కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు సంపూర్ణ మెజార్టీ సాధించలేదు. ఎన్నికలకు ముందు, తర్వాత పెట్టుకొన్న పొత్తులు, స్వతంత్రులపై వల, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం వంటి వాటితో ప్రభుత్వాలు నడిపింది. దీనికి ప్రధాన కారణం వొక్కలిగ ప్రాబల్య ప్రాంతమైన పాత మైసూరులో పాగా వెయ్యలేకపోవడమే.ఈ సారి ఎన్నికల్లోనైనా పాత మైసూరులో పట్టు బిగించి సంపూర్ణ మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ విపక్షాలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడడంతో ఈ ప్రాంతం కొత్త పోరాటాలకు వేదికగా మారింది.
కాంగ్రెస్‌కు కలిసొస్తుందా..?
ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండే పాత మైసూరు ప్రాంతం జేడీ (ఎస్) వచ్చాక క్రమంగా పట్టు కోల్పోతూ వస్తోంది. ఈ ప్రాంత రాజకీయాలను శాసిస్తున్న వొక్కలిగ సామాజిక వర్గీయులు మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను తమకు తండ్రిలా భావిస్తారు. గత ఎన్నికల్లో కూడా ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో 66 స్థానాలకు గాను 30 సీట్లు చేజిక్కించుకొని జేడీ(ఎస్) ముందు వరసలో ఉంది. తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కింగ్ మేకర్‌గా ఒక పార్టీ చక్రం తిప్పి అధికార అందలాన్ని అందుకుంటుందని పాత మైసూర్‌లో వొక్కలిగలు తమ పొలిటికల్ పవర్ చూపించారు.
224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో పాత మైసూరు, బెంగళూరు అర్బన్ కలిపి 89 స్థానాలు ఉన్నాయి. 1983 సంవత్సరం వరకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభ వెలిగిపోయింది. జనతాపార్టీ మూలస్థంభాల్లో ఒకరైన మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత సాధించారు. 1999లో దేవెగౌడ జనతా పార్టీ నుంచి బయటకి వచ్చి జేడీ(సెక్యులర్–ఎస్) స్థాపించిన తర్వాత పోటీ పడలేక క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వస్తోంది.
వొక్కలిగ సామాజిక వర్గీయులు రాజకీయ ప్రయోగాల్ని కూడా ఇష్టపడరు. 2005 సంవత్సరంలో అప్పట్లో జేడీ(ఎస్) నాయకుడిగా ఉన్న కురుబ వర్గానికి చెందిన నాయకుడు సిద్దరామయ్య మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితులతో ‘‘అహిందా’’ అనే కొత్త సామాజిక సమీకరణకు తెరతీశారు. వొక్కలిగ ఓట్లను దూరం చేసుకోవడం ఇష్టం లేని జేడీ(ఎస్) ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తే కాంగ్రెస్‌లో చేరారు. 2018లో సిద్దరామయ్య తన సొంత నియోజకవర్గమైన చాముండేశ్వరిలో వొక్కలిగ ఓట్లు పడకపోవడంతో ఓటమి పాలయ్యారు.
66 స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 26 సీట్లు వస్తే 2018 నాటికి ఆరు స్థానాలు కోల్పోయి 20 స్థానాలకు పరిమితమైంది. దీంతో వ్యూహాలు మార్చుకొని వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు డి.కె. శివకుమార్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. జేడీ(ఎస్) నుంచి ఎస్. శ్రీనివాస్, శ్రీనివాస గౌడ, శివలింగ గౌడ గత నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో ప్రధాన నాయకులు శివకుమార్, సిద్దరామయ్యలు ఈ ప్రాంతానికి చెందినవారే కావడం పార్టీకి కలిసొచ్చేఅంశం.
ఉప ఎన్నికల గెలుపుతో పెరుగుతున్న బీజేపీ పట్టు
పాత మైసూరు ప్రాంతానికి చెందిన బలమైన నాయకుల్ని ఆపరేషన్ కమల్ పేరుతో తమ వైపు లాక్కొని బీజేపీ పట్టు పెంచుకుంటోంది. డి. సుధాకర్, కె.సి.నారాయణ గౌడ, హెచ్‌టీ సోమశేఖర్, బైరఠి బసవరాజ్, వి. గోపాలయ్య వంటి వారు బసవరాజ్ బొమ్మై కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. యడ్డియూరప్ప నేతృత్వంలో పార్టీ ఫిరాయించిన 15 మంది నాయకుల్లో 12 మంది బీజేపీ టికెట్‌పై ఉప ఎన్నికల్లో నెగ్గారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా వొక్కలిగ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహరచన మొదలు పెట్టింది.
అందులో భాగంగానే ముస్లింలకున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలిగ, లింగాయత్‌లకు రెండేసి శాతం చొప్పున కట్టబెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు ఈ ప్రాంతంలోనే అధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. వొక్కలిగ ఆత్మనినాదం పేరుతో ఆ సామాజిక వర్గం నాయకుడు కెంపె గౌడ కంచు విగ్రహాన్ని బెంగుళూరు విమానాశ్రయం సమీపంలో మోదీ ఆవిష్కరించారు. ముస్లిం పాలకుడు టిప్పు సుల్తాన్‌ను చంపిన వొక్కలిగ సైనికులైన ఉరిగౌడ, నంజెగౌడలను హీరోలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో వొక్కలిగల మద్దతు లభించే అవకాశాలున్నాయి.
పట్టు నిలుపుకునే వ్యూహంలో జేడీ (ఎస్)
రెండు దశాబ్దాలుగా పాత మైసూరులో పట్టు కొనసాగిస్తూ వస్తున్న జేడీ(ఎస్) దానిని నిలుపుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. వొక్కలిగలు తమకు పెద్ద దిక్కుగా భావించే దేవగౌడ వృద్ధాప్యంతో, అనారోగ్య సమస్యలతో ప్రచారానికి రాలేకపోతున్నారు. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి అంతా తానై పార్టీ భారాన్ని మోస్తున్నప్పటికీ కుటుంబ పార్టీ ముద్ర, వలసలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తుమకూరు స్థానం నుంచి స్వయంగా ఓటమిపాలైన దేవెగౌడ ఇంటికే పరిమితమయ్యారు.
కులపరమైన సెంటిమెంట్‌లను రెచ్చగొట్టి ఎన్నికల్లో తమకి అనుకూలంగా మార్చుకోవడంలో తలపండిన దేవెగౌడ పార్టీ ఎన్నికల ప్రచారం పంచరత్న సభకి వీల్‌చైర్‌లో రావడంతో జనం పోటెత్తారు. వొక్కలిగలో వివిధ ఉపకులాల్లో కూడా దేవెగౌడకు ఆదరణ ఎక్కువగా ఉంది. కన్నడ ఆత్మగౌరవ నినాదంతో జాతీయ పార్టీలను అక్కున చేర్చుకోవద్దంటూ ప్రచారం చేస్తున్న జేడీ(ఎస్) ఈ సారి ఎన్నికల్లో కూడా పాత మైసూరులో 25 నుంచి 35 స్థానాలు గెలుచుకొని సత్తా చాటుతుందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వొక్కలిగ సంఘ్
మైసూరు ప్రాంతంలో పట్టు సాధించాలంటే వొక్కలిగల మనసు గెలుచుకోవడం మినహా మార్గం లేదు. రాష్ట్రంలో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15%జనాభా ఉన్న వొక్కలిగ ఓట్లు ఇప్పటివరకు జేడీ(ఎస్), కాంగ్రెస్ పంచుకుంటూ ఉన్నాయి.1906 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా వొక్కలిగ సంఘ్‌ను ఏర్పాటు చేశారు. మాండ్యలో ఉన్న ఒకే ఒక్క వొక్కలిగ మఠం (ఆదిచుంచనగిరి మఠ్) సామాజిక వర్గాన్ని ఒకటి చేసింది. బాగా చదువుకోవడం మొదలు పెట్టిన వారు క్రమక్రమంగా కర్ణాటకలో రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగారు. అసెంబ్లీలో నాలుగో వంతు మంది ప్రజాప్రతినిధులు వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం.
2018 ఎన్నికలు
జేడీ(ఎస్) 30
కాంగ్రెస్ 20
బీజేపీ 15
బీఎస్పీ 1 2013 ఎన్నికలు
జేడీ (ఎస్) 26
కాంగ్రెస్ 26
బీజేపీ 8
ఇతరులు 6
పాత మైసూర్
రామనగరం, మాండ్య, మైసూరు, చామరాజ్‌నగర్, కొడగు, కోలార్, తుమకూరు, బెంగళూరు రూరల్, హసన్, కోలార్, చిక్కబళ్లాపూర్
ప్రాబల్య కులం: వొక్కలిగ
(రాష్ట్ర జనాభాలో 15%)
అసెంబ్లీ సీట్లు – 66
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment