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కార్పొరేట్లకు తలొగ్గింది. సెప్టెంబర్ 2019న ఒక జీఓ ద్వారా కార్పొరేట్లు చెల్లించే 30 శాతం పన్నును 22 శాతానికి తగ్గించారు. మార్చి 2033 నాటికి 25 శాతం నుండి 15 శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. విదేశాలలో 35 నుండి 40 శాతం పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ, ఇక్కడ పన్నులు తగ్గిస్తున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటివాళ్ళు 13 రంగాలలో మోసాలు చేసి లక్షల కోట్లు ఎగనామం పెట్టారు. 2019 ఏప్రిల్ 14కు ముందు రూ. 7 లక్షల కోట్లు వారి ఖాతాల నుండి ‘రైట్ ఆఫ్’ చేశారు. నిరర్థక ఆస్తుల పేర 10 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ చేశారు. రూ. 2.11 లక్షల కోట్లు బెయిల్ ఔట్ కింద ఇచ్చారు. జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, ఇటలీ తదితర దేశాలలో కార్పొరేట్లపై 30–40 శాతం పన్నులు వసూళ్ళు చేయడంతోపాటు నెలవారీ వేతనాలపై పన్ను వసూలు చేస్తూ ఆహార, ఇతర సంక్షేమ సబ్సిడీలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ఈ విషయాలు తెల్సినప్పటికీ భారత దేశంలో ఉచితాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను రద్దుచేసి, కార్పొరేట్లకు బహి రంగంగా లాభాలు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. కేంద్రం ప్రకటించిన ‘ఉచితాల రద్దు విధానాన్ని’ ఉపసంహరించుకోవాలి. (క్లిక్: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర) - సారంపల్లి మల్లారెడ్డి అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు -
దేశ చర్రితలోనే ఫస్ట్.. సీజేఐ ఎన్వీ రమణ వీడ్కోలుకు స్పెషల్ గిఫ్ట్
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. నేడు(శుక్రవారం) పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, దేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ప్రత్యక్ష ప్రసారంలో విచారణలు జరిపింది. కాగా, విచారణలో భాగంగా ఉచిత పథకాలపై దాఖలైన పిటిషిన్లపై సీజేఐ ఎన్వీ రమణ తీర్పు వెల్లడించారు. ఉచిత హామీలపై పిటిషన్లను ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేస్తూ జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. కాగా, రేపు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. -
‘ఉచితాల’తో ఆర్థిక వ్యవస్థకు చేటు..అఖిలపక్షాన్ని పిలవలేదేం?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో నెగ్గడానికి రాజకీయ పార్టీలు ప్రజలకు ‘ఉచిత’ హామీలు ఇస్తుండడం తీవ్రమైన అంశమేనని, దీనిపై కచ్చితంగా చర్చ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. చర్చించడానికి అఖిలపక్ష సమావేశానికి ఎందుకు పిలుపునివ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగించే ఉచితాల వ్యవహారాన్ని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఉచితాలపై పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోతే ఇవి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్æ రవికుమార్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున‡ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ఉచితాలపై అధ్యయనం చేయడానికి నియమించే కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లోధాను చైర్మన్‌గా నియమించాలని కోరారు. ‘‘పదవీ విరమణ చేసిన, చేయబోతున్న వ్యక్తికి ఈ దేశంలో విలువ లేదు’’ అంటూ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిస్పందించారు. కమిటీకి ఒక రాజ్యాంగ సంస్థ నేతృత్వం వహించాలని భావిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఈ సమస్యను అధ్యయనం చేయడానికి కేంద్రమే కమిటీని ఎందుకు నియమించకూడదని సీజేఐ ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం చట్టంతో మేలు ఎన్నికలకు ఆరు నెలల ముందు ఉచితాలు ప్రకటించడమే ప్రధానమైన సమస్య అని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. ఆయన ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్’ తరఫున వాదనలు వినిపించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం, పబ్లిక్ పాలసీని అపహాస్యం చేస్తూ ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారులైన కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వడం, ఎన్నికలకు ముందు ఉచిత వాగ్దానాలు చేయడం.. ఈ మూడూ అక్రమమేనని చెప్పారు. పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు నిధుల మూలాలను సైతం వెల్లడించాలనే ప్రతిపాదనను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన రికార్డులు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండవని గుర్తుచేశారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్(ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని అమలు చేస్తే పరిష్కారం లభిస్తుందని, ఆర్థిక లోటు మూడు శాతానికి మించితే తదుపరి సంవత్సరం నుంచి కేటాయింపులు తగ్గించే అధికారం ఆర్థిక కమిషన్‌కు ఉందని తెలిపారు. పార్టీలు ప్రాథమిక హక్కుగా భావిస్తున్నాయి ఓటర్లను ప్రభావితం చేసేలా అధికారంలో లేని పార్టీలు హామీలు ఇస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. ‘‘అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఉండవని ఒకరు ప్రజల్ని మభ్యపెట్టొచ్చు. కానీ, అధికారంలోకి వస్తే చంద్రుడిని తీసుకొస్తానని హామీ ఇవ్వగలమా?’’ అని ప్రశ్నించారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ఉచితాల అంశంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకని అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వలేదని అన్నారు. ఉచితాలపై నియంత్రణను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంతో ఫలితం ఉండదని మెహతా బదులిచ్చారు. ఉచితాలు అందించడం తమ ప్రాథమిక హక్కుగా కొన్ని పార్టీలు భావిస్తున్నాయని, కేవలం ఉచితాల హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీలూ ఉన్నాయని ఉద్ఘాటించారు. నేను పోటీ చేస్తే.. ‘‘కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారనేది పెద్ద సమస్య. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తాయి. వ్యక్తులు కాదు. ఒకవేళ నేను పోటీ చేస్తే 10 ఓట్లు కూడా రావు. ఎందుకంటే వ్యక్తులకు అంత ప్రాధాన్యం ఉండదు. ఇదే మన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారు తర్వాత అధికారంలోకి రావచ్చు’ అని జస్టిస్ రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... తుషార్ మెహతా వ్యాఖ్యలను వ్యతిరేకించారు. కేవలం ఉచితాల ద్వారా ఓటర్లను ఆకర్శిస్తారనడం సరైంది కాదన్నారు. బంగారు చైన్లు ఇస్తామంటూ హామీలు ఇవ్వడాన్ని సంక్షేమంగా ఎలా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ ప్రశ్నించారు. ఉచితాల వల్ల తలెత్తే ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి తగిన సమాచారం అందుబాటులో ఉందని వివరించారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఉచిత హామీల విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై ఇకపై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుందని తెలిపారు. సుబ్రహ్మణ్యం వర్సెస్ తమిళనాడు కేసును పునఃపరిశీలించడానికి ధర్మాసనం ఏర్పాటు చేయొచ్చని పేర్కొన్నారు. -
ఉచితాలొద్దని ఉచిత సలహాలిస్తే తీసుకుంటారా సార్!
ఉచితాలొద్దని ఉచిత సలహాలిస్తే తీసుకుంటారా సార్! -
బడా కార్పొరేట్ల రుణ మాఫీపై చర్చకు సిద్ధమా?: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఉచితాల సంస్కృతి దేశానికి ప్రమాదమంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.5.8 లక్షల కోట్లను ఎందుకు మాఫీ చేశారు? ఏటా రూ.1.45 లక్షల కోట్ల మేర కార్పొరేట్ పన్నుల్లో రాయితీలు ఎందుకు కల్పించారని ప్రశ్నించింది. బడా పారిశ్రామికవేత్తల బ్యాంకు రుణాల మాఫీ, కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపుపై చర్చకు ఎప్పుడు సిద్ధమని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో రద్దు చేసిన రూ.9.92 లక్షల కోట్ల బ్యాంకు రుణాల్లో రూ.7.27 లక్షల కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులవేనని మీడియాకు ఆయన వివరించారు. రద్దైన రుణాల నుంచి కేవలం రూ.1.03 లక్షల కోట్లను మాత్రమే రాబట్టగలిగామంటూ ప్రభుత్వమే పార్లమెంట్లో ప్రకటించిందన్నారు. రానున్న కాలంలో రుణ రికవరీ మరో 20% మేర పెరుగుతుందని భావించినా అప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ మాఫీ రూ.5.8 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. ధనికులకు వివిధ రూపాల్లో వేల కోట్ల మేర మినహాయింపులు కల్పించే ప్రభుత్వం..పేదలకు స్వల్ప మొత్తాల్లో సాయం అందించేందుకు సైతం ఎందుకు ముందుకు రాలేకపోతోందని నిలదీశారు. -
జన ప్రమేయంలేని చర్చ!
ఎప్పటిలాగే ఉచిత పథకాలపై మళ్లీ జోరుగా చర్చ జరుగుతోంది. సహజంగానే ప్రజల కోసం అమలయ్యే ఉచిత పథకాల చుట్టూనే ఇదంతా తిరుగుతోంది. బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల మేర ఎగ్గొట్టిన బ్యాంకు రుణాలు రద్దవుతున్న వైనం గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. బహుశా ఇలా రద్దు చేయడం ఉచితాలకిందకు రాదన్న అభిప్రాయం చర్చిస్తున్నవారికి ఉన్నట్టుంది. గత నెలలో ఒక సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత పథకాలు ప్రకటించడాన్ని ‘మిఠాయిల సంస్కృతి’గా అభివర్ణించారు. ఈ సంస్కృతికి అడ్డదారి రాజకీయంగా కూడా ఆయన పేరుపెట్టారు. ఉచితపథకాల వల్ల ఆర్థికాభివృద్ధి నాశనమవుతుందన్నారు. ఆయన దీన్ని ప్రత్యేకించి ఎందుకు లేవనెత్తారో తెలియంది కాదు. వచ్చే డిసెంబర్లో జరగబోతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. మహిళలకు ప్రతి నెలా వేయి రూపాయలు ఇవ్వడంతోసహా బోలెడు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారు. ఇక తన ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేస్తున్న వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. మధ్య తరగతి, ఆ పై తరగతులవారికి అన్ని రకాల ఉచిత పథకాలపైనా ఎప్పటినుంచో అభ్యంతరం ఉంటోంది. వారి ఉద్దేశం ప్రకారం ఉచిత రేషన్ మొదలుకొని ఉపాధి హామీ పథకం వరకూ అన్నీ వ్యర్థమైనవే. తాము కట్టే పన్నుల ద్వారా సమకూడే రాబడిని ప్రభుత్వాలు ఉచిత పథకాలకింద ప్రజలకు ఇస్తూ వారిని సోమరులను చేస్తున్నాయన్న అభిప్రాయం వారిది. దేశంలో 90వ దశకం మొదట్లో ఆర్థిక సంస్కరణల అమలు మొదలయ్యాక సమాజంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగాయి. కొన్ని అట్టడుగు కులాలకు మాత్రమే పరిమితమై ఉండే వృత్తుల్లోకి సైతం సంపన్నవర్గాలు భారీ పెట్టుబడులతో ప్రవేశించి లాభార్జన మొదలుపెట్టాయి. వారితో సరితూగలేక అట్టడుగు కులాలు మరింత పేదరికంలోకి జారుకున్నాయి. సంస్కరణల అనంతరం వచ్చిన సేవారంగం చూస్తుండగానే విస్తరిస్తూ పోతున్నా అందులో ఉద్యోగావకాశాలు బాగా నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే పరిమితమయ్యాయి. నైపుణ్యం అవసరంలేని ఉద్యోగాల్లో కుదురుకున్నవారు సైతం ఆ ఉద్యోగాల స్వభావరీత్యా ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయారు. పైగా అవి ఎప్పుడు ఉంటాయో, పోతాయో తెలియని కొలువులుగా మిగిలిపోయాయి. ఇవి చాలదన్నట్టు చంద్రబాబువంటి నేతలు అంతవరకూ నిరుపేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో దొరికే ఉచిత వైద్యానికి కూడా యూజర్ చార్జీలు విధించారు. రైతులు మొదలుకొని అట్టడుగు కులాల వరకూ అనేకులు బతకడానికి దోవలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగానికి చేయూతనివ్వడం కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యతిరేకతను కూడా అధిగమించి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. అంతవరకూ నామమాత్రంగా ఉండే వృద్ధాప్య పింఛన్‌ను పెంచారు. ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ప్రాణావసర చికిత్సలు అవసరమయ్యే నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం దక్కేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్‌కు ముందు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసినవారున్నారు. కానీ ఏ పథకాలు దారిద్య్ర నిర్మూలనకు తోడ్పడతాయో, భిన్న వర్గాల ఎదుగుదలకు ఉపయోగపడతాయో నిర్దిష్టంగా ఆలోచించి నిర్ణయించింది మాత్రం ఆయనే. అందుకే సంక్షేమ పథకాల ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ అందరికీ ఆయన పేరే గుర్తుకొస్తుంది. సుప్రీంకోర్టులో దాఖలైన పిల్ విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘అహేతుక ఉచిత పథకాలు’ అవినీతితో సమానమన్న పిటిషనర్ వాదనను సమర్థించారు. కానీ ఒక పథకం అహేతుకతమైనదో, సహేతుకతమైనదో నిర్ణయించేదెవరు? సుప్రీంకోర్టు ప్రతిపాదించిన నిపుణుల కమిటీ వంటివి ఆ అంశాన్ని నిర్ణయించగలవా? నిపుణులు తటస్థులనీ, అన్ని అంశాలపైనా వారికి సమగ్ర అవగాహన ఉంటుందని, వారి అభిప్రాయాలు శిరోధార్యమని భావించడం ఈ ప్రతిపాదన వెనకున్న భావన కావొచ్చు. కానీ నిపుణుల్లో ఉచితాలు సంపూర్ణంగా రద్దు చేయాలని వాదించేవారున్నట్టే, వాటిని కొనసాగించటం అవసరమని కుండబద్దలు కొట్టేవారున్నారు. అసలు ఉచిత పథకాలపై ఏ పార్టీకైనా నిర్దిష్టమైన అభిప్రాయం ఉందా? అనుమానమే. ఎందుకంటే ఉచిత పథకాలను మిఠాయి సంస్కృతిగా అభివర్ణించిన మోదీయే పలు సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉచిత పథకాల గురించి ఏకరువుపెట్టిన ఉదంతాలున్నాయి. అంతెందుకు? విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి, ప్రతి ఒక్కరి జేబులో రూ. 15 లక్షలు వేస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ప్రకటన దేనికిందికొస్తుంది? అసలు ప్రజల ప్రమేయం లేకుండా ఉచిత పథకాల గురించి చర్చించడం దండగ. అన్ని పార్టీలూ ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటిస్తున్నప్పుడు వారిలో ఎవరో ఒకరినే జనం ఎందుకు విశ్వసిస్తున్నారు? వారినే ఎందుకు గెలిపిస్తున్నారు? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అలవిమాలిన హామీలిచ్చి అధికారం అందుకున్న చంద్రబాబును, వాగ్దానాల అమలులో చతికిలబడ్డాక 2019 ఎన్నికల్లో అదే జనం ఓడించలేదా? ప్రజాక్షేత్రాన్ని విస్మరించి, ప్రజలు ఎన్నుకున్న చట్టసభలను పరిగణనలోకి తీసుకోకుండా ఉచితాల గురించి చర్చించడం వృథా ప్రయాస. -
ఉచితం అనుచితమా! పేదలకు ఎందుకివ్వొద్దు?
ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించడం ఆర్థిక వ్యవస్థకు మంచిదా, కాదా అంటూ దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉచిత పథకాలపై ఇటీవలి సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక విశ్లేషకులు ఘాటుగానే స్పందిస్తున్నారు. వాటిని ఎంతసేపూ ఉచితాలుగానే చూడటానికి బదులు సంక్షేమ పథకాలుగానో, లేదా సామాజిక పెట్టుబడిగానో ఎందుకు చూడటం లేదన్నది వారి ప్రశ్న. ఉచితంగా సైకిళ్లు, టీవీలు, కేబుల్ కనెక్షన్ ఇస్తే వృథా కింద లెక్కించవచ్చేమో గానీ విద్య, ఆరోగ్యం, వైద్యం తదితర రంగాలపై పెట్టే ఖర్చు అంతకంతకూ లాభాలు తెచ్చిపెట్టేదే కదా అన్నది వారి వాదన. ఇది ఒక్కరో, ఇద్దరో కాదు, ఏకంగా ముగ్గురు నోబెల్ గ్రహీతలు చెప్పిన మాట! బడికి వెళ్లేందుకు అయ్యే ఖర్చును తగ్గిస్తే మరింత ఎక్కువ మంది చదువుకోగలుగుతారని ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత ఆర్థికవేత్తలు అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫెలో స్పష్టం చేశారు. బడి ఫీజులను తగ్గించడం లేదా తొలగించడం, ఏపీలో అమలు చేస్తున్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితరాల రూపంలో తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలివ్వడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. పలు దేశాల్లో విద్యాపరమైన కార్యక్రమాలను పరిశీలించిన మీదట నిరూపితమైన ఆసక్తికరమైన విషయమిది! బాలల హక్కులపై పోరాడిన నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి పేదరికం, నిరుద్యోగిత సమస్యలను అధిగమించేందుకు విద్య అత్యంత కీలకమని 2015లోనే చెప్పారు. భారత్‌లో విద్యపై పెడుతున్న పెట్టుబడులు తక్కువగా ఉన్నాయని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రస్తుతం 3 శాతం మాత్రమే విద్యపై వెచ్చిస్తున్నారు. దీన్ని కనీసం రెట్టింపు చేయాల్సిన అవసరముంది’’ అని స్పష్టం చేశారు. పేద పిల్లల విద్యపై ఖర్చు చేసే ప్రతి రూపాయి భవిష్యత్తులో జీఎస్డీపీకి కనీసం 2 రూపాయలు జత చేస్తుందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ‘మరీ ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే పేదలు పేదలుగానే మిగిలిపోతారు‘ అంటూ హెచ్చరించారు. సామాజిక పెట్టుబడి∙ ఉచితం పేరిట ప్రచారంలో ఉన్న పథకాలన్నీ అక్షరాలా ఉచితం కాదు. యూపీలో ఉచిత సైకిళ్లు, తమిళనాడులో కేబుల్ కనెక్షన్ల వంటివాటిని కచ్చితంగా వనరుల వృథాగానే చెప్పాలి. కానీ, విద్య, ఆరోగ్యం, వైద్యం వంటి రంగాలపై పెట్టే ఖర్చు అంతకంతకూ లాభాలు తెచ్చిపెట్టేదే. దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేదే. విద్య, నైపుణ్యాలున్న వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్పాదకతా మెరుగ్గా ఉంటుంది. ఈ రెండూ ఆర్థిక వృద్ధికే తోడ్పడతాయి. అక్షరాస్యత, ఉన్నత విద్య ఉన్న సమాజాల్లో సమస్యలపట్ల అవగాహన, సామాజిక చైతన్యం సహజంగానే ఎక్కువగా, సామాజిక రుగ్మతలు తక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ లెక్కల ప్రకారం చదువుకునేందుకు మెరుగైన అవకాశాలు కల్పించడం, వసతులు ఏర్పాటు చేయడం సామాజిక పెట్టుబడి. వీటిపై వెచ్చించే ప్రతి రూపాయీ కనీసం రెండు రూపాయల దాకా లాభం తెచ్చిపెడుతుందని అంచనా. ‘ఆసుపత్రుల ఆధునీకరణ, సౌకర్యాల పెంపు, కొత్త వైద్య కళాశాల వంటి ఆరోగ్య రంగ పెట్టుబడులు ప్రజల ప్రాణాలు కాపాడటమే గాక కుండా ఆరోగ్య పరిరక్షణ ద్వారా సామాజిక ఉత్పాదకతను పెంచుతాయి. మధ్య వయస్కులకు కళ్లజోడు ఉచితంగా ఇవ్వడం దానం కాదు. చూపు బాగైతే వారు మరింత సమర్థంగా పని చేయగలరు. తద్వారా కుటుంబాలకు మరింత ఆదాయం వీలవుతుంది’ అంటారు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే. ఒక రాత్రి అక్కడ నిద్ర చేస్తే పేదరికమంటే ఏమిటో తెలుస్తుంది ‘పేదలు, మరీ ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువన కోటానుకోట్ల కుటుంబాలు నివసిస్తున్న భారతదేశంలో ఉచితాలు తప్పనే వారి గురించి ఏం మాటాడతాం? అయితే ఒకమాట. దేశంలో పేదలే లేరని వారు అనుకుంటుంటే గనక ముంబైలోని ధారవి, కోల్‌కతాలోని బసంతి, ఢిల్లీలోని బాల్స్వా, చెన్నైలోని నోచికుప్పం మురికివాడల్లో ఒక్క రాత్రి నిద్ర చేయండి‘ అని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను సామాజిక విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ‘ఏది ఉచితం, ఏది కాదన్న విచక్షణ లేకుండా విమర్శకులు అన్నింటినీ ఒకే గాటన కట్టేస్తున్నారు. ఈ రెండింటికీ తేడా అర్థం చేసుకుంటే అసలు విషయం బోధపడుతుంది. పేదరికంలో మగ్గుతున్నవారికి చదువు దూరమైనా, వైద్యం