
రాష్ట్రాన్ని గెలవాలంటే ముందు రాజధానిని గెలవాలి. కర్ణాటకలో అధికారిక పీఠానికి తాళాలు బెంగళూరులోనే ఉన్నాయి. బీజేపీకీ, కాంగ్రెస్‌కూ ఈ విషయం బాగా తెలుసు. దాంతో ఈసారి అధికార విపక్షాల మధ్య సిలికాన్ సిటీలో సంకుల సమరం సాగుతోంది.
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని గడచిన పలు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. అందుకే బెంగళూరు పరిధిలోని 28 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు నెగ్గి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తీరు తెన్నులు..
► 2008లో బెంగళూరులో బీజేపీ 17, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలవగా జేడీ(ఎస్) ఒక్క స్థానానికి పరిమితమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి దక్షిణ భారతంలో తొలిసారి ఆ ఘనత సాధించింది.
► 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 12, జేడీ(ఎస్) 3 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య తొలిసారి సీఎం అయ్యారు.
► 2018లో కాంగ్రెస్15, బీజేపీ 11, జేడీ(ఎస్) 2 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ సర్కారు బలపరీక్షలో ఓడి 14 నెలలకే కుప్పకూలింది.
► 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్) సభ్యులు బీజేపీకి ఫిరాయించడంతో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. బీజేపీ ఏకంగా 12 సీట్లు నెగ్గింది. అలా బెంగళూరులో బీజేపీ బలం 15కు పెరగగా కాంగ్రెస్ 11 స్థానాలకు పడిపోయింది. బీజేపీ అధికారాన్ని స్థిరపరచుకుంది.
వేధిస్తున్న తక్కువ ఓటింగ్
బెంగళూరులో ప్రతిసారీ తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండడం పరిపాటిగా వస్తోంది. 2013, 2018 ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పడిపోయింది. సగానికి సగం, అంటే నియోజకవర్గాల్లో మరీ తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. బెంగళూరు వాసులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరన్న అపప్రథా ఉంది. దీన్ని ఈసారైనా తొలగించుకుంటారా అన్నది చూడాలి.
► 2013 ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో కేవలం 55.04% ఓటింగ్ నమోదైంది. 2018లో అది కాస్తా 48.03 శాతానికి తగ్గింది.
► దాంతో ఈసారి ఎలాగైనా రాజధానిలో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి పెట్టింది. కొద్ది రోజులుగా ప్రత్యేక ర్యాలీలు, వాకథాన్లు, ప్రచారాలు చేపడుతోంది.
తటస్థ ఓటర్లే కీలకం
► ట్రాఫిక్ సమస్య, మౌలిక వసతుల లేమి వంటి పలు సమస్యలు బెంగళూరును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారన్నది నగరవాసుల ప్రధాన ఆరోపణ.
► ఇక్కడ 15 నుంచి 20 శాతం ఓటర్లు కులమతాలకు అతీతంగా తటస్థంగా ఉంటారు.
► వీరిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
► బీజేపీ అవినీతి, పాలన వైఫల్యాలు, కుంభకోణాలను ప్రచారం చేస్తూ నగర వాసులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. శాంతినగర, సర్వజ్ఞ నగర వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది.
► ఇక తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారానికి దిగారు.
► కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో నగరంలో బీజేపీ బలంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment