vakkaliga
-
దశాబ్దాల కులవోటు సాంప్రదాయం తారుమారు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయ ఓటింగ్ ధోరణి ఈసారి రూటు మార్చుకుంది. ముఖ్యంగా కులాల వారీ ఓటు బ్యాంకు తారుమారైంది. మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి దూరమై బీజేపీకి అండదండగా నిలుస్తూ వచ్చిన లింగాయత్‌లు మనసు మార్చుకున్నారు. ఓట్లపరంగా అత్యంత ప్రాబల్యమున్న సామాజిక వర్గమైన లింగాయత్‌లలో బాహుబలి నేత యడియూరప్పను పక్కన పెట్టినందుకు బీజేపీ భారీ మూల్యమే చెల్లించింది. ఆ పార్టీకి దశాబ్దాలుగా పెట్టని కోటలా ఉంటూ వచ్చిన లింగాయత్‌లు ఆగ్రహించి దూరమయ్యారు. 1990లో లింగాయత్ నాయకుడైన నాటి ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ అవమానకరంగా సీఎం పదవి నుంచి తప్పించడంతో ఆ పార్టీ లింగాయత్‌ల ఆగ్రహ జ్వాలలకు గురైంది. నెమ్మదిగా లింగాయత్ ఓటుబ్యాంకు బీజేపీకి మళ్లింది. 30 ఏళ్ల తర్వాత సరిగ్గా మళ్లీ అదే సీన్ రిపీటైంది. ఈసారి బీజేపీ వంతు వచ్చింది. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించడమే గాక అభ్యర్థల ఎంపిక మొదలుకుని ప్రచారం దాకా పెద్దగా ప్రాధాన్యమివ్వని ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. లింగాయత్‌లు, వొక్కలిగలు, ఎస్సీల్లో ఐదేసి శాతం మంది కాంగ్రెస్ వైపు మళ్లడంతో ఆ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించగలిగింది. కేంద్ర ఎన్నికల సంఘం, సీ –ఓటరు వెల్లడించిన పార్టీలవారీ ఓట్లు, సీట్ల సరళిని పరిశీలిస్తే కులాల ఓటుబ్యాంకుల్లో మార్పు స్పష్టంగా తెలుస్తోంది... వొక్కలిగలు: జేడీ(ఎస్)కు షాక్ జేడీ(ఎస్)కు అండగా ఉంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను తమ పితగా కొలిచే వొక్కలిగలు కూడా షాకిచ్చే నిర్ణయాలే తీసుకున్నారు. దేవెగౌడ కుటుంబ పెత్తనంపై ఓటర్లలో ఓ రకమైన కసి కనిపించింది. 2018 ఎన్నికల్లో వొక్కలిగ ప్రాబల్యమున్న మొత్తం 51 స్థానాల్లో జేడీ(ఎస్) 23 గెలుచుకుంటే ఈసారి కేవలం 12 సీట్లకు పరిమితమవ్వాల్సి వచ్చింది. పీసీసీ డీకే శివకుమార్ వొక్కలిగ నేత కావడంతో వారికి ప్రత్యామ్నాయం కనిపించింది. కాంగ్రెస్ ఓల్డ్ మైసూర్ గ్రామీణ ప్రాంతంలో ఏకంగా 36 స్థానాల్లో విజయం సాధించింది. శివకుమార్ కనకపురలో లక్షా 20 ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిచారంటేనే దేవెగౌడ గుప్పిట్లోంచి వొక్కలిగలు జారిపోతున్నట్టేనని భావిస్తున్నారు. లింగాయత్‌లు: బీజేపీకి షాక్ లింగాయత్‌లు బీజేపీకి దూరం కావడం ఇది తొలిసారేం కాదు. బీజేపీ యడియూరప్పను దూరం పెట్టినప్పుడు ఆయన బీజేపీకి గుడ్‌బై కొట్టి 2012లో కర్ణాటక జనతా పక్ష పేరుతో వేరు కుంపటి పెట్టారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేతుల కాలాయి. అప్పుడే ఆ పార్టీకి యడియూ రప్ప, లింగాయత్‌ల ఓట్ల ప్రాధాన్యం ఏమిటో తెలిసింది. ఆ తర్వాత యడియూరప్పను అక్కున చేర్చుకున్నప్పటికీ, మళ్లీ తాజాగా ఎన్నికల ముందు యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించి అదే తప్పు చేసింది. 2018 ఎన్నికల్లో లింగాయత్ ప్రాబల్యం ఉన్న స్థానాల్లో 41.8% ఓటు షేర్ బీజేపీకి వస్తే, ఈసారి కాస్త స్వల్పంగా 39.5 శాతానికి తగ్గింది. కానీ సీట్లు మాత్రం ఏకంగా 20 స్థానాలను కోల్పోవలసి వచ్చింది. జేడీ(ఎస్)కు వచ్చిన ఓట్ల శాతంలో పెద్దగా మార్పు లేదు. కాంగ్రెస్‌కు ఓట్లు 5 శాతమే పెరిగినా సీట్లు మాత్రం రెట్టింపు పెరిగాయి. చెయ్యెత్తి జై కొట్టిన ఎస్సీలు ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎస్సీలు అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఎస్సీ ప్రాబల్య అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గత ఎన్నికలతో పోల్చి చూస్తే అదనంగా 5.5శాతం ఓట్లు, 10 సీట్లు సంపాదించింది. దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడం ఈసారి ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. సాధారణంగా దళితులు ఏ ఒక్క పార్టీ వైపు ఉండరు. కానీ ఈసారి ఖర్గే దళిత బ్యాంకుపై ప్రత్యేకంగా దృష్టి సారించి 40 ర్యాలీల్లో పాల్గొనడంతో ఎస్సీ ప్రాబల్య స్థానాల్లో సగానికి పైగా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మొత్తమ్మీద కేవలం ఐదు శాతం ఓట్ల తేడాతోనే ఫలితాల్లో భారీగా మార్పులు కనిపించడమే మన ప్రజాస్వామ్యంలో వైచిత్రిగా ఎన్నికల విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
Karnataka assembly election 2023: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...!
పాత మైసూరు. కర్ణాటకలో అధికార పీఠానికి రాచమార్గంగా భావించే ప్రాంతం. మెజారిటీ కావాలంటే ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుపొందాల్సిందేనని పార్టీలన్నింటికీ బాగా తెలుసు. ఈ ప్రాంతంలో ఒక్కలిగ సామాజికవర్గం ప్రభావం అధికం. వారిని ప్రసన్నం చేసుకోగలిగే పార్టీదే పాత మైసూరు. అందుకోసమే పార్టీలన్నీ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి... సాక్షి బెంగళూరు: కర్ణాటక జనాభాలో ఒక్కలిగ సామాజికవర్గం 15 శాతం ఉంటుందని అంచనా. లింగాయత్ (17 శాతం)ల తర్వాత రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గం వీరే. ఉత్తర కర్ణాటక లింగాయత్ బెల్ట్ కాగా పాత మైసూరు ఒక్కలిగల కంచుకోట. ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వ ఏర్పాటులో ఈ వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. వీరు కొన్ని దశాబ్దాలుగా ఒక్కలిగలు జేడీ(ఎస్)నే ఆదరిస్తూ వస్తున్నారు. ఈసారి వారిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏడుగురు సీఎంలను ఇచ్చిన ప్రాంతం ► రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో పాత మైసూరు ప్రాంతంలో 51 సీట్లున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ 16 స్థానాల్లో, బీజేపీ 9 చోట్ల గెలిచాయి. ► కావేరి వివాదం, రైతు ఆత్మహత్యల వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. మేజిక్ నంబర్ సాధించడంలో ఈ ప్రాంతం కీలకం. ► గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన 17 మందిలో ఏకంగా ఏడుగురు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే! ఈ సామాజికవర్గానికి చెందిన హెచ్.డి.దేవెగౌడ ప్రధాని పదవి దాకా ఎదిగారు. ► ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి జేడీ(ఎస్) చాలా బలంగా ఉంది. ► మండ్య, హసన్, రామనగర, మైసూరు, చామరాజనగర, కోలార్, తుమకూరు, కొడగు జిల్లాలో ఒక్కలిగలు అధికంగా ఉంటారు. ► ఒక్కలిగల ఓట్లను ఒడిసిపట్టేందుకు అధికార బీజేపీ తాజాగా వారి రిజర్వేషన్లను 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. ► ఇక కాంగ్రెస్ ఒక్కలిగలకు ఎక్కువగా టికెట్లిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ► జేడీ(ఎస్) మాత్రం తన సంప్రదాయ ఓటుబ్యాంకు మళ్లీ చెక్కుచెదరబోదని ధీమాగా ఉంది. కాంగ్రెస్.. గత వైభవమే పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ ఒకప్పుడు తిరుగులేని పార్టీ. దేవెగౌడ రూపంలో బలమైన ఒక్కలిగ నేత రాకతో ఇక్కడ దాని ప్రభ మసకబారింది. ఈ ప్రాంతానికే చెందిన ముఖ్య ఒక్కలిగ నేత పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్‌పైనే ఈసారి కాంగ్రెస్ ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీ... ఇక బీజేపీది భిన్నమైన పరిస్థితి! పాత మైసూరులో పార్టీకి ఒక్కరంటే ఒక్కరు కూడా బలమైన ఒక్కలిగ నాయకుడు లేడు. దాంతో ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీ(ఎస్)ల తర్వాతి స్థానానికే పరిమితమవుతూ వస్తోంది. అయితే 2018 ఎన్నికల్లో కాస్తా పుంజుకున్న నేపథ్యంలో ఈసారీ భారీగానే ఆశలు పెట్టుకుంది. గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ బలమైన స్థానిక నేతలను చేర్చుకుని టికెట్లిచ్చింది. ఇంటిపోరు జేడీ(ఎస్)ను ముంచేనా...? దేవెగౌడ కుటుంబంలో వారసత్వ రగడ మొదలైంది. ఆయన కుమారుల్లో జేడీ(ఎస్) నేత హెచ్.డి.కుమారస్వామి రామనగర, మైసూరు, మండ్య జిల్లాల్లో గట్టి నాయకుడు కాగా సోదరుడు హెచ్.డి.రేవణ్ణ హాసన్ జిల్లాలో తిరుగులేని నేత. కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. హాసన్ టికెట్ విషయంలో ఇవి రచ్చకెక్కాయి. అక్కడ రేవణ్ణ భార్య భవానీని కాదని అతి సామాన్య కార్యకర్తకు కుమారస్వామి టికెటిచ్చారు. ఈ గొడవ కొంప ముంచుతుందేమోనని జేడీ(ఎస్) వర్గాల్లో ఆందోళన నెలకొంది. -
Karnataka Assembly Elections 2023: పాత మైసూరు.. కొత్తపోరు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకు సంపూర్ణ మెజార్టీ సాధించలేదు. ఎన్నికలకు ముందు, తర్వాత పెట్టుకొన్న పొత్తులు, స్వతంత్రులపై వల, ఇతర పార్టీల నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం వంటి వాటితో ప్రభుత్వాలు నడిపింది. దీనికి ప్రధాన కారణం వొక్కలిగ ప్రాబల్య ప్రాంతమైన పాత మైసూరులో పాగా వెయ్యలేకపోవడమే.ఈ సారి ఎన్నికల్లోనైనా పాత మైసూరులో పట్టు బిగించి సంపూర్ణ మెజార్టీ సాధించాలన్న లక్ష్యంతో బీజేపీ విపక్షాలతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడడంతో ఈ ప్రాంతం కొత్త పోరాటాలకు వేదికగా మారింది. కాంగ్రెస్‌కు కలిసొస్తుందా..? ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండే పాత మైసూరు ప్రాంతం జేడీ (ఎస్) వచ్చాక క్రమంగా పట్టు కోల్పోతూ వస్తోంది. ఈ ప్రాంత రాజకీయాలను శాసిస్తున్న వొక్కలిగ సామాజిక వర్గీయులు మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను తమకు తండ్రిలా భావిస్తారు. గత ఎన్నికల్లో కూడా ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో 66 స్థానాలకు గాను 30 సీట్లు చేజిక్కించుకొని జేడీ(ఎస్) ముందు వరసలో ఉంది. తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కింగ్ మేకర్‌గా ఒక పార్టీ చక్రం తిప్పి అధికార అందలాన్ని అందుకుంటుందని పాత మైసూర్లో వొక్కలిగలు తమ పొలిటికల్ పవర్ చూపించారు. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో పాత మైసూరు, బెంగళూరు అర్బన్ కలిపి 89 స్థానాలు ఉన్నాయి. 1983 సంవత్సరం వరకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభ వెలిగిపోయింది. జనతాపార్టీ మూలస్థంభాల్లో ఒకరైన మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. తొలిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్‌యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత సాధించారు. 1999లో దేవెగౌడ జనతా పార్టీ నుంచి బయటకి వచ్చి జేడీ(సెక్యులర్–ఎస్) స్థాపించిన తర్వాత పోటీ పడలేక క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. వొక్కలిగ సామాజిక వర్గీయులు రాజకీయ ప్రయోగాల్ని కూడా ఇష్టపడరు. 2005 సంవత్సరంలో అప్పట్లో జేడీ(ఎస్) నాయకుడిగా ఉన్న కురుబ వర్గానికి చెందిన నాయకుడు సిద్దరామయ్య మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితులతో ‘‘అహిందా’’ అనే కొత్త సామాజిక సమీకరణకు తెరతీశారు. వొక్కలిగ ఓట్లను దూరం చేసుకోవడం ఇష్టం లేని జేడీ(ఎస్) ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తే కాంగ్రెస్‌లో చేరారు. 2018లో సిద్దరామయ్య తన సొంత నియోజకవర్గమైన చాముండేశ్వరిలో వొక్కలిగ ఓట్లు పడకపోవడంతో ఓటమి పాలయ్యారు. 66 స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 26 సీట్లు వస్తే 2018 నాటికి ఆరు స్థానాలు కోల్పోయి 20 స్థానాలకు పరిమితమైంది. దీంతో వ్యూహాలు మార్చుకొని వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు డి.కె. శివకుమార్‌కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. జేడీ(ఎస్) నుంచి ఎస్. శ్రీనివాస్, శ్రీనివాస గౌడ, శివలింగ గౌడ గత నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో ప్రధాన నాయకులు శివకుమార్, సిద్దరామయ్యలు ఈ ప్రాంతానికి చెందినవారే కావడం పార్టీకి కలిసొచ్చేఅంశం. ఉప ఎన్నికల గెలుపుతో పెరుగుతున్న బీజేపీ పట్టు పాత మైసూరు ప్రాంతానికి చెందిన బలమైన నాయకుల్ని ఆపరేషన్ కమల్ పేరుతో తమ వైపు లాక్కొని బీజేపీ పట్టు పెంచుకుంటోంది. డి. సుధాకర్, కె.సి.నారాయణ గౌడ, హెచ్‌టీ సోమశేఖర్, బైరఠి బసవరాజ్, వి. గోపాలయ్య వంటి వారు బసవరాజ్ బొమ్మై కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. యడ్డియూరప్ప నేతృత్వంలో పార్టీ ఫిరాయించిన 15 మంది నాయకుల్లో 12 మంది బీజేపీ టికెట్‌పై ఉప ఎన్నికల్లో నెగ్గారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా వొక్కలిగ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహరచన మొదలు పెట్టింది. అందులో భాగంగానే ముస్లింలకున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలిగ, లింగాయత్‌లకు రెండేసి శాతం చొప్పున కట్టబెట్టింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు ఈ ప్రాంతంలోనే అధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ కాంగ్రెస్, జేడీ(ఎస్) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. వొక్కలిగ ఆత్మనినాదం పేరుతో ఆ సామాజిక వర్గం నాయకుడు కెంపె గౌడ కంచు విగ్రహాన్ని బెంగుళూరు విమానాశ్రయం సమీపంలో మోదీ ఆవిష్కరించారు. ముస్లిం పాలకుడు టిప్పు సుల్తాన్‌ను చంపిన వొక్కలిగ సైనికులైన ఉరిగౌడ, నంజెగౌడలను హీరోలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో వొక్కలిగల మద్దతు లభించే అవకాశాలున్నాయి. పట్టు నిలుపుకునే వ్యూహంలో జేడీ (ఎస్) రెండు దశాబ్దాలుగా పాత మైసూరులో పట్టు కొనసాగిస్తూ వస్తున్న జేడీ(ఎస్) దానిని నిలుపుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. వొక్కలిగలు తమకు పెద్ద దిక్కుగా భావించే దేవగౌడ వృద్ధాప్యంతో, అనారోగ్య సమస్యలతో ప్రచారానికి రాలేకపోతున్నారు. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి అంతా తానై పార్టీ భారాన్ని మోస్తున్నప్పటికీ కుటుంబ పార్టీ ముద్ర, వలసలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తుమకూరు స్థానం నుంచి స్వయంగా ఓటమిపాలైన దేవెగౌడ ఇంటికే పరిమితమయ్యారు. కులపరమైన సెంటిమెంట్లను రెచ్చగొట్టి ఎన్నికల్లో తమకి అనుకూలంగా మార్చుకోవడంలో తలపండిన దేవెగౌడ పార్టీ ఎన్నికల ప్రచారం పంచరత్న సభకి వీల్‌చైర్‌లో రావడంతో జనం పోటెత్తారు. వొక్కలిగలో వివిధ ఉపకులాల్లో కూడా దేవెగౌడకు ఆదరణ ఎక్కువగా ఉంది. కన్నడ ఆత్మగౌరవ నినాదంతో జాతీయ పార్టీలను అక్కున చేర్చుకోవద్దంటూ ప్రచారం చేస్తున్న జేడీ(ఎస్) ఈ సారి ఎన్నికల్లో కూడా పాత మైసూరులో 25 నుంచి 35 స్థానాలు గెలుచుకొని సత్తా చాటుతుందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వొక్కలిగ సంఘ్ మైసూరు ప్రాంతంలో పట్టు సాధించాలంటే వొక్కలిగల మనసు గెలుచుకోవడం మినహా మార్గం లేదు. రాష్ట్రంలో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15%జనాభా ఉన్న వొక్కలిగ ఓట్లు ఇప్పటివరకు జేడీ(ఎస్), కాంగ్రెస్ పంచుకుంటూ ఉన్నాయి.1906 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా వొక్కలిగ సంఘ్‌ను ఏర్పాటు చేశారు. మాండ్యలో ఉన్న ఒకే ఒక్క వొక్కలిగ మఠం (ఆదిచుంచనగిరి మఠ్) సామాజిక వర్గాన్ని ఒకటి చేసింది. బాగా చదువుకోవడం మొదలు పెట్టిన వారు క్రమక్రమంగా కర్ణాటకలో రాజకీయంగా బలమైన శక్తిగా ఎదిగారు. అసెంబ్లీలో నాలుగో వంతు మంది ప్రజాప్రతినిధులు వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. 2018 ఎన్నికలు జేడీ(ఎస్) 30 కాంగ్రెస్ 20 బీజేపీ 15 బీఎస్పీ 1 2013 ఎన్నికలు జేడీ (ఎస్) 26 కాంగ్రెస్ 26 బీజేపీ 8 ఇతరులు 6 పాత మైసూర్ రామనగరం, మాండ్య, మైసూరు, చామరాజ్నగర్, కొడగు, కోలార్, తుమకూరు, బెంగళూరు రూరల్, హసన్, కోలార్, చిక్కబళ్లాపూర్ ప్రాబల్య కులం: వొక్కలిగ (రాష్ట్ర జనాభాలో 15%) అసెంబ్లీ సీట్లు – 66 – సాక్షి, నేషనల్ డెస్క్ -
కన్నడనాట రిజర్వేషన్ల రగడ
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారు రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు అందుతున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత వారం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆ 4 శాతాన్ని బీజేపీకి గట్టి ఓటు బ్యాంకైన వక్కలిగలు, లింగాయత్‌లకు సమానంగా పంచడంపై కలకలం రేగుతోంది. ఈ పరిణామం విపక్ష కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శిస్తూనే, తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోటాను పునరుద్ధరిస్తామంటూ హస్తం పార్టీ తాజాగా ఎన్నికల హామీ ఇచ్చింది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లను ఉప కులాలవారీగా విభజించిన తీరుతో తమకు అన్యాయం జరిగిందంటూ బంజారాలు, ఆదివాసీలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు... ఏం జరిగింది? కర్ణాటకలో ముస్లింలను ఓబీసీ జాబితాలోని 2బీ కేటగిరీ నుంచి తొలగిస్తూ బొమ్మై ప్రభుత్వం వారం క్రితం నిర్ణయం తీసుకుంది. ఓబీసీ కోటాలో భాగంగా విద్య, ఉద్యోగాల్లో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. వాటిని లింగాయత్‌లు, వక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ముస్లింలను ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల) జాబితాకు మారుస్తున్నట్టు సీఎం బొమ్మై చెప్పుకొచ్చారు. ‘‘మతాధారిత రిజర్వేషన్లకు రాజ్యాంగంలో చోటు లేదు. ముస్లింలకు ఇకనుంచి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి’’అన్నారు. కాంగ్రెస్ ఏమంటోంది? ముస్లింలను ఓబీసీ జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలిగించారంటూ కాంగ్రెస్ మండిపడింది. ఇది మతాల మధ్య మంటలు రాజేసే యత్నమంటూ దుయ్యబట్టింది. ముస్లింల 4 శాతాన్ని తమకు పంచడంపై లింగాయత్‌లు, వక్కలిగలు కూడా సంతోషంగా లేరని చెప్పుకొచ్చింది. ‘‘ముస్లింలను ఓబీసీ నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాకు మార్చడం రాజ్యాంగవిరుద్ధం. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఏ మతానికి, కులానికి చెందిన వారైనా జనరల్ కేటగిరీ అయిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులే అవుతారు. అలాంటి కోటాకు ముస్లింలను మార్చి, వారికేదో కొత్తగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు బీజేపీ చెప్పుకోవడం విడ్డూరం’’అంటూ మండిపడింది. తాము అధికారంలోకొస్తే వారికి 4 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. భగ్గుమన్న బంజారాలు, ఆదివాసీలు విద్య, ఉద్యోగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, ఎస్టీలకు 4 నుంచి 7 శాతానికి బీజేపీ సర్కారు గత డిసెంబర్లో పెంచింది. అయితే వారిలో అణగారిన ఉప కులాల వారికి రిజర్వేషన్ల ఫలాలు అందకుండా బలవంతులైన కొన్ని ఉప కులాల వాళ్లే వాటిని అత్యధికంగా చేజిక్కించుకుంటున్నారన్న ఫిర్యాదు చాలాకాలంగా ఉంది. ఈ అసమానతలను సరిచేయాలన్న వారి చిరకాల డిమాండ్‌పై బొమ్మై ప్రభుత్వం ఇటీవలే రంగంలోకి దిగింది. 101 ఎస్సీ కులాల వారికి సమ న్యాయం చేసేందుకు అంతర్గత రిజర్వేషన్లను నిర్ణయించింది. ► ఆ మేరకు రాజ్యాంగంలోని 341(2) ఆర్టికల్ ప్రకారం ఎస్సీలను 4 విభాగాలుగా వర్గీకరించారు. ఎస్సీ (లెఫ్ట్)కు 6 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. ఆ జాబితాలోకి మాదిగ, ఆది ద్రవిడ, బాంబి ఉపకులాలు వస్తాయి. ► ఎస్సీ (రైట్)కు 5.5 శాతం కేటాయించింది. ఆది కర్ణాటక, హోలెయా, చలవాది ఉప కులాలు దీని కిందికి వస్తాయి. బంజారా, భోవి, కొరచ, కొరమలకు 4.5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ► మిగిలిన ఒక్క శాతం సంచార, ఆదివాసీ జాతులైన అలెమరి, ఆరె అలెమరిలకు దక్కుతుంది. ► దీన్ని బంజారా, భోవి కులాలవాళ్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఆందోళనలకు దిగారు. తాజాగా మాజీ సీఎం యడ్యూరప్ప నివాసంపై రాళ్లు రువ్వడం అందులో భాగమే. వక్కలిగ, లింగాయత్... బలీయమైన ఓటు బ్యాంకులు వక్కలిగలు, లింగాయత్‌లు కర్ణాటకలో బలమైన సామాజిక వర్గాలు. బలీయమైన ఓటు బ్యాంకులు కావడంతో ఎన్నికల్లో వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బెంగళూరు నగర నిర్మాత కెంపె గౌడది వక్కలిగ సామాజిక వర్గమే. రాష్ట్రంలో గత, ప్రస్తుత రాజకీయ ప్రముఖుల్లో చాలామంది ఈ కులాలకు చెందినవారే. ► పలు నివేదికల ప్రకారం రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉంటారు. ► మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 100 చోట్ల వీరు ఫలితాలను శాసించే స్థితిలో ఉన్నారు. ► లింగాయత్‌లు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. ► ఇక వక్కలిగలు జనాభాలో 11% ఉన్నట్టు అంచనా. కానీ తాము నిజానికి 16 శాతం దాకా ఉంటామన్నది వీరి వాదన. ► తొలుత ప్రధానంగా వ్యవసాయదారులైన వక్కలిగలు స్వాతంత్య్రానంతరం పలు రంగాలకు విస్తరించి పట్టు సాధించారు. ► తమకు రిజర్వేషన్లు పెంచాలంటూ ఈ రెండు సామాజిక వర్గాలూ కొద్ది నెలలుగా బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే ఈసారి బీజేపీకి ఓటేసేది లేదంటూ భీష్మించుకున్నాయి. ► తాజాగా ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను వీరికి పంచడంతో వక్కలిగల రిజర్వేషన్లు 4 నుంచి 6 శాతానికి, లింగాయత్‌లకు 5 నుంచి 7 శాతానికి పెరిగాయి. -
వక్కలిగ, సాదరలను ఓబీసీ జాబితాలో చేర్చండి
మడకశిర : నియోజకవర్గంలోని వక్కలిగ, సాదర కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్పించాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడకు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి వినతిపత్రం అందజేశారు. అగళి మండల సమీపం కర్ణాటక రాష్ట్రం శిరా తాలుకాలోని పట్టనాయకనహళ్లి గ్రామంలోఅదివారం పీఠాధిపతి నంజావధూతస్వామి 38వ జన్మదిన వేడుకలకు కేంద్రమంత్రి సదానందగౌడ, కర్ణాటక మాజీ సీఎం కూమారస్వామి, కర్ణాటక మంత్రులు జయచంద్ర, శివకుమార్, నిర్మలానంద స్వామీజీ, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ముఖ్యఅథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మడకశిర నియోజకవర్గంలోని వక్కలిగ, సాదర కులస్తులను 2008లో రాష్ట్రంలో బీసీల జాబితాలో గుర్తించి వేర్వేరుగా జీఓ విడుదల చేశారని గుర్తుచేశారు. వక్కలిగ, సాదరులను ఓబీసీ జాబితాలో చేర్పించడానికి కృషి చేస్తామని కేంద్రమంత్రి సదానందగౌడ హామీ ఇచ్చారు.