అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారు రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు అందుతున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత వారం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆ 4 శాతాన్ని బీజేపీకి గట్టి ఓటు బ్యాంకైన వక్కలిగలు, లింగాయత్‌లకు సమానంగా పంచడంపై కలకలం రేగుతోంది. ఈ పరిణామం విపక్ష కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శిస్తూనే, తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోటాను పునరుద్ధరిస్తామంటూ హస్తం పార్టీ తాజాగా ఎన్నికల హామీ ఇచ్చింది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లను ఉప కులాలవారీగా విభజించిన తీరుతో తమకు అన్యాయం జరిగిందంటూ బంజారాలు, ఆదివాసీలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు...
ఏం జరిగింది?
కర్ణాటకలో ముస్లింలను ఓబీసీ జాబితాలోని 2బీ కేటగిరీ నుంచి తొలగిస్తూ బొమ్మై ప్రభుత్వం వారం క్రితం నిర్ణయం తీసుకుంది. ఓబీసీ కోటాలో భాగంగా విద్య, ఉద్యోగాల్లో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. వాటిని లింగాయత్‌లు, వక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ముస్లింలను ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల) జాబితాకు మారుస్తున్నట్టు సీఎం బొమ్మై చెప్పుకొచ్చారు. ‘‘మతాధారిత రిజర్వేషన్లకు రాజ్యాంగంలో చోటు లేదు. ముస్లింలకు ఇకనుంచి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి’’అన్నారు.
కాంగ్రెస్ ఏమంటోంది?
ముస్లింలను ఓబీసీ జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలిగించారంటూ కాంగ్రెస్ మండిపడింది. ఇది మతాల మధ్య మంటలు రాజేసే యత్నమంటూ దుయ్యబట్టింది. ముస్లింల 4 శాతాన్ని తమకు పంచడంపై లింగాయత్‌లు, వక్కలిగలు కూడా సంతోషంగా లేరని చెప్పుకొచ్చింది. ‘‘ముస్లింలను ఓబీసీ నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాకు మార్చడం రాజ్యాంగవిరుద్ధం. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఏ మతానికి, కులానికి చెందిన వారైనా జనరల్ కేటగిరీ అయిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులే అవుతారు. అలాంటి కోటాకు ముస్లింలను మార్చి, వారికేదో కొత్తగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు బీజేపీ చెప్పుకోవడం విడ్డూరం’’అంటూ మండిపడింది. తాము అధికారంలోకొస్తే వారికి 4 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని ప్రకటించింది.
భగ్గుమన్న బంజారాలు, ఆదివాసీలు
విద్య, ఉద్యోగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, ఎస్టీలకు 4 నుంచి 7 శాతానికి బీజేపీ సర్కారు గత డిసెంబర్‌లో పెంచింది. అయితే వారిలో అణగారిన ఉప కులాల వారికి రిజర్వేషన్ల ఫలాలు అందకుండా బలవంతులైన కొన్ని ఉప కులాల వాళ్లే వాటిని అత్యధికంగా చేజిక్కించుకుంటున్నారన్న ఫిర్యాదు చాలాకాలంగా ఉంది. ఈ అసమానతలను సరిచేయాలన్న వారి చిరకాల డిమాండ్‌పై బొమ్మై ప్రభుత్వం ఇటీవలే రంగంలోకి దిగింది. 101 ఎస్సీ కులాల వారికి సమ న్యాయం చేసేందుకు అంతర్గత రిజర్వేషన్లను నిర్ణయించింది.
► ఆ మేరకు రాజ్యాంగంలోని 341(2) ఆర్టికల్ ప్రకారం ఎస్సీలను 4 విభాగాలుగా వర్గీకరించారు. ఎస్సీ (లెఫ్ట్)కు 6 శాతం రిజర్వేషన్లు కేటాయించింది.
ఆ జాబితాలోకి మాదిగ, ఆది ద్రవిడ, బాంబి ఉపకులాలు వస్తాయి.
► ఎస్సీ (రైట్)కు 5.5 శాతం కేటాయించింది. ఆది కర్ణాటక, హోలెయా, చలవాది ఉప కులాలు దీని కిందికి వస్తాయి. బంజారా, భోవి, కొరచ,
కొరమలకు 4.5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.
► మిగిలిన ఒక్క శాతం సంచార, ఆదివాసీ జాతులైన అలెమరి, ఆరె అలెమరిలకు దక్కుతుంది.
► దీన్ని బంజారా, భోవి కులాలవాళ్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఆందోళనలకు దిగారు. తాజాగా మాజీ సీఎం యడ్యూరప్ప నివాసంపై రాళ్లు రువ్వడం అందులో భాగమే.
వక్కలిగ, లింగాయత్... బలీయమైన ఓటు బ్యాంకులు
వక్కలిగలు, లింగాయత్‌లు కర్ణాటకలో బలమైన సామాజిక వర్గాలు. బలీయమైన ఓటు బ్యాంకులు కావడంతో ఎన్నికల్లో వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బెంగళూరు నగర నిర్మాత కెంపె గౌడది వక్కలిగ సామాజిక వర్గమే. రాష్ట్రంలో గత, ప్రస్తుత రాజకీయ ప్రముఖుల్లో చాలామంది ఈ కులాలకు చెందినవారే.
► పలు నివేదికల ప్రకారం రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉంటారు.
► మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 100 చోట్ల వీరు ఫలితాలను శాసించే స్థితిలో ఉన్నారు.
► లింగాయత్‌లు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు.
► ఇక వక్కలిగలు జనాభాలో 11% ఉన్నట్టు అంచనా. కానీ తాము నిజానికి 16 శాతం దాకా ఉంటామన్నది వీరి వాదన.
► తొలుత ప్రధానంగా వ్యవసాయదారులైన వక్కలిగలు స్వాతంత్య్రానంతరం పలు రంగాలకు విస్తరించి పట్టు సాధించారు.
► తమకు రిజర్వేషన్లు పెంచాలంటూ ఈ రెండు సామాజిక వర్గాలూ కొద్ది నెలలుగా బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే ఈసారి బీజేపీకి ఓటేసేది లేదంటూ భీష్మించుకున్నాయి.
► తాజాగా ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను వీరికి పంచడంతో వక్కలిగల రిజర్వేషన్లు 4 నుంచి 6 శాతానికి, లింగాయత్‌లకు 5 నుంచి 7 శాతానికి పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment