లక్నోలో ప్రియాంక ప్రకటనపై కాంగ్రెస్ శ్రేణుల హర్షం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ఆ ఎన్నికల్లో 40% టికెట్లను మహిళలకు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం ప్రకటించారు. దీంతో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పక్షాన 161 మంది మహిళా అభ్యర్థులు బరిలో ఉంటారు. ప్రియాంక మంగళవారం లక్నోలో మీడియాతో మాట్లాడారు. మహిళలు రాజకీయాల్లో చేరాలని ఈ సందర్భంగా ప్రియాంక పిలుపునిచ్చారు. బరిలో నిలవాలనుకునే వారు నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
మహిళలకు ఉత్తరప్రదేశ్‌లో హక్కు లభిస్తే, ఇదే హక్కును కేంద్రంలో కూడా పొందుతారని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు కేటాయించే సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ మహిళా అభ్యర్థులకు పూర్తి సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో గళం వినిపించలేని వారి తరఫున తాను పోరాడుతున్నానన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 40% మహిళా అభ్యర్థులను బరిలో నిలబెట్టడం ద్వారా కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా మహిళల మద్దతును కాంగ్రెస్ పొందగలదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు, ఓట్ల శాతం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
చదవండి: Punjab: కెప్టెన్ సొంత పార్టీ!
Comments
Please login to add a commentAdd a comment