Votes percentage
-
Karnataka assembly elections 2023: ఓట్లెక్కువ.. సీట్లు తక్కువ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ గడువు ముంచుకొస్తోంది. ఈ సారైనా మేజిక్ ఫిగర్ దాటడానికి కాంగ్రెస్, బీజేపీ పోటీపడి ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. 1999, 2013లో మినహా గత మూడు దశాబ్దాల ఎన్నికల్లో కన్నడ ఓటరు ఏ పార్టీకి మెజార్టీ కట్టబెట్టడం లేదు. ఈసారి ఓటర్ల మనోగతం ఎలా ఉందోనని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్ర గమనిస్తే అనేక ఆశ్చర్యకరమైన సంగతులు వెలుగు చూస్తాయి. ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ గెలిచే సీట్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. ఓట్లు తక్కువగా పోలయినా సీట్ల బలంతో అధికార అందలం ఎక్కుతున్నారు. ఈ విచిత్రకరమైన పరిస్థితి గత నాలుగు శాసనసభ ఎన్నికల్లో కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్లను సాధించి అగ్రస్థానంలో ఉంటోంది. కానీ సీట్ల సాధనలో వెనుకబడిపోతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 36.59% ఓట్లను సాధించి 224 స్థానాలున్న అసెంబ్లీలో 122 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 ఎన్నికల సమయానికి ఆ పార్టీ ఓటు షేర్ 38శాతానికి పెరిగినప్పటికీ కేవలం 78 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో బీజేపీ 36శాతం ఓట్లతో 104 స్థానాల్లో నెగ్గి అతి పెద్ద పార్టీగా అవతరించడం విశేషం. అదే విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 35.27% ఓట్లు కొల్లగొట్టి 65 స్థానాలు సాధించింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే తక్కువగా 28.3% ఓట్లను గెలుచుకున్న బీజేపీ 79 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల వాటా ఒక్క శాతం తగ్గినప్పటికీ 80 స్థానాల్లో గెలుపొందింది. 2013 ఎన్నికలు ప్రత్యేకం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు, ఆశ్చర్యకర సంఘటనలు జరిగిన ఎన్నికలు ఇవే . 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్ల పాటు పూర్తి కాలం పాటు పాలన సాగించింది. బీజేపీలోని అంతర్గత విభేదాలు, భిన్నాభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చాయి. బీఎస్ యడియూరప్ప బీజేపీని వీడి సొంతంగా కేజేపీ స్థాపించి ఎన్నికలకు వెళ్లారు. ఆయన సహచరుడు బి.శ్రీరాములు కూడా బీఎస్ఆర్ పార్టీని నెలకొల్పి ఎన్నికల బరిలో దిగారు. ఈ పరిణామాలతో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 36.6 శాతం ఓట్లను రాబట్టి 112 నియోజకవర్గాల్లో గెలుపొందింది. బీజేపీ 19.9 శాతం ఓట్లతో 40 సీట్లు, జేడీఎస్ పార్టీ 20.2 శాతం ఓట్లతో 40 సీట్లు, యడియూరప్ప కేజేపీ పార్టీ 9.8 శాతం ఓట్లతో ఆరు నియోజకవర్గాలు గెలుచుకున్నాయి. ఈ దెబ్బతో బీజేపీ యడియూరప్పను బుజ్జగించి పార్టీలోకి తిరిగి చేర్చుకుంది. ఎందుకీ పరిస్థితి..? కర్ణాటక ఓటరు నాడి ఎవరికీ అందకుండా ఉంటుంది. పోలింగ్ బూత్‌కి వెళ్లేవరకు కూడా ఎవరికి ఓటు వెయ్యాలా అని నిర్ణయించుకోలేని ఓటర్లు 20% వరకు ఉంటారని అంచనాలున్నాయి. దీనివల్ల ఏ పార్టీకి లాభం చేకూరుతుందో చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో సంక్లిష్టమైన కులాల చిక్కుముడులు, లింగాయత్‌లు, వొక్కలిగల జనాభా ఎంత ఉంటుందో స్పష్టమైన గణాంకాలు లేకపోవడం వంటివి కూడా ఏ పార్టీకి మెజార్టీ దక్కకపోవడానికి కారణాలన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నప్పటికీ జేడీ(ఎస్) పాత మైసూరుకే పరిమితమైంది.ఆ ప్రాంతంలో బీజేపీకి అంతగా పట్టు లేదు. దీంతో ఎక్కడైనా రెండు పార్టీల మధ్యే ముఖాముఖి పోరు నెలకొంటోంది. పాత మైసూరులో కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య హోరాహోరీ పోరు ఉంటే, మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ ఉంటుంది. దీంతో అయితే భారీ మెజార్టీ, లేదంటే అతి స్వల్ప మెజార్టీతో పార్టీలు విజయం సాధిస్తున్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉండడం వల్ల ఆ పార్టీ ఓట్ల శాతంలో అగ్రభాగంలో నిలుస్తున్నా అధికారానికి అవసరమైన సీట్లను రాబట్టుకోవడంలో విఫలమవుతోంది. -
‘ఆరు’లో 96
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలు జరిగిన ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోలింగ్‌లో పాల్గొన్నారు. మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరగ్గా 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మంలో ఒక్కో స్థానానికి, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఐదు జిల్లాల పరిధిలోని 5,326 మంది ‘స్థానిక’ఓటర్లతో పాటు 65 మంది ఎక్స్అఫీషియో ఓటర్లకు గాను మొత్తం 96.76 శాతం పోలింగ్ నమోదైంది. పోలీసులు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను పోలీసు బందోబస్తుతో స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఆరు చోట్లా తామే విజయం సాధిస్తామని పోలింగ్ సరళిని బట్టి టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. పలుచోట్ల 100% పోలింగ్ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఆదిలాబాద్ మినహా మిగతా నాలుగు జిల్లాల్లో మందకొడిగా సాగింది. తర్వాత ఇన్నాళ్లూ టీఆర్ఎస్ శిబిరాల్లో ఉన్న ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బస్సుల్లో చేరుకోవడంతో ఓటింగ్ ఊపందుకుంది. ఆదిలాబాద్‌లో నిర్మల్, కరీంనగర్లో కోరుట్ల, జగిత్యాల, హుజూరాబాద్, హుస్నాబాద్, మెదక్‌లో జహీరాబాద్, నారాయణఖేడ్, సిద్దిపేట, తూప్రాన్, నల్లగొండ జిల్లా భువనగిరి పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్లో రెండు స్థానాలూ మావే: గంగుల కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు తామే దక్కించుకోబోతున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి రెండు స్థానాలు ఏకగ్రీవం కావాల్సి ఉందని, కొందరు చేసిన ద్రోహం వల్ల ఎన్నిక జరిగిందని తెలిపారు. ఇక ఆదిలాబాద్‌లో స్వల్ప సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ జిల్లాలో మొత్తం 1,026 ఓటర్లకు గాను 1,018 మంది (99.22 శాతం) ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎక్స్ అఫీషియో సభ్యులు కలుపుకొని మొత్తం 1,271 మంది ఓటర్లు ఉండగా.. 1,233 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్‌కు దూరంగా సీఎం కేసీఆర్ గజ్వేల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోలింగ్‌లో పాల్గొనలేదు. మంత్రుల్లో కేటీ రామారావు సిరిసిల్లలో, హరీశ్‌రావు సిద్దిపేట, గంగుల కమలాకర్ కరీంనగర్, కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్, పువ్వాడ అజయ్ ఖమ్మం, జగదీశ్‌రెడ్డి సూర్యాపేట పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓటరుగా నమోదు కాకపోవడంతో పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఓటింగ్‌లో పాల్గొనలేదు. గతంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యుడిగా నమోదు కావడంతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓటు హక్కు పొందలేకపోయారు. భట్టిని అడ్డుకున్న పోలీసులు ఖమ్మం పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ చాలాసేపు లోపలే ఉండడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లిపోగా, పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేశారనే కారణంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఓట్లు ఫుల్.. సీట్లు నిల్ !
* భారీగా ఓట్లు సాధించినా సీట్లు గెలుచుకోలేని పలు పార్టీలు * ఓట్ల శాతంలో మూడో స్థానంలో నిలిచినా ఒక్కసీటూ రాని బీఎస్పీ * తక్కువ ఓట్లతోనే రికార్డు స్థాయిలో సీట్లుపొందిన టీఎంసీ, అన్నాడీఎంకే, బీజేడీ * సీపీఐ, డీఎంకే సహా 1,652 పార్టీలకు సున్నాయే న్యూఢిల్లీ: ఓట్లు గొప్ప.. సీట్లు దిబ్బ.. దేశవ్యాప్తంగా పలు పార్టీల విచిత్రమైన పరిస్థితి ఇది. ఆ పార్టీలు రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించినా కూడా ఒక్క సీటూ గెలుచుకోలేకపోయాయి. అదే తక్కువ శాతం ఓట్లు వచ్చిన కొన్ని పార్టీలు ఏకంగా రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకోవడం గమనార్హం. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలైన మొత్తం ఓట్లలో వివిధ పార్టీలు సాధించిన ఓట్ల శాతాన్ని చూస్తే.. 282 ఎంపీ సీట్లు సాధించి విజయ దుందుభి మోగించిన బీజేపీ గత ఎన్నికల్లో కంటే ఓట్ల శాతాన్ని 12 శాతం పెంచుకుని.. 31 శాతం (17.2 కోట్ల) ఓట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే తొలిసారిగా ఓట్ల శాతం 28 నుంచి 19.3 శాతాని (10.7 కోట్ల ఓట్లు)కి తగ్గింది. ఈ పార్టీ 44 సీట్లు మాత్రమే సాధించగలిగింది. ఇక 4.1 శాతం ( దాదాపు 2.3 కోట్ల) ఓట్లతో మూడో స్థానంలో నిలిచిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం గమనార్హం. ఇదే సమయంలో 3.8 శాతం ఓట్లు పొందిన టీఎంసీ 34 సీట్లు, 3.3 శాతం ఓట్లు పొందిన అన్నాడీఎంకే ఏకంగా 37, 1.9 శాతం ఓట్లు పొందిన శివసేన 19, 1.2 శాతం ఓట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ 11 సీట్లు గెలుచుకున్నాయి. ఇదే సమయంలో 3.4 శాతం ఓట్లు సాధించిన సమాజ్‌వాదీ పార్టీ 5 స్థానాలు, 3.3 శాతం ఓట్లు పొందిన సీపీఎం 9 సీట్లు, 2 శాతం ఓట్లు సాధించిన ఆమ్ఆద్మీ పార్టీ 4 స్థానాలు సాధించాయి. ఇక అన్నింటికన్నా చిత్రమైనదేమిటంటే.. ప్రస్తుత ఎన్నికల్లో సీట్ల సంఖ్య పరంగా 20 సీట్లతో ఐదో పెద్ద పార్టీగా నిలిచిన బిజు జనతాదళ్ (బీజేడీ)కు వచ్చిన ఓట్లు కేవలం 1.7 శాతమే... సరిగ్గా ఇంతేశాతం ఓట్లు పొందిన డీఎంకే పార్టీకి కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. ఇక దేశవ్యాప్తంగా నమోదైన ఓట్లలో దాదాపు 2.5 శాతం చొప్పున సంపాదించిన వైఎస్సార్సీపీ 9, టీడీపీ 16 స్థానాలు సాధించాయి. బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర ఓట్లలో 16 శాతానికిపైగా సాధించిన జేడీయూ కేవలం రెండే లోక్‌సభ సీట్లు గెలుచుకోగలిగింది. కాగా... సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ఒక శాతానికిపైగా ఓట్లను 18 పార్టీలు సాధించగలిగాయి. సీపీఐ, శిరోమణి అకాలీదళ్, డీఎండీకే, పీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా వంటి చాలా పార్టీలకు ఒక్క శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఈ సారి ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘నోటా’కు దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య 60 లక్షలు. 1,652 పార్టీలకు సున్నాయే.. బీజేపీ కూటమి హవా కొనసాగిన ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్పీ, సీపీఐ, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎల్డీ, ఏజీపీ వంటి ప్రముఖ పార్టీలు ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. అంతేకాదు దేశంలో ప్రస్తుతం రిజిస్టరైన మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య 1,687 కాగా.. ఇందులో 1,652 పార్టీలకు ఒక్క సీటు కూడా రాలేదు. ఈ సారి లోక్‌సభకు దేశవ్యాప్తంగా 8,200 మంది అభ్యర్థులు పోటీ పడగా.. వారిలో వివిధ పార్టీల తరఫున బరిలోకి దిగిన 5,007 మందిలో 540 మంది గెలవగా, స్వతంత్రులుగా రంగంలోకి దిగినవారిలో ముగ్గురు విజయం సాధించారు. కమలదళంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు గెలుపు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బరిలో నిలిపిన ప్రతి ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు విజయం సాధించారు. అదే.. కాంగ్రెస్‌కు చెందిన ప్రతి 10 మంది అభ్యర్థుల్లో ఒక్కరు మాత్రమే గెలవగలిగారు. మొత్తం 543 స్థానాలకు గాను బీజేపీ 428 మంది అభ్యర్థులను పోటీకి నిలిపింది. అందులో 282 మంది గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ 457 మంది అభ్యర్థులను పోటీకి దించగా.. అందులో 44 మంది మాత్రమే గెలిచారు. అన్నా డీఎంకే, బిజూ జనతాదళ్, లోక్‌జనశక్తి పార్టీ వంటివి తమకు బలమున్న ప్రాంతాలకే పరిమితమై పోటీ చేయటం వల్ల వాటి గెలుపు శాతం ఎక్కువగా నమోదు చేశాయి. వాటి గెలుపు శాతాలు 90 శాతానికి పైగా ఉన్నాయి. ఇక తమకు బలం లేని ప్రాంతాల్లోనూ పోటీ చేసిన పార్టీ గెలుపు శాతం చాలా దారుణంగా ఉంది. 443 స్థానాల నుంచి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 4 సీట్లలోనే విజయం సాధించటంతో ఆ పార్టీ గెలుపు శాతం కేవలం 0.9 గా నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ తనకు బలమున్న పశ్చిమబెంగాల్లోనే కాక.. ఇతర ప్రాంతాల నుంచి కూడా కలిపి 100 మందికి పైగా అభ్యర్థులను నిలిపింది. దీనివల్ల బెంగాల్లో అత్యధికంగా 34 సీట్లు గెలుచుకున్నప్పటికీ.. ఆ పార్టీ గెలుపు శాతం 30 గానే ఉంది.