21 జిల్లాలకు ‘వెనుకబడిన’ హోదా
సీబీడీటీ నోటిఫికేషన్ జారీ
పరిశ్రమలు, భవనాల్లో పెట్టుబడులకు ఆదాయపన్ను రాయితీ
ఏపీ, తెలంగాణల్లో వెనుకబడిన జిల్లాల తరహా ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. బిహార్ రాజధాని పట్నా సహా ఆ రాష్ట్రంలోని 21 జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ఆ జిల్లాల్లో కొత్త తయారీ పరిశ్రమలు, భవనాల ఏర్పాటుకు 15 శాతం ఆదాయపన్ను రాయితీ లభించనుంది. ఆదాయపన్ను శాఖలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) దీనికి సంబంధించి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 32, 32ఏడీ కింద.. పట్నా, నలంద, భోజ్‌పూర్, రోహత్తాస్, కైమూర్, గయ, జహానాబాద్, ఔరంగాబాద్, నవద, వైశాలి, షోహార్, సమస్తిపూర్, దర్భంగ, మధుబని, పుర్ణియా, కతిహార్, అరారియా, జముయ్, లఖీసరాయ్, సుపౌల్, ముజఫర్‌పూర్ - 21 జిల్లాలను చేర్చింది.
దీనిప్రకారం.. ఆయా జిల్లాల్లో భవనాలు, కొత్త పరిశ్రమలు, యంత్రాలపై పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 15 శాతం తక్కువ ఆదాయపన్ను చెల్లిస్తారు. కొత్తగా విభజించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు, ఆర్థిక తోడ్పాటును అందించే ఉద్దేశంతో.. 2015 ఆర్థిక బిల్లులోని ఐటీ చట్టంలో 32ఏడీ సెక్షన్‌ను చేర్చారు. ఈ సెక్షన్ కింద పేర్కొన్న వెనుకబడిన ప్రాంతాల్లో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ మొదలుకొని 2020 ఏప్రిల్ 1వ తేదీ ముందు వరకూ నెలకొల్పే పరిశ్రమలు, వాటిలో పెట్టే పెట్టుబడులకు ఆదాయపన్ను రాయితీ వర్తిస్తుంది.