అందరూ అందరే! | K Ramachandra Murthy Article On Karnataka Politics | Sakshi
Sakshi News home page

అందరూ అందరే!

Published Sun, May 20 2018 1:56 AM | Last Updated on Sun, May 20 2018 4:20 AM

K Ramachandra Murthy Article On Karnataka Politics - Sakshi

త్రికాలమ్‌ 

కర్ణాటకలో సంభవిస్తున్న పరిణామాలు ప్రజాస్వామ్యప్రియులకు పెద్దగా సాంత్వన కలిగించవు. సంఖ్యాబలం లేకపోయినా జబర్దస్తీగా అధికారం హస్తగతం చేసుకోవడానికి బీజేపీ నాయకత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు వమ్ము చేయడం సంతోషించదగినదే. ముఖ్యమంత్రిగా 55 గంటల క్రితం యడ్యూరప్ప ప్రమాణం చేసినప్పటి నుంచీ రాజీనామా చేసేవరకూ ఉత్కంఠ కలిగించే అనేక ఘటనలు జరిగాయి. 222 మంది సభ్యులు ఉండే కొత్త శాసనసభలో 104మంది సభ్యులు మాత్రమే కలిగిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్‌ వజూభాయ్‌ ఆహ్వానించడం అంటే ఎంఎల్‌ఏల ఫిరాయింపులకూ, బేరసారాలకూ అవకాశం ఇవ్వడమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. బెంగళూరు నుంచి కొచ్చికి శుక్రవారం సాయంత్రం ప్రయాణమైన కాంగ్రెస్, జేడీ (ఎస్‌) ఎంఎల్‌ఏలు తెల్లవారే సరికి హైదరాబాద్‌లో తేలారు. ఐదారు నక్షత్రాల హోటళ్ళలో బస చేశారు. వారితో సమాలోచనలు జరపడానికి బెంగళూరు నుంచి గులాంనబీ ఆజాద్, సిద్ధరామయ్య, కుమారస్వామి ప్రభృతులు వచ్చారు. సుప్రీం తీర్పుతో హుటాహుటిన బెంగళూరు తిరిగి వెళ్ళారు. శనివారం ఉదయం శాసనసభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతూ ఉండగానే ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యుల ఆచూకీ తెలియడం లేదనీ, ఎనిమిది మంది బీజేపీకి మాట ఇచ్చేశారనీ బ్రేకింగ్‌న్యూస్‌ రూపంలో టీవీ చానళ్ళు ఊదరగొట్టాయి. బెంగళూరులో, ఢిల్లీలో సర్వాత్రా ఉద్వేగభరితమైన దృశ్యాలు. జాతి యావత్తూ కర్ణాటక రాజధానిపైన దృష్టి నిలిపిన సందర్భం. భోజన విరామం తర్వాత ప్రమాణాలు తిరిగి ప్రారంభమైనప్పుడు ఉదయం అదృశ్యమైన ఇద్దరు కాంగ్రెస్‌ శాసనసభ్యులూ ప్రత్యక్షమైనారు. అంతలోనే యడ్యూరప్ప ఉద్వేగభరితమైన ప్రసంగం చేసి, పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించి సభ నుంచి విసవిసా వెళ్ళిపోయారు. తాత్కాలిక సభాపతి సైతం జాతీయగీతం ఆలపించే వరకూ వేచి ఉండకుండానే నిష్క్రమించారు. 

న్యాయవ్యవస్థ పట్ల ద్వంద్వ వైఖరి
న్యాయస్థానాలు, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానం ఎన్‌డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయంటూ కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో శుక్రవారం జేడీ (ఎస్‌), కాంగ్రెస్‌ల పిటీషన్లపైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బీజేపీకి అశనిపాత సదృశమైన నిర్ణయాలు వెలువరించింది. బీజేపీ అడిగిన వరాలలో ఒక్కటీ మంజూరు చేయకుండా యడ్యూరప్ప ఆశలు అడియాసలు చేసింది. యడ్యూరప్పను ఆహ్వానిం చాలన్న గవర్నర్‌ నిర్ణయాన్ని తప్పుపట్టకపోయినా బలనిరూపణకు రెండువారాల వ్యవధి ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించలేదు. ఒక్క వారమైనా గడువు ఇవ్వాలంటూ బీజేపీ చేసిన వేడుకోలునూ అంగీకరించలేదు. కేవలం 24 గంటల వ్యవధి ఇచ్చింది. సీక్రెట్‌ బ్యాలట్‌ నిర్వహించాలన్న కోర్కెకు సైతం ససేమిరా అన్నది. గతంలో యడ్యూరప్పకు అనుకూలించే విధంగా వ్యవహరించాడంటూ న్యాయస్థానం మొట్టికాయలు తిన్న బోపయ్య చేత తాత్కాలిక సభాపతిగా గవర్నర్‌ ప్రమాణం చేయించడాన్ని కాంగ్రెస్, జేడీ(ఎస్‌)లు శనివారం ఉదయం సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. న్యాయమూర్తులు బోపయ్య నియామకాన్ని రద్దు చేయలేదు కానీ అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షప్రసారం చేయాలని ఆదేశించారు. బీజేపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. తమ ఎంఎల్‌ఏలను ప్రభావితం చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఆడియో టేపులను విడుదల చేసింది. ఇదంతా చూసిన ప్రజలకు రాజకీయాలంటే వెగటు పెరిగి ఉంటుంది. గోవాలో దిగ్విజయ్‌సింగ్‌ నిర్వాకంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైన కాంగ్రెస్‌ ఈసారి ఆజాద్‌నీ, గెహ్లాట్‌నీ బెంగళూరు పంపించి బీజేపీ ఆటకట్టించింది. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు వారికి అండగా నిలిచారు. జేడీ (ఎస్‌), కాంగ్రెస్‌లకు చెందిన శాసనసభ్యులు బీజేపీకి ఓటు వేసే అవకాశం లేదని గ్రహించిన యడ్యూరప్ప రాజీనామా చేయాలనుకోవడం సముచి తమే. ఈ నిర్ణయం యడ్యూరప్పదైనా, ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాలది అయినా అభినందనీయమే. ప్రజాస్వామ్యాన్ని మరింత అపహాస్యం చేయకుండా సరైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. 

ప్రజాస్వామ్యాన్ని రక్షించినందుకు సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇతర నాయకులు ధన్యవాదాలు చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలంటూ రాజ్యసభలో నోటీసు ఇచ్చి, అందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనుమతించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసి, చివరికి పరిస్థితులు అనుకూలించక దాన్ని ఉపసంహరించుకున్న కాంగ్రెస్‌ ఇప్పుడు అదే న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడిందంటూ స్తుతించడం విడ్డూరం. కర్ణాటక వ్యవహారంలో నిక్కచ్చిగా వ్యవహరించడం వల్ల సర్వోన్నత న్యాయస్థానం పట్ల ప్రజలకు గౌరవం పెరిగింది. అందులో సందేహం లేదు. కానీ తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు మెచ్చుకోవడం, ప్రతికూలంగా వచ్చినప్పుడు పక్షపాతం ఆపాదించడం రాజకీయ నాయకులకు తగదు. అలాగే రాజ్యాంగాన్ని అదే పనిగా ఉల్లంఘించిన నాయకులు కర్ణాటక పరిణామాలపై వ్యాఖ్యానించడం, పార్టీ ఫిరాయింపులను నిరోధించినందుకు సుప్రీంకోర్టును అభినందించడం మరో వింత. 23 మంది ప్రతిపక్ష ఎంఎల్‌ఏలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి రాజ కీయ నాయకుడికి రాజ్యాంగబద్ధతపైనా, రాజకీయ విలువలపైనా మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? 

1996లో 13 రోజులు అధికారంలో ఉండి బలం నిరూపించుకోలేక రాజీనామా చేసిన వాజపేయితో యడ్యూరప్పను ఒకందుకు పోల్చవలసి వస్తున్నది. ఇద్దరి వ్యక్తిత్వాలూ, నైతిక స్థాయీ, దృక్ప«థాలూ వేరైనప్పటికీ లోక్‌సభలో నాటి పరిస్థితులకీ, కర్ణాటక శాసనసభలో నేటి వాతావరణానికీ ఎంతో కొంత సామ్యం ఉంది. నాడు వాజపేయి లోక్‌సభలో బలం నిరూపించుకోలేక వైదొలిగిన తర్వాత ప్రధానమంత్రిగా దేవెగౌడ అందలం ఎక్కారు. ఇప్పుడు యడ్యూరప్ప రాజీనామా అనంతరం ముఖ్యమంత్రిగా దేవెగౌడ కుమారుడు కుమారస్వామి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అప్పుడు దేవెగౌడ 46 మంది ఎంపీల బలంతో ప్రధాని కాగలిగితే ఇప్పుడు కుమారస్వామికి తనతో సహా 37 మంది జేడీ (ఎస్‌) ఎంఎల్‌ఏలు ఉన్నారు. ఇద్దరూ కాంగ్రెస్‌ మద్దతు స్వీకరించినవారే. దేవెగౌడ సంవత్సరం తిరగకుండానే కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్న కారణంగా పదవీచ్యుతులైనారు. కుమారస్వామికి కాంగ్రెస్‌ మద్దతు ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రశ్న. అనిశ్చితికీ, అస్థిరతకూ దారితీసే అంశాలు అనేకం కర్ణాటక రాజకీయాలలోనే నిక్షిప్తమై ఉన్నాయి. 

రాహుల్‌ తప్పిదం
సమాజాన్నీ, పార్టీలనూ విభజించే ప్రమాదభూయిష్టమైన రాజకీయాన్ని అన్ని పార్టీలూ బాధ్యతారహితంగా ప్రోత్సహించాయి. కావేరీ నీటి కంటే విరివిగా ఎన్నికలలో డబ్బు ఖర్చు చేశాయి. చుట్టుపక్కల రాష్ట్రాలలో ఏటీఎంలలో డబ్బులు లేకుండా, రెండువేల రూపాయల నోట్లు మచ్చుకైనా కనిపించకుండా చేశాయి. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు యధేచ్ఛగా చేసుకున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత దూషణలతో, నిందారోపణలతో ప్రచారపర్వాన్ని వేడెక్కించారు. ఎన్నికలలో గెలుపొందేందుకు ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తారనీ, గెలిచినవారిని వెంటనే కొనుగోలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరనీ, అందుకు గవర్నర్‌ ఎంత వ్యవధి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారనీ ప్రజలకు అర్థమైపోయింది. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికల పట్లా, ప్రజాస్వామ్యం పట్లా సాధారణ ప్రజలకు విశ్వాసం ఏముం టుంది? కర్ణాటకంలో ఒక అంకానికి తెర పడింది. రెండో అంకానికి తెర లేవబోతున్నది. జేడీ(ఎస్‌) అధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా సోమవారం కంఠీరవ స్టేడియంలో పదవీబాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌కు చెందిన దళిత నాయకుడు జి. పరమేశ్వర ఉంటారని అంటున్నారు. 

ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్యను సంపూర్ణంగా బలపరిచే ప్రయత్నంలో రాహుల్‌గాంధీ ఒకానొక రాజకీయ తప్పిదం చేశారు. 2006లో జేడీ(ఎస్‌) నుంచి వైదొలిగి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచీ సిద్ధరామయ్యకూ, దేవెగౌడ కుటుంబానికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య దాన్ని ప్రదర్శించడమే కాకుండా రాహుల్‌తో కూడా దేవెగౌడ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. జేడీ (ఎస్‌)లో ‘ఎస్‌’అంటే సంఘ్‌ పరివారమనీ, జేడీ (ఎస్‌) బీజేపీకి ‘బీ–టీమ్‌’అనీ రాహుల్‌ నిందాస్త్రాలు సంధించారు. తన బొందిలో ప్రాణం ఉండగా బీజేపీతో పొత్తు పెట్టుకోనంటూ దేవెగౌడ పలుమార్లు ప్రకటించినా రాహుల్‌ వినిపించుకోలేదు. బీఎస్‌పీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ అధినేత మాయావతితో ప్రచారం చేయించినా జేడీ (ఎస్‌) నాయకత్వాన్ని విశ్వసించలేదు. లోగడ దేవెగౌడ బీజేపీ పట్ల ఇదే విధమైన ప్రతికూలత వెలిబుచ్చారనీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కుమారస్వామితో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటానని ప్రకటించారనీ, తీరా కుమారస్వామి అదే బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆనందించారనీ విమర్శకులు గుర్తు చేస్తారు. రాహుల్‌ కాంగ్రెస్‌ అధినేతగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలనీ, ప్రతి లోక్‌సభ స్థానంలోనూ బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా అత్యంత యోగ్యుడైన అభ్యర్థిని ప్రతిపక్షాలు అన్నీ కలిసి నిలబెట్టాలనీ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదిస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత పెంపొం దించవలసిన రాహుల్‌ దేవెగౌడ కుటుంబంపైన మితిమీరి దాడి చేయడం అవివేకం. ఆ స్థాయిలో విరుచుకుపడకుండా ఉంటే నేటి మైత్రి అంత కృతకంగా కనిపించేది కాదు. మొత్తం మీద జేడీ (ఎస్‌), కాంగ్రెస్‌లు దక్షిణ కర్ణాటకలో హోరాహోరీ పోరాడాయి. అక్కడ బీజేపీ ఉనికి తక్కువ. ఆ విధంగా ద్వేషం పంచుకున్న రెండు పక్షాలు కేవలం బీజేపీని నిలువరించడంకోసం ఒకే తాటిమీదికి రావడం అవకాశవాదం అనాలో, సమయజ్ఞత అనాలో తేల్చుకోవడం కష్టం. రేపటి నుంచి ఈ సంకీర్ణం అంతర్గత విభేదాలను ఎట్లా పరిష్కరించుకుంటుందో, ప్రతిపక్ష బీజేపీని ఎట్లా ఎదుర్కొంటుందో మరి.

కుమారస్వామి సారథ్యం 
విభజన రేఖలు స్పష్టంగా ఉన్నప్పటికీ సమైక్యంగా ఉంటామనీ, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనీ నమ్మబలికే నాయకులను నమ్మడం ఎట్లా అన్నది కర్ణాటక ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. ఒక వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మరోవైపు సోనియా, రాహుల్‌ అత్యవసర సమాలోచన జరిపి జేడీ (ఎస్‌)కు షరతులు లేని మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. ఇదే ప్రాప్తకాలజ్ఞత. ఢిల్లీలో నిర్ణయించినంత మాత్రాన స్థానికంగా నిన్నటి వరకూ ఒకరిపైన ఒకరు పోరాడుకున్నవారు సఖ్యతతో ఉండగలరా? తమ శాసనసభ్యులు నైతిక విలువలను కాపాడారనీ, బీజేపీ ప్రలోభాలకు లొంగలేదనీ కాంగ్రెస్‌ అధినాయకత్వం కితాబు ఇచ్చింది. తెలంగాణలో ఫిరాయించిన కాంగ్రెస్‌ శాసనసభ్యులూ, శాసనమండలి సభ్యులూ, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను వీడి టీడీపీ పంచన చేరిన శాసనమండలి సభ్యులూ నిక్షేపంగా ఉన్నారు. వారిపై అనర్హత వేటు వేయమని రాజ్యాంగ వ్యవస్థలపైన ఒత్తిడి తేవడంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్‌ ఇలా గొప్పలు చెప్పుకోవడం ఆత్మవంచన. యడ్యూరప్ప అధికారంలో కొనసాగి ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్, జేడీ (ఎస్‌)కు కర్ణాటకలో విజయావకాశాలు అధికంగా ఉండేవి. ఇప్పుడు అధికారం పంచుకుంటున్నాయి కనుక సంకీర్ణ భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తడం సహజం. ఆ మేరకు ప్రతిపక్షంలో ఉండే బీజేపీకి సానుకూల వాతావరణం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలకు గడువు ఏడాది మాత్రమే ఉన్నది కనుక కర్ణాటకలో ఎన్నికల వాతావరణం కొనసాగుతుంది. అప్పటి వరకైనా సంకీర్ణ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలన్న తాపత్రయం రెండు పార్టీలకూ ఉంటుంది. అదొక్కటే ఊరట.


కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement