Lingayats
-
దశాబ్దాల కులవోటు సాంప్రదాయం తారుమారు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయ ఓటింగ్ ధోరణి ఈసారి రూటు మార్చుకుంది. ముఖ్యంగా కులాల వారీ ఓటు బ్యాంకు తారుమారైంది. మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి దూరమై బీజేపీకి అండదండగా నిలుస్తూ వచ్చిన లింగాయత్‌లు మనసు మార్చుకున్నారు. ఓట్లపరంగా అత్యంత ప్రాబల్యమున్న సామాజిక వర్గమైన లింగాయత్‌లలో బాహుబలి నేత యడియూరప్పను పక్కన పెట్టినందుకు బీజేపీ భారీ మూల్యమే చెల్లించింది. ఆ పార్టీకి దశాబ్దాలుగా పెట్టని కోటలా ఉంటూ వచ్చిన లింగాయత్‌లు ఆగ్రహించి దూరమయ్యారు. 1990లో లింగాయత్ నాయకుడైన నాటి ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ అవమానకరంగా సీఎం పదవి నుంచి తప్పించడంతో ఆ పార్టీ లింగాయత్‌ల ఆగ్రహ జ్వాలలకు గురైంది. నెమ్మదిగా లింగాయత్ ఓటుబ్యాంకు బీజేపీకి మళ్లింది. 30 ఏళ్ల తర్వాత సరిగ్గా మళ్లీ అదే సీన్ రిపీటైంది. ఈసారి బీజేపీ వంతు వచ్చింది. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించడమే గాక అభ్యర్థల ఎంపిక మొదలుకుని ప్రచారం దాకా పెద్దగా ప్రాధాన్యమివ్వని ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. లింగాయత్‌లు, వొక్కలిగలు, ఎస్సీల్లో ఐదేసి శాతం మంది కాంగ్రెస్ వైపు మళ్లడంతో ఆ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించగలిగింది. కేంద్ర ఎన్నికల సంఘం, సీ –ఓటరు వెల్లడించిన పార్టీలవారీ ఓట్లు, సీట్ల సరళిని పరిశీలిస్తే కులాల ఓటుబ్యాంకుల్లో మార్పు స్పష్టంగా తెలుస్తోంది... వొక్కలిగలు: జేడీ(ఎస్)కు షాక్ జేడీ(ఎస్)కు అండగా ఉంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను తమ పితగా కొలిచే వొక్కలిగలు కూడా షాకిచ్చే నిర్ణయాలే తీసుకున్నారు. దేవెగౌడ కుటుంబ పెత్తనంపై ఓటర్లలో ఓ రకమైన కసి కనిపించింది. 2018 ఎన్నికల్లో వొక్కలిగ ప్రాబల్యమున్న మొత్తం 51 స్థానాల్లో జేడీ(ఎస్) 23 గెలుచుకుంటే ఈసారి కేవలం 12 సీట్లకు పరిమితమవ్వాల్సి వచ్చింది. పీసీసీ డీకే శివకుమార్ వొక్కలిగ నేత కావడంతో వారికి ప్రత్యామ్నాయం కనిపించింది. కాంగ్రెస్ ఓల్డ్ మైసూర్ గ్రామీణ ప్రాంతంలో ఏకంగా 36 స్థానాల్లో విజయం సాధించింది. శివకుమార్ కనకపురలో లక్షా 20 ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలిచారంటేనే దేవెగౌడ గుప్పిట్లోంచి వొక్కలిగలు జారిపోతున్నట్టేనని భావిస్తున్నారు. లింగాయత్‌లు: బీజేపీకి షాక్ లింగాయత్‌లు బీజేపీకి దూరం కావడం ఇది తొలిసారేం కాదు. బీజేపీ యడియూరప్పను దూరం పెట్టినప్పుడు ఆయన బీజేపీకి గుడ్‌బై కొట్టి 2012లో కర్ణాటక జనతా పక్ష పేరుతో వేరు కుంపటి పెట్టారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేతుల కాలాయి. అప్పుడే ఆ పార్టీకి యడియూ రప్ప, లింగాయత్‌ల ఓట్ల ప్రాధాన్యం ఏమిటో తెలిసింది. ఆ తర్వాత యడియూరప్పను అక్కున చేర్చుకున్నప్పటికీ, మళ్లీ తాజాగా ఎన్నికల ముందు యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించి అదే తప్పు చేసింది. 2018 ఎన్నికల్లో లింగాయత్ ప్రాబల్యం ఉన్న స్థానాల్లో 41.8% ఓటు షేర్ బీజేపీకి వస్తే, ఈసారి కాస్త స్వల్పంగా 39.5 శాతానికి తగ్గింది. కానీ సీట్లు మాత్రం ఏకంగా 20 స్థానాలను కోల్పోవలసి వచ్చింది. జేడీ(ఎస్)కు వచ్చిన ఓట్ల శాతంలో పెద్దగా మార్పు లేదు. కాంగ్రెస్‌కు ఓట్లు 5 శాతమే పెరిగినా సీట్లు మాత్రం రెట్టింపు పెరిగాయి. చెయ్యెత్తి జై కొట్టిన ఎస్సీలు ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎస్సీలు అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఎస్సీ ప్రాబల్య అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ గత ఎన్నికలతో పోల్చి చూస్తే అదనంగా 5.5శాతం ఓట్లు, 10 సీట్లు సంపాదించింది. దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడం ఈసారి ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. సాధారణంగా దళితులు ఏ ఒక్క పార్టీ వైపు ఉండరు. కానీ ఈసారి ఖర్గే దళిత బ్యాంకుపై ప్రత్యేకంగా దృష్టి సారించి 40 ర్యాలీల్లో పాల్గొనడంతో ఎస్సీ ప్రాబల్య స్థానాల్లో సగానికి పైగా కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మొత్తమ్మీద కేవలం ఐదు శాతం ఓట్ల తేడాతోనే ఫలితాల్లో భారీగా మార్పులు కనిపించడమే మన ప్రజాస్వామ్యంలో వైచిత్రిగా ఎన్నికల విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
Karnataka assembly elections 2023: కర్ణాటక ‘సెంట్రల్’ ఎవరివైపు..!
సాక్షి,బెంగళూరు: సెంట్రల్ కర్ణాటకలో గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీయే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీ హవా నడుస్తూ వస్తోంది. బీజేపీతో విభేదాలతో ఆ పార్టీ దిగ్గజ నాయకుడు యడియూరప్ప కర్ణాటక జనతా పార్టీ పేరుతో వేరు కుంపటి పెట్టి ఎన్నికల బరిలో దిగిన 2013లో మినహాయిస్తే మిగిలిన ఎన్నికల్లో బీజేపీదే పై చేయి. దావణగెరె, శివమొగ్గ, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో లింగాయత్‌లతో పాటు ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువే. మొత్తం 32 స్థానాల్లో 8 సీట్లు ఎస్సీ, ఎస్టీకి రిజర్వ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ సారి లింగా యత్లతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓట్లు తమకేనని అందుకే ఈ సారి ఈ ప్రాంతంలో తమ పార్టీ దూసుకు పోతుందన్న అంచనాలతో ఉంది. మలేనాడు, మధ్య కర్ణాటక జిల్లాల నుంచి రాష్ట్రానికి ఇప్పటికి ఐదు మంది ముఖ్యమంత్రులు వచ్చారు. దీంతో కర్ణాటక లోని ఈ ప్రాంతంపై ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అయిదుగురు మాజీ ముఖ్యమంత్రుల్లో కడిదాళ్ మంజప్ప, ఎస్.బంగారప్ప, జేహెచ్ పటేల్, బీఎస్ యడియూరప్ప వంటి నేతలు అవిభజతి శివమొగ్గ జిల్లాకు చెందిన వారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ప్రాంతంపై పట్టుకు బీజేపీ,కాంగ్రెస్ శ్రమిస్తున్నాయి. కేవలం తుముకూరు జిల్లాలో మాత్రమే పట్టు ఉన్న జేడీ(ఎస్) ఈ సారి అన్ని జిల్లాలకు విస్తరించడానికి వ్యూహాలు పన్నుతోంది. అవకాశాలను అందిపుచ్చుకున్న బీజేపీ.. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం కాల క్రమేణ బీజేపీ వశం అయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాంగ్రెస్, బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. 2004 నుంచి హిందూ ఓట్లను క్రోడికరించడంలో బీజేపీ సఫలీకృతమైంది. అప్పటి నుంచి నెమ్మదిగా పుంజుకుంటూ మధ్య కర్ణాటకలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. బీజేపీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లు శివమొగ్గ, దావణగెరె జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉండడం అధికార పార్టీకి కలసి వచ్చింది. సీట్లను పెంచుకునే వ్యూహంలో కాంగ్రెస్ స్థానికంగా ఉన్న సమస్యల్ని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ తనకు అను కూలంగా ప్రచారంలో మలుచుకుంటోంది. ఎక్కడిక్కడే హామీలు గుప్పిస్తూ ఈ సారి మధ్య కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. గత ఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య 75వ పుట్టిన రోజు వేడుకల్ని దావణగెరెలో భారీగా నిర్వహించి ఎన్నికల సమరశంఖాన్ని పూరించింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సెంట్రల్ కర్ణాటకలో అత్యధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారు. జేడీ(ఎస్) తుముకూరు ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి పంచరత్న యాత్రని వినియోగించుకున్నారు. మొత్తమ్మీద సెంట్రల్ ఓటరు ఎవరిని కరుణిస్తారో వేచి చూడాలి. స్థానిక అంశాలపై బీజేపీ దృష్టి లింగాయత్ ఓట్లతో పాటుగా స్థానిక సమస్యల పరిష్కారంపై బీజేపీ దృష్టి సారించింది. శివమొగ్గ జిల్లాలో బగర్‌హుకుం భూ స్వాధీనం, శరావతి ప్రాజెక్టు పునరావాసం, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కర్మాగారం మూసివేత వంటి సమస్యలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. చిక్కమగళూరు జిల్లాలో వర్షాల వల్ల కాఫీ సాగుదారులు తీవ్రంగా నష్టపో యారు. భద్రా ఎత్తిపోతల ప్రాజెక్టు చిత్రదుర్గ జిల్లాలో ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్లో రూ. 5,300 కోట్లు ప్యాకేజీ ప్రకటించింది. ఈ అంశం బీజేపీకి అనుకూ లంగా మారింది. ఇక ధరాభారం, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ ఇంకా ఎటూ తేల్చకపోవడంతో ఈ వర్గం వారు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు. -
బీజేపీ అడ్డాపై కాంగ్రెస్ కన్ను
ఏడు జిల్లాలు, 50 అసెంబ్లీ స్థానాలున్న ముంబై కర్ణాటక ప్రాంతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజేతను తేల్చడంలో కీలకంగా ఉంటోంది. బీజేపీకి ప్రధాన ఓటుబ్యాంకైన లింగాయత్‌లు అధికంగా ఉండటంతో ఇక్కడ ఆ పార్టీ ఎంతో బలంగా ఉంది. ఈసారి సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. జేడీ(ఎస్) ఉనికి ఇక్కడ కూడా నామమాత్రమే.. సాక్షి, బెంగళూరు: బ్రిటిషర్లతో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి కిత్తూరు చెన్నమ్మ పేరిట 2021లో ముంబై కర్ణాటక పేరును కిత్తూరు కర్ణాటకగా మార్చారు. ఇక్కడ ఉత్తర కన్నడ మినహాయించి మిగతా ఆరు జిల్లాల్లోనూ లింగాయత్‌లదే ప్రాబల్యం. దశాబ్దాలుగా వారు బీజేపీకి దన్నుగా నిలుస్తున్నారు. ఆధిక్యం అటూ ఇటూ ♦ ముంబై కర్ణాటక తొలినాళ్లల్లో కాంగ్రెస్ కంచుకోట. 1990 ఎన్నికల్లో లింగాయత్ వర్గానికి చెందిన నాటి సీఎం వీరేంద్ర పాటిల్ పక్షవాతం బారిన పడటంతో ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన్ను తొలగించారు. దాంతో కాంగ్రెస్‌పై లింగాయత్‌లు భగ్గుమన్నారు. తర్వాత బీజేపీ లింగాయత్ నేత బీఎస్ యడియూరప్ప వెనక నడిచారు. ♦ క్రమంగా ఈ ప్రాంతం బీజేపీ కంచుకోటగా మారింది. అలా సాగిన బీజేపీ హవాకు యడియూరప్ప తిరుగుబావుట ఎగరేసి సొంత కుంపటి పెట్టుకోవడంతో 2013లో అడ్డుకట్ట పడింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 30 సీట్లు గెలిచింది. ♦ 2014 లోకసభ ఎన్నికల అనంతరం యడియూరప్ప తిరిగి బీజేపీ గూటికి చేరడంతో ముంబై కర్ణాటక మళ్లీ బీజేపీ పట్టులోకి వెళ్లింది. దాంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 30, కాంగ్రెస్ 17 సీట్లు గెలిచాయి. ♦ యడియూరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకున్న నేపథ్యంలో అంతటి లింగాయత్ నేతను బీజేపీ అవమానించిందంటూ కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. ♦ అధికార బీజేపీ కూడా సరిగ్గా ఎన్నికలకు నెల ముందు లింగాయత్‌ల ఓటుబ్యాంకును కాపాడుకునేందుకు వారి రిజర్వేషన్లను 2 నుంచి 4 శాతానికి పెంచింది. ఇది బాగా కలిసొస్తుందని ఆశిస్తోంది. ♦ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెళగావి, ధారవాడల్లో భారీ సభలు, మెగా రోడ్ షోలతో హోరెత్తించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ బెళగావిలో యువ క్రాంతి, యువ సమావేశాలు నిర్వహించారు. బెళగావిలో కీలక పోరు ♦ బెంగళూరు నగరం (28 సీట్లు) తర్వాత అత్యధిక అసెంబ్లీ సీట్లు (18)న్న బెళగావి జిల్లా ముంబై కర్ణాటక ప్రాంతంలోనే ఉంది. ఈ జిల్లా రాజకీయంగానూ చాలా కీలకం. 2018 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 10, కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకున్నాయి. ♦ రెండు పార్టీల్లోనూ గట్టి రాజకీయ కుటుంబాలున్నాయి. జిల్లాలో చాలామంది ప్రజాప్రతినిధులు చక్కెర సహకార సంఘాలున్నాయి. నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ బెళగావి నుంచే ప్రజాధ్వని యాత్ర పేరిట ఎన్నికల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. ♦ ఉమేశ్ కత్తి, సవదత్తి మామని వంటి కీలక నేతల హఠాన్మరణంతో బీజేపీ ఇక్కడ కాస్త బలహీనపడింది. దీనికి తోడు మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది వంటి సీనియర్లు పార్టీని వీడటంతో మరింత డీలా పడింది. శెట్టర్ హుబ్లీ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ తరఫున బీజేపీకి సవాలు విసురుతున్నారు. ♦ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రాతినిధ్యం వహిస్తున్న శిగ్గావ్ స్థానం ముంబై కర్ణాటక కిందకే వస్తుంది. 2018 నుంచీ ఇక్కడ పలు జిల్లాల్లో కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఆ పార్టీకి చెందిన విపక్ష నేత సిద్ధరామయ్య బాగలకోటె జిల్లా బాదామి నుంచి గెలుపొందారు. ♦ విజయపుర జిల్లాలో బీజేపీ సీనియర్ నేత బసవనగౌడ పాటిల్ నోటి దురుసు పార్టీకి తలనొప్పిగా మారింది. గతంలో యడియూరప్పపై బహిరంగంగా విమర్శలతో పార్టీకి నష్టం చేసిన చరిత్ర ఆయనది. ఈసారీ సీఎం అభ్యర్థి తానేనంటూ హల్చల్ చేస్తున్నారు. ♦ ఇక 7 సీట్లున్న ధారవాడ జిల్లా కూడా బీజేపీకి కీలకమే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
మధ్య కర్ణాటకలో ఆసక్తికర రాజకీయం
-
ఆ 84 సీట్లు కీలకం.. గతంలో 56 బీజేపీకే.. మరి ఇప్పుడు.. స్వింగ్ ఎటో?
కిత్తూరు కర్ణాటకలో (గతంలో ముంబై కర్ణాటక) రాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ ఉంది. 1957 సంవత్సరం నుంచి రాన్ నియోజకవర్గం ప్రజలు అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థినే ఎన్నుకుంటూ వస్తున్నారు. ఒకే పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించే సంప్రదాయం ఇక్కడ లేదు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇలా ఓటరు తీర్పు తిరగరాసే నియోజకవర్గాలు రాన్తో సహా 84 ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా పనిచేస్తుందని, అందుకే ఏ పార్టీ కూడా రెండోసారి గెలవడం కష్టంగా మారిందని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎ. నారాయణ అభిప్రాయపడ్డారు. 2018 : స్వింగ్ స్థానాల్లో బీజేపీ స్వీప్ ► లింగాయత్‌లకు గట్టి పట్టున్న ముంబై కర్ణాటక ప్రాంతంలో 19 స్వింగ్ సీట్లున్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలన్నింటిలోనూ విజయం సాధించింది ► సెంట్రల్ కర్ణాటకలో 20 స్వింగ్ సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లింగాయత్, వొక్కలిగలు పట్టుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 16 స్థానాల్లో నెగ్గింది. ► బీజేపీకి కంచుకోటగా భావించే కోస్తా కర్ణాటకలో అత్యధిక స్థానాలు స్వింగ్ సీట్లుగా పేరొందాయి. ఈ ప్రాంతంలో 19 స్థానాలకు గానే 10 స్వింగ్ సీట్లుగా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో అన్ని స్వింగ్ స్థానాలను బీజేపీ స్వీప్ చేసింది. 20% మంది ముస్లిం జనాభా ఉన్న ఈ ప్రాంతంలో విభజన రాజకీయాలే కీలకం. ► హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 12 స్వింగ్ సీట్లు బీజేపీ ౖMðవశం చేసుకుంది. రాష్ట్రంలో ఈ ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంది. ► దక్షిణ కర్ణాటకలో మొత్తం స్థానాలు 46 కాగా అందులో స్వింగ్ సీట్లు 14 ఉన్నాయి. వొక్కలిగల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో జేడీ (ఎస్) సగం స్వింగ్ స్థానాలైన ఏడింటిలో విజయం సాధించింది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ► బెంగళూరు నగరంలో రెండు స్వింగ్ సీట్లు బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి. స్వింగ్ స్థానాల్లో పట్టుకు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు లింగాయత్‌లకు పట్టున్న స్థానాలు, మత విభజన రాజకీయాలకు కేంద్రమైన కోస్తా కర్ణాటకలో 2018 ఎన్నికల్లో బీజేపీ స్వింగ్ స్థానాలన్నింటినీ స్వీప్ చేసింది. మొత్తం 84 స్వింగ్ స్థానాలకు గాను బీజేపీ ఖాతాలో 56 ఉన్నాయి. దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఈ స్థానాల్లో బీజేపీ నెగ్గే అవకాశాలు లేవు. అందుకే బీజేపీ ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచి ఈ స్థానాలపై దృష్టి సారించింది. వీటిలో 30 స్థానాల్లో లింగాయత్‌లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. లింగాయత్‌లు బీజేపీ వైపు నిలుస్తూ ఉండడంతో ఆ స్థానాలు తిరిగి నిలబెట్టుకోగలమన్న కమలదళం ధీమాగా ఉంది. అధికార వ్యతిరేకత, బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, ముస్లింలకు 4 శాతం కోటాలో కోత, పెరిగిపోతున్న ధరలు వంటివన్నీ బీజేపీకి మైనస్‌గా మారాయి. వీటన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో కప్పిపుచ్చే వ్యూహాలు రచిస్తోంది. అంతే కాకుండా చాలా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. తద్వారా అధికార వ్యతిరేకతను అధిగమించవచ్చునని వ్యూహరచన చేసింది. అయితే మోదీ ఇమేజ్ అసెంబ్లీ ఎన్నికలకు పని చేసే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో ఎంతో ఆకర్షణ ఉన్నప్పటికీ ఆయనను స్థానికుడిగా చూడలేరు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఇమేజ్ పని చేస్తుందే తప్ప శాసనసభ ఎన్నికల్లో పని చేసే అవకాశం లేదు’’ అని ఎన్నికల విశ్లేషకుడు చేతన్ చౌహాన్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాల్లో పాగా వెయ్యడానికి పకడ్బందీ వ్యూహాలనే రచించింది. స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ రాకతో లింగాయత్ ఓటు బ్యాంకును కొంతవరకైనా కొల్లగొట్టవచ్చునన్న ఆశగా ఉంది. ఇక బసవరాజ్ బొమ్మై అవినీతి, ముస్లిం కోటా రద్దుని ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. సిద్దరామయ్య, డి.కె.శివకుమార్ వంటి బలమైన నాయకులు ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత పోరు ఆ పార్టీకి మైనస్‌గా మారింది. ఫలితంగా ఈ 84 సీట్లలోనూ హోరాహోరీ పోరు నెలకొంది. ఇక 224 స్థానాలకు గాను 60 సీట్లు సేఫ్ సీట్లుగా ఉన్నాయి. గత మూడు ఎన్నికల్లో వరుసగా ఒకే పార్టీ గెలుస్తూ వచ్చింది. ఈ సేఫ్ సీట్లు కాంగ్రెస్‌కి 27, బీజేపీకి 23, జేడీ(ఎస్)కి 10 ఉన్నాయి. ఈ సీట్లను కాపాడుకోవడానికి కూడా రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం
మన దేశంలో ఎన్నికలంటేనే కులం చుట్టూ తిరుగుతుంటాయి. అందులోనూ కర్ణాటక రాజకీయాల్లో కులాలు, మతాల పాత్ర మరీ ఎక్కువ. లింగాయత్, వొక్కలిగ, ఓబీసీ, ముస్లిం వర్గాలు నాలుగు స్తంభాలుగా ఎన్నికల ఫలితాలను శాసిస్తూ వస్తున్నాయి. అందుకే మరోసారి వారి మనసు చూరగొనేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి... కర్ణాటకలో త్రిముఖ పోరు నేపథ్యంలో కులాలవారీగా ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జేడీ(ఎస్) మాత్రం ప్రధానంగా రాష్ట్ర జనాభాల్లో లింగాయత్‌ల తర్వాత అత్యధికంగా 15% ఓటర్లున్న వొక్కలిగ ఓటు బ్యాంకునే నమ్ముకుంది. 59 అసెంబ్లీ స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగలు ఇప్పటికీ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను ఎంతగానో ఆరాధిస్తారు. ఆ ఓటు బ్యాంకును చీల్చే లక్ష్యంతో ఎన్నికల ముందు నుంచే కోటా రాజకీయాలకు బీజేపీ తెర తీసింది. దాంతో దాన్ని ఎలాగైనా కాపాడుకునే పనిలో జేడీ(ఎస్) తలమునకలుగా ఉంది. కోటాతో రాజకీయ ఆట అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే అధికార బీజేపీ అన్ని సామాజిక వర్గాల ఓట్లూ రాబట్టేలా వ్యూహాలు పన్నడం మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు సాధించినా మెజారిటీ మాత్రం అందలేదు. పాత మైసూరులోని 59 సీట్లలో ఆరు మాత్రమే దక్కడం అందుకు ప్రధాన కారణం. దాంతో ఈసారి సరిగ్గా ఎన్నికల వేళ ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకోవడమే గాక వాటిని బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ఈ నిర్ణయం పాత మైసూరు ప్రాంతంలో తమ భాగ్యరేఖలను కాస్త మెరుగు పరుస్తుందని ఆశ పడుతోంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి పెంచడమే గాక అంతర్గత కోటాను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాలను లింగాయత్‌లు, దళితుల్లో ఒక వర్గం ఆహ్వానించినా ముస్లింలు భగ్గుమంటున్నారు. బంజారాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్గత రిజర్వేషన్లతో తమకు మరింత అన్యాయం జరుగుతుందన్న భయం వారిలో ఉంది. పాత మైసూరులో బీజేపీ ఏకంగా 41 మంది వొక్కలిగలకు టికెట్లిచ్చింది! వీరు వ్యవసాయం మీద ఆధారపడ్డవారే కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు బాగా జనంలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ పాత మైసూరులో పర్యటిస్తున్నారు. హింద్ వర్సెస్ అహిందా లింగాయత్, బ్రాహ్మణుల ఓట్లతో పాటుగా హిందూత్వ ఓటు బ్యాంకునే బీజేపీ బాగా నమ్ముకుంది. హిందూత్వ, దేశభక్తి, అభివృద్ధి నినాదాలతో ఓట్లు రాబట్టజూస్తోంది. బాహుబలిగా పేరొందిన లింగాయత్ నేత బి.ఎస్.యడియూరప్పనే ముందుంచి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తోంది. 51 మంది లింగాయత్‌లకు టికెట్లిచ్చింది. కానీ బలమైన లింగాయత్ నేతలైన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీలో తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను కనీసం 25 సీట్లలో బీజేపీ అవకాశాలకు గండి కొడతానన్న శెట్టర్ హెచ్చరికలను వారు గుర్తు చేస్తున్నారు. ఓబీసీలు ఎటువైపో...! వీరశైవ లింగాయత్‌లలో బీజేపీ ఓట్లలో 2 నుంచి 3% తమకు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హిందూత్వకు పోటీగా అహిందా (ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ) నినాదంతో ఓట్లు కొల్లగొట్టే పనిలో పడింది. ఓబీసీల్లో ఒకప్పుడు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న బిల్వాస్, మొగవీరాస్, విశ్వకర్మ, కొలిస్‌లు కొన్నేళ్లుగా బీజేపీ వైపు తిరిగారు. ఈసారి లింగాయత్, వొక్కలిగలు ఏ ఒక్క పార్టీకీ పూర్తిస్థాయిలో మద్దతునిచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయాల నడుమ ఈ ఓబీసీల ఓటు బ్యాంకే కీలకంగా మారింది. వారి ఓటుబ్యాంకును ఈసారి బీజేపీ నిలబెట్టుకోని పక్షంలో దానికి కాంగ్రెస్ నుంచి గట్టి ముప్పు పొంచి ఉన్నట్టే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
లింగాయత్ పవర్.. కన్నడనాట వారి ఓట్లే కీలకం.. ఒకప్పుడు కాంగ్రెస్ వైపు..
కర్ణాటక రాజకీయాలతో లింగాయత్‌లది విడదీయ లేని బంధం. వారు ఎన్నికల్లో గెలుపోటముల్ని శాసించే శక్తిసామర్థ్యాలున్న సామాజిక వర్గం. ఒకప్పుడు కాంగ్రెస్‌కు గట్టి మద్దతుదారులైన లింగాయత్‌లు కొన్ని దశాబ్దాలుగా బీజేపీకి అండగా నిలుస్తున్నారు. అయితే ఆ సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడు యడియూరప్పను సీఎం పదవి నుంచి బీజేపీ తప్పించడంతో లింగాయత్ మఠాధిపతుల్లో అసహనం మొదలైంది. అది ఎలా పరిణమిస్తుంది? లింగాయత్‌ల ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి...? ఉత్తర కర్ణాటకలో లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువ. రాష్ట్ర జనాభాలో 17% ఉన్న వీరు కీలక ఓటుబ్యాంకు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పెట్టని కోట అయిన లింగాయత్‌లు 1990 తర్వాత బీజేపీ వైపు మళ్లారు. వీరి ఓటుబ్యాంకునే నమ్ముకున్న బీజేపీ ఇతర సామాజిక వర్గాల కోసం పెద్దగా చేస్తున్నదేమీ లేదు. తాజాగా ముస్లింల 4% రిజర్వేషన్లను తొలగించి లింగాయత్, వక్కలిగలకు చెరో 2% కట్టబెట్టింది కూడా. అయితే బలమైన లింగాయత్ నాయకుడు యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగించినప్పటి నుంచీ ఆ వర్గంలో నెలకొన్న అసంతృప్తి అంతా ఇంతా కాదు. సీఎం బసవరాజ్ బొమ్మై లింగాయతే అయినా తమ అభిమాన నాయ కున్ని అవమానకరంగా తొలగించారన్నది వారి ఆగ్రహం. కాంగ్రెస్ వ్యూహరచన ఒకప్పుడు తమ కీలక ఓటుబ్యాంకు అయిన లింగాయత్‌లను మరోసారి అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. యడియూరప్ప విషయమై వారిలో నెలకొన్న అసంతృప్తిని అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. లింగాయత్‌లకు అత్యధిక టికెట్లు ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. ఇప్పటిదాకా ప్రకటించిన 166 మంది అభ్యర్థుల్లో 43 మంది లింగాయత్ సమాజికవర్గానికి చెందినవారే! 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాటి కాంగ్రెస్ సీఎం సిద్దరామయ్య ప్రభుత్వ కార్యాలయాల్లో లింగాయత్‌ల గురువు బసవేశ్వర చిత్రపటాన్ని ఉంచాలని ఆదేశించారు. తమను మతపరమైన మైనారిటీలుగా గుర్తించాలన్న లింగాయత్‌ల డిమాండ్‌ను కూడా కాంగ్రెస్ తలకెత్తుకుంది. తాను రాష్ట్రంలో అధికారంలో ఉండగా ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు కూడా చేసింది. దీనిపై కేంద్రం మౌనాన్ని కూడా ప్రచారాస్త్రంగా చేసుకుంటోంది. అలా బీజేపీ ఓటుబ్యాంకుగా... లింగాయత్‌లు కాంగ్రెస్ వెన్నంటి ఉన్న రోజుల్లో ఆ పార్టీ బంపర్ మెజారిటీలు కళ్లజూసింది. 1990లో లింగాయత్ నేత వీరేంద్ర పాటిల్ నేతృత్వంలో కాంగ్రెస్ 224 స్థానాలకు గాను ఏకంగా 179 చోట్ల గెలిచింది! కానీ తర్వాత కాంగ్రెస్‌లో చీలికలు, బీజేపీ ఎదుగుదల తదితర కారణాలతో లింగాయత్‌లు బీజేపీ వైపు మళ్లారు. ముఖ్యంగా కర్ణాటకలో మత ఘర్షణల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ రాష్ట్ర సీఎం వీరేంద్ర పాటిల్‌ను తప్పించడాన్ని చారిత్రక తప్పిదంగా చెబుతారు. అప్పట్నుంచి లింగాయత్‌లు కాంగ్రెస్‌కు బాగా దూరమయ్యారు. ఆ దెబ్బకు 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 36 స్థానాలకు పరిమితమైంది! లింగాయత్‌ల రాజకీయ ప్రాబల్యానికి ఇది తార్కాణమంటారు. ఇక బీజేపీలో యడియూరప్ప ఎదుగుదలతో లింగాయత్‌లు పూర్తిగా ఆ పార్టీవైపు మళ్లారు. అయితే అవినీతి ఆరోపణలతో యడ్డీని బీజేపీ బహిష్కరించడంతో ఆయన కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) పేరుతో వేరుకుంపటి పెట్టుకున్నారు. దాంతో 2013 ఎన్నికల్లో లింగాయత్ ఓట్లు భారీగా చీలి బీజేపీ 40 సీట్లకు పరిమితమైంది. కేజీపీ కూడా పెద్దగా సత్తా చాటలేదు. తర్వాత యడియూరప్ప తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ చరిష్మా కూడా కలిసొచ్చి 28 ఎంపీ స్థానాల్లో బీజేపీ 17 గెలుపొందింది. స్వాతంత్య్రోద్యమంలోనూ... 12వ శతాబ్దంలో సంఘ సంస్కర్త బసవేశ్వర లింగాయత్‌లకు నిర్దిష్ట జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు. వీరు వీరశైవుల నుంచి దూరమై వేదాలను, కుల వ్యవస్థను వ్యతిరేకించేవారు. దేవాలయాలకు వెళ్లడం, బహుదేవతారాధన మాని ప్రగతిశీల భావాలు అలవర్చుకున్నారు. స్త్రీ పురుషులు సమానమని నమ్ముతారు. లింగాయత్‌లలో మహిళలకు ప్రత్యేక హక్కులున్నాయి. వారికి పెళ్లి చేసుకోకున్నా, భర్తను కోల్పోయినా పిల్లల్ని దత్తత చేసుకునే స్వేచ్ఛ ఉంది. స్వాతంత్య్ర సంగ్రామంలోనూ లింగాయత్‌లది చురుకైన పాత్ర. ప్రస్తుతం వీరశైవులు, లింగాయత్‌లు దాదాపుగా కలిసిపోయారు. లింగాయత్ మఠాల ప్రాధాన్యం... కర్ణాటకలో 500కు పైగా లింగాయత్ మఠాలున్నాయి. వీటి చుట్టూనే రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. లింగాయత్ ఉపకులాలూ కీలకమే. వీరు మఠాధిపతులు గీచిన గీత దాటరు. లింగాయత్‌లు అత్యధికంగా ఉన్న ఉత్తర కర్ణాటకలోని 22 జిల్లాల్లో బాగా పట్టున్న అఖిల భారత వీరశైవ మహాసభ రాష్ట్ర రాజకీయాల్లో బాగా చురుగ్గా ఉంది. బొమ్మై కూడా లింగాయతే అయినా ఈ మఠాల మద్దతు యడియూరప్పకే! ఆయన్ను సీఎంగా తప్పించినప్పటి నుంచీ మఠాధిపతులు గుర్రుగా ఉన్నారు. పర్యవసానం అనుభవిస్తారంటూ బీజేపీకి వారు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఈసారి ఎన్నికల్లో గట్టెక్కించే బాధ్యతను బీజేపీ యడ్డీ భుజస్కంధాలపైనే ఉంచింది. దాంతో ఆయన మఠాధిపతుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. లింగాయత్‌ల జనాభా: 1.5 కోట్లు రాష్ట్ర జనాభాలో శాతం: 17% ప్రభావం చూపించే స్థానాలు: 100-120 ప్రస్తుత అసెంబ్లీలో లింగాయత్ ఎమ్మెల్యేలు: 54 (బీజేపీ 37) 1952 నుంచి లింగాయత్ సీఎంలు: 10 – సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్ణాటక రాజకీయాల్లో మఠాల ప్రభావం
-
కర్నాటక రాజకీయం: ఆ నిర్ణయం బీజేపీకి ప్లస్ అవుతుందా?
సాక్షి, ఢిల్లీ: దక్షిణ భారతంలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కర్నాటకలో ఎన్నికల నగారా మోగింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, ఇటీవలే కర్నాటకలోని బీజేపీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయాలు అధికార పార్టీకి ప్లస్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా? అనేది చూడాల్సి ఉంది. ఇక, బీజేపీ నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ ప్లాన్ చేస్తున్నాయి. కర్నాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 113గా ఉంది. ఇక, రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ 119, కాంగ్రెస్ 75, జేడీఎస్‌కి 28 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, కర్నాటక ఎన్నికల్లో లింగాయత్ సామాజిక వర్గం ఎన్నికల ఫలితాలపై కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడ ఏదైనా పార్టీ అధికారంలోకి రావలంటే వీరి ఓట్లే కీలకం అవుతాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార బీజేపీ ప్రభుత్వం ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లింలను ఓబీసీ జాబితాలోని 2బీ కేటగిరీ నుంచి తొలగిస్తూ బొమ్మై ప్రభుత్వం వారం క్రితం నిర్ణయం తీసుకుంది. ఓబీసీ కోటాలో భాగంగా విద్య, ఉద్యోగాల్లో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. వాటిని లింగాయత్‌లు, వక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ముస్లింలను ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల) జాబితాకు మారుస్తున్నట్టు సీఎం బొమ్మై చెప్పుకొచ్చారు.ఇదే క్రమంలో లింగాయత్‌లకు గతంలో ఉన్న 5శాతం రిజర్వేషన్ 7శాతానికి పెంచారు. అలాగే, విద్య, ఉద్యోగాల్లో లింగాయత్ వర్గాలకు రిజర్వేషన్‌ను పెంచారు. వక్కలిగ, లింగాయత్... బలీయమైన ఓటు బ్యాంకులు వక్కలిగలు, లింగాయత్‌లు కర్ణాటకలో బలమైన సామాజిక వర్గాలు. బలీయమైన ఓటు బ్యాంకులు కావడంతో ఎన్నికల్లో వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బెంగళూరు నగర నిర్మాత కెంపె గౌడది వక్కలిగ సామాజిక వర్గమే. రాష్ట్రంలో గత, ప్రస్తుత రాజకీయ ప్రముఖుల్లో చాలామంది ఈ కులాలకు చెందినవారే. ► పలు నివేదికల ప్రకారం రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉంటారు. ► మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 100 చోట్ల వీరు ఫలితాలను శాసించే స్థితిలో ఉన్నారు. ► లింగాయత్‌లు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. ► ఇక వక్కలిగలు జనాభాలో 11% ఉన్నట్టు అంచనా. కానీ తాము నిజానికి 16 శాతం దాకా ఉంటామన్నది వీరి వాదన. ► తొలుత ప్రధానంగా వ్యవసాయదారులైన వక్కలిగలు స్వాతంత్య్రానంతరం పలు రంగాలకు విస్తరించి పట్టు సాధించారు. ► తమకు రిజర్వేషన్లు పెంచాలంటూ ఈ రెండు సామాజిక వర్గాలూ కొద్ది నెలలుగా బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే ఈసారి బీజేపీకి ఓటేసేది లేదంటూ భీష్మించుకున్నాయి. ► తాజాగా ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను వీరికి పంచడంతో వక్కలిగల రిజర్వేషన్లు 4 నుంచి 6 శాతానికి, లింగాయత్‌లకు 5 నుంచి 7 శాతానికి పెరిగాయి. కర్నాటకలో ఓట్ షేర్.. - బీజేపీ 36 శాతం. - కాంగ్రెస్ 38 శాతం. - జేడీఎస్ 18 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా.. ఎన్నికల కోసం అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. కర్నాటకలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ భారీ ప్లాన్ రచించింది. రాష్ట్రంలో ఇప్పటికే 124 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. జేడీఎస్.. 93 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా బీజేపీ మాత్రం ఏప్రిల్ మొదటి వారంలో అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కర్నాటకలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. 150 స్థానాల్లో గెలుపే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ముఖ్య నేతలు కర్నాటకలో పర్యటించారు. ఈ సందర్బంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఏకైన పాన్ ఇండియా పార్టీ. దక్షిణాదిలోనూ బీజేపీ బలపడుతోంది. కర్నాటకలో బీజేపీ ఎప్పటినుంచో అతిపెద్ద పార్టీ. తెలంగాణ ప్రజలకు భరోసా బీజేపీ మాత్రమేనని అన్నారు. ఇది కూడా చదవండి: కర్నాటకలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. పోలింగ్ ఎప్పుడంటే? -
కన్నడనాట రిజర్వేషన్ల రగడ
అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారు రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ఓబీసీ కోటాలో ముస్లింలకు అందుతున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ గత వారం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆ 4 శాతాన్ని బీజేపీకి గట్టి ఓటు బ్యాంకైన వక్కలిగలు, లింగాయత్‌లకు సమానంగా పంచడంపై కలకలం రేగుతోంది. ఈ పరిణామం విపక్ష కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శిస్తూనే, తాము అధికారంలోకి వస్తే ముస్లింల కోటాను పునరుద్ధరిస్తామంటూ హస్తం పార్టీ తాజాగా ఎన్నికల హామీ ఇచ్చింది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లను ఉప కులాలవారీగా విభజించిన తీరుతో తమకు అన్యాయం జరిగిందంటూ బంజారాలు, ఆదివాసీలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు... ఏం జరిగింది? కర్ణాటకలో ముస్లింలను ఓబీసీ జాబితాలోని 2బీ కేటగిరీ నుంచి తొలగిస్తూ బొమ్మై ప్రభుత్వం వారం క్రితం నిర్ణయం తీసుకుంది. ఓబీసీ కోటాలో భాగంగా విద్య, ఉద్యోగాల్లో వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. వాటిని లింగాయత్‌లు, వక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ముస్లింలను ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల) జాబితాకు మారుస్తున్నట్టు సీఎం బొమ్మై చెప్పుకొచ్చారు. ‘‘మతాధారిత రిజర్వేషన్లకు రాజ్యాంగంలో చోటు లేదు. ముస్లింలకు ఇకనుంచి 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి’’అన్నారు. కాంగ్రెస్ ఏమంటోంది? ముస్లింలను ఓబీసీ జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలిగించారంటూ కాంగ్రెస్ మండిపడింది. ఇది మతాల మధ్య మంటలు రాజేసే యత్నమంటూ దుయ్యబట్టింది. ముస్లింల 4 శాతాన్ని తమకు పంచడంపై లింగాయత్‌లు, వక్కలిగలు కూడా సంతోషంగా లేరని చెప్పుకొచ్చింది. ‘‘ముస్లింలను ఓబీసీ నుంచి ఈడబ్ల్యూఎస్ కోటాకు మార్చడం రాజ్యాంగవిరుద్ధం. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఏ మతానికి, కులానికి చెందిన వారైనా జనరల్ కేటగిరీ అయిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులే అవుతారు. అలాంటి కోటాకు ముస్లింలను మార్చి, వారికేదో కొత్తగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు బీజేపీ చెప్పుకోవడం విడ్డూరం’’అంటూ మండిపడింది. తాము అధికారంలోకొస్తే వారికి 4 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. భగ్గుమన్న బంజారాలు, ఆదివాసీలు విద్య, ఉద్యోగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, ఎస్టీలకు 4 నుంచి 7 శాతానికి బీజేపీ సర్కారు గత డిసెంబర్లో పెంచింది. అయితే వారిలో అణగారిన ఉప కులాల వారికి రిజర్వేషన్ల ఫలాలు అందకుండా బలవంతులైన కొన్ని ఉప కులాల వాళ్లే వాటిని అత్యధికంగా చేజిక్కించుకుంటున్నారన్న ఫిర్యాదు చాలాకాలంగా ఉంది. ఈ అసమానతలను సరిచేయాలన్న వారి చిరకాల డిమాండ్‌పై బొమ్మై ప్రభుత్వం ఇటీవలే రంగంలోకి దిగింది. 101 ఎస్సీ కులాల వారికి సమ న్యాయం చేసేందుకు అంతర్గత రిజర్వేషన్లను నిర్ణయించింది. ► ఆ మేరకు రాజ్యాంగంలోని 341(2) ఆర్టికల్ ప్రకారం ఎస్సీలను 4 విభాగాలుగా వర్గీకరించారు. ఎస్సీ (లెఫ్ట్)కు 6 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. ఆ జాబితాలోకి మాదిగ, ఆది ద్రవిడ, బాంబి ఉపకులాలు వస్తాయి. ► ఎస్సీ (రైట్)కు 5.5 శాతం కేటాయించింది. ఆది కర్ణాటక, హోలెయా, చలవాది ఉప కులాలు దీని కిందికి వస్తాయి. బంజారా, భోవి, కొరచ, కొరమలకు 4.5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ► మిగిలిన ఒక్క శాతం సంచార, ఆదివాసీ జాతులైన అలెమరి, ఆరె అలెమరిలకు దక్కుతుంది. ► దీన్ని బంజారా, భోవి కులాలవాళ్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఆందోళనలకు దిగారు. తాజాగా మాజీ సీఎం యడ్యూరప్ప నివాసంపై రాళ్లు రువ్వడం అందులో భాగమే. వక్కలిగ, లింగాయత్... బలీయమైన ఓటు బ్యాంకులు వక్కలిగలు, లింగాయత్‌లు కర్ణాటకలో బలమైన సామాజిక వర్గాలు. బలీయమైన ఓటు బ్యాంకులు కావడంతో ఎన్నికల్లో వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బెంగళూరు నగర నిర్మాత కెంపె గౌడది వక్కలిగ సామాజిక వర్గమే. రాష్ట్రంలో గత, ప్రస్తుత రాజకీయ ప్రముఖుల్లో చాలామంది ఈ కులాలకు చెందినవారే. ► పలు నివేదికల ప్రకారం రాష్ట్ర జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉంటారు. ► మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 100 చోట్ల వీరు ఫలితాలను శాసించే స్థితిలో ఉన్నారు. ► లింగాయత్‌లు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు. ► ఇక వక్కలిగలు జనాభాలో 11% ఉన్నట్టు అంచనా. కానీ తాము నిజానికి 16 శాతం దాకా ఉంటామన్నది వీరి వాదన. ► తొలుత ప్రధానంగా వ్యవసాయదారులైన వక్కలిగలు స్వాతంత్య్రానంతరం పలు రంగాలకు విస్తరించి పట్టు సాధించారు. ► తమకు రిజర్వేషన్లు పెంచాలంటూ ఈ రెండు సామాజిక వర్గాలూ కొద్ది నెలలుగా బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. లేదంటే ఈసారి బీజేపీకి ఓటేసేది లేదంటూ భీష్మించుకున్నాయి. ► తాజాగా ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను వీరికి పంచడంతో వక్కలిగల రిజర్వేషన్లు 4 నుంచి 6 శాతానికి, లింగాయత్‌లకు 5 నుంచి 7 శాతానికి పెరిగాయి. -
మళ్లీ యెడ్డీ వైపే బీజేపీ మొగ్గు
బెంగళూరు: కర్ణాటకలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రధాని మోదీతోపాటు యడియూరప్ప సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఇప్పటికే ప్రకటించిన యెడియూరప్పను మళ్లీ క్రియాశీలకంగా మార్చేందుకు కమలనాథులు ప్రయత్నాలు ప్రారంభించారు. అట్టడుగు స్థాయి నుంచి పార్టీని విస్తరించి, నాలుగు పర్యాయాలు సీఎం పీఠం అధిరోహించిన నేతగా ఆయనపై ఇప్పటికీ ప్రజాభిమానం చెక్కుచెదరలేదు. మరీ ముఖ్యంగా లింగాయత్ కులస్తుల్లో80 ఏళ్ల ఈ వృద్ధ నేతకున్న పలుకుబడి మరే ఇతర రాజకీయ పార్టీ నేతకూ లేదు. ఈ విషయాన్ని గ్రహించే ఆయన కేంద్ర నాయకత్వం రానున్న ఎన్నికల్లో ఆయన్ను ‘పోస్టర్ బాయ్’గా ఉంచి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరిగిన పలు బహిరంగ సభలు, సమావేశాల్లో ప్రధాని మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యెడియూరప్పపై ప్రశంసలు కురిపించడం వెనుక కారణం ఇదే. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం, లింగాయత్ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంతోపాటు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు సైతం యెడియూరప్ప అవసరం ఎంతో ఉందని రాజకీయ పరిశీలకులతోపాటు కాషాయ వర్గాలు సైతం అంటున్నాయి. రాష్ట్ర బీజేపీకి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇష్టం లేకున్నా యెడియూరప్పనే ప్రచారంలో ముందుంచేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతోందని అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు ఎ.నారాయణ చెప్పారు. -
ప్రకాశ్‌రాజ్‌కు బెదిరింపు లేఖ.. ‘మీపై నేరుగా దాడిచేసి పోలీసులకు లొంగిపోతా’
శివాజీనగర/బెంగుళూరు: బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్, సాహితీవేత్త వీరభద్రప్పతో పాటు 16 మంది కర్ణాటక సాహితీవేత్తలకు బెదిరింపు లేఖలు వచ్చాయి. ‘జై హిందూ దేశం, జై సహిష్ణు’పేరుతో వచ్చిన ఈ లేఖల్లో ‘మీపై నేరుగా దాడిచేసి పోలీసులకు లొంగిపోతా’అని ఉంది. దీనిపై వీరభద్రప్ప, పలువురు రచయితలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు భద్రత పెంచాలని కోరారు. తాను హిందువును కాదని, లింగాయత్‌ను అని వీరభద్రప్ప ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రకటించారు. చదవండి👉🏻 చింతన్ శిబిర్ వేళ కాంగ్రెస్‌కు షాక్.. సీనియర్ నేత సునీల్ జాఖడ్ గుడ్‌బై -
ఒక్క దెబ్బకు... రెండు పిట్టలు
చాలాకాలంగా వినిపిస్తున్నదే నిజమైంది. కర్ణాటక పీఠంపై యడియూరప్ప స్థానంలో కొత్త నేత కూర్చున్నారు. కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బుధవారం పదవీ స్వీకారం చేయడంతో యడియూరప్ప పాత అధికార శకం ముగిసింది. దక్షిణాదిలో తమకు పట్టం కట్టిన తొలి రాష్ట్రంలో బీజేపీ కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. కన్నడనాట పార్టీ బలోపేతంలో, అధికారంలోకి తేవడంలో కీలక పాత్రధారి యడ్డీ తర్వాత ఎవరన్న చిరకాలపు చిక్కుప్రశ్నకు బీజేపీ జవాబిచ్చింది. యడ్డీ మంత్రివర్గంలో హోమ్ మంత్రి బొమ్మై ఇప్పుడు పార్టీనీ, ప్రభుత్వాన్నీ చక్కదిద్దాల్సిన బరువు భుజానికెత్తుకున్నారు. 1980లలో తొమ్మిది నెలల పాటు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ ఎస్సార్ బొమ్మై వారసుడిగా నడక ప్రారంభించారు. ఇంజనీరింగ్ చదివి, టాటా మోటార్స్‌లో ఉద్యోగం చేస్తూ, వ్యాపారవేత్తగా మారాలని బెంగళూరొచ్చి, అనుకోకుండా రాజకీయాల్లోకి దిగిన బసవరాజ్ సీఎం స్థాయికి ఎదగడం అనూహ్యమే. జనతాదళ్‌తో మొదలై, బీజేపీలో చేరడానికన్నా ముందు జేడీయూలో పనిచేసిన గతం బొమ్మైది. కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, బంధుప్రీతి, పెరుగుతున్న అసమ్మతితో యడ్డీ క్రమంగా పార్టీకి బరువవుతున్న సంగతిని అధిష్ఠానం చాలాకాలం క్రితమే గుర్తించింది. ఇప్పటిదాకా నాలుగు సార్లు సీఎం అయినా, ఒక్కసారీ పూర్తికాలం పదవిలో లేని జాతకం యడ్డీది. 2012లోనైతే ఏకంగా అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఇదే యడ్డీ... బీజేపీ నుంచి బయటకొచ్చి, సొంత పార్టీ పెట్టి సత్తా చాటిన రోజులనూ అధినాయకత్వం మర్చిపోలేదు. ఈసారి పార్టీకి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తగా, అదే సమయంలో గౌరవంగా యడ్డీని సాగనంపాలని అధిష్ఠానం 4 నెలలుగా ప్రణాళికలు వేస్తూ వచ్చింది. అందుకే, ఆయనను కానీ, రాష్ట్రంలో దళితుల (23 శాతం) తరువాత రెండో అతి పెద్దదైన (17 శాతం) ఆయన లింగాయత్ సామాజిక వర్గాన్ని కానీ శత్రువుల్ని చేసుకోకుండా తెలివిగా వ్యవహరించింది. ఒక దశలో లింగాయత్‌ల బదులు మరో కీలక ఒక్కళిగల వర్గానికి చెందిన నేతను గద్దెపై కూర్చోబెట్టాలని అధిష్ఠానం తర్జనభర్జన పడింది. కానీ, దక్షిణాదిన బలంగానూ, అధికారంలోనూ ఉన్న ఏకైక రాష్ట్రంలో అతిగా ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని వెనక్కు తగ్గింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాల్లో 100 స్థానాల్లో ఫలితాన్ని నిర్ణయించే లింగాయత్‌లకు జోల పాడింది. వయసు మీద పడ్డ 78 ఏళ్ళ యడ్డీ స్థానంలో తోటి లింగాయత్ అయిన 61 ఏళ్ళ బొమ్మై మెరుగు అనుకుంది. అలా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నేతకు సీఎం సీటు దక్కాలన్న ఆ ప్రాంతీయుల చిరకాల డిమాండ్‌ను కూడా తీర్చింది. వాజ్‌పేయి – అడ్వాణీల తరం నేతలను ఒక్కొక్కరిగా వదిలించుకుంటూ వస్తున్న మోదీ, అమిత్ షా ద్వయం ఆ క్రమంలోనే యడ్డీ స్థానంలో బొమ్మైని తెచ్చింది. అదే సమయంలో ‘దశాబ్దాలుగా మీరు చేసిన సేవలకు మాటలు సరిపోవు’ అంటూ ట్విట్టర్ సాక్షిగా యడ్డీపై ప్రశంసల వర్షమూ కురిపించింది. ఆచితూచి చేసిన ఈ మార్పుతో బీజేపీకి ఒకే దెబ్బకు రెండు పిట్టలు దక్కాయి. ఒకటి – బొమ్మై కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవాడే కావడంతో, రాష్ట్రంలో తమ బలమైన ఓటు బ్యాంకును దూరం చేసుకోకుండా, కాపాడుకున్నట్టయింది. రెండోది – యడ్డీకి బొమ్మై నమ్మినబంటు కావడం వల్ల, నిష్క్రమిస్తున్న సీనియర్ నేత నుంచి అసమ్మతులు, కొత్త ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్టయింది. యడియూరప్ప సైతం నిష్క్రమణ సమయంలోనూ కోరుకున్న హిరణ్యాక్ష వరాలు దక్కించుకొని, పార్టీపై తన పట్టు సడలలేదని చాటుకున్నారు. పదవి పోయినా తానే తెర వెనుక సీఎం అనే ఇమేజ్ తెచ్చుకున్నారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖకు ఉపాధ్యక్షుడైన తన చిన్న కొడుకు 45 ఏళ్ళ విజయేంద్ర ప్రాధాన్యానికి భంగం రాదన్న హామీ పుచ్చుకున్నారు. ఇక, యడ్డీ వారసుడిగా పీఠమెక్కిన బొమ్మైకి 20 నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉన్న సమయం తక్కువ. సవాళ్ళు ఎక్కువ. కరోనా వేళ దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ఠను ఆయన పునరుద్ధ రించాల్సి ఉంటుంది. యడ్డీ అవినీతి, బంధుప్రీతి మరకలు పార్టీ విజయావకాశాలకూ, ప్రభుత్వ గౌరవానికీ భంగం కలిగించకుండా చకచకా చర్యలు చేపట్టాలి. యడ్డీ ఖాళీ చేయగానే సీఎం సీటులో కూర్చోవాలని ఆశపడ్డ ఆశావహులను బుజ్జగించి, కలుపుకొని పోవాలి. వ్యక్తిగత గురువైన యడ్డీని తోసిపుచ్చకుండానే, సొంతకాళ్ళపై నిలబడి పదవిని సుస్థిరం చేసుకొనేందుకు సమస్త ప్రయత్నాలూ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా... పార్టీలో సమస్యల పరిష్కర్తగా, సౌమ్యుడిగా, మధ్యేవాదిగా ఇప్పటి దాకా తనకున్న పేరును కాపాడుకుంటూనే, యడ్డీ లాంటి జననేతగా ఓటర్ల గుండెల్లో గూడు కట్టుకోవాలి. 2018 ఎన్నికలలో గెలిచినా – ఎమ్మెల్యేలపై యడ్డీ వేసిన ‘ఆపరేషన్ కమల్’ మంత్రంతో అధికారానికి దూరమైన కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్)లు తిరిగి బలం పుంజుకోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పటికే అధిష్ఠానం మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రుల్ని చేస్తోందన్న వార్తలొచ్చాయి. అంటే, బొమ్మైకి ఆది నుంచే ఆట మొదలైపోయింది. మరి, స్వతహాగా క్రికెట్ వీరాభిమాని, గతంలో కర్ణాటక క్రికెట్ సంఘానికి చైర్మన్ అయిన బొమ్మై తన కెప్టెన్సీలో కర్ణాటక బీజేపీ టీమ్‌ను ఎంత సమన్వయంతో, సమర్థంగా నడిపిస్తారో చూడాలి. నిండా రెండేళ్ళయినా దూరం లేని 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన సిక్సర్ కొడతారా? రోజుకో రకంగా మారే రాజకీయాలలో అధిష్ఠానం ఆశలు, ఆలోచనల్ని నిజం చేస్తారా? ఇప్పుడే తెర తీసిన కర్ణాటకంలో కొత్త అంకానికి స్వాగతం. -
కర్ణాటక సీఎం మార్పుపై నేడు రానున్న క్లారిటీ
-
సస్పెన్స్‌కు నేడు తెర
బెంగళూరు/బెళగావి: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్ నెలకొంది. సీఎం యడియూరప్పను(78) పదవిలో కొనసాగిస్తారా? లేదా అనేది సోమవారం తేలిపోనుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. పదవి ఉన్నా లేకున్నా మరో 10–15 ఏళ్ల పాటు బీజేపీ కోసం రాత్రింబవళ్లూ కష్టపడి పని చేస్తానని, ఈ విషయంలో సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. యడియూరప్ప ఆదివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి తనకు ఇంకా ఎలాంటి సందేశం రాలేదని తెలిపారు. ఆదివారం రాత్రిలోగా లేదా సోమవారం ఉదయంలోగా సందేశం అందుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలల క్రితమే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యానని గుర్తుచేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని, పదవి నుంచి దిగిపోవాలని ఆదేశిస్తే దిగిపోతా, కొనసాగాలని సూచిస్తే కొనసాగుతా అని పునరుద్ఘాటించారు. సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే కార్యక్రమంలో రెండేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతానని, ఆ తరువాత జరిగే పరిణామాలు మీరే తెలుసుకుంటారని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. ఒకవేళ బీజేపీ నాయకత్వం నుంచి సందేశం రాకపోతే ఏం చేస్తారని ప్రశ్నించగా.. అప్పటి నిర్ణయం అప్పుడే తీసుకుంటానని బదులిచ్చారు. మరోవైపు తదుపరి సీఎం ఎవరనే విషయంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం ధార్వాడ్ నుంచి బెంగళూరుకు చేరుకోవడం, ఢిల్లీకి వెళ్లేందుకు బుక్ చేసుకున్న విమాన టికెట్‌ను రద్దు చేసుకోవడం గమనార్హం. అలాగే సీఎం పదవి రేసులో ఉన్న గనుల మంత్రి మురుగేష్ నిరానీ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్ర హోంమంత్రి బస్వరాజ్ బొమ్మయ్, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేల పేర్లు కూడా ప్రముఖంగా వినపడుతున్నాయి. పార్టీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. పార్టీ గీసిన గీతను దాటే ప్రసక్తే లేదని, క్రమశిక్షణ మీరబోనని యడియూరప్ప చెప్పారు. ఆదివారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ‘‘పార్టీలో నాకు ఎన్నో పెద్ద పదవులు దక్కాయి. కర్ణాటక బీజేపీలో ఈ స్థాయిలో పదవులు పొందినవారు ఎవరూ లేరు. నాకు అవకాశాలు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు కృతజ్ఞతలు’’అని యడియూరప్ప పేర్కొన్నారు. కర్ణాటకలో 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు. నడ్డా ప్రశంసలు మరోవైపు బీజేపీ నాయకత్వం మిశ్రమ సంకేతాలను ఇచ్చింది. యడియూరప్పపై జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. ఆదివారం గోవాలోని పనాజీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యడియూరప్ప ముఖ్యమంత్రిగా చక్కగా బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. కర్టాటక సర్కారు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉందని తాను భావించడం లేదన్నారు. యడ్డిని కొనసాగించాల్సిందే పదవి నుంచి దిగిపోయేందుకు మానసికంగా సిద్ధమైన యడియూరప్పకు సొంత సామాజికవర్గం వీరశైవ లింగాయత్‌ల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. యడ్డిని సీఎంగా కొనసాగించాల్సిందేనని 500 మందికిపైగా వీరశైవ–లింగాయత్ మఠాధిపతులు డిమాండ్ చేశారు. బాలెహోసూరు మఠాధిపతి దింగలేశ్వర స్వామి, తిప్తూరు మఠాధిపతి రుద్రముని స్వామి, చిత్రదుర్గ మఠాధిపతి బసవకుమార్ స్వామి పిలుపు మేరకు బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి పెద్ద సంఖ్యలో వీరశైవ–లింగాయత్ మఠాధిపతులు హాజరయ్యారు. యడియూరప్పను సీఎం పదవిలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ముఖ్యమంత్రి యడియూరప్పను పదవి నుంచి తొలగించడం సరి కాదని వారన్నారు. -
యడ్డి వారసుడెవరో? బీజేపీ చేతిలో ఆ 8 మంది పేర్లు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప స్థానంలో బలమైన మరోనేతను నియమించడం బీజేపీకి సవాలుగా మారింది. కన్నడనాట బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడియూరప్ప (78)ను తప్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని గత కొంతకాలంగా జోరుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ సోమవారంతో యడ్డి సీఎం పదవిని చేపట్టి రెండేళ్లు అవుతుంది. యడ్డి స్థానంలో అందరికీ ఆమోదయోగ్యుడైన, ప్రజాదరణ కలిగిన నేతను వెతికిపట్టుకోవడం ఇప్పుడు బీజేపీకి కత్తిమీద సాములా మారింది. దక్షిణాదిలో తమకు అత్యంత కీలకమైన కర్ణాటకలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ గట్టి కసరత్తు చేస్తోంది. కొత్త సీఎంగా మొత్తం ఎనిమిది మంది పేర్లను బీజేపీ పెద్దలు షార్ట్‌లిస్ట్ చేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. యడ్డి వారసుడిగా లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలనేదే అధిష్టానం ఉద్దేశంగా కనపడుతోంది. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 16 శాతానికి పైగానే ఉంటారు. ఎప్పటినుంచో కమలదళానికి గట్టి మద్దతుదారులు. ఢిల్లీ పెద్దలు షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో పంచమశీల లింగాయత్‌లు నలుగురు ఉన్నారు. విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్, ధార్వాడ్ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్, గనుల శాఖ మంత్రి మురుగేష్ నిరానీ, బస్వరాజ్ బొమ్మయ్‌లు ఈ నలుగురు. బసన్నగౌడ పాటిల్ ఆర్ఎస్ఎస్లో బలమైన మూలాలున్న వ్యక్తి. ఉత్తర కర్ణాటకలో పేరున్న నాయకుడు. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు అదనపు అర్హత అవుతుందని భావిస్తున్నారు. పంచమశీల లింగాయత్‌లను బీసీలుగా గుర్తించి రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఉద్యమంలో కీలకభూమిక పోషించారు. అరవింద్ బెల్లాద్ ఇంజనీరింగ్ చదివారు. వ్యాపారవేత్త కూడా. క్లీన్ఇమేజ్ ఉంది. బాగల్కోట్ జిల్లాలోని బిల్గి నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మురుగేష్ నిరానీకి చక్కెర పరిశ్రమలు ఉన్నాయి. హోంమంత్రి అమిత్‌కు సన్నిహితుడిగా చెబుతారు. యడ్డీ తన వారసుడిగా హోంమంత్రి బస్వరాజ్ బొమ్మయ్ పేరును సిఫారసు చేసే చాన్సుంది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే (బ్రాహ్మణ సామాజికవర్గం), సి.టి.రవి (ఒక్కళిగ)లు రేసులో ఉన్న ఇతర ప్రముఖులు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కతీల్‌కు చెందిన లీకైన ఆడియో సంభాషణను బట్టి చూస్తే ప్రహ్లాద్ జోషి రేసులో అందరికంటే ముందున్నట్లు కనపడుతోంది. నన్నెవరూ సంప్రదించలేదు: ప్రహ్లాద్ హుబ్బళి: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బాధ్యతలు చేపడతారనే వార్తలపై ఆయన శనివారం స్పందించారు. ‘ బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ విషయంపై నాతో ఏమీ మాట్లాడలేదు. అయినా, సీఎంగా యడియూరప్ప రాజీనామా చేస్తారనే అంశాలను ఎవరూ మాట్లాడటం లేదు. కేవలం ప్రసారమాధ్యమాలు(మీడియా) మాత్రమే ఈ అంశాన్ని చర్చిస్తున్నాయి. కొత్త సీఎంగా నన్ను ఎంపికచేస్తారనే విషయాన్ని ఎవరూ నాతో ఇంతవరకూ ప్రస్తావించలేదు’ అని మీడియాతో అన్నారు. అత్యంత ముఖ్యాంశాలపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాలదే తుది నిర్ణయమని చెప్పారు. -
దిగిపోక తప్పదు!
బెంగళూరు: ముఖ్యమంత్రి పదవి నుంచి తాను దిగిపోవడం తప్పదన్న సంకేతాలను కర్ణాటక సీఎం బి.ఎస్.యడియూరప్ప(78) ఇచ్చారు. ముఖ్యమంత్రి మార్పుపై ఆయన తొలిసారిగా గురువారం నోరు విప్పారు. బీజేపీ కేంద్ర నాయకత్వ నిర్ణయమే తనకు శిరోధార్యమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు. ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తును ఈ నెల 25వ తేదీన బీజేపీ నాయకత్వం ఖరారు చేయనుందని పేర్కొన్నారు. పార్టీ పెద్దల మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్ల పదవీ కాలాన్ని ఈ నెల 26న పూర్తి చేసుకోనున్నారు. ఇతరులకు మార్గం సుగమం చేసేందుకు సీఎం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని గతంలో అధిష్టానానికి చెప్పానన్నారు. మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం ‘ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు నాపై ప్రత్యేకమైన ప్రేమ, విశ్వాసం ఉన్నాయి’ అని యడియూరప్ప పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేసి, మళ్లీ అధికారంలోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమని, అందుకోసం కృషి చేస్తానని చెప్పారు. కార్యకర్తలెవరూ గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని, అందరూ తనకు సహకరించాలని కోరారు. అందరం కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. తనకు అనుకూలంగా ఎలాంటి ప్రకటనలు జారీ చేయొద్దని చెప్పారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దన్నారు. వెల్లువెత్తుతున్న సంఘీభావం సీఎం పదవి నుంచి దిగిపోవడం తప్పదని యడియూరప్ప చెబుతుండగా, మరోవైపు ఆయనకు సంఘీభావం వెల్లువెత్తుతోంది. మఠాలు, పీఠాధిపతులు, రాజకీయ నాయకులు, కుల సంఘాల నేతలు ఆయనకు మద్దతుగా ప్రకటనలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా వీరశైవ–లింగాయత్ సామాజికవర్గం నేతలు యడియూరప్పకు అండగా నిలుస్తున్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని అఖిల భారత వీరశైవ మహాసభ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఆయనను పదవి నుంచి తప్పిస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. -
BS Yediyurappa: యడియూరప్ప వారసుడెవరు?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బి.ఎస్.యడియూరప్ప(78) మరో నాలుగు రోజుల్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది. యడియూరప్ప వారసుడు ఎవరన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తదుపరి సీఎం రేసులో తాము ముందంజలో ఉన్నామంటూ పలువురు నాయకులు లీకులిస్తున్నారు. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జాబితాలో కొత్త పేర్లు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదని కర్ణాటక బీజేపీలోని ఒకవర్గం వాదిస్తుండగా, మార్పు తథ్యమని మరో వర్గం బల్లగుద్ది మరీ చెబుతోంది. యడియూరప్ప స్థానంలో బలమైన నేతను నియమించడం పార్టీకి సవాలేనని బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. అనుకున్నంత సులభం కాదు కర్ణాటకలో కొత్త తరానికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన బీజేపీ నాయకత్వంలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి మార్పు ప్రక్రియ సజావుగా సాగాలంటే యడియూరప్ప వారసుడిగా ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేని మాస్ లీడర్ కావాలని చెబుతున్నారు. అలాంటి నేతను వెతికి పట్టుకోవడం అనుకున్నంత సులభం కాదని బీజేపీ కార్యకర్తలే పేర్కొంటున్నారు. కులాల మధ్య సమతూకం పాటిస్తూ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిదేనని అంటున్నారు. లింగాయత్ వర్గం జనాభా కర్ణాటకలో 16 శాతానికి పైగానే ఉంది. దీంతో ఈ వర్గాన్ని విస్మరించలేని పరిస్థితి. లింగాయత్‌లు బీజేపీకి అండగా నిలుస్తున్నారు. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పిస్తారన్న వార్తల పట్ల ఈ వర్గం గుర్రుగా ఉంది. లింగాయత్‌ల ఆగ్రహానికి గురైతే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. ఒక్కళిగ వర్గంలో పట్టుకోసం ఆరాటం కర్ణాటక తదుపరి సీఎంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి.రవి, బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి.ఎల్.సంతోష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జోషీ, సంతోష్ బ్రాహ్మణ సామాజికవర్గం నేతలు. సి.టి.రవి ఒక్కళిగ వర్గం నాయకుడు. అయితే, బీజేపీ అధిష్టానం అనూహ్యంగా కొత్త నేతను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ఒక్కళిగ కూడా బలమైన సామాజిక వర్గమే. ఈ వర్గంలో పట్టుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. సీఎం రేసులో మరో బ్రాహ్మణ నాయకుడు, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ఖగేరీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది. రామకృష్ణ హెగ్డే తర్వాత 1988 నుంచి ఇప్పటిదాకా కర్ణాటక సీఎంగా బ్రాహ్మణులకు అవకాశం దక్కలేదు. బీజేపీలో యడియూరప్ప ప్రత్యర్థి, సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తనకు సీఎం పదవి ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన వీర హిందుత్వవాదిగా పేరుగాంచారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ నెగ్గాలంటే హిందుత్వవాదికే పట్టం కట్టాలని బీజేపీ పెద్దలు నిర్ణయించారని, అందులో భాగంగానే తనవైపు మొగ్గు చూపుతున్నారని బసనగౌడ సంకేతాలిస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా మంత్రులు మురుగేష్ నిరానీ, బసవరాజ్ ఎస్.బొమ్మై, ఆర్.అశోక్, సి.ఎన్.అశ్వత్థ నారాయణ్, జగదీష్ షెట్టర్(మాజీ సీఎం), ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు విందు వాయిదా కర్ణాటక సీఎం యడియూరప్ప ఈ నెల 25న తలపెట్టిన విందు వాయిదా పడింది. సీఎంగా రెండేళ్ల పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో బెంగళూరులోని ఓ హోటల్లో బీజేపీ ఎమ్మెల్యేలకు భారీ విందు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. అయితే, ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల నేపథ్యంలో ఈ విందు వాయిదా పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. విందు కోసం తదుపరి తేదీని ఇంకా ఖరారు చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి. యడియూరప్ప గత వారమే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో సమావేశమయ్యారు. సీఎం మార్పుపై చర్చించడానికే యడియూరప్పను పార్టీ పెద్దలు ఢిల్లీకి పిలిపించారన్న వార్తలు వెలువడ్డాయి. -
కన్నడనాట రిజర్వేషన్ల యుద్ధం
బనశంకరి: రిజర్వేషన్లను పెంచాలని వాల్మీకులు, ఎస్టీల్లో చేర్చాలని కురుబలు, తమనూ బీసీలుగా గుర్తించాలని అగ్రవర్ణ వీరశైవ, లింగాయత్‌ల ఆందోళనలు కర్ణాటకలో ఊపందుకున్నాయి. నెలరోజుల నుంచి ఎవరికి వారు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ యెడియూరప్ప సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆఖరికి మంత్రులు సైతం తమ వర్గాల సమావేశాల్లో పాల్గొంటూ గళమెత్తడంతో సీఎం యెడియూరప్పకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. గుణపాఠం తప్పదన్న పంచమసాలిలు .. ఈ నేపథ్యంలో బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఆదివారం లింగాయత పంచమసాలి వర్గీయులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ వర్గీయులు అధికంగా ఉండే కలబురిగి, విజయపుర, బాగల్‌కోటే, యాదగిరి, బీదర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, హావేరి, ధారవాడ, బెళగావిల నుంచి వేలాదిగా తరలివచ్చారు. బీసీల్లో 3బీ గా ఉన్న తమను తక్షణం 2ఏ కు మార్చి రిజర్వేషన్ వసతులను పెంచాలని నేతలు డిమాండ్ చేశారు. లేదంటే రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కూడల సంగమ పంచమసాలి పీఠాధిపతి శ్రీ బసవజయ మృత్యుంజయ స్వామీజీ మాట్లాడుతూ ఒకవేళ రాష్ట్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తమ వర్గం స్వామీజీల నేతృత్వంలో నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. వ్యవసాయమే జీవనాధారమైన తమకు రిజర్వేషన్ ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యమని తెలిపారు. సమావేశంలో మంత్రులు మురుగేశ్ నిరాణి, సీసీపాటిల్, అన్ని పార్టీల నుంచి 20 మందికిపైగా ఎమ్మెల్యేలు, స్వామీజీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఏమంటున్నారు ? వరుస ఆందోళనల నేపథ్యంలో సీఎం యెడియూరప్ప అన్ని వర్గాలను బుజ్జగించేలా ప్రకటనలు చేస్తున్నారు. మంత్రిమండలిలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని మంత్రులకు స్పష్టంచేశారు. -
శివకుమార స్వామికి తుది నివాళులు
-
శివకుమార స్వామికి తుది నివాళులు
సాక్షి, బెంగళూర్ : లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ సోమవారం తుదిశ్వాస విడిచిన ఆథ్యాత్మిక గురు, సిద్ధగంగ మఠానికి చెందిన శివకుమార స్వామి (111) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరగనున్నాయి. శివకుమార స్వామిని కడసారి వీక్షించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు, సన్యాసులు తుంకూర్లోని మఠానికి తరలివచ్చారు. లింగాయత్‌ల ఆరాధ్యదైవంగా పేరొందిన స్వామిని నడిచే దేవుడిగా వారు భావిస్తుంటారు. శివకుమార స్వామి మృతికి రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సంతాపదినాలను ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. స్వామి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి ఆయన ఎనలేని కృషి సాగించారని కొనియాడారు. -
‘డిప్యూటీ’పై సిగపట్లు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కొలువుదీరనున్న కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారులో డిప్యూటీ సీఎం పదవికోసం కాంగ్రెస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. పలువురు సీనియర్ నేతలు దీనికోసం తమకు తోచిన మార్గాల్లో లాబీయింగ్ చేసుకుంటున్నారు. జేడీఎస్‌తో పొత్తును ప్రకటించిన మరుక్షణం నుంచే డిప్యూటీ సీఎం సహా కీలక మంత్రిత్వ శాఖలపై ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆంతరంగిక సమావేశాల్లోనూ పలువురు నేతలు మంత్రిత్వ శాఖలపై పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పదవిపై సోనియా గాంధీ, రాహుల్‌లతో కుమారస్వామి చర్చించినట్లు సమాచారం. అయితే.. రెండు ఉప ముఖ్యమంత్రుల పదవులను ఏర్పాటుచేసి ఒకటి లింగాయత్‌లకు, మరొకటి దళితులకు ఇవ్వాలని చర్చ జరుగుతోంది. పోటీలో డీకే, శివశంకరప్ప, పరమేశ్వర్ ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలను నడిపిస్తున్న కాంగ్రెస్ మాజీ మంత్రి డీకే శివకుమార్ కూడా డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు. కేపీసీసీ అధ్యక్ష పదవి శివకుమార్‌కు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా.. డిప్యూటీ సీఎంకే ఆయన పట్టుబడుతున్నట్లు సమాచారం. తమ సామాజిక వర్గం అధ్యక్షుడు శ్యామనూరు శివశంకరప్పకు ఉపముఖ్యమంత్రి పదవి అప్పగించాలని లింగాయత్‌లు కోరుతున్నారు. ఇక దళితుల కోటాలో కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ ఆ పదవిని ఇష్టపడుతున్నారు. మంత్రుల విషయంలోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే పలువురు లాబీయింగ్‌లు ప్రారంభించారు. మరో మూడ్రోజుల్లో బలపరీక్ష ఉన్న నేపథ్యంలో శాఖల కేటాయింపు అంశం పీటముడిగా మారినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు మంత్రివర్గ కూర్పుపై చర్చించలేదని ఇరుపార్టీలు బహిరంగంగా చెబుతున్నప్పటికీ లోలోపల ఎమ్మెల్యేల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. -
‘మెజారిటీ’ సర్కారే..!
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పునిస్తారనేది ఉత్కంఠగా మారింది. అన్ని పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం జరగటం.. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడుతుందని వెల్లడిస్తున్న నేపథ్యంలో ఫలితంపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే కర్ణాటక రాజకీయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు మాత్రం కర్ణాటకలో మెజారిటీ ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఒకరికి మేజిక్ ఫిగర్ దక్కుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తారుమారైన విషయాన్ని వీరు గుర్తుచేస్తున్నారు. యూపీ ఫలితాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. కన్నడలో ప్రజానాడిపై విడుదలైన ఎనిమిది సర్వేల్లో.. ఆరు బీజేపీవైపు, రెండు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపాయి. కేవలం మూడు సర్వేలు మాత్రమే ఏకపార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుందని పేర్కొన్నాయి. ఇందులో ఇండియాటుడే–యాక్సిస్ సంస్థ కాంగ్రెస్ 106 నుంచి 118 సీట్లతో సర్కారు ఏర్పాటుచేస్తుందని పేర్కొనగా.. రిపబ్లిక్–జన్‌కీ బాత్, టుడేస్ చాణక్య సంస్థలు బీజేపీకీ స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టాయి. యూపీలో గతితప్పిన అంచనాలు గతంలోనూ వివిధ రాష్ట్రాలపై పలు సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్ క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించటంలో విజయం సాధించలేకపోయాయి. ఉదాహరణకు, గతేడాది యూపీ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ+కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే ఎస్పీ+కాంగ్రెస్ కూటమిదే అధికారమని కొన్ని సంస్థలు, బీజేపీ ప్రభుత్వ పగ్గాలు అందుకున్నా అత్తెసరు మెజారిటీయే ఉంటుందని మరికొన్ని సంస్థలు ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడించాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా ఓవైపు ప్రధాని మోదీ, అమిత్‌షాల వ్యూహాలు.. కాంగ్రెస్ తరపున సిద్దరామయ్య ఒంటరిగా ప్రతివ్యూహాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఏ పార్టీ మరొకరికి తీసిపోని విధంగా ప్రచారం చేసింది. మే 15 నాటి ఫలితాలతోనే ఎవరిపై ఎవరిది పైచేయనేది స్పష్టమవుతుంది. సిద్దరామయ్య విశ్వాసం కాంగ్రెస్ తరపున సీఎం సిద్దరామయ్యే కన్నడ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఐదేళ్ల కాలంలో చేపట్టిన పలు పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన విశ్వాసంతో ఉన్నారు. ప్రభుత్వంపై ఉండాల్సినంత వ్యతిరేకత లేకపోవటం, సామాన్యులు, పేదలకోసం ఉద్దేశించిన పథకాలను సరిగ్గా అమలుచేయటమే తనకు మళ్లీ పట్టంగడతాయని ఆయన విశ్వసిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది కేవలం సిద్దరామయ్య వ్యక్తిగత చరిష్మా వల్ల మాత్రమేననేది సుస్పష్టం. కన్నడ గౌరవం, కన్నడ ప్రత్యేక జెండా వంటివి కర్ణాటక ఓటర్లను కాంగ్రెస్‌కు దూరం కాకుండా చేస్తాయని ఆయన నమ్ముతున్నారు. అందుకే ఐదారు నెలలుగా తమ పార్టీకి 120కి పైగా సీట్లొస్తాయని విశ్వాసంగా చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవానికి ప్రభుత్వంపై అంతగా వ్యతిరేకత లేదు. అటు బీజేపీకి కూడా 2008లో అధికారంలోకి వచ్చిన నాటి పరిస్థితులు కూడా లేవు. క్షేత్రస్థాయి పనిలో బీజేపీ! కర్ణాటక ఎన్నికలకు కనీసం ఆర్నెల్ల ముందునుంచే బీజేపీ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లింది. బూత్ స్థాయిలో పనిచేసేలా కార్యకర్తలకు శిక్షణనివ్వటం మొదలుకుని ఓటింగ్ రోజు వారిని పోలింగ్ బూత్‌లకు తీసుకురావటం వరకు పకడ్బందీగా నిర్వహించింది. ఈ పనిని అమిత్‌షాయే ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూవచ్చారు. అభ్యర్థుల ఎంపిక, ఓటర్ల జాబితా విశ్లేషణ, ఎన్నికల ర్యాలీలు, యాత్రలు, ప్రజలను చేరుకునే కార్యక్రమాల్లో పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కర్ణాటక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఇక్కడ తొలిసారి ఓటేస్తున్న వారి సంఖ్య గతంలో కంటె రెట్టింపు కాగా, మహిళాఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మోదీ తన ప్రచారంలో యువత, మహిళలను పదేపదే ప్రస్తావించటం వెనక వ్యూహం కూడా ఇదే. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు అమిత్ షా సందేశమిస్తూ.. ‘ ఉదయం 10.30 కల్లా ఓటు వేసి.. మిగిలిన వారు ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించండి’ అని సూచించారు. లింగాయత్‌లు ఎటువైపు? ఈసారి కన్నడ ఫలితాలను నిర్ణయించే ప్రధాన అంశం లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పించటం. ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం తనకు అండగా నిలుస్తుందని సీఎం భావిస్తున్నారు. లింగాయత్‌ల జనాభా ఎక్కువగా ఉండే, సెంట్రల్ కర్ణాటక, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ఎగ్జిట్‌పోల్స్, అంతకుముందు ఒపీనియన్ పోల్స్కూడా వెల్లడించాయి. దీన్ని బట్టి చూస్తే 10 శాతం లింగాయత్‌లు మినహా మిగిలిన వారంతా బీజేపీతోనే ఉండొచ్చని తెలుస్తోంది. ఓటింగ్ శాతం పెరగటం అధికార పార్టీపై వ్యతిరేకతకు సంకేతమని అనుకోవడానిక్కూడా వీల్లేదు. దళిత, ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ కర్ణాటక, వక్కలిక ఓట్లు మెజారిటీగా ఉన్న పాత మైసూరు ప్రాంతాలపైనే కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. హైదరాబాద్ కర్ణాటకలోనూ బీజేపీనుంచి తీవ్రమైన పోటీ తప్పదని తెలుస్తోంది. కోస్తా కర్ణాటకలోనూ బీజేపీయే మెజారిటీ స్థానాలు గెలుచుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. – సాక్షి నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్‌కు ‘మోదీ’ గుబులు
కన్నడ రాజకీయాల్లో కోస్తా ప్రాంతానికున్న ప్రత్యేకతే వేరు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అభివృద్ధి, సామాజిక మార్పు, లింగాయత్‌లకు మతపరమైన రిజర్వేషన్లు ఇవేవీ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపవు. ఇక్కడ హిందువులతోపాటు, ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా ఎక్కువ. అడపాదడపా మతపరమైన ఘర్షణలు జరుగుతుంటాయి. ఈ ఐదేళ్లలో కర్ణాటక వ్యాప్తంగా 25 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురవగా.. ఎక్కువ మంది ఈ ప్రాంతంలోనే చనిపోయారు. దీంతో రాజకీయంగా, మతపరంగా చాలా సున్నితమైన ప్రాంతంగా కోస్తాకు పేరుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రధాని మోదీ చేపట్టనున్న ర్యాలీలతో కాంగ్రెస్‌లో గుబులు మొదలైంది. మోదీ హవా బలంగా వీస్తే కాంగ్రెస్ కనీస సీట్లను సంపాదించటమూ కష్టమేనని రాజకీయ విశ్లేషకులంటున్. పెరుగుతున్న నేరాలు ఈ ప్రాంతంలో మొత్తం 21 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 5, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఉన్న మూడు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. నేరాలు పెరగటం, మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం, అటవీ భూములు తగ్గిపోవటం వంటివీ ఈ ప్రాంతంలో తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయి. కొంతకాలంగా మాదక ద్రవ్యాల సరఫరా ఈ ప్రాంతంలో పెరిగిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీనిపై ఇక్కడి ప్రజల్లో మతాలకు అతీతంగా నిరసన వ్యక్తమవుతోంది. ఆలోచనలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో తన ప్రభావాన్ని స్పష్టంగా చూపించిన కాంగ్రెస్ ఈసారి పట్టునిలుపుకునేందుకు శ్రమిస్తోంది. డ్రగ్స్ సరఫరా, లవ్ జిహాదీ ఘటనలు పెరగటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో కోస్తాపై పట్టు నిలుపుకునేందుకు, హిందూ ఓట్లు చీలకుండా ఉండేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ రంగంలోకి దించింది. యోగిని ఎక్కువగా సున్నితమైన ప్రాంతాల్లో ప్రచారానికే వినియోగించుకుంటోంది. దీనికి తోడు మోదీ కూడా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. కొంతకాలంగా తమ ఓట్లు చీలకుండా చేస్తున్న వివిధ ప్రయత్నాలన్నీ ప్రధాని ర్యాలీలతో ప్రభావితం అవుతాయని.. కర్ణాటక మంత్రి, మంగళూరు సిట్టింగ్ ఎమ్మెల్యే యూటీ ఖాదర్ పేర్కొనటం పరిస్థితికి అద్దంపడుతోంది. మోదీ సునామీని తట్టుకునేందుకు ఇంటింటి ప్రచారంపైనే కాంగ్రెస్ అభ్యర్థులు దృష్టిపెట్టారు. అభిమానం ఓటుగా మారేనా? ‘గత ఎన్నికల్లోనూ మోదీ ఇక్కడ పర్యటించారు. కానీ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ప్రస్తుతం ప్రధాని హోదాలో వస్తున్నారు. దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందని భావిస్తున్నాం’ అని ఖాదర్ పేర్కొన్నారు. ‘మోదీ హవా ఉందనేది వాస్తవమే. ఈ జిల్లాలో (మంగళూరు) మోదీకి భారీ సంఖ్యలో అభిమానులున్నారు. కానీ ఇది ఓటుగా ఎంతవరకు మార్పుచెందుతుందనేది ఆలోచించాలి. ఏదేమైనా ఇక్కడ నేనే గెలుస్తాను. ఈ నియోజకవర్గంలో 20 శాతం మైనారిటీ ఓట్లున్నాయి’ అని మంగళూరు (నార్త్) కాంగ్రెస్ అభ్యర్థి మొయినొద్దీన్ బావా పేర్కొన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ తరపున భరత్ శెట్టి బరిలో ఉన్నారు. మరో సున్నితప్రాంతమైన బంత్వాల్ కాంగ్రెస్ అభ్యర్థి, కన్నడ అటవీ శాఖ మంత్రి రామ్‌నాథ్ పాయ్ మాత్రం.. మోదీ ప్రభావం ఉండదని కొట్టిపడేశారు. వారిని బుజ్జగిస్తే..: విశ్లేషకులు అయితే రాజకీయ విశ్లేషకులు కోస్తా కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదని.. మోదీ పర్యటన తర్వాత పరిస్థితి బీజేపీకి మరింత సానుకూలంగా మారొచ్చంటున్నారు. అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తిగా ఉన్న పలువురు కీలక నేతలను మోదీ బుజ్జగిస్తే.. పరిస్థితి కమలదళానికి అనుకూలమేనంటున్నారు. ముందే రంగంలోకి యోగి మతపరంగా సున్నితమైన ప్రాంతంలో మోదీ పర్యటన బీజేపీకి అనుకూలంగా మారుతుందని పార్టీ కార్యకర్తలు విశ్వసిస్తున్నారు. విపక్షాల్లోనూ ఇదే భావన వ్యక్తమవుతోంది. మతపరమైన సున్నిత ప్రాంతం కావటంతో.. ఇక్కడ మెజారిటీ సీట్లను గెలుపొందేందుకు బీజేపీ ముందునుంచే పావులు కదుపుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు నుంచే యోగి ఆదిత్యనాథ్ తరచూ ఈ ప్రాంతంలో పర్యటిస్తుండటం బీజేపీ వ్యూహంలో భాగమే. – సాక్షి నేషనల్ డెస్క్ -
‘లింగాయత్’ల గడ్డపై త్రిముఖపోరు
బీదర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: లింగాయత్ సామాజిక వర్గ ప్రభావం అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలో కీలకమైన ఐదు జిల్లాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ల మధ్య ప్రధాన పోరు సాగనుంది. అన్ని పార్టీలు లింగాయత్‌ల ఓట్ల కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో సాగుతున్నాయి. ప్రస్తుతం బీదర్, కలబుర్గి(గుల్బర్గ), యాద్గీర్, రాయిచూర్, కొప్పాల్ జిల్లాల్లో పట్టు నిలుపుకోవడానికి కాంగ్రెస్ యత్నిస్తుంటే.. మెరుగైన ఫలితాలపై బీజేపీ దృష్టిపెట్టింది. ఈ జిల్లాల్లో మొత్తం 31 స్థానాలుంటే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 18, జేడీఎస్ 5, బీజేపీ 4, కేఎంపీ+కేజేపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. లింగాయత్‌లకు మైనార్టీ హోదా కల్పించడం ద్వారా ఆ ఓట్లను తమవైపు తిప్పుకోవచ్చని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆశించారు. అయితే.. లింగాయత్ల్లోని ఉపకులాలను రిజర్వేషన్ల పేరిట విడగొట్టడంపై ఆ సామాజిక వర్గంలో మెజార్టీలుగా ఉన్న ‘ఆది’ వర్గం అసంతృప్తితో ఉంది. మోదీ సభతో బీజేపీలో ఉత్సాహం సిద్దూ సర్కారు మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని,.. తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఇక్కడి మధ్య, ఉన్నతవర్గాల్లో ఉంది. కందులు, పత్తి, చెరకు పంటలకు గిట్టుబాటు ధర రావడంలేదంటూ రైతులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర కర్ణాటకలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు. లింగాయత్ వర్గానికి చెందిన యడ్యూరప్ప మళ్లీ బీజేపీలోకి రావడంతో ఈసారి సీట్లను రెండంకెలకు పెంచుకోగలమని బీజేపీ భావిస్తోంది. గుల్బర్గలో ప్రధాని మోదీ పాల్గొన్న బహిరంగ సభకు భారీగా స్పందన రావడం బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. కాంగ్రెస్ విషయానికి వస్తే.. మాజీ సీఎం, బీదర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ధరమ్‌సింగ్ మరణించడం ఆ పార్టీకి తీరని లోటు. లింగాయత్‌ల తరువాత ఈ ప్రాంతంలో ముస్లిం, దళిత సామాజిక వర్గానిదే పైచేయి. వారిలో మెజారిటీ మద్దతు కాంగ్రెస్‌కే ఉంది. బీదర్.. బీదర్ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. గత ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్, ఒకస్థానంలో కర్ణాటక మక్కల్ పక్ష(కెఎంపీ), మరో చోట బీజేపీ గెలిచింది. ► బీదర్ మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమయ్యారనే విమర్శలున్నా.. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రహీంఖాన్‌కు మంచిపేరే ఉంది. గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన గురుపాదప్ప నాగమార్పల్లి కుమారుడు సూర్యకాంత్‌ను బీజేపీ దింపింది. ముస్లింలు అధికంగా ఉన్న ఈ స్థానంలో రహీంఖాన్కే గెలుపు అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ► బీదర్(దక్షిణ) అశోక్ ఖేనీ(కాంగ్రెస్), డాక్టర్ శైలేంద్ర బల్దాలే(బీజేపీ), బండెప్ప కేశంపూర్(జేడీఎస్)లు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కెఎంపీ నుంచి గెలిచిన అశోక్ ఖేనీ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. అయితే, ఆయన అభ్యర్థిత్వంపై స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి ఉంది. ► హుమ్నాబాద్: హ్యాట్రిక్ విజయాలు సాధించిన రాజశేఖర్పాటిల్(కాంగ్రెస్) నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనపై సొంత ఆస్తులు పోతాయనే ఉద్దేశంతో రోడ్డు విస్తరణను అడ్డుకుంటున్నారన్న ఆరోపణ ఉంది. లింగాయత్ల్లో పట్టున్న పాటిల్‌కు పోటీగా.. అదే సామాజిక వర్గానికి చెందిన సుభాష్కల్లుర్ను బీజేపీ, మాజీ మంత్రి మీరాజుద్దీన్ సోదరుడు నాసీమ్పటేల్ను జేడీఎస్ బరిలో దింపాయి. ► బసవకళ్యాణ్: మహారాష్ట్ర సరిహద్దులో ఉండే ఈ నియోజకవర్గంలో మరాఠీ ఓటర్లు కీలకం. స్థానిక మరాఠా నాయకులను కాదని కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన జేడీఎస్ ఎమ్మెల్యే మల్లిఖార్జున కుబాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. రెండు సార్లు ఓడిన ‘కబ్బలిగ’ వర్గానికి చెందిన నారాయణరావుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. పీజీఆర్ సింధియాను జేడీఎస్ రంగంలోకి దించింది. మరో రెండు నియోజకవర్గాలైన ఔరాద్లో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభు చౌహాన్(బీజేపీ), విజయ్‌కుమార్(కాంగ్రెస్), ధంజీ(జేడీఎస్)లు పోటీలో ఉన్నారు. యాద్గీర్, రాయచూర్, కొప్పాల్.. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 16(యాద్గీర్ 4, రాయచూర్ 7, కొప్పాల్ 5)స్థానాలున్నాయి. ► యాద్గీర్లో: ఇక్కడ గత ఎన్నికల్లో బీజేపీ ఒక్కస్థానంలోనూ గెలవలేదు. యాద్గీర్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న డాక్టర్ మలక్ రెడ్డి రెండో హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టారు. 1989 నుంచి 99 వరకు వరుసగా మూడుసార్లు గెలిచిన మలక్రెడ్డి, 2004లో ఓడిపోయారు. 2009, 2013లో ఇక్కడ నుంచి గెలుపొందారు. ఆయన కృషితోనే యాద్గీర్ జిల్లా కేంద్రంగా ఏర్పడింది. బీజేపీ తరఫున వెంకట్ రెడ్డి, జేడీఎస్ నుంచి కడ్లూర్ పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో లింగాయత్‌లు 40 శాతం వరకు ఉంటారు. గుర్మిట్కల్ స్థానంలో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూరావుకు ప్రజల్లో మంచి పేరుంది. షాహపూర్, షోరాపూర్ స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంది. ► రాయచూర్, కొప్పాల్: రాయచూర్ నగర అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో జేడీఎస్ తరఫున గెలిచిన శివరాజ్‌పాటిల్ బీజేపీ టికెట్‌తో బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సయ్యద్ యాసీన్ రంగంలో ఉన్నారు. రాయచూర్ రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి తిప్పేస్వామికి మంచి ఫాలోయింగ్ ఉంది. రాయచూర్ జిల్లాలోని మాన్వి, సింధనూరు, మాస్‌కి, దేవదుర్గ, లింగసూగూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్రిముఖపోటీ ఉంది. కొప్పాల్ జిల్లాలో కుస్తాగి, కనకగిరి, గంగావతి, యల్బుర్గ, కొప్పాల్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పోటీ నెలకొంది. గుల్బర్గ.... గుల్బర్గ జిల్లాలో 9 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు, బీజేపీ రెండు, జేడీఎస్ ఒక సీట్లో గెలుపొందాయి. ఇక్కడ కాంగ్రెస్‌దే ఆధిపత్యం. మరో రెండు స్థానాలు అదనంగా సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ ఉంది. గుల్బర్గలో డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉంది. ప్రధాన మార్కెట్ మార్గాల విస్తరణ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బీమా నదిపై నిర్మిస్తున్న రిజర్వాయర్ పనుల్లో జాప్యంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కర్ణాటకలో అత్యధికంగా కందులు పండించే జిల్లాగా గుల్బర్గకు పేరుంది. ఈసారి కందుల ధరలు దారుణంగా పడిపోయాయని రైతు బసవన్న ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 20 క్వింటాళ్ల వరకు ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసేదని, ఇప్పుడు క్వింటాల్‌కు రూ. 6 వేలిచ్చి.. పది క్వింటాళ్లు మాత్రమే కొంటోందన్నారు. ► చిత్తాపూర్ లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఐటీ మంత్రి అయిన ప్రియాంక్‌ఖర్గే వ్యవహారశైలి స్థానిక నాయకులకు నచ్చట్లేదు. ఈడిగ సామాజిక వర్గానికి చెందిన మలికయ్య గుత్తేదార్ సహా పలువురు నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. స్థానిక ప్రజలతో తనకున్న సత్సంబంధాలు, అభివృద్ధిపరచిన మౌలిక వసతులే గెలిపిస్తాయన్న ధీమాతో ప్రియాంక్ ఉన్నారు. ఈ నియోజవకర్గంలో లింగాయత్‌లు దాదాపు 60 వేల వరకు ఉండగా, కోలిలు 45వేలు, దళితులు 35 వేలు, ముస్లింలు 20 వేల వరకు ఉంటారు. బీజేపీ నుంచి బలహీన వర్గాల్లో పేరున్న వాల్మీకి నాయక్ బరిలో ఉన్నారు. ► జెవర్గీ కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అజయ్‌సింగ్(మాజీ సీఎం ధరమ్‌సింగ్ కుమారుడు)కు మంచిపేరే ఉంది. గ్రామాల్లో రహదారులు అభివృద్ధి చేశారని స్థానిక రైతు బసవన్నదొడ్డగౌడ చెప్పారు. ఉద్యోగాల కల్పనలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శ ఉంది. అజయ్‌సింగ్ తండ్రి ధరమ్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని స్థానికులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెవర్గీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేసినా.. ఒక్క పరిశ్రమ రాలేదని గిరిపాటిల్ అనే యువకుడు తెలిపాడు. ► గుల్బర్గ(ఉత్తర) ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కమర్ ఉల్ ఇస్లాం మరణించడంతో.. ఆయన భార్య కనీజ్ ఫాతిమాను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. ఇక్కడ మొత్తంగా 11 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. 60% ముస్లిం ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌కు ముందునుంచి అనుకూలమైన స్థానమే. కానీ ఈసారి ముస్లిం అభ్యర్థులు ఎక్కువ మంది రంగంలో ఉండడంతో ఓట్లు చీలుతాయన్న భయం కాంగ్రెస్‌లో ఉంది. కమర్ ఉల్ ఇస్లామ్‌కు శాసనసభ్యునిగా మంచి పేరుంది. ఆయన అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లేవారని హిందువులు కూడా చెప్తారు. వ్యాపారవేత్త చందుపాటిల్ను బీజేపీ రంగంలోకి దింపింది. ► గుల్బర్గ(దక్షిణ) జేడీఎస్ నుంచి వచ్చిన దత్తాత్రేయ చంద్రశేఖర్ పాటిల్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ రేవూర్ పాటిల్ కుటుంబానికి దక్షిణ గుల్బర్గలో మంచి ఆదరణ ఉంది. కాంగ్రెస్ అల్లప్రభు పాటిల్‌ను, జెడీఎస్ బస్వరాజ్ దుగ్గావిని బరిలోకి దింపాయి. ► గుల్బర్గ(గ్రామీణ) ఇక్కడ త్రిముఖ పోటీ. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ జి.రామకృష్ణ(కాంగ్రెస్), బస్వరాజ్ ముట్టిమడ్(బీజేపీ), రేవూనాయక్ బెలమగి(జేడీఎస్) పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. రేవూనాయక్కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన జేడీఎస్‌లోకి జంప్ అయ్యారు. ఈ ప్రాంతం గుల్బర్గను ఆనుకుని ఉన్నప్పటికీ అభివృద్ధిలో బాగా వెనుకబడింది. తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆ ప్రాంత ప్రజలు విమర్శిస్తున్నారు. ఇవికాకుండా, ఆలంద్, సేడం, అఫ్జల్పూర్, చించోలి నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లే ప్రధానంగా పోటీలో ఉన్నాయి.