Backward regions
-
Karnataka assembly elections 2023: ‘కల్యాణం’ఎవరికో?
కల్యాణ (హైదరాబాద్) కర్ణాటక. కన్నడ సీమలో అత్యంత వెనకబడ్డ మెట్ట ప్రాంతం. దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు 100కు పైగా స్థానాలు ఒడిసిపట్టినా మెజారిటీ మార్కును దాటలేకపోవడానికి ఈ ప్రాంతంలో పట్టు లేకపోవడమే ప్రధాన కారణం. దాంతో ఈసారి రెండు పార్టీలకూ కల్యాణ కర్ణాటక కీలకంగా మారింది. పట్టు కొనసాగించాలని కాంగ్రెస్, కోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని బీజేపీ పట్టుదలగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ ఐదు స్థానాలకు మించి గెలవని జేడీ(ఎస్) ఈసారి బీజేపీ, కాంగ్రెస్ రెబెల్స్‌ను బరిలో దించి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది... ‘హైదరాబాద్ రాష్ట్రం’లో భాగమే ► కల్యాణ కర్ణాటక ఒకప్పటి హైదరాబాద్ రాజ్యంలో భాగంగా నిజాంల ఏలుబడిలో కొనసాగింది. ఇటీవలి దాకా కూడా ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ కర్ణాటకగానే పిలిచేవారు. ► ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, లింగాయత్, ముస్లింలు అధిక సంఖ్యాకులు. 50 శాతానికి పైగా ఉండే ఈ వెనుకబడిన వర్గాలే ఇక్కడ నిర్ణాయక శక్తి. ► వీరేంద్ర పాటిల్, ధరంసింగ్ రూపంలో ఇద్దరు సీఎంలను అందించినా ఈ ప్రాంతం అత్యంత వెనకబాటుతనానికి మారుపేరు. ► దేశంలోనే రెండో అతి పెద్ద మెట్ట ప్రాంతంగా పేరొందింది. దాంతో వెనకబాటుతనం ఇక్కడ ప్రతిసారీ ఎన్నికల అంశంగా మారుతుంటుంది. ► ఈసారి కూడా పార్టీలన్నీ అభివృద్ధి నినాదాన్నే జపిస్తున్నాయి. ► అతివృష్టితో ఇక్కడ 90 శాతం పంటనష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం హెక్టార్‌కు రూ.10 వేల పరిహారం ప్రకటించినా అదింకా అందలేదు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చంటున్నారు. ► ఆర్టికల్ 371(జే) ప్రకారం విద్య, ఉద్యోగాల్లో ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఉన్నా ఒరిగిందేమీ లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ► దాంతో కొన్నేళ్లుగా ప్రత్యేక కల్యాణ రాష్ట్ర డిమాండ్ ఊపందుకుంటోంది! ఖర్గే ఖిల్లా మల్లికార్జున ఖర్గే కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకుడే. కాంగ్రెస్ సారథిగా ఈసారి ఇక్కడ పార్టీకి అత్యధిక స్థానాలు సాధించి పెట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఖర్గే కుమారుడు, చిత్తాపుర ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ఇక్కడ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. ► బీదర్, కలబురిగి, యాద్గిర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలతో కూడిన కల్యాణ కర్ణాటకలో 40 స్థానాలున్నాయి. ► గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించుకుని సత్తా చాటింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 21 సీట్లు రాగా బీజేపీ 15, జేడీ(ఎస్) 4 గెలిచాయి. అయితే 2013తో పోలిస్తే కాంగ్రెస్‌కు 2 సీట్లు తగ్గగా బీజేపీకి 9 పెరిగాయి! ► ఈ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు అధికార బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్, అభివృద్ధి కార్యక్రమాలనే బీజేపీ ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. మోదీపై ఆశలు పెట్టుకుంది. ► కల్యాణ కర్ణాటక ఉత్సవం, బీదర్ ఉత్సవం వంటివాటితో స్థానికుల మనసు దోచుకునే ప్రయత్నాలు చేసింది. ► కల్యాణ కర్ణాటక ప్రాంతీయాభివృద్ధి మండలికి వార్షిక కేటాయింపులను రూ. 1,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచింది. ► ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఓటమిని రుచి చూపిన స్ఫూర్తితో కల్యాణ కర్ణాటకలో పూర్తిగా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ► జేడీఎస్ గత మూడు ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ ఐదు సీట్లకు మించి నెగ్గలేదు. ఈసారి తమ పంచరత్న యాత్ర విజయవంతం కావడం, కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు జేడీ(ఎస్)లో చేరడంతో మంచి ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. ► ఈసారి కల్యాణ కర్ణాటక నుంచి బరిలో దిగిన గాలి జనార్ధన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (కేఆర్పీపీ) మూడు ప్రధాన పార్టీల అవకాశాలను తారుమారు చేసే అవకాశముంది. ► లింగాయత్‌లు ఎక్కువగా ఉన్నందున వారికి 2 శాతం అదనపు రిజర్వేషన్ల నిర్ణయం కలిసొస్తుందని ఆశ పడుతోంది. కానీ 40 శాతం కమీషన్లు, నియామక అక్రమాలు, రెబెల్స్ వంటివి బీజేపీకి ప్రతికూలంగా మారాయి. – సాక్షి, బెంగళూరు -
21 జిల్లాలకు ‘వెనుకబడిన’ హోదా
సీబీడీటీ నోటిఫికేషన్ జారీ పరిశ్రమలు, భవనాల్లో పెట్టుబడులకు ఆదాయపన్ను రాయితీ ఏపీ, తెలంగాణల్లో వెనుకబడిన జిల్లాల తరహా ప్రోత్సాహకాలు న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. బిహార్ రాజధాని పట్నా సహా ఆ రాష్ట్రంలోని 21 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ఆ జిల్లాల్లో కొత్త తయారీ పరిశ్రమలు, భవనాల ఏర్పాటుకు 15 శాతం ఆదాయపన్ను రాయితీ లభించనుంది. ఆదాయపన్ను శాఖలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) దీనికి సంబంధించి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 32, 32ఏడీ కింద.. పట్నా, నలంద, భోజ్‌పూర్, రోహత్తాస్, కైమూర్, గయ, జహానాబాద్, ఔరంగాబాద్, నవద, వైశాలి, షోహార్, సమస్తిపూర్, దర్భంగ, మధుబని, పుర్ణియా, కతిహార్, అరారియా, జముయ్, లఖీసరాయ్, సుపౌల్, ముజఫర్‌పూర్ - 21 జిల్లాలను చేర్చింది. దీనిప్రకారం.. ఆయా జిల్లాల్లో భవనాలు, కొత్త పరిశ్రమలు, యంత్రాలపై పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 15 శాతం తక్కువ ఆదాయపన్ను చెల్లిస్తారు. కొత్తగా విభజించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు, ఆర్థిక తోడ్పాటును అందించే ఉద్దేశంతో.. 2015 ఆర్థిక బిల్లులోని ఐటీ చట్టంలో 32ఏడీ సెక్షన్‌ను చేర్చారు. ఈ సెక్షన్ కింద పేర్కొన్న వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ మొదలుకొని 2020 ఏప్రిల్ 1వ తేదీ ముందు వరకూ నెలకొల్పే పరిశ్రమలు, వాటిలో పెట్టే పెట్టుబడులకు ఆదాయపన్ను రాయితీ వర్తిస్తుంది. -
ఊహించిందే జరిగింది!
నిజామాబాద్: వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎ ఫ్) విడుదలలో అంతా అనుకున్నట్టే జరిగింది. వచ్చే ఏడా ది నుంచి కేంద్రం ఈ పథకాన్ని ఎత్తివేయనున్నట్లు ప్రచా రం జరిగినా, 2014-15 ప్రతిపాదనలకు సైతం మోక్షం కలగలేదు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇటీవలే బీఆర్జీ నిధులు విడుదల కాగా, ఆ జాబితాలో ఉన్న జిల్లాకు మొండిచెయ్యే ఎదురైంది. ఈ నెలాఖరు వరకైనా జిల్లా నుంచి ప్రతిపాదించిన రూ.25.34 కోట్ల విలువ చేసే 1,934 పనులకు నిధులు వస్తాయని అందరూ భావించారు. ఆ నిధులు విడుదల కాకపోగా, వచ్చే సంవత్సరం నుంచి బీఆర్జీఎఫ్ ఉండబోదని ఇదివరకే సంకేతం ఇచ్చిన కేంద్రం ఈ బడ్జెట్లో కేటా యింపులు కూడ ఇవ్వలేదు. దీంతో వచ్చే ఏడాది మాట పక్కనబెడితే, ఈ ఏడాది నిధులూ నిలిచిపోవడంపై నిరాశ వ్యక్తం అవుతోంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలు ముందే పంపినట్లరుుతే ఈ సమస్య ఉండేది కాదు. జిల్లా పరిషత్ అధికారులు గ్రామాలు, మండలాలవారీగా ప్రతిపాదనలు తెప్పించి ప్ర భుత్వామోదంతో హైపవర్ కమిటీకి పంపే ప్రయత్నం చేసినా, అదే సమయంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మార్పులు, చేర్పులకు పట్టుబట్టడం, జడ్పీ, డీపీ సీలలో ఆమోదించి పంపడంలో ఆలస్యం జరిగింది. ఫలితంగా ‘కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన’ చందంగా మారింది. ఆలస్యమే అసలు కారణం జిల్లాలోని 36 మండలాలు నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీల నుంచి 1934 పనుల కోసం రూ.25.34 కోట్లకు ప్రతిపాదనలు 2014 జూన్ వరకు ఢిల్లీ హైపవర్ కమిటీకి చేరివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న చర్చ ఉంది. అధికారులు ఇదే ఉద్దేశ్యంతో పనులకు మే మాసంలోనే ప్రతిపాదనలు కో రారు. అప్పుడున్న ప్రత్యేకాధికారులు వాటిని సిద్ధం చేసి పంపించారు. అప్పుడున్న కలెక్టర్ సిఫారసుతో ప్రభుత్వం ద్వారా కేంద్ర హైపవర్ కమిటీకి పంపిచేందుకు స న్నాహాలు చేస్తున్న క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మ్రోగింది. ఎన్నికల ప్రక్రియలో మునిగిపోయిన అధికారులు బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలను పక్కబెట్టారు. ఆ తర్వాతైన పంపేందుకు కొత్త పాలకవర్గంతో జడ్పీ సర్వసభ్యసమావేశం, డీపీసీ ఆమోదం కోసం ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యు లు, జడ్పీటీసీ సభ్యులు ప్రతిపాదనలలో తేడా వచ్చిందంటూ మార్పులు, చేర్పులకు దిగారు. దీంతో కొంతకాలం వేచి చూసిన అధికారులు బీఆర్జీఎఫ్ మార్గదర్శకాల ప్రకారం పనుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అరుుతే, వాటిని ఢిల్లీ హైపవర్ కమిటీకి చేరవేయడంలో జరిగిన జాప్యం కారణంగానే నిధుల విడుదలకు అంతరాయం కలిగినట్లు చెబుతున్నారు. కమిషనర్ కాన్ఫరెన్స్‌తో స్పష్టత పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనిత రాంచంద్రన్ బీఆర్జీ నిధులపై స్పష్టత ఇవ్వడంతో ఆ నిధుల విడుదలపై భ్రమలు తొలగాయి. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె భవిష్యత్‌లో బీఆర్జీఎఫ్ నిధులుండవని పేర్కొంటూ చివరగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కే టాయించినట్లు స్పష్టం చేశారు. ఒకవేళ బీఆర్జీఎఫ్ విడుదలైతే గ్రామ పంచాయతీలలో 1,255 పనులకు రూ.1012.40 లక్షలు, మండల పరిషత్‌లకు 346 పనులకు రూ . 607.30లక్షలు, జిల్లా పరిషత్ 174 పనులకు రూ.405 లక్షలు, మున్సిపాల్టీలు 135 పనులకు గాను రూ.509.30 లక్షలు ఖర్చు చేసే అవకాశం ఉండేది. పాత ప్రతిపాదనలు తిరస్కరణకు గురి కాగా, 2015-16 కోసం సిద్ధం చేసిన ప్రతిపాదనలు కూడా ఇక ఉత్తవే కానున్నాయి. -
ఇది తగునా బాబూ..
అనంతపురం సెంట్రల్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి(బీఆర్జీఎఫ్) మంజూరులో జిల్లాకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. కరువు జిల్లాను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరుకు రూ. 26.06 కోట్ల బీఆర్జీఎఫ్ నిధులను తన్నుకుపోయారు. ఫలితంగా రూ. 43.91 కోట్లతో జిల్లా పరిషత్ పంపిన ప్రతిపాధనలు చెత్తబుట్టకే పరిమితమయ్యాయి. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ఈ జిల్లాపై ముఖ్యమంత్రికి కరుణ లేకపోవడం శోచనీయమని పలువురు జెడ్పీటీసీలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెలితే.. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ప్రధానంగా అమలవుతున్న పథకాలలో బీఆర్జీఎఫ్ ముఖ్యమైనది. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రతి సంవత్సరం ఈ పథకం ద్వారా రూ. కోట్లు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 90శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కలుపుకుని బీఆర్‌జీఎఫ్‌కు నిధులు విడుదలవుతున్నాయి. జిల్లాకు మంజూరైన ఈ నిధులను జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు, శానిటేషన్, భవన నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలకు మాత్రమే ఈ పథకం ద్వారా నిధులు మంజూరవుతున్నాయి. రాయలసీమలో అనంతపురం, వైఎస్సార్ జిల్లా, చిత్తూరు, కోస్తాలో విజయనగరం జిల్లాకు మాత్రమే బీఆర్జీఎఫ్ నిధులు విడుదలవుతాయి. బీఆర్జీఎఫ్ ప్రతిపాదనలు పంపడంలో చిత్తూరు జిల్లా అధికారులు పూర్తిగా వెనుకబడ్డారు. ప్రతిపాధనలు కూడా గందరగోళంగా ఉండడంతో ఆ జిల్లా జెడ్పీ సీఈఓ ఢిల్లీకి వెళ్లివచ్చినట్లు సమాచారం. అయితే అన్ని జిల్లాల కన్నా ముందే అనంతపురం జిల్లా పరిషత్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాధనలు వెళ్ళాయి. అన్ని అంశాలు సక్రమంగా రూపొందించి పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కూడా జిల్లా ప్రజాప్రతినిధులు తీసుకుపోయారు. రూ.43.91 కోట్లకు ప్రతిపాధనలు పంపగా అందులో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ. 32.05 కోట్లు, పట్టణ ప్రాంతాల అభివృద్ధి (మున్సిపాలిటీలకు) రూ.11.86 కోట్లుగా కేటాయించారు. గ్రామీణా ప్రాంతాలకు కేటాయిస్తున్న నిధుల్లో పంచాయతీలకు (50శాతం) రూ. 16.02 కోట్లు, మండల పరిషత్‌లకు(30శాతం) రూ. 9.61 కోట్లు, జిల్లా పరిషత్‌కు (20శాతం) రూ. 6.41 కోట్లుగా విభజించారు. అయితే బీఆర్జీఎఫ్ నిధులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబునాయుడు మొండిచెయ్యి చూపడంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అందరికన్నా వెనుక ప్రతిపాధనలు పంపినా సీఎం సొంత జిల్లా కావడంతో చిత్తూరుకు నిధులు విడుదల కావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా లోటు బడ్జెట్‌తో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యే బీఆర్జీఎఫ్ పథకం ద్వారా జిల్లాకు నిధులొస్తాయని ప్రజాప్రతినిధులంతా భావించారు. జెడ్పీటీసీ సభ్యులుగా గెలుపొంది ఏడాది కావస్తోందని, ఇంత వరకూ ప్రభుత్వం నుంచి నయా పైసా మంజూరుకాలేదని, కనీసం మంచినీటి కుళాయి వేయించేందుకు కూడా వద్ద నిధుల్లేవని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బీఆర్జీఎఫ్ నిధులకోసం ప్రతిపాదనలు పంపామని, త్వరలో మంజూరవుతాయని ఆశతో నెట్టుకొస్తున్నారు. సోమవారం ప్రభుత్వ కార్యదర్శి(పంచాయతీరాజ్) జవహార్‌రెడ్డి విడుదల చేసిన జీవో 268తో వారి ఆశలు ఆవిరైపోయాయి. చిత్తూరు జిల్లాకు మాత్రమే ఈ ఏడాది బీఆర్జీఎఫ్ అని.. మిగిలిన జిల్లాలకు ఉండకపోవచ్చునని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి.