Karnataka assembly elections 2023: ‘కల్యాణం’ఎవరికో? | Karnataka assembly elections 2023: Triangular fight in Kalyana Karnataka | Sakshi
Sakshi News home page

Karnataka assembly elections 2023: ‘కల్యాణం’ఎవరికో?

Published Fri, Apr 28 2023 5:07 AM | Last Updated on Fri, Apr 28 2023 5:31 AM

Karnataka assembly elections 2023: Triangular fight in Kalyana Karnataka - Sakshi

ల్యాణ (హైదరాబాద్‌) కర్ణాటక. కన్నడ సీమలో అత్యంత వెనకబడ్డ మెట్ట ప్రాంతం. దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు 100కు పైగా స్థానాలు ఒడిసిపట్టినా మెజారిటీ మార్కును దాటలేకపోవడానికి ఈ ప్రాంతంలో పట్టు లేకపోవడమే ప్రధాన కారణం. దాంతో ఈసారి రెండు పార్టీలకూ కల్యాణ కర్ణాటక కీలకంగా మారింది. పట్టు కొనసాగించాలని కాంగ్రెస్, కోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని బీజేపీ పట్టుదలగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ ఐదు స్థానాలకు మించి గెలవని జేడీ(ఎస్‌) ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌ రెబెల్స్‌ను బరిలో దించి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది...

‘హైదరాబాద్‌ రాష్ట్రం’లో భాగమే
► కల్యాణ కర్ణాటక ఒకప్పటి హైదరాబాద్‌ రాజ్యంలో భాగంగా నిజాంల ఏలుబడిలో కొనసాగింది. ఇటీవలి దాకా కూడా ఈ ప్రాంతాన్ని హైదరాబాద్‌ కర్ణాటకగానే పిలిచేవారు.
► ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, లింగాయత్, ముస్లింలు అధిక సంఖ్యాకులు. 50 శాతానికి పైగా ఉండే ఈ వెనుకబడిన వర్గాలే ఇక్కడ నిర్ణాయక శక్తి.
► వీరేంద్ర పాటిల్, ధరంసింగ్‌ రూపంలో ఇద్దరు సీఎంలను అందించినా ఈ ప్రాంతం అత్యంత వెనకబాటుతనానికి మారుపేరు.
► దేశంలోనే రెండో అతి పెద్ద మెట్ట ప్రాంతంగా పేరొందింది. దాంతో వెనకబాటుతనం ఇక్కడ ప్రతిసారీ ఎన్నికల అంశంగా మారుతుంటుంది.
► ఈసారి కూడా పార్టీలన్నీ అభివృద్ధి నినాదాన్నే జపిస్తున్నాయి.
► అతివృష్టితో ఇక్కడ 90 శాతం పంటనష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం హెక్టార్‌కు రూ.10 వేల పరిహారం ప్రకటించినా అదింకా అందలేదు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చంటున్నారు.
► ఆర్టికల్‌ 371(జే) ప్రకారం విద్య, ఉద్యోగాల్లో ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఉన్నా ఒరిగిందేమీ లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది.
► దాంతో కొన్నేళ్లుగా ప్రత్యేక కల్యాణ రాష్ట్ర డిమాండ్‌ ఊపందుకుంటోంది!


ఖర్గే ఖిల్లా
మల్లికార్జున ఖర్గే కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకుడే. కాంగ్రెస్‌ సారథిగా ఈసారి ఇక్కడ పార్టీకి అత్యధిక స్థానాలు సాధించి పెట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఖర్గే కుమారుడు, చిత్తాపుర ఎమ్మెల్యే ప్రియాంక్‌ ఖర్గే ఇక్కడ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు.

► బీదర్, కలబురిగి, యాద్గిర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలతో కూడిన కల్యాణ కర్ణాటకలో 40 స్థానాలున్నాయి.
► గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్‌ చేజిక్కించుకుని సత్తా చాటింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 21 సీట్లు రాగా బీజేపీ 15, జేడీ(ఎస్‌) 4 గెలిచాయి. అయితే 2013తో పోలిస్తే కాంగ్రెస్‌కు 2 సీట్లు తగ్గగా బీజేపీకి 9 పెరిగాయి!
► ఈ కాంగ్రెస్‌ కంచుకోటను బద్దలు కొట్టేందుకు అధికార బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్, అభివృద్ధి కార్యక్రమాలనే బీజేపీ ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. మోదీపై ఆశలు పెట్టుకుంది.
► కల్యాణ కర్ణాటక ఉత్సవం, బీదర్‌ ఉత్సవం వంటివాటితో స్థానికుల మనసు దోచుకునే ప్రయత్నాలు చేసింది.
► కల్యాణ కర్ణాటక ప్రాంతీయాభివృద్ధి మండలికి వార్షిక కేటాయింపులను రూ. 1,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచింది.  
► ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఓటమిని రుచి చూపిన స్ఫూర్తితో కల్యాణ కర్ణాటకలో పూర్తిగా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది.
► జేడీఎస్‌ గత మూడు ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ ఐదు సీట్లకు మించి నెగ్గలేదు. ఈసారి తమ పంచరత్న యాత్ర విజయవంతం కావడం, కాంగ్రెస్, బీజేపీ సీనియర్‌ నేతలు జేడీ(ఎస్‌)లో చేరడంతో మంచి ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. 
► ఈసారి కల్యాణ కర్ణాటక నుంచి బరిలో దిగిన గాలి జనార్ధన్‌ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (కేఆర్‌పీపీ) మూడు ప్రధాన పార్టీల అవకాశాలను తారుమారు చేసే అవకాశముంది.         
► లింగాయత్‌లు ఎక్కువగా ఉన్నందున వారికి 2 శాతం అదనపు రిజర్వేషన్ల నిర్ణయం కలిసొస్తుందని ఆశ పడుతోంది. కానీ 40 శాతం కమీషన్లు, నియామక అక్రమాలు, రెబెల్స్‌ వంటివి బీజేపీకి ప్రతికూలంగా మారాయి.

– సాక్షి, బెంగళూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement