1952 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యమిదీ...
రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇలా..
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 మంది మహిళలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారిలో కాంగ్రెస్ నుంచి జె.గీతారెడ్డి, డీకే అరుణ విజయం సాధించగా టీఆర్‌ఎస్ నుంచి అజ్మీరా రేఖ, బొడిగె శోభ, గొంగిడి సునీత, కొండా సురేఖ, కోవా లక్ష్మి, పద్మాదేవేందర్‌రెడ్డి గెలుపొందారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన మహిళల సంఖ్య ఆరుకు తగ్గింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సీతక్క (అనసూయ), సబితారెడ్డి, బానోత్ హరిప్రియ గెలుపొందగా, టీఆర్‌ఎస్ నుంచి అజ్మీరా రేఖ, గొంగిడి సునీత, పద్మాదేవేందర్‌రెడ్డి విజయం సాధించారు.
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో సగభాగం అంటూ మహిళలను పొగడటం తప్ప అవకాశాలపరంగా వెనుకబాటులో ఉన్నారు. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు దాదాపు 71 ఏళ్ల కాలంలో మహిళలు ప్రాతినిధ్యం వహించని అసెంబ్లీ నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి. 1952లో అసెంబ్లీ ఎన్నికలు మొదలు 2018 ఎన్నికల వరకు రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళల ప్రాతినిధ్యం పరిశీలిస్తే కేవలం 51 సెగ్మెంట్లలోనే అడపాదడపా కనిపించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 70 స్థానాల్లో ఇప్పటివరకు మహిళల ప్రాతినిధ్యమే లేకపోవడం గమనార్హం. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు బరిలోకి దిగిన సందర్భాలు అత్యంత పరిమితంగానే ఉన్నాయి.
మహిళా రిజర్వేషన్లతోనే..
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలనే డిమాండ్ కొన్నేళ్లుగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్‌లో మహిళా బిల్లు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. తాజాగా మహిళా బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనేది ఈ చట్టం సారాంశం. అన్ని స్ధానాల్లో మహిళలకు అవకాశం లభించేలా రొటేషన్ పద్ధతిని ఈ చట్టంలో పొందుపరిచారు. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో సగానికిపైగా అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు ఇప్పటివరకు అవకాశం దక్కకపోగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో మహిళా రిజర్వేషన్లు అమలైతే వారి ప్రాతినిధ్యం అమాంతం పెరగనుంది.
ఒక్కసారి కూడా మహిళా ప్రాతినిధ్యం లేని స్థానాలు..: చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్, బోధన్, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, వేములవాడ, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్, సిద్దిపేట, నారాయణఖేడ్, సంగారెడ్డి, పటాన్‌చెరు, దుబ్బాక, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, తాండూరు, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చారి్మనార్, చాంద్రాయణగుట్ట, యాఖుత్‌పుర, కొడంగల్, నారాయణపేట్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, మునుగోడు, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, వరంగల్ వెస్ట్, వర్దన్నపేట, భూపాలపల్లి, పినపాక, పాలేరు, మంథని, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, సనత్‌నగర్, బహదుర్‌పురా.
తొలి ఓటరు రంభాబాయి
కాగజ్‌నగర్ రూరల్: కుమురం భీం జిల్లా సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్ మండలం మాలిని గ్రామ పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్రంలో మొదటి పోలింగ్ కేంద్రంగా గుర్తించారు. ఫలితంగా ఈ గ్రామానికి చెందిన ఆత్రం రంభాబాయికి తొలి ఓటరుగా అవకాశం దక్కింది. గతంలో సుర్పం మారుబాయి తొలి ఓటరుగా ఉండగా, ఇటీవల ఎన్నికల అధికారులు ఇంటి నంబరు ఆధారంగా ఓటరు జాబితాను సవరించగా రంభాబాయి రాష్ట్రంలో తొలి ఓటరుగా మారారు.
ఈ పోలింగ్ కేంద్రంలో 430 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 208, మహిళలు 222 మంది ఉన్నారు. మాలిని పోలింగ్ కేంద్రం కాగజ్‌నగర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో గుట్టల మధ్యలో ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే సిర్పూర్(టీ) మండల కేంద్రం నుంచి చీలపెల్లి మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
సమస్యలతో సతమతం ..: మాలినిగ్రామానికి సరైన రోడ్డు లేదు. రాళ్లురప్పలతో కంకర తేలిన రోడ్డు ఉండడంతో జనం అవస్థలకు గురవుతున్నారు. సిర్పూర్(టీ) నుంచి మాలిని గ్రామానికి వెళ్లే మార్గమధ్యంలో రెండు ఒర్రెలపై కల్వర్టులు లేకపోవడంతో వర్షాకాలంలో వాహనాలు వెళ్లలేని పరిస్థితి.. మిషన్ భగీరథ పైపులు వేసినప్పటికీ నల్లాల్లో నీరు రావడం లేదు. గ్రామంలోని చేదబావికి మోటార్లు బిగించుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు. అడవి మధ్యలో ఉన్న ఈ గ్రామంలో సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ఫోన్లు కూడా పనిచేయవు.
ప్రతీసారి ఓటు వేస్తున్నా...
నాకు ఓటుహక్కు వచ్చినప్పటి నుంచి వినియోగించుకుంటున్నా. రాష్ట్రంలో తొలి ఓటరుగా చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. అయితే మా ఊరిలో కనీస సౌకర్యాలు లేక బాధపడుతున్నాం. అధికారులు, నాయకులు పట్టించుకుని సౌకర్యాలు కల్పించాలి. – రంభాబాయి, మాలిని
Comments
Please login to add a commentAdd a comment