కిత్తూరు కర్ణాటకలో (గతంలో ముంబై కర్ణాటక) రాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ ఉంది. 1957 సంవత్సరం నుంచి రాన్ నియోజకవర్గం ప్రజలు అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థినే ఎన్నుకుంటూ వస్తున్నారు. ఒకే పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించే సంప్రదాయం ఇక్కడ లేదు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇలా ఓటరు తీర్పు తిరగరాసే నియోజకవర్గాలు రాన్‌తో సహా 84 ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా పనిచేస్తుందని, అందుకే ఏ పార్టీ కూడా రెండోసారి గెలవడం కష్టంగా మారిందని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎ. నారాయణ అభిప్రాయపడ్డారు.
2018 : స్వింగ్ స్థానాల్లో బీజేపీ స్వీప్
► లింగాయత్‌లకు గట్టి పట్టున్న ముంబై కర్ణాటక ప్రాంతంలో 19 స్వింగ్ సీట్లున్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలన్నింటిలోనూ విజయం సాధించింది
► సెంట్రల్ కర్ణాటకలో 20 స్వింగ్ సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లింగాయత్, వొక్కలిగలు పట్టుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 16 స్థానాల్లో నెగ్గింది.
► బీజేపీకి కంచుకోటగా భావించే కోస్తా కర్ణాటకలో అత్యధిక స్థానాలు స్వింగ్ సీట్లుగా పేరొందాయి. ఈ ప్రాంతంలో 19 స్థానాలకు గానే 10 స్వింగ్ సీట్లుగా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో అన్ని స్వింగ్ స్థానాలను బీజేపీ స్వీప్ చేసింది. 20% మంది ముస్లిం జనాభా ఉన్న ఈ ప్రాంతంలో విభజన రాజకీయాలే కీలకం.
► హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 12 స్వింగ్ సీట్లు బీజేపీ ౖMðవశం చేసుకుంది. రాష్ట్రంలో ఈ ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంది.
► దక్షిణ కర్ణాటకలో మొత్తం స్థానాలు 46 కాగా అందులో స్వింగ్ సీట్లు 14 ఉన్నాయి. వొక్కలిగల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో జేడీ (ఎస్) సగం స్వింగ్ స్థానాలైన ఏడింటిలో విజయం సాధించింది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాలను దక్కించుకున్నాయి.
► బెంగళూరు నగరంలో రెండు స్వింగ్ సీట్లు బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి.
స్వింగ్ స్థానాల్లో పట్టుకు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు
లింగాయత్‌లకు పట్టున్న స్థానాలు, మత విభజన రాజకీయాలకు కేంద్రమైన కోస్తా కర్ణాటకలో 2018 ఎన్నికల్లో బీజేపీ స్వింగ్ స్థానాలన్నింటినీ స్వీప్ చేసింది. మొత్తం 84 స్వింగ్ స్థానాలకు గాను బీజేపీ ఖాతాలో 56 ఉన్నాయి. దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఈ స్థానాల్లో బీజేపీ నెగ్గే అవకాశాలు లేవు. అందుకే బీజేపీ ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచి ఈ స్థానాలపై దృష్టి సారించింది. వీటిలో 30 స్థానాల్లో లింగాయత్‌లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు.
లింగాయత్‌లు బీజేపీ వైపు నిలుస్తూ ఉండడంతో ఆ స్థానాలు తిరిగి నిలబెట్టుకోగలమన్న కమలదళం ధీమాగా ఉంది. అధికార వ్యతిరేకత, బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, ముస్లింలకు 4 శాతం కోటాలో కోత, పెరిగిపోతున్న ధరలు వంటివన్నీ బీజేపీకి మైనస్‌గా మారాయి. వీటన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో కప్పిపుచ్చే వ్యూహాలు రచిస్తోంది. అంతే కాకుండా చాలా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. తద్వారా అధికార వ్యతిరేకతను అధిగమించవచ్చునని వ్యూహరచన చేసింది.
అయితే మోదీ ఇమేజ్ అసెంబ్లీ ఎన్నికలకు పని చేసే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో ఎంతో ఆకర్షణ ఉన్నప్పటికీ ఆయనను స్థానికుడిగా చూడలేరు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఇమేజ్ పని చేస్తుందే తప్ప శాసనసభ ఎన్నికల్లో పని చేసే అవకాశం లేదు’’ అని ఎన్నికల విశ్లేషకుడు చేతన్ చౌహాన్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాల్లో పాగా వెయ్యడానికి పకడ్బందీ వ్యూహాలనే రచించింది.
స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ రాకతో లింగాయత్ ఓటు బ్యాంకును కొంతవరకైనా కొల్లగొట్టవచ్చునన్న ఆశగా ఉంది. ఇక బసవరాజ్ బొమ్మై అవినీతి, ముస్లిం కోటా రద్దుని ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. సిద్దరామయ్య, డి.కె.శివకుమార్ వంటి బలమైన నాయకులు ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత పోరు ఆ పార్టీకి మైనస్‌గా మారింది.
ఫలితంగా ఈ 84 సీట్లలోనూ హోరాహోరీ పోరు నెలకొంది. ఇక 224 స్థానాలకు గాను 60 సీట్లు సేఫ్ సీట్లుగా ఉన్నాయి. గత మూడు ఎన్నికల్లో వరుసగా ఒకే పార్టీ గెలుస్తూ వచ్చింది. ఈ సేఫ్ సీట్లు కాంగ్రెస్‌కి 27, బీజేపీకి 23, జేడీ(ఎస్)కి 10 ఉన్నాయి. ఈ సీట్లను కాపాడుకోవడానికి కూడా రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment