![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/24/65566.jpg.webp?itok=XupdvCZU)
బనశంకరి: సిద్ధాంతాలు, విశ్వాసాలు తరువాతి సంగతి. మనకు టికెట్ రాకపోతే పార్టీ మారిపోదాం అనే ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో సీనియర్లు సైతం ఇట్టే పార్టీలను మార్చడం ఈ ఎన్నికల్లో ద్యోతకమైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల టికెట్ కేటాయింపుల్లో అసమ్మతి చెలరేగి సీనియర్ నాయకులు అనూహ్యంగా పార్టీలు మారడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ప్రతి ఎన్నికల సమయంలో వలసలు మామూలే. కానీ మొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలోని జగదీశ్ షెట్టర్ వంటి నాయకులు జెండాలను మార్చుకోవడం సంచలనం రేపింది. కాంగ్రెస్, బీజేపీలో ప్రయోగాలకు పూనుకోవడంతో అనేకమందికి టికెట్లు దక్కకపోగా కొత్తముఖాలకు టిక్కెట్లు కేటాయించారు. ఫలితంగా సాగిన వలసల వల్ల ఫలితాలు ఎలా ఉంటాయోనన్నది పార్టీలతో పాటు సామాన్యులకూ ఉత్కంఠ కలిగిస్తోంది.
ఓటుబ్యాంకు చీలే అవకాశం
వలసల వల్ల ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీయస్‌లలో ఓటుబ్యాంక్ చీలుతుందనే భయం నెలకొంది. టికెట్లు దక్కని నేతలు నియోజకవర్గాల్లో వారి ప్రభావంతో ఓట్లను చీల్చవచ్చనే భయం అభ్యర్థుల్లో ఉంది. అసమ్మతితో ఉన్న నేతలను బుజ్జగించే ప్రయత్నాలను అగ్రనేతలు ముమ్మరం చేశారు. అధికార బీజేపీలో అసమ్మతీయులు పెద్దసంఖ్యలో ఉన్నారు. గతంలోనే కొందరు నేతలు ప్రతిపక్షాలలోకి చేరారు. బీజేపీలో లింగాయతులకు అన్యాయం జరుగుతోందని షెట్టర్ ఆరోపించడం, ఎలాంటి అన్యాయం జరగలేదని వేదికలపై సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి బీజేపీకి రావడం గమనార్హం. వలసల వల్ల జేడీఎస్ లాభపడితే, కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ నష్టమైతే జరగలేదని అంచనా. బలమైన నాయకులు వెళ్లిపోవడం వల్ల ఎంతమాత్రం ఓట్లు నష్టపోవచ్చనే లెక్కలు తేల్చడంలో పార్టీలు నిమగ్నమయ్యాయి.
పార్టీలు మారిన నేతలు ఎందరో
జగదీశ్ షెట్టర్, లక్ష్మణసవది, పుట్టణ్ణ, బాబూరావ్ చించినసూర్, వీఎస్.పాటిల్, యుబీ.బణకార్, ఎన్‌వై.గోపాలకృష్ణ నేతలు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. బీఎస్.యడియూరప్ప అనుచరుడు ఎన్‌ఆర్.సంతోష్ జేడీయస్ పార్టీలోకి వెళ్లారు.
ఎస్‌ఆర్.శ్రీనివాస్, కేఎం.శివలింగేగౌడ అనే ఇద్దరు జేడీయస్ ఎమ్మెల్యేలు కాంగ్రేస్ పార్టీలోకి దూకారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగరాజచబ్బి, బీవీ.నాయక్ బీజేపీలో చేరారు.
బీజేపీలోని ఆయనూరు మంజునాథ్, ఎంపీ కుమారస్వామి, సూర్యకాంతనాగమారపల్లి జేడీయస్ పార్టీలో చేరారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాలో చాలామంది నాయకులు చేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment