సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ గడువు ముంచుకొస్తోంది. ఈ సారైనా మేజిక్ ఫిగర్ దాటడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీపడి ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. 1999, 2013లో మినహా గత మూడు దశాబ్దాల ఎన్నికల్లో కన్నడ ఓటరు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టడం లేదు. ఈసారి ఓటర్ల మనోగతం ఎలా ఉందోనని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర గమనిస్తే అనేక ఆశ్చర్యకరమైన సంగతులు వెలుగు చూస్తాయి.
ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ గెలిచే సీట్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. ఓట్లు తక్కువగా పోలయినా సీట్ల బలంతో అధికార అందలం ఎక్కుతున్నారు. ఈ విచిత్రకరమైన పరిస్థితి గత నాలుగు శాసనసభ ఎన్నికల్లో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్లను సాధించి అగ్రస్థానంలో ఉంటోంది. కానీ సీట్ల సాధనలో వెనుకబడిపోతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 36.59% ఓట్లను సాధించి 224 స్థానాలున్న అసెంబ్లీలో 122 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2018 ఎన్నికల సమయానికి ఆ పార్టీ ఓటు షేర్ 38శాతానికి పెరిగినప్పటికీ కేవలం 78 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో బీజేపీ 36శాతం ఓట్లతో 104 స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టీగా అవతరించడం విశేషం. అదే విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 35.27% ఓట్లు కొల్లగొట్టి 65 స్థానాలు సాధించింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే తక్కువగా 28.3% ఓట్లను గెలుచుకున్న బీజేపీ 79 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల వాటా ఒక్క శాతం తగ్గినప్పటికీ 80 స్థానాల్లో గెలుపొందింది.
2013 ఎన్నికలు ప్రత్యేకం
రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు, ఆశ్చర్యకర సంఘటనలు జరిగిన ఎన్నికలు ఇవే . 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్ల పాటు పూర్తి కాలం పాటు పాలన సాగించింది. బీజేపీలోని అంతర్గత విభేదాలు, భిన్నాభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. బీఎస్ యడియూరప్ప బీజేపీని వీడి సొంతంగా కేజేపీ స్థాపించి ఎన్నికలకు వెళ్లారు.
ఆయన సహచరుడు బి.శ్రీరాములు కూడా బీఎస్‌ఆర్ పార్టీని నెలకొల్పి ఎన్నికల బరిలో దిగారు. ఈ పరిణామాలతో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 36.6 శాతం ఓట్లను రాబట్టి 112 నియోజకవర్గాల్లో గెలుపొందింది. బీజేపీ 19.9 శాతం ఓట్లతో 40 సీట్లు, జేడీఎస్ పార్టీ 20.2 శాతం ఓట్లతో 40 సీట్లు, యడియూరప్ప కేజేపీ పార్టీ 9.8 శాతం ఓట్లతో ఆరు నియోజకవర్గాలు గెలుచుకున్నాయి. ఈ దెబ్బతో బీజేపీ యడియూరప్పను బుజ్జగించి పార్టీలోకి తిరిగి చేర్చుకుంది.
ఎందుకీ పరిస్థితి..?
కర్ణాటక ఓటరు నాడి ఎవరికీ అందకుండా ఉంటుంది. పోలింగ్ బూత్‌కి వెళ్లేవరకు కూడా ఎవరికి ఓటు వెయ్యాలా అని నిర్ణయించుకోలేని ఓటర్లు 20% వరకు ఉంటారని అంచనాలున్నాయి. దీనివల్ల ఏ పార్టీకి లాభం చేకూరుతుందో చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో సంక్లిష్టమైన కులాల చిక్కుముడులు, లింగాయత్‌లు, వొక్కలిగల జనాభా ఎంత ఉంటుందో స్పష్టమైన గణాంకాలు లేకపోవడం వంటివి కూడా ఏ పార్టీకి మెజార్టీ దక్కకపోవడానికి కారణాలన్న విశ్లేషణలు ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నప్పటికీ జేడీ(ఎస్) పాత మైసూరుకే పరిమితమైంది.ఆ ప్రాంతంలో బీజేపీకి అంతగా పట్టు లేదు. దీంతో ఎక్కడైనా రెండు పార్టీల మధ్యే ముఖాముఖి పోరు నెలకొంటోంది. పాత మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య హోరాహోరీ పోరు ఉంటే, మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ ఉంటుంది. దీంతో అయితే భారీ మెజార్టీ, లేదంటే అతి స్వల్ప మెజార్టీతో పార్టీలు విజయం సాధిస్తున్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండడం వల్ల ఆ పార్టీ ఓట్ల శాతంలో అగ్రభాగంలో నిలుస్తున్నా అధికారానికి అవసరమైన సీట్లను రాబట్టుకోవడంలో విఫలమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment