సాక్షి, ఎన్నికల డెస్క్: దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయాలకు– సినీ తారలకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. తమిళనాడు, ఏపీ, కర్ణాటక ఏది చూసినా సినిమాలు– రాజకీయాలు పెనవేసుకుని కనిపిస్తాయి. కొంతకాలంగా కన్నడ చిత్రసీమ శాండల్‌వుడ్ నుంచి సినీనటులు రాజకీయ రంగంపై చాలా మంది ఆసక్తి చూపించారు. అయితే ఈ విధానసభ ఎన్నికల్లో ఎందుకనో ఎక్కువమంది తారలు చురుగ్గా పాల్గొనడం లేదు. ఒకరో ఇద్దరో బరిలో ఉండగా, తక్కువమంది మాత్రమే నేతలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు.
ప్రముఖులు కొందరే
ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో సినీ నటీనటులు ఓ మోస్తరుగానే ఉన్నారు. ఎన్నికల బరిలో ప్రముఖ నటులు కూడా లేకపోవడం విశేషం. రాజకీయ నేతలు ఎవరూ కూడా సినీ తారలకు రెడ్ కార్పెడ్ పరిచినట్లు లేదు. జేడీఎస్ తరఫున రామనగర నుంచి వర్ధమాన నటుడు నిఖిల్ పోటీలో ఉన్నారు. బీజేపీకి, సీఎం బొమ్మైకి మద్దతుగా నటుడు కిచ్చా సుదీప్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారానికి పరిమితం అయ్యారు. మరో ప్రముఖ నటుడు దర్శన్‌దీ అదే తీరు. కేజీఎఫ్ హీరో యశ్ ఎన్నికల ఛాయలకే రాలేదు. గతంలో ప్రజాకీయ పార్టీని పెట్టిన ఉపేంద్ర మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు.
కాంగ్రెస్ లీడర్ రమ్య ఎక్కడ?
అందాల నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్యస్పందన తారాజువ్వలా ఎగిశారు. ఆమె తల్లి రజిత కాంగ్రెస్‌లో చురుగ్గా పని చేశారు. నటి రమ్య 2012లో కాంగ్రెస్‌లో చేరి మండ్య ఉప ఎన్నికలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో మరోసారి మండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో ఉన్నప్పటికీ కన్నడనాట ప్రచారానికి దూరంగానే ఉండడం చర్చనీయాంశమైంది.
అంబరీశ్‌దే అగ్రస్థానం
కన్నడ రెబల్‌స్టార్ 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తర్వాత జనతాదళ్‌లో (1996 – 99) చేరి మండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు. తిరిగి సొంతగూటికి చేరుకుని మరోసారి పార్లమెంటుకు ఎన్నికై కేంద్రమంతి అయ్యారు. అంబరీశ్ సతీమణి సుమలత 2019లో మండ్య నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆమె తరఫున నటులు దర్శన్, యశ్ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే.
రాజకీయాల్లో నటీనటులు
► పోలీసు అధికారిగా పని చేసిన బీసీ పాటిల్ తర్వాత సినీ రంగం వైపు దృష్టి సారించారు. వెండితెరపై రాణిస్తూనే రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖమంత్రిగా కొనసాగుతున్నారు.
► తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన సాయికుమార్ చిక్కబళ్లాపుర బాగేపల్లి నుంచి బీజేపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా అదృష్టం కలిసిరాలేదు. ఆపై రాజకీయాల వైపు చూడలేదు.
► జస్ట్ ఆస్కింగ్ అంటూ 2018 ఎన్నికల్లో కన్నడనాట ఆకర్షించిన వైవిధ్య నటుడు ప్రకాష్‌రాజ్ ఈ ఎన్నికల్లో కనిపించనేలేదు. ఏ పార్టీకి మద్దతుగా గళమెత్తలేదు. గతంలో ఆయన ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.
► రెండు దశాబ్దాల పాటు వెండితెరపై వెలిగిన తార శృతి. బీజేపీలో మహిళా విభాగం నేతగా కొనసాగుతున్నారు.
► సుమారు 300 చిత్రాల్లో నటించిన అనంత్‌నాగ్ ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. తర్వాత రాజకీయాల్లో చేరి జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయ్యారు. మళ్లీ చురుకై న పాత్ర పోషించలేదు.
► కన్నడ చిత్రాల్లో సహాయక నటిగా రాణించిన ఉమాశ్రీ హాస్యం పండించి ఆకట్టుకునేది. 2013లో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పని చేశారు.
► సినిమాల్లో సహాయక నటిగా రాణించిన తార అనురాధ బీజేపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్‌గా వ్యవహరించారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment