కర్ణాటక: మేకెదాటు పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ సీనియర్లు సిద్దరామయ్య, డీకే శివకుమార్, డీకే.సురేశ్‌లకు ఊరట కల్పిస్తూ, వారిపై నమోదైన కోవిడ్ మార్గదర్శకాల ఉల్లంఘన కేసులు ఎత్తివేయాలని కేబినెట్‌లో తీర్మానించారు. గతేడాది జనవరిలో మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణం కోరుతూ డీకే ఆధ్వర్యంలో మేకెదాటు నుంచి బెంగళూరుకు పాదయాత్ర నిర్వహించడం తెలిసిందే.
ఈ సమయంలో కోవిడ్ థర్డ్ వేవ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. గురువారం విధానసౌధలో మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రి హెచ్‌కే పాటిల్ వివరాలను వెల్లడించారు. రామనగరలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 9 క్రిమినల్ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాదయాత్రలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వందలాది మందితో ర్యాలీలు చేయడంతో బొమ్మై సర్కారు కేసులు నమోదుచేసింది.
పలు ముఖ్యమైన తీర్మానాలు..
► వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎంహెచ్.నాగేశ్, గత జాయింట్ డైరెక్టర్‌లకు నిధుల దుర్వినియోగం కేసులో సెషన్స్‌కోర్టు 5 ఏళ్లు జైలుశిక్ష విధించడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని తీర్మానం.
► బెంగళూరులో ఏరోస్పేస్ రక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.391 కోట్లకు పాలనాత్మక ఆమోదం. ఇందిరానగర సీవీ.రామన్ ఆసుపత్రి వైద్యురాలు ఎస్‌డీ.నాగమణి లోకాయుక్తకు పట్టుబడగా తప్పనిసరి రిటైర్మెంటుకు తీర్మానం. రామనగర మహిళా వైద్యురాలు డాక్టర్ ఉషా కదరమండలగికి ఇదే నిర్ణయం.
► హువినహడగలి నియోజకవర్గం విద్యాశాఖాదికారి ఎన్‌ఎస్. హళ్లిగుడిపై ఆరోపణలు ఉన్నందున సేవల నుంచి సస్పెండ్.
ఆస్పత్రులకు నిధులు..
►బెళగావి మెడికల్ కాలేజీలో 325 పడకల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి రూ.187 కోట్ల మంజూరు
► కరావళి అభివృద్ధి ప్రాధికార పేరును కరావళి ప్రాదేశికాభివృద్ధి మండలి అని పేరు మార్పు
► ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో 20 సంచార ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు. రూ. 47 కోట్లతో ఐదు జిల్లా ఆసుపత్రులైన మైసూరు, చిత్రదుర్గ, సీవీ రామన్‌నగర, వెన్‌లాక్ ఆసుపత్రి, కేసీ.జనరల్ ఆసుపత్రుల్లో 15 ఎంఆర్‌ఐ స్కానింగ్ సేవలు.
కొత్తగా సైబర్ భద్రతా చట్టం
► కర్ణాటక సైబర్ భద్రతా చట్టం 2023 –24 కు అనుమతి. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడి నేపథ్యంలో సైబర్ భద్రతకు చట్టం ఆమోదం● సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో పామాయిల్‌కు బదులుగా సన్ ఫ్లవర్ నూనె పంపిణీ.
► బీబీఎంపీ చట్టాన్ని ఇతర మహానగర పాలికె, నగర సభ, పురసభల్లో అమలుకు పరిశీలన, అలాగే అక్రమ కట్టడాలు, బయలు భూమిపై పన్ను విధింపు పరిశీలనకు మంత్రి వర్గ ఉపసమితి ఏర్పాటు.
Comments
Please login to add a commentAdd a comment