ఆ బిల్లులు ఆమోదించాలి | Telangana CM KCR writes to PM Modi seeking passage of womens quota bill in special Parliament session | Sakshi
Sakshi News home page

ఆ బిల్లులు ఆమోదించాలి

Published Sat, Sep 16 2023 3:15 AM | Last Updated on Sat, Sep 16 2023 3:15 AM

Telangana CM KCR writes to PM Modi seeking passage of womens quota bill in special Parliament session - Sakshi

బీఆర్‌ఎస్‌పీపీ సంయుక్త సమావేశంలో ఎంపీలతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

మహిళలకు సమానావకాశాలతోనే అభివృద్ధి
మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకా శాలు లభించినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని బీఆర్‌ఎస్‌పీపీ పేర్కొంది. మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తీరుపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర మొదటి అసెంబ్లీ సమావేశా ల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశా రు. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ మరో తీర్మానాన్ని కూడా బీఆర్‌ఎస్‌పీపీ ఆమోదించింది.

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మహిళలకు పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లులను ఆమోదించాలని కోరుతూ భారత్‌ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (బీఆర్‌ఎస్‌ పీపీ) సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్ల మెంటు ప్రత్యేక సమావేశాల్లోనే వీటిని ఆమోదించాలని డిమాండ్‌ చేసింది. పార్లమెంటు సమావేశా లు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బీఆర్‌ఎస్‌పీపీ సంయుక్త సమావేశం జరిగింది.

పార్లమెంటు, శాసన సభల్లో ఓబీసీలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా బీఆర్‌ ఎస్‌ ఎంపీలు అనుసరించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, వెనుక బడిన తరగతుల అభ్యున్నతి కోసం బీఆర్‌ఎస్‌ కట్టుబడి ఉందని కేసీఆర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వారి హక్కులు కాపాడేందుకు దేశ వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుంద న్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ డిమాండ్లను ఎంపీలు లేవనెత్తాలని, అందుకు అవసరమైన సమాచారంతో సిద్ధం కావాలని సూచించారు. 

దేశ సంపదలో ఓబీసీల కీలక భాగస్వామ్యం
తమ వృత్తుల ద్వారా దేశ సంపదను సృష్టించడంలో కీలక భాగస్వాములైన ఓబీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యత కల్పించేలా 33 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని బీఆర్‌ఎస్‌పీపీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా ఉంటున్న ఓబీసీ కులాలను సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉందనే అభి ప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు, కార్యాచరణ మంచి ఫలితాలు ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ ని ఎంపీలు అన్నారు.

రాజకీయ అధికారంలో ఓబీసీ ల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వా రు పూర్తి స్థాయిలో అభివృద్ది చెందుతారని బీఆర్‌ ఎస్‌పీపీ పేర్కొంది. పార్లమెంటు ప్రత్యేక సమావే శాల్లో ఓబీసీ రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టి చిత్తశు ద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే (14 జూన్‌ 2014) ఓబీసీ రిజర్వే షన్‌ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని గుర్తు చేసింది. తొమ్మిదేళ్లు కావస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. 

17న కేంద్రం ఏమంటుందో చూద్దాం
ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు సమా వేశాల్లో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నియామకానికి సంబంధించిన బిల్లుతో పాటు ఇతర బిల్లులు చర్చకు వస్తాయని కేంద్రం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఎజెండాలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌పీపీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ‘ఈ నెల 17న కేంద్రం అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించే అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై వ్యూహాన్ని రూపొందించుకుందాం. ఒకవేళ జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌర స్మృతి వంటి అంశాలు ప్రస్తావనకు వస్తే మన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేద్దాం.

ఈడీ నోటీసులు జారీ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నందున ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే, మరోవైపు రాజకీయంగా ఎదుర్కొనేందుకు కూడా వెనుకాడేది లేదు. మహిళలు, ఓబీసీల రిజర్వేషన్‌ బిల్లులపై ఒత్తిడి చేయడం ద్వారా బీజేపీ అసలు స్వరూపం పడుతుంది..’ అని కేసీఆర్‌ అన్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, పార్టీ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు.

వారికి 33% రిజర్వేషన్‌ కల్పించండి ప్రధాని మోదీకి కేసీఆర్‌ లేఖలు
చట్టసభల్లో మహిళలు, ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ కోరారు. ఈ మేరకు రెండు వేర్వేరు లేఖలు రాశారు. వచ్చే పార్లమెంటు సమావేశా ల్లో బిల్లులు ప్రవేశ పెట్టాలని శుక్రవారం బీఆర్‌ఎస్‌పీపీ తీర్మానించిన నేపథ్యంలో ముఖ్య మంత్రి ఈ లేఖలు రాశారు. ‘శతాబ్దాలుగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమా పేందుకు ముందుచూపుతో రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు కల్పించిన విషయం మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది.

పార్లమెంటు, శాసనసభల్లోనూ మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభ 2014లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి చొరవను తీసుకోలేదు. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనైనా బిల్లు ఆమోదానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను..’ అని ఒక లేఖలో కేసీఆర్‌ పేర్కొన్నారు. ఓబీసీలకు కోటాపై సీఎం మరో లేఖ రాశారు. ‘విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్‌ ఫలాలు కొంతమేర దక్కినా చట్టసభల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేదు. ఇప్పటికైనా కేంద్రం 33 శాతం కోటా బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలి..’ అని కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement