karnataka politics
-
కోడిగుడ్లతో బీజేపీ సీనియర్ ఎమ్మెలేపై దాడి
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఆర్ ఆర్ నగర్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడి(Muniratna Naidu)పై కొందరు ఆగంతకులు కోడిగుడ్డు విసిరారు. అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి మునిరత్న బెయిల్ మీద బయటకు వచ్చి రెండు నెలలు అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆయనకు ప్రజల్లోకి వచ్చింది ఇదే తొలిసారికాగా.. ఆ టైంలోనే దాడి జరగడం గమనార్హం.బుధవారం లక్ష్మీ నగర్లో నిర్వహించిన వాజ్‌పేయి(Vajpayee) శతజయంతి ఉత్సవాల్లో మునిరత్న పాల్గొన్నారు. తిరిగి తన అనుచరులతో వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపైకి గుడ్డు విసిరారు. ఆపై మంటతో కాసేపు ఆయన విలవిలలాడిపోయారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆయనకు రకరకాల వైద్య పరీక్షలు జరిపారు. చివరకు ఆయన బాగానే ఉన్నారని ప్రకటించి అర్ధరాత్రి పూట వైద్యులు డిశ్చార్జి చేశారు.ఇదిలా ఉంటే.. మునిరత్న నాయుడు రాజకీయాలతోనే కాదు.. సినిమాలతోనూ పేరు సంపాదించుకున్నారు. ఉపేంద్ర, దర్శన్ లాంటి అగ్ర తారాలతో ఆయన చిత్రాలను నిర్మించారు. 2013, 2018, 2020, 2024 ఎన్నికల్లో రాజరాజేశ్వరి నగర్(RR Nagar) నుంచి ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో కర్ణాటక కేబినెట్ మినిస్టర్‌గానూ పని చేశారు. అయితే.. In a dramatic incident on Wednesday, #BJP MLA #Munirathna was targeted with an egg during an event marking the birth anniversary of former Prime Minister #AtalBihariVajpayee in #Bengaluru's #NandiniLayout.Police have arrested three individuals in connection with the attack and… pic.twitter.com/TWavEBJADq— Hate Detector 🔍 (@HateDetectors) December 25, 2024ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయనపై అనూహ్యమైన ఆరోపణలు వచ్చాయి. సోషల్ వర్కర్‌గా పని చేసే ఓ మహిళ(40) ఫిర్యాదుతో ఈ బీజేపీ ఎమ్మెల్యేపై పలు నేరాల కింద కేసు నమోదయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మూడు రోజులుల్లో ఉండి బయటకు వచ్చారాయన. అయితే బయటకు వచ్చి కొన్నినిమిషాలకే.. అత్యాచారం కేసు(Rape Case)లో ఆయన్ని మరోసారి అరెస్ట్ చేశారు.వాపై నెలరోజులపాటు సెంట్రల్ జైల్లో గడిపిన ఆయనకు.. అక్టోబర్ మూడో వారంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఊరట ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. గుడ్డు దాడిపై రాజకీయం తమ పార్టీ సీనియర్ నేత మునిరత్నపై కోడిగుడ్డు దాడి కాంగ్రెస్ కార్యకర్తల పనేనని బీజేపీ(BJP) ఆరోపిస్తోంది. మునిరత్న మరో అడుగు ముందుకు వేసి.. ఇది తనను చంపేందుకు జరిగిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరికొందరు కాంగ్రెస్ నేతలు ఈ కుట్రలో భాగమయ్యారని అన్నారాయన. అయితే ఘటనపై నందిని లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. -
కుటుంబ రాజకీయాలకు చెక్..!
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్టంలోని మూడు విధానసభ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. బీజేపీ, జేడీఎస్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి ఘోర పరాజయం ఎదురైంది. అయితే ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కుటుంబ రాజకీయాలకు కన్నడిగులు చెక్ పెట్టినట్లు అర్థం అవుతోంది. చెన్నపట్టణ, శిగ్గావి నియోజకవర్గాల్లో కుటుంబ రాజకీయాల నుంచి వచ్చిన అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించారు. ఒక్క సండూరులో మాత్రమే ఈ.తుకారాం సతీమణి అన్నపూర్ణకు గెలుపు వరించింది. బీజేపీ అభ్యర్థి బంగార హనుమంతప్పపై ఈమె గెలిచారు. చెన్నపట్టణలో కేంద్ర మంత్రి, జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, శిగ్గావిలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై ఓటమి పాలయ్యారు. హెచ్డీ కుమారస్వామి, డీసీఎం డీకే శివకుమార్‌ల ప్రతిష్టాత్మక పోటీగా నిలిచిన చెన్నపట్టణ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడం ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటమిని సాధించినట్లు అయింది. ఇక్కడ బీజేపీ నుంచి ఎన్నికల ముందు టికెట్ దక్కక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేత సీపీ యోగేశ్వర విజయం సాధించారు. జేడీఎస్ పార్టీ కంచుకోట అయిన రామనగర జిల్లా నాలుగు నియోజకవర్గాల్లో ఒకటైన చెన్నపట్టణను కోల్పోవడం ఎన్డీఏను తీవ్రంగా నిరాశ పరిచింది. 2023 విధానసభ ఎన్నికల్లోనూ రామనగర నుంచి పోటీ చేసిన నిఖిల్ ఓడిపోయారు. అలాగే 2019 లోకసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి, సీనియర్ నటి సుమలతా అంబరీశ్ చేతిలో కూడా నిఖిల్ పరాజయం పొందారు. తాజాగా చెన్నపట్టణలో కూడా ఓటమి పలకరించింది. హేమాహేమీలు ఇక్కడ నిఖిల్ తరపున ప్రచారం చేపట్టారు. అయినప్పటికీ సత్ఫలితాన్ని పొందలేకపోయారు.భరత్ బొమ్మైకు నిరాశేఅయితే శిగ్గావిలో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకున్న మాజీ సీఎం బసవరాజు బొమ్మై కుమారుడు, బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైకు నిరాశే ఎదురైంది. ఎన్నికల తొలినాళ్లలో తన కుమారుడికి టికెట్ వద్దని చెప్పిన బసవరాజు బొమ్మై ఆ తర్వాత చివరి నిమిషంలో మనసు మా ర్చుకుని టికెట్ ఇప్పించుకున్నారు. ఆలస్యంగా బరిలో దిగడం, ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ఎక్కువమంది ఓటర్లను చేరుకోలేకపోయా రు. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం భరత్‌కు కష్టంగా మారింది. భరత్ ఓటమికి ఇది కూడా ఒక కారణమే. కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్‌ఖాన్ 13వేల ఓట్ల మెజారిటీతో భరత్‌పై గెలిచారు. -
Karnataka: మాజీ మంత్రి శ్రీరాములు కాంగ్రెస్‌లో చేరుతున్నారా?
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బి.శ్రీరాములు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను సోమవారం బెంగళూరులోని ఆయన నివాసంలో కలిశారు. దీంతో శ్రీరాములు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్రను పార్టీ ఇటీవల నియమించింది. దీంతో ఈ పదవిని ఆశించిన శ్రీరాములుకు భంగపాటు ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే శ్రీరాములు తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు డీకే నివాసానికి వెళ్లినట్లు సమాచారం. శ్రీరాములు బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో 2021 ఆగస్టు నుండి 2023 మే వరకు రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2020 అక్టోబర్ నుండి 2021 జూలై వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. శ్రీరాములు ప్రస్తుతం చిత్రదుర్గ జిల్లాలోని బళ్లారి రూరల్ మొలకల్మూరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
Siddaramaiah vs DK Shivakumar: కర్ణాటకలో కుర్చీలాట!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టిలో వర్గపోరు పెరుగుతోంది. ఎవరికి వారు వర్గాలుగా మారి సీఎం కురీ్చపై టార్గెట్ పెట్టారు. ఇందులో ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గం పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో గురువారం హోసపేట నగరంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని వ్యాఖ్యలు చేయడంతో డీకే శివకుమార్ వర్గం నోటిలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. రెండున్నరేళ్ల తర్వాత అధికార మార్పిడితో తాను సీఎం అవుతానని ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్‌కు ఈ వ్యాఖ్యలు మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రిగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య రానున్న ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం వ్యాఖ్యలపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యానాలను రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టిలో ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత తానే సీఎం అనే ఆశలతో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం తాను కేవలం హైకమాండ్ మాట మాత్రమే వింటానని, ఎవరేమి చెప్పినా పట్టించుకోనని తెలిపారు. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ లోలోపల ఎవరి వర్గానికి వారు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై మంత్రి ప్రియాంక్ ఖర్గే శుక్రవారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఎవరిని కొనసాగించాలి, ఎవరికి అడ్డుకట్ట వేయాలనే విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మరో మంత్రి కేఎన్ రాజణ్ణ శుక్రవారం తుమకూరులో మాట్లాడుతూ మాజీ డీప్యూటీ సీఎం, హోం మంత్రి పరమేశ్వరకు కూడా సీఎం అయ్యే అర్హత ఉందని పేర్కొన్నారు. తుమకూరులో హోం మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెప్పారు. అధికార పంపిణీ కేవలం సీఎం, డీసీఎం మధ్యజరిగిన చర్చ అని, అసలు ఢిల్లీలో ఎలాంటి ఒప్పందం జరిగిందనే విషయంపై వారిద్దరికే స్పష్టమైన అవగాహన ఉందని, అలాంటప్పుడు ఇది సత్యం, ఇది అబద్ధమని తానే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అయితే రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాత్రం డీసీఎం డీకే శివకుమార్‌కు మద్దతు పలికారు. పోస్టు ఖాళీగా లేదు కదా! ఖాళీగా లేని ముఖ్యమంత్రి పదవిపై అవసరంగా చర్చ సాగుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ అన్నారు. ఇలాంటి చర్చకు అర్ధం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. సీఎం పోస్టు ఖాళీగా లేదు. ఆ పదవి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే దీనిపై చర్చించాలి. ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల లాభం ఏమిటి?’ అని వ్యాఖ్యానించారు. -
Karnataka: కేసులు మాఫీ.. సీఎం, డిప్యూటీ సీఎంలకు ఊరట
కర్ణాటక: మేకెదాటు పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ సీనియర్లు సిద్దరామయ్య, డీకే శివకుమార్, డీకే.సురేశ్‌లకు ఊరట కల్పిస్తూ, వారిపై నమోదైన కోవిడ్ మార్గదర్శకాల ఉల్లంఘన కేసులు ఎత్తివేయాలని కేబినెట్లో తీర్మానించారు. గతేడాది జనవరిలో మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణం కోరుతూ డీకే ఆధ్వర్యంలో మేకెదాటు నుంచి బెంగళూరుకు పాదయాత్ర నిర్వహించడం తెలిసిందే. ఈ సమయంలో కోవిడ్ థర్డ్ వేవ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. గురువారం విధానసౌధలో మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రి హెచ్‌కే పాటిల్ వివరాలను వెల్లడించారు. రామనగరలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 9 క్రిమినల్ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాదయాత్రలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వందలాది మందితో ర్యాలీలు చేయడంతో బొమ్మై సర్కారు కేసులు నమోదుచేసింది. పలు ముఖ్యమైన తీర్మానాలు.. ► వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎంహెచ్.నాగేశ్, గత జాయింట్ డైరెక్టర్లకు నిధుల దుర్వినియోగం కేసులో సెషన్స్‌కోర్టు 5 ఏళ్లు జైలుశిక్ష విధించడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని తీర్మానం. ► బెంగళూరులో ఏరోస్పేస్ రక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.391 కోట్లకు పాలనాత్మక ఆమోదం. ఇందిరానగర సీవీ.రామన్ ఆసుపత్రి వైద్యురాలు ఎస్డీ.నాగమణి లోకాయుక్తకు పట్టుబడగా తప్పనిసరి రిటైర్మెంటుకు తీర్మానం. రామనగర మహిళా వైద్యురాలు డాక్టర్ ఉషా కదరమండలగికి ఇదే నిర్ణయం. ► హువినహడగలి నియోజకవర్గం విద్యాశాఖాదికారి ఎన్ఎస్. హళ్లిగుడిపై ఆరోపణలు ఉన్నందున సేవల నుంచి సస్పెండ్. ఆస్పత్రులకు నిధులు.. ►బెళగావి మెడికల్ కాలేజీలో 325 పడకల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి రూ.187 కోట్ల మంజూరు ► కరావళి అభివృద్ధి ప్రాధికార పేరును కరావళి ప్రాదేశికాభివృద్ధి మండలి అని పేరు మార్పు ► ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో 20 సంచార ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు. రూ. 47 కోట్లతో ఐదు జిల్లా ఆసుపత్రులైన మైసూరు, చిత్రదుర్గ, సీవీ రామన్నగర, వెన్లాక్ ఆసుపత్రి, కేసీ.జనరల్ ఆసుపత్రుల్లో 15 ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు. కొత్తగా సైబర్ భద్రతా చట్టం ► కర్ణాటక సైబర్ భద్రతా చట్టం 2023 –24 కు అనుమతి. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడి నేపథ్యంలో సైబర్ భద్రతకు చట్టం ఆమోదం● సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో పామాయిల్‌కు బదులుగా సన్ ఫ్లవర్ నూనె పంపిణీ. ► బీబీఎంపీ చట్టాన్ని ఇతర మహానగర పాలికె, నగర సభ, పురసభల్లో అమలుకు పరిశీలన, అలాగే అక్రమ కట్టడాలు, బయలు భూమిపై పన్ను విధింపు పరిశీలనకు మంత్రి వర్గ ఉపసమితి ఏర్పాటు. -
కన్నడ నాట పొత్తు రాజకీయం
శివాజీనగర: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్‌కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై బీజేపీ హైకమాండ్‌తో జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. దీనికి జేడీఎస్‌ను ఆహ్వానించాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది. పిలుపు వస్తే వెళ్లాలని కుమారస్వామి సిద్ధమయ్యారు. అక్కడ చర్చలు ఫలిస్తే లోక్‌సభ ఎన్నికలకు పొత్తు కుదిరే అవకాశముంది. కానీ కుమారస్వామితో పొత్తు పెట్టుకొంటే పాత మైసూరు భాగంలో పార్టీ ప్రభావం తగ్గుతోంది, అంతేకాకుండా ఒక్కలిగుల ఓట్ బ్యాంకును కోల్పోతాము. పొత్తు వద్దని బీజేపీ రాష్ట్ర నాయకులు, అందులోనూ ఒక్కలిగ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇది గ్రహించిన కుమారస్వామి రాష్ట్ర నాయకులను కాదని బీజేపీ కేంద్ర నాయకులతో పొత్తు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. జేడీఎస్‌తో చేతులు కలిపి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుపొందాలని బీజేపీ కూడా ఆశిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రికార్డుస్థాయిలో 20కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈసారి అదే జాదూను పునరావృతం చేయాలనుకుంటోంది. కాగా, బీజేపీ–జేడీఎస్ పొత్తు వార్తలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అవకాశవాద జేడీఎస్ పార్టీ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించింది. జేడీఎస్‌ను చీల్చేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ ఇదిలా ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ మరో ఎత్తుగడలో ఉంది. బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న జేడీఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. సుమారు 12 జేడీఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకు రావటం ద్వారా పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించకుండా చూడాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జేడీఎస్‌కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలా వచ్చే వారికి మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అదనుచూసి జేడీఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని పథకం వేస్తోంది. చర్చలు జరిగాయి: బొమ్మై పొత్తు గురించి బీజేపీ మాజీ సీఎం బస్వరాజ బొమ్మై ఆదివారం స్పందిస్తూ తమ హైకమాండ్, జేడీఎస్ అధినేత దేవేగౌడ మధ్య పొత్తులపై చర్చలు జరిగాయన్నారు. చర్చలు సఫలమైతే రాజకీయ మార్పులు తథ్యమన్నారు. -
ముహూర్తం ఫిక్స్.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరంటే?
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా కానీ, సీఎం ఎవరన్నదానిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయింది. అయితే, ఎట్టకేలకు బుధవారం.. ఉత్కంఠకు తెరపడింది. సిద్ధూకు ఒకే అన్న కాంగ్రెస్ అధిష్టానం.. మరికాసేపట్లో ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. కాగా, ముందుగా ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య.. ఖర్గేతో మంగళవారం ఓ దఫా చర్చలు జరిపారు. నిన్న ఉదయం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఢిల్లీ వెళ్లి ఖర్గేతో సమావేశమై చర్చలు జరిపారు. నిన్న మల్లికార్జున్ ఖర్గే నివాసంలో నిరంతరం సమావేశాలు, చర్చలు జరిగినా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. కాగా, రాహుల్ గాంధీతో సిద్దరామయ్య బుధవారం సమావేశమయ్యారు. అరగంట పాటు రాహుల్‌తో చర్చించారు. సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు మధ్యాహ్ననికి క్లారిటీ రాగా, సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రొటేషన్ సీఎం ఫార్ములాను కాంగ్రెస్ హైకమాండ్ సూచిస్తోంది. డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. రాహుల్‌గాంధీని డీకే శివకుమార్ కూడా కలిశారు. కర్ణాటక సీఎం అభ్యర్థిపై అధిష్టాన నిర్ణయాన్ని డీకేకి రాహుల్ తెలిపారు. చదవండి: కాషాయ పార్టీకి షాకిచ్చిన ఆ ఓటర్లు.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే! రేపు(గురువారం) సాయంత్రం బెంగుళూరులో సీఎల్పీ భేటీ జరగనుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య ఇంటి దగ్గర భద్రత పెంచారు. రేపు ప్రమాణస్వీకారం ఉంటుందని సిద్ధూ అనుచరులు అంటున్నారు. -
Karnataka, assembly elections 2023: మైకులు బంద్
బెంగళూరు: కర్ణాటకలో మైకులు మూగబోయాయి. నెలకు పైగా జోరుగా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. పార్టీలు, అభ్యర్థులు మంగళవారం కేవలం ఇంటింటి ప్రచారానికే పరిమితం కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితరులు నెల రోజులుగా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారును 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా అభివర్ణిస్తూ అవినీతే ప్రధానాంశంగా ప్రజల్లోకి వెళ్లారు. ఇక బీజేపీ పూర్తిగా ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకుంది. అమిత్ షా, నడ్డా వంటి అతిరథులు రంగంలోకి దిగినా ప్రధానంగా మోదీయే సుడిగాలి పర్యటనలు, వరుస సభలు, రోడ్‌షోలతో హోరెత్తించారు. ఎన్నికల షెడ్యూలుకు ముందు నుంచే కర్ణాటకలో పదేపదే పర్యటించిన ఆయన, 10 రోజుల్లో ఏకంగా 19 భారీ బహిరంగ సభలు, ఆరు రోడ్‌షోలతో రాష్ట్రమంతటా చుట్టేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే స్థిరత్వం, అభివృద్ధి సాధ్యమంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 40 శాతం కమీషన్ల సర్కారు విమర్శలకు విరుగుడుగా కాంగ్రెస్ 85 శాతం కమిషన్ల పార్టీ అంటూ ప్రతి దాడికి దిగారు. ఇక ప్రచారం చివరి దశలో బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని బీజేపీ రెండు చేతులా అందిపుచ్చుకుంది. ఆ పార్టీని హిందూ వ్యతిరేకిగా చిత్రించేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. బీజేపీ జాతీయ నేతలు మొత్తం 206 సభలు, 90 రోడ్‌షోలు, రాష్ట్ర నేతలు 231 బహిరంగ సభలు, 48 రోడ్ షోలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నేతలంతా కలిసి 99 బహిరంగ సభలు, 33 రోడ్‌షోలు జరిపారు. విషసర్పం, పనికిమాలిన కుమారుడు, విషకన్య తదితర వ్యక్తిగత విమర్శలు ఈసారి కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో హైలైట్‌గా నిలిచాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలనాథులు, ఎలాగైనా గెలిచి విశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ప్రయత్నించాయి. ఈసారి ఎలాగైనా పూర్తి మెజారిటీ సాధనే లక్ష్యంగా రెండు పార్టీలూ పరిశ్రమించాయి. జేడీ(ఎస్) నేతలు కూడా నిప్పులు చెరిగే ఎండల్లో చెమటలు కక్కారు. ఇప్పుడిక బుధవారం జరగబోయే కీలకమైన పోలింగ్ మీదే అందరి దృష్టీ నెలకొంది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఫలితాలు 13వ తేదీన వెలువడనున్నాయి. రూ.375 కోట్లు జప్తు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డబ్బు కట్టలు తెంచుకుని పారింది. మార్చి 29 నుంచి ఏకంగా రూ.375.6 కోట్ల మేరకు నగదు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. ఇందులో రూ.147 కోట్లు నగదు, రూ.84 కోట్ల విలువైన మద్యం, రూ.97 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ.24 కోట్ల విలువైన కానుకలు, రూ.24 కోట్ల డ్రగ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఏకంగా 2,896 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. మార్చి 29కి ముందు కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న రూ.58 కోట్ల విలువైన నగదు తదితరాలు దొరికాయి. -
కన్నడనాట తెలుగువాడి వేడి.. వలస ఏ పార్టీకో! ఆరు రాష్ట్రాలతో సరిహద్దులు
సాక్షి బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో ఒక పార్టీ విజయం సాధించాలంటే కన్నడిగుల ఓట్లు మాత్రం పడితే చాలనుకుంటే పొరపాటు పడ్డట్లే..! దశాబ్దాలుగా కన్నడ నాట ఇరుగు పొరుగు రాష్ట్రాల ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరే ఇతర రాష్ట్రానికి లేని విదంగా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక ఏకంగా ఆరు రాష్ట్రాలతో సరిహద్దుల్ని పంచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలతో సరిహద్దులున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వలసలు ఎక్కువే. బెంగుళూరు వంటి మహానగరంలో వ్యాపారాలు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారెందరో ఉన్నారు. రాష్ట్రంలో 65.45 లక్షల మందివరకు వలసదారులు ఉన్నారు. వీరి ఓట్ల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఈ సారి ఎన్నికల బరిలో కూడా ఎందరో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలుగు మూలాలున్న వారు 100 మంది, మరాఠా మూలాలున్న వారు 50 మందికి పైగా, తమిళులు 10 మంది వరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బెంగళూరులో ఎవరి జనాభా ఎంత? ► రాజధానిలో 44 శాతం కన్నడిగులు ఉంటే 56 శాతం ఇతర భాషా ప్రజలు ఉన్నారు. తెలుగు వారు అత్యధికంగా 25–30 లక్షల మంది ఉన్నారు. ► తమిళులు 16–17 లక్షల మంది ఉంటే మళయాలీలు 4–5 లక్షలు ఉన్నారు ► ఇక ఉత్తరాది రాష్ట్రాల జనాభా 11–12% ఉన్నారు.రాజస్తాన్, బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో జార్ఖండ్, త్రిపుర నుంచి కూడా వలసలు పెరిగాయి. ► రాజస్తాన్‌కు చెందిన జైన సామాజికవర్గం ప్రజలు బెంగళూరులో చాలా చోట్ల నివసిస్తూ ఎన్నికల్లో నిర్ణయాకత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. తెలుగు వాడి వేడి కర్ణాటకలో దాదాపుగా 40–50 అసెంబ్లీ స్థానాల్లో తెలుగువారి ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్రంలో సుమారు కోటి మంది వరకు తెలుగు ప్రజలు కర్ణాటకలో నివసిస్తున్నట్లు అనధికారిక సమాచారం. పలు దశాబ్దాలుగా వివిధ కారణాలతో కర్ణాటకకు వచ్చి ఇక్కడి కన్నడిగులతో మిళితమై తెలుగు వారు జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడిపోయారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వహిస్తున్న వారిలో అధిక భాగం తెలుగు ప్రాంత ప్రజలే కావడం గమనార్హం. ఒక్క బెంగళూరులోనే సుమారు 25 లక్షలకు పైగా తెలుగు వారు ఉన్నారు. కర్ణాటకలో కన్నడ, ఉర్దూ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉంది. బెంగళూరులోని కేఆర్ పురం, రామ్మూర్తినగర, హెబ్బాళ, మారతహళ్లి, మహదేవపుర, యలహంకా, దేవనహళ్లితో పాటు ఏపీ, తెలంగాణ సరిహద్దు కలిగిన బళ్లారి జిల్లా, బీదర్, కలబురిగి, రాయచూరు, యాదగిరి, బసవకల్యాణ, కోలార, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర జిల్లాల్లో తెలుగు వారు అధికంగా ఉన్నారు. 1947లో ఏర్పడిన మైసూరు రాష్ట్రానికి తెలుగు వ్యక్తి క్యాసంబల్లి చెంగరాయరెడ్డి ఎన్నికయ్యారు. 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడ్డాక ఎందరో తెలుగువారు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఓట్ల కోసం వ్యూహాలు కర్ణాటకకు పొట్ట చేతపట్టుకొని వచ్చిన వలసదారులు గుర్తింపు సమస్యని అధికంగా ఎదుర్కొంటున్నారు. 65 లక్షల మంది వలసదారుల్లో ఎంత మందికి కర్ణాటకలో ఓటు హక్కు ఉందో అన్న దానిపై స్పష్టమైన గణాంకాలేవీ లేవు. కార్మికులుగా పని చేస్తున్న వారికి తాగు నీరు, ఉండడానికి ఇల్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటివన్నీ సమస్యలుగానే ఉన్నాయి. టీ, కాఫీ తోటల్లో పని చేస్తున్న కూలీలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. అధికార బీజేపీ వీరిని సంప్రదిస్తూ రేషన్ కార్డులు ఇప్పించడం, ప్రభుత్వం పథకాలు వారికి అందేలా చూస్తామని హామీలు ఇస్తోంది. వలసదారుల ఓట్లను రాబట్టేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన యువ ఎమ్మెల్యేలు, ఎంపీలను రంగంలోకి దింపింది. గుజరాత్‌కు చెందిన హార్దిక్ పటేల్ సహా వివిధ రాష్ట్రాల యువ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ భాషలకు చెందిన వారి ఓట్లను రాబట్టేందుకు ఆయా రాష్ట్రాల నాయకుల్ని ప్రచార పర్వంలోకి తీసుకువచ్చింది. -
Karnataka assembly elections 2023:ఎవరిదో రాజధాని!
రాష్ట్రాన్ని గెలవాలంటే ముందు రాజధానిని గెలవాలి. కర్ణాటకలో అధికారిక పీఠానికి తాళాలు బెంగళూరులోనే ఉన్నాయి. బీజేపీకీ, కాంగ్రెస్‌కూ ఈ విషయం బాగా తెలుసు. దాంతో ఈసారి అధికార విపక్షాల మధ్య సిలికాన్ సిటీలో సంకుల సమరం సాగుతోంది. సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని గడచిన పలు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. అందుకే బెంగళూరు పరిధిలోని 28 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు నెగ్గి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తీరు తెన్నులు.. ► 2008లో బెంగళూరులో బీజేపీ 17, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలవగా జేడీ(ఎస్) ఒక్క స్థానానికి పరిమితమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి దక్షిణ భారతంలో తొలిసారి ఆ ఘనత సాధించింది. ► 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 12, జేడీ(ఎస్) 3 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య తొలిసారి సీఎం అయ్యారు. ► 2018లో కాంగ్రెస్15, బీజేపీ 11, జేడీ(ఎస్) 2 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ సర్కారు బలపరీక్షలో ఓడి 14 నెలలకే కుప్పకూలింది. ► 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్) సభ్యులు బీజేపీకి ఫిరాయించడంతో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. బీజేపీ ఏకంగా 12 సీట్లు నెగ్గింది. అలా బెంగళూరులో బీజేపీ బలం 15కు పెరగగా కాంగ్రెస్ 11 స్థానాలకు పడిపోయింది. బీజేపీ అధికారాన్ని స్థిరపరచుకుంది. వేధిస్తున్న తక్కువ ఓటింగ్ బెంగళూరులో ప్రతిసారీ తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండడం పరిపాటిగా వస్తోంది. 2013, 2018 ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పడిపోయింది. సగానికి సగం, అంటే నియోజకవర్గాల్లో మరీ తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. బెంగళూరు వాసులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరన్న అపప్రథా ఉంది. దీన్ని ఈసారైనా తొలగించుకుంటారా అన్నది చూడాలి. ► 2013 ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో కేవలం 55.04% ఓటింగ్ నమోదైంది. 2018లో అది కాస్తా 48.03 శాతానికి తగ్గింది. ► దాంతో ఈసారి ఎలాగైనా రాజధానిలో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి పెట్టింది. కొద్ది రోజులుగా ప్రత్యేక ర్యాలీలు, వాకథాన్‌లు, ప్రచారాలు చేపడుతోంది. తటస్థ ఓటర్లే కీలకం ► ట్రాఫిక్ సమస్య, మౌలిక వసతుల లేమి వంటి పలు సమస్యలు బెంగళూరును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారన్నది నగరవాసుల ప్రధాన ఆరోపణ. ► ఇక్కడ 15 నుంచి 20 శాతం ఓటర్లు కులమతాలకు అతీతంగా తటస్థంగా ఉంటారు. ► వీరిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ► బీజేపీ అవినీతి, పాలన వైఫల్యాలు, కుంభకోణాలను ప్రచారం చేస్తూ నగర వాసులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. శాంతినగర, సర్వజ్ఞ నగర వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. ► ఇక తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారానికి దిగారు. ► కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో నగరంలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. -
ఆదర్శనేత సురేశ్ గౌడ
తుమకూరు: సురేష్ గౌడ్ ఒక ఆదర్శవంతమైన నేత అని, మోసంతో గతంలో ఓడిపోయారని, ఈసారి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పిలుపునిచ్చారు. తుమకూరు గ్రామీణ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ సురేశ్ గౌడ వంటి ఎమ్మెల్యే ఇంకొకరు దొరకరని, ఎంతో ప్రామాణికంగా పని చేశారని కొనియాడారు. ఈసారి మాత్రం కచ్చితంగా చట్టసభకు సురేశ్ గౌడను పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మళ్లీ బీజేపీదే అధికారం శివాజీనగర: విధానసభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో మళ్లీ అధికారం చేపడుతుందని బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీ.సీ.మోహన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సోమవారం సర్వజ్ఞన నగర బీజేపీ అభ్యర్థి పద్మనాభరెడ్డికి మద్దతుగా బాణసవాడి, సేవానగర తదితర ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించి ప్రచారం చేపట్టి ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వ సాధనాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులే తమ పార్టీ అభ్యర్థులు గెలుపునకు అవకాశమన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కే.జే.జార్జ్‌కు పోటీగా బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి పద్మనాభరెడ్డిని గెలిపించాలన్నారు. -
Karnataka assembly election 2023: రాజకీయాల్లో నటీనటులు
సాక్షి, ఎన్నికల డెస్క్: దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయాలకు– సినీ తారలకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. తమిళనాడు, ఏపీ, కర్ణాటక ఏది చూసినా సినిమాలు– రాజకీయాలు పెనవేసుకుని కనిపిస్తాయి. కొంతకాలంగా కన్నడ చిత్రసీమ శాండల్‌వుడ్ నుంచి సినీనటులు రాజకీయ రంగంపై చాలా మంది ఆసక్తి చూపించారు. అయితే ఈ విధానసభ ఎన్నికల్లో ఎందుకనో ఎక్కువమంది తారలు చురుగ్గా పాల్గొనడం లేదు. ఒకరో ఇద్దరో బరిలో ఉండగా, తక్కువమంది మాత్రమే నేతలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రముఖులు కొందరే ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో సినీ నటీనటులు ఓ మోస్తరుగానే ఉన్నారు. ఎన్నికల బరిలో ప్రముఖ నటులు కూడా లేకపోవడం విశేషం. రాజకీయ నేతలు ఎవరూ కూడా సినీ తారలకు రెడ్ కార్పెడ్ పరిచినట్లు లేదు. జేడీఎస్ తరఫున రామనగర నుంచి వర్ధమాన నటుడు నిఖిల్ పోటీలో ఉన్నారు. బీజేపీకి, సీఎం బొమ్మైకి మద్దతుగా నటుడు కిచ్చా సుదీప్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారానికి పరిమితం అయ్యారు. మరో ప్రముఖ నటుడు దర్శన్దీ అదే తీరు. కేజీఎఫ్ హీరో యశ్ ఎన్నికల ఛాయలకే రాలేదు. గతంలో ప్రజాకీయ పార్టీని పెట్టిన ఉపేంద్ర మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు. కాంగ్రెస్ లీడర్ రమ్య ఎక్కడ? అందాల నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్యస్పందన తారాజువ్వలా ఎగిశారు. ఆమె తల్లి రజిత కాంగ్రెస్‌లో చురుగ్గా పని చేశారు. నటి రమ్య 2012లో కాంగ్రెస్‌లో చేరి మండ్య ఉప ఎన్నికలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో మరోసారి మండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో ఉన్నప్పటికీ కన్నడనాట ప్రచారానికి దూరంగానే ఉండడం చర్చనీయాంశమైంది. అంబరీశ్దే అగ్రస్థానం కన్నడ రెబల్‌స్టార్ 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తర్వాత జనతాదళ్‌లో (1996 – 99) చేరి మండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు. తిరిగి సొంతగూటికి చేరుకుని మరోసారి పార్లమెంటుకు ఎన్నికై కేంద్రమంతి అయ్యారు. అంబరీశ్ సతీమణి సుమలత 2019లో మండ్య నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆమె తరఫున నటులు దర్శన్, యశ్ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే. రాజకీయాల్లో నటీనటులు ► పోలీసు అధికారిగా పని చేసిన బీసీ పాటిల్ తర్వాత సినీ రంగం వైపు దృష్టి సారించారు. వెండితెరపై రాణిస్తూనే రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖమంత్రిగా కొనసాగుతున్నారు. ► తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన సాయికుమార్ చిక్కబళ్లాపుర బాగేపల్లి నుంచి బీజేపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా అదృష్టం కలిసిరాలేదు. ఆపై రాజకీయాల వైపు చూడలేదు. ► జస్ట్ ఆస్కింగ్ అంటూ 2018 ఎన్నికల్లో కన్నడనాట ఆకర్షించిన వైవిధ్య నటుడు ప్రకాష్‌రాజ్ ఈ ఎన్నికల్లో కనిపించనేలేదు. ఏ పార్టీకి మద్దతుగా గళమెత్తలేదు. గతంలో ఆయన ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ► రెండు దశాబ్దాల పాటు వెండితెరపై వెలిగిన తార శృతి. బీజేపీలో మహిళా విభాగం నేతగా కొనసాగుతున్నారు. ► సుమారు 300 చిత్రాల్లో నటించిన అనంత్‌నాగ్ ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. తర్వాత రాజకీయాల్లో చేరి జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయ్యారు. మళ్లీ చురుకై న పాత్ర పోషించలేదు. ► కన్నడ చిత్రాల్లో సహాయక నటిగా రాణించిన ఉమాశ్రీ హాస్యం పండించి ఆకట్టుకునేది. 2013లో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పని చేశారు. ► సినిమాల్లో సహాయక నటిగా రాణించిన తార అనురాధ బీజేపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్‌గా వ్యవహరించారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. -
Karnataka assembly election 2023: వారికి మతి పోయింది
సాక్షి, బళ్లారి: ప్రధాని మోదీ విషసర్పమన్న ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి, వారి నేతలకు మతి భ్రమించిందనేందుకు రుజువని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. శుక్రవారం కర్ణాటకలో గదగ్, ధార్వాడ జిల్లాల్లో ఆయన పలు సభలో మాట్లాడారు. ‘‘మోదీని విషసర్పంతో పోల్చడం ఆ పార్టీ ఎంతగా దిగజారిందనేందుకు రుజువు. వారెంతగా విమర్శిస్తే అంతగా ఆయనకు ప్రజల్లో మద్దతు పెరుగుతుంది’’ అన్నారు. ‘తీవ్రవాద భావజాల పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను నిషేధించినందుకు నాపై కేసు పెట్టారు. పీఎఫ్ఐను కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుంది. దానిపై నిషేధం తర్వాత కర్ణాటక సురక్షితంగా ఉంది’’ అన్నారు. ‘‘సీఎం తానంటే తానని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్య వాదులాడుకుంటున్నారు. అవసరం లేదు. సీఎం బీజేపీ వ్యక్తే అవుతారు. కన్నడ ఓటర్లు బీజేపీనే గెలిపిస్తారు. ఓటర్ల నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ వాగ్దానాలను ఎవరు విశ్వసిస్తారు?. కొన్ని విషయాల్లో మాత్రం కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీని ఖచ్చితంగా నమ్మవచ్చు. అవి.. అబద్దాలు, అవినీతి, కులతత్వం, వంశపాలన, బుజ్జగింపు రాజకీయాలు’ అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. -
Karnataka assembly elections 2023: కొన్ని పార్టీలకు రాజకీయాలంటే అవినీతి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. వారికి దిశానిర్దేశం చేశారు. కర్ణాటకలో ఓటర్లకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ వారంటీ ఎప్పుడో ముగిసిపోయిందని, ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలకు అర్థంపర్థం లేదని ఎద్దేవా చేశారు. ఉచిత పథకాలపై మోదీ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రాలు దివాలా తీయడం ఖాయమని చెప్పారు. భవిష్యత్తు తరాలకు దక్కాల్సిన ప్రయోజనాలను ఈ ఉచిత పథకాలు మింగేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితాల సంస్కృతికి తెరపడాలని మోదీ స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు కోరుతా.. ‘మన దేశంలో రాజకీయాలు అంటే అర్థం అధికారం, అవినీతిగా కొన్ని పార్టీలు మార్చేశాయి. అధికారం కోసం ఆయా పార్టీలు సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నాయి. దేశ భవిష్యత్తు గురించి, కర్ణాటకలోని యువత, మహిళల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు’అని మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు బీజేపీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఈ నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల వల్ల దక్కే లాభాలను బూత్‌స్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేస్తానని చెప్పారు. ఒక కార్యకర్తగా కర్ణాటక ప్రజల వద్దకు వెళ్లి, వారి ఆశీస్సులు కోరుతానని వివరించారు. ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ షార్ట్‌కట్‌లను తాము నమ్ముకోవడం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆత్యాధునిక భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నామని గుర్తుచేశారు. ఎఫ్‌డీఐ అంటే తమకు ‘ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్’ కాదని, ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ అని వివరించారు. ఐదేళ్ల పాలనా కాలం గురించి యోచించడం లేదని, దేశం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ కాదు, దేశమే తమకు ముఖ్యమని చెప్పారు. -
Karnataka assembly elections 2023: ‘కల్యాణం’ఎవరికో?
కల్యాణ (హైదరాబాద్) కర్ణాటక. కన్నడ సీమలో అత్యంత వెనకబడ్డ మెట్ట ప్రాంతం. దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు 100కు పైగా స్థానాలు ఒడిసిపట్టినా మెజారిటీ మార్కును దాటలేకపోవడానికి ఈ ప్రాంతంలో పట్టు లేకపోవడమే ప్రధాన కారణం. దాంతో ఈసారి రెండు పార్టీలకూ కల్యాణ కర్ణాటక కీలకంగా మారింది. పట్టు కొనసాగించాలని కాంగ్రెస్, కోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని బీజేపీ పట్టుదలగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ ఐదు స్థానాలకు మించి గెలవని జేడీ(ఎస్) ఈసారి బీజేపీ, కాంగ్రెస్ రెబెల్స్‌ను బరిలో దించి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది... ‘హైదరాబాద్ రాష్ట్రం’లో భాగమే ► కల్యాణ కర్ణాటక ఒకప్పటి హైదరాబాద్ రాజ్యంలో భాగంగా నిజాంల ఏలుబడిలో కొనసాగింది. ఇటీవలి దాకా కూడా ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ కర్ణాటకగానే పిలిచేవారు. ► ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, లింగాయత్, ముస్లింలు అధిక సంఖ్యాకులు. 50 శాతానికి పైగా ఉండే ఈ వెనుకబడిన వర్గాలే ఇక్కడ నిర్ణాయక శక్తి. ► వీరేంద్ర పాటిల్, ధరంసింగ్ రూపంలో ఇద్దరు సీఎంలను అందించినా ఈ ప్రాంతం అత్యంత వెనకబాటుతనానికి మారుపేరు. ► దేశంలోనే రెండో అతి పెద్ద మెట్ట ప్రాంతంగా పేరొందింది. దాంతో వెనకబాటుతనం ఇక్కడ ప్రతిసారీ ఎన్నికల అంశంగా మారుతుంటుంది. ► ఈసారి కూడా పార్టీలన్నీ అభివృద్ధి నినాదాన్నే జపిస్తున్నాయి. ► అతివృష్టితో ఇక్కడ 90 శాతం పంటనష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం హెక్టార్‌కు రూ.10 వేల పరిహారం ప్రకటించినా అదింకా అందలేదు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చంటున్నారు. ► ఆర్టికల్ 371(జే) ప్రకారం విద్య, ఉద్యోగాల్లో ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఉన్నా ఒరిగిందేమీ లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ► దాంతో కొన్నేళ్లుగా ప్రత్యేక కల్యాణ రాష్ట్ర డిమాండ్ ఊపందుకుంటోంది! ఖర్గే ఖిల్లా మల్లికార్జున ఖర్గే కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకుడే. కాంగ్రెస్ సారథిగా ఈసారి ఇక్కడ పార్టీకి అత్యధిక స్థానాలు సాధించి పెట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఖర్గే కుమారుడు, చిత్తాపుర ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ఇక్కడ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. ► బీదర్, కలబురిగి, యాద్గిర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలతో కూడిన కల్యాణ కర్ణాటకలో 40 స్థానాలున్నాయి. ► గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించుకుని సత్తా చాటింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 21 సీట్లు రాగా బీజేపీ 15, జేడీ(ఎస్) 4 గెలిచాయి. అయితే 2013తో పోలిస్తే కాంగ్రెస్‌కు 2 సీట్లు తగ్గగా బీజేపీకి 9 పెరిగాయి! ► ఈ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు అధికార బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్, అభివృద్ధి కార్యక్రమాలనే బీజేపీ ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. మోదీపై ఆశలు పెట్టుకుంది. ► కల్యాణ కర్ణాటక ఉత్సవం, బీదర్ ఉత్సవం వంటివాటితో స్థానికుల మనసు దోచుకునే ప్రయత్నాలు చేసింది. ► కల్యాణ కర్ణాటక ప్రాంతీయాభివృద్ధి మండలికి వార్షిక కేటాయింపులను రూ. 1,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచింది. ► ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఓటమిని రుచి చూపిన స్ఫూర్తితో కల్యాణ కర్ణాటకలో పూర్తిగా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ► జేడీఎస్ గత మూడు ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ ఐదు సీట్లకు మించి నెగ్గలేదు. ఈసారి తమ పంచరత్న యాత్ర విజయవంతం కావడం, కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు జేడీ(ఎస్)లో చేరడంతో మంచి ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. ► ఈసారి కల్యాణ కర్ణాటక నుంచి బరిలో దిగిన గాలి జనార్ధన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (కేఆర్పీపీ) మూడు ప్రధాన పార్టీల అవకాశాలను తారుమారు చేసే అవకాశముంది. ► లింగాయత్‌లు ఎక్కువగా ఉన్నందున వారికి 2 శాతం అదనపు రిజర్వేషన్ల నిర్ణయం కలిసొస్తుందని ఆశ పడుతోంది. కానీ 40 శాతం కమీషన్లు, నియామక అక్రమాలు, రెబెల్స్ వంటివి బీజేపీకి ప్రతికూలంగా మారాయి. – సాక్షి, బెంగళూరు -
Karnataka assembly elections 2023: వాగ్దానాల నుంచి కోటా దాకా... కీలకాంశాలివే...!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నామినేషన్ల సమర్పణ, పరిశీలన, ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. ప్రచారమూ జోరందుకుంది. ఆయా పార్టీల నేతలు ఊరూవాడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల ఉచిత వాగ్దానాలతో పాటు రెబెల్స్ వంటి పలు అంశాలు ఈసారి ఎన్నికలను గట్టిగానే ప్రభావితం చేసేలా కన్పిస్తున్నాయి... – సాక్షి, బెంగళూరు వాగ్దానాలు, తాయిలాలు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈసారి కూడా పోటాపోటీగా ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 అందిస్తామని కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ తక్షణం ప్రతిస్పందించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు రూ.3,000 ప్రకటించింది. మహిళా వ్యవసాయ కూలీలకు నెలకు రూ.1,000తో పాటు 30 లక్షల మంది మహిళలకు, 8 లక్షల మంది విద్యార్థినులకు ఉచిత బస్ పాస్ హామీలిచ్చింది. కాంగ్రెసేమో కుటుంబానికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం, పట్టభద్రులకు రూ.3,000 నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని పేర్కొంది. ఇక జేడీ(ఎస్) పేద మహిళలకు నెలకు రూ.2,000 జీవన భృతి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తదితర వాగ్దానాలు చేసింది. తొలిసారి రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న ఆప్ కూడా ఏమీ వెనకబడలేదు. ఉచిత విద్యుత్, తాగునీరు, సాగు రుణ మాఫీ, పట్టణ ప్రాంత మహిళలకు ఉచిత బస్ పాస్ వంటి హామీలిచ్చింది. పాల ప్యాకెట్లో తుఫాన్ స్థానిక నందిని డెయిరీని దెబ్బతీసేందుకు గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీ వచ్చి పడుతోందన్న ప్రచారం బీజేపీకి తలనొప్పిగా మారింది. దీన్ని అస్త్రంగా మలుచుకున్నాయి. కర్ణాటకలో అమూల్, నందిని కలసి పనిచేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పదేపదే ప్రస్తావిస్తోంది. దీనివల్ల దేశంలో రెండో అతి పెద్ద డెయిరీ సహకార వ్యవస్థ అయిన కర్ణాటక పాల సమాఖ్య మనుగడే ప్రమాదంలో పడుతుందంటూ ప్రచారం చేస్తోంది. దాంతో దిమ్మెరపోయిన బీజేపీ కీలకమైన డెయిరీ రైతుల ఓట్లు చేజారకుండా చూసుకునేందుకు కిందామీదా పడుతోంది. ‘అవినీతి’ పై కాంగ్రెస్ ఆశలు బొమ్మై ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ప్రధానంగా అస్త్రాలు ఎక్కుపెడుతోంది. 40 శాతం కమిషన్ సర్కారు అంటూ చేస్తు న్న ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయ ని నమ్ముతోంది. ప్రభుత్వ పెద్దలే ప్రతి పనిలోనూ 40 శాతం కమీషన్లు, ముడుపులు తీసుకుంటున్నారంటూ హో రెత్తిస్తోంది. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ అధికారంలో ఉండగా కర్ణాటకను ఆ పార్టీ అధిష్టానం అచ్చం ఏటీఎం మాదిరిగా వాడుకుందంటూ బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. ‘కోటా’తో బీజేపీ ఆట ఎన్నికల వేళ బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడమే గాక బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్‌లు, ఒక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున బ దలాయించింది. ఊహించినట్టే ముస్లింల నుంచి దీనిపై భారీ నిరసన ఎదురైనా ఈ ఎత్తుగడ హిందూ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటితం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పెంచి ఆయా కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతోపాటు హిజాబ్, టిప్పు సుల్తాన్ అంశాలూ ప్రభావం చూపనున్నాయి. కింగ్(మేకర్) ఆశల్లో జేడీ(ఎస్) 2013లో మినహాయించి గత 20 ఏళ్లలో కన్నడ ఓటరు ఎప్పుడూ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. హోరాహోరి పోరు నేపథ్యంలో ఈసారి కూడా ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. 224 సీట్లలో కాంగ్రెస్ 100కు అటూ ఇటుగా, బీజేపీ 90లోపు, జేడీ(ఎస్) 30 నుంచి 40 గెలుస్తాయని అంచనా. అదే జరిగితే కింగ్‌మేకర్‌గా మరోసారి చక్రం తిప్పాలని జేడీ(ఎస్) ఆశపడుతోంది. పాత మైసూరులోని 89 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 30కి పైగా గెలుస్తామని ధీమాగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెబల్స్ తద్వారా మరిన్ని స్థానాలు తెచ్చిపెడతారని భావిస్తోంది. గుండెల్లో రె‘బెల్స్’ ► బీజేపీ కనీసం 20కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ► సీనియర్లకు ఉద్వాసన పలికి కొత్తవారికి, యువతకు చాన్సివ్వాలన్న అధిష్టానం నిర్ణయం కాస్త బెడిసికొట్టినట్టు కన్పిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ► మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదితో పాటు చాలామంది సీనియర్లు టికెట్ రాక పార్టీని వీడారు. ► వారిని కాంగ్రెస్ సాదరంగా ఆహ్వానించి టికెట్లిచ్చింది. ఇది ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో బీజేపీని బాగా దెబ్బ తీస్తుందంటున్నారు. ► రెబెల్స్ దెబ్బకు బీజేపీ ఓటు బ్యాంకుకు చిల్లి పడేలా కన్పిస్తోంది. ► మరీ నామినేషన్ల దాకా ఆగకుండా ఏ మూడు నెలల ముందో సీనియర్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్న భావన వ్యక్తమవుతోంది. -
Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో మాదే విజయం
సాక్షి, బళ్లారి/విజయపుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించబోతున్నామని, 224 స్థానాలకు గాను 150 స్థానాలు కచ్చితంగా గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని విజయపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శివాజీ సర్కిల్ నుంచి కనకదాస సర్కిల్ వరకూ జరిగిన భారీ రోడ్డు అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘40 పర్సెంట్ బీజేపీ సర్కారు’కు ఈ ఎన్నికల్లో 40 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నాయకులు 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవణ్ణ బోధనల గురించి మాట్లాడుతున్నారు గానీ వాటిని ఏమాత్రం ఆచరించడం లేదని రాహుల్ ఆక్షేపించారు. బసవేశ్వరుడికి రాహుల్ నివాళులు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట జిల్లాలోని కూడల సంగమంలోని బసవణ్ణ సమాధిని దర్శించుకున్నారు. నివాళులర్పించారు. కూడల సంగమంలో సంగమనాథ దేవాలయాన్ని దర్శించుకుని విశేష పూజలు చేశారు. నుదుటిన విభూతి ధరించారు. విశ్వగురు బసవణ్ణ సమసమాజ స్థాపన కోసం కృషి పడ్డారని, ఆనాడే చట్టసభ ద్వారా అన్ని వర్గాల ప్రజలను అందలమెక్కించాలని తపనపడ్డారని రాహుల్ కొనియాడారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి బసవణ్ణ చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురించి కాంగ్రెస్ నేతలతో రాహుల్ చర్చించారు. హుబ్లీకి వెళ్లి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌తో మాట్లాడారు. -
మా నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్ర
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్‌ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. -
ఆ 84 సీట్లు కీలకం.. గతంలో 56 బీజేపీకే.. మరి ఇప్పుడు.. స్వింగ్ ఎటో?
కిత్తూరు కర్ణాటకలో (గతంలో ముంబై కర్ణాటక) రాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ ఉంది. 1957 సంవత్సరం నుంచి రాన్ నియోజకవర్గం ప్రజలు అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థినే ఎన్నుకుంటూ వస్తున్నారు. ఒకే పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించే సంప్రదాయం ఇక్కడ లేదు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇలా ఓటరు తీర్పు తిరగరాసే నియోజకవర్గాలు రాన్తో సహా 84 ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా పనిచేస్తుందని, అందుకే ఏ పార్టీ కూడా రెండోసారి గెలవడం కష్టంగా మారిందని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎ. నారాయణ అభిప్రాయపడ్డారు. 2018 : స్వింగ్ స్థానాల్లో బీజేపీ స్వీప్ ► లింగాయత్‌లకు గట్టి పట్టున్న ముంబై కర్ణాటక ప్రాంతంలో 19 స్వింగ్ సీట్లున్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలన్నింటిలోనూ విజయం సాధించింది ► సెంట్రల్ కర్ణాటకలో 20 స్వింగ్ సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లింగాయత్, వొక్కలిగలు పట్టుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 16 స్థానాల్లో నెగ్గింది. ► బీజేపీకి కంచుకోటగా భావించే కోస్తా కర్ణాటకలో అత్యధిక స్థానాలు స్వింగ్ సీట్లుగా పేరొందాయి. ఈ ప్రాంతంలో 19 స్థానాలకు గానే 10 స్వింగ్ సీట్లుగా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో అన్ని స్వింగ్ స్థానాలను బీజేపీ స్వీప్ చేసింది. 20% మంది ముస్లిం జనాభా ఉన్న ఈ ప్రాంతంలో విభజన రాజకీయాలే కీలకం. ► హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 12 స్వింగ్ సీట్లు బీజేపీ ౖMðవశం చేసుకుంది. రాష్ట్రంలో ఈ ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంది. ► దక్షిణ కర్ణాటకలో మొత్తం స్థానాలు 46 కాగా అందులో స్వింగ్ సీట్లు 14 ఉన్నాయి. వొక్కలిగల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో జేడీ (ఎస్) సగం స్వింగ్ స్థానాలైన ఏడింటిలో విజయం సాధించింది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ► బెంగళూరు నగరంలో రెండు స్వింగ్ సీట్లు బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి. స్వింగ్ స్థానాల్లో పట్టుకు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు లింగాయత్‌లకు పట్టున్న స్థానాలు, మత విభజన రాజకీయాలకు కేంద్రమైన కోస్తా కర్ణాటకలో 2018 ఎన్నికల్లో బీజేపీ స్వింగ్ స్థానాలన్నింటినీ స్వీప్ చేసింది. మొత్తం 84 స్వింగ్ స్థానాలకు గాను బీజేపీ ఖాతాలో 56 ఉన్నాయి. దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఈ స్థానాల్లో బీజేపీ నెగ్గే అవకాశాలు లేవు. అందుకే బీజేపీ ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచి ఈ స్థానాలపై దృష్టి సారించింది. వీటిలో 30 స్థానాల్లో లింగాయత్‌లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. లింగాయత్‌లు బీజేపీ వైపు నిలుస్తూ ఉండడంతో ఆ స్థానాలు తిరిగి నిలబెట్టుకోగలమన్న కమలదళం ధీమాగా ఉంది. అధికార వ్యతిరేకత, బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, ముస్లింలకు 4 శాతం కోటాలో కోత, పెరిగిపోతున్న ధరలు వంటివన్నీ బీజేపీకి మైనస్‌గా మారాయి. వీటన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో కప్పిపుచ్చే వ్యూహాలు రచిస్తోంది. అంతే కాకుండా చాలా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. తద్వారా అధికార వ్యతిరేకతను అధిగమించవచ్చునని వ్యూహరచన చేసింది. అయితే మోదీ ఇమేజ్ అసెంబ్లీ ఎన్నికలకు పని చేసే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో ఎంతో ఆకర్షణ ఉన్నప్పటికీ ఆయనను స్థానికుడిగా చూడలేరు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఇమేజ్ పని చేస్తుందే తప్ప శాసనసభ ఎన్నికల్లో పని చేసే అవకాశం లేదు’’ అని ఎన్నికల విశ్లేషకుడు చేతన్ చౌహాన్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాల్లో పాగా వెయ్యడానికి పకడ్బందీ వ్యూహాలనే రచించింది. స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ రాకతో లింగాయత్ ఓటు బ్యాంకును కొంతవరకైనా కొల్లగొట్టవచ్చునన్న ఆశగా ఉంది. ఇక బసవరాజ్ బొమ్మై అవినీతి, ముస్లిం కోటా రద్దుని ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. సిద్దరామయ్య, డి.కె.శివకుమార్ వంటి బలమైన నాయకులు ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత పోరు ఆ పార్టీకి మైనస్‌గా మారింది. ఫలితంగా ఈ 84 సీట్లలోనూ హోరాహోరీ పోరు నెలకొంది. ఇక 224 స్థానాలకు గాను 60 సీట్లు సేఫ్ సీట్లుగా ఉన్నాయి. గత మూడు ఎన్నికల్లో వరుసగా ఒకే పార్టీ గెలుస్తూ వచ్చింది. ఈ సేఫ్ సీట్లు కాంగ్రెస్‌కి 27, బీజేపీకి 23, జేడీ(ఎస్)కి 10 ఉన్నాయి. ఈ సీట్లను కాపాడుకోవడానికి కూడా రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రసకందాయంలో కర్నాటకం.. పార్టీలు చిన్నవి.. ప్రభావం పెద్దది
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరిగిపోతోంది. ఎన్నికల బరిలో ఉన్న పదుల సంఖ్యలో చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని చీలుస్తాయన్న చర్చ మొదలైంది. చిన్న పార్టీలకు సొంతంగా విజయం సాధించే బలం లేకపోయినప్పటికీ జయాపజయాలను మార్చే సత్తా కలిగి ఉన్నాయి. ఇంతకీ ఈ చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని కొల్లగొడతాయి? ప్రధాన పార్టీల్లో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? కర్ణాటక ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. రాజకీయ పార్టీల ప్రచార హోరు తీవ్రతరమైంది. గత ఎన్నికల్లో కీలక స్థానాల్లో 3 వేల లోపు మెజార్టీయే లభించడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో చిన్న పార్టీలు, ఎన్నికల బరిలో దిగిన కొత్త పార్టీలు ప్రధానపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గత ఎన్నికల్లో బెంగుళూరులోని 18 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు ఆప్ పరిస్థితి వేరు. ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండడంతోపాటు జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. కర్ణాటక ఓటరు మొదట్నుంచి ప్రాంతీయ పార్టీల కంటే, జాతీయ పార్టీలవైపు మొగ్గు చూపిస్తున్నాడు. కేజ్రివాల్ ఢిల్లీ మోడల్ పాలన పట్ల యువత, మహిళల్లో విపరీతమైన ఆకర్షణ ఉంది. అందుకే ఈ సారి ఆప్‌ను కూడా ప్రధాన పార్టీలు ముప్పుగానే పరిగణిస్తున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా పనిచేసే సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు కోస్తా కర్ణాటకలో గట్టి పట్టుంది. అధికార వ్యతిరేకతకు చిన్న పార్టీలతో చెక్! కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. 40% కమీషన్ల సీఎంగా పేరు పడడం, యడ్డీయూరప్ప స్థానంలో వచ్చి ఆ స్థాయిలో ప్రతిభ కనబరచలేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, హిందూత్వ కార్డుతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీ చిన్న పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తమ విజయావకాశాలను పెంచుతాయని ఆశల పల్లకిలో విహరిస్తోంది. గుజరాత్, యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, బీఎస్పీ కాంగ్రెస్ ఓటు బ్యాంకునే చీల్చడంతో బీజేపీ ఘన విజయం సాధించింది. కర్ణాటకలో కూడా అదే పునరావృతమై బహుముఖ పోటీ జరుగుతుందని, అది బీజేపీకి లాభం చేకూరుస్తుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అక్కడ ప్రజలు జాతీయ పార్టీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. లేదంటే అతి పెద్ద ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులు కలిపి 6% వరకు మాత్రమే ఓట్లను సంపాదించాయి. పార్టీ అనుసరించే సిద్ధాంతాలే ముఖ్యమైనవని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అవినీతిని అంతమొందిస్తామంటూ రొటీన్ హామీలిస్తే ప్రజల నుంచి స్పందన కరువై చిన్న పార్టీలు మనుగడ సాధించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో మొదటిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేఆర్ఎస్ పార్టీ మాత్రం తాము ప్రజల మద్దతుతోనే ఎన్నికల బరిలో దిగామని చెబుతోంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 40 వేల మంది ఆర్థిక సాయం చేసి పార్టీలో సభ్యులుగా చేరారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ రెడ్డి తెలిపారు. 50 స్థానాల్లో ప్రభావం కర్ణాటకలో చిన్న పార్టీలు ఏకంగా 50 సీట్లలో ప్రభావం చూపించనున్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ), కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్ఎస్), నటుడు ఉపేంద్రకు చెందిన ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)లతో పాటు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం గట్టి ప్రభావాన్ని చూపిస్తాయనే అంచనాలున్నాయి. 69 గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలు బరిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో 30 స్థానాల్లో 5 వేల కంటే తక్కువ మెజార్టీ రావడం, చిన్న పార్టీల సంఖ్య బాగా పెరిగిపోవడంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్తా ఓటరండీ! ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం.. మాట వినే ప్రసక్తే లేదు
బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్సటీలో విద్యార్థిని ఎంజే గుణ. కొద్ది రోజుల క్రితమే ఆమెకు 18 ఏళ్లు నిండాయి. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే చాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు తమ నాయకుడ్ని ఎన్నుకునే రోజు వస్తుందాని ఆమె ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆమె ఉద్దేశంలో నాయకుడంటే బాగా చదువుకుని, దార్శినికుడై ఉండాలి. ‘‘నేను ఓటు వేసే ముందు ఏ పార్టీ అని కూడా చూడను. మా నియోజకవర్గానికి అభ్యర్థి ఏం చేస్తాడన్నదే ముఖ్యం. ఆ తర్వాత అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్, విద్యార్హతలు, గతంలో చేసిన పని, భవిష్యత్‌లో ఏం చేయగలడు వంటివన్నీ చూశాకే ఓటేస్తా’’అని ఆమె కచ్చితంగా చెప్పింది. సునీత అనే మరొక ఫస్ట్ టైమ్ ఓటరు సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే సామర్థ్యం మనకున్నప్పుడే రాష్ట్రం, దేశం సరైన మార్గంలో వెళతాయని చెప్పుకొచ్చింది. వీరి మాటలు వింటే సంప్రదాయంగా రాజకీయ వ్యూహాలు రచిస్తూ, తాయిలాల ఆశ చూపిస్తూ వెళ్లే పార్టీల వైపు వీరు చూసే చాన్సే లేదు. కొత్తగా ఓటు హక్కు పొందడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం. తల్లిదండ్రులు చెప్పారనో, స్నేహితులు సిఫారసు చేశారనో ఎవరికి పడితే వారికి నేటి తరం ఓటు వెయ్యరు. సొంతంగా ఆలోచించి తమకు నచ్చిన అభ్యర్థికి తొలిసారి ఓటు వేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు. ఓటు వెయ్యడంలో ఉదాసీనత మచ్చుకైనా లేదు. ఉరిమే ఉత్సాహంతో చూపుడు వేలి మీద సిరా గుర్తు చూపిస్తూ ఫొటోలు దిగి ఓట్ల పండుగను సంబరంగా చేసుకుంటున్నారు. కర్ణాటకలో మెజార్టీ మార్కు దాటడానికి అత్యంత కీలకమైన కొత్త ఓటర్ల మదిలో ఏముంది ? గత ఎన్నికల్లో... మొదటి సారి ఓటు వేసే వారిలో కొత్త ఉత్సాహం, ఓటు వెయ్యాలన్న తపన ఎక్కువ ఉంటుంది. వారు తప్పనిసరిగా ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు కదిలి వెళతారు. గత 3 ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు ఓటు వేసే విధానాన్ని విశ్లేషిస్తే వారి నాడి పట్టుకోవడం కష్టమనే అభిప్రాయం కలుగుతుంది. సీఎస్డీఎస్–లోక్‌నీతి పోస్ట్ పోల్ సర్వే కొత్త ఓటరు అండదండ లేనిదే ఏ పార్టీ కూడా మెజార్టీ మార్క్ సాధించలేదు. కొత్త ఓటరు ఎటుంటే.. కర్ణాటకలో ఈ సారి 11 లక్షల మంది కొత్త ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 7.7 లక్షలుంటే ఈ సారి వారి సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ప్రతీ సారి ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కొత్త ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. మనీ, మద్యం కంటే అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి, చెడులను తామే విశ్లేషించుకునే శక్తి సామర్థ్యాలున్నవారు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు. పార్టీలు వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలైతే చేస్తున్నాయి. కర్ణాటకలో ఏదైనా పార్టీ మెజార్టీ మార్కు దాటాలంటే కొత్త ఓటర్లు అత్యత కీలకమని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. పార్టీల కొత్త పంథా..! మేము ఏం చేస్తాం అన్నది కాదు.. మీకేం కావాలన్నదే ముఖ్యం అని కొత్త ఓటర్ల మనసులో ఏముందో పార్టీలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ‘‘సెలబ్రేట్ యువర్ ఓటు’’అనే ప్రచారాన్ని ప్రారంభించింది. 18–23 మధ్య వయసున్న వారే లక్ష్యంగా చేసుకొని వారికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలను అరికట్టడం, అందరికీ ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్నివ్వడం ప్రస్తుతం యువత ఆశిస్తుందని తెలుసుకొని ఆ దిశగా వ్యూహాలు పన్నుతోంది. దాంతో పాటు నిరుద్యోగులు తల్లిదండ్రులకి భారంగా మారకుండా రెండేళ్ల పాటు నెలకి రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ యువ సంవాద్ కార్యక్రమం ద్వారా కొత్త ఓటర్ల ఆశలు, ఆకాంక్షల్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది.కొత్త ఓటర్లను దృష్టిలో ఉంచుకునే బీజేపీ సిట్టింగ్‌లను కాదని అత్యధికంగా 60 మంది కొత్త ముఖాలకు టికెట్లిచ్చింది. జేడీ(ఎస్) పంచరత్న రథయాత్రలో యువతకే అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కుమారస్వామి ప్రచారంలో యువతతోనే మాట్లాడుతూ వారి నాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఓటర్లు తమ వైపేనని ధీమాతో ఉంది. ఢిల్లీ, పంజాబ్‌లో యువ ఓటర్లను అధికంగా ఆకర్షించిన ఆప్ ఈసారి ఉన్నత విద్య అభ్యసించిన వారికే ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చింది. 2008: ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్కుకి కేవలం మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సగటు ఓటు షేరు కంటే కొత్త ఓటరు వేసిన ఓట్ల వాటా (మొత్తం పోలయిన కొత్త ఓటర్ల ఓట్లలో) ఎక్కువగా ఉంది. కొత్త ఓటర్ల ఓటు షేర్ మూడు శాతం ఎక్కువగా ఉంది. 2013: అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు కాంగ్రెస్ వైపు స్వల్పంగా మొగ్గు చూపించారు. ఆ పార్టీకి వచ్చిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్లు కాంగ్రెస్‌కు వేసిన ఓటు షేరు ఒక్క శాతం అధికంగా ఉంది. హస్తం పార్టీ గద్దెనెక్కింది. 2018: బీజేపీ మెజార్టీ మార్కుకి 9 సీట్ల దూరంలో ఉండిపోయింది. దీనికి కారణం కొత్త ఓటర్లేనని సీఎస్డీఎస్–లోక్‌నీతి గణాంకాల్లో తేలింది. బీజేపీకి పోలయిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్ల షేరు ఆరు శాతం తక్కువగా ఉంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 2013, 2018 ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీకి సగటు ఓటు షేర్ కంటే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఓటు షేర్ నాలుగు శాతం అధికంగా ఉంది. దీంతో పట్టణ యువత జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారని తేలుతోంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం
మన దేశంలో ఎన్నికలంటేనే కులం చుట్టూ తిరుగుతుంటాయి. అందులోనూ కర్ణాటక రాజకీయాల్లో కులాలు, మతాల పాత్ర మరీ ఎక్కువ. లింగాయత్, వొక్కలిగ, ఓబీసీ, ముస్లిం వర్గాలు నాలుగు స్తంభాలుగా ఎన్నికల ఫలితాలను శాసిస్తూ వస్తున్నాయి. అందుకే మరోసారి వారి మనసు చూరగొనేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి... కర్ణాటకలో త్రిముఖ పోరు నేపథ్యంలో కులాలవారీగా ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జేడీ(ఎస్) మాత్రం ప్రధానంగా రాష్ట్ర జనాభాల్లో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15% ఓటర్లున్న వొక్కలిగ ఓటు బ్యాంకునే నమ్ముకుంది. 59 అసెంబ్లీ స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగలు ఇప్పటికీ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను ఎంతగానో ఆరాధిస్తారు. ఆ ఓటు బ్యాంకును చీల్చే లక్ష్యంతో ఎన్నికల ముందు నుంచే కోటా రాజకీయాలకు బీజేపీ తెర తీసింది. దాంతో దాన్ని ఎలాగైనా కాపాడుకునే పనిలో జేడీ(ఎస్) తలమునకలుగా ఉంది. కోటాతో రాజకీయ ఆట అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే అధికార బీజేపీ అన్ని సామాజిక వర్గాల ఓట్లూ రాబట్టేలా వ్యూహాలు పన్నడం మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు సాధించినా మెజారిటీ మాత్రం అందలేదు. పాత మైసూరులోని 59 సీట్లలో ఆరు మాత్రమే దక్కడం అందుకు ప్రధాన కారణం. దాంతో ఈసారి సరిగ్గా ఎన్నికల వేళ ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకోవడమే గాక వాటిని బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ఈ నిర్ణయం పాత మైసూరు ప్రాంతంలో తమ భాగ్యరేఖలను కాస్త మెరుగు పరుస్తుందని ఆశ పడుతోంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి పెంచడమే గాక అంతర్గత కోటాను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాలను లింగాయత్‌లు, దళితుల్లో ఒక వర్గం ఆహ్వానించినా ముస్లింలు భగ్గుమంటున్నారు. బంజారాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్గత రిజర్వేషన్లతో తమకు మరింత అన్యాయం జరుగుతుందన్న భయం వారిలో ఉంది. పాత మైసూరులో బీజేపీ ఏకంగా 41 మంది వొక్కలిగలకు టికెట్లిచ్చింది! వీరు వ్యవసాయం మీద ఆధారపడ్డవారే కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు బాగా జనంలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ పాత మైసూరులో పర్యటిస్తున్నారు. హింద్ వర్సెస్ అహిందా లింగాయత్, బ్రాహ్మణుల ఓట్లతో పాటుగా హిందూత్వ ఓటు బ్యాంకునే బీజేపీ బాగా నమ్ముకుంది. హిందూత్వ, దేశభక్తి, అభివృద్ధి నినాదాలతో ఓట్లు రాబట్టజూస్తోంది. బాహుబలిగా పేరొందిన లింగాయత్ నేత బి.ఎస్.యడియూరప్పనే ముందుంచి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తోంది. 51 మంది లింగాయత్‌లకు టికెట్లిచ్చింది. కానీ బలమైన లింగాయత్ నేతలైన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీలో తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను కనీసం 25 సీట్లలో బీజేపీ అవకాశాలకు గండి కొడతానన్న శెట్టర్ హెచ్చరికలను వారు గుర్తు చేస్తున్నారు. ఓబీసీలు ఎటువైపో...! వీరశైవ లింగాయత్‌లలో బీజేపీ ఓట్లలో 2 నుంచి 3% తమకు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హిందూత్వకు పోటీగా అహిందా (ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ) నినాదంతో ఓట్లు కొల్లగొట్టే పనిలో పడింది. ఓబీసీల్లో ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న బిల్వాస్, మొగవీరాస్, విశ్వకర్మ, కొలిస్‌లు కొన్నేళ్లుగా బీజేపీ వైపు తిరిగారు. ఈసారి లింగాయత్, వొక్కలిగలు ఏ ఒక్క పార్టీకీ పూర్తిస్థాయిలో మద్దతునిచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయాల నడుమ ఈ ఓబీసీల ఓటు బ్యాంకే కీలకంగా మారింది. వారి ఓటుబ్యాంకును ఈసారి బీజేపీ నిలబెట్టుకోని పక్షంలో దానికి కాంగ్రెస్ నుంచి గట్టి ముప్పు పొంచి ఉన్నట్టే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్ణాటకలో మళ్లీ ముఖ్యమంత్రి మార్పు?
బెంగళూరు: 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ, ప్రభుత్వంలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని కర్ణాటక బీజేపీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్పులు ఉండబోతున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు మాజీ ఎమ్మెల్యే బీ సురేశ్ గౌడ. ముఖ్యమంత్రి మార్పు సహా ఇతర అంశాలపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే.. మార్పు ఉంటుందా? ఉండదా అనే అంశంపై స్పష్టత లేదన్నారు. కానీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. ‘రాష్ట్రంలో ఏదైనా మార్పు జరిగితే అది ఆగస్టు 15లోపే జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ మార్పులు ఉండబోతున్నాయి. 2023లో రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావటం, 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావటమే లక్ష్యం. ఏ సమయంలోనైనా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు.’ అని పేర్కొన్నారు గౌడ. మరోవైపు.. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంచి పనితీరు కనబరుస్తున్నారని తెలిపారు. ఏడాది పదవీ కాలంలో చాలా మంచి పనులు చేశారని, అయితే.. పార్ట ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అనుసరిస్తామన్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ముఖ్యమంత్రులను మార్చే ఆనవాయితీ బీజేపీలో కొనసాగుతోందన్నారు తుమకూరు రూరల్ మాజీ ఎమ్మెల్యే. అయితే, ఆ నిర్ణయం కేంద్ర నాయకత్వం చేతిలో ఉంటుందన్నారు. ఇటీవల రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన అనంతరం బీజేపీలో ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీలో ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఈ మార్పులు ఉండబోతున్నాయని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరోవైపు..కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభ కరండ్లేజ్ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందా? అని అడగగా.. అది మీడియా క్రియేషన్‌గా పేర్కొన్నారు గౌడ. ఇదీ చదవండి: CM Nitish Kumar: నితీశ్‌లో ఎందుకీ అసంతృప్తి? -
బీజేపీకి షాకివ్వనున్న యడియూరప్ప? బల నిరూపణకు సై
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తర్వాత పరిస్థితులు చక్కబడతాయనుకుంటే ఏం మారలేదని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు తమ శాఖలపై అసహనంతో ఉన్నారు. అప్రాధాన్య శాఖలు ఇచ్చారని సీనియర్ నాయకులు అసంతృప్తిలో ఉండగా.. మరికొందరు సీఎం బసవరాజు బొమ్మైకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే పదవి నుంచి అకారణంగా పంపించి వేసిన వైనంపై మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తనతో బలవంతంగా రాజీనామా చేయించిన పార్టీ తీరుపై మండిపడుతున్నారు. వాటితోపాటు కొత్త ప్రభుత్వంలో తన కుమారుడికి, అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన బలం చూపించేందుకు యడియూరప్ప సిద్ధమయ్యారని కర్ణాటకలో వార్తలు వస్తున్నాయి. పదవి నుంచి దిగిన అనంతరం కొన్నాళ్లు ఎవరితో మాట్లాడకుండా ఉన్న యడియూరప్ప వారం కిందట మాల్దీవులుకు వెళ్లి వచ్చారు. రావడంతోనే మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా మారుతాననే సంకేతాలు పంపారు. ఈ క్రమంలోనే శివమొగ్గలో పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప యడియూరప్పను కలిశారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయేంద్రకు సహకరించనున్నట్లు సమాచారం. త్వరలోనే కుమారుడితో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టే ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కుమారుడికి బలం చేకూర్చాలని యడ్డియూరప్ప లక్ష్యమని పార్టీలోని ఓ నాయకుడు చెప్పారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు: అలా పెళ్లి.. ఇలా విడాకులు) అయితే సోమవారం పార్టీ కర్ణాటక ఇన్చార్జి అరుణ్‌సింగ్ మూడు రోజుల పర్యటనకు మైసూర్ చేరుకున్నారు. పార్టీలో ఇంకా సద్దుమణగని విబేధాలు, లుకలుకలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి మార్పు తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. ఈ క్రమంలోనే యడియూరప్ప తన బలం చూపించాలని భావిస్తున్నారట. ఈ సందర్భంగా తన అనుచరులకు ఈ మేరకు ఆదేశాలు పంపారంట. త్వరలోనే తన మద్దతుదారులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించుకుని ఎన్నికలకు వెళ్లనున్నారని ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది. తనకు తన వర్గానికి అప్రాధాన్యం ఇవ్వడంపై యడియూరప్ప వర్గం ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. త్వరలోనే యడియూరప్ప వర్గం పార్టీలోనే ఉంటూనే తమ బలం నిరూపించుకునే మార్గాలు అన్వేషిస్తోంది. తనే బీజేపీకి పెద్ద దిక్కు అనిపించేలా యడ్డి వర్గం కార్యాచరణ ఉండనుందని సమాచారం. జూలై 26వ తేదీన ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయగా జూలై 28న బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో -
ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తిట్ల పురాణం
తుమకూరు(కర్ణాటక): రైతులకు అబద్ధపు హామీలు ఇచ్చుకుంటూ వారిని మాయ చేస్తున్నారని బీజేపీ ఎంపీ బసవరాజుపై జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ విమర్శలు చేయగా, ఎంపీ సైతం వాగ్బాణాలు సంధించడంతో పరిస్థితి వేడెక్కింది. గుబ్బి తాలూకా చేళూరు హోబళి సి.నందిహళ్లిలో కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం అధికారులతో ఎంపీ వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ సమయంలో రైతుల కోసం నీటి ప్రాజెక్టు కట్టడానికి కేంద్రం రూ. 500 కోట్లు విడుదల చేసిందని ఎంపీ చెప్పారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ కలుగజేసుకుని అసత్య హామీలు, మాటలు చెప్పొద్దంటూ ఎంపీపై గట్టిగా మాట్లాడారు. ఎంపీ కూడా ఎమ్మెల్యేకు ఘాటుగా హెచ్చరికలు చేయడంతో అధికారులు, నేతలు నచ్చజెప్పి పంపించారు. కాగా, ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తిట్ల పురాణంతో సభ వేడెక్కింది. -
ఇమేజ్ కాపాడుకునే పనిలో యడియూరప్ప
సాక్షి బెంగళూరు: ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేసిన బీఎస్ యడియూరప్ప అధికారంలో లేకున్నప్పటికీ తన ఇమేజ్ను, తన ప్రాభవాన్ని కాపాడుకునే పనిలో పడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును కొనసాగించేందుకు కొత్త ప్లాన్‌ను అమలు చేయనున్నారు. సీఎంగా రాజీనామా చేసినప్పటికీ మంత్రిమండలిలో తన అనుంగు అనుచరులను చేర్చేందుకు శ్రమిస్తున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేందుకు రాష్ట్ర పర్యటన చేపట్టాలని నిర్ణయించారు. 1983 నుంచి 2021 వరకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో విరామం ఎరుగకుండా శ్రమించిన యడియూరప్ప దక్షిణాదిన తొలిసారిగా కర్ణాటకలో బీజేపీ అధికారం చేపట్టడంలో ముఖ్యభూమిక పోషించారు. 78 ఏళ్ల యడ్డి జూలై 26న సీఎంగా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకొని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 75 ఏళ్లు పైబడిన వారికి కీలక పదవులు ఇవ్వకూడదనే నియమాన్ని మోదీ హయాంలో పాటిస్తున్నప్పటికీ... యడియూరప్పకు మాత్రం మినహాయింపునిచ్చి రెండేళ్లు సీఎంగా కొనసాగడానికి అవకాశం ఇవ్వడం ఆయన బలాన్ని, అవసరాన్ని తెలియజేసింది. ఇప్పటికీ యడ్డినే పవర్ఫుల్.. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై బాధ్యతలు చేపట్టినప్పటికీ యడియూరప్పనే పవర్ సెంటర్‌గా మారారు. పార్టీలో ఇప్పటికీ యడియూరప్ప తన పట్టును కొనసాగిస్తున్నారు. ఇదే పట్టు, బలాన్ని వచ్చే అసెంబ్లీ, లోకసభ ఎన్నికల వరకు కొనసాగించాలని తీర్మానించుకున్నారు. గవర్నగిరీ వద్దని, రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటానని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. తాలూకాల యాత్రకు ప్లాన్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించి తీరుతానని యడ్డి ఇటీవల చెప్పడం గమనార్హం. వారానికో తాలూకాకు వెళ్లిని పార్టీని బలోపేతం చేసి తద్వారా తనకు వయసు పైబడిన, అధికారం ఇవ్వకపోయినా రాజకీయంగా శక్తివంతుడినని హైకమాండ్‌కు తెలిసేలా చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసమే గవర్నర్ పదవిని సైతం యడియూరప్ప తిరస్కరించినట్లు సమాచారం. తన ఇద్దరు కుమారులు విజయేంద్ర (బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు), రాఘవేంద్రలను రాజకీయంగా మంచి స్థాయిలో నిలబెట్టాలంటే ప్రజల్లో తిరుగుతూ తిరిగి తన శక్తిని అధిష్టానానికి తెలియజేయాలని భావించినట్లు తెలిసింది. వారి రాజకీయ భవిష్యత్తుకు మంచి పునాది వేయడం వంటి లక్ష్యాలు ఆయన ముందున్నాయి. -
కర్ణాటకం కోసం బీజేపీ కసరత్తు
కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి బసవ రాజ బొమ్మైతో పాటు బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. బసవరాజ్ పేరుకు ముఖ్యమంత్రి అయినా కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆయన కున్న అధికారం తక్కువ. పార్టీ ఢిల్లీ పెద్దలే మంత్రుల ఎంపికలో కీలకపాత్ర వహిస్తారు. ఈ పరిస్థితిని నిశి తంగా పరిశీలించిన వారికి ఇందిర హయాంలో కాంగ్రెస్ రాజకీయాలు గుర్తుకురాక మానవు. కర్ణాటకలో కొత్త తరం నాయకులను ప్రోత్సహిం చాలని బీజేపీ హైకమాండ్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హిందూత్వ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, కనీసం మూడు దఫాలు ఎమ్మె ల్యేగా ఎన్నికవడాన్ని ప్రాతిపదికలుగా తీసుకుంటు న్నట్లు బెంగళూరు రాజకీయ వర్గాల కథనం. ఈ నేప థ్యంలో యడ్యూరప్ప కేబినెట్లో పనిచేసిన చాలా మందికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిం చడం లేదు. అయితే యడియూరప్ప రాజీనామా తరు వాత ముఖ్యమంత్రి పదవిని ఆశించిన అరవింద్ బెల్లాడ్, బీపీ యత్నాల్‌కు తప్పకుండా చోటు దొరుకు తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సంఘ్ పరివార్‌కు సన్నిహితుడైన సురేష్ కుమార్, యడ్యూరప్ప శిబిరం నుంచి అశోక్‌కు మంత్రి పదవులు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. బసవరాజ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారో లేదో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ సెట్టార్ నిరసన గళం వినిపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కేబి నెట్లో చేరే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. 2012లోనే ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర జగదీశ్‌ది. అయితే 2019లో ఏర్పడ్డ యడియూరప్ప కేబినెట్లో ఎలాంటి భేషజాలకు పోకుండా పనిచేశారు. యడియూరప్ప తనకంటే వయసులోనూ, రాజకీయంగానూ సీనియర్ కావడంతో ఆయన కేబినెట్లో ఉన్నానన్నారు. బసవ రాజతో తనకెలాంటి గొడవలూ లేవనీ, ఆత్మ గౌర వాన్ని కాపాడుకోవడానికే తనకు సబ్ జూనియర్ అయిన బసవరాజ మంత్రివర్గంలో చేరదలుచుకోలే దనీ స్పష్టత ఇచ్చారు. ఇదిలావుంటే, బసవరాజ ప్రమాణ స్వీకారానికి బళ్లారి నేత బి. శ్రీరాములు డుమ్మా కొట్టారు. ఆయన్ని కొంతకాలంగా ఢిల్లీ పెద్దలు దూరం పెడుతున్నారు. దీంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సుష్మా స్వరాజ్ చనిపోయిన తరువాత శ్రీరాములు రాజకీయ జీవితం దాదాపుగా మసక బారిందనే చెప్పవచ్చు. ఇక సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప ఉపముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. చాలా మంది మఠాధిపతులు తనను ఉప ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని మనసులోని మాటను బయటపెట్టారు. అయితే బీజేపీలాంటి సైద్ధాంతిక పార్టీలో ఇలాంటి బెదిరింపులు ఎవరూ పట్టించుకోరు. యడియూరప్ప మీద నమ్మకంతోనో, పదవులకు ఆశపడో గతంలో కాంగ్రెస్, జేడీ (ఎస్) నుంచి 17 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వారికి యడి యూరప్ప మంచి పదవులే కట్టబెట్టారు. ఇప్పుడు దళపతి మారడంతో తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన పడుతున్నారు. అయితే వీరిని దూరం చేసు కుంటే ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఏర్పడవచ్చు. అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ కంటే కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువున్నారు. అంటే ఏడు గురు ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయిస్తే బసవరాజ సర్కార్ పడి పోవడం ఖాయం. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మె ల్యేలకు ఎలాంటి అన్యాయం జరగదని తాను భావి స్తున్నట్లు మాజీ మంత్రి బీసీ పాటిల్ అన్నారు. ఏమైనా ఎవరినీ నారాజ్ చేయకుండా అడుగులు వేస్తోంది బీజేపీ. బసవరాజ టీమ్‌తోనే 2023 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. కర్ణాటకలో పార్టీ బలోపేతానికి యడియూరప్ప పునా దులు తవ్విన విషయాన్ని ఎవరూ కాదనలేరు. అయితే కొంతకాలంగా ఆయన పాలన గాడి తప్పిందన్న విమ ర్శలున్నాయి. యంత్రాంగంలో అవినీతి పెరిగింది. ప్రభుత్వ వ్యవహారాల్లో యడియూరప్ప పుత్రరత్నం జోక్యం పెరగడంతో బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అలాగే కోవిడ్‌ను కట్టడి చేసే విషయంలోనూ యడియూరప్ప సర్కార్ విఫలం అయిందన్న విమర్శలు న్నాయి. దీంతో పాతవారిని పక్కనపెట్టి ప్రజలకు కొత్త నాయకత్వాన్ని పరిచయం చేయాలని బీజేపీ నిర్ణయిం చుకున్నట్లు రాజకీయవర్గాల మాట. ఎస్. అబ్దుల్ ఖాలిక్ సీనియర్ జర్నలిస్ట్ ‘ మొబైల్ : 87909 99335 -
ఒక్క దెబ్బకు... రెండు పిట్టలు
చాలాకాలంగా వినిపిస్తున్నదే నిజమైంది. కర్ణాటక పీఠంపై యడియూరప్ప స్థానంలో కొత్త నేత కూర్చున్నారు. కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బుధవారం పదవీ స్వీకారం చేయడంతో యడియూరప్ప పాత అధికార శకం ముగిసింది. దక్షిణాదిలో తమకు పట్టం కట్టిన తొలి రాష్ట్రంలో బీజేపీ కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. కన్నడనాట పార్టీ బలోపేతంలో, అధికారంలోకి తేవడంలో కీలక పాత్రధారి యడ్డీ తర్వాత ఎవరన్న చిరకాలపు చిక్కుప్రశ్నకు బీజేపీ జవాబిచ్చింది. యడ్డీ మంత్రివర్గంలో హోమ్ మంత్రి బొమ్మై ఇప్పుడు పార్టీనీ, ప్రభుత్వాన్నీ చక్కదిద్దాల్సిన బరువు భుజానికెత్తుకున్నారు. 1980లలో తొమ్మిది నెలల పాటు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ ఎస్సార్ బొమ్మై వారసుడిగా నడక ప్రారంభించారు. ఇంజనీరింగ్ చదివి, టాటా మోటార్స్‌లో ఉద్యోగం చేస్తూ, వ్యాపారవేత్తగా మారాలని బెంగళూరొచ్చి, అనుకోకుండా రాజకీయాల్లోకి దిగిన బసవరాజ్ సీఎం స్థాయికి ఎదగడం అనూహ్యమే. జనతాదళ్‌తో మొదలై, బీజేపీలో చేరడానికన్నా ముందు జేడీయూలో పనిచేసిన గతం బొమ్మైది. కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, బంధుప్రీతి, పెరుగుతున్న అసమ్మతితో యడ్డీ క్రమంగా పార్టీకి బరువవుతున్న సంగతిని అధిష్ఠానం చాలాకాలం క్రితమే గుర్తించింది. ఇప్పటిదాకా నాలుగు సార్లు సీఎం అయినా, ఒక్కసారీ పూర్తికాలం పదవిలో లేని జాతకం యడ్డీది. 2012లోనైతే ఏకంగా అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఇదే యడ్డీ... బీజేపీ నుంచి బయటకొచ్చి, సొంత పార్టీ పెట్టి సత్తా చాటిన రోజులనూ అధినాయకత్వం మర్చిపోలేదు. ఈసారి పార్టీకి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తగా, అదే సమయంలో గౌరవంగా యడ్డీని సాగనంపాలని అధిష్ఠానం 4 నెలలుగా ప్రణాళికలు వేస్తూ వచ్చింది. అందుకే, ఆయనను కానీ, రాష్ట్రంలో దళితుల (23 శాతం) తరువాత రెండో అతి పెద్దదైన (17 శాతం) ఆయన లింగాయత్ సామాజిక వర్గాన్ని కానీ శత్రువుల్ని చేసుకోకుండా తెలివిగా వ్యవహరించింది. ఒక దశలో లింగాయత్‌ల బదులు మరో కీలక ఒక్కళిగల వర్గానికి చెందిన నేతను గద్దెపై కూర్చోబెట్టాలని అధిష్ఠానం తర్జనభర్జన పడింది. కానీ, దక్షిణాదిన బలంగానూ, అధికారంలోనూ ఉన్న ఏకైక రాష్ట్రంలో అతిగా ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని వెనక్కు తగ్గింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాల్లో 100 స్థానాల్లో ఫలితాన్ని నిర్ణయించే లింగాయత్‌లకు జోల పాడింది. వయసు మీద పడ్డ 78 ఏళ్ళ యడ్డీ స్థానంలో తోటి లింగాయత్ అయిన 61 ఏళ్ళ బొమ్మై మెరుగు అనుకుంది. అలా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నేతకు సీఎం సీటు దక్కాలన్న ఆ ప్రాంతీయుల చిరకాల డిమాండ్‌ను కూడా తీర్చింది. వాజ్‌పేయి – అడ్వాణీల తరం నేతలను ఒక్కొక్కరిగా వదిలించుకుంటూ వస్తున్న మోదీ, అమిత్ షా ద్వయం ఆ క్రమంలోనే యడ్డీ స్థానంలో బొమ్మైని తెచ్చింది. అదే సమయంలో ‘దశాబ్దాలుగా మీరు చేసిన సేవలకు మాటలు సరిపోవు’ అంటూ ట్విట్టర్ సాక్షిగా యడ్డీపై ప్రశంసల వర్షమూ కురిపించింది. ఆచితూచి చేసిన ఈ మార్పుతో బీజేపీకి ఒకే దెబ్బకు రెండు పిట్టలు దక్కాయి. ఒకటి – బొమ్మై కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవాడే కావడంతో, రాష్ట్రంలో తమ బలమైన ఓటు బ్యాంకును దూరం చేసుకోకుండా, కాపాడుకున్నట్టయింది. రెండోది – యడ్డీకి బొమ్మై నమ్మినబంటు కావడం వల్ల, నిష్క్రమిస్తున్న సీనియర్ నేత నుంచి అసమ్మతులు, కొత్త ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్టయింది. యడియూరప్ప సైతం నిష్క్రమణ సమయంలోనూ కోరుకున్న హిరణ్యాక్ష వరాలు దక్కించుకొని, పార్టీపై తన పట్టు సడలలేదని చాటుకున్నారు. పదవి పోయినా తానే తెర వెనుక సీఎం అనే ఇమేజ్ తెచ్చుకున్నారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖకు ఉపాధ్యక్షుడైన తన చిన్న కొడుకు 45 ఏళ్ళ విజయేంద్ర ప్రాధాన్యానికి భంగం రాదన్న హామీ పుచ్చుకున్నారు. ఇక, యడ్డీ వారసుడిగా పీఠమెక్కిన బొమ్మైకి 20 నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉన్న సమయం తక్కువ. సవాళ్ళు ఎక్కువ. కరోనా వేళ దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ఠను ఆయన పునరుద్ధ రించాల్సి ఉంటుంది. యడ్డీ అవినీతి, బంధుప్రీతి మరకలు పార్టీ విజయావకాశాలకూ, ప్రభుత్వ గౌరవానికీ భంగం కలిగించకుండా చకచకా చర్యలు చేపట్టాలి. యడ్డీ ఖాళీ చేయగానే సీఎం సీటులో కూర్చోవాలని ఆశపడ్డ ఆశావహులను బుజ్జగించి, కలుపుకొని పోవాలి. వ్యక్తిగత గురువైన యడ్డీని తోసిపుచ్చకుండానే, సొంతకాళ్ళపై నిలబడి పదవిని సుస్థిరం చేసుకొనేందుకు సమస్త ప్రయత్నాలూ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా... పార్టీలో సమస్యల పరిష్కర్తగా, సౌమ్యుడిగా, మధ్యేవాదిగా ఇప్పటి దాకా తనకున్న పేరును కాపాడుకుంటూనే, యడ్డీ లాంటి జననేతగా ఓటర్ల గుండెల్లో గూడు కట్టుకోవాలి. 2018 ఎన్నికలలో గెలిచినా – ఎమ్మెల్యేలపై యడ్డీ వేసిన ‘ఆపరేషన్ కమల్’ మంత్రంతో అధికారానికి దూరమైన కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్)లు తిరిగి బలం పుంజుకోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పటికే అధిష్ఠానం మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రుల్ని చేస్తోందన్న వార్తలొచ్చాయి. అంటే, బొమ్మైకి ఆది నుంచే ఆట మొదలైపోయింది. మరి, స్వతహాగా క్రికెట్ వీరాభిమాని, గతంలో కర్ణాటక క్రికెట్ సంఘానికి చైర్మన్ అయిన బొమ్మై తన కెప్టెన్సీలో కర్ణాటక బీజేపీ టీమ్‌ను ఎంత సమన్వయంతో, సమర్థంగా నడిపిస్తారో చూడాలి. నిండా రెండేళ్ళయినా దూరం లేని 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన సిక్సర్ కొడతారా? రోజుకో రకంగా మారే రాజకీయాలలో అధిష్ఠానం ఆశలు, ఆలోచనల్ని నిజం చేస్తారా? ఇప్పుడే తెర తీసిన కర్ణాటకంలో కొత్త అంకానికి స్వాగతం. -
Karnataka Politics: ఇంజనీరు రిపేర్ చేస్తాడా?
రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన యెడ్డీనే స్థానిక బీజేపీ నేతలు ఇబ్బంది పెట్టగా, సౌమ్యుడిగా పేరున్న బొమ్మై వీరితో ఎలా నెగ్గుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది. యెడ్డీ ఆశీస్సులతో పాటు, పార్టీ లో సీనియర్ నేతల మద్దతుందని బొమ్మై చెప్పారు. గతంలో సదానంద గౌడను యెడ్డీ మద్దతుతోనే సీఎం చేశారు. కానీ హైకమాండ్ ఆశించినట్లు గౌడ రాణించలేకపోయారు. సీఎంగా దిగినంత మాత్రాన యెడ్డీ ఊరికే ఉండరు. రాజకీయాల్లో యాక్టివ్గానే ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన కుమారులు సైతం బీజేపీలోనే కొనసాగుతారు. వీరిలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విజయేంద్రను సూపర్ సీఎంగా పిలిచేవారు. తండ్రి సీఎంగా దిగిపోయినా, విజయేంద్ర హవా కొనసాగించే యత్నాలు సాగించవచ్చు. యెడ్డీని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లాద్, బసన్న గౌడ పాటిల్ ఎంతవరకు బొమ్మైకి సహకరిస్తారో తెలీదు. అరవింద్.. యెడ్డీ స్థానంలో సీఎం కావాలని ఆశించారు. కానీ అధిష్టానం బొమ్మైను ఎంచుకుంది. వీరితో పాటు సీఎం పోస్టు ఆశించిన పలువురు ఆశావహులను బుజ్జగించుకుంటూ రాబోయే ఎన్నికల్లో పార్టీని తిరిగి గెలిపించాల్సిన బాధ్యత బొమ్మైపై ఉంది. ఈ మెకానికల్ ఇంజనీరు యెడ్డీ వర్గాన్ని, అసమ్మతి వర్గాన్ని సముదాయించుకుంటూ సొంత పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తారో, లేదో వేచిచూడాల్సిందే! –నేషనల్ డెస్క్, సాక్షి 50%కి పైగా 2 ఏళ్ల లోపే... కర్ణాటక సీఎంలుగా పనిచేసిన వారిలో 50 శాతానికి పైగా రెండేళ్లలోపే పదవిలో ఉన్నారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బసవరాజ బొమ్మైకి మరో 19 నెలల పదవీకాలం మాత్రమే మిగిలి ఉంది. 2023 మేలోపు కర్ణాటక అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు జరగనున్నాయి. కన్నడనాట సీఎంల పదవీకాలం వివరాలిలా ఉన్నాయి. పదవీకాలం సీఎంలు 0–1 ఏళ్లు 9 మంది 1–2 7 2–3 6 3–4 3 4–5 3 5+ 3 -
కర్ణాటక 20వ సీఎంగా రేపు బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం
బెంగళూరు: కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉ.11 గంటలకు రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. అంతకుముందు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో పరిశీలకులు బసవరాజు పేరును ఖరారు చేశారు. తాజా మాజీ సీఎం యడియూరప్ప కూడా తదుపరి సీఎంగా బసవరాజునే సూచించిన విషయం తెలిసిందే. జనతా దళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన బసవరాజు 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరి కీలక నాయకుడిగా అవతరించారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరకు బసవరాజు బొమ్మైకే ఆ అదృష్టం వరించింది. బసవరాజు గతంలో టాటా గ్రూప్‌లో ఇంజనీర్‌గా బసవరాజు పని చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై
బెంగళూరు: కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో పరిశీలకులు బసవరాజు పేరును ఖరారు చేశారు. తాజా మాజీ సీఎం యడియూరప్ప కూడా తదుపరి సీఎంగా బసవరాజునే సూచించిన విషయం తెలిసిందే. జనతా దళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన బసవరాజు 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరి కీలక నాయకుడిగా అవతరించారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరకు బసవరాజు బొమ్మైకే ఆ అదృష్టం వరించింది. బసవరాజు గతంలో టాటా గ్రూప్‌లో ఇంజనీర్‌గా బసవరాజు పని చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
కర్ణాటక సంకీర్ణం అందుకే కూలిందా ?
న్యూఢిల్లీ: 2019లో కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగించారని కాంగ్రెస్ నేతలు మంగళవారం బీజేపీని విమర్శించారు. పెగసస్ స్పైవేర్ లిస్టులో అప్పటి ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్యల కార్యదర్శులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బీజేపీపై విరుచుకుపడ్డారు. పెగసస్‌ను వినియోగించుకొని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రిగా కొనసాగే హక్కు అమిత్‌షాకు లేదని వ్యాఖ్యానించారు. -
‘మా సీఎం మారడు.. 65 మంది మద్దతు ఉంది’
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశానికి సంబంధించి రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. అయితే ముఖ్యమంత్రి యడియూరప్ప మాత్రం మారడని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే రేణుకాచార్య కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా యడియూరప్పకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై రేణుకాచార్య విరుచుకుపడ్డారు. వారి పక్క నియోజకవర్గాన్ని గెలిపించుకునే సత్తాలేనివారు యడియూరప్ప గురించి మాట్లాడుతుండడం వింతగా ఉందని పేర్కొన్నారు. యత్నాళ్ పిచ్చోడి తరహాలో మాట్లాడారని తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఏమి జరగదని చెప్పారు. వారం కిందట 18 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు మద్దతుగా తాము ఢిల్లీకి వెళ్లి వస్తామని చెప్పారని.. అయితే ఏ సమస్య లేదని యడియూరప్ప చెప్పినట్లు’ రేణుకాచార్య వివరించారు. ఈ సమయంలో యడియూరప్ప రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలోనూ యడియూరప్ప వృద్ధాప్యంలో చురుగ్గా పని చేస్తున్నారని రేణుకాచార్య తెలిపారు. కోవిడ్ సందర్భంలో కొందరు ఢిల్లీకి వెళ్లి ఏవేవో ప్రయత్నాలు చేయడం సరికాదని ప్రత్యర్థి గ్రూపులకు హితవు పలికారు. నాయకత్వ మార్పు వివాదం రేగిన నేపథ్యంలో యడియూరప్పకు మద్దతుగా 65 మందికి పైగా ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, దానికి సంబంధించిన లేఖ తన వద్ద ఉందని రేణుకాచార్య తెలిపారు. చదవండి: కలకలం..ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం చదవండి: ‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’ -
‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’
బెంగళూరు: కర్ణాటక సీఎం యడియూరప్పను తప్పిస్తారన్న వార్తలపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. యడియూరప్పను సీఎంగా తొలగించే అవకాశమే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యడియూరప్ప మా సీఎం, ఆయన పదవీకాలం ముగిసేంత వరకూ సీఎంగానే ఉంటారు. మేము ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము, కర్ణాటకలో సీఎంను మార్చే ఆలోచన లేదు. ఈ వార్తలు కేవలం పుకారు మాత్రమేనని తెలిపారు. అంతకుముందు కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద్ బెల్లాడ్ సహా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు కూడా సీఎం మార్చాలని డిమాండ్ చేశారు. మార్చి నెలలో యట్నాల్ మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీ పార్టీ సజీవంగా ఉండాలంటే, ముఖ్యమంత్రి మార్పు అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఢిల్లీలో బీజేపీ నాయకులతో సమావేశమైన తరువాత, సీటీ రవి యడియూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. చదవండి: కర్ణాటకలో కీలకంగా మారుతున్న పరిణామాలు -
కలకలం: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం
మైసూరు: సీఎం యడియూరప్పకు ఆరోగ్యం సరిగా లేదు, దీంతోపాటు రాష్ట్ర పరిపాలన కూడా సరిగా లేదని, దీనిపై హైకమాండ్ వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ అన్నారు. ఆయన బుధవారం మైసూరు జయలక్ష్మీపురంలో ఎంపీ శ్రీనివాస్ ప్రసాద్ ఇంటికి వెళ్లి తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం విశ్వనాథ్ మాట్లాడుతూ ఎంపీ ఇంట్లో పలు విషయాలకు ముహూర్తం పెట్టినట్లు చెప్పారు. కొద్ది రోజులు వేచి చూడాలని తెలిపారు. చదవండి: ఢిల్లీ టూర్‌తో వేడెక్కిన కర్ణాటక రాజకీయం చదవండి: సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మంత్రి -
ఢిల్లీ టూర్‌తో వేడెక్కిన కర్ణాటక రాజకీయం
శివాజీనగర: రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం యడియూరప్ప తనయుడు, యువమోర్చా నేత విజయేంద్ర ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యార్థకమైంది. పరిపాలనలో విజయేంద్ర వేలు పెడుతున్నారని, సీఎంను మార్చాలని యడ్డి వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి అరుణ్‌సింగ్‌ను కలుస్తారని తెలిసింది. రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించే అవకాశముది ఇది మూడు ముక్కల ప్రభుత్వమని మంత్రి యోగీశ్వర్ ఇటీవల విమర్శలు చేయడంపై విజయేంద్ర ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన వల్ల పారీ్టకి, ప్రభుత్వానికి అవమానమైందని, వీలైతే మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరే అవకాశముంది. బళ్లారి జిల్లాలో జిందాల్‌కు ఇచ్చిన 3 వేల ఎకరాలకు పైగా భూమిని వెనక్కు తీసుకోవడంపైనా వివరణ ఇవ్వనున్నారు. హైకమాండ్ వద్ద తన వాదనను వినిపించేందుకు యడియూరప్ప తనయున్ని పంపినట్లు తెలిసింది. సీఎం మార్పు ఉండదు మైసూరు: ఢిల్లీకి ఎవరు, ఎందుకు వెళ్లారు అన్న విషయం నాకు తెలియదు, సీఎంగా యడియూరప్ప పూర్తి కాలం పదవిలో ఉంటారని బీజేపి జాతీయ కార్యదర్శి సి.టి.రవి అన్నారు. మంగళవారం మైసూరులో ఆయన పార్టీ ఆఫీసులో మాట్లాడారు. బీ.వై. విజయేంద్ర ఢిల్లీకి వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ పార్టీ నాయకులు అన్నాక అనేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. కరోనా సమయంలో రాజకీయాలువద్దని అన్నారు. సీఎం మార్పు ఉండబోదని చెప్పారు. -
సీఎం మార్పు: కుట్రలపై ముఖ్యమంత్రి ఘాటు స్పందన
శివాజీనగర: ప్రస్తుతం నా ఎదురుగా ఉన్నది కరోనా సవాల్ మాత్రమే. దానిని ఎదుర్కోవడానికి ఏమేం చేయాలో చేస్తాను. ఢిల్లీకి వెళ్లినవారికి హైకమాండ్ తగిన సమాధానం చెప్పి పంపింది. శాసనసభా పక్ష సమావేశం గురించి మీ ముందు చర్చించలేను అని సీఎం యడియూరప్ప అన్నారు. సీఎం మార్పు కోసం బీజేపీలో ఒక వర్గం చేస్తున్న ప్రయత్నాలపై ఘాటుగా స్పందించారు. జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా గురువారం విధానసౌధ ఆవరణలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు కలసికట్టుగా కోవిడ్ ఎదుర్కోవాల్సి ఉందన్నారు. ఎవరో ఒకరు ఎక్కడికో వెళ్లి వచ్చారంటే వారికి హైకమాండ్ సమాధానం చెప్పి పంపారు కదా అన్నారు. యడియూరప్పని తొలగించాలని బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇటీవల ఢిల్లీలో బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేశారని వార్తలు రావడం తెలిసిందే. -
థాంక్యూ సీఎంజీ
సాక్షి, కర్ణాటక: ఇటీవల సీఎం యడియూరప్ప, బీజేపీ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు వార్తల్లోకి ఎక్కిన కత్తి సోదరులు, మురుగేశ్ నిరాణి తమ డిమాండ్లను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రమేశ్ కత్తికి రాజ్యసభ టికెట్‌కు సిఫార్సు చేసినందుకు ధన్యవాలు తెలిపారు. ఆదివారం ఉదయం సీఎం నివాసం కావేరిలో కత్తి సోదరులు, నిరాణి వెళ్లి కలిశారు. కాగా, డిమాండ్ల సాధనకు ఉమేశ్ కత్తి ఆధ్వర్యంలో నిరాణి తదితర బీజేపీ ఎమ్మెల్యేలు విందు రాజకీయం నిర్వహించడం తెలిసిందే. దీంతో యడియూరప్ప వారిని పిలిపించి బుజ్జగించారు. మురుగేశ్ నిరాణి వర్గానికి మండ్య జిల్లా పాండవపుర సహకార కార్మాగారాన్ని 40 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్‌కు అప్పగించినట్లు తెలిసింది. చదవండి: ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక రాజకీయాలు -
ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక రాజకీయాలు
సాక్షి, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సంక్రమిస్తున్న తరుణంలో కన్నడ నాట రాజకీయ అసమ్మతి తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పారీ్టకి ప్రమాదం ముంచుకొస్తోందని పుకార్లు షికారు చేశాయి. అయితే అసమ్మతి ఎమ్మెల్యేగా ముద్ర వేసుకున్న ఉమేశ్ కత్తి మరోసారి తన నివాసంలో గురువారం రాత్రి కొందరు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం నుంచి రాజకీయంగా చర్చ మొదలైంది. అంతేకాకుండా ఉమేశ్ కత్తిని తన ఇంటికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆహ్వానించారు. ఉమేశ్ కత్తి బెంగళూరులోని సీఎం నివాసం సమావేశమై అనంతరం మీడియాతో మాట్లాడారు. తన నివాసంలో సమావేశానికి.. రాజకీయానికి సంబంధం లేదని కొట్టి పారేశారు. రహస్య సమావేశంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. రేణుకాచార్య ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నాయకత్వంపై తమకందరికి విశ్వాసముందని, ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎంపీ రేణుకాచార్య తెలిపారు. శుక్రవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ యడియూరప్ప ఎమ్మెల్యేలందరి విశ్వాసంతో పాలన అందిస్తున్నారన్నారు. సీఎం నాయకత్వంపై ఎవరికీ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. చిన్నపాటి వివాదాలున్నా పరిష్కరించేందుకు పార్టీ ప్రముఖులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం యడియూరప్ప కరోనా సమస్యను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే కష్టసుఖాలు మాట్లాడుకున్నాం : ఉమేశ్ కత్తి బీజేపీలో బాధ్యతాయుత ఎమ్మెల్యేలుగా ఉన్నాం. అందరూ కలిసి భోజనం చేశాం. కష్టసుఖాల గురించి మాట్లాడుకున్నాం. ఎలాంటి రాజకీయ చర్చలు జరపలేదు. బీజేపీలో తిరుగుబాటు లేచిందని, ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించారనే వార్తల్లో నిజం లేదు. మా నాయకుడు మోదీ ప్రభుత్వం మరో మూడేళ్లు ఉండాలని కోరుకున్నాం. రాజ్యసభ స్థానం గురించి ఎలాంటి చర్చలు జరుగలేదు. చదవండి: ప్రముఖ జ్యోతిష్యుడు కన్నుమూత తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాదు : యత్నాళ్ తాము తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాదని.. ప్రభుత్వాన్ని కూల్చటం లేదని ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తల్లో నిజం లేదన్నారు. లాక్డౌన్ ద్వారా హోటల్ బంద్ అయిన కారణంగా ఉమేశ్ కత్తి ఇంట్లో విందుకు వెళ్లామన్నారు. ప్రభుత్వానికి ఢోకా లేదు : మంత్రి బీ.సీ.పాటిల్ నాయకత్వ మార్పు ఎట్టి పరిస్థితిలోను ఉండబోదని.. మరో మూడేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం భద్రంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి బీసీ.పాటిల్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా యడియూరప్ప సమర్థ పాలన అందిస్తున్నారన్నారు. స్నేహితులందరు ఒకచోట కలిస్తే తప్పుగా భావించడం సరికాదన్నారు. -
మంత్రిగిరి కోసం.. ధవళగిరి ప్రదక్షిణ
సాక్షి బెంగళూరు: మంత్రివర్గంలో చోటు ఆశించిన పలువురు శాసనసభ్యులు డాలర్స్ కాలనీలోని ముఖ్యమంత్రి నివాసం ధవళగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నేడు (శనివారం) కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటక రానున్న సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆశావహులు జోరు పెంచారు. ఈమేరకు సీఎం యడియూరప్పతో ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కర్తవ్యం నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం నివాసం వద్ద కొందరు ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉమేశ్ కత్తి, కె.గోపాలయ్య, గోలిహట్టి శేఖర్, ఎం.చంద్రప్ప, సోమశేఖరరెడ్డి, రేణుకాచార్య, జ్ఞానేంద్ర, మాజీ మంత్రులు ఎంటీబీ నాగరాజు, ఆర్.శంకర్ మత్తికెరెలోని సీఎం నివాసానికి శుక్రవారం వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో తమకు చోటు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. శనివారం ఉదయం ప్రత్యేక విమానం ద్వారా అమిత్‌షా బెంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు హుబ్బళి బయలుదేరి వెళ్తారు. అక్కడ పౌరసత్వ సవరణ చట్టంపై జాగృతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్తారు. కాగా అమిత్‌షా శుక్రవారమే కర్ణాటక వస్తారని భావించారు. కానీ ఆయన ఉన్నఫలంగా నిర్ణయం మార్చుకుని శనివారానికి వాయిదా వేసుకున్నారు. అమిత్‌షాతో నేడు సీఎం భేటీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శనివారం కర్ణాటక రానున్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప భేటీ అయి మంత్రివర్గ విస్తరణ గురించి చర్చిస్తారని తెలిసింది. ఈమేరకు ఇప్పటికే మంత్రివర్గం జాబితా కూడా సీఎం సిద్ధం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరిస్తారా? లేక తర్వాతా? అనేది కూడా నేడు తేలనుంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి? ఏ శాఖ ఇవ్వాలనే దానిపై అమిత్‌షాతో సీఎం యడియూరప్ప చర్చించనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఉప ఎన్నికల్లో గెలిచిన వారందరికీ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓడిన వారిని మంత్రిమండలిలోకి తీసుకోవాలా? వద్దా? అనే దానిపై అమిత్‌షాతో చర్చించి తీర్మానిస్తారు. దీనికి తోడు పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్న సీనియర్ నేతలను కూడా కేబినెట్లోకి తీసుకునే విషయమై మాట్లాడుతారు. -
అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ కండువా
సాక్షి, బెంగళూరు: అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కన్నడనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. అనర్హుల్లో రోషన్ బేగ్ తప్ప అందరూ అధికార బీజేపీలో చేరారు. వీరు డిసెంబరులో జరిగే 15 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని, వారిలో పలువురు కాబోయే మంత్రులని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. అనర్హత ఎమ్మెల్యేల్లో 17 మందికి గాను 16 మందికి గురువారం బెంగళూరులో బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యడియూరప్ప కాషాయ కండువా కప్పారు. బెంగళూరు శివాజీనగర కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్‌ను బీజేపీలోకి ఆహ్వానించలేదు. టికెట్ కూడా ఇవ్వలేదు. కాగా, కొత్త నేతల రాకను బీజేపీ స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో బుజ్జగించడం యడ్యూరప్ప ముందున్న ప్రధాన కర్తవ్యంగా మారింది. -
అనర్హులే.. కానీ పోటీ చేయొచ్చు!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని బుధవారం సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆ ఎమ్మెల్యేలు రానున్న ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా పేర్కొంటూ స్పీకర్రమేశ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో.. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు పోటీ చేసే అవకాశం లేదన్న భాగాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉప ఎన్నికల్లో గెలిస్తే వారు మంత్రులూ కావచ్చని పేర్కొంది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో జూలై నెలలో యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఎమ్మెల్యేలు నేడు(గురువారం) బీజేపీలో చేరనున్నారని సీఎం యడియూరప్ప, ఉప ముఖ్యమంత్రి అశ్వద్ధ నారాయణ్ వెల్లడించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ద్వారా సంక్రమించిన అధికారాలను స్పీకర్ ఉపయోగించిన విషయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణ మురారిల ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ‘ఎంత కాలం అనర్హులుగా ప్రకటించాలనే విషయంలో కానీ, ఎన్నికల్లో పోటీ చేయరాదనే విషయంలో కానీ స్పీకర్‌కు అధికారం లేదు’ అని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న రాజ్యాంగ ధర్మానికి వ్యతిరేకంగా స్పీకర్లు వ్యవహరించడం ఎక్కువైందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అవినీతికి పాల్పడటం, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం వంటి చర్యల వల్ల పౌరులు స్థిర ప్రభుత్వాన్ని పొందే హక్కును కోల్పోతున్నారని పేర్కొంది. ‘ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు, వారు స్వచ్చంధంగానే చేశారా? అనే విషయాన్ని మాత్రమే స్పీకర్ పరిగణనలోకి తీసుకుని, ఆ రాజీనామాను ఆమోదించడమో, లేక తిరస్కరించడమో చేయాలి’ అని కోర్టు పేర్కొంది. ‘స్వచ్చంధంగానే రాజీనామా చేసినట్లు తేలితే, ఆ రాజీనామాను ఆమోదించడం మినహా స్పీకర్‌కు మరో మార్గం లేదు. ఆ రాజీనామాను ఆమోదించే విషయంలో సంబంధం లేని ఇతర అంశాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవడం రాజ్యాంగపరంగా ఆమోదనీయం కాదు. స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్షకు అర్హమైనదే’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎమ్మెల్యేలు మొదట హైకోర్టును కాకుండా సుప్రీంకోర్టునే ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టును ఆశ్రయించి, ఆ తీర్పుపై సంతృప్తి చెందనట్లయితేనే, సుప్రీంకోర్టును ఆశ్రయించడం çసరైనదని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 5న ఉప ఎన్నికలు తమను అనర్హ ఎమ్మెల్యేలుగా స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై తాజా తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాల్లో 15 సీట్లకు డిసెంబర్ 5వ తేదీని ఉప ఎన్నికలు జరగనున్నాయి. 18 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ‘ఆ’ ఎమ్మెల్యేలపై కఠిన విధానం సరికాదు పార్టీ ధిక్కరణకు పాల్పడే చట్ట సభల సభ్యులపై కఠినమైన అనర్హత విధానాన్ని తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దానివల్ల న్యాయమైన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ఆటంకం కలుగుతుందని కాబట్టి అది ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. పార్టీ విధానాన్ని ధిక్కరించే, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఒక కఠిన విధానాన్ని రూపొందించేలా ఆదేశాలు జారీ చేయలన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. కర్ణాటకకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవేళ అలాంటి విధానమేదైనా తీసుకురావాలన్నా.. అది శాసన వ్యవస్థ చేయాల్సిన విధి. ఆ పని కోర్టులు చేయలేవు’ అని పేర్కొంది. విశ్వాస పరీక్షకు ముందే... జూలై 23న కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నేపథ్యంలో... విప్‌ను వ్యతిరేకించే అవకాశమున్న కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. తరవాత జరిగిన విశ్వాస పరీక్షలో గెలవకపోవడంతో కుమార స్వామి రాజీనామా చేశారు. జూలై 29న∙విశ్వాస పరీక్షలో నెగ్గి, యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 17 మంది ఎమ్మెల్యేల అనర్హతతో అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్య 225 నుంచి 208కి తగ్గింది. మెజారిటీకి అవసరమైన మేజిక్ ఫిగర్ 105కి చేరింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, తమ 105 మంది ఎమ్మెల్యేల మద్దతుతో యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. -
తిరుగుబాటు వ్యూహం అమిత్షాదే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకపాత్ర పోషించిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. దీనికి సంబంధించి యడియూరప్ప మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ 17 మంది విశ్వాస పరీక్షకు హాజరుకాకుండా ముంబైలోని ఓ స్టార్ హోటల్‌కు తరలించడం సహా అన్ని ఏర్పాట్లను బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా పర్యవేక్షించారని యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ 17 మంది ఎమ్మెల్యేలు తమ కుటుంబాలను వదిలి రెండు మూడు నెలల పాటు ముంబైలో ఉన్నారు. వారంతా మన ప్రభుత్వ ఏర్పాటుకు సహాయం చేశారు. నన్ను నమ్మి వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. వాళ్లకు అన్యాయం చేసి సీఎం అయ్యి నేరం చేశాననే భావన నాలో కలుగుతుంది. మీకు ఈ విషయాలన్నీ తెలియవు. మనం వాళ్లకి అండగా ఉండాలి’అని యడియూరప్ప వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా: కుమారస్వామి యడియూరప్ప వ్యాఖ్యలతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందని కుమారస్వామి ఆరోపించారు. రెబల్ ఎమ్మెల్యేల విషయంలో యడియూరప్ప తనంతట తానే వాస్తవాలను బయటపెట్టారని అన్నారు. ఈ విషయంలో వీడియో క్లిప్పింగుల ఆధారంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని శనివారం చెప్పారు. -
నా తొలి శత్రువు సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: ‘సిద్ధరామయ్యే నా తొలి శత్రువు. బీజేపీ కాదు’అని జేడీఎస్ మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్యపై మూడు రోజుల నుంచి జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించారు, తాను సీఎం కావడాన్ని ఆయన ఏమాత్రం సహించలేకపోయారని మీడియాతో ఆదివారం వ్యాఖ్యానించారు. తన సన్నిహిత ఎమ్మెల్యేల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ చివరికి వారి చేత రాజీనామాలు చేయించి, ప్రభుత్వం కూలిపోవడానికి కారకులయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ అధిస్టానం సూచించడంతో, ఇష్టం లేకపోయినా బలవంతంగా తనను ముఖ్యమంత్రిగా అంగీకరించారన్నారు. ఆయన ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో తాను ముఖ్యమంత్రిగా కాకుండా, క్లర్క్‌లాగా పనిచేశానని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలు తనపై పెత్తనం చేసేవారని, కలెక్టర్లు సహా అందరి బదిలీలు వారు చెప్పినట్లే చేశానని తెలిపారు. సాయంత్రానికి మాట మార్పు.. ఈ వ్యాఖ్యల అనంతరం సాయంత్రానికే కుమారస్వామి మాట మార్చారు. తానెప్పుడూ సిద్ధరామయ్య తన తొలి శత్రువు అని చెప్పలేదని తెలిపారు. డిజిటల్ మీడియా విలేకరులకు కొన్ని రోజుల క్రితం ఇచ్చిన సందేశాన్ని తాజాగా కొందరు మార్చి చెబుతున్నారని అన్నారు. -
గౌడ X సిద్ధూ రగడ
సాక్షి, బెంగళూరు: మొన్నటి వరకు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నేతలిపుడు నిందారోపణలకు దిగుతున్నారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి నెల రోజులు గడవటంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ రచ్చ రాజుకుంటోంది. ప్రభుత్వం కూలిపోయింది మీ వల్లే అని జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అంటే.. కాదు మీరు, మీ కుమారుల వల్లే కూలిపోయిందని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శలకు దిగారు. కాంగ్రెస్ వల్లే కుమారస్వామికి అష్టకష్టాలు.. సంకీర్ణ ప్రభుత్వంలో తన కుమారుడు కుమారస్వామిని కాంగ్రెస్ నాయకులు అష్టకష్టాలు పెట్టి బాధపెట్టారని దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పెట్టిన హింసలకు కుమారస్వామి నా దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకునేవారు. అది చూసి నాకు భోజనం చేయడానికి కూడా మనసొప్పేది కాదు. కాంగ్రెస్ నేతలు పెట్టే బాధల్ని తట్టుకోలేక సీఎం పదవికి రాజీనామా చేస్తానని కుమార స్వామి చాలాసార్లు ప్రస్తావించారు’’ అంటూ వెల్లడించారు. పతనానికి దేవెగౌడ కారణం: సిద్దరామయ్య జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడానికి తాను కారణం కాదని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారులే కారణమని, రాజకీయ దురుద్దేశంతో దేవెగౌడ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో రామకృష్ణ హెగ్డే, ఎస్ఆర్ బొమ్మై, ధరంసింగ్ ప్రభుత్వాలను దేవెగౌడ కూల్చిన విషయం తనకు తెలుసన్నారు. ç జేడీఎస్‌తో మైత్రి వద్దన్న మాట వాస్తవమేనని, అది తన వ్యక్తిగత అభిప్రాయమని, కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పూర్తిగా సహకరించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. -
రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు
సాక్షి, బెంగళూరు: కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమరస్వామి మరోసారి కన్నీటిపర్యంతమయ్యారు. మాండ్య జిల్లాలోని కేఆర్ పేట రాజకీయాల్లో తమ కుటుంబ స్వయంకృతాపరాధం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వాపోయారు. ఇక్కడి నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేగా గెలిచి సంకీర్ణంపై తిరుగుబాటు చేసిన నారాయణ గౌడను ఉద్దేశిస్తూ కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం మండ్య జిల్లాలోని కేఆర్‌పేటకు వచ్చిన ఆయన కార్యకర్తల సమావేశంలోను, మీడియాతో మాట్లాడారు. కేఆర్ పేటలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కృష్ణకు కాకుండా నారాయణగౌడను నమ్మి టికెట్ ఇచ్చి గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని అన్నారు. నారాయణగౌడ గెలుపు కోసం గ్రామ గ్రామానికి తిరిగి పని చేçసి ఆయనను గెలిపిస్తే తన కుటుంబంపైనే ఆరోపణలు చేశాడని అన్నారు. అతడు క్రిమినల్ అని మండపడ్డ కుమరస్వామి, ఇదంతా మా కుటుంబం చేసుకున్న స్వయంకృతాపరాధమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు తుడుచుకున్నారు. రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు తాను మనసులో ఏముంటే దానిని మాట్లాడతానన్న కుమారస్వామి...తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, రాష్ట్రంలో ఉన్న ప్రజల హృదయాల్లో ఉండిపోవాలని అనుకున్నానని అన్నారు. పదవి పోయినా బాధ పడకుండా సంతోషంగా వదిలివచ్చానని అన్నారు. దేశం కోసం తమ కుటుంబం ఎంతో చేసిందని, కానీ సోషల్ మీడియాలో నిఖిల్ ఎల్లిదియప్పా అని ప్రచారం జరగడం బాధగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కుల రాజకీయాలు జరుగుతున్నాయని, రాజకీయాల్లో మంచికి కాలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో తనకు రాజకీయాల్లో కొనసాగాలని అనిపించడం లేదని కుమారస్వామి వ్యాఖ్యానించారు. -
దేవెగౌడ ఇంటికెళ్తే టీ కూడా ఇవ్వలేదు
సాక్షి, బెంగళూరు: తాను పదవి..డబ్బులు కోసం రాజీనామా చేయలేదని నియోజక వర్గం అభివద్ధి కోసం రాజీనామా చేసిన్నట్లు కేఆర్ పేట జేడీఎస్ అనర్హత ఎమ్మెల్యే నారాయణగౌడ తెలిపారు. ఆయన శనివారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. ‘మాజీ ప్రధాని దేవేగౌడ ఇంట్లో ఒక సిండికేట్ ఉంది. ఈ సిండికేట్‌ను ఆయన పెంచి పెద్ద చేశారు. ఒక ఎమ్మెల్యేగా అయన ఇంటికి వెళ్తే టీ కూడా ఇవ్వలేదు. చెప్పుడు మాటలను విని నన్ను వేధించారు’ అని ఆరోపించారు. ఉప ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి మండ్య: రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో మూడు పార్టీల్లో ఉపఎన్నికల హడావిడి మొదలైందని, అయితే జేడీఎస్‌లో ఈ పరిస్థితి కొంచెం ఎక్కువగా ఉందని మాజీ మంత్రి చెలువనారాయణస్వామి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్ అధినేతలు దేవేగౌడ,కుమారస్వామి కేఆర్ పేటె నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారని మిగిలిన పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తుంటే ఉపఎన్నికల ప్రచారాలు మొదలైన ట్లు కనిపిస్తోందన్నారు. 17 మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సు ప్రీంకోర్టు వచ్చే వారంలో తీర్పు వెల్లడించే అవకాశం ఉందని, కోర్టు తీర్పు ఎ లా వచ్చినా ఉపఎన్నికలు జరిగేలాగానే కనిపిస్తున్నాయన్నారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్–జేడీఎస్ మైత్రి కొనసాగితే తమకేమి అభ్యంతరాలు లేవన్నారు. -
కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే
సాక్షి, బెంగళూరు: కర్ణాటక నూతన ప్రభుత్వంలో విధానసభ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి బుధవారం జరగనున్న ఎన్నికలకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉండగా కాగేరి ఒక్కరే నామినేషన్ సమర్పించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి ఒక్కరూ కూడా నామినేషన్ వేయలేదు. దీంతో విశ్వేశ్వర హెగ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశ్వాస పరీక్షలో యడియూరప్ప ప్రభుత్వం విజయం సాధించడంతో కేఆర్ రమేష్ కుమార్ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో విశ్వేశ్వర్‌ను నూతన సభాపతిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎంతో సహా బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అంకోలా నుంచి రాజకీయ ప్రస్థానం 1961 జులై 10న జన్మించిన కాగేరి, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994 నుంచి ఉత్తర కన్నడ జిల్లా అంకోలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాగేరి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పునర్విభజన కారణంతో 2008లో సిర్సి–సిద్ధాపుర నియోజకవర్గం నుంచి తొలిసారిగా, ఆ తరువాత 2013, 2018లో అక్కడి నుంచే ఎన్నికయ్యారు. 2008లో యడియూరప్ప మంత్రిమండలిలో ప్రాథమికోన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన కాగేరి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే గతంలో స్పీకర్‌గా పనిచేసిన కే.జీ.బోపయ్యను సోమవారం వరకు అనుకున్నారు. అయితే హఠాత్తుగా మంగళవారం ఉదయం బోపయ్యకు బదులుగా కాగేరిని ఎంపిక చేశారు. పార్టీ అధినేత అమిత్ షా సూచనల ప్రకారమే ఈ మార్పు జరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో గత నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. విధానసౌధలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విజయం సాధించారు. అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప ‘నా నేతృత్వంలోని మంత్రివర్గంపై ఈ సభ విశ్వాసం ఉంచుతోంది’ అనే ఏకవాక్య తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ..‘నేను ప్రతీకార రాజకీయాల జోలికిపోను. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో పాలనా యంత్రాంగం నిర్వీర్యమైంది. దీన్ని చక్కదిద్దడమే మా తొలి ప్రాధాన్యత’ అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్–జేడీఎస్ సభ్యులు డివిజన్ కోరకపోవడంతో విశ్వాసతీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం కాంగ్రెస్–జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసిన విషయం తెలిసిందే. ఇది అనైతిక ప్రభుత్వం.. విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య ముఖ్యమంత్రి యడియూరప్పపై నిప్పులు చెరిగారు. ‘యడియూరప్ప నేతృత్వంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అనైతిక పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పడింది. ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేదు. కేవలం 105 మంది ఎమ్మెల్యేలతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీకాలాన్ని పూర్తిచేసుకోవాలని నేను కోరుకుంటున్నా. కానీ మీరెంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారో చూద్దాం!’ అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ..‘మీరు(బీజేపీ) కుట్రలు పన్ని అధికారంలోకి వచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన పనులు, ఈ రాజకీయాలు చరిత్రలో నిలిచిపోతాయి’ అని వ్యంగ్యంగా అన్నారు. విశ్వాసఘట్టం ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాటుపై దృష్టిసారిస్తామని బీజేపీ నేత సురేశ్ కుమార్ తెలిపారు. స్పీకర్ రాజీనామా.. అసెంబ్లీలో విశ్వాసతీర్మానం ఆమోదం పొందినవెంటనే తాను స్పీకర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రమేశ్ కుమార్ ప్రకటించారు.‘రాజ్యాంగాన్ని అనుసరించి మనస్సాక్షి ప్రకారం విధుల్ని నిర్వర్తించాను. స్పీకర్ కుర్చీ గౌరవాన్ని కాపాడేందుకు శాయశక్తులా కృషిచేశాను. ప్రజలు మీకు(యడియూరప్ప) రెండో అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో సుపరిపానలతో మీదైన ముద్ర వేయండి’ అని తెలిపారు. అనంతరం తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డికి అందించి సభనుంచి నిష్క్రమించారు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకు ఉద్దేశించిన ఆర్థికబిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
కర్ణాటక స్పీకర్ రాజీనామా
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కే.ఆర్.రమేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా రాష్ట్రంలో సాగుతోన్న రాజకీయ సంక్షోభానికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ సోమవారం తన పదవి నుంచి తప్పుకున్నారు. అసెంబ్లీలో యుడియూరప్ప విశ్వాస పరీక్షలో విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సభలోనే ఆయన రాజీనామా లేఖను సభ్యులందరికీ చదవి వినిపించారు. కాగా స్పీకర్ రాజీనామాకు ఒక్కరోజు ముందు (ఆదివారం) 14 మంది సభ్యులపై అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి.. సభా నియమాలను ఉల్లంఘించినందుకు వారిపై వేటు వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి అనంతరం.. స్పీకర్‌ను దింపేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ కే.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం సభలో జరిగిన విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కార్ విజయం సాధించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో బీజేపీ నూతన స్పీకర్‌ను ఎన్నుకోనుంది. -
విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. సోమవారం జరిగిన బలపరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 106 మంది సభ్యులు ఓటేశారు. దీంతో మ్యాజిక్ ఫిగర్‌ను యడ్డీ సునాయాసంగా ఛేదించగలిగారు. సభకు కాంగ్రెస్-బీజేఎస్ సభ్యులు కూడా హాజరయ్యారు. వీరంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ.. విశ్వాస పరీక్షలో సర్కార్ విజయం సాధించింది. బీజేపీకి ఉన్న 105 మందితో పాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యేతో కలుసుకుని బలం 106కి చేరింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 104 కంటే రెండు ఓట్లను ఎక్కువగా సాధించి బలపరీక్షలో గెలుపొందింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 మంది సభ్యులు ఓటు వేశారు. మూజువాణి పద్దతిలో స్పీకర్ రమేష్ కుమార్ ఓటింగ్‌ను చేపట్టారు. ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం విజయం సాధించిందని స్పీకర్ ప్రకటించారు. అనంతరం సీఎం యడియూరప్ప సభలో సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజల విజయమన్నారు. విశ్వాస పరీక్షకు ముందు సభలో యడియూరప్ప మాట్లాడుతూ.. బల నిరూపణలో తమ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో పాలనలో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. రైతులకు పెద్దపీఠ వేస్తామని స్పష్టం చేశారు. ప్రజల, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని సీఎం పేర్కొన్నారు. చర్చలో భాగంగా కాంగ్రెస్ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. యడియూరప్ప వ్యాఖ్యలను తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఎంతో చేశాయని ఆయన గుర్తుచేశారు. కాగా బలపరీక్షలో ప్రభుత్వం విజయం సాధించడంతో.. గత కొంత కాలంగా సాగుతోన్న రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టయింది. కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమయిన 17 మంది సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. స్పీకర్ చర్యతో సభలో మ్యాజిక్ ఫిగర్ 104కి పడిపోయింది. దీంతో విశ్వాస పరీక్షలో యడియూరప్ప సునాయాసంగా విజయం సాధించారు. -
జాతకం తారుమారు అయ్యిందా?
సంచలనాలన్నీ తిరుగుబాటు ఎమ్మెల్యేల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. వారి రాజీనామాలతో కుమార సర్కారు కూలిపోగా, ఇప్పుడు వారివంతు వచ్చింది. మూకుమ్మడిగా అనర్హత వేటు పడడంతో రెబెల్స్ సందిగ్ధంలో పడిపోయారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రుల పదవులు ఊరిస్తూ ఉండగా ఇలా జరిగిందేమిటని కంగుతిన్నారు. సాక్షి, బెంగళూరు: అసంతృప్త ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పు మారిపోయే అవకాశాలున్నాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన రెబెల్స్‌కు కేబినెట్లో చోటు కల్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు వారిపై అనర్హత వేటు వేయడంతో పదవులు దక్కడం అనుమానమే. ఈ పరిణామం అధికార బీజేపీ ఎమ్మెల్యేల్లో సంతోషాన్ని నింపింది. తమ పదవులకు ఢోకా లేదని సీనియర్లు ఊహల్లో విహరిస్తున్నారు. ఒకవేళ రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే వారికే బీజేపీ టికెట్ ఇచ్చి ఉప ఎన్నికలు జరపాల్సి ఉండేది. గెలిచిన అభ్యర్థులకు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగిరి ఇవ్వాల్సి ఉంది. చదవండి: కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం పదవుల సంగతేమిటి? అనూహ్యంగా అందరిమీదా అనర్హత వేటు పడడంతో అసంతృప్త ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు. అనర్హత గురయిన ఎమ్మెల్యేలంతా సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. సుప్రీంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తే మంత్రి పదవులను డిమాండ్ చేసేందుకు ఆస్కారముంది. వ్యతిరేకంగా వస్తే మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ప్రభుత్వంలోని బోర్డులు, నామినేషన్ల అధ్యక్షులు, డైరెక్టర్ల పదవులను చేపట్టడానికి ఏ అడ్డంకీ లేనందున ఆ పదవులనే రెబెల్స్ డిమాండ్ చేయవచ్చు. ఆది నుంచీ ఆవేశాలు అనర్హతకు గురయిన రెబెల్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. దురాశకు వెళ్లి ఉన్న పదవులు పోగొట్టుకున్నారనే విమర్శలు రెబెల్ ఎమ్మెల్యేలపై వస్తున్నాయి. స్పీకర్ అనర్హత వేటు వేయడంతో వీరు 2023 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అప్పటి సీఎం కుమారస్వామితో పొసగడం లేదు. 14 నెలల పాలన కాలం లో విమర్శలు గుప్పిస్తూ కాం గ్రెస్, జేడీఎస్ నేతలకు మింగు డు పడకుండా తయారయ్యా రు. పదవులు దక్కలేదన్న ఆగ్రహంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. రాజీనామాలతో మొత్తం సంకీర్ణం చాపకిందకు నీళ్లు వచ్చాయి. ఇప్పుడు రెబెల్స్ భవిత ఏమిటనేది చర్చనీయాంశమైంది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఎ.శివరామ్ హెబ్బార్ ( యల్లాపుర), శ్రీమంత్ పాటిల్ (కాగవాడ); బైరతి బసవరాజు (కృష్ణరాజపురం); మునిరత్న ( రాజరాజేశ్వరి నగర); ఆర్.రోషన్ బేగ్ (శివాజీనగర); ప్రతాప్ గౌడ పాటిల్ (మస్కి); కేసీ నారాయణ గౌడ (కేఆర్ పేట); కె.గోపాలయ్య(మహాలక్ష్మి లేఔట్); ఎంటీబీ నాగరాజు (హోసకోటె); కె.సుధాకర్ (చిక్కబళ్లాపుర); హెచ్. విశ్వనాథ్(హుణసూరు); బీసీ పాటిల్ (హీరేకరూర్); ఆనంద్ సింగ్ (హొసపేట); ఎస్టీ సోమశేఖర్ (యశ్వంతపుర). -
14 మంది రెబెల్స్‌పై కొరడా
సాక్షి, బెంగళూరు/పుణే : కర్ణాటకలో రెబెల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరంతా కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి ముగిసేవరకూ(2023) ఎన్నికల్లో పోటీకి అనర్హులని స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల సంఖ్య 17కు చేరుకుంది. ఈ నెల 25న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. రమేశ్ కుమార్ నిర్ణయంతో యడియూరప్ప ప్రభుత్వం సోమవారం విశ్వాసపరీక్షను సులభంగా గట్టెక్కేందుకు అవకాశమేర్పడింది. కాగా, స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్, జేడీఎస్ స్వాగతించగా, ఓ పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే రమేశ్ రెబెల్స్‌పై వేటేశారని బీజేపీ విమర్శించింది. నోటీసులిచ్చినా స్పందించలేదు.. చట్టాన్ని అనుసరించి, మనస్సాక్షి ఆధారంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసినట్లు స్పీకర్ రమేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రస్తుత రాజకీయ సంక్షోభం నన్ను తీవ్రమైన డిప్రెషన్లోకి నెట్టేసింది. ఇది నా రాజకీయ జీవితంలో చివరిదశ కావొచ్చు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో నాపై వచ్చిన విమర్శలు నూటికి నూరుశాతం బాధించాయి. రెబెల్ ఎమ్మెల్యేలు విప్ ఉల్లంఘించినట్లు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో మూడు రోజుల్లోగా నా ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేశాను. వారు స్పందించకపోవడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలు ప్రతాప్‌గౌడ పాటిల్, బీసీ పాటిల్, శివరామ్ హెబ్బర్, ఎస్టీ సోమశేఖర్, జేడీఎస్ ఎమ్మెల్యేలు గోపీనాథ్, ఎ.హెచ్.విశ్వనాథ్, నారాయణ గౌడ, తదితరుల్ని అనర్హులుగా ప్రకటించాను’ అని చెప్పారు. ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్‌పై అనర్హత వేటేయాలని బీఎస్పీ కోరిందనీ, దీనిపైనా నిర్ణయం తీసుకుంటానన్నారు. తనపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందన్న వార్తలపై స్పందిస్తూ..‘నేనే సభాపతిగా ఉంటా. వాళ్లను(బీజేపీ) రానివ్వండి. నేను రాజీనామా చేయను. నా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాను’ అని తెలిపారు. విశ్వాసపరీక్షతో పాటు ఆర్థికబిల్లుకు ఆమోదం నేపథ్యంలో సోమవారం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మరణంపై స్పీకర్ రమేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘జైపాల్ రెడ్డి నాకు పెద్దన్నలాంటివారు. నాకు మార్గదర్శి. మాది 40 ఏళ్ల అనుబంధం ’ అని చెప్పారు. ‘సుప్రీం’లో సవాల్ చేస్తాం: రెబెల్స్ స్పీకర్ రమేశ్ కుమార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సోమవారం సవాలు చేస్తామని రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అనర్హత విషయంలో స్పీకర్ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారని జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యే ఎ.హెచ్.విశ్వనాథ్ ఆరోపించారు. ఓ వీడియోను విడుదలచేసిన తిరుగుబాటు ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్..అనర్హత వేటుపై సుప్రీంకోర్టుకు వెళతామనీ, న్యాయపోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని తెలుసుకునే పదవులకు రాజీనామా చేశామనీ, ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరించారని ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బలాబలాలు కర్ణాటక అసెంబ్లీలో 224 మంది సభ్యులు(స్పీకర్ కాకుండా) ఉన్నారు. స్పీకర్ 17 మందిపై అనర్హతవేటు వేయడంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 207కు చేరుకుంది. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 104కు తగ్గింది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది బలం ఉండగా, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా మద్దతు ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 100 మంది(నామినేటెడ్‌తో కలిపి) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే బలపరీక్షలో బీజేపీ విజయం సాధించడం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోమవారం బలపరీక్ష నేపథ్యంలో అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎమ్మెల్యేలకు బీజేపీ విప్ జారీ చేసింది. ఇక మిషన్ మధ్యప్రదేశ్! జైపూర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో బీజేపీ మధ్యప్రదేశ్‌పై దృష్టిసారించబోతోందన్న వార్తలపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యడియూరప్ప కేబినెట్ ఏర్పాటయ్యాక కొత్త మిషన్ ప్రారంభిస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వాలు కూల్చాలన్నది మా ఉద్దేశం కాదు. కానీ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య అనేక విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు. కాంగ్రెస్‌తో పోల్చుకుంటే ప్రధాని మోదీ నాయకత్వం మంచిదని వారంతా భావిస్తున్నారు. అంతర్గత కలహాలు, కుమ్ములాటలతోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోతున్నాయి’ అని విజయవర్గీయ అన్నారు. 100% విజయం: యడియూరప్ప సోమవారం జరిగే విశ్వాసపరీక్షలో విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. ‘సోమవారం అసెంబ్లీలో మెజారిటీని 100 శాతం నిరూపించుకుంటా. ఆర్థిక బిల్లును ఆమోదించకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేం. కాబట్టి అసెంబ్లీ ప్రారంభంకాగానే విశ్వాసపరీక్షను ముగించి, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలుపుతాం. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం తయారుచేసిన ఆర్థిక బిల్లునే సభలో ప్రవేశపెట్టబోతున్నాం. ఇందులో చిన్న కామా, ఫుల్‌స్టాప్‌ను కూడా మార్చలేదు’ అని అన్నారు. -
కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. అనర్హత వేటు వేయడం చట్టవిరద్దమని, రేపు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని జేడీ(ఎస్) రెబల్ ఎమ్మెల్యే విశ్వనాథ్ తెలిపారు. తమపై అనర్హత వేటు వేయడాన్ని చట్ట విరుద్ధంగా భావిస్తున్నానని, అందుకే ఈ విషయమై తాను సుప్రీంను ఆశ్రయిచంనున్నట్లు స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందని, సుప్రీంకోర్టులోనే తమకు న్యాయం జరుగుతుందని మరో రెబల్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ ఓ వీడియో విడుదల చేశారు. (చదవండి : కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం) కాగా స్పీకర్ తాజా నిర్ణయంతో వేటు పడిన మొత్తం సభ్యుల సంఖ్య 17కి చేరింది(ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు). మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా దీనికి హాజరుకావాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడటంతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 207కు పడిపోయింది. బల నిరూపణకు కావల్సిన బలం 105. భాజపాకి 105మంది సొంత పార్టీ సభ్యులతో పాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో రేపు బల పరీక్షలో సీఎం యడియూరప్ప నెగ్గేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం
సాక్షి, బెంగళూరు: గత కొంతకాలంగా ఉత్కంఠ రాజకీయాలకు వేదికయిన కర్ణాటకలో అసెంబ్లీ స్పీకర్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మొత్తం 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్.. తాజాగా 13 మంది కాంగ్రెస్, ఓ స్వతంత్ర సభ్యుడిపై అనర్హత వేటు వేశారు. దీంతో వేటు పడిన మొత్తం సభ్యుల సంఖ్య 17కి చేరింది. స్పీకర్ తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.. దీంతో వారంత నాలుగేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా దీనికి హాజరుకావాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా తాను మాత్రం స్పీకర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 17 మంది సభ్యులపై అనర్హత వేట పడడంతో.. సభలో మొత్తం సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. దీంతో మేజిక్ ఫిగర్ 104కి చేరింది. బీజేపీకి ప్రస్తుతం 105 మంది సభ్యులు ఉండగా.. ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. దీంతో విశ్వాస పరీక్షలో బీజేపీ సునాయాసంగా నెగ్గే అవకాశం ఉంది. అనర్హత వేటుకు గురయిన ఎమ్మెల్యేలు వీరే.. కాంగ్రెస్ బస్వరాజు మునిరత్నం సోమశేఖర్ రోషన్‌బేగ్ ఆనంద్‌సింగ్ నాగరాజు బీసీ పాటిల్ ప్రతాప్ గౌడ్ సుధాకర్ శివరాం హెబ్బర్ మంత్ పాటిల్ రమేష్ జార్జ్‌హోళి మహేష్ జేడీఎస్ గోపాలయ్య నారాయణ గౌడ్ విశ్వనాథ్ శంకర్(స్వతంత్ర) -
మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు కూడా కాకముందే బీజేపీ జోరుపెంచింది. కాంగ్రెస్ నేత, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బీజేపీ తరఫు ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని నేరుగా స్పీకర్‌కు చేరవేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘రమేశ్ కుమార్ స్వచ్ఛందంగా తప్పుకోకుంటే ఆయనపై అవిశ్వాసం పెట్టక తప్పదు. అయితే మా తొలిప్రాధాన్యం సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడం, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడమే. ఇది పూర్తయ్యాక స్పీకర్ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి లబ్ధి చేకూర్చేలా స్పీకర్ వ్యవహరించవచ్చన్న అనుమానంతోనే బీజేపీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు యడియూరప్ప ప్రభుత్వానికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ చెప్పారు. అనర్హతపై రెబెల్స్ న్యాయపోరాటం.. స్పీకర్ అనర్హతవేటు వేసిన నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుతో పాటు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని ఎమ్మెల్యేలు రమే శ్ జార్కిహోళి, మహేశ్ కుమటహళ్లి, శంకర్లు నిర్ణయించారు. సుప్రీంలో రమేశ్, మహేశ్‌ల పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తీసుకోకుండా అనర్హులను చేయడంపై వీరిద్దరూ అఫిడవిట్లు దాఖలు చేస్తారని సమాచారం. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌ను కాంగ్రెస్ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్ అనర్హతవేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ సోమవారం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఫిరాయింపుల చట్టం కింద వేటువేయడం కుదరదని శంకర్ చెబుతున్నారు. తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినప్పటికీ, 6 నెలల్లోపు జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు సుప్రీంకోర్టు, ఈసీ అనుమతించిన విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ ముగిసేవరకూ (2023) అనర్హత వేటేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులు కోర్టులో నిలబడవని స్పష్టం చేస్తున్నారు. -
బీజేపీకి కుమారస్వామి మద్దతు!
సాక్షి, బెంగళూరు: రాజకీయ సంక్షోభంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. తదుపరి బలపరీక్షపై వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయింది. బీజేపీకి ప్రస్తుతం 106 మంది సభ్యుల (బీజేపీ 105, ఓ స్వతంత్ర ఎమ్మె ల్యే) బలముంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగురిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పు డు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ సభ్యుల మద్దతును కోరతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శుక్రవారం రాత్రి జేడీఎస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా రెండు ప్రతిపాదనలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మాజీ మంత్రి జీవీ దేవెగౌడ ఈ వివరాలను వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చి ప్రభుత్వంలో భాగస్వామి కావడమా? లేక ప్రజల్లో ఉంటూ యడియూరప్పపై పోరాటం చేయడమా? అనే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. అయితే ఈ భేటీలో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు సుముకంగా ఉన్నారని వెల్లడించారు. తనతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యే మద్దతుకు సిద్ధంగా ఉన్నామని.. దీనిపై కుమారస్వామి తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌తో జేడీఎస్ చెలిమిని కొనసాగిస్తుందా? బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలుపుతుందా? కాంగ్రెస్‌తో చెలిమికి గుడ్‌బై చెప్పి, బీజేపీ ప్రభుత్వంపై ఒంటరిగానే పోరాటం చేస్తుందా? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. మరోవైపు బీజేపీ కూడా జేడీఎస్ సభ్యుల మద్దతు కోరడంపై ఆలోచనలు చేస్తున్నట్ల తెలిసింది. వారితోపాటు రెబల్స్‌ను కూడా తమవైపునకు తిప్పుకునేందుక ప్రయత్నలను ముమ్మరం చేస్తోంది కమళ దళం. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షపై ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. -
కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో మరోసారి కమలనాథుల ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక 32వ ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప(76) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ వజూభాయ్‌వాలా శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సదానంద గౌడతో పాటు మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ, కర్ణాటక బీజేపీ ఇన్చార్జ్ మురళీధరరావు, బీజేపీ నేత శోభాకరంద్లాజే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజన్న ఈ వేడుకకు వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచారు. కర్ణాటకలో హెచ్.డి.కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన మూడ్రోజులకే యడియూరప్ప ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. కాంగ్రెస్ నేతలెవరూ ఈ కార్యక్రమానికి రాలేదు. యెడ్డీకి అమిత్ షా ఫోన్.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయడంతో బీజేపీ అధిష్టానం చకచకా పావులు కదిపింది. పలువురు న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. శుక్రవారం ఉదయాన్నే యడియూరప్పకు ఫోన్‌చేసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్‌వాలా అపాయింట్మెంట్ తీసుకున్న యడియూరప్ప నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలనీ, సభలో మెజారిటీని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన గవర్నర్ వజూభాయ్‌వాలా సాయంత్రం 6–6.15 గంటల మధ్యలో ప్రమాణస్వీకారం చేయాలని ఆదేశించారు. యడియూరప్ప ఇప్పటికే ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన్ను బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా మరోసారి ఎన్నుకోలేదు. 29న అసెంబ్లీలో బలపరీక్ష.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక యడియూరప్ప స్పందిస్తూ.. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు బలపరీక్షను చేపడతామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన ఆర్థిక బిల్లును కూడా ఆమోదిస్తామని చెప్పారు. బీజేపీ చీఫ్ అమిత్ షాను సంప్రదించి త్వరలోనే మంత్రివర్గ విస్తరణను చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు యడియూరప్ప విజ్ఞప్తి మేరకు సోమవారం సభను నిర్వహిస్తానని స్పీకర్ చెప్పారు. యడ్యూరప్ప కాదు.. యడియూరప్ప! కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తన పేరును మరోసారి మార్చుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్‌కు రాసిన లేఖలో తన పేరును ఆయన ‘బీఎస్ యడియూరప్ప’గా రాశారు. న్యుమరాలజీ ప్రభావంతో యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. 2007లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిరావడంతో న్యుమరాలజీ ప్రకారం యడియూరప్ప తన పేరును యడ్యూరప్పగా మార్చుకున్నారు. అయితే ఇది కలిసిరాకపోవడంతో ఈ బీజేపీ నేత తన పాత పేరునే వాడాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమా? ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుం టుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయింది. బీజేపీకి ప్రస్తుతం 106 మంది సభ్యుల (బీజేపీ 105, ఓ స్వతంత్ర ఎమ్మె ల్యే) బలముంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగు రిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పు డు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ స్పీకర్ రమేశ్ మిగిలిన 14 మంది రెబెల్స్ రాజీనామాలను ఆమోదిస్తే/ అనర్హత వేటేస్తే అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 208కి చేరుకుంటుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు 105 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. ఇదే జరిగితే ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ గట్టెక్కుతుంది. అయితే 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ప్రస్తుతం అస్పష్టత నెలకొంది. ప్రజానుకూల పాలన అందిస్తాం: అమిత్ షా కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సుస్థిరమైన, రైతు, ప్రజానుకూల పాలన అందిస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్పకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. కలహాలవల్లే కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిందనీ, తమ ప్రమేయం లేదన్నారు. మండిపడ్డ కాంగ్రెస్, జేడీఎస్.. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకా రం చేయడంపై కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ‘బీజేపీకి అండగా నిలిచిన వజూభాయ్‌వాలా సాయంతో రాజ్యాంగ విరుద్ధంగా కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. అవినీతి రారాజు, జైలు పక్షి యడియూరప్ప రాజకీయ ప్రలోభాల విషయంలో తన అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి అధికారంలోకి వచ్చారు’ అని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శించింది. కర్ణాటక బీజేపీకి ప్రయోగశాలగా మారిపోయిందని సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. యడియూరప్ప వరాల జల్లు కర్ణాటకలో రైతులు, చేనేత కార్మికులకు సీఎం యడియూరప్ప వరాలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఎంపికైన రైతులకు అదనంగా రూ.4000ను రెండు విడతల్లో అందజేస్తామని తెలిపారు. ఈ పథకం కింద కేంద్రం ఏటా రూ.6 వేలు అందిస్తుందన్నారు. అలాగే చేనేత కార్మికులకు రూ.100 కోట్ల మేర ఉన్న అప్పులను మాఫీ చేస్తామని వెల్లడించారు. రైతుల రుణమాఫీ విషయంలో అన్నిపక్షాలను సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 15 ఏళ్లకే ఆరెస్సెస్ కార్యకర్త కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆరెస్సెస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. తన స్వగ్రామం శికారిపురలో ఒక రైలు మిల్లులో పని చేశారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మైత్రిదేవిని ప్రేమించి పెళ్లాడారు. ఆరెస్సెస్ శికారిపుర సంఘ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో బీజేపీలో చేరిన యడ్యూరప్ప 1983 నుంచి శికారిపుర ఎమ్మెల్యేగా ఏడు సార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 2007లో.. 2007 నవంబర్‌లో తొలిసారి యడియూరప్ప సీఎం అయ్యారు. జేడీ(ఎస్) మద్దతు ఉపసంహరించడంతో ఆయన ఏడు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008 మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అక్రమ మైనింగ్ కేసులో లోకాయుక్త యడియూరప్పను దోషిగా తేల్చడంతో మూడేళ్లకే 2011 జులైలో సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. వారం రోజులు జైల్లో ఉన్నారు. కొత్త పార్టీ.. మళ్లీ విలీనం ఆ తరువాత కర్ణాటక జనతా పక్ష (కేజేపీ) పేరుతో పార్టీ పెట్టారు. 2014లో కేజేపీని బీజేపీలో విలీనం చేశారు. 2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో యడియూరప్ప మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చారు. కానీ, దీనిపై కాంగ్రెస్, జేడీ(ఎస్) కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు వెంటనే బలాన్ని నిరూపించుకోవాలంటూ ఆదేశించింది. కేవలం 3 రోజులు మాత్రమే సీఎంగా ఉన్న యెడ్డీ మే 19న బలపరీక్షకు కాస్త ముందు రాజీనామా చేశారు. -
యడ్యూరప్ప బల పరీక్షకు డెడ్‌లైన్ ఫిక్స్
సాక్షి, బెంగళూరు: రాజకీయ సంక్షోభంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమయింది. ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్పీకారం చేయనున్నారు. దీనికి గవర్నర్, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీలో బల నిరూపణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న రాజకీయ సంక్షోభం కారణంగా విశ్వాస నిరూపణకు గవర్నర్ అనూహ్యాంగా వారికి ఏడు రోజుల సమయం ఇచ్చారు. జూలై 31న శాసనసభలో యడ్యూరప్ప బల పరీక్షను ఎదుర్కోనున్నారు. గవర్నర్ వారికి ఏడు రోజుల సమయం కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభను బీజేపీ ఓ ప్రయోగశాలగా మార్చిందని మండిపడింది. రాజ్యాంగంలో ఏ అధికారణ ప్రకారం గవర్నర్ మెజార్టీకి తక్కువగా ఉన్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని ప్రశ్నించింది. ఈచర్య సిగ్గుచేటని ఘటుగా స్పందించింది. ఈ మేరకు పార్టీ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను పావుగా ఉపయోగించుకుంటోందని విమర్శించింది. గతంలోలా అసెంబ్లీలో బలం సరిపోక మరోసారి యడ్యూరప్ప రాజీనామా చేయక తప్పదని కాంగ్రెస్ జోస్యం చెప్పింది. మరోవైపు యడ్యూరప్ప విశ్వాసపరీక్షపై బీజేపీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. రెబల్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు కేంద్ర నాయకత్వం ఆపార్టీ నేతలను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ కూడా మరోసారి రెబల్స్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలావుండగా రెబల్స్‌పై స్పీకర్ తీసుకునే నిర్ణయం ఉత్కంఠగా మారింది. ఇదివరకే ముగ్గురు సభ్యులపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. -
మా వెనుకున్నది ఆయనే: రెబల్ ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ రెబల్స్ వెనుక ఆయన హస్తం ఉందంటూ జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా వారి ఆ వార్తలను నిజం చేస్తూ.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే శివరాం హెర్బర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తామంతా సిద్దరామయ్య సూచనల మేరకే నడుచుకున్నామంటూ బాంబు పేల్చారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో నెలకొన్న అనిశ్చితికి సిద్దరామయ్యే కారణం. పార్టీకి దూరంగా ఉండమని కొద్ది రోజుల క్రితం ఆయన మాకు చెప్పారు. కానీ ఇప్పుడు మమ్మల్నే నిందిస్తున్నారు. మేమంతా ఏకతాటిపై ఉన్నాం. అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. మేం బీజేపీలో చేరుతున్నామనేది అబద్ధం’ అని తెలిపారు. శివరాం వ్యాఖ్యలపై కన్నడ రాజకీయాల్లో పెను దుమారం చేలరేగుతోంది. ఈ నేపథ్యంలో హెర్బర్ వ్యాఖ్యలపై సిద్దరామయ్య స్పందించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారని. ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే వారికి గట్టిగా బుద్ధి చెప్తానని ట్వీట్ చేశారు. విశ్వాస పరీక్షలో ప్రభుత్వాన్ని కాపాడటానికి తనవంతు కృషి చేశానని సిద్దూ చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటక సంక్షోభం అనంతరం స్థానిక నేతలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ పతనం వెనుక సిద్దరామయ్య ఉన్నారన్న వార్తలు కాంగ్రెస్ అధిష్టానం దృషికి కూడా వెళ్లాయి. దీంతో ఆయనపై పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ప్రభుత్వ పతనం వెనుక కాంగ్రెస్! ఇదిలావుండగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శుక్రవారం సాయంత్రం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా ఉండేందుకు మరోసారి రెబల్స్‌ను బుజ్జగింజే ప్రయత్నంలో పడ్డారు జేడీఎస్, కాంగ్రెస్ నేతలు. మరోవైపు వారి రాజీనామాలపై అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో కర్ణాటక రాజకీయాల ఉత్కంఠ మరికొన్ని రోజులు సాగనున్నట్లు తెలుస్తోంది. -
సీఎంగా నేడు యడ్యూరప్ప ప్రమాణం!
సాక్షి, బెంగళూరు: అనేక ఉత్కంఠ పరిణమాల అనంతరం కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తోంది. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్‌తో బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ దానికి సానుకూలంగా స్పందించారని, ఆరోజు సాయంత్రం 6గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్పీకారం చేస్తారని సమాచారం. గవర్నర్‌తో భేటీ అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎంగా తాను ప్రమాణం చేస్తానని యడ్డీ స్పష్టం చేశారు. ఇదిలావుండగా కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ అనర్హత వేటు వేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటల్లి, శంకర్‌లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామాలు ఇవ్వలేదనీ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్(ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించారని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై ఆచితూచి అడుగులు వేస్తోన్న బీజేపీ కేంద్రనాయకత్వం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవల్సిందిగా యడ్డీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మిగిలిన రెబల్స్‌పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా మారింది. -
ముగ్గురు రెబెల్స్‌పై అనర్హత వేటు
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటల్లి, శంకర్‌లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామాలు ఇవ్వలేదనీ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్(ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించారని స్పష్టం చేశారు. ప్రస్తుత శాసనసభ కాలం ముగిసే వరకూ (2023) వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, సభలో పదవులు చేపట్టేందుకు అనర్హులని తేల్చిచెప్పారు. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవటం తెలిసిందే. తన నిర్ణయంపై రెబెల్స్ కోర్టులకు వెళ్లే అవకాశముందన్నారు. ఆర్థిక బిల్లుకు గనక ఈ నెల 31లోగా ఆమోదం లభించకపోతే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు అసెంబ్లీని సస్పెండ్ చేయడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదని చెప్పారాయన. మరోవైపు తమ రాజీనామాలపై స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువు కావాలని రెబెల్స్ కోరారు. యెడ్డీ జోరుకు షా బ్రేక్.. బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప, నేతలు జగదీశ్ షెట్టర్, అరవింద్ లింబావలి, మధుస్వామి, బసవరాజ్ బొమ్మై గురువారం ఢిల్లీ చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అయితే మిగిలిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ తుది నిర్ణయం తీసుకున్న తరవాతే ముందుకెళ్లాలనీ, అప్పటివరకూ ఓపికపట్టాలని యడ్యూరప్పకు షా సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సాక్షి, బెంగళూరు : విశ్వాస పరీక్ష ముగిసినా కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన 48 గంటల్లోనే కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గురువారం అనర్హత వేటు వేశారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్.శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్జ్‌హోళి, మహేష్... 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటన చేశారు. విశ్వాస తీర్మానంలో కుమారస్వామి ప్రభుత్వానికి వీరంతా మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ కేపీజేపీ (కర్ణాటక ప్రజకీయ జనతా పార్టీ) తరపును పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఈ ఏడాది జూన్ 14న గవర్నర్‌కు లేఖ ఇచ్చారు. అంతేకాకుండా కేపీజేపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. విలీన ప్రక్రియకు స్పీకర్ ఈ ఏడాది జూన్ 25న ఆమోదం తెలపడంతో ఆర్.శంకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణించడం జరిగింది. కాగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్ బీజేపీలోకి చేరేందుకు సన్నద్ధం అయ్యారు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పీకర్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. 17 రోజులు హైడ్రామా కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి కుమారస్వామి పనితీరుకు వ్యతిరేకంగా రెండు పార్టీల నుంచి 16మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వం ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. అయితే ఎవరు ఎందుకు రాజీనామా చేశారనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. రాజీనామా చేసిన 16మందిలో 12మంది ముంబయిలో మకాం వేశారు. పార్టీ అధిష్టానం విప్ జారీ చేసినప్పటికీ పట్టించుకోలేదు. ముంబయికి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్ జాతీయ నేతలు గులాంనబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్ వెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయింది. -
హై‘కమాండ్’ కోసం ఎదురుచూపులు
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక బీజేపీ చీఫ్, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. అయితే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరులోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయం ‘కేశవ కృప’లో బుధవారం సంఘ్ పెద్దలను కలుసుకున్న అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘నేను ఢిల్లీ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నా. ఎప్పుడు అవసరమైనా నేను బీజేపీ శాసనసభా పక్షాన్ని సమావేశపర్చి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలుసుకోగలను. కానీ ఇందుకోసం పార్టీ హైకమాండ్ నుంచి తొలుత స్పష్టత రావాలి’ అని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షకు అనుకూలంగా 99 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా, 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. దీంతో విశ్వాసతీర్మానం వీగిపోయి సీఎం కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆరెస్సెస్ ఆశీర్వాదం వల్లే.. ఆరెస్సెస్ పెద్దల ఆశీర్వాదం, సహకారం కారణంగానే తాను తాలూకా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతగా, ముఖ్యమంత్రిగా ఎదిగానని యడ్యూరప్ప తెలిపారు. ‘తదుపరి కార్యాచరణను చేపట్టేముందు ఆరెస్సెస్ పెద్దల ఆశీస్సులు తీసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. విశ్వాసపరీక్ష సందర్భంగా మా ఎమ్మెల్యేలు బలంగా, ఐకమత్యంతో నిలిచారు. మాకు రాబోయే కాలంలో కీలకమైన పరీక్షలు ఎదురుకానున్నాయి. ఇలాంటి పరిస్థితులన్నింటిని దీటుగా ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’ అని వెల్లడించారు. మరోవైపు విశ్వాసపరీక్షకు డుమ్మా కొట్టిన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని బీజేపీ అధిష్టానం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిపై స్పష్టత వచ్చాకే కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ముందుకెళ్లాలని భావిస్తోంది. కాగా, ముంబైలో ఆందోళన చెందుతున్న రెబెల్ ఎమ్మెల్యేలకు సర్దిచెప్పేందుకు బీజేపీ నేతలు అశ్వంత్ నారాయణ్, ఆర్.అశోక ముంబైకి బయలుదేరివెళ్లారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక దూత.. కర్ణాటకలో నాటకీయ పరిణామాల మధ్య సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను సాఫీగా జరిగేలా చూసేందుకు త్వరలోనే ప్రత్యేక పరిశీలకుడిని పంపనుంది. కర్ణాటకలో విశ్వాసపరీక్షకు మొత్తం 17 మంది అధికార కూటమి సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వీరిపై స్పీకర్ చర్యలు తీసుకునేవరకూ వేచిఉండాలన్న ధోరణితోనే బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ స్పీకర్ సుప్రీంకోర్టుకెళ్లిన 15 మంది రెబెల్స్ రాజీనామాలను ఆమోదించి లేదా అనర్హత వేటేస్తే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 210కి, కాంగ్రెస్–జేడీఎస్ కూటమి బలం(బీఎస్పీ ఎమ్మెల్యేతో కలుపుకుని) 103కు చేరుకుంటుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106కు తగ్గుతుంది. దీంతో 107 ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ కూటమి(బీజేపీ 105, ఇద్దరు స్వతంత్రులు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమౌతుంది. అయితే స్వతంత్రుల దయాదాక్షిణ్యాలపై బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగించాల్సి ఉంటుంది. -
ప్రజాతీర్పే పరిష్కారం
‘ఇంకెన్నాళ్లు...?’ అని అందరి చేతా పదే పదే అనిపించుకున్నాక, మూడు వారాలపాటు కాలయాపన చేశాక కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకుంది. అక్కడి రాజకీయ పరిణామాలతో విసుగు చెందిన జనం ఊపిరిపీల్చుకునేంతలోనే మధ్యప్రదేశ్‌లో కుర్చీలాట మొదలైంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 24 గంటల్లో కూల్చేస్తామని బీజేపీ ప్రకటించగా, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను తమకు అనుకూలంగా మలుచుకుని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఈ సవాలుకు జవాబిచ్చారు. ఆ రాష్ట్రంలోని రాజకీయం మరెన్ని మలుపులు తిరుగు తుందో రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. కర్ణాటక రాజకీయ చదరంగంలో అటు అధికార పక్షమూ, ఇటు విపక్షమూ రెండూ సాధారణ ప్రజానీకానికి ఏవగింపు కలిగించాయి. నిరుడు మే నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిననాటినుంచి దినదిన గండంగానే బతుకీడుస్తోంది. 104మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ... యడ్యూరప్ప సారధ్యంలో సర్కారు ఏర్పరి చినా అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. అటుపై 116మంది బలం ఉన్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమి డీకే కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ కూటమి ప్రభు త్వానికి పాలనపై దృష్టి పెట్టే అవకాశమే కలగలేదు. స్వీయ రక్షణే దాని ఏకైక ఎజెండాగా మారింది. కూటమి సర్కారును కూల్చడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని స్వల్పకాలం ఏలిన యడ్యూరప్ప కాచుక్కూర్చోగా... కేవలం 37 స్థానాలు మాత్రమే గెల్చుకున్న కుమారస్వామి అందలం ఎక్కడాన్ని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జీర్ణించుకోలేక పోయారు. వెలుపలి నుంచి యడ్యూరప్ప, లోపలినుంచి సిద్దరామయ్య ఇలా రగిలిపోతుంటే కుమారస్వామి భరోసాతో ఉండటం ఎలా సాధ్యం? అందుకే ఆయన రాజీనామా చేసి పోతానని అనేకసార్లు బెదిరించారు. ఒక సందర్భంలో కంటతడి పెట్టారు. ఎవరినీ సంతృప్తిపరచలేక, సము దాయించలేక అయోమయానికి లోనయ్యారు. అయినా సిద్దరామయ్యను అదుపు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఆయన్ను ఏదోవిధంగా సముదాయించినా ఆ పార్టీలో ఇతరేతర వర్గాలున్నాయి. వాటి డిమాండ్లు వాటికున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం కూటమి ప్రభుత్వం 14 నెలలు అధికారంలో కొనసాగడం నిజంగా వింతే. ఇప్పుడు యడ్యూరప్ప వెంటనే ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారో, లేదో చూడాల్సి ఉంది. సభకు గైర్హాజరైన 17మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల వ్యవహారం ఏ మలుపుతిరుగుతుందో కూడా ఆసక్తికరమే. అయితే యడ్యూరప్ప ఏర్పరిచే ప్రభుత్వమైనా సుస్థిరంగా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు పదవులు దక్కని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు చేసినట్టే, రేపు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించరని చెప్పలేం. 2008లో అధికారంలోకి వచ్చాక బీజేపీలో చెలరేగిన అంతర్గత కుమ్ము లాటలు ఎవరూ మరిచిపోరు. తొలుత యడ్యూరప్ప, ఆ తర్వాత సదానంద గౌడ, అటుపై జగదీశ్ శెట్టార్లకు అధికార పగ్గాలు అప్పగించినా అసంతృప్తి సద్దుమణగలేదు. పార్టీలో ముఠా తగాదాలు ముదిరిపోగా అధిష్టానం నిస్సహాయంగా మిగిలిపోయింది. చివరకు 2013లో దారుణంగా ఓటమి పాలయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిచేరే కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల అండతో ఏర్పడబోయే ప్రభుత్వం ఎన్నాళ్లు మనుగడ సాగించగలదో చూడాలి. అధికారం కోల్పోయిన కాంగ్రెస్, జేడీఎస్ లకు ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయిలో వనరులు లేవు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా అదంత సులభమూ కాదు. కాంగ్రెస్, జేడీఎస్‌లు ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే అదే గొప్ప అనుకోవాలి. అసలు ఆ రెండూ ఇప్పుడున్నట్టే మిత్రపక్షాలుగా కొనసాగుతాయన్న నమ్మకం ఎవరికీ లేదు. అయితే బీజేపీ తెరవెనక ఉండి ఆడించిన రాజకీయ క్రీడ వల్ల తాము అధికారం కోల్పోయామని ప్రజల ముందు ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడానికి వాటికి అవ కాశం ఉంటుంది. రెండూ కలిసి నడిస్తేనే ఇదంతా సాధ్యం. తగినంత మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వాలు ఫిరాయింపుల వల్ల కూలిపోవడం విచారించదగ్గ విషయమే. కానీ దేశంలో వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ కూడా ఫిరాయింపుల విషయంలో సూత్రబద్ధమైన వైఖరితో లేవు. ఫిరాయింపుల వల్ల బలైనప్పుడు ఒకలా, వాటివల్ల లబ్ధి పొందే పరిస్థితులున్నప్పుడు మరొకలా మాట్లాడటం ఆ పార్టీలకు అలవాటైపోయింది. సాగినన్నాళ్లు కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ప్రభుత్వాలను పడగొట్టింది. గతంలో కాంగ్రెస్‌ను తప్పుబట్టిన బీజేపీ ఇప్పుడు అధికారం అందుకున్నాక తానూ ఆ మార్గాన్నే అనుసరిస్తోంది. ఫిరా యింపుల నిరోధక చట్టం ఆచరణలో పనికిమాలినదని రుజువయ్యాక కూడా కేంద్రంలో అధికారం చలాయించిన ఏ పక్షమూ దాన్ని సరిచేయడానికి పూనుకోలేదు. అలా చేయనివారే నష్టపోయినప్పుడల్లా అన్యాయం జరిగిందని శోకాలు పెడుతున్నారు. తాము అధికారంలోకొచ్చినప్పుడు మళ్లీ ఆ ఫిరాయింపులనే ప్రోత్సహించి, వాటితోనే మనుగడ సాగిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్ పరిధి నుంచి తొలగించి ఎన్నికల సంఘానికి కట్టబెడితే ఈ సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. కానీ అది ముందుమునుపూ ఏం సమస్యలు తెచ్చిపెడు తుందోనన్న భయంతో అలాంటి సవరణకు ఏ ప్రభుత్వమూ సిద్ధపడదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పది కాలాలపాటు నిలబెడదామని, విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉందామని పార్టీలు భావించనంతకాలమూ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఫిరాయింపుల్ని, వాటిని ప్రోత్స హించే పార్టీలనూ ప్రజలు ఏవగించుకుంటే పార్టీలు పంథా మార్చుకోక తప్పని స్థితి ఏర్పడుతుంది. అంతవరకూ ఈ రాజకీయ సంతలు, బేరసారాలు కొనసాగక తప్పదు. కర్ణాటకలో ఇప్పుడున్న రాజ కీయ అస్థిరత సమసిపోవాలన్నా, అనైతిక రాజకీయాలకు కళ్లెం పడాలన్నా కొత్తగా ప్రజల తీర్పు కోరడమే శ్రేయస్కరం. అయితే అందుకు ఎన్ని పార్టీలు సిద్ధపడతాయన్నది ప్రశ్నార్థకమే. -
కర్ణాటకం: పతనం వెనుక కాంగ్రెస్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం ఎవరు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలు గెలుకుచుకున్న జేడీఎస్‌కు సీఎం పదవి దక్కడంతో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరవెనుక చక్రం తిప్పారా?. అంటూ కన్నడ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయగా.. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సిద్ధమయ్యారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నాయకులు ఉండి బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టలేకపోయారంటూ రాష్ట్ర నేతలపై అసహనంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్దరామయ్యపై వ్యవహారంపై రాహుల్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, పతానానికి కారణం ఆయనే అంటూ మండిపడుతున్నారని తెలిసింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. సీఎంగా కుమారస్వామి పదవీ బాధ్యతలు చేపట్టనప్పటి నుంచీ ప్రభుత్వంపై సిద్దరామయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు అన్నీ తానై నడిపించిన తనను కాదని, అతి తక్కువ స్థానాలు గెలుచుకున్న జేడీఎస్‌కు, అందులోనూ తనకు గిట్టని కుమారస్వామికి సీఎం పదవి కట్టబెట్టడంపై రామయ్య గుర్రుగా ఉన్నారంటూ పెద్దస్థాయిలో చర్చ కూడా జరిగింది. అంతేకాదు సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదని, రానున్న ఏడాదిలోపు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని గతంలో ఆయన వ్యాఖ్యానించిన సందర్భాలెన్నో. మరోవైపు కుమారస్వామితో పాటు, మాజీ ప్రధాని దేవెగౌడ సైతం సిద్దరామయ్య తీరుపై అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్దూ కుట్రపన్నుతున్నారని, తమకు వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తున్నారంటూ బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాటి నుంచి వీరి మధ్య సరైన అవగహన లేనట్లు బయటపడింది. దీనికి తోడు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఘోర పరాజయం పాలవ్వడం సంకీర్ణంలో విభేదాలు మరింత పెరిగాయి. జేడీఎస్-కాంగ్రెస్ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా 28 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా.. ఇరు పార్టీలు కేవలం ఒక్కో స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి. దేవెగౌడ సైతం ఓటమి చవిచూడక తప్పలేదు. ఫలితాల అనంతరం సిద్దరామయ్య మాట్లాడుతూ.. జేడీఎస్‌తో పొత్తు కారణంగా తాము ఎంతో నష్టపోయామని ఏకంగా మీడియా సమావేశంలోనే విమర్శించారు. దేవెగౌడ, కుమారస్వామి కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలూ చేశారు. దీంతో కన్నడ పంచాయతీ కాంగ్రెస్ పెద్దల దగ్గరకు వెళ్లడంతో సిద్దరామయ్య అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇదిలావుండగా తాజాగా ప్రభుత్వం పడిపోవడానికి కూడా కారణం ఆయనే అని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగిన ఎమ్మెల్యేలు అత్యధిక మంది సిద్దరామయ్య వర్గానికి చెందినవారే ఉన్నారు. రెబల్స్ వెనుక సిద్దూ హస్తం ఉందంటూ జేడీఎస్ మొదటి నుంచి చెబుతూనే ఉంది. అయినా కూడా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరుపార్టీల మధ్య ఉన్న విభేదాలను ప్రతిపక్ష బీజేపీ ఆసరాగా చేసుకుని రెబల్స్‌ను తమపైపు తిప్పుకున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరికి ఉన్న ప్రభుత్వం ఊడిపోయి.. బీజేపీ ఖాతాలోకి మరో రాష్ట్రం చేరబోతోంది. -
‘ఎందుకు బహిష్కరించారో అర్థం కావట్లేదు’
సాక్షి, బెంగళూరు : కర్ణాకటకలో 14 నెలల పాటు కొనసాగిన కుమారస్వామి ప్రభుత్వం.. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కుమారస్వామి ప్రవేశ పెట్టిన తీర్మాణానికి 99 మంది అనుకూలంగా మద్దతు ఇవ్వగా.. 105 మంది వ్యతిరేకించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ హాజరుకాలేదు. కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించనా.. ఓటింగ్‌లో పాల్గొనకపోవడం పట్ల పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్ చేశారు. (చదవండి : కుమార ‘మంగళం’) మాయావతి నిర్ణయంపై ఎమ్మెల్యే మహేశ్ స్పందింస్తూ.. తనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో అర్థం కావడంలేదన్నారు. తాను ఓటింగ్‌లో పాల్గొనడంలేదని ముందే చెప్పానని, అయినప్పటికీ ఎందుకు బహిష్కరించారో తెలియడం లేదన్నారు. మయావతి ట్వీట్ గురించి తనకు తెలియదని, ఈ విషయంపై తర్వాత మాట్లాడతానని తెలిపారు. కాగా కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పినా.. పార్టీ నియమామలను ఉల్లంఘిస్తూ మహేశ్ సభకు హాజరుకాలేదని అందుకే అతన్ని బహిష్కరిస్తున్నాని మాయావతి ట్వీట్ చేశారు. (చదవండి : కూలిన కుమార సర్కార్ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు) 2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, జేడీఎస్‌లు కూటమిగా బరిలో నిలిచాయి. ఈ కూటమి తరఫున బరిలో నిలిచిన మహేశ్ కొల్లెగల నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి తన మంత్రివర్గంలో మహేశ్‌కు స్థానం కల్పించారు. ఆయనకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే కొద్దికాలం పాటు మంత్రిగా కొనసాగిన మహేశ్.. 2018 అక్టోబర్‌లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
‘ప్రతిదీ కొనలేం.. ఆ రోజు వస్తుంది’
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో బీజేపీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ‘ప్రతిదీ కొనలేం.. ప్రతి ఒక్కరిని బెదిరించలేం.. ప్రతి అబద్ధం బయటపడే రోజు తప్పక వస్తుంది.. త్వరలోనే బీజేపీ ఈ విషయాన్ని గ్రహిస్తుందని’ ప్రియాంక ట్వీట్ చేశారు. ‘ప్రజలు భరించినంత వరకే.. నాయకుల అంతులేని అవినీతి, ప్రజా ప్రయోజనాలను కాపాడే సంస్థలను నిర్వీర్యం చేయడం.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చడం వంటి అంశాలు కొనసాగుతాయి. ఒక్కసారి ప్రజల్లో సహనం నశిస్తే.. ఎంతటి నాయకుడైనా తుడిచిపెట్టుకుపోతా’డని మరో ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. One day the BJP will discover that everything cannot be bought, everyone cannot be bullied and every lie is eventually exposed. 1/2 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 23, 2019 దురాశ, స్వార్థ ప్రయోజనాలే గెలిచాయి: రాహుల్ కాగా, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ దురాశ ముందు నిజాయతీ, ప్రజాస్వామ్యం, కర్ణాటక ప్రజల తీర్పు కుప్పకూలిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తమను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. -
కూలిన కుమార సర్కార్ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కుమారస్వామి గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేశ్‌ను ఓటింగ్‌లో పాల్గొనాల్సిందిగా బీఎస్పీ అధ్యక్షురాలు మయావతి ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినా కూడా మహేశ్ ఓటింగ్‌కు గైర్హాజరు కావడంతో అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు మయావతి ప్రకటించారు. ‘కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్‌లో పాల్గొనాలనే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మహేశ్ మంగళవారం రోజున సభకు హాజరుకాలేదు. దీనిని పార్టీ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. తక్షణమే మహేశ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాన’ని మయావతి ట్విటర్లో వెల్లడించారు. అయితే 2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, జేడీఎస్‌లు కూటమిగా బరిలో నిలిచాయి. ఈ కూటమి తరఫున బరిలో నిలిచిన మహేశ్ కొల్లెగల నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి తన మంత్రివర్గంలో మహేశ్‌కు స్థానం కల్పించారు. ఆయనకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే కొద్దికాలం పాటు మంత్రిగా కొనసాగిన మహేశ్.. 2018 అక్టోబర్‌లో ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. कर्नाटक में कुमारस्वामी सरकार के समर्थन में वोट देने के पार्टी हाईकमान के निर्देश का उल्लंघन करके बीएसपी विधायक एन महेश आज विश्वास मत में अनुपस्थित रहे जो अनुशासनहीनता है जिसे पार्टी ने अति गंभीरता से लिया है और इसलिए श्री महेश को तत्काल प्रभाव से पार्टी से निष्कासित कर दिया गया। — Mayawati (@Mayawati) July 23, 2019 చదవండి : కుమార ‘మంగళం’ -
కుమార ‘మంగళం’
సాక్షి బెంగళూరు: దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కర్ణాటకలో 14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. ప్రభుత్వంలోని కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఈ నెల మొదటి వారంలో రాజకీయ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. గవర్నర్ విధించిన గడువులు కూడా ముగిశాయి. చివరి అంకంగా స్పీకర్ సూచన మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్ నుంచి 65 మంది, జేడీఎస్‌కు చెందిన 34 మంది కలిపి మొత్తం 99 మంది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీజేపీకి చెందిన 105 మంది వ్యతిరేకించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ‘సీఎం పెట్టిన తీర్మానం వీగిపోయింది’ అని ప్రకటించడంతో ప్రభుత్వ పతనం అనివార్యమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమయింది. అంతకుముందు తీర్మానంపై జరిగిన చర్చలో అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాలతో సభా వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచి కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య విభేదాలు పొడచూపుతూనే ఉన్నాయి. పరస్పర విమర్శలు, క్యాంపు రాజకీయాలతోనే ఏడాదంతా గడిచిపోయింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం సంకీర్ణంపైనా పడింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని స్థానాలన్నిటినీ దాదాపు కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్–జేడీఎస్ నేతల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. బీజేపీ పరోక్ష ప్రోద్బలంతో సంకీర్ణానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. అయితే, వీరిని అసెంబ్లీకి హాజరుకావాలంటూ బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అలాగే తీవ్ర హెచ్చరికలు చేసినా రాజీనామా చేసిన వారు తిరిగి వచ్చేందుకు నిరాకరించడంతో కుమారస్వామి సర్కారు పతనానికి దారులు పడ్డాయి. నాలుగు రోజులుగా చర్చలు, వాయిదాల అనంతరం మంగళవారం సభలో బల నిరూపణకు సిద్ధం కావాలని స్పీకర్ గడువు విధించారు. అయితే, తనకు బుధవారం వరకు సమయం ఇవ్వాలని సీఎం కుమారస్వామి కోరగా ఆయన నిరాకరించారు. దీంతో మంగళవారం యథావిధిగా అసెంబ్లీ సమావేశమయింది. సాయంత్రం సభలో కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం వీగిపోయిందిలా.. ప్రత్యర్థి పార్టీల ఉచ్చులో పడకుండా ఇప్పటి దాకా ముంబై వంటి చోట్ల తమ ఎమ్మెల్యేలను రిసార్టులు, హోటళ్లలో బస ఏర్పాటు చేసిన అధికార, ప్రతిపక్షాలు మంగళవారం నాటి బలపరీక్షకు ప్రత్యేకంగా అసెంబ్లీకి బస్సుల్లో తరలించాయి. కాంగ్రెస్–జేడీఎస్‌లకు చెందిన 17 మంది, బీఎస్పీ సభ్యుడు ఒకరు, స్వతంత్రులు ఇద్దరు మొత్తం 20 మంది మంగళవారం సభకు గైర్హాజరయ్యారు. దీంతో సభలో సభ్యుల సంఖ్య 225 నుంచి 204(స్పీకర్ మినహా)కు తగ్గింది. మ్యాజిక్ ఫిగర్ 103 కాగా, తీర్మానానికి అనుకూలంగా 99 మంది, వ్యతిరేకంగా 105 మంది నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఉద్వేగపూరితంగా ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి సభా కార్యకలాపాలను నిర్వేదంతో చూస్తూ తన స్థానంలో కూర్చుండిపోయారు. బీజేపీ సభ్యులు చర్చలో పాల్గొనలేదు. సర్కారు కూలిపోయినట్లు ప్రకటించగానే బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆనందోత్సాహాలుపెల్లుబికాయి. బీజేపీ పక్ష నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను అభినందించారు. సంతోషంగా త్యజిస్తున్నా: కుమారస్వామి బలపరీక్షకు ముందు సీఎం కుమారస్వామి సుదీర్ఘంగా ప్రసంగించారు. రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కేటాయించిన నిధుల వివరాలను చదివి వినిపించారు. పలు అభివృద్ధి పనులు కేటాయించినా ప్రభుత్వంపై విశ్వాసం లేకుండా తిరుగుబాటు చేశారని వాపోయారు. అయితే కుమారస్వామి తనకు మూడు గంటల వ్యవధి ఇవ్వాలని కోరగా, త్వరగా ముగించాలని స్పీకర్ సూచించారు. సాయంత్రం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో బలపరీక్షను నిర్వహించాలని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. సీఎం పదవి ఎవరికీ శాశ్వతం కాదని, తాను అధికారం కోసం పాకులాడలేదన్నారు. సీఎం కుర్చీని సంతోషంగా వదిలివేస్తున్నట్లు తెలిపారు. బల పరీక్షను వాయిదాలు వేసి స్పీకర్‌ను నొప్పించినందుకు క్షమిం చాలని కోరారు. సభాపతిని అవమానించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. 10 రోజులుగా జరిగిన పరిణామాల గురించి చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ‘మాకూ సిగ్గుంది. ఇంకా అధికారంలో కొన సాగలేం. అయినా మేం చేసిన తప్పేంటి? నిజాయతీతో ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషిచేశాం. రాజీనామా తర్వాత నేను ఎక్కడికీ పారిపోను. నన్ను ఎందుకు తప్పించారో ప్రజలు కూడా తెలుసుకోవాలి. కుర్చీ శాశ్వతం కాదు’ అని అన్నారు. ‘మా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పదేపదే ప్రయత్నించింది. ఆ పార్టీ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం ఉండదు. అదే జరిగితే, ఎన్నికలకు వెళ్లడం ఉత్తమం’ అని అన్నారు. కుమారస్వామి రాజీనామా విశ్వాస పరీక్షలో ఓటమి అనంతరం సీఎం కుమారస్వామి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించిన గవర్నర్.. మరో ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. కాగా, బల పరీక్షలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వని బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధినేత్రి మాయావతి ప్రకటించారు. అపవిత్ర మైత్రికి చెల్లుచీటీ: యడ్యూరప్ప కర్ణాటకలో బీజేపీ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బల పరీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 14 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్–జేడీఎస్ నేతలు కమీషన్ల కోసం పని చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ –జేడీఎస్ అపవిత్ర మైత్రికి కాలం చెల్లిపోయిందన్నారు. 2018 ఎన్నికల్లో 104 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం ఉప ఎన్నికలో మరో సీటును గెలుచుకుని 105కు బలం పెంచుకుంది. గత ఏడాది మేలో విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే యడ్యూరప్ప వైదొలగిన విషయం తెలిసిందే. అనంతరం కుమారస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటయింది. స్పీకర్, నామినేటెడ్ సభ్యుడితో కలిపి 225 సభ్యులున్న అసెంబ్లీలో రెబెల్స్ రాజీనామాలకు ముందు కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం బలం 117. ఇందులో స్పీకర్ కాకుండా కాంగ్రెస్ 78, జేడీఎస్ (37), బీఎస్పీ (1), నామినేటెడ్ (1)సభ్యులున్నారు. ప్రజాస్వామ్యం ఓడింది: రాహుల్ ‘ప్రజాస్వామ్యం, నిజాయితీ, రాష్ట్ర ప్రజల తీర్పు’ ఓడిపోయాయి అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘సంక్షోభాలు సృష్టించిన వారి లక్ష్యం నేరు నెరవేరింది’ అని బీజేపీనుద్దేశించి అన్నారు. తదుపరి సీఎం యడ్యూరప్ప! న్యూఢిల్లీ : కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో తర్వాత ఏం చేయాలనేదానిపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ పార్టీ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తదుపరి సీఎం అవుతారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ నాయకుడొకరు మాట్లాడుతూ, ‘సీఎం పదవిని చేపట్టేది యడ్యూరప్పేనన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులతో కూడిన పార్టీ అగ్రనాయకత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, కర్ణాటకకే చెందిన ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ యడ్యూరప్పకే సీఎం అవకాశాలు అత్యధికంగా ఉన్నప్పటికీ, పార్టీ జాతీయ నాయకత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మోదీ, షాతో మాట్లాడాక గవర్నర్‌ను కలుస్తాం: యడ్యూరప్ప పార్టీ కేంద్ర నాయకత్వంలోని మోదీ, అమిత్ షాతో సంప్రదింపులు జరిపిన అనంతరం తాము గవర్నర్‌ను కలుస్తామని యడ్యూరప్ప వెల్లడించారు. కుమారస్వామి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారనీ, వారి ప్రభుత్వం కూలిపోవడం ప్రజా విజయమని ఆయన అన్నారు. విశ్వాసపరీక్షలో బీజేపీ పక్షానే నిలిచిన 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుంచి అభివృద్ధిలో నవశకం మొదలవుతుందని పేర్కొన్నారు. 4 రాష్ట్రాల్లోనే.. న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు గడ్డు రోజులు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుని, దేశవ్యాప్తంగా కేవలం 52 స్థానాల్లో గెలుపుతో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడిన ఆ పార్టీని కర్ణాటక పరిణామాలు మరో దెబ్బతీశాయి. సంకీర్ణ భాగస్వామి అయిన కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ‘చే’జారింది. 2018లో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలోనూ అధికారాన్ని కోల్పోవడంతో ప్రస్తుతం ‘చేతి’లో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం మాత్రమే ఉన్నాయి. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిల్లో మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. దక్షిణాదిలో అధికారం పంచుకుంటున్న ఏకైక రాష్ట్రాన్ని కూడా కోల్పోవాల్సి రావడం పార్టీకి దెబ్బగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ముచ్చటగా ముగ్గురే! ఐదేళ్లు పూర్తి చేసుకున్న సీఎంలు వీరే న్యూఢిల్లీ : కర్ణాటక చరిత్రలో ఐదేళ్ల పూర్తి కాలం కొనసాగిన ముఖ్యమంత్రులు ముగ్గురే. వారు కూడా కాంగ్రెస్ పార్టీ వారే కావడం గమనార్హం. ఎస్.నిజలింగప్ప (1962–68), డీ దేవరాజ ఉర్స్ (1972–77), సిద్దరామయ్య (2013–18) మాత్రమే విజయవంతంగా తమ పదవీకాలాన్ని ముగించగలిగారు. బీజేపీ నుంచి కానీ జేడీఎస్ నుంచి కానీ ఎవరూ ఐదేళ్లు సీఎంగా నిలవలేకపోయారు. గతంలో బీజేపీ సంకీర్ణంలో భాగంగా సీఎం పదవి చేపట్టిన కుమారస్వామి రెండేళ్లలోపే గద్దె దిగారు. ఫిబ్రవరి 2006 నుంచి అక్టోబర్ 2007 వరకు మాత్రమే అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. అనంతరం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని మరోసారి 2018 మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి.. విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో 2019 జూలై 23న రాజీనామా చేశారు. బీజేపీ విషయానికి వస్తే.. 2007లో తొలిసారి సీఎం అయిన యడ్యూరప్ప జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో వారం రోజులకే పదవీచ్యుతులయ్యారు. మరోసారి, 2018 మే 17 నుంచి 23 వరకే అధికారంలో కొనసాగి, మెజారిటీ లేకపోవడంతో రాజీనామా చేశారు. 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటివరకు 25 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సంక్షోభం సాగిందిలా.. 2019 జూలై 1: కుమారస్వామి సర్కార్‌తో విభేదాలతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా. జూలై 6: రాజీనామా చేసిన మరో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు. మొత్తంగా 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు అందాయని స్పీకర్ ప్రకటన. రెబెల్స్ అంతా విమానంలో ముంబైకి వెళ్లారు. జూలై 7: అమెరికా నుంచి తిరిగొచ్చిన కుమారస్వామి జూలై 8: మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేశ్, శంకర్. బీజేపీకి మద్దతు. జూలై 9: 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు సక్రమంగా లేవన్న స్పీకర్. సరైన ఫార్మాట్లో పంపాలని సూచన. సీఎల్పీ భేటీ. 20 మంది ఎమ్మెల్యేల డుమ్మా. మరో ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా. జూలై 10: ముంబైలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లోని ముగ్గురు అసంతృప్త నేతల్ని బుజ్జగించడానికి కాంగ్రెస్ నేత శివకుమార్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు ఆయనను కలవడానికి నిరాకరించి పోలీసుల సాయాన్ని అభ్యర్థించారు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజ్, డాక్టర్ కె.సుధాకర్ రాజీనామా జూలై 11: స్పీకర్ తమ రాజీనామాలు చెల్లవని తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం తలుపు తట్టిన రెబెల్ ఎమ్మెల్యేలు జూలై 17: రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనన్న సుప్రీంకోర్టు. దానికి నిర్దిష్ట సమయం అంటూ లేదని, సభకు హాజరు కావాలా వద్దా అన్నది రెబెల్ ఎమ్మెల్యేల ఇష్టమని స్పష్టీకరణ. తన రాజీనామాను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి. జూలై 18: ఇదే రోజు కర్ణాటకలో సీఎం కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండేది. అయితే 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సహా 21 మంది అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను అపహరించిందంటూ సభలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఆరోపణలు. సభకు హాజరుకావడంపై ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తే, విప్ జారీ చేసి ఉపయోగం ఉండదని, దీనిపై స్పష్టత కావాలంటూ వాదించిన కాంగ్రెస్. విశ్వాసపరీక్ష జరగకుండా సభ వాయిదా వేయడంతో సభలోనే రాత్రంతా కూర్చొని బీజేపీ ఎమ్మెల్యేల నిరసన ప్రదర్శన జూలై 19: శుక్రవారం సభలో విశ్వాస పరీక్ష జరపాలని గవర్నర్ వజూభాయ్ రెండుసార్లు సీఎం కుమారస్వామికి లేఖలు రాశారు. అయినా సీఎం, స్పీకర్ ఆయన ఆదేశాలను పట్టించుకోలేదు. గందరగోళ పరిస్థితుల మధ్య సభ వాయిదా జూలై 22: సభలో బలాన్ని నిరూపించుకోవడానికి బుధవారం వరకూ స్పీకర్‌ని గడువు కోరిన కుమారస్వామి. నిరాకరించిన స్పీకర్. విశ్వాస పరీక్షపై కాలయాపన ఎవరికీ మంచిది కాదని హితవు. విశ్వాస తీర్మానం చర్చకు సంబంధించి ఎమ్మెల్యేల ప్రసంగాన్ని తగ్గించాలంటూ స్పీకర్ అసహనం. అధికార, విపక్ష సభ్యుల గందరగోళం మధ్యే సభ వాయిదా. జూలై 23: ఎట్టకేలకు బలపరీక్ష నిర్వహణ. కుప్పకూలిన కుమారస్వామి సర్కార్. గైర్హాజరైన 21 మంది ఎమ్మెల్యేలు. కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు. సభలో బలాబలాలు మొత్తం సభ్యులు (1 నామినేటెడ్ సహా) 225 సభకు హాజరైనవారు (స్పీకర్‌తో) 205 మ్యాజిక్ ఫిగర్ 103 విశ్వాసానికి అనుకూలంగా 99 విశ్వాసానికి వ్యతిరేకంగా 105 హాజరుకాని వారు 20 -
కర్ణాటక నూతన సీఎంగా యడ్యూరప్ప!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరికాసేట్లో బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప గవర్నర్‌ను కలవనున్నారు. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యులున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం సభలోనే బీజేపీ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ.. తర్వాతి ప్రభుత్వం తమదేనని సంకేతమినిచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. యడ్యూరప్ప మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. బల పరీక్షలో కుమారస్వామి ఓటమి అనంతరం.. యడ్యూరప్ప స్పందించారు. ఇది కర్ణాటక ప్రజల విజయమన్నారు. కన్నడ ప్రజలను అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని వదిలిందని, 105 మంది సభ్యులతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జేడీఎస్- కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూలిపోవడంతో తన ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. విశ్వాస పరీక్ష అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తేలాల్సిఉంది. -
అయ్యో ‘కుమార’ కూల్చేశారా
సాక్షి, బెంగళూరు: దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కర్ణాటక సంక్షోభం ముగిసింది. ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓ పార్టీ, కాపాడుకోడానికి మరో పార్టీ రచించిన వ్యూహాలన్నీంటికి నేటితో తెరపడింది. బీజేపీ అనుకున్నట్లుగానే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది. కుమారుస్వామి ప్రభుత్వానికి మెజార్టీ సభ్యుల మద్దతు లేకపోవడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం పడిపోయినట్లు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. సీఎం కుమారస్వామి ఉద్వేగ ప్రసంగం అనంతరం.. స్పీకర్ రమేష్ కుమార్ బలపరీక్ష నిర్వహించారు. మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. రెబల్స్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. మరోవైపు బీజేపీ సభ్యులు 105 మంది సభకు హాజరయ్యారు. ఓటింగ్ జరిగిన సమయంలో సభలో మొత్తం 204 మంది సభ్యులున్నారు. తొలుత ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్ ఆదేశించడంతో వారు ఆశీనులయ్యారు. ఓటింగ్ ముగిసే వరకు అసెంబ్లీ తలుపులను పూర్తిగా మూసివేశారు. అనంతరం డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. అనంతరం విశ్వాస పరీక్షలో ప్రభుత్వ ఓడినట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో 14 నెలల సంకీర్ణ ప్రభుత్వ పాలన నేటితో ముగిసింది. మరోవైరు సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరుకాలేదు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అంతకుమందు విశ్వాస పరీక్షపై సీఎం కుమార స్వామి భావోద్వేగంగా మాట్లాడారు. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, సీఎంగా కన్నడ ప్రజలకు ఎంతో చేశానని ఉద్వేగంగా మాట్లాడారు. త్వరలో కుమారస్వామి గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. బెంగళూరులో 144 సెక్షన్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్-కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేంగా నినాదాలు చేస్తూ.. పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. రాజధాని ప్రాంతం బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేశారు. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కుట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో రెండు రోజులపాటు బార్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. -
కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో స్పీకర్ అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నారు. సభలో చర్చలో భాగంగా స్పీకర్ రమేష్ కుమార్ భావోద్వేగ ప్రసంగం చేశారు. గత కొన్ని రోజులుగా సభలో జరిగే పరిణామాలన్నింటితో తన రక్తం మరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు కనీస సంప్రదాయలు పాటించకుండా స్పీకర్ పదవిలో ఉన్న తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి తాను పూర్తిగా న్యాయం చేసినట్లు భావిస్తున్నానని చెప్పారు. రాజ్యాంగ ప్రమాణాల మేరకు సభను నిర్వహించానన్నారు. సభలో జరగబోయే పరిణామాలను తాము ముందే ఊహించి.. తన రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్లు వెల్లడించారు. తానేంటో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు. కాగా సభలో సీఎం కుమార స్వామి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఓటింగ్‌కు తాము సిద్ధమేని...కానీ డివిజన్ పద్దతిలో ఓటింగ్ జరపాలని స్పీకర్‌ని కోరారు. దానికి స్పీకర్ నిరాకరించారు. -
నన్ను క్షమించండి: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠ పరిణామాల నడుమ కర్ణాటక రాజకీయం తుదిదశకు చేరుకుంది. విశ్వాస పరీక్షపై సభ్యులంతా ప్రసంగించిన అనంతరం.. చివరగా సీఎం కుమారస్వామి మాట్లాడారు. విశ్వాసపరీక్షపై సీఎం ఉద్వేగంగా ప్రసంగించారు. కన్నడ ప్రజలకు తన పాలనలో ఎన్నో మంచి పనులు చేశానని, ఏమైనా తప్పులు చేసి ఉంటే తనను క్షమించాలని ప్రజలను కోరారు. అనుకోకుండా తాను రాజకీయాల్లోకి వచ్చానని.. పాలనలో పొరపాటున కొన్ని తప్పులు కూడా చేశానని అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. కన్నడ సంక్షోభంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరి సభ్యుల అభిప్రాయం తీసుకోవడం కోసం.. విశ్వాస పరీక్ష కొంత ఆలస్యమయినట్లు సభలో ఒప్పుకున్నారు. సంకీర్ణాన్ని భాజపా ఎలా అస్థిరపరిచిందో సభలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభుత్వానికి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రసంగం అనంతరం రాజీనామా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం సభలో ఆయన ప్రసంగం కొనసాగుతోంది. ఆయన మాట్లాడిన వెంటనే స్పీకర్ విశ్వాస పరీక్షను చేపట్టనున్నారు. కుమార స్వామి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్-కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేంగా నినాదాలు చేస్తూ.. పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భద్రతను కుట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో బార్ షాపులను మూసేశారు రాజధాని ప్రాంతం బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేశారు. సభలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ సభ్యులు 105 మంది ఉన్నారు. మరోవైరు రెబల్స్‌తో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 101 మాత్రమే. స్పీకర్, నామినేటేడ్ సభ్యులను మినహాయిస్తే అధికారపక్షం బలం 99కి పడిపోతుంది. సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరుకాలేదు -
కర్ణాటకం: ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 50 కోట్లా?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి మద్దతు తెలుపుతూ రెబల్ ఎమ్మెల్యేలు రాజకీయ విలువలను సమాధి చేశారని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ, 25 కోట్ల నుంచి 50 కోట్ల వరకు బీజేపీ నేతలు వెచ్చించారని, ఆ డబ్బాంతా ఎక్కడి నుంచి తెస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పార్టీకి వెన్నుపోటు పొడిచిన తిరుగుబాటు దారులపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా మారిన కర్ణాటక రాజకీయం చివరిదశకు చేరుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రసంగం అనంతరం విశ్వాసపరీక్ష నిర్వహిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ సభ్యులు 105 మంది ఉన్నారు. మరోవైరు రెబల్స్‌తో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 101 మాత్రమే. స్పీకర్, నామినేటేడ్ సభ్యులను మినహాయిస్తే అధికారపక్షం బలం 99కి పడిపోతుంది. సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరుకాలేదు. స్పీకర్ విశ్వాస పరీక్ష చేపడితే కుమారస్వామి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. రాజధాని బెంగళూరులో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలిసింది. -
ఒక్కరోజు ఆగితే తిరుగులేదు
కర్ణాటక,శివాజీనగర: బల పరీక్ష నిరూపణ ప్రక్రియను మంగళవారం కూడా వాయిదా పడేటట్లు చూసుకోవాలి, బుధవారం నుంచి అదృష్టమే మారిపోతుంది అని జ్యోతిష్యులు ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామికి సూచించినట్లు వదంతులు విహరించాయి. జ్యోతిష్యుల సలహా ప్రకారమే కుమారస్వామి విశ్వాస పరీక్షను వాయిదా వేస్తున్నారని సమాచారం. ఆయన జ్యోతిష్యాన్ని గట్టిగా నమ్ముతారన్నది తెలిసిందే. మంగళవారం కూడా బలపరీక్ష జరగకుండా ఉంటే, బుధవారం నుంచి గ్రహబలం అనుకూలిస్తుందని కొందరు జ్యోతిష్యులు చెప్పినట్లు సమాచారం. అందుకే ఆయన పదేపదే స్పీకర్‌ను కలిసి వాయిదాకు గడువు కోరడంతో పాటు గవర్నర్ ఆదేశాలనూ పక్కనపెడుతూ వచ్చారు. -
నేడే బల నిరూపణ!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో సోమవారం హైడ్రామా నెలకొంది. విశ్వాసపరీక్షను చేపట్టేందుకు తమకు బుధవారం వరకూ గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్ రమేశ్ కుమార్ ఛాంబర్‌కు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ జరగాల్సిందేనని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చాం. మళ్లీ ఇవ్వాలంటే కుదరదు. నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేడు విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదాపడింది. చివరికి స్పీకర్ రమేశ్ కుమార్ అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుందనీ, బలపరీక్షను సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని ప్రకటించారు. సాయంత్రం 6గంటల్లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తైపోతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్–జేడీఎస్ సభ్యుల ఆందోళన.. విధానసౌధ సోమవారం గంట ఆలస్యంగా ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు మధుస్వామి మాట్లాడుతూ.. నేడు ఎలాగైనా విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్‌ను కోరారు. ‘విశ్వాసపరీక్షపై చర్చను సోమవారం నాటికి ముగించి బలపరీక్షను చేపడతామని సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య అసెంబ్లీలో చెప్పారు. వారి మాటలను మేం నమ్మాం. మీ(స్పీకర్) ఆదేశాలను గౌరవించాం. కాబట్టి విశ్వాసపరీక్షపై ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయొద్దు’ అని మధుస్వామి కోరారు. అనంతరం కాంగ్రెస్ నేత, మంత్రి బైరె గౌడ స్పందిస్తూ.. ‘విశ్వాసపరీక్షను బుధవారానికి వాయిదా వేయాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నా. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకోకుండా బలపరీక్ష చేపడితే సభ పవిత్రతే దెబ్బతింటుంది. ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు స్వచ్ఛందమా? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? దేశంలో ప్రతిపక్షాన్ని ఓ ప్రణాళికతో బీజేపీ నిర్మూలిస్తోంది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యపు రక్త బీజేపీ చేతులకు అంటుకుంది’ అని ఘాటుగా విమర్శించారు. అయితే చర్చ ముగిసినవెంటనే బలపరీక్ష చేపడతామని స్పీకర్ రమేశ్ ప్రకటించడంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ‘మాకు న్యాయం కావాలి’ ‘విశ్వాస పరీక్షపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలి’ అంటూ సభలో ఆందోళనకు దిగారు. సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్.. సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. సోమవారం ఫేస్బుక్లో బీజేపీ స్పందిస్తూ..‘కుమారస్వామికి నిజంగా కర్ణాటక ప్రజలపై, భారత రాజ్యాంగంపై నమ్మకముంటే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి’ అని పోస్ట్ చేసింది. కర్ణాటక ప్రజలు కుమారస్వామిని క్షమించబోరని స్పష్టం చేసింది. కాగా, సీఎం పదవిని త్యాగం చేసేందుకు సీఎం కుమారస్వామి ఒప్పుకున్నా, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సీఎం పదవిని వీడరాదని దేవెగౌడ ఆయనకు సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు కుమారస్వామి రాజీనామా చేశారంటూ ఓ లేఖ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది నకిలీ లేఖ అని జేడీఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. రాజీనామా విషయాన్ని ఖండించిన సీఎం కుమారస్వామి, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. స్వతంత్రులకు సుప్రీంలో నిరాశ.. కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్.నగేశ్‌లకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని వీరిద్దరు దాఖలుచేసిన పిటిషన్‌ను తక్షణం విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. స్వతంత్రుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ..‘కర్ణాటకలో బలపరీక్షను ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినా అధికారంలో కొనసాగుతోంది. అసెంబ్లీలో విశ్వాసపరీక్షను చేపట్టేలా ఆదేశించండి’ అని కోరారు. దీంతో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం స్పందిస్తూ..‘అసాధ్యం. మేం ఇంతకుముందెప్పుడు ఇలా చేయలేదు. ఈ పిటిషన్‌ను మంగళవారం పరిశీలిస్తాం’ అని స్పష్టం చేసింది. అర్ధరాత్రయినా అసెంబ్లీలోనే ఉంటాం: యడ్యూరప్ప కర్ణాటక అసెంబ్లీని వాయిదావేస్తామంటే ఒప్పుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఇచ్చినమాట మేరకు సోమవారం విశ్వాసపరీక్ష నిర్వహించాలి. ఇందుకోసం అర్ధరాత్రివరకైనా వేచిఉంటాం. అంతేతప్ప సభను వాయిదా వేస్తామంటే ఒప్పుకోం. విశ్వాసపరీక్ష సమయాన్ని ఇప్పటికే రెండు సార్లు మార్చారు. ఒకవేళ మాకు అసెంబ్లీలో న్యాయం జరగకుంటే గవర్నర్ వజూభాయ్వాలాతో భేటీ అవుతాం. బలపరీక్షపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని యడ్యూరప్ప స్పష్టం చేశారు. బలిపశువును చేయొద్దు: స్పీకర్ అధికార పక్ష సభ్యుల ఆందోళనతో స్పీకర్ రమేశ్ సహనం కోల్పోయారు. ‘ప్రతీఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు సభకు ఎంతమాత్రం శోభనివ్వవు. మనం ప్రజాజీవితంలో ఉన్నాం. చర్చల పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నామన్న అభిప్రాయం ఏర్పడితే అది నాతో పాటు ఎవ్వరికీ మంచిది కాదు. ఈ వ్యవహారంలో నన్ను బలిపశువును చేయవద్దు. చర్చను వీలైనంత త్వరగా ముగించి బలపరీక్షను చేపడతాం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. విప్ల జారీవిషయంలో సుప్రీంకోర్టు జూలై 17న ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రూలింగ్ ఇవ్వాలని కోరారు. రెబెల్ ఎమ్మెల్యేలు ఈ తీర్పును బూచీగా చూపి విశ్వాసపరీక్షకు గైర్హాజరవుతారని చెప్పారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ..‘విప్ జారీచేయడం అన్నది రాజకీయ పార్టీల హక్కు. వాటిని పాటించడం, పాటించకపోవడం అన్నది ఎమ్మెల్యేల ఇష్టం. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే విప్‌ను పాటించలేదని నాకు ఫిర్యాదు అందితే, నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను’ అని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తనను కలుసుకోవాల్సిందిగా రెబెల్ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు చెప్పారు. -
కర్ణాటకం : రాజీనామాకు సిద్ధమైన సీఎం
బెంగళూర్ : కర్ణాటకలో రాజకీయం నిమిషానికో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామాకు సిద్ధమయ్యారు. రాజీనామా లేఖను అసెంబ్లీలో చూపించారు. బలపరీక్షకు ముందే కుమారాస్వామి రాజీనామాను ప్రకటించనున్నారు. సంకీర్ణ సర్కార్ భవితవ్యం తేల్చే విశ్వాస పరీక్షకు డెడ్లైన్లు మారుతూనే ఉన్నాయి. బలపరీక్ష గడువు పెంచాలన్న జేడీఎస్-కాంగ్రెస్ నేతల అభ్యర్ధనను స్పీకర్ ఆర్ రమేష్ కుమార్ తోసిపుచ్చారు. సోమవారం రాత్రి 9 గంటల వరకూ బలపరీక్షకు సమయం ఇచ్చిన స్పీకర్ ఇక వాయిదాలకు ఆస్కారం లేదని సంకీర్ణ నేతలకు స్పష్టం చేశారు. బలపరీక్షను వాయిదా వేయాలని ఒత్తిడి పెంచితే తానే రాజీనామా చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. తాను చెప్పినట్టు బలపరీక్ష చేపట్టాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. సుప్రీం కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున బలపరీక్షను రేపటికి వాయిదా వేయాలని కోరిన జేడీఎస్ వినతిని ఆయన అంగీకరించలేదు. బలపరీక్షపై గందరగోళంతో సభ వాయిదా పడటంతో విరామ సమయంలో స్పీకర్‌తో బీజేపీ సభ్యులు భేటీ అయ్యారు. ఎట్టిపరిస్థితుల్లో ఈరోజే బలపరీక్ష నిర్వహించాలని వారు పట్టుబట్టారు. బలపరీక్షకు తాను సిద్ధమని స్పీకర్ వారితో స్పష్టం చేశారు. -
క్లైమాక్స్‌కు చేరిన కన్నడ రాజకీయాలు
సాక్షి, బెంగళూరు : విశ్వాస తీర్మానంపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుండగా కన్నడ రాజకీయం కీలక ఘట్టానికి చేరింది. గంట గంటకి ఆసక్తికర మలుపులు తిరుగుతోన్న ‘కర్నాటకం’లో తాజాగా ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి స్పీకర్ రమేశ్‌కుమార్‌ను కలిశారు. బలపరీక్షకు సిద్ధంగా కావాలని స్పీకర్ సూచించగా, మరోవైపు సీఎం తనకుఓటింగ్కు మరి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే స్పీకర్ మాత్రం బలపరీక్ష ప్రక్రియ ఇవాళే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఓటింగ్‌కు ముందే ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. రాత్రి ఏడు గంటలకు కుమారస్వామి గవర్నర్ వాజుభాయ్ వాలా అప్పాయింట్ మెంట్ కోరారని వార్తలు రాగా.. అయితే ఆ వార్తలను సీఎంవో కార్యాలయ వర్గాలు ఖండించాయి. చదవండి: బలపరీక్షకు ముందే కుమారస్వామి రాజీనామా..? సభ 10 నిమిషాలు వాయిదా అటు విశ్వాస తీర్మానంపై విధానసభలో చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. చర్చను సాగదీయకుండా త్వరగా ముగించాలని స్పీకర్ సభ్యులను కోరారు. ప్రతి ఎమ్మెల్యే 10 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని సూచించారు. అయితే బలపరీక్ష తక్షణమే నిర్వహించాలంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగటంతో స్పీకర్ సభను 10నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు విశ్వాస పరీక్ష వద్దని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కాగా 15మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో కుమారస్వామిప్రభుత్వం మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంకీర్ణ సర్కార్‌కి స్పీకర్ సహా 102మంది సభ్యుల బలముంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగింది. సభలో బలపరీక్ష గట్టెక్కాలంటే 105మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలి. ఇప్పటికే 15మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. రాజీనామా చేయకున్నా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలపరీక్షకు దూరంగా ఉంటున్నారు. జేడీఎస్‌కి మద్దతిస్తున్న బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ కూడా సభకు గైర్హాజరయ్యారు. కాబట్టి బలపరీక్షపై ఓటింగ్ జరిగితే, కుమారస్వామి సర్కార్ కూలి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌కి ఇక కాలం చెల్లినట్టే భావించాలి. బలపరీక్షపై ఓటింగ్ జరిగితే ప్రభుత్వం కూలిపోవడం తప్పనిసరి. ఒకవేళ అదే జరిగితే 107మంది సభ్యుల బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేకుంటే రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్... రాష్ట్రపతి పాలనకు ఆదేశాలు ఇవ్వవచ్చు. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఇప్పటివరకూ కర్ణాటకలో ఐదుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. -
క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం నేటితో ముగిసేలా కనిపిస్తోంది. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారం రోజు సాయంత్ర 6 గంటలకు ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్ రమేశ్‌కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతకుముందు స్పీకర్‌తో సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు, విశ్వాస పరీక్షకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. దీనికి నిరాకరించిన స్పీకర్ నేడు తప్పనిసరిగా బల పరీక్ష నిర్వహించాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే సోమవారం రెబల్స్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. రేపటి లోగా వారంత తన ముందు హాజరుకావాలని 16 మంది సభ్యులకు సమన్లు జారీచేశారు. జేడీఎస్, కాంగ్రెస్ నేతలు రెబల్స్‌పై అనర్హత వేటు వేయాలని స్వీకర్‌కు చెప్పడంతో ఆయన సమన్లు జారీచేసినట్లు తెలుస్తోంది. అయితే విశ్వాస పరీక్షపై చర్చ పూర్తయిన వెంటనే బలపరీక్ష ప్రక్రియను చేపట్టే అవకాశం ఉంది. దీంతో కర్ణాటక రాజకీయ సంక్షోభానికి నేడో, రేపో తెరపడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తమ రాజీనామాలను ఆమోదించాలంటూ స్వతంత్ర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న వారి అభ్యర్థనకు ధర్మాసనం నిరాకరించింది. విశ్వాస పరీక్షలో తాము జోక్యం చేసుకోలేని స్పష్టం చేస్తూ.. ఇవాళే బలపరీక్ష చేపట్టాలని తాము స్వీకర్‌కు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం తేల్చిచెప్పింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషిన్‌ను రేపు విచారిస్తామని తెలిపింది. ‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. కాగా విశ్వాస పరీక్షపై గవర్నర్ ఇప్పటికే రెండు సార్లు స్పీకర్‌ను లేఖ రాయగా.. వాటిని రమేష్ కుమార్ ధిక్కరించారు. దీంతో బలనిరూపణపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకంకానుంది.