మోనికాదాస్ : బ్యాంకు ఉద్యోగి, ప్రస్తుత ఎన్నికలకు శిక్షణ పొందనున్న ప్రిసైడింగ్ ఆఫీసర్
ఓకే ఒక రోజుకు పోలింగ్ ఆఫీసర్. వచ్చేది లేదు, పోయేది లేదు. ‘చేస్తావా అమ్మా!’ అంది ఎలక్షన్ కమిషన్. ‘అమ్మా’ అన్నందుకైనా చేయాలనుకుంది.అమ్మ, మేడమ్, అమ్మాయ్.. మోనిక కోరుకున్న జెండర్ ఐడెంటిటీ! దేశంలోనే తొలిసారిగా.. ప్రిసైడింగ్ ఆఫీసర్ డ్యూటీ చేయబోతున్న ట్రాన్స్‌జెండర్ ఉమన్ మోనిక! బిహార్ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్‌లో ఆమె కనిపిస్తారు. ట్రాన్స్ ఉమెన్‌కు గౌరవాన్ని తెచ్చిపెట్టి..తన బ్యాంక్ డ్యూటీకి తను వెళ్లిపోతారు.
ఉద్యోగం వచ్చాక మోనికాదాస్ జీవితమే మారిపోయింది. ఆఫీస్‌లో అంతా ఆమెను గౌరవంగా చూస్తున్నారు. గౌరవంగా చూడదగని వ్యక్తేమీ కాదు ఆమె. అయితే గౌరవం అనే మాట ఎందుకు వచ్చింది? సమాజం తననొక స్త్రీగా గుర్తించాలని మోనికాదాస్ కోరుకుంది. స్త్రీలాగే బట్టలు వేసుకుంది. స్త్రీలా అలంకరించుకుంది. స్త్రీ సహజసిద్ధమైన కోమలత్వంలోకి తనని తను ఇముడ్చుకుంది. గోపాల్ కుమార్ అనే ఒక అబ్బాయి మోనికాదాస్ అనే అమ్మాయిగా కళ్లముందే మారిపోతూ ఉంటే ఆమెను ఏదో ఒకటి అనకుండా ఆమె జీవితాన్ని ఆమెకే వదలిపెట్టడానికి సమాజానికి చాలానే సమయం పట్టింది. ఎంత సమయం అంటే, ఆమె తన 27వ యేట పాట్నాలోని కంకర్‌బాగ్ కెనరా బ్యాంక్ బ్రాంచి ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరేవరకు! 2015లో ఆమె ఆ ఉద్యోగంలోకి వచ్చారు.
ఆ క్రితం ఏడాదే ఆమె తన పేరును అధికారికంగా మోనికాదాస్ అని మార్చుకున్నారు. ఆఫీస్‌కి, ఆఫీస్ బయటికి తొలిరోజే వ్యత్యాసాన్ని గమనించారు మోనిక. ‘మేడమ్..టీ’ అన్నాడు ఆఫీస్ బాయ్ వచ్చి, సంశయంగానే అయినా సవినయంగా ఆమె కేబిన్‌లో టీ కప్పును పెడుతూ! అదెంతో సంతోషాన్నిచ్చింది మోనికకు. మిగతా స్టాఫ్ కూడా ఆమెతో చాలా మర్యాద గా ఉన్నారు. అక్కడికి దగ్గర్లోని కంకర్‌బాగ్ ఆటో స్టాండ్ సమీపంలోని సాయి మందిర్ దగ్గర ఉంటుంది మోనిక కుటుంబం. అమ్మ నాన్న, ఒక తమ్ముడు. పెద్ద తమ్ముడి పెళ్లి ఈ మధ్య జరిగింది. ఆ తమ్ముడి పెళ్లికి చీరకట్టుకునే వెళ్లారు మోనిక. ఎవరూ అభ్యంతరపెట్టలేదు. తను అమ్మాయిగానే ఉంటాను అన్నప్పుడు ఆమెను సపోర్ట్ చేసింది మొదట ఆమె తల్లిదండ్రులే. ఐదేళ్ల క్రితం బిహార్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ మహిళా బ్యాంకు ఉద్యోగిగా గుర్తింపు పొందిన మోనికాదాస్ ఈసారి దేశంలోనే తొలిసారి పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ విధులను నిర్వహించబోతున్న ట్రాన్స్‌జెండర్ ఉమన్‌గా వార్తల్లోకి వచ్చారు!
పాట్నా యూనివర్శిటీలో ‘లా’ చేశారు మోనికాదాస్. ‘లా’లో గోల్డ్ మెడలిస్ట్. పాట్నా నవోదయ విద్యాలయలో స్కూల్ చదువు. స్కూల్లో ‘బ్రిలియంట్ బాయ్’ అనే వారు తనను. ఆ ప్రశంసను ‘బ్రిలియంట్’ అన్నంత వరకే ఆమె స్వీకరించగలిగేది. బాయ్స్‌లా బట్టలు వేసుకోబట్టే కదా తనను అంతా బాయ్ అంటున్నారని బాధపడేది. ఆడపిల్లలా స్కూల్‌కి తయారై రావాలని, ఆడపిల్లల్తో కలిసి కూర్చోవాలని తపించేది. ‘అది అసాధ్యం బాబూ..’ అని ఎప్పటికప్పుడు ఆమెకు ఎవరో ఒకరు చూపులతో, మాటలతో తెలియబరుస్తూనే ఉండేవారు. కాలేజ్‌లో కూడా అంతే. ఉద్యోగం లో చేరాక మాత్రమే ఆమెకు పూర్తి స్వేచ్ఛ లభించింది. మనసా వాచా పూర్తిగా ఒక యువతిలా మారిపోయేందుకు వీలైంది. ఇప్పుడీ కొత్త గుర్తింపుతో (దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ ఉమన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అనే గుర్తింపు) బిహార్‌లో ఉన్న నలభై వేల మంది ట్రాన్స్‌జెండర్‌లకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని మోనికా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు, గౌరవం మాత్రమే కాదు, ‘మేము ఫలానా’ అని ధైర్యంగా బయటికి వచ్చి చెప్పుకునే ఆత్మవిశ్వాసం కూడా వారికి తన వల్ల చేకూరుతుందని ఆమె ఆశిస్తున్నారు. అసలందుకే.. ‘చేస్తావా? అమ్మా’ అని ఎలక్షన్ కమిషన్ అడగ్గానే ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా చేయడానికి ముందుకు వచ్చారు మోనికాదాస్.
పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా మోనికాదాస్ ఈ కోవిద్ సమయంలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది. బిహార్‌లో అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీలలో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మోనికాదాస్ రెండో విడత పోలింగ్‌లో పాట్నాలోని ఏదైనా ఒక బూత్‌కు పర్యవేక్షణ అధికారిగా ఉంటారు. పోలింగ్ సజావుగా జరిగేలా చూడటం, ఈవీఎంల పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండటం, జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన ఉత్తర్వులను తు.చ.తప్పకుండా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడం, బ్యాలెట్ బాక్సుల భద్రత.. ఇవన్నీ ఆమె చూసుకోవలసి ఉంటుంది. ఇందుకోసం అక్టోబర్ 8న పట్నాలోని గర్దానీబాగ్‌లో మోనికాదాస్‌తోపాటు మరికొందరు ఆఫీసర్‌లకు ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వబోతోంది.
ప్రజాస్వామ్య వ్యవస్థాపనకు అత్యంత ముఖ్యమైన ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం పొందడాన్ని ఒక ట్రాన్స్‌పౌరురాలిగా నేను గర్విస్తున్నాను’’ అని అంటున్నారు మోనికాదాస్. తొలిసారి 2016 పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రియా సర్కార్ అనే ట్రాన్స్‌జెండర్ ఉమన్ కోల్‌కతాలో పోలింగ్ ఆఫీసర్‌గా చేశారు. మోనికాదాస్ ప్రిసైడింగ్ ఆఫీసర్.
Comments
Please login to add a commentAdd a comment