లభించకపోయినా, ఎన్ని వనరులు ఉన్నాయన్న దానితో నిమిత్తం లేకుండా ఆ దేశం పేదరికంలో మగ్గుతున్నట్టే లెక్క‘ అని ఢిల్లీ కేంద్రంగా పేద పిల్లల చదువు కోసం దశాబ్దాలుగా స్వచ్ఛందంగా పని చేస్తున్న ‘అభినవ్ సమాజ్’ చైర్మన్ గోపాలకృష్ణ గుప్తా అన్నారు. సంపన్న దేశాల్లోనూ ఉచితాలు బ్రిటన్‌తో పాటు పలు యూరప్ దేశాల్లో ఆహారం కోసం కూపన్లు, విద్య, ఆరోగ్యం వంటి సౌకర్యాలనూ ఉచితంగా అందించడం వంటివి ఇప్పటికీ అమలవుతున్నాయి. భారత్‌లో సంక్షేమ కార్యక్రమాల కోసం చేస్తున్న ఖర్చు సాపేక్షంగా తక్కువగానే ఉంటోంది. బ్రెజిల్ లాంటి దేశాలు వీటిపై స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఏడెనిమిది శాతం వరకూ ఖర్చు చేస్తున్నాయి. వైద్యం, ఆరోగ్యం, విద్య, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కలిపి భారత్‌లో 2020–21లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సంక్షేమంపై వెచ్చించింది జీడీపీలో 8.8 శాతమే. ఫ్రాన్స్ సంక్షేమ కార్యక్రమాలకు జీడీపీలో ఏకంగా 32 శాతం ఖర్చు పెడుతోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఇది 18 శాతంగా ఉంది. నార్వే, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రియా, డెన్మార్క్, ఇటలీ, బెల్జియం వంటి సంపన్న యూరప్ దేశాలూ జీడీపీలో నాలుగోవంతుకు పైగా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నాయి. బ్రిటన్ కూడా 20 శాతానికి పైగా ఇందుకు వెచ్చిస్తోంది. -కంచర్ల యాదగిరిరెడ్డి -
ఇవి అనుచితం ఏమీ కాదు!
దేశంలో ఉచిత పంపిణీల వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. కేంద్రం కూడా వీటిని కట్టడి చేయాల్సిందేనన్న భావనతో ఉన్నట్లు సుప్రీంకోర్టులో తెలిపింది. దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ కొంచెం ఎక్కువ, తక్కువగా ఈ ఉచిత హామీలు ఇస్తూనే ఉన్నాయి. కొన్ని సఫలం అవుతుంటాయి. కొన్ని విఫలం అవుతుంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రగతికి ఇవి ఉపయోగపడతాయా, లేదా అన్నది కూడా ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది. కానీ దేశంలో పేదరికం పోనంతవరకూ ఇలాంటి హామీలు ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటాయి. మరోవైపు బ్యాంకులకు లక్షల కోట్లు ఎగవేస్తున్న పెద్ద కార్పొరేట్లతో పోల్చితే ఈ ఉచిత హామీలు ఎంత అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఉచిత హామీలపై సుప్రీంకోర్టు విచారణ చేయడం, చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ ఈ సంద ర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. గౌరవ న్యాయస్థానం వారు ఈ ఉచిత పంపిణీల హామీల గురించి ఆందోళన చెందినట్లుగా ఉన్నారు. తరచుగా కోర్టులలో పిల్స్ వేస్తుండే న్యాయ వాది ఒకరు ఈ పిల్ కూడా వేశారు. ఉచిత హామీలను నిలుపుదల చేస్తూ కోర్టువారు ఉత్తర్వులు ఇవ్వాలన్నది ఆ పిటీషన్ సారాంశం. ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌ను కూడా న్యాయమూర్తి సలహా కోరారు. ఇందులో కోర్టుల నిర్ణయం కన్నా, ఆర్థిక సంఘం సలహా తీసుకోవడం మంచిదని ఆయన సూచించారు. కోర్టులలో అప్పుడప్పుడు ఇలాంటివి విచారణకు వస్తుంటాయి. కానీ అవి కూడా నిర్దిష్ట ఉత్తర్వులు ఇవ్వగలవా అన్నది సందేహం. కేంద్రం కూడా ఈ ఉచితాలను కట్టడి చేయాల్సిందేనన్న భావనతో ఉన్నట్లు సుప్రీంకోర్టులో తెలిపింది. దానికి తగ్గట్లుగానే ప్రధాని మోదీ హెచ్చరిక చేశారు. ఉచిత హామీలు అని కోర్టువారు అన్నా, వాటిని పేదల సంక్షేమ కార్యక్రమాలని రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. బహుశా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ట్రెండుకు తెర తీశారని చెప్పాలి. ఆమె ‘గరీబీ హఠావో’ నినాదం ఇచ్చారు. దానికి అనుగుణంగా పలు సబ్సిడీ పథకాలను అమలు చేశారు. దీన్ని పాత కాంగ్రెస్ నేతలు, స్వతంత్ర పార్టీ నేతలు వ్యతిరేకించినా, జన బాహుళ్యం ఇందిరాగాంధీకే జేజేలు పలికింది. ఆ తర్వాత కాలంలో పలు రాష్ట్రాలలో ఇలాంటి స్కీములను అమలు చేశారు. వాటిలో కొన్ని ఆచరణ సాధ్యంకానివి కూడా ఉండవచ్చు. తమిళనాడులో ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత; వారికి పోటీగా కరుణానిధి ఇలాంటి హామీలు ఇవ్వడానికి వెనుకాడలేదు. మిక్సర్లు ,గ్రైండర్లు తదితర ఉపకరణాలు ఇస్తామని వాగ్దానం చేశారు. రుణ మాఫీ హామీలను కూడా ఆయా జాతీయ పార్టీలు, వివిధ ప్రాంతీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక మొదలైన రాష్ట్రాలలో బీజేపీ సైతం రుణమాఫీ హామీలను ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో 1983లో ఎన్.టి.రామారావు కిలో రెండు రూపాయల పథకానికి హామీ ఇచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. అది ఆచరణ సాధ్యం కాదని అన్నవారు చాలామంది ఉన్నారు. కానీ పరిస్థితిని గమనించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తాము 1.90 పైసలకే కిలో బియ్యం ఇస్తామని చెప్పి అమలు చేసింది. కానీ ఆ స్కీము పేటెంట్ ఎన్టీఆర్‌దే అన్న భావన వచ్చి ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. 2014లో టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో లక్ష రూపాయల వరకు రుణ మాఫీని ప్రకటించింది. ఆ తర్వాత అమలు చేయగలి గింది. ఆ సమయంలో కాంగ్రెస్ రెండు లక్షల రూపాయల హామీ ఇచ్చినా, ప్రజలు ఆదరించలేదు. మళ్లీ 2023 ఎన్నికలు రాబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని, అది కూడా ఒకేసారి అమలు చేస్తామని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఈ ప్రకటన చేసి వెళ్లారు. ఇది సాధ్యమా అంటే మామూలుగా అయితే కష్టమే. కానీ తాము వనరులు సమకూర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతారు. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ మళ్లీ రుణమాఫీ వాగ్దానం చేసింది కానీ, పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతోంది. 2014లో ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు రైతుల రుణాలు, చివరికి బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలనూ మాఫీ చేస్తామని భారీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పరిమితులు పెట్టి లక్షన్నర రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అది కూడా అరకొరగా చేసి చేతులు దులుపుకొన్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చింది. వాటిలో అమ్మ ఒడి, చేయూత, ఆసరా, పెన్షన్ల పెంపు, రైతు భరోసా వంటివి ఉన్నాయి. వాటిలో 95 శాతం అమలు చేసిన ఘనతను వైసీపీ సాధించింది. కరోనా సమయంలో జగన్ స్కీములు పేదలకు బాగా ఉపయోగపడ్డాయన్న అభిప్రాయం ఉంది. బీజేపీ రైతులకు ఆరువేల రూపాయల చొప్పున ఉచిత పంపిణీ స్కీమును తెచ్చింది. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. ఆనాటి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగైతే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. కానీ ఆ తర్వాత రోజులలో ఆయనే ఈ హామీని ఇవ్వడం విశేషం. ఆమ్ ఆద్మీ పార్టీ మరో అడుగు ముందుకేసి పంజాబ్‌లో ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్ ఉచితం అని ప్రకటించి విజయం సాధించింది. ఇప్పుడు గుజరాత్లో కూడా అదే హామీ ఇస్తోంది. ఒడిషాలో బీజేడీ సంక్షేమ స్కీములపైనే రెండు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగు తోందన్న అభిప్రాయం ఉంది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని సుప్రీంకోర్టు కంట్రోల్ చేయగలుగుతుందా? ఏపీలో తెలుగుదేశం పార్టీ రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించినప్పుడు కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారు తెలుగుదేశం పార్టీని దీనిపై ప్రశ్నించారు. తాము చేయగలుగుతామని ఆ పార్టీ నేతలు వాదించారు. ఎన్నికల సంఘం టీడీపీని వారించలేకపోయింది. మరి కొన్నిచోట్ల కూడా ఈ హామీలు వచ్చాయి. అలాంటి హామీలు వచ్చిన వెంటనే, సుప్రీంకోర్టు వారు జోక్యం చేసుకోగలిగి, నిరోధించి ఉంటే గొప్ప పేరు వచ్చేదేమో! విశేషం ఏమిటంటే, కరోనా నేపథ్యంలో గౌరవ కోర్టువారే కరోనా వల్ల మరణించిన కుటుంబాల వారికి యాభై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు. మరి అది ఉచితం కింద వస్తుందో, రాదో తెలియదు. కొందరు కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్లు, ఇతర సదుపాయాలు పొందు తున్నారు. ఎన్నికలలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వీరు రిటైరయ్యాక తమకు వచ్చే వేల రూపాయల సదుపాయాన్ని మాత్రం వదులుకోరు. న్యాయ వ్యవస్థ తీరుపై ఈ మధ్య రిటైర్డ్ జిల్లా జడ్జీ మంగారి రాజేందర్ ఒక ఆసక్తికర వ్యాసం రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలకు రిటైరయ్యాక పలు సదుపాయాలు కల్పిస్తున్న తీరును సోదాహరణంగా వివరించారు. వారికి రిటైరయ్యాక ఈ సదుపాయాలు అవసరమా అంటే ఏమి చెబుతాం! నిజంగా వీరిలో ఎవరైనా పేదవారు ఉంటే ఆదుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఏ హామీలు ఇవ్వాలి? ఏవి ఇవ్వరాదన్నదానిపై నియంత్రణ కష్టసాధ్యం. కానీ దేశంలో పేదరికం పోనంతవరకూ ఇలాంటి హామీలు ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటాయి. మరోవైపు బ్యాంకుల నుంచి లక్షల కోట్లు తీసుకుని ఎగవేస్తున్న పెద్ద పెద్ద కార్పొరేట్లతో పోల్చితే ఈ ఉచిత హామీలు ఎంత అన్న ప్రశ్న కూడా వస్తుంది. దేశ న్యాయ వ్యవస్థ ఇలా రుణాలు ఎగవేసిన వారిని కూడా ఏమీ చేయలేకపోతోందన్న భావన ఉంది. రుణాలు ఎగవేసినవారు అధికార పార్టీలో చేరితే వారి జోలికి ఎవరూ వెళ్లడం లేదన్న భావన సామాన్యులలో కలుగుతోంది. ఈ నేప«థ్యంలో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టగలుగుతుందా? పార్లమెంటు ఎలా స్పందిస్తుంది? ఆయా వ్యవస్థలు ఎలా స్పందిస్తాయన్నదానిపైనే ఇవి ఏ రూపుదాల్చుతాయో చెప్పగలం. ప్రజలలో వీటిపై నిర్దిష్ట అవగాహన వచ్చేవరకూ, పేదరికం పోనంతవరకూ ఈ హామీలను ఎవరూ నిరోధించలేకపోవచ్చేమో! - కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఉచితాలకు అడ్డుకట్ట వేద్దాం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు చేసే ఉచిత వాగ్దానాలు తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ‘‘వీటిని వ్యతిరేకించడానికి, పార్లమెంటులో చర్చించడానికి ఏ పార్టీ కూడా ఇష్టపడదు. ఇవి కొనసాగాలనే కోరుకుంటుంది. కాబట్టి ఈ పోకడకు అడ్డుకట్ట వేయడానికి ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, ఆర్బీఐ వంటి సంస్థలు మేధోమథనం చేసి నిర్మాణాత్మక సూచనలివ్వాలి. విపక్షాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి’’ అని సూచించింది. ఉచిత పథకాలను ప్రకటించే పార్టీల గుర్తింపును, వాటి ఎన్నికల గుర్తును రద్దు చేసేందుకు ఎన్నికల సంఘానికి అధికారాలు కల్పించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మానసం బుధవారం విచారణ జరిపింది. ఈ విషయంలో ఏమీ చేయలేమని మాత్రం కేంద్రం, ఎన్నికల సంఘం చెప్పొద్దని, కూలంకషంగా పరిశీలించి సలహాలివ్వాలని స్పష్టం చేసింది. పిల్లో లేవనెత్తిన అంశాలకు కేంద్రం కూడా మద్దతిస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ‘‘ప్రజాకర్షక పథకాలతో ఇష్టారీతిన ఉచితాల పంపకం మున్ముందు ఆర్థిక వినాశనానికి దారి తీస్తుంది. ఉచితాల ద్వారా తన కుడి జేబులోకి కొంత వస్తున్నా తర్వాత్తర్వాత ఎడమ జేబుకు ఎంత కోత పడుతుందో సగటు పౌరుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. కనుక ఓటర్లు తమ ఓటు హక్కును తెలివిడితో ఉపయోగించుకునే వీల్లేకుండా పోతుంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. ఈ అంశం ఈసీ పరిధిలోనిదని ఇప్పటిదాకా కేంద్రం చెబుతూ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశమై కేంద్రానికి సలహాలిచ్చేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలిస్తామని ధర్మాసనం సంకేతాలిచ్చింది. దీనిపై గురువారం కూడా విచారణ కొనసాగనుంది. -
ఉచిత పథకాలు తీవ్రమైన అంశమే
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టేలా ఉచిత పథకాలపై హామీలు ఇవ్వడం చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ అంశంపై ఒక దృఢ వైఖరిని అవలంబించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. హేతుబద్ధత లేని ఉచితాలను కఠినంగా నియంత్రించాలని కోరుతూ బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పార్టీలు ప్రకటించే ఉచితాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఆ తర్వాత ఇలాంటి వాటిని కొనసాగించాలో లేదో తాము నిర్ణయిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఉచిత పథకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేశారు. ఉచితాలను రాష్ట్రాల స్థాయిలోనే నియంత్రించాలని సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. ఉచిత పథకాల అమలు వల్ల రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయని పిటిషనర్ అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.70 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు. ఉచితాలను ప్రకటించే పార్టీల ఎన్నికల గుర్తులను రద్దు చేయాలని, పార్టీల రిజిస్ట్రేషన్‌ను సైతం క్యాన్సల్ చేయాలని కోరారు. మీడియా నిజాయితీ పాటించాలి మీడియా సంస్థలు వ్యాపార ధోరణి వదులుకోవాలని, నిజాయితీగా వ్యవహరించాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ హితవు పలికారు. వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి, పలుకుబడి పెంచుకోవడానికి మీడియాను ఒక సాధనంగా వాడుకోవద్దని సూచించారు. మంగళవారం ఢిల్లీలో గులాబ్‌చంద్ కొఠారీ రచించిన ‘ద గీతా విజ్ఞాన ఉపనిషత్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. మన దేశంలో మీడియా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు గుర్తింపు పొందలేకపోతున్నాయో ఆలోచించుకోవాలన్నారు. -
మీది ఉచిత సలహా అనుకుంటారేమో సార్!
మీది ఉచిత సలహా అనుకుంటారేమో సార్! -
ఉచిత పథకాలు దేశానికి ప్రమాదకరం
జలౌన్: ఉచిత పథకాల ద్వారా ఓట్లు దండుకునే సంస్కృతి దేశం అభివృద్ధికి చాలా ప్రమాదకరమని ప్రధాని మోదీ అన్నారు. ఇటువంటి తాయిలాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన హెచ్చరించారు. యూపీలో రూ.14,850 కోట్లతో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను జలౌన్ జిల్లా కైతెరి గ్రామం వద్ద శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ రహదారితో వాహనాల వేగం మాత్రమే కాదు, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని చెప్పారు. చిత్రకూట్– ఢిల్లీ మధ్య ప్రయాణ కాలం మూడు నుంచి నాలుగు గంటలు తగ్గుతుందని కూడా చెప్పారు. ‘‘మన దేశంలో రేవడీ(ఉత్తర భారతంలో ఒక స్వీట్ పేరు)లు పంచుతూ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవడీలతో ప్రజలను కొనుగోలు చేయవచ్చని అనుకుంటున్నారు. ఈ సంస్కృతి దేశం అభివృద్ధికి ప్రమాదకరం. రేవడీ సంస్కృతితో కొత్త ఎక్స్‌ప్రెస్ వేలు, ఎయిర్‌పోర్టులు, డిఫెన్స్ కారిడార్లు రావు. ఈ సంస్కృతిని దేశ రాజకీయాల నుంచి పారదోలినప్పుడే కొత్త రహదారులు, కొత్త రైలు మార్గాలు నిర్మించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవచ్చు’’అంటూ ఎన్నికల సమయంలో ఉచిత పథకాలను ప్రకటించే రాజకీయ పార్టీలపై పరోక్షంగా విమర్శలు చేశారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు సులువైన రేవడీ సంస్కృతిని వదిలి, రాష్ట్రాభివృద్ధికి తీవ్రంగా పాటుపడుతున్నాయని ప్రధాని చెప్పారు. దేశ అభివృద్ధికి పునాదులు: కేజ్రీవాల్ ఉచిత పథకాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇస్తున్న విద్య, ఆరోగ్యం, విద్యుత్ సౌకర్యాలు ఓట్లు గుంజే తాయిలాలు కావని తెలిపారు. మన దేశం ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలిచేందుకు పునాది వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలని పేర్కొన్నారు. -
ఉచిత పథకాలపై నిర్ణయం ఓటర్లదే
న్యూఢిల్లీ: ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు సంబంధిత పార్టీకి చెందిన విధానపరమైన నిర్ణయాలేనని ఎన్నికల సంఘం(ఈసీ) తెలి యజేసింది. ఆయా పథకాల అమలు సాధ్యాసాధ్యాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పట్ల వాటి ప్రభావంపై సంబంధిత రాష్ట్ర ఓటర్లే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ సమర్పించిం ది. ఎన్నికల్లో గెలిచిన పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు తీసుకొనే నిర్ణయాలు, రాష్ట్రాల విధానాలను తాము నియంత్రించలేమని స్పష్టం చేసింది. చట్టంలో మార్పులు చేయకుండా అలా చేయలేమని ఉద్ఘాటించింది. రాజకీయ పార్టీల నిర్ణయాలు, విధానాల్లో జోక్యం చేసుకుంటే చట్టాన్ని అతిక్రమించినట్లే అవుతుందని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలంటూ 2016 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి 47 ప్రతిపాదనలు చేశామని ఎన్నికల సంఘం వివరించింది. పార్టీల రిజిస్ట్రేషన్, డీ–రిజిస్ట్రేషన్‌ను క్రమబద్ధం చేసేందుకు వీలుగా అవసరమైన ఉత్తర్వులు ఇవ్వాలంటూ కేంద్ర న్యాయ శాఖకు సిఫార్సు చేశామని తెలిపింది. ఓటర్లను మభ్యపెట్టేలా ఉచిత పథకాలను ప్రకటించే పార్టీల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ అశ్వినీకుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఎన్నికల సంఘం అఫిడవిట్‌ను దాఖలు చేసింది.