ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించడం ఆర్థిక వ్యవస్థకు మంచిదా, కాదా అంటూ దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉచిత పథకాలపై ఇటీవలి సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక విశ్లేషకులు ఘాటుగానే స్పందిస్తున్నారు. వాటిని ఎంతసేపూ ఉచితాలుగానే చూడటానికి బదులు సంక్షేమ పథకాలుగానో, లేదా సామాజిక పెట్టుబడిగానో ఎందుకు చూడటం లేదన్నది వారి ప్రశ్న.
ఉచితంగా సైకిళ్లు, టీవీలు, కేబుల్ కనెక్షన్ ఇస్తే వృథా కింద లెక్కించవచ్చేమో గానీ విద్య, ఆరోగ్యం, వైద్యం తదితర రంగాలపై పెట్టే ఖర్చు అంతకంతకూ లాభాలు తెచ్చిపెట్టేదే కదా అన్నది వారి వాదన. ఇది ఒక్కరో, ఇద్దరో కాదు, ఏకంగా ముగ్గురు నోబెల్ గ్రహీతలు చెప్పిన మాట! బడికి వెళ్లేందుకు అయ్యే ఖర్చును తగ్గిస్తే మరింత ఎక్కువ మంది చదువుకోగలుగుతారని ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ప్రఖ్యాత ఆర్థికవేత్తలు అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ డఫెలో స్పష్టం చేశారు.
బడి ఫీజులను తగ్గించడం లేదా తొలగించడం, ఏపీలో అమలు చేస్తున్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితరాల రూపంలో తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలివ్వడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. పలు దేశాల్లో విద్యాపరమైన కార్యక్రమాలను పరిశీలించిన మీదట నిరూపితమైన ఆసక్తికరమైన విషయమిది! బాలల హక్కులపై పోరాడిన నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి పేదరికం, నిరుద్యోగిత సమస్యలను అధిగమించేందుకు విద్య అత్యంత కీలకమని 2015లోనే చెప్పారు.
భారత్‌లో విద్యపై పెడుతున్న పెట్టుబడులు తక్కువగా ఉన్నాయని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రస్తుతం 3 శాతం మాత్రమే విద్యపై వెచ్చిస్తున్నారు. దీన్ని కనీసం రెట్టింపు చేయాల్సిన అవసరముంది’’ అని స్పష్టం చేశారు. పేద పిల్లల విద్యపై ఖర్చు చేసే ప్రతి రూపాయి భవిష్యత్తులో జీఎస్‌డీపీకి కనీసం 2 రూపాయలు జత చేస్తుందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ‘మరీ ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే పేదలు పేదలుగానే మిగిలిపోతారు‘ అంటూ హెచ్చరించారు.
సామాజిక పెట్టుబడి∙
ఉచితం పేరిట ప్రచారంలో ఉన్న పథకాలన్నీ అక్షరాలా ఉచితం కాదు. యూపీలో ఉచిత సైకిళ్లు, తమిళనాడులో కేబుల్ కనెక్షన్ల వంటివాటిని కచ్చితంగా వనరుల వృథాగానే చెప్పాలి. కానీ, విద్య, ఆరోగ్యం, వైద్యం వంటి రంగాలపై పెట్టే ఖర్చు అంతకంతకూ లాభాలు తెచ్చిపెట్టేదే. దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేదే. విద్య, నైపుణ్యాలున్న వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్పాదకతా మెరుగ్గా ఉంటుంది. ఈ రెండూ ఆర్థిక వృద్ధికే తోడ్పడతాయి. అక్షరాస్యత, ఉన్నత విద్య ఉన్న సమాజాల్లో సమస్యలపట్ల అవగాహన, సామాజిక చైతన్యం సహజంగానే ఎక్కువగా, సామాజిక రుగ్మతలు తక్కువగా ఉంటాయి.
అంతర్జాతీయ లెక్కల ప్రకారం చదువుకునేందుకు మెరుగైన అవకాశాలు కల్పించడం, వసతులు ఏర్పాటు చేయడం సామాజిక పెట్టుబడి. వీటిపై వెచ్చించే ప్రతి రూపాయీ కనీసం రెండు రూపాయల దాకా లాభం తెచ్చిపెడుతుందని అంచనా. ‘ఆసుపత్రుల ఆధునీకరణ, సౌకర్యాల పెంపు, కొత్త వైద్య కళాశాల వంటి ఆరోగ్య రంగ పెట్టుబడులు ప్రజల ప్రాణాలు కాపాడటమే గాక కుండా ఆరోగ్య పరిరక్షణ ద్వారా సామాజిక ఉత్పాదకతను పెంచుతాయి. మధ్య వయస్కులకు కళ్లజోడు ఉచితంగా ఇవ్వడం దానం కాదు. చూపు బాగైతే వారు మరింత సమర్థంగా పని చేయగలరు. తద్వారా కుటుంబాలకు మరింత ఆదాయం వీలవుతుంది’ అంటారు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే.
ఒక రాత్రి అక్కడ నిద్ర చేస్తే పేదరికమంటే ఏమిటో తెలుస్తుంది
‘పేదలు, మరీ ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువన కోటానుకోట్ల కుటుంబాలు నివసిస్తున్న భారతదేశంలో ఉచితాలు తప్పనే వారి గురించి ఏం మాటాడతాం? అయితే ఒకమాట. దేశంలో పేదలే లేరని వారు అనుకుంటుంటే గనక ముంబైలోని ధారవి, కోల్‌కతాలోని బసంతి, ఢిల్లీలోని బాల్స్‌వా, చెన్నైలోని నోచికుప్పం మురికివాడల్లో ఒక్క రాత్రి నిద్ర చేయండి‘ అని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను సామాజిక విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
‘ఏది ఉచితం, ఏది కాదన్న విచక్షణ లేకుండా విమర్శకులు అన్నింటినీ ఒకే గాటన కట్టేస్తున్నారు. ఈ రెండింటికీ తేడా అర్థం చేసుకుంటే అసలు విషయం బోధపడుతుంది. పేదరికంలో మగ్గుతున్నవారికి చదువు దూరమైనా, వైద్యం లభించకపోయినా, ఎన్ని వనరులు ఉన్నాయన్న దానితో నిమిత్తం లేకుండా ఆ దేశం పేదరికంలో మగ్గుతున్నట్టే లెక్క‘ అని ఢిల్లీ కేంద్రంగా పేద పిల్లల చదువు కోసం దశాబ్దాలుగా స్వచ్ఛందంగా పని చేస్తున్న ‘అభినవ్ సమాజ్’ చైర్మన్ గోపాలకృష్ణ గుప్తా అన్నారు.
సంపన్న దేశాల్లోనూ ఉచితాలు
బ్రిటన్‌తో పాటు పలు యూరప్ దేశాల్లో ఆహారం కోసం కూపన్లు, విద్య, ఆరోగ్యం వంటి సౌకర్యాలనూ ఉచితంగా అందించడం వంటివి ఇప్పటికీ అమలవుతున్నాయి. భారత్‌లో సంక్షేమ కార్యక్రమాల కోసం చేస్తున్న ఖర్చు సాపేక్షంగా తక్కువగానే ఉంటోంది. బ్రెజిల్ లాంటి దేశాలు వీటిపై స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఏడెనిమిది శాతం వరకూ ఖర్చు చేస్తున్నాయి. వైద్యం, ఆరోగ్యం, విద్య, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కలిపి భారత్‌లో 2020–21లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సంక్షేమంపై వెచ్చించింది జీడీపీలో 8.8 శాతమే. ఫ్రాన్స్ సంక్షేమ కార్యక్రమాలకు జీడీపీలో ఏకంగా 32 శాతం ఖర్చు పెడుతోంది. అగ్రరాజ్యం అమెరికాలోనూ ఇది 18 శాతంగా ఉంది. నార్వే, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రియా, డెన్మార్క్, ఇటలీ, బెల్జియం వంటి సంపన్న యూరప్ దేశాలూ జీడీపీలో నాలుగోవంతుకు పైగా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నాయి. బ్రిటన్ కూడా 20 శాతానికి పైగా ఇందుకు వెచ్చిస్తోంది.
-కంచర్ల యాదగిరిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment