పాత మైసూరు. కర్ణాటకలో అధికార పీఠానికి రాచమార్గంగా భావించే ప్రాంతం. మెజారిటీ కావాలంటే ఇక్కడ అత్యధిక స్థానాలు గెలుపొందాల్సిందేనని పార్టీలన్నింటికీ బాగా తెలుసు. ఈ ప్రాంతంలో ఒక్కలిగ సామాజికవర్గం ప్రభావం అధికం. వారిని ప్రసన్నం చేసుకోగలిగే పార్టీదే పాత మైసూరు. అందుకోసమే పార్టీలన్నీ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి...
సాక్షి బెంగళూరు: కర్ణాటక జనాభాలో ఒక్కలిగ సామాజికవర్గం 15 శాతం ఉంటుందని అంచనా. లింగాయత్ (17 శాతం)ల తర్వాత రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గం వీరే. ఉత్తర కర్ణాటక లింగాయత్ బెల్ట్ కాగా పాత మైసూరు ఒక్కలిగల కంచుకోట. ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వ ఏర్పాటులో ఈ వర్గం కీలక పాత్ర పోషిస్తోంది. వీరు కొన్ని దశాబ్దాలుగా ఒక్కలిగలు జేడీ(ఎస్)నే ఆదరిస్తూ వస్తున్నారు. ఈసారి వారిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఏడుగురు సీఎంలను ఇచ్చిన ప్రాంతం
► రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో పాత మైసూరు ప్రాంతంలో 51 సీట్లున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీ 24 స్థానాల్లో, కాంగ్రెస్ 16 స్థానాల్లో, బీజేపీ 9 చోట్ల గెలిచాయి.
► కావేరి వివాదం, రైతు ఆత్మహత్యల వంటి సమస్యలు ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి. మేజిక్ నంబర్ సాధించడంలో ఈ ప్రాంతం కీలకం.
► గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన 17 మందిలో ఏకంగా ఏడుగురు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారే! ఈ సామాజికవర్గానికి చెందిన హెచ్.డి.దేవెగౌడ ప్రధాని పదవి దాకా ఎదిగారు.
► ఈ ప్రాంతంలో ప్రస్తుతానికి జేడీ(ఎస్) చాలా బలంగా ఉంది.
► మండ్య, హసన్, రామనగర, మైసూరు, చామరాజనగర, కోలార్, తుమకూరు, కొడగు జిల్లాలో ఒక్కలిగలు అధికంగా ఉంటారు.
► ఒక్కలిగల ఓట్లను ఒడిసిపట్టేందుకు అధికార బీజేపీ తాజాగా వారి రిజర్వేషన్లను 4 శాతం నుంచి 6 శాతానికి పెంచింది.
► ఇక కాంగ్రెస్ ఒక్కలిగలకు ఎక్కువగా టికెట్లిచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
► జేడీ(ఎస్) మాత్రం తన సంప్రదాయ ఓటుబ్యాంకు మళ్లీ చెక్కుచెదరబోదని ధీమాగా ఉంది. కాంగ్రెస్.. గత వైభవమే పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ ఒకప్పుడు తిరుగులేని పార్టీ. దేవెగౌడ రూపంలో బలమైన ఒక్కలిగ నేత రాకతో ఇక్కడ దాని ప్రభ మసకబారింది. ఈ ప్రాంతానికే చెందిన ముఖ్య ఒక్కలిగ నేత పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్‌పైనే ఈసారి కాంగ్రెస్ ఆశలన్నీ పెట్టుకుంది.
బీజేపీ...
ఇక బీజేపీది భిన్నమైన పరిస్థితి! పాత మైసూరులో పార్టీకి ఒక్కరంటే ఒక్కరు కూడా బలమైన ఒక్కలిగ నాయకుడు లేడు. దాంతో ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీ(ఎస్)ల తర్వాతి స్థానానికే పరిమితమవుతూ వస్తోంది. అయితే 2018 ఎన్నికల్లో కాస్తా పుంజుకున్న నేపథ్యంలో ఈసారీ భారీగానే ఆశలు పెట్టుకుంది. గత తప్పిదాలను సరిదిద్దుకుంటూ బలమైన స్థానిక నేతలను చేర్చుకుని టికెట్లిచ్చింది.
ఇంటిపోరు జేడీ(ఎస్)ను ముంచేనా...?
దేవెగౌడ కుటుంబంలో వారసత్వ రగడ మొదలైంది. ఆయన కుమారుల్లో జేడీ(ఎస్) నేత హెచ్.డి.కుమారస్వామి రామనగర, మైసూరు, మండ్య జిల్లాల్లో గట్టి నాయకుడు కాగా సోదరుడు హెచ్.డి.రేవణ్ణ హాసన్ జిల్లాలో తిరుగులేని నేత. కొద్ది నెలలుగా వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. హాసన్ టికెట్ విషయంలో ఇవి రచ్చకెక్కాయి. అక్కడ రేవణ్ణ భార్య భవానీని కాదని అతి సామాన్య కార్యకర్తకు కుమారస్వామి టికెటిచ్చారు. ఈ గొడవ కొంప ముంచుతుందేమోనని జేడీ(ఎస్) వర్గాల్లో ఆందోళన నెలకొంది.
Karnataka assembly election 2023: ఒక్కలిగల కంచుకోటలో పాగా ఎవరిదో...!
Published Sun, Apr 30 2023 4:48 AM | Last Updated on Sun, Apr 30 2023 12:07 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment