కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నామినేషన్ల సమర్పణ, పరిశీలన, ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. ప్రచారమూ జోరందుకుంది. ఆయా పార్టీల నేతలు ఊరూవాడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల ఉచిత వాగ్దానాలతో పాటు రెబెల్స్ వంటి పలు అంశాలు ఈసారి ఎన్నికలను గట్టిగానే ప్రభావితం చేసేలా కన్పిస్తున్నాయి...
– సాక్షి, బెంగళూరు
వాగ్దానాలు, తాయిలాలు
ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈసారి కూడా పోటాపోటీగా ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 అందిస్తామని కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ తక్షణం ప్రతిస్పందించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు రూ.3,000 ప్రకటించింది. మహిళా వ్యవసాయ కూలీలకు నెలకు రూ.1,000తో పాటు 30 లక్షల మంది మహిళలకు, 8 లక్షల మంది విద్యార్థినులకు ఉచిత బస్ పాస్ హామీలిచ్చింది.
కాంగ్రెసేమో కుటుంబానికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం, పట్టభద్రులకు రూ.3,000 నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని పేర్కొంది. ఇక జేడీ(ఎస్) పేద మహిళలకు నెలకు రూ.2,000 జీవన భృతి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తదితర వాగ్దానాలు చేసింది. తొలిసారి రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న ఆప్ కూడా ఏమీ వెనకబడలేదు. ఉచిత విద్యుత్, తాగునీరు, సాగు రుణ మాఫీ, పట్టణ ప్రాంత మహిళలకు ఉచిత బస్ పాస్ వంటి హామీలిచ్చింది.
పాల ప్యాకెట్లో తుఫాన్
స్థానిక నందిని డెయిరీని దెబ్బతీసేందుకు గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీ వచ్చి పడుతోందన్న ప్రచారం బీజేపీకి తలనొప్పిగా మారింది. దీన్ని అస్త్రంగా మలుచుకున్నాయి. కర్ణాటకలో అమూల్, నందిని కలసి పనిచేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పదేపదే ప్రస్తావిస్తోంది. దీనివల్ల దేశంలో రెండో అతి పెద్ద డెయిరీ సహకార వ్యవస్థ అయిన కర్ణాటక పాల సమాఖ్య మనుగడే ప్రమాదంలో పడుతుందంటూ ప్రచారం చేస్తోంది. దాంతో దిమ్మెరపోయిన బీజేపీ కీలకమైన డెయిరీ రైతుల ఓట్లు చేజారకుండా చూసుకునేందుకు కిందామీదా పడుతోంది.
‘అవినీతి’ పై కాంగ్రెస్ ఆశలు
బొమ్మై ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ప్రధానంగా అస్త్రాలు ఎక్కుపెడుతోంది. 40 శాతం కమిషన్ సర్కారు అంటూ చేస్తు న్న ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయ ని నమ్ముతోంది. ప్రభుత్వ పెద్దలే ప్రతి పనిలోనూ 40 శాతం కమీషన్లు, ముడుపులు తీసుకుంటున్నారంటూ హో రెత్తిస్తోంది. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ అధికారంలో ఉండగా కర్ణాటకను ఆ పార్టీ అధిష్టానం అచ్చం ఏటీఎం మాదిరిగా వాడుకుందంటూ బీజేపీ ఎదురు దాడి చేస్తోంది.
‘కోటా’తో బీజేపీ ఆట
ఎన్నికల వేళ బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడమే గాక బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్‌లు, ఒక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున బ దలాయించింది. ఊహించినట్టే ముస్లింల నుంచి దీనిపై భారీ నిరసన ఎదురైనా ఈ ఎత్తుగడ హిందూ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటితం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పెంచి ఆయా కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతోపాటు హిజాబ్, టిప్పు సుల్తాన్ అంశాలూ ప్రభావం చూపనున్నాయి.
కింగ్(మేకర్) ఆశల్లో జేడీ(ఎస్)
2013లో మినహాయించి గత 20 ఏళ్లలో కన్నడ ఓటరు ఎప్పుడూ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. హోరాహోరి పోరు నేపథ్యంలో ఈసారి కూడా ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. 224 సీట్లలో కాంగ్రెస్ 100కు అటూ ఇటుగా, బీజేపీ 90లోపు, జేడీ(ఎస్) 30 నుంచి 40 గెలుస్తాయని అంచనా. అదే జరిగితే కింగ్‌మేకర్‌గా మరోసారి చక్రం తిప్పాలని జేడీ(ఎస్) ఆశపడుతోంది. పాత మైసూరులోని 89 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 30కి పైగా గెలుస్తామని ధీమాగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెబల్స్ తద్వారా మరిన్ని స్థానాలు తెచ్చిపెడతారని భావిస్తోంది.
గుండెల్లో రె‘బెల్స్’
► బీజేపీ కనీసం 20కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటును ఎదుర్కొంటోంది.
► సీనియర్లకు ఉద్వాసన పలికి కొత్తవారికి, యువతకు చాన్సివ్వాలన్న అధిష్టానం నిర్ణయం కాస్త బెడిసికొట్టినట్టు కన్పిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
► మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదితో పాటు చాలామంది సీనియర్లు టికెట్ రాక పార్టీని వీడారు.
► వారిని కాంగ్రెస్ సాదరంగా ఆహ్వానించి టికెట్లిచ్చింది. ఇది ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో బీజేపీని బాగా దెబ్బ తీస్తుందంటున్నారు.
► రెబెల్స్ దెబ్బకు బీజేపీ ఓటు బ్యాంకుకు చిల్లి పడేలా కన్పిస్తోంది.
► మరీ నామినేషన్ల దాకా ఆగకుండా ఏ మూడు నెలల ముందో సీనియర్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్న భావన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment