letters
-
అంగన్వాడీలను క్రమబద్దీకరించాలి
కార్వేటినగరం: అంగన్వాడీ కార్యకర్తలను సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం క్రమబద్దీకరించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా కార్వేటినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ సిబ్బంది సిఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రపతికి లేఖలు రాశారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అలాగే హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు విజయ, మమత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడిలను నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు తీర్పు ప్రకారం ఐసీడీఎస్‌ను సంస్థాగతం చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు సంస్థాగతం చేయకపోవడం దారుణమన్నారు. శిశు, మరణాలు రేటు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల కొద్ది పని చేస్తున్న అంగన్వాడీలపై పనిభారం పెంచడంతో రకరకాల పద్ధతుల్లో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఆధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అంగన్వాడీల వద్ద డబ్బులు వసూలు చేసే కార్యక్రమం తీవ్రమైందన్నారు. చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా పోషణ వాటిక సెంటర్లను నిర్వహించడం అధికారులకు కాసుల పంటగా మారిందన్నారు. దీంతో అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఆరోపించారు. అధికారుల ఒత్తిడి మానక పోతే నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టులో ఒకరిద్దరు నాయకులుగా చెలామణి అవుతూ అధికారులకు తొత్తులుగా ఉంటూ అంగన్వాడీలను బెదిరించే పనులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డెమ్మ (శ్రీరంగరాజపురం) పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
‘రోజ్‌గార్ మేళా’లో పాల్గొననున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు(సోమవారం) యువతకు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వర్చువల్‌గా జరిగే ‘రోజ్‌గార్ మేళా’లో ప్రధాని పాల్గొని యువతతో ఆయన సంభాషించనున్నారు.కేంద్ర ప్రభుత్వంలోని పలుశాఖల్లోని విభాగాలలో పలు ఉద్యోగాలకు ఎంపికైన 71 వేల మంది యువతీయువకులకు ప్రధాని మోదీ నియామక పత్రాలను అందజేయనున్నారు. ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా కార్యక్రమం జరగనుంది. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం ఆయా రాష్ట్రాల్లోని కేంద్ర మంత్రులు అభ్యర్థులకు నియామక పత్రాలను స్వయంగా అందజేయనున్నారు.హోమ్‌శాఖ, తపాలా విభాగం, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం తదితర శాఖల్లో 71 వేల ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఒక ప్రకటనలో వివరించింది. రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం. ఇది జాతి నిర్మాణంతో పాటు స్వయం ఉపాధిలో యువత భాగస్వామ్యానికి అవకాశాలను కల్పిస్తుంది. రాష్ట్రస్థాయిల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ రోజ్‌గార్ మేళాలను నిర్వహిస్తుంటాయి. దేశంలో యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఉపాధి మార్గాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రోజ్‌గార్ మేళాను నిర్వహిస్తుంటారు. ఇది కూడా చదవండి: ఇంకా ఆందోళనకరంగానే పరిస్థితి! -
రాహుల్ గాంధీకి ప్రధాని మ్యూజియం లేఖ
న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలను, మరికొన్ని పత్రాలను వెనక్కి ఇచ్చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని, ప్రధానమంత్రి సంగ్రహాలయం కోరింది. సోనియా గాంధీ వాటిని తీసుకెళ్లారని.. వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ మ్యూజియం సభ్యుడొకరు ఆయనకు లేఖ రాశారు.2008 యూపీఏ పాలనలో.. అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అప్పటి పీఎంఎంఎల్(Prime Ministers' Museum and Library) డైరెక్టర్ అనుమతితో ఆ పత్రాలన్నింటిని తీసకెళ్లారు. అయితే వాటిని ఇప్పుడు వెనక్కి ఇవ్వాలంటూ పీఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ ఖాద్రి, రాహుల్‌కు లేఖ రాశారు. ఒకవేళ ఒరిజినల్ లేఖలు ఇవ్వడం ఇష్టంలేని తరుణంలో ఫొటోకాపీలు లేదంటే డిజిటల్ కాపీలైనా ఇవ్వాలని కోరారు.అయితే ఈ పత్రాల గురించి నెహ్రూ కుటుంబాన్ని కోరడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మ్యూజియం వార్షిక సమావేశం జరిగింది. అందులో.. నెహ్రూ సంబంధిత లేఖలు, ఇతరత్రా పేపర్లు కనిపించకుండా పోవడంపై చర్చ జరిగింది. చారిత్రకంగా అవి ఎంతో ప్రాధాన్యం పత్రాలుగా అభిప్రాయపడుతూ.. వాటిని ఎలాగైనా వెనక్కి రప్పించాలని పీఎంఎంఎల్ మండలి నిర్ణయించింది. ఈ విషయంలో అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావించింది. ఈ మేరకు.. సెప్టెంబర్‌లో సోనియా గాంధీని కోరుతూ ప్రధాని మ్యూజియం ఓ లేఖ రాసింది. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు రాహుల్ గాంధీకి మరో లేఖ రాసింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న టైంలో పలు కీలక పత్రాలు సైతం.. ఆ సేకరణలో ఉన్నట్లు పీఎంఎంల్ భావిస్తోంది. అలాగే.. ఎడ్విన్ మౌంట్‌బాటెన్, అల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ లాంటి ప్రముఖలతో నెహ్రూకు మధ్య జరిగిన ఉత్తర-ప్రత్యుత్తరాలు ఆ కలెక్షన్స్‌లో ఉన్నాయి.నెహ్రూ దస్తూరితో ఉన్న ఈ లేఖలను 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో(ఇప్పుడదే ప్రధానుల మ్యూజియంగా మారింది) భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో వాటిని సుమారు 51 బాక్సుల్లో సోనియా గాంధీ నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పీఎంఎంల్ మండలి కాలపరిమితి ఈ నవంబర్లోనే ముగియాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో.. ఆ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగించడం గమనార్హం.ఇదీ చదవండి: ‘తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నెహ్రూ పేరు వాడుకుంటున్నారు’ -
తాతలు ఉత్తరాలు బట్వాడా చేసేవారని..
బహ్రాయిచ్ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అత్యంత విచిత్రమైన రీతిలో పొట్టపోసుకుంటున్నాడు. జిల్లాకు చెందిన సురేష్ కుమార్ గత 40 ఏళ్లుగా పోస్ట్‌మ్యాన్ రూపంలో ఇంటింటికీ తిరుగుతున్నాడు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ, తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ వింత పంథాను ఎంచుకున్నాడు. తన తాత, ముత్తాతల కాలం నుంచి తమ కుటుంబంలోని వారు ఉత్తరాలు బట్వాడా చేసేవారని సురేష్ కుమార్ మీడియాకు తెలిపారు. పూర్వంరోజుల్లో అతని పూర్వీకులు బ్రిటీష్ వారికి ఉత్తరాలు అందజేసేవారట. ఇప్పుడు సురేష్ పోస్ట్‌మ్యాన్ గెటప్‌తో అందరినీ పలుకరిస్తున్నాడు. దీనికి ప్రతిఫలంగా వారు ఏది ఇచ్చినా తీసుకుంటూ, దానితో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.సురేశ్ ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పోస్ట్‌మ్యాన్ వేషధారణతో తిరుగుతుంటాడు. ఇంటింటికీ వెళ్లి మీ పేరు మీద ఉత్తరం వచ్చిందని వారికి చెబుతుంటాడు. వారు తొలుత అతనిని పోస్ట్‌మ్యాన్‌గా భావిస్తారు. తరువాత విషయం తెలుసుకుని, ఆనందంగా తమకు తోచినంత సురేష్‌కు ముట్టజెపుతుంటారు.స్థానికులు అతనిని పోస్ట్‌మ్యాన్ అని పిలుస్తుంటారు. సురేష్ కుమార్ పోస్ట్‌మ్యాన్ యూనిఫాం ధరించి, తలపై టోపీ పెట్టుకుంటాడు. అలాగే కళ్లద్దాలు కూడా పెట్టుకుంటాడు. చేతిలో వైర్లెస్ వాకీ-టాకీ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలుగొందిన ఈ వృత్తిని అనుకరిస్తూ సురేష్ కుమార్ పొట్టపోసుకోవడం విశేషమే మరి.ఇది కూడా చదవండి: ఆ పేరుతో సర్టిఫికెట్ మార్చి ఇస్తాం -
ఐపీఎస్‌లను వెంటనే డెప్యుటేషన్‌పై పంపండి
సాక్షి, అమరావతి: కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రత విభాగాల్లో విధులు నిర్వర్తించడానికి రాష్ట్రాలు డెప్యుటేషన్‌పై ఐపీఎస్ అధికారులను పంపకపోవడంపై కేంద్ర హోం శాఖ అసహనం వ్యక్తం చేసింది. ‘ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్‌పై పంపండి. ఇప్పటికే ఓసారి చెప్పాం. అయినా పంపడంలేదు. ఇది సరైన పద్ధతి కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే కోటా మేరకు ఐపీఎస్ అధికారులను పంపించడి’ అని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శు (సీఎస్)లకు లేఖలు రాసింది. కేంద్ర హోం శాఖ ఈ విధంగా రాష్ట్రాలకు లేఖ రాయడం ఈ ఏడాది ఇది రెండోసారి. కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర భద్రతా విభాగాల్లో రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారులనే డెప్యుటేషన్‌పై నియమిస్తారు. అందుకోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటికి నిర్దేశించిన కోటా ప్రకారం ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్‌పై కొంతకాలం కేంద్ర సర్వీసులకు పంపాల్సి ఉంటుంది. డెప్యుటేషన్ ముగిసి తిరిగి రాష్ట్ర సర్వీసులో చేరిన అధికారుల స్థానంలో మరికొందరిని పంపాలి. కానీ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోటా మేరకు ఐపీఎస్‌లను కేంద్ర సర్వీసులకు పంపడంలేదు. దీనిపై కొన్ని నెలల క్రితం కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. అయినా హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఐపీఎస్ అధికారులను పంపించలేదు. దీనిపై కేంద్ర హోం శాఖ తీవ్రంగా స్పందించింది. ఐపీఎస్ అధికారులను కేంద్రానికి పంపాలని ఇటీవల మరో లేఖ రాసింది.దాదాపు 250 పోస్టులు ఖాళీరాష్ట్రాల నుంచి ఐపీఎస్ అధికారులను డెప్యుటేషన్‌పై పంపించకపోవడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో భారీగా పోస్టులు ఖాళీగా ఉండిపోయాయని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 3 నాటికి ఎస్పీ, ఆ పైస్థాయి అధికారుల పోస్టులు 250 వరకు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక డీజీ, అదనపు డీజీ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ఎస్పీస్థాయిలో 129 పోస్టులు, డీఐజీ స్థాయిలో 81 పోస్టులు, ఐజీ స్థాయిలో 25 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.దర్యాప్తులో జాప్యం.. దేశ భద్రత విధుల్లో ఇబ్బందులుకేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాల్లో ఇంత భారీగా అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. సీబీఐ, ఎన్ఐఏలపై ఇప్పటికే పనిభారం విపరీతంగా పెరిగింది. కీలక కేసుల దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోంది. బీఎస్ఎఫ్, ఐటీబీపీ విభాగాల్లో అధికారుల కొరతతో సరిహద్దుల్లో భద్రత విధుల్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. సీఆర్పీఎఫ్లో అధికారుల కొరత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో తెలిపింది. విభాగాల వారీగా ఖాళీలు» కేంద్ర దర్యాప్తు సంస్థలో 63 డీఐజీ పోస్టుల్లో 30 పోస్టులు దీర్ఘకాలంగా భర్తీ కావడంలేదు. రెండు ప్రత్యేక డైరెక్టర్ జనరల్, 8 అదనపు డైరెక్టర్ జనరల్ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.» కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో 73 ఎస్పీ స్థాయి పోస్టులకుగాను 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి» ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో 36 ఎస్పీ స్థాయి పోస్టులలో 13 భర్తీ చేయాల్సి ఉంది.» కేంద్ర నిఘా విభాగం (ఐబీ)లో 83 ఎస్పీ పోస్టుల్లో 50 ఖాళీగా ఉన్నాయి.» భారత్–చైనా సరిహద్దుల్లో భద్రత విధులు నిర్వర్తించే ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగంలో 11 డీఐజీ పోస్టుల్లో 5 ఖాళీగా ఉన్నాయి. » సరిహద్దు భద్రతా విభాగం (బీఎస్ఎఫ్) లో ఒక అదనపు డీజీ పోస్టు, 26 డీఐజీ పోస్టుల్లో 10 పోస్టులు, 21 ఐజీ పోస్టులకుగాను ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.» కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు (సీఆర్పీఎఫ్)లో 7 డీఐజీ పోస్టులు, 5 ఐజీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. -
యాపిల్‌లో 600 మంది ఉద్యోగులకు ఉద్వాసన
వాషింగ్టన్: టెక్ దిగ్గజం యాపిల్ 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మే 27 నుంచి తొలగింపు వర్తిస్తుందంటూ మార్చి 28న 614 మంది వర్కర్లకు పంపిన లేఖలో యాపిల్ పేర్కొంది. ఈ ఉద్యోగులంతా శాంటా క్లారాలోని ఎనిమిది కార్యాలయాల్లో పని చేస్తున్నారు. కోవిడ్–19 తర్వాత యాపిల్ ఇంత భారీ స్థాయిలో ఉద్వాసనలకు తెర తీయడం ఇదే ప్రథమం. కోవిడ్ సమయంలో భారీగా రిక్రూట్మెంట్ చేపట్టిన చాలా మటుకు టెక్ కంపెనీలు గత రెండేళ్లుగా పెద్ద యెత్తున ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. -
ఖైదీలు నెలకు ఎన్ని లేఖలు రాయవచ్చు?
జైలు ప్రపంచం చాలా విచిత్రమైనది. చాలామంది జైళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఎవరూ జైలుకు వెళ్లాలని కలలో కూడా అనుకోరు. ఎన్సీఆర్బీ అందించిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా 2020’ నివేదికలోని వివరాల ప్రకారం 2020 చివరి నాటికి దేశవ్యాప్తంగా 4.83 లక్షల భారతీయ పౌరులు వివిధ జైళ్లలో ఉన్నారు. వీరిలో 76 శాతానికి పైగా అండర్ ట్రయల్ నిందితులు కాగా, 23 శాతం మంది దోషులుగా తేలిన వారున్నారు. ఈ అండర్ ట్రయల్ ఖైదీలు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కాగా, శిక్ష పడిన వారిలో ఎక్కువ మంది 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే ఉన్నారు. జైళ్లలో ఖైదీల సంఖ్య ఏటా పెరుగుతోంది. కాగా జైలులోని ఖైదీలు తమ కుటుంబాలకు నెలకు ఎన్ని ఉత్తరాలు రాయవచ్చనేది చాలామందిలో ఉండే సందేహం. జైలు నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రతి 15 రోజులకోసారి లేఖ రాయవచ్చని ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జైలు సూపరింటెండెంట్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రతి ఖైదీ నెలకు రెండుసార్లు లేఖ రాయవచ్చు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీ తన కుటుంబ సభ్యులకు లేదా దగ్గరి బంధువులకు మాత్రమే లేఖలు రాయవచ్చు. దీనికి సంబంధించిన రికార్డును జైల్లో భద్రపరుస్తారు. కాగా జైలులోని ఖైదీలు లేఖలు రాసేటప్పుడు అవి జైలుకు, అక్కడి నిబంధనలకు విరుద్ధంగా ఉండకూడదు. జైలు నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ఖైదీ లేఖ రాస్తే ఆ లేఖను జైలు అధికారులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటారు. -
ఏజెన్సీలో ఎలా?
సాక్షి, ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని, ప్రచారానికి వచ్చే నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. ఇటీవల కాలంలో వరుసగా కరపత్రాలు, లేఖలు విడుదల చేస్తున్నారు. దీంతో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి కత్తిమీద సాములా మారే అవకాశం కనిపిస్తోంది. గోదావరి తీరంలో.. ఒకప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు నల్లమల అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉండేవి. ప్రభుత్వ ఆదేశాల కంటే మావోయిస్టుల హెచ్చరికలే పల్లెల్లో ప్రభావం చూపించేవి. రానురాను మావోయిస్టుల ప్రభావం తెలంగాణలో తగ్గిపోయింది. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మావోయిస్టులు బలంగా తమ ఉనికి చాటుతున్నారు. ఆ ప్రభావం సరిహద్దు పంచుకుంటున్న మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు ఉన్న గోదావరి ఏజెన్సీలో స్థానిక సంస్థలు మొదలు చట్టసభల వరకు ప్రతీ ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం తలపిస్తోంది. గంట ముందుగానే సాధారణ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కానీ మావోయిస్టుల ప్రభావం ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను అక్కడి నుంచి తరలిస్తారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వచ్చే దారులు, మార్గమధ్యలో ఉన్న కల్వర్టులను పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు చేస్తారు. అయినా ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు. అప్రమత్తమైన పోలీసులు ఎన్నికల నేపథ్యంలో ఇటు పోలీసులు, అటు కేంద్ర బలగాలు సరిహద్దులో అడవులను విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి. భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ ఏజెన్సీ ఏరియాల్లో పర్యటిస్తూ పోలీసు సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహించడంతో పాటు అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు భరోసా కల్పించేలా పోలీసు కవాతు నిర్వహిస్తున్నారు. కరపత్రాల కలకలం ఈసారి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పక్షం రోజులకు మావోయిస్టుల నుంచి లేఖలు వచ్చాయి. ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీలు, నాయకులను నిలదీయండి. మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎన్నికలను బహిష్కరించండి.. అంటూ మావోయిస్టు తెలంగాణ కమిటీ పేరుతో చర్లలో కరపత్రాలు వెలువడ్డాయి. అంతకు ముందు అల్లూరి సీతారామరాజు – భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లెందు – నర్సంపేట డివిజన్ కమిటీల పేరుతోనూ లేఖలు వచ్చాయి. -
ఆ బిల్లులు ఆమోదించాలి
మహిళలకు సమానావకాశాలతోనే అభివృద్ధి మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకా శాలు లభించినపుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని బీఆర్ఎస్పీపీ పేర్కొంది. మహిళా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తీరుపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర మొదటి అసెంబ్లీ సమావేశా ల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశా రు. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ మరో తీర్మానాన్ని కూడా బీఆర్ఎస్పీపీ ఆమోదించింది. సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతులు (ఓబీసీ), మహిళలకు పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన బిల్లులను ఆమోదించాలని కోరుతూ భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (బీఆర్ఎస్ పీపీ) సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్ల మెంటు ప్రత్యేక సమావేశాల్లోనే వీటిని ఆమోదించాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు సమావేశా లు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బీఆర్ఎస్పీపీ సంయుక్త సమావేశం జరిగింది. పార్లమెంటు, శాసన సభల్లో ఓబీసీలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా బీఆర్ ఎస్ ఎంపీలు అనుసరించాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, వెనుక బడిన తరగతుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ కట్టుబడి ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వారి హక్కులు కాపాడేందుకు దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుంద న్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ డిమాండ్లను ఎంపీలు లేవనెత్తాలని, అందుకు అవసరమైన సమాచారంతో సిద్ధం కావాలని సూచించారు. దేశ సంపదలో ఓబీసీల కీలక భాగస్వామ్యం తమ వృత్తుల ద్వారా దేశ సంపదను సృష్టించడంలో కీలక భాగస్వాములైన ఓబీసీలకు చట్టసభల్లో సముచిత ప్రాధాన్యత కల్పించేలా 33 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని బీఆర్ఎస్పీపీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా ఉంటున్న ఓబీసీ కులాలను సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉందనే అభి ప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు, కార్యాచరణ మంచి ఫలితాలు ఇస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయ ని ఎంపీలు అన్నారు. రాజకీయ అధికారంలో ఓబీసీ ల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వా రు పూర్తి స్థాయిలో అభివృద్ది చెందుతారని బీఆర్ ఎస్పీపీ పేర్కొంది. పార్లమెంటు ప్రత్యేక సమావే శాల్లో ఓబీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చిత్తశు ద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే (14 జూన్ 2014) ఓబీసీ రిజర్వే షన్ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని గుర్తు చేసింది. తొమ్మిదేళ్లు కావస్తున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. 17న కేంద్రం ఏమంటుందో చూద్దాం ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు సమా వేశాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకానికి సంబంధించిన బిల్లుతో పాటు ఇతర బిల్లులు చర్చకు వస్తాయని కేంద్రం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఎజెండాలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సీఎం కేసీఆర్ బీఆర్ఎస్పీపీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ‘ఈ నెల 17న కేంద్రం అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించే అంశాల ఆధారంగా తదుపరి కార్యాచరణపై వ్యూహాన్ని రూపొందించుకుందాం. ఒకవేళ జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌర స్మృతి వంటి అంశాలు ప్రస్తావనకు వస్తే మన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేద్దాం. ఈడీ నోటీసులు జారీ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నందున ఓ వైపు న్యాయ పోరాటం చేస్తూనే, మరోవైపు రాజకీయంగా ఎదుర్కొనేందుకు కూడా వెనుకాడేది లేదు. మహిళలు, ఓబీసీల రిజర్వేషన్ బిల్లులపై ఒత్తిడి చేయడం ద్వారా బీజేపీ అసలు స్వరూపం పడుతుంది..’ అని కేసీఆర్ అన్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, పార్టీ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. వారికి 33% రిజర్వేషన్ కల్పించండి ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖలు చట్టసభల్లో మహిళలు, ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు రెండు వేర్వేరు లేఖలు రాశారు. వచ్చే పార్లమెంటు సమావేశా ల్లో బిల్లులు ప్రవేశ పెట్టాలని శుక్రవారం బీఆర్ఎస్పీపీ తీర్మానించిన నేపథ్యంలో ముఖ్య మంత్రి ఈ లేఖలు రాశారు. ‘శతాబ్దాలుగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమా పేందుకు ముందుచూపుతో రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు కల్పించిన విషయం మీకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. పార్లమెంటు, శాసనసభల్లోనూ మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభ 2014లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. కానీ కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి చొరవను తీసుకోలేదు. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనైనా బిల్లు ఆమోదానికి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా కోరుతున్నాను..’ అని ఒక లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఓబీసీలకు కోటాపై సీఎం మరో లేఖ రాశారు. ‘విద్య, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ ఫలాలు కొంతమేర దక్కినా చట్టసభల్లో వారికి సరైన ప్రాతినిధ్యం లేదు. ఇప్పటికైనా కేంద్రం 33 శాతం కోటా బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలి..’ అని కోరారు. -
చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అబద్దాలు ఆడతారని అనుకుంటారు కానీ, మరీ ఇంతలా అసత్యాలు చెప్పవచ్చన్న సంగతి మాత్రం ఆయన రాసిన ఒక లేఖ చూస్తే అర్ధం అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా మాట్లాడతారని చెప్పుకుంటాం.. కానీ, అందులో ఇంతలా రికార్డు సృష్టించవచ్చని ఆయన రుజువు చేస్తున్న తీరు గమనించదగిందే. ఇక నారా లోకేష్ సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్‌పై పడిపోయి ఒక రకమైన శబ్ద కాలుష్యం సృష్టిస్తూ అరాచకాలకు తెగపడుతున్న వీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు హద్దులు దాటిపోయాయి. వారు ప్రజలకు ఏం చేస్తామో చెప్పే ధైర్యం చేయలేక, అనవసరపు ఆరోపణలన్నిటిని కలిపి అబద్దాల వంటకంతో ప్రజలను మభ్య పెట్టాలని విపరీతంగా కృషి చేస్తున్నారు. వాటిని పేజీలకొద్ది రాసేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ప్రజలను మోసం చేయడానికి తమ డప్పు కొడుతున్నాయి. ప్రజలపై యుద్ధమే.. అంగళ్లు, పుంగనూరుల వద్ద జరిగిన గొడవలు ఏంటి?. దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు చంద్రబాబు రాసిన లేఖలేమిటి?. అలాగే విశాఖపట్నం గాజువాకలో పవన్ కళ్యాణ్ చేసిన ఉపన్యాసం చూస్తే ఆయనకు కూడా ఏదో అయిందన్న భావన కలుగుతుంది. వీరు నిస్పృహతో సాగిస్తున్న ఈ యుద్దం సీఎం జగన్‌పై కాదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై చేస్తున్న వికృత యుద్దం. చంద్రబాబు అయితే ముఖ్యమంత్రి జగన్‌పై చేసిన ఒక విమర్శ చూడండి. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదట. అందరూ చంద్రబాబు మానసిక స్థితిని సందేహిస్తున్నారని భావించి ఆయన రచయితలు ఎవరో ఎదురు దాడి చేసినట్లుగా ఉంది. లేఖల డ్రామా.. పోలీసులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబుకు మతి స్థిమితం లేనట్లా?. లేక తన స్కీముల గురించి సవివరంగా వివరించి ప్రజల నుంచి స్పందన పొందుతున్న సీఎం జగన్‌కు మతి లేనట్లా?. చంద్రబాబు పేరుతో రాసిన ఆ లేఖను జాగ్రత్తగా పరిశీలిస్తే అనేక విషయాలు తెలుస్తాయి. అంగళ్లు కూడలి వద్ద తనపైనే హత్యాయత్నం జరిగిందని.. కానీ, తానే హత్యాయత్నం చేశానని కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై హత్యాయత్నం జరిగితే పోలీసులకు ఎందుకు దెబ్బలు తగిలాయి?. చంద్రబాబుకు ఇలాంటి ట్రిక్కులు కొత్తకాదు. ఢిల్లీ స్థాయిలో తన పరపతి బాగా దెబ్బతిందన్న సంగతి ఆయనకు తెలుసు. అందుకే మళ్లీ ఢిల్లీ పెద్దల సానుభూతి పొందడానికి ఈ లేఖ డ్రామా ఆడారు. అందులో పచ్చి అబద్దాలు రాసి మొత్తం నెపం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్‌పైన, పోలీసులపైన నెట్టే యత్నం చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఏదో రకంగా చెడగొట్టాలన్నది వారి యత్నం. డ్రోన్లపై అసత్య ప్రచారం.. చంద్రబాబు తన లేఖలో ఎక్కడా ప్రజలకు ఇబ్బంది వచ్చినట్లు చెప్పలేదు. తనపై దాడులు జరుగుతున్నాయని అసత్య ఆరోపణలు మాత్రమే ఆ లేఖలో కనిపిస్తాయి. కుప్పం స్థానిక ఎన్నికలలో టీడీపీని దారుణంగా ఓటమి పాలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు. 2019 నుంచే ఆయనపై దాడులు చేశారట. దీనిని ఎవరైనా నమ్ముతారా?. ఆ ఏడాది ఆగస్టులో తన ఇంటిపై డ్రోన్ ఎగరవేశారని, వారిని తన భద్రతాధికారులు పట్టుకున్నా చర్యలు తీసుకోలేదట. నిజానికి అప్పుడు వచ్చిన వరదల గురించి మాత్రం చంద్రబాబు దాచిపెట్టేశారు. డ్రోన్లు ఎగరవేసింది కరకట్టపై ఉన్న ఎన్ని ఇళ్లు మునిగిపోయే అవకాశం ఉందో తెలుసుకోవడానికి అని అధికారులు ప్రకటించినా, చంద్రబాబు మాత్రం తన అబద్దాన్ని పదే పదే వల్లె వేస్తుంటారు. 2021 సెప్టెంబర్‌లో జోగి రమేష్ తన నివాసంపై దాడికి వచ్చారట. ఆ రోజున చంద్రబాబుకు వినతిపత్రం ఇస్తామని రమేష్ ఆ ప్రాంతానికి వెళ్లిన మాట వాస్తవం. కానీ, పోలీసులు ఆయనను వెళ్లనివ్వలేదు. ఇందులో దాడి చేసింది ఏముంది?. అనపర్తి, నందిగామ, ఎర్రగొండపాలెంలలో జరిగిన కొన్ని చిన్న ఘటనలను ఆసరాగా తీసుకుని వాటిని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. వాటిలో ఎక్కడా చంద్రబాబుపై దాడి జరగలేదు. అలా అని ఆయన కానీ, ఆయన వద్ద ఉండే భద్రత అధికారులు కానీ పోలీసులకు ఫిర్యాదే చేయలేదు. ప్రతిపక్షాలు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించకుండా జీఓ తెచ్చారని ఆయన అన్నారు. మరణాల గురించి చెప్పాలి కదా.. కందుకూరులో తన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది, గుంటూరులో ప్రజలకు కానుకలు ఇస్తామని తీసుకు వచ్చి తొక్కిసలాటకు గురిచేసి ముగ్గురు మరణించిన విషయాన్ని దాచిపెట్టేశారు. అంగళ్లు వద్ద నిర్దిష్ట రూట్ మ్యాప్‌ను వీడి అనుమతి లేకుండా రోడ్ షోని నిర్వహించి తప్పు చేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అంగళ్లు వద్ద, పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు గాయపడిన సంగతి, ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టుకున్న వైనం కూడా ప్రధానికి, రాష్ట్రపతికి తెలియచేస్తే బాగుండేది కదా!. పోలీసు వాహనాలను దగ్ధం చేసింది టీడీపీ కార్యకర్తలు కాదా?. వివేక హత్య కేసు, అమరావతి మొదలైనవాటిని కూడా ప్రస్తావించి సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఆయన శైలిని మరోసారి బయటపెట్టుకున్నారు. పవన్‌ది మరో కథ.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాయిస్తూ, వారిని పోలీసులు పట్టుకుంటే ప్రజాస్వామ్యం అని గగ్గోలు పెడుతూ, మళ్లీ ఎదురు ప్రభుత్వంపైనే దాడి చేశారు. ఏపీ మాదక ద్రవ్యాలు అంటూ పలు పిచ్చి ఆరోపణలు చేస్తూ రాష్ట్రం పరువు తీయడానికి చంద్రబాబు వెనుకాడటం లేదు. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగం చూస్తే, ఒక్కదానికి కూడా అర్ధం, పర్ధం ఉండదని తేలిపోతుంది. ఆస్తులు అమ్ముతున్నారని ఒకసారి, తాకట్టు పెడుతున్నారని మరోసారి అంటారు. దేవుడు, దెయ్యం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయనకు ప్రధాని మోదీ చాలా క్లోజ్ అట. అయినా ఆయన కాళ్లు పట్టుకుంటారట. సీఎం జగన్ పాలన లేని రాష్ట్రాన్ని చూడాలట. ఆయన కోరిక కోసం ప్రజలు ఓడిస్తారని భ్రమ పడుతున్నారు. ఏ మాత్రం పద్దతి ఉన్నా జగన్ తీసుకువచ్చిన విధానాలలో ఏది తప్పు, ఏది రైటు చెప్పగలగాలి. ఒకసారి ముఖ్యమంత్రిగా పనికిరానని, మరోసారి సీఎం పదవి తీసుకోవడానికి సిద్దమని చెబుతారు. తాజాగా విశాఖలో సీఎం పదవి ఇవ్వాలని అంటున్నారు. అందుకోసం ఆయన ఏం చేస్తారో చెప్పే ధైర్యం ఉందా?. ఏదో రకంగా సినిమాలలో మాదిరి ప్రజలను మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. --కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ ఇది కూడా చదవండి: ఇద్దరిలో అసహనం, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది, ఎందుకో తెలుసా? -
ఆ హ్యాండ్సమ్ సీరియల్ కిల్లర్‌పై అమ్మాయిల మోజు.. జైలులో ఉన్నా..
రిచర్డ్ రెమిరెజ్ 1960 ఫిబ్రవరి 29న అమెరికాలోని టెక్సాస్ పరిధిలోగల ఎల్ పాసోలో జన్మించాడు. అతని బాల్యం సవ్యంగా సాగలేదు. అతని తల్లిదండ్రులు నిరంతరం గొడవపడుతూ అతనిని పట్టించుకునేవారు కాదు. 12 ఏళ్ల వయసులో రిచర్డ్ తన కజిన్ మైక్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఏదో విషయమై భార్యతో గొడవ పడిన మైక్.. రిచర్డ్ ఎదుటనే ఆమెను హత్య చేశాడు. ఈ ఉదంతం రిచర్డ్ మనసులో ఎంతగా నాటుకుపోయిందంటే తాను కూడా ఎవరినైనా హత్యచేయాలని అనుకున్నాడు. తన బంధువు మైక్ తీరుతెన్నులకు ప్రభావితుడైన రిచర్డ్ పెరిగి పెద్దయ్యాక నేరమార్గాన్ని ఎంచుకున్నాడు. 1984 జూన్‌లో 79 ఏళ్ల వితంతువుపై అత్యాచారం జరిపి, హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు రిచర్డ్‌ను పట్టుకోవడంలో విఫలమయ్యారు. అది మెదలు రిచర్డ్ తన వినోదం కోసం హత్యలు చేయడం మొదలుపెట్టాడు. ఆధారాలు మాయం చేయకుండానే రిచర్డ్ హత్యలు చేస్తూ వచ్చినా.. పోలీసులు అతనిని పట్టుకోలేకపోయారు. దీంతో రిచర్డ్ నేరాల మీద నేరాలు చేస్తూ వచ్చాడు. ఈ నేపధ్యంలోనే అతను సైతానిక్ సొసైటీలో చేరాడు. ఈ సొసైటీ సైతానుకు పూజలు చేసేది. ఈ సొసైటీలో చేరిన దగ్గరి నుంచి ప్రతీరోజూ మత్తుమందులు తీసుకునేవాడు. ఫలితంగా నిస్సత్తువుగా మారి ఏ పనీ చేయలేకపోయేవాడు. మద్యం మత్తులో తేలేందుకే రిచర్డ్ ఈ సొసైటీలో చేరాడు. అయితే అంతకు మందు రిచర్డ్ 13 హత్యలు, 11 అత్యాచారాలు, 14 దోపిడీలు చేశాడు. అక్కడి జనం అతనిని ‘నైట్ స్టాకర్’ అని పిలిచేవారు. పోలీసులు.. కొందరు బాధితులు అందించిన ఆధారాల మేరకు అతని స్కెచ్ రూపొందించారు. అతను మార్కెట్లో తిరుగుతుండగా వలపన్ని పోలీసులు అతనిని పట్టుకున్నారు. కోర్టు రిచర్డ్ రెమిరిజ్ను దోషిగా తీర్మానిస్తూ, 1989 నవంబరు 20న అతనికి ఉరిశిక్ష విధించింది. అతను చేసిన దారుణాలకు ప్రతిగా అతనిని 19 సార్లు ఉరితీయాలని ఆదేశించింది. రిచర్డ్ జైలులో మగ్గుతున్నప్పడు అతనికి అమ్మాయిల నుంచి లవ్ లెటర్లు వచ్చేవి. ఇదేకోవలో డోరిన్ లివోఎ అనే మ్యాగజైన్ ఎడిటర్ నుంచి కూడా అతనికి ఉత్తరాలు వచ్చేవి. ఆమె 11 ఏళ్లలో ఏకంగా 75కు మించిన ఉత్తరాలను రిచర్డ్‌కు రాసింది. ప్రతీవారం అతనిని కలుసుకునేందుకు జైలుకు వచ్చేది. 1996లో రిచర్డ్ జైలులోనే ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే వారి అనుబంధం ఎంతో కాలం నిలవలేదు. డెరిన్ అతనికి విడాకులు ఇచ్చింది. 2013 జూన్ 7న జైలులోనే రిచర్డ్ కన్నుమూశాడు. ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు -
కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు: ప్రముఖ దర్శకుడు బి.నర్సింగ్‌రావు
సాక్షి, హైదరాబాద్: బి.నర్సింగ్‌రావు... తెలంగాణ చిత్రానికి ప్రపంచస్థాయి గౌరవాన్ని తెచ్చిన ప్రముఖ దర్శకుడు. తెలుగు సమాజానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చిరపరిచితుడు. ఆయన ఇటీవల సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 రోజులుగా తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ‘ఎక్కడ పుట్టిన కమలాలు మీరు’అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. తన పట్ల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న తీరును గర్హిస్తూ ఆయన రాసిన లేఖలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. లేఖలో ఏముందంటే.. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఆధునిక హంగులతో నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‘ నుంచే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తన పర్యవేక్షణలన్నీ కొనసాగిస్తోంది. వారికెందుకో నేను కూడా టార్గెట్ అయ్యాను. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడినా దాన్ని అడ్డుకుంటున్నారు. అవతలివాళ్లు మాట్లాడేది నాకు వినబడకుండా చేస్తున్నారు. 2014 నుంచి ఫోన్ టాపింగ్‌కు గురవుతోంది. 2018 జనవరి నుంచి నా ఫోన్ కాల్స్‌ను అడ్డుకుంటున్నారు. ఐదున్నరేళ్లుగా నాకు నరకం చూపిస్తున్నారన్నారు. రెండుసార్లు కేటీఆర్‌ను కలిసి ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదు.’’అని పేర్కొన్నారు. అకారణంగా వేధిస్తున్నారు.. ప్రభుత్వం 8 ఏళ్లుగా తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తోందని నర్సింగ్‌రావు చెప్పారు. ఎవరితోనూ మాట్లాడనీయకుండా బంధువులు, స్నేహితులు, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన సంస్థలు, వ్యక్తులకు తనను దూరం చేస్తోందని, మానసికంగా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం ఫోన్‌పైనే ఆధారపడి కొనసాగుతోంది. అలాంటిది మొబైల్ ఫోన్‌ను తననుంచి దూరం చేసి ప్రభుత్వం తన జీవన గమనాన్నే అడ్డుకుంటోందని ఆయన ‘సాక్షి’తో వాపోయారు. ప్రపంచంతో తన సంబంధాలన్నీ నిలిచిపోయాయని, చివరకు బంధువుల్లో ఎవరైనా చనిపోయినా సమాచారం అందుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను డాక్టర్‌తో మాట్లాడాలనుకున్నా మాట్లాడలేని పరిస్థితి. నన్ను కలిసేందుకు ఎవరైనా రావాలనుకున్నా ఫోన్లో ఆ విషయం చెప్పలేని స్థితి నెలకొంది’’అని వెల్లడించారు. ప్రభుత్వం తనను అకారణంగా వేధిస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ ఇలాంటి దుస్థితిని ఎదుర్కోలేదన్నారు. -
70 లేఖలు రాసినా స్పందన లేదు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని పలు అంశాల అమలు కోరుతూ 70కి పైగా లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందనలేదంటూ కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ లేఖలపై ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. గతంలో రాసిన 70 లేఖల జాబితాతో పాటు ఆ లేఖల్లోని ముఖ్యాంశాలను తాజాగా రాసిన లేఖలో పొందుపరిచారు. ఈ నెల 24న కృష్ణా బోర్డు నిర్వహించనున్న రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో బోర్డు అధికారులను ఎండగట్టేందుకు వ్యూహాత్మకంగా తెలంగాణ ఈ లేఖను రాయడం విశేషం. వివరాలివీ... ► రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(8ఏ) ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పుతో పాటు అంతర్రాష్ట్ర ఒప్పందాల అమలు తప్పనిసరి అని గుర్తు చేశారు. 20% జలాలను తాగునీటికి వినియోగించాలని కృష్ణా ట్రిబ్యునల్–1 పేర్కొనగా, నీటి లెక్కల్లో దీన్ని కృష్ణా బోర్డు పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలంగాణ తప్పుబట్టింది. ► వాడుకోని వాటా జలాలను తెలంగాణ మరుసటి జల సంవత్సరానికి బదలాయింపు(క్యారీ ఓవర్) చేస్తుండగా, ఈ జలాలను మరుసటి ఏడాది తెలంగాణ వాటా జలాల కింద లెక్కించవద్దని చేస్తున్న విజ్ఞప్తులను కృష్ణా బోర్డు పట్టించుకోవడం లేదు. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని స్కీం–ఏ కేటాయింపుల కింద ‘క్యారీ ఓవర్’జలాలను మరుసటి సంవత్సరం వాడుకోవచ్చు. ► ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో జరిపిన కృష్ణా జలాల తాత్కాలిక కేటాయింపులను తెలంగాణ రాష్ట్రం ఇకపై ఏ మాత్రం అంగీకరించ దు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 70శాతం హ క్కులున్నప్పటికీ 50:50 నిష్పత్తిలో తాత్కాలిక కే టాయింపులు జరపాలని ఎన్నో లేఖలు రాశాం. ► శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణకు విధివిధానాల(రూల్‌కర్వ్)రూపకల్పనలో సీడబ్ల్యూసీ వినియోగించిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరినా కేఆర్ఎంబీ, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. శ్రీశైలం జలాశయంలో వాటాదారుడిగా రూల్‌కర్వ్ పరిశీలనల కోసం ఈ సమాచారం మాకు అవసరం. చెన్నై వాటర్ సప్లై ఒప్పందాల ప్రకారం..కేవలం 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో గల కాల్వ ద్వారా 15 టీఎంసీలను మాత్రమే తరలించడానికి హెడ్‌వర్క్స్ నిర్మించాలి, ఈ నిబంధన అమలుకు కేంద్రం తనిఖీలు జరపాల్సి ఉంది. ఈ తనిఖీలకు సంబంధించిన సమాచారం కూడా కావాలి. ఈ నిబంధన మేరకు రూల్‌కర్వ్‌ను సవరించాలి. ► గోదావరి ట్రిబ్యునల్ ఒప్పందంతో పాటు పోల వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతు లప్రకారం.. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టా సిస్టం వాటాలో 80 టీఎంసీలను తగ్గించాలి. దీనికి విరుద్ధంగా సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్‌కర్వ్‌లో నాగార్జునసాగర్నుంచి కృష్ణా డెల్టా సిస్టంకు జరిపిన కేటాయింపులను తొలగించాలి. ► బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలకు తగ్గట్టుగా శ్రీశైలంలో 76:24 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలు విద్యుదుత్పత్తి చేసుకునేందుకు వీలుకల్పించేలా రూల్‌కర్వ్‌ను సవరించాలి. తెలంగాణ పరిధిలోని బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలకు 160 టీఎంసీలను కేటాయించడంతో పాటు శ్రీశైలం నుంచి బేసిన్ వెలుపలి అవసరాలకు ఏపీ చేస్తున్న తరలింపులను 34 టీఎంసీలకు పరిమితం చేసేలా రూల్‌కర్వ్‌ను సవరించాలి. ► పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్తో అనుసంధానమై ఉన్న అన్ని కాల్వలకు రియల్ టైం డేటా అక్విసైషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి నీటి తరలింపులను కచ్చితంగా లెక్కించాలి. శిథిలావస్థకు చేరిన ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ జరపాలి. ఇదీ చదవండి: అదేమో గానీ.. పార్టీని మాత్రం ఎవరూ కాపాడలేరు -
సోనాలీ ఫోగాట్ హత్యకు రూ.10 కోట్ల డీల్!
న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్, నటి సోనాలీ ఫోగాట్(42) హత్యకు రూ.10 కోట్ల డీల్ కుదిరిందని, ఈ మేరకు తమ కుటుంబానికి ఇటీవలే రెండు లేఖలు అందాయని ఆమె బావ అమన్ పూనియా తాజాగా చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ రెండు లేఖలు వచ్చినట్లు తెలిపారు. ఒక లేఖలో రూ.10 కోట్ల డీల్ గురించి, మరో లేఖలో పలువురు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయన్నారు. లేఖల్లో కీలక సమాచార ముంది కాబట్టి వీటిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సోనాలీ ఫోగాట్ ఆగస్టు 23న గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు పోస్టుమార్టంలో తేలింది. విచారణ చేపట్టిన పోలీసులు సోనాలీ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్తోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సీబీఐ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
ఎయిర్‌పోర్ట్‌ల వృద్ధి కోసం కేంద్రానికి సీఎం జగన్ లేఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక, పర్యాటకాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విశాఖ మరింత ఎదిగేలా నూతన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి షరతులు లేని అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. ఈస్టర్న్ నావల్ కమాండ్ ఐఎన్ఎస్ డేగాకు చెందిన నేవీ బేస్ నుంచి పౌర విమాన సర్వీసులు అధిక సంఖ్యలో నడిపేందుకు ఇబ్బందులు తలెత్తడంతో భోగాపురం వద్ద నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించ తలపెట్టినట్లు లేఖలో ప్రస్తావించారు. 2016లో షరతులతో ఇచ్చిన నిరభ్యంతర పత్రం గడువు ముగిసిపోయినందున తాజాగా ఎటువంటి నిబంధనలు, షరతులు లేకుండా ఎన్వోసీ జారీ చేయాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కూడా ముఖ్యమంత్రి వేర్వేరుగా లేఖలు రాశారు. ముఖ్యాంశాలు ఇవీ.. విశాఖ హబ్‌గా ఎదిగేలా.. రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నాం. విభజన చట్టం ప్రకారం విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను రాష్ట్ర విభజన తేదీ నుంచి ఆరు నెలల్లోగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలన్న అంశాలను కేంద్రం పరిశీలించాలి. ఈ 3 ఎయిర్‌పోర్టుల నుంచి విమాన సర్వీసులు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పర్యాటకాభివృద్ధిలో విశాఖ పాలు పంచుకునేలా విమానాశ్రయం కీలకపాత్ర పోషిస్తోంది. మరింత వృద్ధిరేటు సాధించి విశాఖ హబ్‌గా ఎదిగేలా పౌర విమాన సర్వీసులను నడపాల్సిన ఆవశ్యకత ఉంది. ఇటు కొండలు.. అటు రద్దీ విశాఖ విమానాశ్రయానికి మూడు వైపులా కొండలున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా పౌర విమానాలను కేవలం ఒక దిశలో మాత్రమే టేకాఫ్ చేసేందుకు అనుమతిస్తున్నారు. దీనివల్ల గంటకు 10 విమాన సర్వీసులకు మించి నడిపే అవకాశం లేదు. రక్షణ రంగం, పౌర విమానయాన అవసరాలను ప్రస్తుతం ఇది తీరుస్తున్నా భవిష్యత్తులో రాకపోకలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు రక్షణ రంగ కార్యకలాపాలు మరోవైపు విశాఖలో పర్యాటకం అభివృద్ధి చెందుతుండటంతో పౌర, రక్షణ అవసరాలకు వినియోగిస్తున్న ఈ ఎయిర్‌పోర్టులో రద్దీ పెరుగుతోంది. రక్షణ అవసరాల దృష్ట్యా.. కొత్తగా భోగాపురం వద్ద నిర్మించే ఎయిర్‌పోర్టు వద్దకు నావల్ ఎయిర్‌స్టేషన్ ఐఎన్ఎస్ డేగాను రక్షణ అవసరాల రీత్యా తరలించలేమని నేవీ, రక్షణ శాఖ ప్రతినిధులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు జరిపిన సంప్రదింపుల లేఖలను జత చేస్తున్నాం. తూర్పు తీర రక్షణలో ఐఎన్ఎస్ డేగా చాలా కీలకమని, రక్షణపరంగా వ్యూహాత్మకమని, రక్షణ కార్యకలాపాలకు మినహా పౌర విమాన సర్వీసులకు విశాఖ అనువు కాదని స్పష్టం చేశారు. నేవీ ఎయిర్ బేస్‌ను భోగాపురం తరలించాలనే ప్రతిపాదన ఆర్థికంగా కూడా ఆచరణ యోగ్యం కాదు. దీంతో పౌర విమాన సర్వీసులను తరలించాలని నిర్ణయించాం. ఎన్వోసీ లేకపోవడంతో.. భోగాపురం విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నాం. దీనికి సంబంధించి పౌర విమానయాన శాఖ 2016లో కొన్ని షరతులతో అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టును నిర్వహిస్తున్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పరిహారం చెల్లించాలని కోరింది. పౌరవిమానయాన శాఖ ఇచ్చిన నిరభ్యంతర లేఖ కాల పరిమితి ఇప్పటికే ముగిసిపోయిది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి పీపీపీ విధానంలో భాగస్వామ్య కంపెనీని ఎంపిక చేసినప్పటికీ కొత్తగా సైట్ క్లియరెన్స్, ఎన్వోసీ ఇవ్వకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నాం. దీని ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి పౌర విమానయాన శాఖ నిరభ్యంతర పత్రం జారీ చేసేలా చూడాలని కోరుతున్నాం. -
కేంద్రంపై కేసీఆర్ సర్కార్ లేఖాస్త్రం! ఏయే అంశాలపై లెటర్స్ రాశారంటే..
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల్లో నిలదీసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖాస్త్రాలు సంధిస్తోంది. ఇప్పటికే పలు అంశాలపై వరుసగా లేఖలు రాయగా.. నెలాఖరు నుంచి కేంద్ర బడ్జెట్ సమా వేశాలు మొదలవుతుండటంతో మరిన్ని లెటర్లు రాసేందుకు సిద్ధమైంది. తద్వారా రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు నిధు లివ్వడంలో వివక్ష వంటి అంశాలపై కేంద్రం వైఖరిని ఎత్తిచూపాలని భావిస్తోంది. అదే సమయంలో.. బీజేపీ రాష్ట్ర ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం చేస్తున్నదేమీ లేదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపేలా వ్యూహాన్ని సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నేతృత్వంలో.. ఎరువుల ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహ రించుకోవాలంటూ ఈ నెల 12న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వయంగా లేఖ రాశారు. తాజాగా ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు కేంద్రం ప్రతిపాదిం చిన సవరణలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయంటూ మరో లేఖ రాశారు. మరోవైపు రాష్ట్ర కేబినెట్లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వేర్వేరుగా కేంద్ర మంత్రులకు అరడజను లేఖలు రాశారు. గిరిజన అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తామం టూ బీజేపీ నేతలు చేసిన ప్రకటనల నేపథ్యంలో.. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, మేడారం జాతరకు జాతీ య హోదాపై మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. ఇక రాష్ట్ర విభ జన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ.. బడ్జెట్ సమావేశాల సమయంలో మరిన్ని లేఖలు రాసేందుకు మంత్రులు సిద్ధమవుతున్నారు. గిరిజన యూని వర్సిటీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు, కాళేశ్వరం లేదా పాలమూరు పథకానికి జాతీయ హోదా, కాజీపేట రైల్వే వేగన్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ వంటి అంశాలను లేఖల ద్వారా కేంద్రానికి గుర్తు చేయాలని భావిస్తున్నారు. బీజేపీ వైఖరిని ఎత్తిచూపేందుకే! ఓవైపు లేఖల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రశ్నిస్తూనే.. మరోవైపు సామాజిక మాధ్యమాలు, మీడియా సమావేశాల ద్వారా బీజేపీ వైఖరిని నిలదీసే వ్యూహాన్ని టీఆర్ఎస్ అనుసరిస్తోంది. ఖాళీగా ఉన్న 15.62 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు వంటి అంశాల్లో కేంద్రం వైఖరిపై ప్రశ్నలు సంధిస్తోంది. సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలు, ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్ మీడియం, పసుపుబోర్డు ఏర్పాటు, మేడారం జాతర నిర్వహణకు కేంద్ర నిధులు వంటి అంశాలను టీఆర్ఎస్ నేతలు, మంత్రులు తరచూ వివిధ రూపాల్లో లేవనెత్తుతున్నారు. ‘‘ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన బీజేపీ.. ఇతర అంశాల్లోనూ అదే రీతిలో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరుతోపాటు ఆ పార్టీ రాష్ట్ర ఎంపీల పనితీరును ప్రజలను వివరించేందుకు టీఆర్ఎస్ వ్యూహం పన్నింది. అందులో భాగంగానే లేఖల ద్వారా రాష్ట్ర అంశాలను కేంద్రంతోపాటు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం’’ అని టీఆర్ఎస్ ఎంపీ ఒకరు పేర్కొన్నారు. -
నవంబర్ 30 వరకు ఆంక్షలు పొడిగించాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కోవిడ్ నియంత్రణ చర్యలను కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ముఖ్యంగా పండుగ సీజన్లో తగిన జాగ్రత్తలతో, సురక్షితంగా ప్రజలను బయటికి అనుమతించే మార్గదర్శకాలను అమలు చేయడం చాలా కీలకమని ఆయన చెప్పారు. దేశంలో రోజువారీ కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా వైరస్ వ్యాప్తి ఉందని, ఇది ప్రజారోగ్య సవాల్‌గా కొనసాగుతోందని భల్లా లేఖలో పేర్కొన్నారు. పండుగ సీజన్లో టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేషన్, కోవిడ్ ప్రోటోకాల్స్‌కు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. -
World Post Day 2021: జ్ఞాపకాల మూట
World Post Day 2021: నిన్న మొన్నటి వరకూ టెలిఫోన్ కలిగిన వారిదే. మధ్యతరగతిది ఉత్తరం. పేదవాడికి పోస్ట్‌కార్డ్. కనీసం ఐదు దశాబ్దాల భారతీయుల జీవన భావోద్వేగాలు లేఖలు, ఉత్తరాలు, ఇంటర్వ్యూ కార్డులు, మనీ ఆర్డర్ల చుట్టే తిరిగాయి. ఉత్తరం లేకపోతే... పోస్ట్‌మేన్ లేకపోతే ఆ జ్ఞాపకాలు ఉండేవా? అక్టోబర్ 9 ‘వరల్డ్ పోస్ట్ డే’ సందర్భంగా కొన్ని ఉద్వేగాల రీవిజిట్. ‘ఇద్దరం ఉద్యోగానికి అప్లై చేద్దాం. నా వంతు డబ్బులు నావి. ఏవీ... మీ డబ్బులు ఇవ్వండి’ అని నిస్సిగ్గుగా సావిత్రి దగ్గరి నుంచి అడిగి మరీ తీసుకుంటాడు ఎన్టీఆర్ ‘మిస్సమ్మ’లో. ఆ నిరుద్యోగ రోజులు అలాంటివి. వారి అప్లికేషన్ పోస్ట్‌లో అందుకున్న వెంటనే ఎస్.వి.రంగారావు ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని టెలిగ్రామ్ ఇమ్మంటాడు మేనల్లుడు ఏఎన్నార్‌ని. అంతేనా ఖర్చులకు 200 ఎం.ఓ కూడా చేయమంటాడు. చూడండి... ఒక్క సీనులో ఎన్ని పోస్టాఫీసు సేవలు అవసరమయ్యాయో. ఆ సేవలు లేకుంటే ఎన్టీఆర్, సావిత్రి ఉద్యోగంలో చేరేవారూ కాదు... ‘రావోయి చందమామ’ పాడేవారూ కాదు. గాంధీ గారికి ఉత్తరాలు రాయకుండా ఏ రోజూ గడవలేదు. నెహ్రూ జైలులో ఉండి తన కుమార్తె ఇందిరకు తెగ ఉత్తరాలు రాశారు. ఉత్తరం రాయడం ఒక మర్యాద. ఉత్తరం అందుకోవడం ఒక గౌరవం. ఉత్తరాలు ఒకరికొకరు రాసుకుంటూ ఉండటం స్నేహం. కాని ఉత్తరం కేవలం పెద్దవాళ్ల వ్యవహారంగా కొంతకాలమే ఉంది. పేదవాళ్లు, మధ్యతరగతి వారు ఉత్తరాలను మొదలెట్టారు. వీధి మొదలులో వేలాడదీసి ఉండే ఎర్రటి పోస్ట్ డబ్బాను గుర్తించారు. ఊళ్లో ఆ రోజుల్లో స్కూల్ మేష్టారు లేదంటే పోస్ట్మేస్టారే కదా గౌరవనీయులు. ‘పెళ్లి చేసి చూడు’లో ఏఎన్నార్ తండ్రి తెలుగు మేష్టారు రావికొండలరావు. కొడుకు పంపాల్సిన మనియార్డర్ ఏదిరా అని పోస్ట్మేన్ని దబాయిస్తాడు. ‘రాలేదు మేష్టారు’ అనంటే ‘వస్తే అందరూ ఇస్తారు. రాకపోయినా ఇవ్వడమే గొప్పదనం’ అంటాడు. 1970లు, 80లు కొడుకుల మనిఆర్డర్ల కోసం తల్లిదండ్రుల కళ్లు కాయలు కాచేలా చేశాయి. నిరుద్యోగ భారతంలో కొడుకు ఉద్యోగం సంపాదించి ఎంతో కొంత పంపితేనే జరుగుబాటైన ఇళ్లు. ఆ రోజుల్లో అకౌంట్లు ఎవరికీ ట్రాన్స్ఫర్లు ఎవరికీ ఫోన్‌పేలు ఎవరికీ? మని ఆర్డరే. పోస్ట్‌మేన్ మనీ ఆర్డర్ తెచ్చి ఇస్తే సంతోషించి ఆ ఇంటి ఇల్లాలు మజ్జిగ ఇచ్చేది. ఇంటి పెద్ద రూపాయో రెండ్రూపాయలో బక్షీసు ఇచ్చేవాడు. ఆ పూట ఆ ఇంట్లో గుండెల మీద కాకుండా వంటగదిలోనే కుంపటి వెలిగేది. సౌదీ, అమెరికా, రంగూన్... వలస వెళ్లిన వారి ఉత్తరాలు నెలల తరబడి వేచి చూస్తే తప్ప వచ్చేవి కావు. సైన్యంలో చేరిన వారి బాగోగులు ఉత్తరాలు చెప్తే తప్ప తెలిసేవి కావు. పట్నంలో చదువుకుంటున్న కొడుకు పరీక్ష ఫీజు కోసం రాసిన పోస్ట్‌కార్డు అతి బరువుగా అనిపించేది. కాపురానికి వెళ్లిన కూతురు నుంచి వచ్చిన ప్రతి ఉత్తరం ఉలికిపాటును తెచ్చేదే. ఆ కూతురు కూడా తక్కువ తిన్నదా? కష్టాలన్నీ తాను దిగమింగుతూ సంతోషంగా ఉన్నట్టు తెగ నటించదూ? ఇంటర్వూకు కాల్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, స్టడీ మెటీరియల్, కలం స్నేహం కోసం మొదలెట్టిన జాబులు, పత్రికకు పంపిన కథకు జవాబు, తకరారులో చిక్కుకుంటే వచ్చే కోర్టు నోటీసు, వ్యాపార లావాదేవీల కరెస్పాండెన్సు, అభిమాన హీరోకు లేఖ రాస్తే పంపే ఫొటో, వశీకరణ ఉంగరం... ఎన్నని. అన్నీ ఆ ఖాకీ బట్టల పోస్ట్‌మేన్ చేతుల మీదుగా అందేవి. తెలిసేవి. సంతోషపెట్టేవి. బాధించేవి. గెలిపించేవి. ఓడించేవి. ఇక కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఉత్తరాలు సృష్టించిన ‘డ్రామా’ అంతా ఇంతా కాదు. ‘పోస్ట్ అన్న కేకతో పడక్కుర్చీలోని పరంధామయ్యగారు ఉలిక్కిపడ్డారు’ అనే లైనుతో ఎన్నో కథలు మొదలయ్యేవి. ఉత్తరాలు అందక ఏర్పడిన అపార్థాలు, ఒకరి ఉత్తరం ఇంకొకరికి చేరి చేసే హంగామాలు, ఒకరి పేరుతో మరొకరు రాసే ప్రేమ లేఖలు.. వీటిలో పోస్ట్మేన్లది ఏ పాపమూ ఉండదు. కాని వారికి తెలియకనే వ్యవహారమంతా వారి చేతుల మీదుగా నడుస్తుంటుంది. ఉత్తరాలు బట్వాడా చేయాల్సింది వారే కదా. కొందరు పోస్ట్‌బాక్స్ నంబర్ తీసుకుని ఆ నంబర్ మీదే సవాలక్ష వ్యవహారాలు నడిపేవారు. బుక్పోస్ట్ను ఉపయోగించి పుస్తకాలు పంపని కవులు, రచయితలు లేరు. రిజిస్టర్డ్ పోస్ట్ విత్ డ్యూ అక్నాలెడ్జ్మెంట్ అయితే ఆ ధీమా వేరు. ‘టెలిగ్రామ్’కు పాజిటివ్ ఇమేజ్ లేదు. అది వచ్చిందంటే ఏదో కొంపలు మునిగే వ్యవహారమే. సంతవ్సరం పొడుగూతా సేవ చేసే పోస్ట్‌మేన్ మహా అయితే అడిగితే దసరా మామూలు. అది కూడా ఇవ్వక వారిని చిన్నబుచ్చేవారు కొందరు. చాలీ చాలని జీతంతో, ఎండనక వాననక సైకిల్ తొక్కుతూ ఇల్లిల్లు తిరిగి క్షేమ సమాచారాలు ఇచ్చి ఊరడింప చేసే ఆత్మీయుడు పోస్ట్‌మేన్ మధ్యతరగతి భారతదేశంలో కనిపించని పాత్ర పోషించాడు. ఇవాళ కథే మారిపోయి ఉండవచ్చు. ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్లో ఎక్కడిది. చేతిరాతతో అందుకునే ఉత్తరం జాడ ఎక్కడిది. ఆ చెరగని గుర్తు ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు. ఆ కాలానికి ధన్యవాదాలు. థ్యాంక్యూ పోస్ట్‌మేన్. ‘‘ఇప్పుడు ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఒక పోస్టాఫీసు, బ్యాంకు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండొచ్చు. కాని ఆ రోజుల్లో ఉండే మానవీయ అంశ ఈ కృత్రిమ మెషీన్లో ఎక్కడిది. దాచుకున్న ఉత్తరాలు జ్ఞాపకాల మూటగా మారడం ఇవాళ ఎవరికి తెలుసు.’’ -
మావోయిస్టుల కరపత్రాల కలకలం
జయపురం: ఒడిశాలోని నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితిలో మావోయిస్టులు విడుదల చేసిన కొన్ని వందలాది కరపత్రాలు మంగళవారం కనిపించాయి. ప్రధానంగా బీడీఓ కార్యాలయం వద్ద హిందీ భాషలోని కరపత్రంలో ఝోరిగాం సమితి దగ్గరున్న తేల్ నదిపై ప్రతిపాదిత డ్యామ్‌ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మావోయిస్టులు పేర్కొన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను నిరసిస్తూ ఆందోళనన చేపడతామన్నారు. ముఖ్యంగా నవరంగపూర్ ఎంపీ రమేశ్ చంద్ర మఝి, ఝోరిగాం ఎమ్మెల్యే ప్రకాష్ చంద్ర మఝిల ప్రజా వ్యతిరేక విధానాలను దళం ఖండిస్తోందన్నారు. చదవండి: స్థానిక ఎన్నికలు.. తేలని పంచాయితీ! అలాగే విద్యుత్ సరఫరాలో టాటా కంపెనీ కూడా పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ విషయాల్లో మార్పు రాకపోతే బాగోదని హెచ్చరించారు. గతంలో ఇదే ప్రాంతంలో ఉదంతి మావోయిస్ట్ డివిజన్ పేరిట పోస్టర్లు, కరపత్రాలతో మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కనిపించిన మావోయిస్టుల కరపత్రాలు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మావోయిస్టుల పట్టుతప్పుతోంది... -
హుజూరాబాద్ ఓటర్లకు సీఎం కేసీఆర్ లేఖలు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఖరారు చేసిన టీఆర్ఎస్... ఓటర్లను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందిన వారిని పార్టీ తరఫున వ్యక్తిగతంగా కలసి గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు కోరాలని నిర్ణయించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏడేళ్లలో నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందిన వారి జాబితాను మున్సిపాలిటీలు, వార్డులు, మండలాలు, గ్రామాలవారీగా సిద్ధం చేశారు. ఈ జాబితాల ఆధారంగా లబ్ధిదారులను పార్టీ యంత్రాంగం ద్వారా నేరుగా చేరుకొని పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టేలా ప్రణాళిక సిద్ధం చేసింది. నియోజకవర్గంలో 2.26 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో సుమారు 70 వేల మంది వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నట్లు టీఆర్ఎస్ గుర్తించింది. లబ్ధిదారులకు స్వయంగా ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు నియోజకవర్గంలోనూ విస్తృతంగా పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖతో కూడిన రెండు లక్షల కరపత్రాలను గులాబీ రంగులో ముద్రించింది. ‘దళితబంధు’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌కు వస్తుండటంతో ఆలోగా లేఖల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ఉప ఎన్నిక ఇన్‌చార్జీలకు ఆదేశాలు అందాయి. ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక దృష్టి.: హుజూరాబాద్‌లో మకాం వేసిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి కేంద్రీకరించారు. కొత్తగా సామాజిక పింఛన్ల మంజూరు, రేషన్ కార్డుల జారీ, సీసీ రోడ్లు, మహిళలు, కుల సంఘాలకు భవనాలు, స్త్రీనిధి రుణాల చెక్కుల పంపిణీ వంటి కార్యక్రమాల్లో తలమునకలై పనిచేస్తున్నారు. తాజాగా హుజూరాబాద్‌లో పద్మశాలి స్థలానికి రూ.కోటి నిధులతోపాటు ఎకరా స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. -
కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖలు
హైదరాబాద్: రేపు(సోమవారం) జరిగే గోదావరి-కృష్ణా బోర్డు సమావేశానికి హాజరుకాలేమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి కృష్ణా, గోదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసింది. బోర్డు చైర్మన్లకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. మరోరోజు ఈ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. -
సీఎంకు పది వేల లేఖలు; ఆర్టీసీ ఉద్యోగుల వినూత్న నిరసన
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సహకార పరపతి సంఘాని (సీసీఎస్)కి పేరుకుపోయిన బకాయిల కోసం ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. సీసీఎస్‌కు ఆర్టీసీ బకాయిపడ్డ రూ.1,000 కోట్లను వెంటనే విడుదల చేయించాలని కోరుతూ ఉద్యోగులు ముఖ్యమంత్రికి మూకుమ్మడి లేఖలు పంపుతున్నారు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 వేల లేఖలు పోస్టు చేశారు. కొంతకాలంగా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన మొత్తాన్ని సీసీఎస్‌కు జమ చేయకుండా ఆర్టీసీ సొంతానికి వినియోగించుకుంటోంది. ఇలా దాదాపు రూ.1,000 కోట్లు బకాయి (వడ్డీతో కలుపుకొని) పేరుకుపోయింది. గతంలో ఉద్యోగులు తీసుకున్న అప్పులు మరో రూ.800 కోట్లు ఉన్నాయి. ఇందులో రూ.1,000 కోట్లను వెంటనే విడుదల చేసి ఉద్యోగులకు తిరిగి రుణాలు ఇవ్వడం ప్రారంభించాలని చాలాకాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, తమ వద్ద నిధులు లేనందున సమయం పడుతుందంటూ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందితే చెల్లిస్తామని చెబుతున్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని వేడుకుంటూ ముఖ్యమంత్రికి లేఖలు పంపాలని ఇటీవల నిర్ణయించారు. ఈ మేరకు మొత్తం 10 వేల లేఖలు సిద్ధం చేసి, డిపోల వారీగా ఉద్యోగుల సంతకాలతో పోస్టు చేస్తున్నారు. సీసీఎస్‌లో నిధులు లేకపోవడంతో ఉద్యోగులకు రుణాలు అందకపోవటమే కాకుండా, రిటైర్ అయి సీసీఎస్‌లో నగదు డిపాజిట్ చేసుకున్న విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ ఇవ్వటం లేదని, సీసీఎస్‌లో సభ్యత్వం రద్దు చేసుకున్న వారికి చెల్లింపులు జరపటం లేదని, రిటైర్ అయిన వారికి సెటిల్మెంట్ చేయటం లేదని ఆ లేఖల్లో పేర్కొన్నారు. 27న జనరల్ బాడీ సమావేశం.. సీసీఎస్‌కు సంబంధించి ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలి. కానీ, ఏడాది కాలంలో ఓసారి సమ్మె వల్ల, మరోసారి కోవిడ్ వల్ల ఈ సమావేశాలు జరుగలేదు. రెండేళ్లుగా సీసీఎస్‌లో నిధులు లేక రుణాలు అందని దుస్థితి నెలకొన్నందున ఇప్పుడు అత్యవసరంగా సమావేశం నిర్వహించాలని సీసీఎస్ పాలక మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 27 తేదీని ఖరారు చేశారు. ఉద్యోగుల ప్రతినిధులుగా ఉండే 250 మంది, ఆర్టీసీ ఎండీ, ఇతర సభ్యులైన అధికారులు, ఎక్స్అఫీషియో సభ్యులు పాల్గొనాలి. కానీ, లోన్ల విషయంలో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నందున జనరల్ బాడీ సమావేశంలో ఘర్షణ పూరిత వాతావరణం ఉండనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీసీఎస్‌కు బకాయి పడ్డ మొత్తాన్ని ఇవ్వలేక చేతులెత్తేసినందున, ఈ సమావేశంతో గందరగోళం నెలకొంటుందని భావిస్తున్న ఆర్టీసీ అధికారులు, భేటీ జరుగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమావేశాన్ని నిర్వహించి తీరుతామని సీసీఎస్ పాలకమండలి స్పష్టం చేస్తోంది. -
ప్రిన్సెస్ డయానా రాసిన ఆ ఉత్తరాల్లో ఏముంది..?
ప్రిన్సెస్ డయానా మరణించి దాదాపు 24 ఏళ్లు అవుతున్నప్పటికీ తన వ్యక్తిగత జ్ఞాపకాలతో ఇప్పటికీ వార్తల్లో నిలుస్తుండడం విశేషం. క్లోజ్ ఫ్రెండ్స్‌కు డయానా స్వయంగా రాసిన ఉత్తరాలు తాజాగా వెలుగులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఎవరూ చదవని రెండు దశాబ్దాల క్రితం నాటి.. దాదాపు 40 ఉత్తరాలను ‘డేవిడ్ లే’ అనే వేలం సంస్థ విక్రయించనుంది. ఈ ఉత్తరాలను డయానా స్నేహితుడు రోజర్ బ్రాంబుల్‌కు 1990 ఆగస్టు నుంచి 1997 మే నెల మధ్యకాలం లో రాశారు. 1997లో ఆమె మరణించిన తరువాత కంట్రీ ఫామ్ హౌస్‌లో ఓ కప్ బోర్డులో ఈ ఉత్తరాలు దొరికాయి. ఇన్నేళ్లు చీకట్లో మగ్గిన ఆ ఉత్తరాలు జన బాహుళ్యంలోకి రానున్నాయి. ప్రిన్స్ చార్లెస్‌తో తన వివాహబంధాన్ని తెంచుకున్న తరువాత రాసిన లెటర్స్ కావడంతో వాటిలో ఏముందోనని ఆసక్తి నెలకొంది. తన కుమారులైన ప్రిన్స్‌విలియం, హ్యారీల గురించి కూడా దీనిలో డయానా ప్రస్తావించారని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. ‘‘డయానా ఓ యాక్సిడెంట్లో మరణించినప్పటికీ ఆమె మృతి వెనుక అనేక అనుమానాలు ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని చాలామంది కుతూహలం చూపుతున్నారు. అందుకే ఆమె జీవితానికి సంబంధించిన మరిన్ని నిజాలు తెలుసుకునేందుకు ఉత్తరాలను వేలం వేస్తున్నట్లు’’ వేలం సంస్థ వెల్లడించింది. మార్చి 18న 39 లెటర్స్ ను వేలం వేస్తున్నామని, మరింత సమాచారం కోసం తమ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సంస్థ పేర్కొంది. -
ఒక్కగానొక్క ఆడబిడ్డ అన్నట్లుగా..
‘ఒక్కగానొక్క ఆడబిడ్డ’ అన్నట్లుగా కమలా హ్యారీస్‌ను అమెరికాలో అందరూ తమ కుటుంబ సభ్యురాలిని చేసుకున్నారు! ఆమె ‘పరిపూర్ణమైన అమెరికన్’ అయుంటే ఇంకా బాగుండేదనే భావన తెల్లజాతి స్థానికుల్లో ఉన్నప్పటికీ, తమ దేశానికి వైస్ ప్రెసిడెంట్ అయిన తొలి మహిళగా ఆమెను గుర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు. మహిళలైతే ఆమెతో ఏమైనా చెప్పాలని ఉత్సాహపడుతున్నారు కూడా. ఆ ఉత్సాహం ఒక్క అమెరికన్ మహిళల్లోనే కాదు, యావత్ ప్రపంచ మహిళల్లో వ్యక్తం అవుతోంది. ఆ విషయాన్ని న్యూయార్క్‌లోని ఆఫ్రో–అమెరికన్ రచయిత్రి డాక్టర్ పెగ్గీ బ్రూక్స్ కనిపెట్టారు. కమలపై తనొక పుస్తకం వేస్తున్నాననీ, ఆమెకు ఏదైనా చెప్పదలచినవారు ఉత్తరం రాసి తనకు పంపిస్తే ఆ ఉత్తరాలను పుస్తకంగా వేస్తానని ప్రకటించారు. వేల ఉత్తరాలు వచ్చాయి. వాటిలోంచి 120 ఉత్తరాలు ఎంపిక చేసి పుస్తకంగా విడుదల చేశారు పెగ్గీ బ్రూక్స్. పెగ్గీ బ్రూక్స్ వేసిన ఆ పుస్తకం పేరు ‘డియర్ కమల: ఉమెన్ రైట్ టు ది న్యూ వైస్ ప్రెసిడెంట్’. ఆ పుస్తకాన్ని ఒక వ్యక్తి తప్పకుండా చదవాలని బ్రూక్స్ కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో అర్థమయ్యే ఉంటుంది. కమలా హ్యారిస్! ఇప్పటికే ఒక కాపీని ఆమె యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్‌కి పంపించారు కనుక కమల ఆ పుస్తకాన్ని చదివే అవకాశాలు ఉన్నాయి. పైగా అందులోనివి వివిధ మహిళలు తనకు రాసిన ఉత్తరాలు! నేడు, రేపట్లో కమల నుంచి బ్రూక్స్‌కి ఒక సందేశం వచ్చినా రావచ్చు..‘బ్రూక్స్.. మీ ప్రయత్నం నాకెంతగానో ఉపకరిస్తుంది’ అని. మంచి విషయానికి స్పందించకుండా ఉండలేకపోవడం కమల స్వభావం. పుస్తకంలో కేవలం ఉత్తరాలు మాత్రమే లేవు. ఆ ఉత్తరాలను సమన్వయం చేస్తూ కమలా హ్యారిస్‌తో ఒక రచనా ప్రక్రియగా రచయిత్రి బ్రూక్స్ పంచుకున్న మనోభావాలూ ఉన్నాయి. ‘‘ఉత్తరాల్లో ఎక్కువ భాగం.. సమాజంలోని స్త్రీ పురుష అసమానతలను తొలగించమని కోరుతూ చేసిన విజ్ఞప్తులే ఉన్నాయి’’ అంటున్నారు బ్రూక్స్. ∙∙ బరాక్ ఒబామా అధ్యక్షుడు అయినప్పుడు, ఆయన భార్య, ‘ఫస్ట్ లేడీ’ అయిన మిషెల్ ఒబామా మీద కూడా ఇదే విధంగా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు బ్రూక్స్. ఆ పుస్తకం పేరు ‘గో, టెల్ మిషెల్’. అయితే రాజకీయాల్లో ఉన్న మహిళలు, రాజకీయ నేతల భార్యల మీద మాత్రమే పుస్తకాలు రాసే స్పెషలిస్టు కారు బ్రూక్స్. ప్రధానంగా ఆమె ఆఫ్రో–అమెరికన్ మహిళల జీవిత వైవిధ్యాలకు, వారి జీవన వైరుధ్యాలకు ప్రామాణికత కల్పించే చరిత్రకారిణి. కవయిత్రి, నాటక రచయిత్రి. ఆమె రాసిన ‘వండర్ఫుల్ ఇథియోపియన్స్ ఆఫ్ ది ఏన్షియంట్ కుషైట్ ఎంపైర్’ గ్రంథం జగద్విఖ్యాతి చెందినది. కుషైట్లది ఈజిప్టులోని ఇరవై ఐదవ రాజవంశం. డెబ్బై ఎనిమిదేళ్ల పెగ్గీ బ్రూక్స్ బాల్టిమోర్‌లో జన్మించారు. భర్త yð న్నిస్తో కలిసి 1986లో న్యూయార్క్ వెళ్లి స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలు. పుస్తకాలు, నాటికలు ఆమె జీవనాసక్తులు. ఆమె చదివేవీ, రాసేవీ అన్నీ కూడా స్త్రీల సంబంధ సామాజికాంశాలే. పొలిటికల్ సైన్స్ బి.ఎ. చదివారు. ప్రజారోగ్యంపై రెండు డాక్టరేట్లు చేశారు. అవి కూడా ఉమెన్ హెల్త్ పైనే. కుటుంబ బంధాలపై, ముఖ్యంగా తల్లీబిడ్డల అనుబంధాలపై ఆమె రచనలకు అవార్డులు కూడా వచ్చాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడితే సమాజం, సామాజిక సంబంధాలు మెరుగుపడితే స్త్రీల స్థితిగతులు మెరుగుపడతాయని బలంగా నమ్ముతారు పెగ్గీ బ్రూక్స్. -
30 ఏళ్ల తర్వాత ఆ రహస్య చీటీలు చూసి..
లండన్ : ఓ మహిళ తన మూడేళ్ల ప్రాయంలో తోబుట్టువులతో కలిసి ఇంటి గోడలో దాచి పెట్టిన రహస్య చీటీలు 30 ఏళ్ల తర్వాత కంటబడ్డాయి. దీంతో చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు కదిలి ఆమె కంటతడి పెట్టుకుంది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్, గ్యుసెలీకి చెందిన కింబర్లీ కోల్బెక్కు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె తోబుట్టువులు ఆండ్రూ, క్రిస్టోఫర్‌లు ఓ కాగితంపై ‘‘ ఈ నోట్ రాసింది.. ఆండ్రూ 12, క్రిస్టోఫర్ 8, కింబర్లీ 3.. 28-7-1987లో’’ అని రాసి దాన్ని చిన్న గాజు బాటిల్లో పెట్టి తమ కిచెన్‌లోని గోడలో దాచారు. తర్వాత వారు ఆ ఇంటినుంచి వేరే చోటుకి మారిపోయారు. ( ఈ ఆట పేరేంటో మీకు గుర్తుందా?) కిచెన్‌లో బయటపడ్డ గాజు సీసా అందులోని కాగితాలు అలా 33 ఏళ్లు గడిచిపోయాయి. ఆ ఇంటిలో నివాసముంటున్న వారు కిచెన్‌ని పునరుద్ధరిస్తుండగా 33ఏళ్ల నాటి గాజు బాటిల్ కనిపించింది. అందులోని కాగితాలు చాలా పాతవని తెలిసి వాటిని ఫేస్బుక్లో ఉంచారు. ఓ రోజు ఫేస్బుక్లో తమ పాత జ్ఞాపకాలకు సంబంధించిన వాటిని చూసి కిమ్ ఆశ్చర్యపోయింది. బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకుని కంటతడిపెట్టింది. ప్రస్తుతం క్యాసిల్ పోర్డ్లో ఉంటున్న ఆమె పాత ఇంటికి వెళ్లి వాటిని తనతో పాటు తెచ్చేసుకుంది. -
ఏపీకి కేంద్రం అన్యాయం: కేవీపీ
సాక్షి, ఢిల్లీ: విభజన చట్టం అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం వైఎస్ జగన్‌కి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు లేఖలు రాశారు. పారిశ్రామిక పన్ను రాయితీలు, వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. ఏపీకి న్యాయం చేస్తానని చెప్పి మోదీ అధికారంలోకి వచ్చారని.. తిరుమల వెంకన్న సాక్షిగా చేసిన వాగ్దానాలను ఆయన మరిచిపోయారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. తప్ప కొత్తగా ఏమీ కోరడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై కుంటిసాకులతో ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం గ్రహించి ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని లేఖలో కోరారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి చిత్తశుద్ధితో పనిచేయాలని.. పారిశ్రామిక పన్ను రాయితీలు రాష్ట్రానికి ఇవ్వాలని కేవీపీ కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా పరిశ్రమల రాకకు సహకరించాలన్నారు. గత ఆరేళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న 60 శాతం నిధులకు మరో 30 శాతం లెక్కకట్టి ఇవ్వాలని కోరారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా ఏపీ నిలబడే వరకు సహాయం అందించాలని లేఖలో కేవీపీ కోరారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని నిలదీయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు కేవీపీ రామచంద్రరావు మరో లేఖ రాశారు. ఏపీ విభజన చట్టంలో ఉన్న వాటిని చట్టబద్ధంగా అమలు చేయించుకోవాలని సూచించారు. (చదవండి: టీడీపీకి భారీ షాక్; మాజీ మంత్రి రాజీనామా) -
మావోయిస్టుల లేఖలు... ఏజెన్సీలో అలజడి
సాక్షి, కొత్తగూడెం: గోదావరి పరీవాహక ప్రాంతం ఆవరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో మావోయిస్టులు తమ కార్యకలాపాలను తిరిగి ముమ్మరం చేయాలనే లక్ష్యంతో.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దాటి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. కాగా, హరిభూషణ్ ఆధ్వర్యంలో మావోయిస్టుల యాక్షన్ టీమ్‌లు భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో రిక్రూట్మెంట్లకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు మావోయిస్టులు గత కొన్ని నెలలుగా వరుసగా లేఖలు విడుదల చేస్తుండడంతో ఏజెన్సీ ప్రాంతంలో అలజడి నెలకొంటోంది. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో చర్ల, సత్యనారాయణపురం సొసైటీల్లో కొన్ని వర్గాల వారిని ఓడించాలంటూ చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో ఓ లేఖ వెలువడింది. అయితే ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చాయి. దీనిపై అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లేఖలు అసలువేనా..? ఇటీవల చందాల కోసం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లోని పలువురు వ్యాపారులు, కాంట్రాక్టర్లకు మావోయిస్టు నాయకులు లేఖలు పంపినట్లు వార్తలు వచ్చాయి. 15 రోజుల క్రితం పినపాక నియోజకవర్గం మణుగూరు పట్టణంలోని పలువురు కాంట్రాక్టర్లు, వ్యాపారులకు సైతం చందాల కోసం అదే మండలం విజయనగరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లేఖలు పంపినట్లు సమాచారం. మావోయిస్టు నేత రాసిన లేఖ.. అయితే వసూళ్ల కోసం పంపిన ఆ లేఖలు అసలువా.. నకిలీవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోల పేరిట నకిలీలు లేఖలు పంపిస్తున్నారా లేక మావోయిస్టు నాయకులే వ్యక్తిగతంగా వసూళ్లకు పాల్పడుతున్నారా అనే సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇటీవల ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్‌ను హెచ్చరిస్తూ మావోయిస్టులు ఓ లేఖను విడుదల చేశారు. దీనికి ప్రతిగా జగదీష్ సైతం మరో లేఖ విడుదల చేయడం గమనార్హం. ‘ఏటూరునాగారం ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం రండ’ని జగదీష్ పేర్కొనడం విశేషం. తరువాత వెంకటాపురం–వాజేడు ఏరియా కార్యదర్శి సుధాకర్ పేరుతో పలువురు నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖలు రాశారు. ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్, వెంకటాపూర్ కమిటీ సుధాకర్, ఏటూరునాగారం కమిటీ సబిత పేరుతో వరుసగా లేఖలు వచ్చాయి. ఇక ఇటీవల జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి పేరిట విడుదలైన లేఖపై సైతం పలువురు వివిధ రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరుస లేఖలతో గోదావరి పరీవాహక ప్రాంతంలో కలకలం నెలకొంది. -
సమాచారం.. బూడిదవుతోంది..
కీసర: ఇళ్లలోకి చేరాల్సిన ఉత్తరాలు, బ్యాంకు చెక్ బుక్కులు, ఆధార్ కార్డులు, నోటీసులు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ చెత్త బుట్టలోకి చేరుతున్నాయి. ఆ తర్వాత ఓ ప్రదేశంలో కాలి బూడిదవుతున్నాయి. గుట్టలు గుట్టలుగా సంచుల్లో వాటిని తగలబెడుతుండగా పోలీసులు సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని అహ్మద్‌గూడలో ఉన్న ప్లాట్లకు సంబంధించి రాంపల్లిదాయరకు చెందిన రామిడి రాజిరెడ్డి, చింతల్‌కు చెందిన భిక్షపతి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ వివాదాస్పద స్థలంలో శుక్రవారం భిక్షపతి పది సంచుల్లో తెచ్చిన ఉత్తరాలు కాల్చివేయడాన్ని గమనించిన రాజిరెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. కీసర ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్ సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే కొన్ని సంచులను కాల్చివేయగా మిగిలిన వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కూకట్పల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన ఉత్తరాలు, చెక్‌బుక్కులు, ఆధార్ కార్డులు, వివిధ బ్యాంకుల నోటీసు పత్రాలతో పాటు ఇతర పత్రాలు ఉండటంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోస్టల్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో సంబంధిత అధికారులు శనివారం కీసర పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకొని తీసుకెళ్లారు. విచారణ చేపడతాం.. చిరునామా ప్రకారం సంబంధిత వ్యక్తులకు చేరాల్సిన ఉత్తరాలు, ఆధార్ కార్డులు, ఇతర కవర్లు ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటం ఇదే మొదటిసారని సికింద్రాబాద్ తూర్పు డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ (ఏఎస్పీ) పవన్‌కుమార్ తెలిపారు. వాటిని తెచ్చి కాల్చివేయాల్సిన అవసరం భిక్షపతికి ఏంటి? అతడికి ఆ ఉత్తరాలు ఎవరు ఇచ్చారనే విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. -
తోక లేని పిట్ట ఇమడ'లేఖ'
నెల్లూరు(బారకాసు):ఉత్తరం ఒక మధురమైన అనుభూతి.. గుండె గదిలో నిక్షిప్తమైన జ్ఞాపకాల తడి.. ఉత్తరాలు మన ఆత్మీయుల యోగక్షేమాలకు ఆనవాళ్లు.. ప్రేయసీ ప్రియుల్లో విరబూసిన పారిజాతాలు.. స్వాప్నికుల మనసులను రాగరంజితం చేసే ఊహా చిత్రాలు.. సరిహద్దుల్లో.. మంచుకురిసే రాత్రుల్లో పహారా కాస్తూ శత్రువుల గుండెలకు తుపాకీ ఎక్కుపెట్టిన సైనికుడు తన భార్యకు చేసుకునే హృదయ నివేదన.. ఉత్తరం కోసం ఎన్నెన్ని ఎదురుచూపులో.. ఎన్నెన్ని పడిగాపులో.. ఇలా మానవ సంబంధాలకు నిలయంగా వెలుగొందిన ఉత్తరాలు నేడు కనుమరుగయ్యాయి. సెల్ఫోన్లు, ఎస్ఎంఎస్, వాట్సాప్‌లు, ఈ–మెయిల్ లాంటి ఆధునిక సమాచార వ్యవస్థలు రావడంతో ఉత్తరం అస్థిత్వాన్ని కోల్పోయింది. రంగురంగుల లేఖలతో సీతాకోకచిలుక గుంపు వాలినట్లు కనిపించే ఇంట్లోని చిలక్కొయ్య(హ్యాంగర్) తోక లేని పిట్టలు(ఉత్తరాలు) లేక వెలవెలబోయింది. మనసాగ‘లేఖ’ బంధువులు, మిత్రులు, ఆప్తులు తమ వారితో వారి కష్టసుఖాలను పంచుకునేందుకు మనసారా లేఖల ద్వారా సమాచారం చేరవేసుకునే వారు. కాగా ఆ ఉత్తరాల మధురానుభూతులు, తీపి జ్ఞాపకాలు నేడు కనుమరుగయ్యాయి. స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా రూపంలో లేఖలు కనిపించకుండాపోయాయి. కలం స్నేహం ఎవరెక్కడుంటారో తెలియదు. వారపత్రికలు, మాసపత్రికల ద్వారా పరిచయం అయ్యేవారు. ఆ తర్వాత కలం స్నేహంపై ఆసక్తి ఉన్న వారి చిరునామాలను పత్రికల్లో ప్రచురించేవారు. అలాంటి అభిరుచి ఉన్న వారి నుంచి ప్రత్యుత్తరాలు అందుకునేవారు. కలం స్నేహం అంటే ఒకప్పుడు గొప్ప క్రేజ్ ఉండేది. పేజీలకు పేజీలు ఉత్తరాలు రాసుకునే వారు. ఇదంతా గతం. పూజ్యులైన అమ్మానాన్నలకు.. ఇప్పుడంటే సెల్ఫోన్లు వచ్చాయి. వాట్సప్ సందేశాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఇలా కాదు. పైచదువుల కోసం, ఉద్యోగం కోసం దూరప్రాంతాలకు వెళ్లే పిల్లలు ఉత్తరాలు రాస్తే తప్ప వారి తల్లిదండ్రులకు యోగక్షేమాలు తెలిసే అవకాశం ఉండేది కాదు. అలాగే తల్లిదండ్రులు తమ సమాచారాన్ని పిల్లలకు తెలియజేయాలంటే ఉత్తరమే వారధి. ‘పూజ్యులైన అమ్మానాన్నల పాదపద్మాలకు నమస్కరించి’ అంటూ దూరప్రాంతాల నుంచి కొడుకు, అత్తారింటి నుంచి కూతురు రాసే ఉత్తరాలను చూసుకుని తల్లిదండ్రులు పులకించిపోయేవారు. ఇలా మానవ సంబంధాలకు వారధిగా నిలిచిన ఉత్తరాలు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. వాటిస్థానంలో ఆధునిక సమాచార మాధ్యమాలు అల్లుకున్నాయి. ఒకప్పుటి ఉత్తరం ఇప్పుడు సరికొత్త హంగులు సంతరించుకుంది. బంధుమిత్రుల మధ్య ఆప్యాయతతో నిండిన పలకరింపులను పంచిన లేఖలు కార్పొరేట్ సంస్థలకు, వినియోగదారులకు మధ్య వారధులుగా సరికొత్త అవతారం ఎత్తాయి. సెల్ఫోన్లు, ఈ–మెయిల్స్, ఎస్ఎంఎస్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంటర్నెట్, టెలిఫోన్లు, ఎంఎంఎస్, చాటింగ్లకు దీటుగా సేవలు విస్తరించాయి. పోస్టుకార్డులు, ఇంగ్లాండ్ లెటర్ స్థానంలో ఈ–పోస్టు, స్పీడ్‌పోస్టు, బిజినెస్ పోస్టు వచ్చి చేరాయి. ఎక్స్‌ప్రెస్ పార్శిల్పోస్టు, ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఉత్తరాలు, బిజినెస్ పోస్ట్ రిటైల్ పోస్టు, బంగారు నాణేల విక్రయాలు, పేమెంట్ బ్యాంకులుగా పోస్టాఫీసులు పలు సేవలు అందిస్తున్నాయి. ప్రధాన సమాచార వారధి నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ సమీపంలో సుమారు 50 ఏళ్ల నుంచి పెద్దపోస్టాఫీసు ఉంది. ఇప్పటికీ ఆ ప్రధాన కార్యాలయం అక్కడే కొనసాగుతోంది. ప్రతిరోజూ వేలాది ఉత్తరాలు ఇక్కడి నుంచి ప్రజలకు చేరేవి. టెక్నాలజీలో ఉత్తరం బందీ అయ్యింది. ఆత్మీయులకు రాసే ఉత్తరాల స్థానంలో సమస్థ ప్రపంచాన్ని గుప్పెట్లో బంధించే స్మార్ట్‌ఫోన్ రాజ్యమేలుతోంది. ఇది మానవ సంబంధాలను తెంచుతుందో.. ఉంచుతుందో... అర్థం కాని పరిస్థితిని చూస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దు
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం... కార్మికులంతా సంఘటితంగా ఉద్యమించి డిమాండ్ల సాధనకు దీక్షగా సమ్మెలో పాల్గొన్నారు. విధుల్లో చేరండంటూ ముఖ్యమంత్రి మూడు సార్లు పిలిచినా స్పందించకుండా కార్మిక సంఘ నేతల సూచనలకే పెద్ద పీట వేశారు. ఇప్పుడు తీరు మారిపోయింది. రెండేళ్ల వరకు తమ కార్మిక సంఘాలకు ఎన్నికలే వద్దంటూ ఇప్పుడు ఆ కార్మికుల సంతకాలతోనే మూకుమ్మడి లేఖలు లేబర్ కమిషనర్‌కు అందుతున్నాయి . గత ఆదివారం సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో, రెండేళ్ల వరకు యూనియన్లే అవసరం లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిపోల వారీగా ఓ నిర్దేశిత పత్రం సిద్ధం చేసి దానిపై కార్మికుల సంతకాలు తీసుకుని లేబర్ కమిషనర్ కార్యాలయానికి పంపుతున్నారు. దీనిపై మళ్లీ కార్మిక సంఘాల జేఏసీ స్పందించింది. ఇది వేధించటమేనని పేర్కొంటూ నిరసనగా శుక్రవారం డిపోల ఎదుట ధర్నాలకు పిలుపునిచ్చింది. ‘వెల్ఫేర్ కౌన్సిళ్లపై నమ్మకం ఉన్నందునే...’ డిపో స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం వెల్ఫేర్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని ఆత్మీయ సమ్మేళనంలో సీఎం సూచించారు. ప్రతి డిపో నుంచి ఇద్దరు చొప్పున ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, ఆ కమిటీలే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాయన్నారు. రెండేళ్ల వరకు ఇక కార్మిక సంఘాలతో పని ఉండదని, అప్పటి వరకు గుర్తింపు సంఘం ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన పనిలేదని ఆయన వివరించారు. రెండేళ్ల తర్వాత యూనియన్లు అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైతే అప్పుడు చూద్దామని ముక్తాయించారు. దీనికి అనుగుణంగా అధికారులు చర్య లు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి లేఖల కార్యక్రమం మొదలైంది. కార్మికుల సమస్యను తక్షణం పరిష్కరించేందుకు ‘వెల్ఫేర్ కౌన్సిళ్లు’కృషి చేస్తాయన్న నమ్మకం తమకు ఉందని, రెండేళ్ల వరకు గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు అవసరం లేదని ఏ డిపోకు ఆ డిపోగా ఓ నమూనా సిద్ధం చేసి కార్మికులందరితో సంతకాలు తీసుకుంటున్నారు. జేఏసీ నేతలు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కార్మికులకు ఇష్టం లేకపోయినా, అధికారులు బలవంతంగా వారితో సంతకాలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
ఉత్తరానికి కొత్త రక్తం
ఉత్తరం అనే పదమే డిక్షనరీలోంచి మాయమైపోతుంటే ఫేస్బుక్లో మాత్రం ఓ పేజీ కనిపిస్తోంది.. ‘లెటర్స్ ఫ్రమ్ ఎ స్ట్రేంజర్, ఇండియా’’ అనే పేరుతో! ఆ పేజీని మొదలుపెట్టిన మహిళ పారోమితా బార్దోలై. అస్సాం నివాసి. తన పన్నెండో ఏట నుంచి ఉత్తరాలు రాసే అభిరుచిని అలవాటుగా చేసుకున్నారు ఆవిడ! తల్లిదండ్రులతో ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా అక్కడ పరిచయమైన తన ఈడు పిల్లల దగ్గర చిరునామాలు ఇచ్చిపుచ్చుకుని .. స్వంత ఊరు తిరిగొచ్చాక వాళ్లకు ఉత్తరాలు రాసేవారట. సాంకేతిక విప్లవం తర్వాత ‘హేయ్.. వాట్సప్..’ అంటూ ఫోన్ యాప్‌లే పొద్దుకు పదిసార్లు పలకరిస్తూండడంతో ఉత్తరాల ఊసే లేకుండా పోయింది కదా. అందుకని ఉత్తరాలకు మళ్లీ ఊపిరి పోయడానికి డిజిటల్ మీడియానే ప్లాట్‌ఫామ్ చేసుకుంటే.. అని ఆలోచించారు పారోమితా. వెంటనే ఫేస్బుక్లో పేజీ తెరిచారు. ఎవరైనా తమకు ఉత్తరాలు రాస్తే బాగుండు అనుకునే వాళ్ల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను ఆహ్వానించారు. వెంటనే ప్రపంచ వ్యాప్తంగా వినతులు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఉత్తరాలు రాస్తాం.. ఉత్తరాలు అందుకుంటాం అని. ఆ స్నేహ విన్నపాలను పంపిన వాళ్లను స్నేహితుల జాబితాలోకి మార్చేసుకున్నారు పారోమితా. తీర్పులు, సూక్తులు వల్లించకుండా.. జీవితానుభూతులు, నేర్చుకున్న విషయాలు, మరిచిపోలేని జ్ఞాపకాలు.. ఇలా మంచి భావనలను పంచి కొత్త ఉత్సాహం కలిగేలా మీరు రాసే ఉత్తరాలు ఉండాలి అనే షరతు కూడా పెట్టారు. అలాగే ‘లెటర్స్ ఫ్రమ్ స్ట్రేంజర్, ఇండియా’ పేజీలో ఫ్రెండ్స్ అయిన వాళ్లంతా పద్దెనిమిదేళ్లు నిండిన వారై ఉండాలి, విధిగా తమ చిరునామాలు ఆధారాలతో సహా పొందుపర్చాలన్నది నిబంధన. జాబు అందుకున్నాక జవాబు రాయడం, రాయకపోవడం వాళ్ల ఇష్టం. ఉత్తరం కోసం ఎదురుచూడ్డం, అందుకున్నాక దాన్ని చదవడం.. వంటి నిజమైన అనుభూతి కోసం ఉత్తరాలు రాయించుకునే వాళ్లే ఎక్కువని పారోమితా చెబుతున్నారు. ఇప్పటివరకు ఆమె తన స్వహస్తాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తర ప్రియులకు దాదాపు వంద జాబులు రాసి పోస్ట్ చేశారు. ఈ ఉత్తరాల ప్రయాణంలో ప్రతి నెలా 30 మంది చేరుతున్నారట. ‘‘త్వరలోనే ఈ వంద ఉత్తరాలతో ఓ పుస్తకాన్నీ వేయాలనుకుంటున్నాను’’ అని చెబుతున్నారు పారోమిత. -
ఓటు మీ హక్కు.. వినియోగించుకోండి
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితాలో పేరు నమోదు.. పొరపాట్ల సవరణ.. చిరునామా మార్పు తదితరాల గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నా అది ప్రజలందరికీ చేరడం లేదని, వీటిపై వారందరికీ అర్థమయ్యేలా సరళమైన తెలుగుభాషలో ఓటరు నమోదుపై చైతన్యం కలిగేలా ఇంటింటికీ పోస్టుకార్డుల పంపిణీని చేపట్టామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. అంతే కాకుండా తమవైపు నుంచి ప్రజలకు చేరవేస్తున్న సమాచారంతోపాటు వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తెలుసుకునేందుకు కూడా ఉపకరిస్తుందని సీఈఓ చిరునామాతో రిప్లయ్ పోస్టుకార్డుతో కూడిన లేఖలను పంపామన్నారు. ‘ఓటు మీ హక్కు.. ఓటు వేయడం మీ బాధ్యత’అంటూ రజత్‌కుమార్ స్వీయ సంతకంతో కూడిన లేఖల్ని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే మేరకు రాష్ట్రంలోని కోటి ఐదు లక్షల కుటుంబాలకు చేరేలా వీటిని పంపించి నట్లు తెలిపారు. సంక్రాంతికన్నా ముందుగానే పంపాలనుకున్నప్పటికీ, ఆలోగా అన్ని పోస్టుకార్డుల్ని పోస్టల్‌శాఖ తమకు సమకూర్చలేకపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు పోయిందని, ఓటు వేయలేకపోయాని పలువురు వేదన వ్యక్తం చేయడంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్కరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఈ లేఖలు ఉపకరించగలవన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆలోచన రావడానికి కారణం.. ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి గురువారం రజత్‌కుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఓటర్ల ఇళ్ల వద్దకుబూత్‌స్థాయి అధికారులు రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా నగరంలో బీఎల్ఓలు (బూత్‌స్థాయి అధికారులు) తమ ఇళ్లకు రాలేదని, ఇంటింటికీ సర్వే చేయకుండానే ఓట్లు తొలగించారని పలువురు తమ దృష్టికి తేవడంతో ఈ రకంగానైనా బీఎల్ఓలు ప్రతీ ఇంటికీ వెళ్తారనే ఉద్దేశంతోనూ తిరుగు పోస్టుకార్డుతో కూడిన లేఖల పంపిణీని బీఎల్ఓల ద్వారా చేపట్టామన్నారు.ప్రతి ఇంటికి వెళ్లి లేఖను ఇవ్వడంతోపాటు వారి నుంచి అకనాలెడ్జ్‌మెంట్‌కూడా తీసుకోవాల్సి ఉన్నందున కచ్చితంగా వెళతారనే ధీమా వ్యక్తం చేశారు. ఈ రకంగానైనా బీఎల్ఓలకు, ఓటర్లకు మధ్య సంబంధం ఏర్పడుతుందన్నారు. తమ లక్ష్యాన్ని నూరు శాతం పూర్తిచేసేవారికి ప్రోత్సాహక బహుమతులిచ్చే ఆలోచన ఉందని చెప్పారు. లేఖలకు ఓటర్ల నుంచి ధన్యవాదాలు లేఖలు పంపినందుకు ధన్యవాదాలు అంటూ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, తాను దాదాపు వంద లేఖల్ని చదివానని తెలిపారు. కొందరు ఖాలీ రిప్లయ్ కార్డులు కూడా పంపారని, చాలామంది ఎపిక్‌కార్డులు రాలేదని ఫిర్యాదు చేశారన్నారు. ప్రకటనల కోసం చేస్తున్న ఖర్చులో భాగంగానే ఇంటింటికీ పోస్టుకార్డు పంపినట్లు తెలిపారు. వాట్సాప్ మెసేజ్‌లు, ఎస్ఎంఎస్ల గురించి కూడా ప్రస్తావన వచ్చినప్పటికీ, బీఎల్ఓలు ప్రజలను నేరుగా కలుసుకునేందుకు పోస్టుకార్డుల్ని పంపిణీ చేశామన్నారు. ఉర్దూ చదివే వారికోసం ఉర్దూలోనూ ఈ లేఖలు పంపించనున్నట్లు తెలిపారు. ఓటు నమోదుపై ప్రజలకు ఏమాత్రం అవగాహన లేదనడం కూడా సరికాదని, అసెంబ్లీ ఎన్నికల ముందు రెండునెలల్లో ఇరవై లక్షలమందికి పైగా నమోదు చేసుకున్నారని చెప్పారు. దివ్యాంగులు, థర్డ్జెండర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేపట్టిన కార్యక్రమాలు అసెంబ్లీ పోలింగ్‌లో మంచి ఫలితమిచ్చాయని చెప్పారు. వివరాలతో లేఖలు.. ఓటరు నమోదుపై చాలామందికి సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేసేందుకూ, వారికి సులభంగా అర్థమయ్యేలా కొత్తగా పేరు నమోదు చేసుకోవాలంటే ఏ ఫారం నింపాలి.. చిరునామా మారితే ఏ ఫారం భర్తీచేయాలి.. పొరపాట్ల సవరణకు ఏ ఫారం వినియోగించాలో లేఖలో వివరించామన్నారు. ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయవచ్చో కూడా తెలిపామన్నారు. పోలింగ్‌కు ముందు నామినేషన్ల గడువు వరకు ఓటరు జాబితాలో ఎప్పుడైనా పేరు నమోదు చేసుకోవచ్చునని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రం ఇప్పుడే సరిచూసుకోవాలని రజత్‌కుమార్ ప్రజలను కోరారు. ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే ఓటు వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
మావోయిస్టుల లేఖల కలకలం
సాక్షి, గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండల కేంద్రంలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. దాచేపల్లి మండలం తహాశీల్దార్ కార్యాలయంలో అవినీతి పెరిగిందని, అధికారులు పద్దతులు మార్చుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన మావోయిస్టులు. పల్నాడులో అక్రమార్కులకు హెచ్చరిక పేరుతో మరో లేఖ విడుదల చేశారు. పల్నాడు ప్రాంతంలో బెల్ట్ షాపులు ఎత్తివేయాలి. కబ్జా చేసిన భూములను తక్షణమే ఖాళీ చేయాలని మావోయిస్ట్‌ల లేఖల ద్వారా హెచ్చరించారు. -
మీ ఊరికి నిధులు... మాకు ఓట్లు!
సాక్షి, హైదరాబాద్: ‘ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఒక్క ల్యాబర్తి గ్రామానికే నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.1.13 కోట్లు ఇచ్చింది. కానీ, అవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పుకుంటోంది. ఆ మాటలను నమ్మవద్దు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మే పార్టీ బీజేపీ. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించండి’అంటూ గ్రామాలకు బీజేపీ లేఖలు పంపుతూ వినూత్న ప్రచారానికి తెర తీసింది. ఒక్క ల్యాబర్తే కాదు.. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి కేంద్రం వెచ్చించిన నిధుల మొత్తాన్ని వివరిస్తూ గ్రామాలకు లేఖలు పంపిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో అన్ని జిల్లాల్లో ఈ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చింది. 60 నుంచి 90 శాతం నిధులు కేంద్రం ఇచ్చినవే.. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించిన నిధుల్లో 60 నుంచి 90 శాతం నిధులను నరేంద్రమోదీ ప్రభుత్వమే ఇచ్చిందంటూ బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. ఉపాధి హామీ కింద చెల్లించే కూలీని రూ.169 నుంచి రూ.205 పెంచింది కేంద్ర ప్రభుత్వమేనని లేఖల్లో వివరించింది. నాలుగేళ్లలో తెలంగాణలోని ఒక్కో గ్రామానికి కేంద్రం రూ. 10 లక్షల నుంచి రూ. కోటికి పైగా ఇచ్చిందని, అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం రకరకాల కారణాలతో దుర్వినియోగం చేసిందని పేర్కొంది. స్వచ్ఛ భారత్ కింద ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 7,200–9000 చొప్పున 20 లక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి మోదీ ప్రభుత్వమే ని«ధులు ఇచ్చిందని వెల్లడించింది. గ్రామాల్లో చెత్త సేకరణకు ఉపయోగించే ట్రైసైకిళ్ల పంపిణీ కోసం కేంద్రం ఒక్కో సైకిల్‌కు రూ.12 వేలు ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని నిరుపయోగం చేసిందని ఆరోపించింది. రూ.కిలో బియ్యానికి కేంద్రం ఇస్తున్నది రూ.30... రూపాయికి కిలో బియ్యం పథకానికి కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా డబ్బును వెచ్చిస్తుంటే టీఆర్ఎస్ దానిని తమ పథకంగా చెప్పుకుంటోందని బీజేపీ విమర్శిస్తోంది. కిలో బియ్యానికి మోదీ ప్రభుత్వం రూ. 30 సబ్సిడీ భరిస్తుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ. 2 వెచ్చిస్తోందని వెల్లడించింది. కేంద్రం ఒక్కో కుటుంబానికి ఈ పథకం కింద ఏటా రూ.8,623 ఖర్చు చేస్తోందని వివరించింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్రం తెలంగాణకు రూ. 1,500 కోట్లు మంజూరు చేసిందని, రూ.5 లక్షల ఉచిత వైద్య బీమా పథకం ‘ఆయుష్మాన్ భారత్’ను అమల్లోకి తెస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మోదీకి పేరు వస్తుందని అమలు చేయడం లేదని వివరించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదల ఇళ్ల నిర్మాణానికి రూ. 2 వేల కోట్లు కేటాయిస్తే టీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ పేరుతో తన ప్రయోజనాలకు వినియోగించుకుంటోందని ఆరోపించింది. పథకాల పేర్లు మార్చి జిమ్మిక్కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కో ప్రసవానికి కేంద్రం రూ.6 వేలు ఇస్తుంటే, పథకాల పేర్లు మార్చి టీఆర్ఎస్ ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటోందని బీజేపీ పేర్కొంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద రూ. 6 వేలు కేంద్రం ఇస్తుండగా టీఆర్ఎస్ ఆ పేరును కేంద్రానికి రాకుండా చేస్తోందని విమర్శించింది. రాష్ట్రంలో 1.21 లక్షల ఇళ్లకు కేంద్రమే ఉచిత విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చిందని తెలిపింది. మద్దతు ధర పెంపు, మొక్కల పెంపకం, సాగునీరు, విత్తన పంపిణీకి కేంద్రం రూ.1,985 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.956 కోట్లు , గొర్రెల పంపిణీ పథకం కోసం కేంద్రం సబ్సిడీ కింద రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నా అవన్నీ టీఆర్ఎస్ ఘనతగా చెప్పుకుంటోందని విమర్శించింది. ఈ నేపథ్యంలో ప్రజలు బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసింది. -
మీ పిల్లలు క్షేమం.. నన్ను క్షమించండి
మే సాయ్ (థాయ్‌లాండ్): గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ జట్టులోని పిల్లల తల్లిదండ్రులకు వారి కోచ్ ఎకపోల్ ఛంథవాంగ్ క్షమాపణలు తెలిపారు. తామంతా క్షేమంగానే ఉన్నామనీ, తమ కుటుంబ సభ్యులు బాధపడకుండా ధైర్యంగా ఉండాలని బాలురు కూడా కోరారు. గుహలో చిక్కుకుపోయిన తర్వాత తొలిసారిగా కోచ్, పిల్లలు కలిసి తల్లిదండ్రులకు లేఖలు రాశారు. ఈ లేఖలను సహాయక బృందంలోని డైవర్లు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ‘బాలుర తల్లిదండ్రులకు నా క్షమాపణలు. పిల్లలంతా క్షేమంగానే ఉన్నారు. సహాయం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు’ అని ఎకపోల్ తన లేఖలో పేర్కొన్నారు. మరో బాలుడు రాసిన లేఖలో ‘నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నా పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేయడం మరచిపోకండి’ అని ఉంది. టున్ అనే మరో బాలుడు ‘అమ్మా, నాన్న! దయచేసి బాధపడకండి. నేను బాగున్నా. నేను రాగానే ఫ్రైడ్ చికెన్ తినడానికి బయటకు వెళదాం’ అని రాశాడు. ఓ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన 12 మంది బాలురు, కోచ్‌తో కలసి థామ్ లువాంగ్ గుహలో జూన్ 23న సాహసయాత్రకు వెళ్లగా అప్పుడే కురిసిన భారీ వర్షాలకు లోపలే చిక్కుకుపోవడం తెలిసిందే. ఇప్పటికిప్పుడు తీసుకురాలేం.. పిల్లలందరికీ ఈత సరిగ్గా రాకపోవడం, అదీ గుహలో కావడంతో ఇప్పటికిప్పుడు వారందరినీ నీటి కింద నుంచే బయటకు తీసుకొచ్చే సాహసం ఏదీ చేయబోమని చియాంగ్ రాయ్ గవర్నర్ నరోగ్సక్ చెప్పారు. ఇప్పటికే నైపుణ్యవంతుడైన డైవర్ నీటి కింద నుంచి వస్తూ చనిపోయాడనీ, పిల్లలను తీసుకురావడం సురక్షితం కాదని ఆయన చెప్పారు. మళ్లీ భారీ వర్షాలు మొదలైతే సహాయక సిబ్బంది గుహ లోపలికి చేరుకోవడానికి కూడా అవకాశం ఉండదనీ, వర్షాలు తగ్గినందున ఇప్పుడు వారిని కాపాడాలని కొందరు అంటున్నారు. 100కు పైగా రంధ్రాలతో ప్రయత్నం.. కొండకు వందకుపైగా రంధ్రాలు చేసి వారంతా ఎక్కడున్నారో కనిపెట్టేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కొన్ని రంధ్రాలను 400 మీటర్ల లోతుకు వేసినా పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయారు. గుహలో ఆక్సిజన్ స్థాయులు తగ్గకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. -
మోదీకి పది లక్షల లేఖలు..
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆమ్ ఆద్మీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆదివారం కేజ్రీవాల్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇచ్చిన హామీ మేరకు 2019 లోక్‌సభ ఎన్నికలలోపు ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని మోదీని కోరారు. దీనిపై ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా ప్రకటించారు. ఆప్ కార్యకర్తలు ఢిల్లీలోని ప్రతి ఇంటికి చేరుకుని హోదాకు ప్రజల మద్దతు కొరతారని తెలిపారు. సీఎం కేజ్రీవాల్ సంతకం చేసిన లేఖపై పది లక్షల మందితో సంతకాలు చేయించి వాటిని ప్రధాని మోదీకి పంపుతామని మనీశ్ శిసోడియా పేర్కొన్నారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయం ఏంటో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలో అన్ని పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఢిల్లీ జాతీయ రాజధాని అయినందువల్ల రాష్ట్ర హోదా ఇవ్వలేమని కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలను కేజ్రీవాల్ కొట్టిపారేశారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్ఎమ్డీసీ) మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని, మిగిలిన ప్రాంతానికి రాష్ట్రహోదా ఇవ్వాలని అన్నారు. -
మీడియాకు లెటర్లు రాయడం మానుకోండి..
ఆదోని టౌన్: ‘బుద్ధిగా డ్యూటీలు చేసుకోండి. అనవసరమైన తగవులు పెట్టుకోవద్దు. విభేదాలతో ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుంది. మీలో కొంతమంది అధికారులకు, మీడియాకు లెటర్లు రాస్తున్నారు. ఇంతటితో ఆపేయండి. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. నాకు ఎవరూ లెక్కకాదు. నలుగురు డీసీహెచ్ల్లో కంటే నేనే సీనియర్‌ను. ఎవరు చెప్పినా వినను. గిరిజన ప్రాంతాలకు బదిలీ చేస్తా’ అంటూ స్టాఫ్, హెడ్ నర్సులను ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ రామకృష్ణారావు హెచ్చరించారు. ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఏరియా ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై డీసీహెచ్ విచారణ చేశారు. ప్రసవం కోసం వచ్చిన గ్రామీణప్రాంత పేద మహిళలను కొంతమంది డాక్టర్లు, సిబ్బంది భయపెడుతూ ప్రైవేటే ఆసుపత్రులకు తరలించి కమీషన్లు తీసుకుంటున్నారని మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ డీసీహెచ్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రసవం సమయంలో ఒక్కొక్క గర్భిణి నుంచి వెయ్యి, రెండువేలు దాకా వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇందుకు డీసీహెచ్ స్పందిస్తూ ఇక నుంచి విధి నిర్వహణలో ఎవరైన నిర్లక్ష్యంగా వ్యవహరించినా వెంటనే బదిలీ చేస్తానని హెచ్చరించారు. వచ్చేనెలలో ప్రిన్సిపాల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆదోనిలో పర్యటించనున్నట్లు చెప్పారు. ఈఎస్ఐ ఆస్పత్రి ఆవరణలో ఐదెకరాల స్థలాన్ని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులు పరిశీలన కూడా చేసినట్లు తెలిపారు. బ్లడ్‌బ్యాంక్ ఉద్యోగుల వినతి ఆదోని బ్లడ్ బ్యాంక్, ఆలూరు, ఎమ్మిగనూరు, మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ కేంద్రాల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆరునెలలుగా జీతాలు అందలేదని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని డీసీహెచ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. -
ఐ యామ్ వెరీ సారీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మరో ఇద్దరు ప్రత్యర్థులకు తాజాగా క్షమాపణలు చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశాననీ, తనను క్షమించాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కొడుకు అమిత్ సిబల్‌లకు ఆయన లేఖలు రాశారు. దేశంలోనే తొలి 20 మంది అత్యంత అవినీతిపరుల్లో గడ్కారీ ఒకరంటూ గతంలో కేజ్రీవాల్ ఓ జాబితాను ప్రచురించారు. అమిత్ సిబల్పై కూడా అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో వారు కేజ్రీవాల్‌పై వేర్వేరుగా పరువునష్టం కేసులు వేయగా ప్రస్తుతం విచారణ నడుస్తోంది. కేజ్రీవాల్ క్షమాపణ లేఖలను ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. అమిత్ సిబల్‌కు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా క్షమాపణలు చెప్పారు. అనంతరం పరువునష్టం కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు గడ్కారీ, కేజ్రీవాల్ సంయుక్తంగా ఒక దరఖాస్తును, కేజ్రీవాల్, అమిత్ సిబల్‌లు మరో దరఖాస్తును కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ రెండు కేసుల నుంచి కేజ్రీవాల్‌కు కోర్టు విముక్తి కల్పించింది. కాగా, కోర్టు కేసుల నుంచి బయటపడటానికి కేజ్రీవాల్ న్యాయవాదులు అమలు చేస్తున్న వ్యూహం ఇదని విశ్లేషకులు అంటున్నారు. సిసోడియా మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేయాల్సిన సమయాన్ని అహంభావంతో కోర్టుల చుట్టూ తిరిగి వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే క్షమాపణలు చెప్పామన్నారు. ‘మా వ్యాఖ్యలతో ఎవరైనా బాధకు గురైతే మేం క్షమాపణలు చెప్తాం. అహంకారంతో దాన్ని వైరంగా మార్చం. ప్రజల కోసం పనిచేయడానికి మేం ఇక్కడున్నాం. కోర్టుల చుట్టూ తిరగడానికి కాదు’ అని ఆయన అన్నారు. మరోవైపు తనపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వేసిన రెండో పరువునష్టం కేసును కేజ్రీవాల్ కోర్టులో వ్యతిరేకించారు. కేజ్రీవాల్ సూచనల మేరకే ఆయన న్యాయవాది రాం జెఠ్మలానీ తనను అభ్యంతరకర పదాలతో దూషించాడంటూ జైట్లీ ఈ కేసు వేశారు. మూడు పోయి.. మరో 30 ఉన్నాయి కేజ్రీవాల్‌పై ఇంకా 30 పరువునష్టం కేసులున్నాయి. శిరోమణి అకాలీదళ్ నేత విక్రమ్ సింగ్ మజీథియాకు మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధాలు ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపించడంతో ఆయన పరువునష్టం కేసు వేయడం, ఇటీవలే ఆయనకూ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పి కేసును ఉపసంహరించుకునేలా చేయడం తెలిసిందే. కేజ్రీవాల్ వైఖరిని ఆప్ నేతలే కొందరు వ్యతిరేకిస్తున్నారు. కేజ్రీవాల్ క్షమాపణ కోరడంతో ఆప్ పంజాబ్ చీఫ్ పదవికి ఎంపీ భగవంత్ మన్ రాజీనామా కూడా చేశారు. గడ్కారీ, సిబల్‌లకు కేజ్రీ క్షమాపణ చెప్పడంతో మరో రెండు కేసుల నుంచి ఆయన బయటపడనున్నారు.అయినా మరో 30 పరువునష్టం కేసులు ఆయనపై ఉన్నాయి. ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? 20 మంది అత్యంత అవినీతిపరుల జాబితాను ప్రచురించిన కేజ్రీవాల్ ఇప్పుడు ఎందుకు వెనక్కు జారుకుంటున్నారని ఆప్ మాజీ నాయకురాలు అంజలీ దమానియా ప్రశ్నించారు. గడ్కారీ అవినీతిపరుడే అనేందుకు తన వద్ద ఉన్న ఆధారాలను అప్పుడే కేజ్రీవాల్‌కు ఇచ్చాననీ, అవినీతిపరులకు శిక్ష పడేలా చేయకుండా ఆయన ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారన్నారు. అంజలీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరఫున గడ్కారీపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2015లో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన సమయంలో ఆమె ఆప్‌ను వీడారు. -
ముస్లింలపై లండన్‌లో సంచలన లేఖలు
లండన్ : ముస్లింలకు వ్యతిరేకంగా లండన్‌లో సంచలనాత్మక లేఖలు బయటకు వచ్చాయి. ముస్లింలపై దాడులకు సిద్ధం కండి అని ఉపదేశిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆ లేఖలను విడుదల చేశారు. వచ్చే నెల (ఏప్రిల్) 3న తమ పిలుపునందుకొని 'ముస్లింను శిక్షించండి' కార్యక్రమం (పనిష్ ఏ ముస్లిం డే)లో పాల్గొనాలని ఆ లేఖల్లో ఉపదేశించారు. పైగా వీటిని ఆన్లైన్లో కూడా చెక్కర్లు కొట్టించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పనిష్ ఏ ముస్లిం డే అనే పేరిట విడుదల అయిన లేఖలను కొందరు వ్యక్తులు లండన్, యార్క్‌షైర్, మిడ్‌ల్యాండ్ నగరాల్లో పంచి పెట్టారు. దీంతో ఈ కేసును బ్రిటన్‌లో ఉగ్రవాద కేసులను విచారించే దర్యాప్తు సంస్థకు అప్పగించారు. తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పని చేసే నిఘా సంస్థ ఈ పత్రాలపై దర్యాప్తును చేపట్టినట్టు, సమాజానికి హాని కల్గించే ఇలాంటి తాము సహించబోమని, కొన్ని ముస్లిం వ్యతిరేక గ్రూపులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కలకలం సృష్టించిన ఆ లేఖల్లో ముస్లింలపై భౌతిక దాడులు చేయాలని, ముస్లిం మహిళల హిజాబ్‌లను తొలగించాలని, యాసిడ్ దాడులు కూడా చేయాలని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ దాడులకు పాల్పడిన వారికి వారు చేసిన దాడి తీవ్రతను బట్టి బహుమతులు కూడా ఇస్తామని ఆ లేఖల్లో ప్రచురించడం గమనార్హం. -
పవన్‌కు మోదీ ఝలక్ ఇచ్చారా?
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టేసారా? గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన పవన్‌పై పొగడ్తల వర్షం కురిపించిన మోదీ తన ప్రతిష్టాత్మక కార్యక్రమం స్వచ్ఛ్ భారత్ కు ఎందుకు ఆహ్వానించలేదు. స్వచ్ఛ భారత్ పట్ల స్ఫూర్తిని కొనసాగించాలంటూ సోమవారం ప్రధాని రాసిన లేఖల్లో పవర్‌స్టార్‌కు స్థానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ‘స్వచ్ఛత హి సేవా’ ఉద్యమ ప్రచారంలో వివిధ రంగాల ప్రముఖులతో పాటు, సినీ రంగ ప్రముఖులకు కూడా లేఖలు రాసిన మోదీ పవన్‌కళ్యాణ్‌కు ఎందుకు లేఖ రాయలేదు? ఇదే ఇపుడు ఇటు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. అక్టోబర్ 2న నిర్వహించనున్న ‘స్వచ్ఛత హి సేవా’ కార్యక్రమాలో పాలుపంచుకోవాలని ప్రధాని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులకు కూడా లేఖలు పంపారు. ముఖ్యంగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబు, బాహుబలి ప్రభాస్ వీరిలో ఉన్నారు. వీరితోపాటు మోహన్ లాల్, అనిల్ కపూర్, అనుష్కశర్మలకు కూడా మోదీ లేఖలు రాయడం విశేషం. కాగా ఇటీవల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కూడా ఒక లేఖ రాశారు. స్వచ్ఛ్ భారత్, మిషన్ భగీరథ కార్యక్రమాలను ప్రశంసిస్తూ అభినందన లేఖ రాశారు. అక్టోబర్ 2న మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలు ‘స్వచ్ఛత హి సేవా’ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు స్వచ్ఛత హి సేవా ఉద్యమంలో పాల్గొనాలని, తన అనుభవాలను నరేంద్రమోదీ యాప్‌లో పంచుకోవాలని పలువుర్ని మోదీ కోరుతున్న సంగతి తెలిసిందే. -
జనరిక్ మందులను పెద్ద అక్షరాలతో రాయాలి
మంత్రి కామినేని ఆదేశం కాకినాడ వైద్యం(కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై వైద్యులందరూ విధిగా రోగులకు జనరిక్ మందులను పెద్ద అక్షరాలతో రాయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ధీరూబాయి లేబొరేటరీ పక్కన రూ.1.50 కోట్లతో కొనుగోలు చేసిన అత్యాధునిక జీఈ కంపెనీకి చెందిన 16 స్లైస్ సిటీ స్కాన్ మెషీన్‌ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటుబడ్జెట్లో ఉన్నా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యపరికరాలు, వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. జీజీహెచ్‌లో రోగులకు వైద్యులు సమష్టిగా నాణ్యమైన వైద్య సేవలందించడంతో ఓపీ సంఖ్య పెరుగుతుందన్నారు. ఆసుపత్రిలో 1,065 పడకలుండగా, 1,800 మంది ఇన్‌పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. సిటీస్కాన్ ప్రస్తుతం విశాఖపట్టణం, కాకినాడలో ప్రారంభించామని, అనంతపురం, తిరుపతి, గుంటూరు ప్రభుత్వాసుపత్రుల్లో సిటీస్కాన్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వైద్య సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టామన్నారు. రూ.20 కోట్లతో ఎంసీహెచ్ బిల్డింగ్ నిర్మాణంలో ఉందని, ఇది పూర్తయితే మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆసుపత్రిలో శానిటేషన్ మెరుగుదలకు చర్యలు తీసుకున్నామన్నారు. నెలకు 1,000 ప్రసవాలు జరుగుతుండగా బేబీకిట్లను అందిస్తున్నామని, త్వరలో తల్లికి కూడా కిట్ అందిస్తామన్నారు. ఆసుపత్రికి 80 శాతం మందులు ప్రభుత్వం సరఫరా చేస్తుందని, మిగతా 20 శాతం మందుల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, డీఎంఈ డాక్టర్ బాబ్జి, జెడ్పీ అధ్యక్షుడు నామన రాంబాబు, డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ మహాలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పాల్గొన్నారు. స్టైఫండ్ కోసం ప్రశ్నించిన పీజీ వైద్యులపై మంత్రి ఆగ్రహం నాలుగు నెలలుగా స్టైఫండ్ విడుదల కావడం లేదని, మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరిన పీజీ వైద్యులపై మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీస్కాన్ ప్రారంభోత్సవానికి ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన మంత్రిని పలువురు పిజీ విద్యార్థులు కలుసుకుని స్టైఫండ్ కోసం అడిగారు. అభివృద్ధి కార్యక్రమం కోసం వస్తే. ఇప్పుడా స్లైఫండ్ కోసం అడిగేది..మీ సమస్యలు లేవనెత్తడానికి ఇదా సమయమంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వైద్యులై ఉండి కూడా ఇలా అడగడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. అక్కడే ఉన్న డీఎంఈ డాక్టర్ బాబ్జి కలుగజేసుకుని తర్వాత మాట్లాడదాం అంటూ సర్ది చెప్పడంతో మంత్రి శాంతించారు. -
ఇదో త్రీ స్టార్ మాయ
ముడుపులిస్తేనే సిఫార్సు లేఖలు మెచ్చిన వారికి నచ్చిన చోటు సాక్షి ప్రతినిధి, కాకినాడ : పోలీసు శాఖలో బదిలీల పర్వం ఒక ప్రహసనంగా మారింది. రూ. లక్షలు మూటలతోపాటు నేతల సిఫార్సులున్న వారికి కోరుకున్న పోస్టింగులు దక్కాయనే చర్చ పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా సరే ప్రజాప్రతి‘నిధుల’ సిఫార్సులుండడటంతో చేసేదేమీ లేక కోరుకున్న పోస్టులు ఇవ్వక తప్పలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు సంబంధిత ఉన్నతాధికారులు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తుని, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు సిఫార్సుల లేఖల కోసం రూ.10 నుంచి రూ.15 లక్షలు కూడా ముట్టజెప్పారని పోలీసు వర్గాలు కోడై కూస్తున్నాయి. జిల్లాలోని పలు సర్కిళ్లకు ఇ¯ŒSస్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నెలల తరబడి వీఆర్‌లో ఉండి పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న వారు, సీఐడీ, ఇంటిలిజెన్స్, ఏసీబీ, ఎస్ఐబీ, ఎలక్ట్రికల్ విజిలె¯Œ్స తదితర లూప్లై¯ŒS పోస్టింగుల్లో చాలా కాలంగా ఉండిపోతున్నవారికి సర్కిళ్లకు అవకాశం దక్కడం లేదు. లూప్లై¯ŒSలో ఉండి రెండు సవంత్సరాలు దాటిన వారున్నా పక్కనపెట్టేసి అవినీతి మరకలున్నా సరే అందలమెక్కిస్తున్నారని పోలీసు వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. బేరసారాలు... నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల కోసం కొందరు పెద్ద ఎత్తున బేరసారాలు జరిపారనే ఆరోపణలున్నాయి. తాజా పోస్టింగుల్లో పిఠాపురం సి.ఐ. ఉమర్‌కు కాకినాడ టూటౌ¯ŒSలో పోస్టింగ్ ఇచ్చారు. ఉమర్‌ను గతంలో వివిధ కారణాలతో పిఠాపురం నుంచి రెండు పర్యాయాలు బదిలీ చేసేందుకు ప్రయత్నించారు. నకిలీ నోట్ల ముఠాను పట్టుకున్న వ్యవహారంలో ఆ ప్రాంతానికి చెందిన ఒక ముఖ్యనేత ఒత్తిళ్లను భరించలేక కేసును నీరుగార్చారనే ఆరోపణలు వచ్చాయి. తాజా పోస్టింగులో ఉమర్‌ను కాకినాడ నగరంలో కీలకమైన టూటౌ¯ŒSకు బదిలీ చేశారు. ∙కాకినాడ సర్పవరం సి.ఐ.గా పనిచేసి గత ఏడాది చివర్లో వీఆర్‌లో పెట్టిన పి.మురళీ కృష్ణారెడ్డిని జిల్లాలోనే రాజమహేంద్రవరం అర్బ¯ŒS పోలీస్ జిల్లాకు బదిలీ చేశారు. కాకినాడ రూరల్ మండలంలో భూ ఆక్రమణలు, సెటిల్మెంట్లలో అధికార పార్టీ నేతలతో మిలాఖతయ్యారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ∙రూరల్‌లో ప్రైవేటు సెటిల్మెంట్లు చేస్తున్నారని భూ యజమానులు ఏలూరు రేంజ్ డి.ఐ.జి.కి ఫిర్యాదులు చేయడంతో అతన్ని వీఆర్‌కు పంపారు. వీఆర్‌లో పెట్టిన తక్కువ సమయంలోనే రాజకీయ ఒత్తిళ్లతో తిరిగి కాకినాడ సిటీలో ఒ¯ŒSటౌ¯ŒS సీసీఎస్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఈ విషయంలో ఒక మంత్రి అడ్డు తగలడంతో ఆ పోస్టింగ్‌ను అతనంతరం నిలిపివేశారు. అమాత్యుని కంటే పై స్థాయిలో ప్రయత్నాల ఫలితంగా మురళీ కృష్ణారెడ్డికి రాజమహేంద్రవరంలో పోస్టింగ్ లభించిందంటున్నారు. ఇతనితో పాటు కాకినాడ టూటౌ¯ŒS సి.ఐ.గా ఉన్న చైతన్య కృష్ణను సర్పవరానికి ఇదివరకే పోస్టింగ్ ఇచ్చారు. కానీ వెనువెంటనే ఆ బదిలీ ఉత్తర్వులు నిలిపివేశారు. సర్పవరం సర్కిల్‌ను ఆశిస్తున్న చైతన్యకృష్ణకు దాదాపు ఖాయమైపోయిందని తెలిసింది. టుటౌ¯ŒSలో లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్న చైతన్యకృష్ణ కాకినాడలో గతంలో ఆరేళ్లు పనిచేశారు. పదోన్నతి తరువాత ఆరు నెలలు ఏజెన్సీలో పనిచేశారు. ∙పిఠాపురం సీఐగా పని చేస్తున్న ఉమర్ కాకినాడ టూటౌ¯ŒSలో జాయి¯ŒS కాగానే చైతన్య కృష్ణ సర్పవరంలో పోస్టింగ్ ఇచ్చేస్తారంటున్నారు. కాకినాడ ఒ¯ŒSటౌ¯ŒSలో సి.ఐ.గా పనిచేస్తుండగా అద్దంకి శ్రీనివాసరావు సస్పెండయ్యారు. అనంతరం వీఆర్‌లో పెట్టారు. అతనిపై ఒక మహిళా హోంగార్డును వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు వచ్చాయి. అనంతరం అతన్ని వీఆర్‌లో పెట్టగా ఇప్పుడతనికి జిల్లాలో ప్రత్తిపాడు సి.ఐ.గా పోస్టింగ్ లభించింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు నేపథ్యంలోనే అక్కడ పోస్టింగ్ లభించిందంటున్నారు. తుని టౌ¯ŒS సి.ఐ. అప్పారావును పిఠాపురం సర్కిల్ ఇనస్పెక్టర్‌గా. బదిలీ చేశారు. తుని రూరల్ సి.ఐ. చెన్నకేశవరావు రెండు సంవత్సరాలు పూర్తయినా అక్కడి అధికార పార్టీ నేతల ఆశీస్సులుండటంతో కదపలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్ఇజెడ్, దివీస్ వ్యవహారాల్లో న్యాయస్థానంలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే కారణంతో బదిలీ చేయలేదని పైకి చెబుతున్నారు. రంపచోడవరం ఏజెన్సీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అడ్డతీగల సిఐ ముక్తేశ్వరరావు, కృష్ణా జిల్లా నుంచి వీఆర్‌కు వచ్చిన ఈశ్వరుడు తదితరులు జిల్లాలో పోస్టింగుల కోసం నేతల సిఫార్సులతో గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అదేవిధంగా రౌతులపూడిలో కుటుంబం ఆస్థి వివాదంలో వీఆర్‌లో కృష్ణా జిల్లాకు పంపిన ఒక ఎస్.ఐ. తిరిగి తుని వచ్చే ప్రయత్నాల్లో అక్కడి అధికార పార్టీ నేతలకు పెద్ద ఎత్తున ముట్టజెప్పేందుకు సిద్ధపడ్డారనే ఆరోపణలున్నాయి. అతను తుని టౌ¯ŒSకు రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మరికొన్ని బదిలీ ఉత్తర్వులు త్వరలో వెలువడనున్న నేపథ్యంలో పలువురు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
గుబులు రేపుతున్న ఇన్ఫోసిస్, విప్రో లేఖలు
ముంబై: నూతన సంవత్సరం సందర్భంగా తన సంస్థలోని ఉద్యోగులకు రాసిన లేఖలో టాప్ ఐటీ దిగ్గజ కంపెనీ లుఅధిపతులు చేసిన హెచ్చరికలు ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ సేవల సంస్థలైన ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా, విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ వ్యాఖ్యలు భారతీయ ఐటీ రంగ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ప్రతిబింబించాయి. నోట్ల రద్దు, అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ను మించి సమస్యలు ఐటి రంగాన్ని పీడిస్తున్నాయన్న సంకేతాలు అందించారు. ఐటీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ మరియు ఆర్థిక సంఘర్షణల నేపథ్యంలో తీవ్ర ముప్పు ఎదుర్కోనున్నట్టు ఇద్దరు నేతలు ఉద్యోగులను హెచ్చరించడం గమనార్హం. ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా శరవేగంగా మారుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇన్ఫోసిస్ మంచి స్థానాన్ని ఆక్రమిస్తుందని చెబుతూనే, భవిష్యత్ ఐటీ రంగం ముళ్ల బాటలో నడవాల్సి వుంటుందని, ఎన్నో అడ్డంకులు, అవాంతరాలను అధిగమించాల్సి వుంటుందని విశాల్ హెచ్చరించారు. ఇన్ఫోసిస్ విలువను మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నామని, ఈ మార్గంలో ఉద్యోగుల శ్రమ, మరింత కృషి అవసరమని అన్నారు. బ్రెగ్జిట్, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, నోట్ల రద్దు, డిజిటౌజేషన్ , సైబర్ సెక్యూరిటీ సమస్యలు, పెద్ద దేశాలను పట్టి పీడిస్తున్న వలసలు, ఉగ్రవాదం తదితర ఎన్నో సమస్యలు ఐటీ రంగంపై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు. ముందడుగు పడకుంటే పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాం. ఆటోమేషన్, టెక్నాలజీ విభాగాల్లో మరింతగా అభివృద్ధి చెందాల్సి వుంది. క్లయింట్లకు మరింత సమర్థవంతమైన సేవలను అందించాల్సి వుందపి విశాల్ చెప్పారు. విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ మరోవైపు 2016 లో ఎదునైన అడ్డంకులను, సవాళ్లను విస్మరించలేమంటూ విప్రో ఛైర్మన్ అజిం ప్రేమ్ జీ పేర్కొన్నారు. కానీ, వివాదాలపై దృష్టిపెట్టకుండా కామన్ గ్రౌండ్ పై దృష్టిపెట్టాలంటూ నాలుగు సూత్రాలను ప్రేమ్ జీ ఉద్యోగులకు సూచించారు. తోటి మానవులను గౌరవించాలని ప్రకృతి పట్ల కూడా అదే గౌరవం కలిగి ఉండాలన్నారు. అపుడు కామన్ గ్రౌండ్ ను గుర్తించడం సాధ్యమవుతుంది.సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు ప్రకృతి అన్నీమానవులతో పెనవేసుకున్న బంధాన్ని, అనుసంధానం గుర్తించాలన్నారు. మన సమస్యలు, వాటి పరిష్కారాలు ఈ సంబంధాలను బలోపేతం చేసుకోవడంలోనే ఉందన్నారు. ప్రత్యీ ఉద్యోగి విలువలకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలన్నారు. ఈ సందర్భంగా రాజస్తాన్ సందర్శన, అక్కడి ప్రజల కష్టాలను, వారి పోరాటాలను తన లేఖలో విప్రో ఛైర్మన్ ఉదహరించారు. . -
అమ్మానాన్నకు చదువు
తల్లిదండ్రులకు అక్షరజ్ఞానం నేర్పేది వారే.. వయోజన విద్యలో వినూత్న కార్యక్రమం వచ్చే నెల 1 నుంచి మార్చి 31 వరకు నిర్వహణ 8, 9 తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకం గీసుకొండ : నిరక్షరాస్యులైన వారికి అక్షర జ్ఞానం నేర్పే బాధ్యత వారి పిల్లలకు అప్పగించడం ద్వారా ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వయోజన విద్యలో భాగంగా ‘అమ్మానాన్నకు చదువు’ పేరిట వచ్చే నెల 1వ తేదీ నుంచి నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో చదివే 8, 9వ తరగతుల విద్యార్థులు నిరక్షరాస్యులైన వారి తల్లిదండ్రుకు ఇక సాయంత్రం వేళల్లో అక్షరాలు నేర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులే ఎందుకు..? పొలం పనులకు వెళ్లిన కూలీలు సాయంత్రం వేళ అలసిపోయి ఇంటికి తిరిగొస్తారు. అలా వచ్చిన వారు గ్రామాల్లో వయోజన విద్యా కేంద్రాలు అందుబాటులో ఉన్నా అక్కడకు వెళ్లి అక్షరాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక మరికొందరు వయస్సు మీద పడుతుండగా ఇప్పుడు చదువు ఎందుకంటూ ఊరుకుంటున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా ‘అమ్మానాన్నకు చదువు’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. గ్రామీణులకు బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించని విషయాన్ని గుర్తించి.. పిల్లలతోనే తల్లిదండ్రులకు చదువు చెప్పించాలన్న భావనతో కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సాధారణంగా ఎవరు చెప్పినా వినిపించుకోని వారు తమ పిల్లలు చెబితే వింటారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు అక్షర జ్ఞానం నేర్పే తెలివితేటలు ఉన్న విద్యార్థులను, నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న తల్లిదండ్రులను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేస్తున్నారు. ముందుగా విద్యార్థులకు శిక్షణ.. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో 8,9వ తర గతి చదువుతున్న విద్యార్థులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఎందరు నిరక్షరాస్యులో తెలుసుకుంటున్నారు. ప్రతీ పాఠశాల నుంచి నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ఉపాధ్యాయులు రెండు మూడు గంటల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈక్రమంలో వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున పదో తరగతి విద్యార్థులకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఇదే క్రమంలో 8, 9వ తరగతుల విద్యార్థులైతే రెండేళ్ల పాటు తల్లిదండ్రులకు చదువు నేర్పించే వెసలుబాటు ఉంటుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతీ పాఠశాలలో 8, 9వ తరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రుల్లో సుమారు 15 నుంచి 20 మంది వరకు నిరక్షరాస్యులు ఉంటారని.. వీరిని అక్షరాస్యులను చేయడానికే ఈ కార్యక్రమాన్ని రూపొందించారని అధికారులు చెబుతున్నారు. పుస్తకాలు రెడీ.. ‘అమ్మానాన్నకు చదువు’ కార్యక్రమానికి అవసరమైన పుస్తకాలను వయోజన విద్య శాఖ అధికారులు ఇప్పటికే రూపొందించి జిల్లాలోని అన్ని మండలాలకు పంపిణీ చేశారు. తెలంగాణ యాసలో సులువుగా బోధించడం, అక్షరాలను నేర్చుకునేలా పాఠ్యాంశాలు రూపొందిస్తూ రెండు భాగాలుగా పుస్తకాలు తీసుకొచ్చారు. అయితే, ఈ కార్యక్రమం విజయవంతం కోసం సాక్షర భారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్లు కృషి చేయాల్సి ఉంటుంది. -
చలం నాన్న లేఖలు
అంతరంగం చలంగారి ఉత్తరాలను ఎందరో ప్రచురించారు. దాదాపు 60 సంవత్సరాల తర్వాత నా ఉత్తరాలు ఇప్పుడు ప్రచురిద్దా మనుకుంటున్నాను. చలంగారు ఉన్న రోజుల్లోనే - 1960 ప్రాంతంలో, ఎవరో చలంగారి ఉత్తరాలు ప్రచురించాలనే కోరికతో, వారిని అడిగారట. ‘‘ఈమధ్య రాసిన ఉత్తరాల్లో కామేశ్వరికి మంచి ఉత్తరాలు రాశాను. అడగండి. ఆమె ఒప్పుకుంటే ప్రచురణకు వెళ్లండ’’న్నారట. ‘‘నాన్నా ఈ ఉత్తరాలు మీరు ప్రేమతో నాకు రాసినవి, దీనివల్ల ప్రపంచానికి ఏమి ఉపయోగం. వద్దులెండి. ఇవి నా కోసమే ఉంచుకుంటాను’’ అని అన్నాను. అది తప్పేమోనని నాకు ఈ మధ్యవరకు అనిపించనేలేదు. నేను 13-14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే చలంగారి పుస్తకాలు నాకు దొరికినవి చదివాను. పురూరవలోని ఊర్వశి, శశాంకలోని తార, జీవితాదర్శంలోని లాలస, అరుణలోని అరుణ, చలంగారి ఇతర స్త్రీ పాత్రలన్నీ నన్నాశ్చర్యపరిచేవి. తర్వాత కాలంలో అడిగాను గూడా చలంగారిని. ‘‘నాన్నా నిజంగా మీరు ఇలాంటి స్త్రీలని చూశారా? అంతటి సౌందర్యవంతులు, అటువంటి స్థైర్యం ఉన్నవారు, అంతటి శృంగారమూర్తులు, జీవితం యెడల అంత చక్కటి అవగాహన ఉన్నవారు ఉన్నారంటారా? అసలు కాస్తై అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లని చూడకపోతే, ఎలా సృష్టించారు అలాంటి పాత్రలని’’ అని. నాన్న అనేవారు ఎంతో ఆలోచించి, ‘‘దాదాపు లేరు. కాస్త లీలగారు, కాస్త పద్మావతి పిన్ని’’ అని. నేను పెద్దయ్యాక తప్పక చూడాలనుకున్న వ్యక్తులలో చలం గారు ఒకరు. నేను 3, 4వ సంవత్సరం ఎంబీబీఎస్‌లో ఉండగా ‘‘కవిగా చలం’’ వజీర్ రెహమాన్ రాసిన పుస్తకం చదివాను. మళ్లీ చలంగారిని చూడాలనే వెర్రి కోరిక వచ్చింది. కనీసం వారంటే, వారి రచనలంటే నాకెంత అభిమానమో తెలియజేస్తూ ఒక ఉత్తరమైనా రాయాలనిపించింది. కాని వారెంతో గొప్ప కవి. వారికెంతమంది ఫ్యాన్స్ ఉంటారో! ఆఫ్ట్రాల్ ఒక చిన్న కాలేజీ స్టూడెంట్‌ని, వారికేం గొప్ప? జవాబయినా ఇస్తారో, ఇవ్వరో? ఆయన జవాబయినా ఇవ్వకపోతే నా అహం దెబ్బతింటుంది. ఇప్పటివరకూ వున్న గౌరవాభిమానాలు కూడా తగ్గిపోతాయేమో అని భయం. అందుకే ఉత్తరం రాయలేదు. నేను సెలవుల్లో మద్రాసులో ఉన్నాను. ఆ రోజుల్లోనే నండూరి సుబ్బారావుగారు పోయారు. ఒంటరిగా ఉన్న జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి గారు మా ఇంటికి వచ్చి నండూరి వారినీ, వారి స్మృతులనూ తలచుకుంటూ కంటతడి పెట్టుకుని మా ఇంట్లోనే ఉండిపోయారు. ఆ మర్నాడు చెప్పాను. కవిగా చలం చదివాక నా భావాలు, చిన్నప్పటి నుండి చలం గారిని చూడాలనే వెర్రి కోరికను. ఆయనకు కనీసం ఉత్తరం రాయాలన్న ఆకాంక్షను, రాయలేకపోవడానికి కారణాలను అన్నీ చెప్పాను. ఆ తరువాత ఆ సంగతి కూడా మర్చేపోయాను. కొన్నాళ్లకి ఒక మంచి ఉత్తరం వచ్చింది చలంగారి నుండి! నమ్మలేకపోయాను. ఆశ్చర్యంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఉత్తరంలో- 3/6/57 Dear unknown friend, మీరు నన్ను చూడాలనుకోవడం, నాకు సన్మానం. అలాంటి వాంఛ మన మనసుని మించి నరాల్లోకి ఇంకి హృదయాన్ని చేరుకుంటే, ఇక దేహాలు చూసుకోవడమనేది స్వల్ప విషయమౌతుంది. జీవితం- తప్పవు ఆశలు, నిరాశలు, ambitions. కాని ఏ స్థితిలోనూ హృదయంలోని అందమైన విలువల్ని అడుగున పడనీకండి- ఎన్ని కష్టాలు అడ్డం వచ్చినా సరే. ఈశ్వరాశీర్వాదాలతో, చలం. ఎంతో మంచి ఉత్తరం. అదీ వారంతట వారే రాయడం. వారే మొదటిసారిగా ఉత్తరం రాసింది నాకేనట! ఎంత అదృష్టవంతురాలిని! ఆ తరువాత ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు మా మధ్య. ఎన్నెన్ని పేజీలు నింపి రాసేవారో! డాక్టర్ కామేశ్వరి -
మీ పాన్ వివరాలివ్వండి..
♦ 7 లక్షల మందికి త్వరలో ఐటీ శాఖ లేఖలు ♦ పాన్ రహిత భారీ లావాదేవీలపై కన్ను ♦ పన్ను ఎగవేతలకు అడ్డుకట్టే లక్ష్యం.. న్యూఢిల్లీ: పన్ను ఎగవేతల నిరోధం దిశగా ఆదాయపు పన్ను శాఖ మరో కీలక అడుగు వేయనుంది. భారీ విలువగల ఆర్థిక లావాదేవీల నిర్వహణ లేదా తమ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో రూ.10 లక్షలకన్నా అధికంగా ఉన్న 7 లక్షల మంది అసెసీల నుంచి వారి పాన్ వివరాలను ప్రత్యేకంగా సేకరించనుంది. త్వరలో వీరికి ఆదాయపు పన్ను శాఖ లేఖలు రాయనున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్స్ (ఏఐఆర్) కింద పలు అధిక విలువ ఆర్థిక లావాదేవీలు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వచ్చాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.10 లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్లు, రూ.30 లక్షలు ఆపైన స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాలు వంటివి ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో పలు లావాదేవీలు పాన్‌తో అనుసంధానం కాకపోవడాన్ని ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది. నల్లధనం వివరాలు తెలియజేసి, 45 శాతం పన్ను చెల్లింపుల ద్వారా ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు పొందే వెసులుబాటును కల్పిస్తూ 4 నెలలు అమల్లో ఉండే ఒక కీలక పథకాన్ని జూన్ 1న కేంద్రం ప్రారంభించిన నేపథ్యంలోనే ఐటీ శాఖ తాజా చొరవ తీసుకోవడం గమనార్హం. 90 లక్షల పాన్ రహిత లావాదేవీల గుర్తింపు... 2009-10 నుంచి 2016-17 మధ్య పాన్ లేకుండా భారీ ఆర్థిక లావాదేవీలు దాదాపు 90 లక్షలు జరిగినట్లు అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ఐటీ శాఖ గుర్తించింది. ఇందులో ఇప్పటికి 14 లక్షల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి, అందులో సందేహాస్పదమైన 7 లక్షల లావాదేవీలను వెలికితీసింది. పాన్ వివరాలు సమర్పించాలని వీరికి త్వరలో లేఖలు రాయాలని నిర్ణయించింది. అలాగే లేఖలు పంపుతున్న వారి సౌలభ్యం నిమిత్తం వారు తగిన సమాచారం ఇవ్వడం కోసం ఒక ఈ-పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు కూడా అత్యున్నత స్థాయి వర్గాలు తెలి పాయి. పంపే లేఖలో ఒక యునిక్ ట్రాన్జాక్షన్ సీక్వెన్స్ నంబర్ ఉంటుంది. లేఖ అందుకున్న వ్యక్తులు తమ ఈ- ఫైలింగ్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత, ఈ నంబర్ సహాయంతో తమ లావాదేవీలకు తమ పాన్ వివరాలను జతచేసే వీలుంటుంది. అలాగే ఈ-పోర్టల్ ద్వారానే తమ సమాధానాన్ని కూడా తెలియజేయవచ్చు. -
పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ లేఖలు!
న్యూఢిల్లీ: న్యాయ పరిధిలో విచారణలో ఉన్న పన్ను వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడంపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ కసరత్తు ప్రారంభించింది. జూన్ 1 నుంచీ అమల్లోకి వచ్చిన ‘ప్రత్యక్ష పన్నుల పరిష్కార పథకం 2016’ కింద వివాదాలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలని ‘వివాదాలకు సంబంధించిన’ 2.59 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు లేఖలు రాయనున్నట్లు సమాచారం. నల్లధనం వెల్లడి పథకం విజయవంతానికి జరుగుతున్న ప్రచారం, ప్రయత్నం తరహాలోనే, పన్ను వివాదాల పరస్పర పరిష్కారానికీ ఐటీ శాఖ ప్రయత్నిస్తుందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. -
ఏకపక్షంగా కృష్ణా బోర్డు తీరు
కేంద్రమంత్రి ఉమకు కేసీఆర్, హరీశ్ వేర్వేరుగా లేఖలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల్లో స్పష్టత వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి చేర్చే విషయంలో తొందర అవసరం లేదని సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రాజెక్టుల వారీ కేటాయింపులపై స్పష్టత వచ్చాకే బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సంప్రదించకుండా, చర్చలు జరపకుండా బోర్డు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వాటా తేలే వరకు బోర్డు పంపిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఆమోదించవద్దని కోరారు. ఎందుకంత ఆత్రుత: ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసిన తర్వాత, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలి. అదీగాక బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడిగిస్తూ.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు నిర్ధారించాలని సూచించారు. ఎవరి వాటా ఎంత, వినియోగం ఎలా ఉండాలో ట్రిబ్యునల్ చెప్పాకే బోర్డు అర్థవంతంగా వ్యవహరించాలి. కానీ దురదృష్టవశాత్తూ బోర్డు ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఆత్రుత చూపుతోంది’’ అని సీఎం, హరీశ్ తమ లేఖల్లో వివరించారు. ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89(ఏ), (బీ) ప్రకారం ట్రిబ్యునల్ కాల పరిమితిని రెండేళ్లు పెంచారు. కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్యా లేదా నాలుగు రాష్ట్రాల మధ్యా అన్న అంశం ఇంకా తేలలేదు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేవు. నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలు ఇంకా బ్రజేష్ ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నాయి. అలాంటప్పుడు బోర్డు నియంత్రణ ఎక్కడిది’’ అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో గత అరవై ఏళ్లుగా తెలంగాణకు నీటి కేటాయింపుల్లో తీరని అన్యాయం జరిగిందని, ఇప్పుడు తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుంటే అదే అన్యాయం మళ్లీ కొనసాగినట్లు అవుతుందని వివరించారు. ఈ దృష్ట్యా కృష్ణా ప్రాజెక్టులను తన పరిధిలోకి తేవాలంటూ బోర్డు పంపిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఆమోదించరాదని కోరారు. ఏపీ ఒత్తిళ్లకు తలొగ్గుతోంది ఏపీ ఒత్తిళ్లకు తలొగ్గి కృష్ణా బోర్డు ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తోందని మంత్రి హరీశ్ తన లేఖలో పేర్కొన్నారు. బ్రజేష్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించే వరకు బోర్డు నియంత్రణ అవసరం లేదని అన్నారు. రాష్ట్రాల పునర్విభజన చట్టంలోని 87(1), 85(8) సెక్షన్ల ప్రకారం కృష్ణా బోర్డు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను తయారు చేయలేదని తెలిపారు. -
ఇంద్రాణీకి పీటర్ విడాకులు..!
షీనా బోరా హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణీ ముఖర్జీయాకు ఆమె భర్త పీటర్ ముఖర్జీయా విడాకులు ఇవ్వదలుచుకున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంద్రాణీ పుట్టినరోజున ఆమెకు గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇస్తానని లేఖ రాసిన పీటర్.. తాజాగా విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు ఆయన లాయర్ మిహిర్ ఘీవాలా తెలిపారు. షీనా కేసులో గత నవంబర్ లో పీటర్ ను కూడా నిందింతుడిగా చేరుస్తూ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీటర్ అరెస్టయిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 40కుపైగా ఉత్తరాలను ఇంద్రాణీ రాసింది. వాటిలో తాను ఏ తప్పు చేయలేదని, 2016లో మంచి జీవితం ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. మొదట్లో వాటికి సమాధానం ఇవ్వని పీటర్ డిసెంబర్21న వచ్చిన లేఖకు మాత్రం జనవరిలో ఇంద్రాణీ పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి సమాధానం ఇచ్చారు. 2015 సెప్టెంబర్ నుంచి బైకుల్లా మహిళా కారాగారంలో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణీ తరచుగా తన ఒంటరితనాన్ని పీటర్ తో పంచుకోవడానికి ప్రయత్నించారని, తనకున్న వ్యాధి (మెదడుకు రక్తప్రసరణ సరిగా అవకపోవడం) ముదురుతోందని త్వరలోనే మరణిస్తానని ఆమె లేఖలో తెలిపిందని పీటర్ మరో లాయర్ ఆబోద్ పాండా తెలిపారు. తన చివరి రోజులు భరించలేని నొప్పితో కూడుకొని ఉంటాయా? అని డాక్టర్లను ప్రశ్నించినప్పుడు.. వారు అదేం ఉండదని ముందు కోమాలోకి వెళ్లి తర్వాత మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారని ఇంద్రాణీ లేఖలో వివరించింది. అందుకు సమాధానంగా.. విధిరాతను ఎవరూ మార్చలేరు. తాను జైలు అధికారులతో మాట్లాడుతానని ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తనకు తెలపాలని కోరతానని చెప్పారు. కాగా గురువారం పీటర్ ముఖర్జియా బెయిల్ పిటీషన్ పై కోర్టులో మళ్లీ వాదనలు జరగనున్నాయి. -
చివరి రోజుల్లో లాడెన్ పట్టుబడతానని భయపడ్డాడా?
వాషింగ్టన్: ఉగ్రవాదానికి చిరునామాగా నిలిచి... ప్రపంచదేశాల్లో అనేక దాడులు చేసిన మహమ్మద్ బిన్ అవాద్ బిన్ లాడెన్ తాను స్థాపించి, నడిపిన సంస్థ ఆల్-ఖైదాను ముందుకు తీసుకువెళ్లడానికి , పరిపాలించడానికి చివరి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడా ? తన భార్య వద్దే ట్రాకింగ్ కు సంబంధించిన వస్తువు ఉందని భయపడ్డాడా ? అవుననే సమాధానం. 2011లో పాకిస్తాన్ లో దాక్కున్న లాడెన్ ను అమెరికా బలగాలు మట్టుపెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులను అమెరికన్ నేవీ స్వాధీనం చేసుకుంది. వాటిలో లాడెన్ ఉత్తరప్రత్యురాలు జరిపిన కొన్ని పత్రాలను నేవీ మంగళవారం విడుదల చేసింది. లేఖల్లోని అంశాలు : సూడన్ దేశంలో తనకు దాదాపు 29 మిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయని ఒక వేళ తాను మరణిస్తే ఆ డబ్బును జీహాద్ కోసం వినియోగించాలని లాడెన్ లేఖలో పేర్కొన్నాడు. తన చివరిరోజుల్లో అమెరికా డ్రోన్ ఆల్-ఖైదా స్థావరాలపై దాడి చేసిన తర్వాత నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడ్డాడని ఒక ఉత్తరంలో ఉంది. తన నివాసాన్ని ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా ఎక్కడ భద్రతా దళాలు పసిగడతాయోనని , తన భార్య పంటికి శస్త్రచికిత్స చేసిన ఇరానీయన్ డాక్టర్ పంటిలో ఏదైనా ట్రాకింగ్ పరికరం అమర్చారేమోనని వెతికినట్టు మరో ఉత్తరంలో ఉంది. ఎక్కవ కాలం ట్రాకింగ్ గురించి భయపడినట్లు తెలిపే మరో సంఘటన జిహాద్ అవసరాల కోసం తరలిస్తున్న డబ్బు సూట్ కేసుల్లో ట్రాకింగ్ పరికరాలు ఉండే అవకాశం ఉందని లాడెన్ అనుమానించే వాడు. జీపీఎస్ పరికరంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ ను తీసుకుని వస్తానని చెప్పిన ఖతార్ కు చెందిన వ్యక్తి తనకు షుగర్ ఉందని డాక్టరు వద్దకు వెళ్లాలని చెప్పి రాకుండా వెళ్లిపోవడం లాడెన్ కు తీవ్రఅనుమానంగా తోచింది. -
స్పీకర్‌కు వైఎస్సార్ సీఎల్పీ లేఖలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ జరపాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు శనివారం రెండు లేఖలు రాసింది. ఓ లేఖలో ద్రవ్య వినిమయ అంశం, మరో లేఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింబల్‌పై గెలిచిన ఎమ్మెల్యేల పేర్ల జాబితాను పొందుపరిచారు. ఈ లేఖలను పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు అందించారు. సోమవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. -
వివాదంలో మరో విశ్వవిద్యాలయం
న్యూఢిల్లీ: హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వివాదం ఇంకా చల్లారకముందే దేశ రాజధాని లో ప్రముఖ యూనిర్శిటీ వార్తల్లో నిలిచింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం కలకలం రేపింది. తన సమస్యను వారంలోగా తేల్చాలని ...లేకుంటే ప్రాణత్యాగం చేస్తానని బెదిరిస్తూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌ను ఉద్దేశించి రెండు లేఖలు రాశాడు. తనకు రావాల్సిన గ్రాంట్ ను మంజూరు చేయకుండా వివక్షను గురి చేసి, వేధిస్తున్నారని దళిత స్కాలర్ మదన్ మెహర్ ఆరోపిస్తున్నాడు. తన పీహెచ్‌డీని ఆపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిలిపి వేసిన తన ఫెలోషిప్‌ను తక్షణమే కొనసాగించాలని అతడు డిమాండ్ చేశాడు. వారంలోగా తన సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ లేఖలో తెలిపాడు. అయితే యూనివర్శిటీ వాదన దీనికి భిన్నంగా ఉంది. సదరు విద్యార్థి బ్రస్సెల్స్, బెల్జియంలో పర్యటన కోసం అడ్వాన్స్‌గా తీసుకున్న రూ 66,000 ను యూనివర్శిటీకి తిరిగి చెల్లించాల్సింది ఉందన్నారు. విద్యార్ధి తన ఫెలోషిప్ కొనసాగించడానికి అనుమతించే ముందు, ఆ మొత్తం డబ్బులను తిరిగి ఇవ్వాల్సి ఉంటుదని వైస్ ఛాన్సలర్ హెచ్. శర్మ బుధవారం పేర్కొన్నారు. వర్శిటీ కంట్రోలర్, ఫైనాన్స్ అధికారి నుంచి అనుమతి లేకపోవడంతోనే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొడిగింపును నిలిపి వేసినట్టు చెప్పారు. మరోవైపు విద్యార్థిని ఒక కంట కనిపెట్టమని యూనివర్శిటీ భద్రతా అధికారిని అప్రమత్తం చేశామని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మరో అధికారి హామీ ఇచ్చారు. మరోవైపు సమస్యలపై వర్సిటీ అధికారులు ఫిబ్రవరి 8న విద్యార్థులతో భేటీ కానుంది. కాగా జనవరి 17 న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో రోహిత్(26) హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. -
కమలనాథన్ కమిటీ ఏర్పాటు తప్పిదమే
రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటిపోయింది. కానీ ఉద్యోగుల విభజన ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఇంకో ఏడాది గడిచినా ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందన్న గ్యారెంటీ ఏదీలేదు. ప్రభుత్వ వాదోపవాదాలు, ఒక్కొక్క ఉద్యోగిది ఒక్కో ప్రత్యేక మైన నేపథ్యం, ప్రభుత్వ నిబంధనలు, ఉద్యోగ సంఘాల వైఖర్లతో సమస్యకు అంతిమ పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం కలగడంలేదు. అసలు విభజన చట్టంలోనే లోపాలున్నాయి. హడావిడిగా ఆగమేఘాల మీద చేసి ఈ చట్టం అతి ముఖ్యమైన ఉద్యోగుల విభజనకు సంబంధించి దూరదృష్టితో వ్యవ హరించలేదు. తెలంగాణ ఉద్యమం బలపడటానికి నీళ్లు, నిధులతోపాటు నియామకాలలో జరిగిన వ్యత్యాసాలే కారణమన్నది తెలిసిందే. విభజన అనివార్యమైనప్పుడు జరిగిన హడావుడి, ఆందోళనల మధ్య భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై ఎవరూ పట్టించుకోలేదు. విభజన బిల్లులో ఉద్యోగులకు సంబంధించిన అంశాలలో ఇరు ప్రాంతాలలోని ఏ ఒక్కరూ దృష్టి సారించలేదు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపిణీ జరగాలన్నది తెలంగాణ ఉద్యోగుల వాదన. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవా లన్నది సీమాంధ్ర ఉద్యోగుల వాదన. పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవ హరించాలన్నది కమలనాథన్ కమిటీ అభిప్రాయం. నిజానికి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇరుప్రాంతాల ఉద్యోగులకు ఉండి ఉంటే ఈ సమస్య ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. అసలు కమలనాథన్ కమిటీ ఏర్పాటే పెద్ద తప్పు. దాని పరిధి చాలా చిన్నది. అది కేవలం సచివాలయం, కొన్ని డెరైక్టరేట్లకే పరిమితమైన కమి టీయే తప్ప యావత్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన కమిటీ కాదు. ఏడాదికి పైగా ఈ కమిటీ చేసిన పనేమిటంటే 56 వేల మంది రాష్ట్ర స్థాయి అధికారులలో ఇప్పటివరకు 15 వేలమంది ఉద్యోగులను మాత్రమే రాష్ట్రానికి కేటాయించింది. అతి ముఖ్యమైన శాఖలను మర్చిపోయింది. ఉద్యోగ కేటా యింపుల అనంతర చేదు పరిణామాల పట్ల కమిటీ మౌనం పాటించింది. తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రం ఏర్పడినా కూడా ఆప్షన్ల పేరిట ఇక్కడ తెలంగాణేతరులు కొనసాగడం ఇక్కడి ఉద్యోగులు, నిరుద్యోగులకు నచ్చని అంశం. భవిష్యత్తులో మరిన్ని వైషమ్యాలు తలెత్తకుండా ఉండా లంటే ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో పని చేసుకుంటేనే బాగుంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని కమలనాథన్ కమిటీ పరిధి పెంచడమో, లేదా మరొక కమిటీని వెంటనే నియమించడమో చేసి, రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగులలో ప్రాంతేతరులపై దృష్టి సారించాలి. అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలోనే పని చేసే విధంగా నిబంధనలు రూపొందించాలి. ఉద్యోగుల విభజన సమస్యలకు శాశ్వత పరిష్కా రం కనుగొనకుండా తాత్సారం వహిస్తే అది ఏ ఒక్కరికీ క్షేమకరం కాదు. కాలేరు సురేష్ రాష్ట్ర సహాధ్యక్షులు తెలంగాణ ఉద్యోగుల సంఘం. మొబైల్: 9866174474. -
లేజీ.. పోస్ట్‌మన్!
కొండకరకాం (విజయనగరం రూరల్): మండల పరిధిలోని కొండకరకాం పోస్ట్‌మన్ నిర్వాకం తాళ్లపూడిపేట గ్రామ నిరుద్యోగులకు శాపంగా మారింది. పోస్ట్‌మన్ అలసత్వం, నిర్లక్ష్యం వల్ల సమీప ప్రాంతాల్లోని నిరుద్యోగులు ఉద్యోగాలకు దూరం కావాల్సిన పరిస్థి తి నెలకొంటోంది. మండల పరిధిలోని కొండకరకాం గ్రామ పోస్టాఫీస్ పరిధి లో కొండకరకాం, వైఎస్ఆర్ నగర్, ఆర్కె టౌన్షిప్, నెల్లిమర్ల మండలం తాళ్లపూడిపేట, ఎల్‌ఎన్‌పేట గ్రామాలు ఉన్నాయి. కొండక రకాం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లిమర్ల మండలం తాళ్లపూడిపేట గ్రామానికి వచ్చే ఉత్తరాలను పోస్ట్‌మన్ ఎం.చలపతిరావు సకాలంలో అందించడం లేదన్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడి నిరుద్యోగులు ప్రభు త్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు అధికంగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ సంస్థల నుంచి కాల్ లెటర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఎప్పుడో ఇంటర్వ్యూ గడువు దాటి 10, 20 రోజులు పోయిన తర్వాత వీరికి కాల్‌లెటర్లు అందుతున్నాయి. ఇవి తెలిసిన వరకే.. అందకుండా పోతున్నవి ఇంకెన్నో..! గత రెండేళ్ల కాలంలో తాళ్లపూడిపేట గ్రామానికి చెందిన ఆరుగురు నిరుద్యోగులకు కాల్‌లెటర్లను పోస్ట్‌మన్ అందించలేదు. ఇటీవల మరోసారి ముగ్గురు నిరుద్యోగులైన తాళ్లపూడి సూరప్పుడు, ధవళ పెంటంనాయుడు, ఎం.పైడిరాజులకు కాల్‌లెటర్లు అందించాల్సి ఉంది. వాటినీ సదరు పోస్ట్‌మన్ అందించలేదు. దీంతో పలువురు నిరుద్యోగులు కొండకరకాం గ్రామంలో ఉన్న పోస్ట్‌మన్ ఇంటికి వెళ్లి ఉత్తరాలను పరిశీలించారు. పది రోజుల క్రితం వచ్చిన కాల్‌లెటర్లు పోస్ట్‌మన్ ఇంటిలోని టీవీ వెనుక ఉండడంతో వారంతా నిర్ఘాంతపోయారు. దీంతో వారంతా సోమవారం కొండకరకాం గ్రామానికి వచ్చి సర్పంచ్, ఎమ్పీటీసీ సమక్షంలో పోస్ట్‌మన్‌ను నిలదీశారు. అనంతరం విజయనగరంలోని హెడ్ పోస్టాఫీస్‌లో ఫిర్యాదు చేశారు. -
ఆత్మహత్యలకోసం మరో 70 మంది లేఖలు
భోపాల్: వ్యాపం కుంభకోణం కేసులో నిందితులైన మరో 70మంది మెడికల్ విద్యార్థులు, జూనియర్ వైద్యులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖలు రాశారు. తమకు బెయిలయినా ఇప్పించాలని లేదంటే ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాలని అందులో విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన మెడికల్ పరీక్షల్లో వీరంతా అవకతవకలకు పాల్పడ్డారని, వేరేవారితో పరీక్షలు రాయించడం, అధికారులకు డబ్బులిచ్చి మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంవంటి ఆరోపణలతో కేసులు పెట్టారు. ప్రస్తుతం గ్వాలియర్ జైల్లో ఉన్న వీరంతా తమను చాలా కాలం నుంచి విచారిస్తున్నారని, దీంతో తమ భవిష్యత్తు అంధకారంగా మారిందని, ఫలితంగా మానసికంగా సమాజ పరంగా తీవ్ర ఒత్తిడి నెలకొందని ఆవేదన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్లే తమకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి లేఖలు రాష్ట్రపతికి కొంతమంది విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే. -
కలిగిరి తహశీల్దార్ సస్పెన్షన్
నెల్లూరు (రెవెన్యూ) : కలిగిరి తహశీల్దార్ వి. లావణ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఎం. జానకి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లావణ్య కొండాపురం మండలంలో తహశీల్దార్‌గా పనిచేసిన సమయంలో వెబ్‌ల్యాండ్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్‌ల్యాండ్‌లో అనర్హుల పేర్లు చేర్చారు. గానుగపెంట పంచాయతీలో భూములను అధికార పార్టీ నాయకుల అండతో బినామీ పేర్లతో భూ రికార్డులు తారుమారు చేశారు. బినామీ పేర్లతో పాసుపుస్తకాలు సృష్టించారు. గంట శ్రీనివాసరావు భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయాలపై జాయింట్ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ విచారణ జరిపించి నివేదికలు కలెక్టర్‌కు అందజేశారు. భూముల విషయంలో అక్రమాలకు పాల్పడట్టు నిర్ణారణకావడంతో సస్పెండ్ చేశారు. -
రాత పోల్చుకో.. రంగం ఎంచుకో..
కెరీర్ ఎంపికలో హ్యాండ్ రైటింగ్ పాత్ర నప్పే కెరీర్ కోసం గ్రాఫాలజిస్ట్తో సంప్రదింపులు నగరంలో నవ్య ధోరణి టెక్నాలజీ పుణ్యమాని ఉత్తరాలు రాసే అవకాశం లేకపోయింది. కీబోర్డ్ రాకతో చేత్తో రాసే అవసరం తగ్గిపోతుంటే.. చేతిరాతను తరచి చూసే అవసరం మరోవైపు పెరిగిపోతోంది. ఉద్యోగాలు ఇచ్చేవారు మాత్రమే కాదు ఉద్యోగార్థులు సైతం తమ చేతి‘రాత’ను పరీక్షించుకుంటున్నారు. దాని ప్రకారం తల రాతను దిద్దుకుంటున్నారు. ఇప్పుడు సిటీలో ఈ ధోరణి బాగా పెరిగింది. వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నవారు తమ కెరీర్ కోసం గ్రాఫాలజిస్టులను సంప్రదించి చేతిరాతలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. ‘నేనెందుకు పనికొస్తాను?’.. ఈ ప్రశ్న నిరాశతో మాత్రమే కాదు అత్యంత ఆశావహ దృక్పథంతో కూడా వేసుకోవచ్చు. అలా ప్రశ్నించుకున్న తర్వాత, తన శక్తియుక్తులు తరచి చూసుకున్న తర్వాత ‘రంగం’లోకి దూకితే.. ఆ దూకుడుకు అడ్డుండదు. ఇది విజయవంతమైన వ్యక్తుల కథల సాక్షిగా నిరూపితమైన నిజం. కెరీర్ ఎంపికకు ముందుగా తమని తాము తరచి చూసుకుంటున్న వారికి అందుబాటులోకి వచ్చిన మరో మార్గం ‘హ్యాండ్ రైటింగ్ ఎనాలసిస్’. ‘అక్షరాలా’ మనమే.. పలకా బలపం నాటి రోజుల తర్వాత రకరకాల మార్పులకు లోనైంది. ఎంతగా అంటే.. సన్నిహితులు మనల్ని గుర్తు పట్టడానికి అదొక మార్గంగా మారిపోయింది. మనకు అంతగా అలవాటైపోయిన చేతిరాత.. అలవోకగా అమరిపోయిందనుకుంటే పొరపాటే అని గ్రాఫాలజీ చెబుతోంది. మన ఆలోచనలు, ప్రవర్తన, మనస్తత్వం.. వీటన్నింటి ప్రతిరూపంగానే రాసే శైలి కూడా ఉంటుందని గ్రాఫాలజిస్ట్‌లు చెబుతున్నారు. మనం ఏ రంగంలో రాణిస్తామో తెలుసుకోవాలంటే మన ఇష్టాఇష్టాలు, శక్తి యుక్తులు తరిచి చూసుకోవడం అవసరమని, అందులో భాగంగా చేతిరాతను సైతం ఎనలైజ్ చేసుకోవాలని వీరు సూచిస్తున్నారు. ఉదాహరణకు కొన్ని రకాల హ్యాండ్ రైటింగ్ స్టైల్స్‌ను చూస్తే.. లార్జ్ హ్యాండ్ రైటింగ్ అక్షరాలపై బార్స్ పెద్దగా ఉండడం స్ట్రోక్స్ అన్నీ కనెక్టింగ్‌గా ఉండడం.. ఈ శైలి సెల్ఫ్ ఎస్టీమ్, కాన్ఫిడెన్స్ ఎక్కువని చెబుతుంది. ఉద్యోగం కన్నా స్వేచ్ఛ, స్వతంత్రత ఎక్కువగా ఉండే వ్యాపకాలను ఎంచుకునే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక పదానికి పదానికి మధ్య తక్కువ స్పేస్ ఉండడం కలుపుగోలు తనానికి చిహ్నం. ఈ ధోరణి సేల్స్ అండ్ మార్కెటింగ్ లేదా సంబంధిత రంగానికి అతికినట్టు సరిపోతుంది. స్మాల్ సైజ్ రైటింగ్ ఈ స్టైల్లో అక్షరం మీద చుక్కను రౌండ్ చుడుతుంటారు. అలాగే పదాల్లో స్పష్టత ఎక్కువగా ఉంది. ఇది పలు అంశాలపై ఉన్న క్లారిటీకి చిహ్నం. వీరిది చిన్న చిన్న డిటైల్స్ అన్నీ పర్ఫెక్ట్గా రాసే తరహా. ఈ ‘రాత’ గల వ్యక్తులకు ఫైనాన్షియల్ సంబంధిత రంగాల (అకౌంటెంట్, ఫైనాన్షియల్ అడ్వయిజర్)కు ఉపయుక్తం. యాంగ్యులర్ రైటింగ్ ఈ తరహా రైటింగ్ చివర్లన్నీ సూదిగా ఉంటాయి. ఇది ఇంటిలిజెన్స్‌కి చిహ్నం. అక్షరాలన్నీ ఒక్కోటి ఒక్కో యాంగిల్లా ఉంటాయి. అంటే వీరు లాజికల్‌గా ఆలోచిస్తారు. ప్రతి అక్షరానికి ముందు స్టార్టింగ్ స్ట్రోక్ ఉంటుంది. ఇది వాదనా పటిమకు, వేగంగా నేర్చుకునే తత్వానికి సూచిక. ప్రతి అక్షరానికీ ముందు తోక తగిలించడాన్ని చూశారా.. ఇది పరిశోధనాత్మక ఆలోచనా ధోరణిని సూచిస్తుంది. అడ్వకేట్స్, లీగల్, డిటెక్టివ్ తదితర రంగాల్లో రాణిస్తారు. రౌండ్ రైటింగ్ రైటింగ్ సైజ్ పెద్దగా ఉంది. మంచి శ్రోతలవుతారు. కొన్ని అక్షరాలు కలిపి, కొన్ని విడివిడిగా ఉంటాయి. అంటే ఎడాప్టబులిటీ, ఫ్లెక్సిబులిటీలని సూచిస్తుంది. పదాల మధ్య ఈక్వెల్ స్పేస్ ఇచ్చారు. అంటే, వీళ్లు వెల్ బ్యాలెన్స్డ్ థింకింగ్ గలవారు. టీచర్స్, కౌన్సిలర్స్, సోషల్ వర్క్, అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాలు వీరికి నప్పుతాయి. షార్ప్ టాల్ హ్యాండ్ రైటింగ్ అడుగున ఉన్న అక్షరాలు పొడవుగా వెళతాయి. ప్రతి పదం చివర్లో, మొదటి అక్షరమో తోకలు కింద లైన్లోకి వెళ్లిపోయేంతగా పొడవుగా ఉంటాయి. వీరికి ఇన్నర్ స్టామినా, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ. షార్ప్‌గా ఉంటారు. స్పోర్ట్స్‌కి, అవుట్ డోర్ యాక్టివిటీస్‌కి నప్పుతారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తారు. సంతకం చెప్పే సంగతులు.. - చేతిరాత విశ్లేషణ ద్వారా మన శక్తియుక్తులు ఎలా తెలుస్తాయో.. సంతకం చేసే శైలిని బట్టి.. మన మనస్తత్వాన్ని విశ్లేషించుకోవచ్చని చెబుతున్నారు గ్రాఫాలజిస్ట్, డాక్టర్ రణధీర్ కుమార్. ఎడమ నుంచి కుడివైపునకు వెళుతున్నట్టుండేది, అలాగే పైనుంచి కిందకు, కింద నుంచి పైకి వెళ్తున్నన్నట్టుగా ఉండేలా అక్షరాలు రాసేవారు పైకి గంభీరంగా, రిజర్వ్డ్గా ఉన్నప్పటికీ చాలా సహృదయులై ఉంటారు. - సంతకంలో అక్షరాలు పెద్దగా ఉంటే ఆ వ్యక్తికి ఇగో ఎక్కువని, తాను చెప్పింది ఇతరులు అంగీకరించి తీరాల్సిందేనన్న తత్వం గలవారని అర్థం చేసుకోవచ్చు. చేతిరాత కంటే సంతకం చిన్నగా ఉంటే ఆ వ్యక్తి తనను తాను ప్రాధాన్యత లేనివాడిగా భావించే గుణం ఉందని. - సంతకం అర్థం కాకుండా, చదివే వీలు లేకుండా ఉంటే.. ఆ వ్యక్తులు తమ విషయం ప్రపంచం ఎక్కువగా తెలుసుకోకూడదని కోరుకుంటారు. తన గురించి చెప్పేందుకు ఇష్టం లేని దాపరికం ఉన్న వ్యక్తి కూడా అయి ఉంటారు. సంతకం మరీ కాంప్లికేటెడ్‌గా ఉంటే ఇతరులకు తనో రహస్యం కావాలనుకుంటున్నట్టు. - సంతకంలోని చివరి స్ట్రోక్ (అక్షరం) వెనుకడుగు వేసినట్టుగా అంటే.. ప్రారంభించిన చోటుకి తిరిగి వచ్చినట్టుగా ఉంటే అది తనను తాను పాడు చేసుకునే తత్వానికి నిదర్శనం. - పొడవైన కింద నుంచి పైకి వెళ్లే రైజింగ్ లైన్‌తో ఉన్న సంతకం... రగిలే ఆశలు, ఆశయాలతో ఉన్న మనస్తత్వానికి గుర్తు. - రెండు సార్ల కంటే ఎక్కువగా అండర్ స్కోర్ చేసిన సంతకం రాజీపడని, ధృఢమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. - సంతకం కింద వ త్తిపట్టి అండర్స్కోర్ చేస్తే అది స్వార్థ మనస్తత్వం, గుర్తింపు కోసం పడే ఆరాటానికి గుర్తు. -
ఇంకెన్ని చావులు చదవాలి?
అక్షరాలను ఆస్వాదిస్తారనుకుంటే చావుని చప్పరిస్తున్నారు. ఊరికి మొనగాళ్లవుతారనుకుంటే ఉరికి బలైపోతున్నారు. ప్రకాశిస్తారనుకుంటే కిరోసిన్‌లో అగ్నిస్నానాలు చేస్తున్నారు. మనకు ధైర్యమిస్తారనుకుంటే... దగా చేసి వెళ్తున్నారు. అక్షరాలపై సవారీ చేస్తారనుకుంటే... అంపశయ్యలెక్కుతున్నారు. ఆకాశాన్ని తాకుతారనుకుంటే... మట్టికరుస్తున్నారు. చదవలేక, చావుని వాళ్లు కోరుకుంటుంటే... వాళ్ల చావుల్ని చదవలేక మనం కుమిలిపోతున్నాం. చదవలేక, కక్కలేక మింగుతున్న విషానికి విరుగుడు కావాలి. ఈ కడుపుకోతను మాన్పే చదువులను కనిపెట్టాలి. ఈ ఏడాది జూన్ 26 శుక్రవారం: గుత్తి మండలం, ఎంగిలిబండ గ్రామం. దేవరాజ్, లక్ష్మీదంపతుల కొడుకు ఎ. నారాయణస్వామి. గుత్తిపట్టణంలోని మహాత్మా జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) సెకండియర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫస్టియర్ మ్యాథ్స్ రెండు పేపర్లలో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. 25వ తేదీ గురువారం రాత్రి ఇంట్లో విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించి శుక్రవారంనాడు ప్రాణాలు వదిలాడు. జూన్ 24 బుధవారం: యాడికి మండలం పి.వెంగన్నపల్లి గ్రామం. నాగేశ్వర్, రాజా మునీశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి.. ముగ్గురూ మంచి స్నేహితులు. ఊళ్లోని జిల్లాపరిషత్ స్కూల్లో టెన్త్ చదువుతున్నారు. రాజా మునీశ్వర్‌రెడ్డికి చదువుకన్నా వ్యవసాయం అంటే ఇష్టం. నాగేశ్వరేమో ఇంటి గొడవలతో కలతచెంది ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి అమాయకుడు. మునీశ్వర్ రెడ్డి, నాగేశ్వర్లు ఎలా చెబితే అలా! మొత్తానికి రకరకాల వ్యక్తిగత కారణాల వల్ల ముగ్గురికీ చదువంటే అనాసక్తతే. పైగా ఇప్పుడు టెన్త్కొచ్చారు. అది బోర్డ్ ఎగ్జామ్ అని, చాలా కష్టపడి చదివితే కానీ పాస్ అవలేమని అంతా అంటుంటే భయం పెట్టుకున్నారు. దాంతో ఇంట్లో పోరు మొదలుపెట్టారు చదువుకోకుండా వ్యవసాయం పనులు చేస్తామని. వ్యవసాయం తర్వాత చెయ్యొచ్చు. ముందు చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని తల్లిదండ్రులు పిల్లలకు నచ్చచెప్పి బడికి పంపారు. కానీ వాళ్లు బడికి వెళ్లినట్టే వెళ్లి వేరుశనగ విత్తనాలను నిల్వచేయడానికి ఉపయోగించే విషపు గుళికలను మింగి ఆత్మహత్య చేసుకున్నారు. జూన్ 3 బుధవారం: కర్నూలుకి చెందిన పుల్లంరాజు (బీఎస్ఎన్ఎల్లో అధికారి), కుమారిల కూతురు స్వర్ణకుమారి. అనంతపురం మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ ఫస్టియర్ చేస్తోంది. సరిగ్గా చదవలేకపోతున్నాననే మానసిక ఒత్తిడికి లోనయింది. అదే విషయాన్ని ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేసుకుంది. జూన్ మూడో తారీఖున స్వర్ణ పుట్టిన రోజు. రెండో తారీఖు అర్ధరాత్రి కేక్‌కట్ చేసి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంది. ఆనందంగా గడిపింది. ఇంతలో ఏమయిందో ఏమో... హాస్టల్లోని తన రూమ్ 121లో.. ఎవరూలేని సమయం చూసి ఫ్యాన్‌కి ఉరేసుకొని ఉసురు తీసుకుంది.. తండ్రికి ఉత్తరం రాసిపెట్టి మరీ. ఆ సూసైడ్ నోట్లో ... ‘మీరు నా కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ నేను చదవలేకపోతున్నా. ఎంత చదువుతున్నా ఏమీ గుర్తుండట్లేదు. ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతా. నా ఫెయిల్యూర్ని మీరు తట్టుకోలేరు! సారీ డాడీ.. సారీ మమ్మీ! లవ్ యూ బోత్! ఫర్ గివ్ చేయండి!’ అని ఉంది. ఈ నాలుగూ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క అనంతపురం జిల్లాలోనే జరిగిన సంఘటనలు. ఏడాది క్రిందట ఆగస్టు 28 గురువారం: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం, తిమ్మారెడ్డిపాలెంకు చెందిన పందొమ్మిదేళ్ల సుభాషిణి టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తుండేది. ఫస్టియర్‌లో ఒక సబ్జెక్ట్ తప్పింది. దానికి సంబంధించి ఏం మథన పడిందో ఏమో... సప్లిమెంటరీ పరీక్ష రాసిన రోజే అంటే 2014, ఆగస్ట్ 28 సాయంకాలం ఇంట్లో ఎవరూలేని సమయం చూసుకొని కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. చికిత్స పొందుతూ మరణించింది. అంతకుముందు ఏడాది విశాఖపట్నం, మధురవాడలోని గాయత్రి ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఓంకార్ తన సబ్జెక్టులు అర్థం కావడం లేదని, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని తరచు స్నేహితులతో అంటుండేవాడు. ఆ క్రమంలో ఓ రోజు హాస్టల్లోనే ఉండిపోయాడు. లంచ్ బ్రేక్‌లో తోటి విద్యార్థులు వచ్చి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు! నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల గ్రామానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని గురజాల స్రవంతి కూడా ఇలా ఆత్మహత్య చేసుకున్న అమ్మాయే. ఆమె ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చదువులో ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అంతా అనుకున్నారు. ఒత్తిడిని తట్టుకోలేకే... పై సంఘటనల్లోని విద్యార్థుల నేపథ్యం వేరయినప్పటికీ వారందరి ఆత్మహత్యలకు కారణం ఒక్కటే... ఒత్తిడి. అయితే ఇవి మచ్చుకు కొన్ని సంఘటనలు మాత్రమే. ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలలు, ఇంజనీరింగ్, మెడిసిన్ డిగ్రీల మీదున్న మోజు.. సమాజం వాటికి ఇస్తున్న విలువ.. ప్రతిభను ర్యాంకుల్లో కొలిచే పద్ధతి.. ఇవన్నీ పిల్లల మీద తెలియని ఒత్తిడిని మోపుతున్నాయి. తట్టుకోలేని సున్నిత మనస్కులైన విద్యార్థులు ఆత్మహత్యలతో అర్ధంతరంగా సెలవు తీసుకుంటుంటే తట్టుకొని నిలబడిన పిల్లలు యంత్రాల్లా మారుతున్నారు. ఈ రెండూ దుష్పరిణామాలకు దారి తీసేవే! ఇలాంటి పరిణామాలు సంభవించకుండా అటు టీచర్లు, ఇటు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. - సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఎప్పటికప్పుడు వాకబు చేస్తుండాలి ఇలాంటి ఘటనలను నివారించడంలో ఇటు తల్లిదండ్రుల పాత్రా, అటు టీచర్ల పాత్ర కూడా కీలకమే. ఇంట్లో పిల్లాడి ప్రవర్తనలో తేడాలొస్తే తల్లిదండ్రులు స్కూల్లో టీచర్లను వాకబు చేయాలి. అలాగే స్కూల్లో పిల్లాడు ఎవరితో కలవకుండా ఉంటుంటే టీచర్లు తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాలి. మొత్తంగా పేరెంట్స్, టీచర్స్ ఇంటరాక్ట్ అవుతూంటే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరక్కుండా ఆపొచ్చు. అలాగే పేరెంట్స్ పిల్లల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకునే భవిష్యత్ ప్రణాళికలు వేయాలి. - డాక్టర్ పి. వీరజారావు, సైకాలజిస్ట్ అండ్ అసిస్టెంట్‌ప్రొఫెసర్, ఉస్మానియా వ్యక్తిత్వ నిర్మాణానికి చోటు ఉండాలి చదువులు, మార్కుల విషయంలో పిల్లలపై ఒత్తిడి రావడానికి మూలకారణం వారి భావి జీవితం పట్ల పెద్దల్లో అభద్రతా భావం ఉండడమే. సమాజంలో ఏదో ఒక వృత్తి లేదా ఉపాధి లభించి గౌరవప్రదంగా జీవించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడే వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మన విద్యా విధానం విద్యార్థులను యంత్రాలుగా తయారు చేస్తోంది తప్ప జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగిన వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడడం లేదు. - ఎస్.గోవిందరాజులు, రాష్ట్ర కన్వీనర్, ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ -
'ఇక ఉంటాను.. త్వరలో నాకు ఉరి'
లండన్: వారు చేసింది తప్పే అయినా.. ఉరికంబం ఎక్కడానికి ముందు వారి స్పందనలు మాత్రం కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్నాయి. మత్తుపదార్థాల రవాణాకు పాల్పడిన ఏడుగురు నిందితులను నిర్దాక్షిణ్యంగా ఇండోనేషియా ఉరితీసిన వరుసలోనే తాజాగా బ్రిటన్‌కు చెందిన 'లిండ్ సే సాండీఫోర్డ్(58)' అనే పెద్దావిడ చేరబోతుంది. ఇలాంటి కేసులోనే త్వరలో ఇండోనేషియా ఆమెను ఉరితీయబోతుంది. ఈ సందర్భంగా ఆమె కడసారిగా తన కుటుంబీకులకు, బంధువులకు లేఖలు రాసింది. ఉరి సమీపిస్తున్న తరుణంలో ఆమె తీవ్ర దుఃఖసాగరంలో మునిగినట్లుగా వాటిద్వారా స్పష్టమైంది. ఆ లేఖలో 'ఇక అందరికీ సెలవు.. నన్ను ఏక్షణమైనా ఉరితీయొచ్చు. బహుషా నన్ను రేపే ఈ సెల్లోంచి ఉరి తీసే ప్రాంతానికి తరలించవచ్చు' అని లేఖలో రాసింది. 58 ఏళ్ల సాండీ ఫోర్డ్ ఇంగ్లాండ్‌లోని రెడ్ కార్ ప్రాంతానికి చెందిన మహిళ. ఆమె 2013లో బాలీలో మత్తుపదార్థాల రవాణ కేసులోనే పట్టుబడింది. ఈ కేసులో ఆమెకు ఉరిశిక్ష పడింది. ఈ సందర్భంగా ఆమెను ఇంగ్లాండ్‌కు చెందిన ఓ మీడియా సంప్రదించగా.. తనను ఉరి తీసే సందర్భంలో మ్యాజిక్ మూమెంట్స్ అనే ప్రముఖ గీతాన్ని పాడాలనుకుంటున్నాననే విషయం చెప్పింది. ఉరి తీస్తుండటంవల్ల తనకు పెద్దగా బాధ లేదని, ధైర్య వంతురాలినని పేర్కొంది. అయితే, తాను అరెస్టు అయిన తర్వాత జన్మించిన తన మనుమరాలికి ఇప్పుడు రెండేళ్లని.. తాను ఆ పాపను ఇంతవరకు చూడలేదని, ఇక చూడలేనేమోనని దుఃఖించింది. డ్రగ్ సిండికేట్ దారులు తన కొడుకును హతమారుస్తామని బెదిరించడంవల్లే తప్పనిసరి పరిస్థితిలో ఆ పని చేయాల్సి వచ్చిందని చెప్పింది. తన జీవితంలో ఉన్న నిజమైన హీరోల్లో అంతకుముందు ఉరితీయబడిన ఆండ్రూ చాన్ ఒకరని ఆమె తెలిపింది. -
‘ఆసరా’ అక్రమాలపై అలర్ట
కరీంనగర్ రూరల్ : ‘ఆసరా’ సామాజిక భద్రత పింఛన్ల మంజూరులో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనర్హులను గుర్తించి ఏరివేయాలంటూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 4,705 మంది అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించారు. స్వయంగా పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించి తొలగించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులకు లేఖలు రాశారు. వికలాంగుల సదరెం సర్టిఫికెట్లపై ముగ్గురు వైద్యుల సంతకాలుంటేనే పింఛన్‌మంజూరు చేయాలంటూ జిల్లా కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తం 3,98,647 మంది లబ్ధిదారులున్నారు. వీరిలో వికలాంగులు 63,745, వృద్ధాప్య 1,89,020, వితంతు 1,27,362, చేనేత 8,152, గీతకార్మికులు 10,365 మంది లబ్ధిదారులున్నారు. జనవరికి సంబంధించిన పింఛన్ డబ్బులు రూ.43.48 కోట్లు మంజూరుకాగా.. ఆదివారం నుంచి పలు గ్రామాల్లో లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శులు పంపిణీ చేస్తున్నారు. వికలాంగులకు సదరెం సర్టిఫికెట్లపై వైద్యుల సంతకాలున్న లబ్ధిదారులకు మాత్రమే రూ.1500 అందించారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలతోపాటు విచారణాధికారులు దరఖాస్తులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన అనంతరం లబ్ధిదారులను ఎంపికచేశారు. అయినా పలు గ్రామాల్లో అనర్హులకు పింఛన్లు మంజూరైనట్లు ఆరోపణలు వచ్చాయి. అనర్హులను గుర్తించాలని కేటీఆర్ లేఖ.. ఆసరా పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను గుర్తించడానికి సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు సహకరించాలని కోరుతూ ఐటీ, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు. అనర్హుల ఏరివేతకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలనే మంత్రి విజ్ఞప్తితో లబ్ధిదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. అయితే తమను తొలగించవద్దంటూ పలువురు సర్పంచులు, ఎంపీటీసీలపై ఒత్తిడి తె స్తున్నారు. ఒకవైపు అనర్హులను తొలగించాలనే మంత్రి ఆదేశాలు.. మరోవైపు తమకు అన్యాయం చేయవద్దంటూ లబ్ధిదారులు చేస్తున్న ఒత్తిళ్లతో సర్పంచులు అయోమయానికి గురవుతున్నారు. పింఛన్లు తొలగిస్తే తమకు చెడ్డపేరు వస్తుందని, రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతుందని పలువురు వెనుకంజవేస్తున్నారు. సదరెం సర్టిఫికెట్లపై వెద్యుల సంతకాలుండాలి... వికలాంగులకు జారీ చేసిన సదరెం సర్టిఫికెట్లపై ముగ్గురు వైద్యుల సంతకాలుంటేనే పింఛన్ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. సదరెం ఐడీ నంబరుతో పింఛను మంజూరు చేసిన అధికారులు ప్రస్తుతం సర్టిఫికెట్ చూపిస్తేనే డబ్బులిస్తామనడంతో లబ్ధిదారులు సర్టిఫికెట్లకోసం పరుగులు తీస్తున్నారు. అయితే పలువురు లబ్ధిదారులకు సదరెం సర్టిఫికెట్లను అధికారులు జారీ చేయకపోవడంతో ఏమి చేయాలో తెలియక బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా బ్రోకర్లు సర్టిఫికెట్ల పేరిట వికలాంగులను దోచుకుంటున్నారు. సదరెం సర్టిఫికెట్‌పై వైద్యుల సంతకాలు లేని లబ్ధిదారుల జాబితాను డీఆర్డీఏ కార్యాలయానికి పంపించి వైద్యుల సంతకాలతో సర్టిఫికెట్లను అందజేస్తామని కరీంనగర్ ఎంపీడీవో దేవేందర్‌రాజు తెలిపారు. ఇప్పటికే 4,705మంది తొలగింపు.. ఆసరా పథకంలో ఇప్పటికే పలు కారణాలతో 4,705 మంది అనర్హులను గుర్తించి అధికారులు తొలగించారు. గత నెలలో ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించగా.. 2,474 మంది అనర్హులను గుర్తించారు. జాబితాలో ఉన్న మృతులను 1070 మంది, రెండు గ్రామాలు, రెండు పేర్లతో పింఛన్లు పొందుతున్న 358 మంది, ఉపాధికోసం వలస వెళ్లిన 803 మందిని గుర్తించి జాబితానుంచి తొలగించారు. ముగ్గురు డాక్టర్ల సంతకం తప్పనిసరి.. - కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ముకరంపుర : ఆసరా పథకం కింద వికలాంగుల పింఛన్ పొందుతున్న వారు సదరెం ధ్రువీకరణ సర్టిఫికెట్లలో ముగ్గురు డాక్టర్ల సంతకం తప్పనిసరని, లేకుంటే వాటిని ఎంపీడీవోలకు అందజేయాలని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ కోరారు. ఎంపీడీవోలు, డీఆర్ డీఏ సహకారంతో సర్టిఫికెట్లపై ముగ్గురు డాక్టర్ల సంతకం చేయించి తిరిగి వారికి అందజేస్తారని తెలిపారు. వికలాంగుల పింఛన్ పొందుతున్న వారు పంపిణీ సమయంలో తప్పనిసరిగా సదరెం సర్టిఫికెట్లను చూపించాలని సూచించారు. డాక్టర్ల సంతకం కోసం వికలాంగులు డాక్టర్ల వద్దకు వెళ్లవద్దని సూచించారు. అధికారులతో సహకరించాలని కోరారు. -
ఉపాధ్యాయ విద్యలో నాణ్యతేదీ?
ఇన్ బాక్స్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, పట్టణాలలో నెలకొల్పి న ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల్లో చదువుతున్న ఛాత్రో పాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ అందడం లేదు. దీం తో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన తర్వాత వారు విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్యను అందించ లేకపోతున్నారు. బీఈడీ, డీఈడీ శిక్షణా కాలేజీల్లో సరైన విద్యార్హతలున్న అధ్యాపకులు ఉండటం లే దు. అందువలన బీఈడీ కోర్సు చేసిన వారే ఛాత్రోపాధ్యాయులకు అధ్యాపకులు గా బోధన చేస్తున్నారు. ఫలితంగా ఉపాధ్యా య విద్య పట్ల ప్రతి ఒక్కరిలో అనాసక్తత పెరుగుతోంది. మరో వైపున తెలంగాణ ప్రభుత్వం, ఎన్సీటీఈలు ఇబ్బడిముబ్బడిగా ఉపాధ్యా య విద్యా కాలేజీలకు అనుమతులను ఇస్తున్నాయి. దీంతో కేవలం లాభాపేక్ష వైఖరితోనే కాలేజీలు పుట్టుకు రావడంతోపాటు, విద్యార్థులకు నామమాత్రంగానే శిక్షణ అందుతోంది. దీంతో సత్ఫలితాలు రావడంలేదు. ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లో నిరంతరం నాణ్యమైన విద్యను అందిం చేలా, అనుభవం గల అధ్యాపకులను నియమించేలా ప్రభుత్వం తగిన చొరవ చూపాలి. - కామిడి సతీష్‌రెడ్డి పరకాల, వరంగల్ జిల్లా అధిక సంతానమా, నియంత్రణా? గత అరవై సంవత్సరాల నుంచి భారతదేశం ఎంత అభివృద్ధి చెందినా అధిక జనాభా వలన దేశం అనేక రంగాల్లో తగినన్ని నిధులు, వనరులు లేక నిర్వీర్యమైపోయింది. యాభై కోట్ల జనాభాను మాత్రమే భరించగల మన దేశం 130 కోట్ల మందిని ఎలా భరించగలగటం అసాధ్యం. దేశంలో రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తీవ్రస్థాయిని చేరడానికి కారణం అధిక జనాభా. కొద్ది మేరకు ధనిక మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. కాని కొన్ని మతాల వారు మరియు సంతానాన్ని ఆదాయ వనరులుగా భావించే కార్మికులు, కూలీలు కుటుంబ నియంత్రణ పాటించకుండా జనాభాను అధికాధికంగా పెంచుతున్నారు. ఫలితంగా ఆ దేశ జనాభా పెరిగిపోతోంది. దీంతో జనాభా సమతుల్యత దెబ్బతిన్నది. కనుక ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే కుల మత రాజకీయాలు పక్కన పెట్టి నిర్బంధ కుటుంబ నియంత్రణ చట్టం చేసి కఠినంగా అమలు చేయాలి. మానవ వనరుల పరంగా దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టడం అంటే జనాభాను అదే పనిగా పెంచాలని అర్థం కాదు. రాజకీయ నేతలు అధిక సంతానంపై ఇటీవల చేస్త్నున వరుస ప్రకటనలు ఏ రకంగా చూసినా సమంజసం కాదు. - గోపాలుని శ్రీరామమూర్తి వినుకొండ, గుంటూరు జిల్లా భారత జట్టుకు జేజేలు లబ్ డబ్ .. లబ్ డబ్.. ఇది ఆదివారం భారత క్రికెట్ అభిమానుల గుండెచప్పుడు. ప్రపంచకప్‌లో భాగంగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన భారత్, పాకిస్థాన్‌ల క్రికెట్ పోరు ఆద్యంతం కనువిందు చేసింది. దాయాది పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే భారత ఘన విజయం సాధించింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైనా... ప్రపంచకప్‌లో మాత్రం తమ తొలి మ్యా చ్లోనే అదర గొట్టే ఆట తీరును భారత జట్టు ప్రదర్శించడం విశేషం. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం భారత్‌నే వరించడంతో, కోట్లాది భారతీయుల ముఖాల్లో ఆనందం పెల్లుబికింది. ఈ మ్యాచ్ ప్రపంచకప్‌కే కళ తెచ్చింది అనడంలో అతిశ యోక్తి లేదు. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన భారత ఆటగాళ్ల సమిష్టి కృషి ఫలితంగానే ఈ విజయం దక్కింది. దీంతో భారత్ వరుసగా ఆరు ప్రపంచకప్ పోటీల్లో పాకిస్థాన్‌పై వరుస విజయాలు సాధించింది. మన ఆటగాళ్లు ఇదే ఆటతీరుతో విజయ పరంపరను చివరి వరకూ కొనసాగించాలి. గతంలో రెండుసార్లు వరల్డ్‌కప్‌ను మనదేశానికి తీసుకొచ్చిన టీమ్ ఇండియా ముచ్చటగా మూడోసారి కూడా కప్‌ను ఎగురేసుకొచ్చి విశ్వవిజేతగా నిలవాలని ఆశిద్దాం. - బట్టా రామకృష్ణ దేవాంగ సౌత్ మోపూరు బాసర భక్తులకు బస్టాండ్ ఆదిలాబాద్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రానికే తల మానికం. ఇది చదువులతల్లి, జ్ఞాన సరస్వతి ఆలయం. నిత్యం వేలాది భక్తులతో శోభాయ మానంగా కళకళలాడుతోంది. భక్తులు తమ పిల్లలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని పిల్లలకు అక్షరాభ్యాసం కార్య క్రమంలో పాల్గొని, పూజలు నిర్వహిస్తుంటారు. బాసర సరస్వతిమాత ఆలయ చరిత్ర విస్తృత ప్రచారం లోకి రావడంతో దేశం నలు మూలల నుండి యాత్రి కులు నిత్యం వేలాది సంఖ్యలో వస్తుంటారు. ఈ దేవస్థానం వద్ద భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, ఆయా సమాజాల వారు ధర్మసత్రాలు, నిత్య అన్నదాన కార్య క్రమం చేపడుతూ అందరి ప్రశంసలందుకుంటున్నారు. కాని ఇక్కడ ఒకే ఒక్క లోపం ఏమిటంటే ప్రయాణీకుల సౌకర్యార్థం బాసర సరస్వతి మందిరం వద్ద ఆర్టీసీ బస్సులు రోడ్డు పక్కనే ఉన్న ఇరుకైన స్థలంలో నిలబడ తాయి. వీరి ఇక్కట్లు తీరాలంటే సరస్వతి ఆలయం పక్కనే విశాలమైన పది ప్లాట్‌ఫారాలున్న బస్టాండ్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సత్వరం స్పందించి భక్తులకు సౌకర్యాలను మెరుగుపర్చాలి. - గంగాప్రసాద్ అప్పా బోధన్, నిజామాబాద్ జిల్లా -
నీతి ఆయోగ్ - అవినీతి
ఇన్ బాక్స్ ప్రధాని నరేంద్రమోదీ ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రారంభించారు. కాలంచెల్లిన వ్యవస్థలస్థానే ప్రస్తుత అవసరాల కోసం నూతన వ్యవస్థను నెలకొల్పుకోవడం ఎంతైనా అవసరమే. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పాలనా వ్యవస్థలో అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చి ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా అధికారులు, ఉద్యోగులలో కూడా జవాబుదారీ తనాన్ని పెంచే ప్రయత్నాలకు పూనుకోవడం ప్రశంసించదగిన విషయమే. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెం ట్‌తో జీతాలు పెంచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల సెల్ ఫోన్ నంబర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాయించాలి. ముఖ్యంగా రాష్ట్రంలో కుల, ఆదాయ, నివాస, బర్త్ సర్టిఫికెట్ల జారీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సేవాభావం కనబడేలా సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేయాలి. అలాగే ఆహారభద్రత, ఆసరా, 58, 59 నంబర్ పట్టాల జారీ కోసం సుశిక్షితులైన ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది. నిరుపేదలకు ఆహార భద్రత కార్డులు రాక మునిసిపల్ కార్యాల యాల్లో గంటల తరబడి వేచి ఉంటూ ఇబ్బంది పడుతున్నందున తాహసీ ల్దార్లకే ఆహార భద్రత బాధ్యతలు అప్పగించాలి. ప్రభుత్వ ఉద్యోగులు నీతి, నిజాయితీతో పనిచేసేలా చర్యలు తీసుకొనడమే కాకుండా ప్రతి కార్యాలయంలోనూ ఏసీబీ అధికారుల సెల్ ఫోన్ నంబర్లు రాసి ఉంచితే అవినీతికి చాలా వరకు అడ్డుకట్టలు వేయవచ్చు. రాజీవ్ అమన్, కరీంనగర్ మత వాదమా! మానవతా వాదమా? ఎంతో మంది మేధావులు, జాతీయ నాయకులు ఆనాడు మన దేశానికి ఒక విధానపరమైన, ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన కొనసాగించేందుకు రాజ్యాంగాన్ని రూపొందించ డం జరిగింది. ఎటువంటి వివక్ష లేకుండా సాంఘిక, ఆర్థిక, రాజకీయ తదితర రంగాల్లో సమానత్వం, న్యాయం, స్వాతంత్య్రం సమకూర్చడమే రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం. ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటు వంటి రాజ్యాంగంలోని సామ్యవాద, లౌకిక అనే పదాలు తొలగించాలని ఇటీవల కొంత మంది ప్రకటనలు చేయడం హేయమైన చర్య, రాజ్యాం గాన్ని అవమానించడమే అవుతుంది. ప్రజాస్వామ్యయుత మైన భారతదేశ ప్రభుత్వానికి ‘‘పవిత్ర గ్రంథం రాజ్యాం గం’’. ఇంత ప్రాముఖ్యత కలిగిన రాజ్యాంగంలో 42వ సవ రణ ద్వారా చేసిన సామ్యవాద, లౌకిక పదాలు తొలగించా లనడం చాలా విడ్డూరం. స్వేచ్ఛ సమానత్వం, న్యాయం, వర్గరహిత సమాజం, ప్రభుత్వ పరమైన పరిశ్రమల ఏర్పా టు వంటి వాటికి సామ్యవాదం ప్రాముఖ్యతనిస్తుంది. భారతదేశం ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని బలపరుస్తుం ది. మనదేశంలో భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయీక రణలు సామ్యవాద స్థాపన చేయడంలో చేసిన కృషిగా చెప్పవచ్చు. పెట్టుబడుల కోసం సంస్కరణలు కాకుండా సామ్యవాద వ్యవస్థను బలోపేతం చేయాలి. భారతదేశం వివిధ మతాల పుట్టినిల్లు. ఈ దేశంలో హిందువులు అధిక సంఖ్యలో ఉన్నా... మిగతా వారు కూడా ఉన్నారు. కేవలం భారతదేశంలో హిందువులే ఉండాలి. హిందువుల రాజ్యమని అనడం మానుకోవాలి. మొన్నటికి మొన్న మన దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో... మతాల మధ్య శాంతి, సౌఖ్యా లు వర్ధిల్లాలని... మతం ఐక్యతను సాధించే సాధ నం... భారతీయులంతా ఐక్యమత్యంతో మెలగాలని కోరారు. మతం అనేది వ్యక్తి అవసరానికి సంబంధించిన ఒక అవసరం. ఇది ఆ వ్యక్తి నమ్మకంపై ఆధారపడి ఉం టుంది. వివిధ మతాలున్న సమాజంలో లౌకికతత్వం ఒక అత్యవసరమైన జీవన విధానం. అందువల్ల మన దేశంలో లౌకికతత్వాన్ని ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఎం తైనా ఉంది. మతవాదానికి బదులు మానవతావాదం అవసరం అనే నమ్మకం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇది అత్యవ సరం. మహాకవి గురజాడ అప్పారావు ‘‘మతముల న్నియు మాసిపోవును జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును’’ అని శతాబ్దం కిందటే అన్న విషయం గుర్తుంచుకోవాలి. బుర్రి శేఖర్ ధర్మన్నగూడ, రంగారెడ్డి జిల్లా ఈ ఘోరం ఇంకెన్నాళ్లు? హైదరాబాద్ వాటర్ బోర్డు ద్వారా, అలాగే ఇతర ప్రైవేట్ సంస్థల ద్వారా నీటిని అమ్మకాలు జరిపే ట్యాంకర్ల నిర్వాహకులు, వ్యాపారంలో పోటీ కారణంగా వాహనం నడిపేందుకు ఎలాంటి అర్హతలు లేని చిన్న వయసు పిల్లల చేత ట్యాంకర్లు నడిపిస్తూ నగరంలో చాలా ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. ఇటీవల నగరంలో ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసుకోబో తున్న ఒక విద్యార్థినిని అన్యాయంగా ఒక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ బలి తీసుకోవడం గర్హనీయం. ఈ ట్యాంకర్లు నడిపే చిన్న వయసు పిల్లలకు ఎలాంటి మానసిక పరిపూర్ణతా ఉండదు. ఇందువల్ల వీరు విపరీతమైన వేగంతో వాహనాలు నడుపుతూ, ప్రమాదాలకు కారణమవుతూ, అమాయ కుల ప్రాణాలు ముప్పు కలిగిస్తున్నారు. అలాగే ఈ వాహనాలకు ఎటువంటి పిట్నెస్లు ఉండవేమోననే అనుమానం కూడా కలుగుతోంది. కాబట్టి, నగరంలో అనేక ప్రమాదాలకు కారకులౌతున్న ఈ నీళ్ల ట్యాంకర్లను కొన సాగించడంపై పరిశీలించి తగు చర్యలు తీసుకుని, నగర పౌరులకు భద్రత కలిపించగలరని మనవి చేస్తున్నాను. హైదరాబాద్ హెచ్ఎమ్డబ్ల్యూఎస్ ఎస్ మేనేజింగ్ డెరైక్టర్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కమిషనర్, జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకరవర్గాల ప్రజాప్రతినిధులైన రాష్ట్ర శాసనసభ సభ్యులు ఇంజనీరింగ్ విద్యార్థిని అమూల్యమైన ప్రాణాలను బలిగొన్న ట్యాంకర్ ప్రమాదం వంటి ఘటనలను ఇకనైనా తీవ్రంగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని అభ్యర్థన. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులపై కఠిన చర్యలు చేపడితేనే దీనికి అడ్డుకట్ట వేయగలుతాం. ఎం. అశోక్, ఎర్రగడ్డ, హైదరాబాద్ సికిల్ సెల్ నివారణకు చర్యలేవీ? ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గిరిజన సీమల్లో సికిల్ సెల్ వ్యాధి పంజా విసురుతూ ఎందరో చిన్న పిల్లలను బలిగొంటున్నప్పటికీ ఎ.పి. వైద్య ఆరోగ్యశాఖ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. కనీస స్పందన కూడాలేదు. నివారణ చర్యల ఊసేలేదు. జన్యుపరమైన మార్పుల ఫలితంగా వచ్చే ఈ రక్తహీనత జబ్బునకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుంది. సికిల్‌సెల్ అనీమియా అంటే ఏమిటో తెలియని పరిస్థితిలో వైద్య, ఆరోగ్యశాఖ ఉండటం దారుణమని చెప్పక తప్ప దు. ఈ వ్యాధికి గురై మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా సికిల్ సెల్ పరీక్షలు జరపకపోవడం అత్యంత బాధాకరం. వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యవైఖరికి ఇది ప్రబల నిదర్శనం. ఈ వ్యాధి నిర్ధారణకు జరిపే ప్రాథమిక రక్తపరీక్ష ఖరీదు రూ.10కి మించి ఉం డదు. కాగా ఈ వ్యాధి నివారణకు మందులు అందుబాటులో లేవు. వ్యాధి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జబ్బును ప్రాథమిక దశలో గుర్తిం చి తగు మందులు తీసుకుంటే రోగి ఎక్కువ కాలం బతికేందుకు అవకాశం ఉంటుందని వైద్య నిష్ణాతులు చెబుతున్నారు. సుదీర్ఘ కాలం కామెర్లు ఉండ టం, రక్తహీనతతో శరీరం పాలిపోయి ఉండటం, కాళ్లు, చేతుల వేళ్లు వాచి పోయి వంపు తిరగడం, ప్లీహం వాచిపోయి ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. దీన్ని నయం చేసే వైద్య విధానం ఇంకా అందుబాటులోకి రాకపోవడం దురదృష్టకరమే. అయితే వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మన ముందున్న ఏకైక పరిష్కారం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ వ్యాధి విస్తరిస్తున్నా, గిరిజనేతర ప్రాంతాల్లో సైతం ఇది కనిపిస్తోంది. విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని గ్రామాల్లో ఈ వ్యాధి విజృంభిస్తుండగా, విజయ నగరం జిల్లా పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పల్లెల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్టు సమాచారం. సికిల్ సెల్ అనీమి యా వ్యాధిని ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోవడం క్షమార్హం కాదు. ఈ వ్యాధిపై కనీసం ఐటీడీఏ పరిధిలోని గ్రామాల్లో వైద్య, ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహించి గిరిజనులను, గిరిజనేతరు లను చైతన్యపరచాలి. అలాగే వైద్య పరీక్షా శిబిరాలను నిర్వహించి రక్త పరీక్షలు జరపాలి. నిశ్శబ్దాన్ని ఛేదించండి, ఎయిడ్స్‌పై చర్చించడని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తున్నట్టుగానే సికిల్ సెల్ అనీమియాపై చైతన్య కార్యక్రమాలలోనూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిం చాలి. ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చాలి. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సంబంధిత ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నట్టు గానే, మన రాష్ట్రం కూడా తగు విధంగా వ్యాధి నిరోధక చర్యలు తీసుకోవాలి. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే 13 జిల్లాల్లో కూడా సెమినార్లు జరపాలి. వైద్య నిష్ణాతులు అవసరమైన పత్రాలు సమర్పిం చాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఇకనైనా చొరవ తీసుకోకపోతే గిరిజన ప్రాంతాల నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవలసి ఉంటుంది. అందరికీ ఆరో గ్యం అనే నినాదం అందని మానిపండుగా మారకూడదు. వి.కొండలరావు, సీనియర్ జర్నలిస్టు, పొందూరు ప్రత్యేక హోదా కోసం ఉద్యమం! ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10 ఏళ్లపాటు రాష్ట్ర విభజన అంశం కీలకంగా సాగింది. ఈ నేపథ్యంలో విభజన బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. విభజన వలన నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌కు సహాయం అందించడా నికి కేంద్రం కొన్ని ప్రతిపాదనలను సభ ముందుం చింది. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా మని వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. అలాగే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, పర్యావరణ, ప్రాజెక్టు అనుమతులను సైతం కేం ద్రమే తెస్తుందని తెలిపారు. వీటితోపాటు నూతనంగా రాజధాని నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని విభజన బిల్లులో పేర్కొన్నారు. సభలో ఆనాటి బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ఐదేళ్ల ప్రత్యే క హోదాతో ప్రజలు సంతృప్తి చెందరని మాట్లాడారు. ఇప్పుడేమో మాట మార్చి ఇతర రాష్ట్రాలు ఆమోదించే అవకాశం లేనందున ప్రత్యేక హోదా మరచిపోవాలం టున్నారు. కేంద్రంలో తమ పార్టీ ప్రభుత్వం లేని రోజు ల్లో మంత్రి కాని రోజుల్లో, ప్రత్యేక హోదా సాధించా మని ప్రగల్బాలు పలికిన బీజేపీ నేతలు ఇప్పుడు తమ ప్రభుత్వం ఉండగా ఈ రకమైన మాటలు మాట్లాడ టం ప్రజలను మోసగించడమే అవుతుంది. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రలకు 23,500 కోట్ల రూపా యల ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపా దనలు పంపగా 350 కోట్ల రూపాయలతో సరిపెట్టడం ఏ రకంగా భావ్యమో వారే చెప్పాలి. జిల్లాకు 50 కోట్ల రూపాయలు కేటాయిస్తే 10 కి.మీ. తారు రోడ్డు వేయ డానికి మాత్రమే సరిపోతుంది. అంతేగాకుండా బడ్జె ట్లో ఏడాదికి 16 వేల కోట్ల రూపాయల లోటు ఉం దని తెలిసి 500 కోట్లు మాత్రమే కేటాయించడం విచా రకరం. రాజధాని నిర్మాణానికి 1,13,000 కోట్ల నిధు లు అవసరమని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 20 వేల కోట్ల రూపాయలు కావాలని కోరింది. కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, విభజన బిల్లులోని అంశాలను అమలు పరచా లని డిమాండ్ చేస్తూ, ఫిబ్రవరి 18న 13 జిల్లాల్లో నిర సన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ విజ్ఞప్తి చేస్తున్నది. కె. రామకృష్ణ, కార్యదర్శి సీపీఐ ఏపీ రాష్ట్రసమితి -
కాలుష్యాన్ని గమనించాలి
ఇన్ బాక్స్ గణపురం(ఎం) మండలం, పరిసరాలు టీఎస్ జెన్కో, కాకతీయ లోంగోవాల్ ప్రాజెక్టుల వల్ల పారిశ్రామికంగా కొంత అభివృద్ధిని సాధి స్తున్నాయి. కానీ దీని వల్ల ఈ ప్రాంత పర్యావరణం కలుషితమవు తోంది. ప్రజలు ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నారు. దీనికి పరిష్కారం ఒక్కటే. ఈ ప్రాంతాల నిండా ప్రభుత్వ భూములలో సామాజిక అడవులు పెంచడానికి తక్షణమే చర్యలు తీసు కోవాలి. ఈ బాధ్యతను టీఎస్ జెన్కో, కాకతీయ- లోంగోవాల్ ప్రాజెక్టు వారే స్వీకరించాలి. ఇందులో భాగంగానే ఈత, తాటి చెట్లను పెంచి గీత కార్మికులను ఆదుకోవాలి. కాలుష్య సమస్య మరింత తీవ్రం కాకుండానే ఆధునిక పరిజ్ఞానం ఆధారంగా నివారణకు కృషిని ఆరంభించాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో గణపురం పెద్ద చెరువును కూడా అభివృద్ధి చేయాలి. కట్టను విస్తరించి మినీ ట్యాం క్బండ్గా రూపొందించాలి. తెలంగాణ మహనీయుల, త్యాగధనుల విగ్రహాలను ఏర్పాటు చేయించాలి. విగ్రహాలను ఏర్పాటు చేయడం వలన స్థానికుల చరిత్ర వెలుగులోకి వస్తుంది. అలాగే కాలుష్యం మీద దృష్టి పెట్టడం ఆధునిక దృష్టికి కొలమానం కాగలదు. ఆ రెండింటినీ కరీంనగర్ పట్టణంలో ఆవిష్కరించి అందరికీ ఆదర్శం కావాలి. తాళ్ల హరిప్రసాద్ గణపురం, వరంగల్ జిల్లా ఆ విమర్శలు గుర్తు లేవా? ఆధార్‌తో, వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీని అనుసంధానం చేయడంలో ప్రభుత్వాలు అతడి కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. సిలిండర్‌పై ఇచ్చే సబ్సిడీని ఆధార్‌తో ముడిపెట్టి, బ్యాంకు ద్వారా తిరిగి చెల్లించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయిం చింది. దీని మీద దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనాయి. ప్రజా గ్రహాన్ని యూపీఏ ప్రభుత్వం చవి చూడవలసి వచ్చింది. దీనితో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. నిజానికి ఈ విధానాన్ని అప్పుడు ప్రతిపక్షం స్థానంలో ఉన్న ఎన్డీఏ కూడా విమర్శించింది. ఆధార్ అనుసంధానం ద్వారా కాంగ్రెస్ నిరాధా ర్గా మారిందని వెంకయ్యనాయుడు విమర్శించారు కూడా. ఇప్పుడు అదే నిర్ణయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయడం వింత కాదా? మధ్య తరగతి కుటుంబాలను ఎంతగానో ఇబ్బందికి గురిచేస్తున్న ఈ పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకాలి. ఏ విధంగా చూసినా ఈ పద్ధతిలోని హేతు బద్ధత ఏమిటో సామాన్య జనానికి అంతుపట్టడం లేదు. ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించడం, అందులో కొంత మళ్లీ వినియోగదారుల ఖాతా లలో జమచేయడం, ఇంత ప్రక్రియ ఎందుకో ప్రభుత్వాలు ఇకనైనా ఆలోచించాలి. ఏ వ్యవస్థనైనా కాలం గడిచేకొద్దీ సరళతరం చేయాలి తప్ప మరింత జటిలం చేయరాదు. రఘుముద్రి అప్పలనరసమ్మ బాలిగాం, శ్రీకాకుళం జిల్లా యాత్రల మతలబేమిటి? ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విదేశీ యాత్రల హడావుడి చూస్తుంటే ప్రజలకు సందేహాలు కలుగుతున్నాయి. దీనికి తోడు పలువురు నాయకులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ యాత్రలను ప్రశ్నించారు. ఆయన విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి ఆహ్వానించడం కోసమే తాను యాత్రలు చేస్తున్నానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ దీనిని ఎక్కువ మంది నమ్మడం లేదు. అందుకు కారణం ఆయన నైజం. గతంలో ఆయన విదేశీయాత్రల పేరుతో చేసిన నిర్వాకం, ఎదుర్కొన్న విమర్శలు. తాను అధికారంలో ఉన్నా, లేకున్నా సింగ పూర్‌తో తన అనుబంధం సాగుతుందని ఇటీవల ఆయన అన్నట్లు వార్తాపత్రికల్లో కూడా వెలువడింది. సింగపూర్‌కు చంద్రబాబుతో ఉన్న అనుబంధం గతంలో కూడా వివాదాస్పదమే. కాబట్టి బాబు యాత్రల మర్మమేమిటో ఆయనే వెల్లడించడం మంచిది. రాజధాని నిర్మాణాన్నీ, ఇతర ప్రణాళికలను అంత ఆగమేఘాల మీద విదేశీ సంస్థలకు అప్ప గించాలని చంద్రబాబు అనుకోవడం అందరికీ తెలుసు. ఇంత తొందర ఎందుకు? అని అన్ని వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. కొత్త రాష్ట్రం అభి వృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల విషయంలో ఎవరికీ స్వలాభా పేక్ష ఉండరాదు. అయినాల కనకరత్నాచారి కొరిశపాడు, ప్రకాశం జిల్లా మళ్లీ మోసపోయిన ప్రజలు పాత ప్రభుత్వాలతో విసిగిపోయిన ప్రజలు కొత్త పార్టీలకు ఓట్లు వేసి మోసపోయారు. పాత ముఖాలే అని తెలిసినా, మార్పు ఉంటుందని ఆశపడి ఓట్లు వేశారు. కానీ భంగపడ్డారు. భారతదేశంలో రాజకీయ పార్టీల చేతుల్లో నాయకుల మాటలతో సామాన్య ప్రజానీకం చిరకాలంగా మోసపోతూనే ఉంది. ఇందుకు ప్రజాస్వామ్య విధానంలో ఉన్న లొసుగులను నాయకులు ఉపయోగించుకుంటున్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నదీ సరికొత్త మోసమే. ఇద్దరూ తమ ఎన్నికల ప్రణాళికలను తుంగలో తొక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు గడుస్తున్నాయి. అత్యంత ప్రాధాన్యం కలిగిన సమస్యల గురించి కూడా ఆయన ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. రైతుల రుణాలు రద్దు కాలేదు. నిరుద్యోగులను మరింత నిరాశ పరుస్తూ ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్లు పెంచారు. ఈ సమస్యలను పరి ష్కరించకుండా, కమిటీల పేరుతో జాప్యం చేస్తూ, ఏదో పేరు చెప్పి విదేశాలకు వెళుతున్నారు. కేంద్రం కూడా నవ్యాంధ్రను అన్ని విధాలా ఆదుకుంటామని వాగ్దానం చేసి, ఇప్పుడు గాలికి వదిలేసింది. జాతీయ సమస్యల పరిష్కారం కోసం ఆలోచించకుండా మోదీ కూడా విదేశీ యాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదెంత వరకు సబబు? ఈశ్వర్ ప్రొద్దుటూరు, కడప జిల్లా -
డీఎస్సీతో నిరుద్యోగులకు తీరని బాధలు
ఇన్ బాక్స్ టెట్‌కు అర్హత సాధించిన వారికిచ్చే సర్టిఫికెట్ ఏడేళ్ల వరకు చెల్లు బాటవుతుందని చెప్పారు. కాని ఇప్పుడు టెట్, డీఎస్సీ రెండిం టికీ కలిపి ఒకే పరీక్ష ఉంటుందని, గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు మళ్లీ టెట్ ప్లస్ డీఎస్సీ పరీక్షను రాయాలని షరతు పెట్టా రు. అలాంటప్పుడు గత టెట్ సర్టిఫికెట్కున్న ఏడేళ్ల వ్యాలిడిటీ పరిస్థితేమిటి? ఒక డీఎస్సీకి మరో డీఎస్సీకి విధానాలు మారు తుంటే మేమెలా సిద్ధం కావాలి? ఇప్పటికే టెట్ పరీక్ష రాసి అర్హత సాధించిన మాకు మళ్లీ కోచింగ్‌కు సిద్ధమవటం తలకు మించిన భారమే. ఏ ప్రభుత్వ ఉద్యోగానికీ లేనన్ని పరీక్షలను ఉపాధ్యాయ ఉద్యోగాలకు పెట్టి నిరుద్యోగులను కుంగదీస్తున్నారు. పైగా ఎస్సీఆర్టీ ప్రకారం ప్రస్తుత విద్యాసంవత్సరంలో జరుగుతున్న పాఠ్యపుస్తకాలతోటే టెట్, డీఎస్సీ పెట్టాలంటున్నారు. కానీ గతం లో ఉన్న పాత పాఠ్యపుస్తకాలను అనుసరించి పరీక్ష ఉంటుందని పాత, కొత్త పాఠ్యపుస్తకాలకు బోధించే విధానం మాత్రమే వేరని వాటిలో ఉండే సబ్జెక్టు ఒకటేనని మన ప్రభుత్వం సర్దిచెబుతోం ది. నిజానికి ఎస్సీఆర్టీ ప్రకారం పాఠశాల విద్య ప్రస్తుతం గుణాత్మక విద్యావిధానంలో అమలవుతోంది. కాని పాత పాఠ్య పుస్తకాలు గుణాత్మక విద్యావిధానం ప్రకారం లేవు. అంటే పాత పాఠ్యపుస్తకాలననుసరించి డీఎస్సీ పరీక్ష రాయాలి. తరువాత పాఠశాలల్లో పిల్లలకు కొత్త పాఠ్యపుస్తకాలను గుణాత్మక విద్యావి ధానంలో చెప్పాల్సి ఉంటుంది. అంటే చదివేది పాత పాఠ్యపుస్త కాలు, పిల్లలకు బోధించాల్సింది మాత్రం కొత్త పాఠ్యపుస్తకాలు. ఇలా కాకుండా పాత పద్ధతి ప్రకారం టెట్, డీఎస్సీలకు విడివి డిగా తగిన సమయం కేటాయించి నిర్వహిం చాలి. పైగా, ఎంతోమంది నిరుద్యోగులు ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్నారు. టెట్, డీఎస్సీ కోచింగ్ కోసం విద్యాసంవత్సరం మధ్యలో వారు పని చేస్తున్న పాఠశాలలను వదిలి బైటకువచ్చి ఎగ్జామ్ పూర్తి చేసుకుని మరలా పోస్టు కోసమని ప్రైవేట్ స్కూల్‌కు వెళితే వాళ్ల పోస్టుల్లో మరొకరు ఉంటున్నారు. కాబట్టి ఈ టెట్, డీఎస్సీ పరీక్షలను విద్యాసంవత్సరం మధ్యలో కాకుండా మే, జూన్ నెల లో నిర్వహిస్తే మంచిది. కోర్టుల ద్వారా ఈ సమస్యను పరిష్క రించుకునేంత ఆర్థికస్తోమత లేనందున ఇలా పత్రిక ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. నిరుద్యోగుల ఆశలను పట్టించుకుంటారని, అందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. జ్యోతి, వినుకొండ, గుంటూరు జిల్లా ‘మేముసైతం’ సందేశం భేష్ ఉత్తరాంధ్రను వణికించిన హుద్ హుద్ తుపాను బాధితుల సహాయార్థం తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన ‘మేము సైతం’ కార్యక్రమం అందరినీ అలరించింది. సాటి మనుషు లను ఆదుకోవడం మనందరి బాధ్యత అనే సందేశాన్నీ ఇచ్చింది. ఈ వినోద కార్యక్రమాల ద్వారా వచ్చిన 11.51 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందించడం అభినందనీయం. ప్రకృతి వైపరీత్యాల వల్ల తెలుగు ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద కలిగినా వారిని ఆదుకోవడంలో తెలుగు సినీ పరిశ్రమ ముందుంటోంది. గతంలో ఎన్నో విపత్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేశాయి. అప్పుడు కూడా తెలుగు ప్రజలకు అండగా నిలబడిన ఘనత మన చిత్ర పరిశ్రమది. ఈసారి అక్టోబర్‌లో ఉత్తరాంధ్రను హుద్ హుద్ తుపాను భయపెట్టింది. దీంతో వెంటనే చిత్ర పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు స్పందించారు. ఎవరికి తోచిన సహాయం వారు అందించారు. మీకు అండగా మేమున్నా మంటూ చేయూతనిచ్చారు. ఏది ఏమైనప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఒక తాటిపై నిలిచి ఉత్తరాంధ్ర బాధితులను ఆదు కోవడం ప్రశంసనీయం. బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూరు, నెల్లూరు జిల్లా ‘చిత్ర’ స్పందన ఇక్కడేదీ? విశాఖలో జరిగిన హుద్‌హుద్ తుపాన్ బాధితుల కోసం తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్పందించిన తీరు అమోఘం. ఆంధ్రప్రాం తంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రతిసారీ పరిశ్రమ బాగానే స్పందిస్తుంది. సంతోషం. నిజానికి తెలుగు చిత్రపరిశ్రమకు ఆయువుపట్టు నైజాం ప్రాంతం. ఈ ప్రాంతంలోనే వ్యాపారం ఎక్కువ. స్టూడియోలకు, ఫిలింనగర్‌లకు, ఫిల్మ్ సొసైటీలకు, థియేటర్లకు భూములు ఇచ్చింది ఈ ప్రాంతమే. కానీ, ఈ ప్రాం తంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వరదలు, కరువుకాట కాలు వచ్చినప్పుడు చిత్రపరిశ్రమ స్పందించలేదు. తెలంగా ణలో ఫ్లోరోసిస్ బాధితుల కోసం, వడగండ్ల వానలకు నష్టపో యిన రైతుల కోసం, చేనేత కార్మికుల కోసం చిత్ర పరిశ్రమ స్పం దించిన దాఖలా లేదు. ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుం టున్నా చిత్రపరిశ్రమ కనీసంగా స్పందించలేదు. అదే సమయం లో తెలంగాణలో ప్రతి నటీనటులకు చాలామంది అభిమానులు ఉన్నారు. ప్రాంతాలకు అతీతంగా వీరు నటీనటులను అభిమాని స్త్తున్నారు. తెలంగాణ కోసం కూడా స్పందించాలని చిత్రపరిశ్రమ పెద్దలను కోరుతున్నాము. ఇక్కడి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతిని ధులు ఈ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సురేష్ కాలేరు, భువనగిరి, నల్లగొండ జిల్లా వికలాంగుల విన్నపం ప్రపంచ వికలాంగుల దినోత్సవం (డిసెంబర్ 3) సందర్భంగా సభలూ సమావేశాలూ నిర్వహించడమే కాకుండా వారికి ఇచ్చే పెన్షన్ రూ. 1,500కు పెంచడం చాలాబాగుంది. ప్రభుత్వ చర్య వికలాంగులకు నజరానా అనే చెప్పాలి. దీంతోపాటు వికలాం గుల కోసం నూతనంగా మంచి సంక్షేమ పథకాలను చేపట్టాలి. వారికి ప్రత్యేక గృహ సముదాయం, కాలనీలు నిర్మించి ఇవ్వాలి. బ్యాంకుల ద్వారా వారికి ప్రత్యేక రుణాలు కల్పించాలి. వారి సౌకర్యార్థం మరుగు దొడ్లు నిర్మించాలి. గ్యాస్ పథకం ద్వారా సబ్సిడీలు అందించాలి. వికలాంగుల హాస్టళ్లు ఏర్పర్చి సౌక ర్యాలు కల్పించాలి. డిసెంబర్ 3 నుంచి 10 వరకు వికలాంగుల వారోత్సవాలు నిర్వహించి వికలాంగుల సంక్షేమం కోసం బడ్జెట్, పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, రెవెన్యూ, పంచా యతీరాజ్, విద్య, ఆరోగ్యం, రేషన్ కార్డులు వంటి అంశాలపై 7 రోజుల పాటు చర్చించాలి. అన్ని రకాల ఉద్యోగాల్లో, వృత్తుల్లో వికలాంగులకు డిసెంబర్ 3న సెలవుదినం ప్రకటించాలి. ప్రతిభా వంతులైన వికలాంగులను ఈ వారోత్సవాల సందర్భంగా ప్రోత్సహించాలి. ఈదునూరి వెంకటేశ్వర్లు, నెక్కొండ, వరంగల్ జిల్లా ‘ఉసూరు’ మానియా ఆసుపత్రి మన ఆరోగ్య మంత్రిగారు రాత్రి మొత్తంగా ఉస్మానియా ఆసు పత్రిలో ఉండి రోగులను పరామర్శించడం బాగుంది కానీ ఒక్కరోజు ఆయన ఆసుపత్రిలో ఉంటే సమస్యలు తీరిపోతా యా? ఆయన వస్తున్న సంగతి తెలిసి సిబ్బంది పైపైన శుభ్రం చేసి చేతులు దులుపుకున్నారు. ఆసుపత్రి లోపల అన్ని విభాగాల పనితీరు చూసి అప్పుడు చెప్పాలి. అంతే కాని తూతూ మంత్రం తనిఖీ వల్ల ఏమీ ఒరగదని రోగుల మాట.. ఉస్మానియాకి వెళ్తే గేటు దగ్గర నుంచి అవినీతిమయం, చేయి తడిపితే కానీ లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. వీల్‌చైర్ ఉండదు. స్ట్రెచ్చర్ దొరకదు. ఎలా గోలా లోపలికి వెళితే పారిశుధ్యం అంతంత మాత్రమే. కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు, సమస్త జీవరాసులకూ ఉస్మానియానే నిలయం. పైగా భయంకర దుర్గంధం, గోడలనిండా ఉమ్ములు. ఇక వైద్యులు ఎప్పుడొస్తారో తెలియని స్థితి. సెలైన్ బాటిల్స్ కొరత. బెడ్లు లేక రోగులు నేలమీదే పడుకుంటున్నారు. రోగులు వైద్యం అందే లోపే చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి మాత్రం మారదు. ప్రభుత్వం ఇకనైనా అక్కడ సౌక ర్యాలు మెరుగుపర్చాలి. రాజ్యలక్ష్మి, చిక్కడపల్లి, హైదరాబాద్ -
అన్నప్రాశన రోజే ఆవకాయ
ఈ మధ్య ప్రవేశపెట్టిన ఆంగ్ల పాఠ్యపుస్తకాలు ‘విద్యార్థుల’ మానసిక స్థాయిని మించి ఉన్నాయి. డిగ్రీ, పీజీ స్థాయి వారికి పరిచయం చేసే క్లిష్టమైన పదజాలం పాఠాల్లో వాడటం విడ్డూ రం. విద్యా ప్రణాళికలో విషయాత్మకతకు కాని, లక్ష్యాత్మకతకు కాని చోటులేదు. కేవలం సృజనాత్మకతకే పెద్దపీట వేశారు. ఉదా హరణకు ఒక కథను ఇచ్చి దాన్ని సంభాషణ రూపంలో ఇంగ్లిష్ లో రాయమనడం, చదవని పద్యాన్ని ఇచ్చి అం దులో ప్రశ్నలడగడం, క్రికెట్ కామెంటరీ రాయ మనడం పసి మనసులను క్షోభ పెట్టడమే. ఇది కార్పొరేట్ స్కూళ్లకే కాని ప్రభుత్వ పాఠశాలలకు ఉపయోగకరం కాదు. తెలంగాణలో పేద విద్యా ర్థినీ, విద్యార్థులకు ఇది మేలు కలిగించదు. పాఠంలో చదివిన ప్రశ్నలు రావు. ఉపాధ్యాయులకు వారిని ఎలా సిద్ధం చేయాలో తెలియని పరిస్థితి. ఇది విద్యార్థులను నిరాశ నిస్పృహలకు గురి చేస్తుంది. పాఠ్యపుస్తకాలను సరళతరం చేసి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎల్కేజీ, యూకేజీ ప్రాథమిక ఇంగ్లిష్ మీడి యం పాఠశాలలు ప్రవేశ పెట్టడం వలన విద్యార్థులకు ఇంగ్లీష్ పరిజ్ఞానం ఏర్పడుతుంది. దేవళ్ల సుధాసాగర్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ బెల్టుషాపులు రద్దు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఆర్టీసీ బస్సులో వారికి ప్రత్యేకంగా బాక్స్ ఏర్పాటు చేశారు. మహిళలపై అఘా యిత్యాల పట్ల దృష్టిపెడుతూ చట్టాల ద్వారా శిక్షించే విధంగా నిర్భయ చట్టాన్ని అమలుచేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పనిలో పనిగా, రాష్ట్రంలో మహిళలకు కన్నీరు కురిపిస్తున్న బెల్టు షాపులను వెంటనే రద్దుచేయాలి. ఉద్యోగమో, కూలోనాలో చేసు కుంటూ కుటుంబాన్ని పోషించే మహిళలు తమ వీధుల్లో ఉన్న బెల్టు షాపుల వల్ల చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మహి ళలు పని చేసి తిరిగి వచ్చే సరికి, ఇంట్లో దాచిన డబ్బులను భర్త తీసుకుని బెల్టు షాపుల్లోని చీప్ లిక్కర్ తాగి కట్టుకున్న భార్యను బెల్టుతో బాదేస్తుంటే ఆ కుటుంబం పరువు బజారులో పడు తోంది. ఈ దుస్థితి నుంచి మహిళలను, కుటుంబాలను బయట పడవేయాలంటే, తెలంగాణ వ్యాప్తంగా చీప్ లిక్కర్, గుడుంబా అమ్మే బెల్టు షాపులను ప్రభుత్వం రద్దు చెయ్యాలి. బెల్టు షాపుల వలన జనాల జీవితాలు అప్పుల పాలవుతున్నాయి, బెల్టు షాపు లను రద్దుచేస్తే తప్ప తెలంగాణ బాగుపడదని జనాభిప్రాయం. ప్రభుత్వం మద్యం మీద వచ్చే ఆదాయంతో మనుగడ సాగించా లనుకుంటే, ఇక సంక్షేమానికి అర్థం పరమార్ధం ఉండవు. కె.అమన్‌రాజీవ్ కుతుబుల్లాపూర్, రంగారెడ్డి జిల్లా ఆ బౌన్సర్ ఓ గుణపాఠం ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్‌పై దూసుకొచ్చిన ఓ బౌన్సర్ అతని నిండు ప్రా ణాలను బలితీసుకోవడం క్రికె ట్ చరిత్రలో దురదృష్టకర ఘ టన. భారత క్రికెట్ ఆటగాడు రమణ్ లాంబా అతి పిన్న వ యసులో ఇలాగే క్రికెట్ బంతి తగిలి మృత్యువాతపడ్డాడు. జెంటిల్‌మ్యాన్ గేమ్‌గా పేరు గాంచిన క్రికెట్లో ఈ దుర్ఘ టనతో అర్థాంతరంగా ఒక వర్ధమాన క్రికెటర్ అసువులు బాయడం దిగ్భ్రాంతికరం. క్రీడ వినోదం కావాలి కాని విషాదం మిగల్చరాదు. బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచర్ల, కర్నూలు జిల్లా -
పూలింగా.. ఫూల్స్ చేయడమా?
ఇప్పటివరకు రాజధాని గురించి సరైన స్పష్ట త ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ అని రైతుల ను గందరగోళంలో పడేసిన ఘనత చంద్రబా బుదే. ఒకసారి మంగళగిరి అని, ఒకసారి విజ యవాడ అని చెబుతూ ఎక్కడో ఇంతవరకూ తేల్చకపోవడం శోచనీయం. చంద్రబాబు అనుచరులకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటోదని చెబితే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఒక పక్క రైతులకు మేలు చేస్తామని చెప్పి రైతుల భూమిని తీసుకోవడంలో అర్థం ఏమిటి? దీనిపై 80 శాతం ప్రజలు, రైతులు తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలాగే రైతుల పొలాలు కారుచౌకగా కొనుక్కోవడానికి చూడటం, అలా కాకపోతే బలవం తంగా తీసుకుందామని ఆలోచన ఉంది. ఇదే కొనసాగితే రైతులు ఉద్యమం చేయడం ఖాయం. అదే కాకుండా అధికారంలోకి వచ్చాకా బెల్టు షాపులు ఎత్తేస్తామని చెప్పి ఇప్పటివరకూ బెల్ట్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికయినా రాజ ధాని విషయంలో స్పష్టంగా ఒక ప్రకటన చేసి రైతులకు నష్టం కాకుండా వ్యవహరించాలి. శొంటి విశ్వనాథం, చిక్కడపల్లి, హైదరాబాద్ కేంద్ర విద్యాసంస్థలు ఇలాగేనా? ఆంధ్రప్రదేశ్‌కి మంజూరైన 11 కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుపై టీడీపీ సర్కారు రోజుకోమాటగా వ్యవహరిస్తోంది. అన్ని జిల్లా లకూ అభివృద్ధి ఫలాలు అందజేయవలసి ఉంది. ప్రాథమికంగా నిర్ణయించిన ప్రకారం నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలకు 11 విద్యా సంస్థల్లో ఏదీ కేటాయించటం లేదట. ఈ మూడు జిల్లాల్లో వైఎస్సార్సీపీ మెజారిటీ సీట్లు గెలిచిన కారణం గానే టీడీపీ ఇలా వ్యవహరిస్తోందనిపిస్తోంది. ఇక కర్నూలు లో ముందు ఎన్ఐటీ అని చెప్పి ఇప్పుడు ఐఐఐటీ అంటు న్నారు. అనంతపురంలో ఐఐఐటీ అని చెప్పి, తర్వాత ఎన్ఐటీ అని ఇప్పుడు సెంట్రల్ వర్సిటీ అంటున్నారు. విశాఖలో 4 విద్యా సంస్థలు పెడతామని, ఇప్పుడు ఐఐఎం అంటున్నారు. పెట్రో వర్సిటీ అయితే మొదట విశాఖలో అన్నారు. తర్వాత రాజమండ్రి అంటున్నారు. గోదావరి జిల్లాల్లో వైఎస్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు గూడెంకి హార్టికల్చర్ వర్సిటీ, రాజమం డ్రికి నన్నయ వర్సిటీ ఇచ్చారు. ఇవి నిజానికి కాకినాడ, ఏలూ రుకు దక్కవలసినవి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గందరగోళానికి తెరదించుతూ కాకినాడలో పెట్రో యూనివర్సిటీ, ఏలూరులో ఎన్ఐటీ లేదా ఒక కేంద్ర విద్యాసంస్థ ఏర్పాటు చేయాలి. యామినీ రెడ్డి, విజయవాడ నిరుద్యోగులను ఆదుకోండి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా గ్రంథాలయ శాఖల్లో 430 ఆఫీస్ సబార్డి నేట్ ఉద్యోగాలకు ఈ సంవత్సరం మార్చి నెలలో పరీక్షలు నిర్వ హించి 1:3 ప్రకారం ఇంటర్వ్యూలకు పిలిచారు. అయితే ఈ ఇంట ర్వ్యూలు రాష్ట్ర విభజన నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ ఉద్యోగాలను డీఎస్సీ టీచర్ రిక్రూట్మెంట్ నియామకాల తర్వాత నియామకం చేయాల్సి ఉంటుంది. 1:3 ప్రకారం ఇంటర్వ్యూకు ఎంపికయిన అభ్యర్థులందరూ, ఎక్కువ శాతం టీటీసీ, బీఈడీ చేసి ఉన్నవారే. కాబట్టి వీరిలో చాలామంది ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహించనున్న డీఎస్సీ 2014కు ఎంపికయ్యే అవకాశం ఉంది. డీఎస్సీకి ఎంపిక కాగా మిగిలిన అభ్యర్థులకు 1:3 ప్రకారం మెరిట్ ప్రాతిపదికన గ్రంథా లయ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం కలుగుతుంది. ఈ అం శాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వయోపరిమితి దాటుతున్నా, ఇంటర్వ్యూకు అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని నిరుద్యోగుల అభ్యర్థన. రాను రాను ప్రభుత్వాలకు గ్రంథాలయాల పట్ల, వాటి పురోభివృద్ధి పట్ల అశ్రద్ధ పెరిగి పోతోంది. ఇకనైనా జ్ఞాన భాండాగారాలను కాపాడాలని కోరుతున్నాము. పుల్లేటి మహేంద్ర, సాయినగర్, అనంతపురం కల్లు దుకాణాలొద్దు ఒక పక్క కల్లు దుకాణాలపై మహిళలు ఆందోళన చేస్తున్నా, ఇం కా జనావాసాల ముందు, పాఠశాలలు, దేవాలయాలు అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ వాటికి అనుమతినివ్వడంతో ప్రభు త్వానికి ప్రజాభిప్రాయంతో పనిలేదని తేలిపోయింది. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి పట్టదా? దీనిపై ఏ రాజకీయ నాయకులూ పెదవి విప్పకపోవడం దురదృష్టకరం. ప్రజల ఆరో గ్యం కంటే ప్రభుత్వ ఆదాయమే ముఖ్యమైతే, పేద లవైద్యం, దవాఖానాలకు ఎంత డబ్బు కేటాయిస్తే మాత్రం ఏమిటి లాభం. సారావలన సంసారాలు నాశనం అవుతున్నాయని మహిళలు నెత్తీనోరూ బాదుకుంటున్నా ప్రయోజనం కనిపించటంలేదు. ఒకవైపు ఇదే ప్రభుత్వం పేకాట క్లబ్బులను నగరానికి దూరంగా పెట్టుకునే వీలు కల్పిస్తున్నప్పుడు కల్లు, సారా దుకాణాలను కూడా ఊరి చివ రకు తరలించే చర్యలు చేపట్టాలి. జనావాసాల మధ్య మద్యం ఉం టే మహిళల దగ్గరనుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. పేద వాడి కూలి డబ్బులు కల్లు, సారా దుకాణాలకే అర్పితం అవుతున్న ప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఏమి లా భం? తెలంగాణ ప్రభుత్వం వీటిపై మరోసారి పునరాలోచించాలి. ఎస్. రాజ్యలక్ష్మి, చిక్కడపల్లి, హైదరాబాద్ -
ఏమిటీ 'ముద్దు గోల'
ఇటీవల కేరళలో ప్రారంభమైన ముద్దుల గోల అవమానకరంగా ఉంది. ఏం సాధించాలని విద్యార్థులు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు? ఉద్యమాల బాట వీడి ముద్దుల బాట పడతామని వారు అనడం విచారకరం. కల్చరల్ పోలీసింగ్‌కు నిరసన తెలియచేయాలంటే ఇదా మార్గం? వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వేరే విధంగా నిరసన తెలియ చేయవచ్చు. వ్యక్తి స్వేచ్ఛకూ మతానికీ ముడిపెడితే దానికి కూడా అభ్యంతరం చెప్పవచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇలా ముద్దులు ఎందుకు పెట్టుకోవాలి? అప్పుడైనా ఎవరో అందమైన బాలిక దగ్గరే కుర్రకారు అంతా కనిపించింది తప్ప, మామూలు బాలికలు ఎవరూ ఇందులో పాల్గొనలేదు కదా! పాల్గొన్నా వారిని అబ్బాయిలు ఆకర్షించలేదా? ఒకనాడు తమ మనోభావాలను వ్యక్తీకరించడానికి విద్యార్థులు గొప్ప ఉద్యమాలు చేశారు. సినిమాలలో ముద్దు సీన్లకు వ్యతిరేకంగా పోరాడివారే ఇప్పుడు వ్యక్తి స్వేచ్ఛకు భంగం పేరుతో బహిరంగ ముద్దులను ప్రేరేపించడం ఏమిటి? ఇదంతా విద్యార్థులలో, యువతలో తీవ్రంగా ఆలోచించగలిగే మనస్తత్వం నశించిపోవడమే. దీనిని సరిదిద్దాలి. బి. సాయికిరణ్ గుంటూరు నత్తనడకన 'బాబు'పాలన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు నత్తనడకను తలపించింది. ఈ వ్యవధిలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టకపోవడం దురదృష్టకరం. రైతు రుణ మాఫీ అంటూ వాగ్దానాలను కురిపిం చి అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు, ఆ దిశగా ఇప్పటికీ సుస్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం రైతుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఒక వైపు బ్యాంకర్ల ఒత్తిడి, మరోవైపు ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో రైతులు రుణాలు పొందాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు డ్వాక్రా రుణాలను లక్ష రూపాయల వరకే మాఫీ ప్రకటించారు. ఒక్కో గ్రూపులో పది మందికి పైగా సభ్యులున్న మహిళలకు దీని వల్ల ఒనగూరేది అంతంత మాత్రమే. చౌక దుకాణ వస్తువుల సరఫ రాను గ్రామాల్లో 2 రోజులకు, పట్టణ, నగరాల్లో 3 రోజులకు కుదించడం హేయమైన చర్య. కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికీ ఆధార్ లేకపోయినా బియ్యం కోత పెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం? కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా ప్రజల మనసెరిగి పాలించేందుకు సమాయత్తం కాచాలి. బట్టా రామకృష్ణదేవాంగ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా న్యాయమే అయినా, సమస్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండటం చాలా వరకు న్యాయమే. అయితే అక్కడ రాజధానిని నిర్మిస్తే మనకున్న భౌగోళిక స్థితి వల్ల చాలా వరకు పంట భూములను కోల్పోవలసి వస్తుంది. ఇప్పటికి చాలా మంది రైతులు వ్యవసాయం లాభసాటిగా లేదంటున్నారు. మనిషిని బతికించేది ఆహారం. ఆ కొరత రానివ్వకుండా ఆంధ్ర అన్నపూర్ణగానే ఉండాలి. రాయలసీమ వాసులు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల వారిని ప్రత్యేకంగా గౌరవిస్తారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక చాలా బాగుంది. వారి సూచనకు మౌలిక మార్పులతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చు. భారతదేశంలో చివరిసారిగా రెండు ముక్కలైంది మన తెలుగు రాష్ట్రమే ఇప్పుడు అభివృద్ధి అంటే ఆంధ్రను చూసి నేర్చుకోవాలని మిగిలిన రాష్ట్రాలు అనుకోవాలి. ఈ విషయంలో నేతలు వినాయకులుగా మారకుండా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తమ ప్రత్యేకతను నిరూపించుకోవలసిందే! ఏ రాష్ట్రానికి లేని సముద్ర తీర ప్రాంతం మనకు మాత్రమే ఉంది. ఒకరకంగా అదృష్టం. మైనేపల్లి సుబ్రహ్మణ్యం ఆకునూరు, కృష్ణా జిల్లా -
మద్యంతో మరణశాసనం
ఎన్నికల ముందు మద్యం బెల్టు షాపులు రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాలే ఆధారమన్నట్లు మరిన్ని దుకాణాల పెంపుతో మద్యాన్ని రాష్ట్ర మంతా పారించి మద్యాంధ్రప్రదేశ్ చేసేలా ఉన్నారు. బెల్టు షాపు లు రద్దుచేస్తున్నట్లు జీవో ఇచ్చినప్పటికీ తన జీవోను తానే తుం గలోతొక్కి మరిన్ని కొత్త షాపులు ప్రవేశపెట్టడా నికి మద్యం దుకాణాల సామర్థ్యం పెంపు, అనే కొత్త పేరు పెట్టి గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ మరింత మంది తాగుబోతులను చేస్తారట. రోడ్డు మీదకొచ్చి తాగనక్కరలేకుండా వారి ఇళ్ల దగ్గర గల్లీలలోనే షాపులు పెట్టి మద్యం దాసులకు మరింత చేరువ చేస్తారట. పేదలు, మధ్యతరగతి వర్గాలు తాగే మద్యం రకాల విక్రయాలు అధికంగా ఉంటాయి గనుక వాటిపైనే ధరలు పెంచనున్నట్లు తెలుస్తుంది. కూలీనాలీ చేసుకొని తెచ్చే సొమ్ము కాస్తా పెట్టి మద్యం సేవించి ఇల్లు వళ్లూ గుల్లచేసుకొని మరణిస్తున్న వారిని చూసి అయినా ప్రభుత్వం మద్యాన్ని ఎం దుకు నిషేధించదు? మద్యం ప్రియులచేత మందు తాగించి వారి మరణ శాసనం రాసుకోడానికి సహకరిస్తోంది ప్రభుత్వం. ఎస్.వీనస్ ఎల్‌ఎన్‌పురం, తూ.గో.జిల్లా బస్సుబాధలకు పరిష్కారం నేను నా కుటుంబం 17.10.2014న సాయంత్రం 4 గంటలకు హైర్ బస్సు 8027లో జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరుకు ప్రయా ణించాం. బస్సు బయల్దేరిన 2, 3 నిమిషాలకే డ్రైవర్ టేప్ రికార్డర్ ఆన్ చేశారు. 10 నిమిషాలు గడిచాక టేప్ శబ్దం భరించరానిదిగా ఉంది కాబట్టి ఆపివేయాలని డ్రైవర్ని కోరాను. నా అభ్యర్థనను పట్టించుకోలేదు. దాంతో కండక్టర్‌కి చెబితే ఆయన డ్రైవర్‌తో విషయం ప్రస్తావించారు. అయితే డ్రైవర్ వినిపించుకోకుండా మమ్మల్ని వెనక సీట్లోకి పోయి కూర్చోవాలని తృణీకారభావంతో వ్యాఖ్యానించారు. దైవదర్శనానికి బయల్దేరిన మాకు శబ్ద కాలుష్యానికి తోడు తిరస్కారం, అమర్యాద ఎదురైంది. హైర్ బస్సుల్లో టేప్ రికార్డర్ శబ్దం, డ్రైవర్ ఎదురుగా దేవుని పటాలకు రంగు రంగుల కాంతితో వెలిగే లైట్లు ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. బస్సుల్లో పొగత్రాగనీయకుండా గత 30 ఏళ్లుగా నేను కృషి చేస్తూనే ఉన్నాను. ప్రయాణీకులు కోరినప్పటికీ బస్సుల్లో శుభ్రమైన 200 ఎంఎల్ మంచినీరు ఇవ్వరు కానీ, కోరకుండానే శబ్ద కాలుష్యం కలిగించి ఇబ్బంది పెడు తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను. కాసర వెంకటరెడ్డి జంగారెడ్డిగూడెం సోదరుల మధ్య తగవులా? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోని తన తొమ్మిదేళ్ల పాలనలో శ్రీశైలం నది నీటినిల్వల విషయంగా ఇచ్చిన జీవో పట్టుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించడంతో వివాదం మొదలై రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంది. కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రతిగా చంద్రబాబు సీఎం స్థాయిలో సమాధానం ఇవ్వకుండా టీడీపీ మంత్రులను, శాసనసభ్యులను ఎగదోయడం తో వారు కేసీఆర్‌పై దూషణలకు దిగుతున్నారు. పాత జీవోలను చూపి మాకూ హక్కు ఉందని కేసీఆర్ అన్నప్పుడు, అది తప్ప యితే దీటుగా చంద్రబాబే ఘాటుగా స్పందించాల్సింది. ఇద్దరూ ఒకే వేదికపై చర్చించి ప్రజలకు నిజానిజాలు తెలియ జేయాల్సింది. కేసీఆర్‌వన్నీ అబద్ధాలేనని ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల నిరూపించొచ్చుగదా. బాబు కూడా రైతులు, డ్వాక్రా మహిళలకు హామీలిచ్చి ఓట్లేయించుకుని రుణ మాఫీ చేయకుండా నానా తిప్పలు పెడుతున్నారు గదా. ఇలా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడం సరికాదు. విషయాన్ని కేంద్రానికి నివేదించి వారి సలహా ప్రకారం సమస్య పరిష్కరిం చుకుంటే రెండు రాష్ట్రాల మధ్య తగవులుండవు. రెండు రాష్ట్రా లలోనూ ఉన్నది అన్నదమ్ములే గదా. ఆర్.గోవిందరాజులు ఎస్.కోట, విజయనగరం జిల్లా -
'జయకు లేఖ రాయడం మేనకా వ్యక్తిగతం'
చెన్నై:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాయడం మేనకా గాంధీ వ్యక్తిగతమని బీజేపీ జాతీయ నేత మురళీధరరావు స్పష్టం చేశారు. తాజాగా జయలలితకు మేనకా లేఖలు అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పందించారు. అది ఆమె వ్యక్తిగతం. ఇందులో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు'అని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో మద్దతుపై ఎటువంటి బెదిరింపు ధోరణి లేదన్నారు. శివసేనతో తమ మైత్రి కొనసాగుతుందనే అనుకుంటున్నా అని ఆయన తెలిపారు. మేనకా గాంధీతో పాటు, రజనీ కాంత్ లు వేర్వేరుగా జయక లేఖలు రాసిన సంగతి తెలిసిందే. రజనీ కాంత్ వంటి స్టార్లను నియంత్రించ లేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదిలా ఉండగా వారిద్దరి లేఖలు తనను లోతుగా కదిలించాయని జయ తెలిపారు. రజనీ, మేనకాగాంధీలు తమ తమ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన గురించి ఆలోచించటం సంతోషకరమన్నారు. -
ఆ 'లేఖలు' నన్ను కదిలించాయి: జయ
చెన్నై : సినీ నటుడు రజనీకాంత్, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధ్యక్షురాలు జయలలిత ధన్యవాదాలు తెలిపారు. జయ జైలు నుంచి విడుదలైన సందర్భంగా రజనీకాంత్, మేనకా గాంధీలు తమ సానుభూతి, మద్దతు తెలుపుతూ వేర్వేరుగా లేఖలు రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జయలలిత ... వారిద్దరి లేఖలు తనను లోతుగా కదిలించాయన్నారు. రజనీ, మేనకాగాంధీలు తమ తమ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన గురించి ఆలోచించటం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబాలకు మంచి జరగాలని జయ ఆకాక్షించారు. ఈ మేరకు అన్నాడీఎంకే కార్యాలయం సోమవారం ఓ లేఖను విడుదల చేసింది. కాగా జీవితంలో ఎన్నో కష్టాల్ని, ఒడిదుడుకుల్ని చవి చూశారని, వాటిన్నింటిని ఎదుర్కొన్నట్టుగానే ప్రస్తుత కష్టాన్ని అధిగమించి త్వరితగతిన బాధ్యతలు చేపట్టాలని కేంద్రమంత్రి మేనకా గాంధీ ...జయలలితకు రాసిన లేఖలో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే రజనీ కాంత్ తన లేఖలో మనో ధైర్యంగా ఉండాలని, ప్రశాంత పూరితంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మళ్లీ ప్రజల్లోకి రావాలని ఆంక్షిస్తూ, ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన ఆలేఖలో పేర్కొన్నారు. -
అవి ‘ఉత్త’రాలే!
అమలాపురం టౌన్ :అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని కుదిపేసిన అజ్ఞాత ఉత్తరాల కలకలం కొత్త మలుపు తిరిగింది. ఆస్పత్రికి వచ్చిన తన కుమార్తెపై అక్కడి సిబ్బందిలో ఒకరు లైంగిక దాడికి యత్నించారన్న సారాంశంతో ఓ అజ్ఞాత తండ్రి రాసినట్టుగా వచ్చిన ఉత్తరాల్లో నిజం లేదని పోలీసులు తేల్చారు. లేఖల కలకలం ఏరియా ఆస్పత్రి ఎక్స్‌రే ల్యాబ్‌లో పనిచేసే నారాయణమూర్తి ల్యాబ్‌కు వచ్చిన ఓ పేదింటి యువతిపై లైంగిక దాడి చేశాడని లేఖలు కలకలం సృష్టించడంతో జిల్లా అధికార యంత్రాంగం , ప్రజాప్రతినిధులూ హైరానా పడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించి ఆర్డీఓను విచారణ చేయమని సూచించారు. వివిధ ప్రజా సంఘాలు లైంగిక దాడికి కారణమైన ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసనలు తెలిపాయి. దీంతో ఆరోపణలు ఎదుర్కొన్న నారాయణమూర్తిని విధుల నుంచి తొలగించారు. ఆస్పత్రి అభాసుపాలైందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో సంచలనమైనఈ ఉత్తరాలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పట్టణ సీఐ శ్రీనివాసబాబు లోతుగా దర్యాప్తు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్పత్రి ల్యాబ్ ఉద్యోగి నారాయణమూర్తిని విచారించి, అతడికి శత్రువులు ఎవరున్నారనే దిశగా దృష్టిసారించారు. పోలీసుల దర్యాప్తుతో... ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎక్స్‌రే ల్యాబ్ ఉద్యోగి నారాయణమూర్తి రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో కొందరు సిబ్బంది ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. అయితే ల్యాబ్‌లో యువతిపై లైంగిక దాడి చేసేంత పరిస్థితులు అక్కడ లేవని స్పష్టం చేస్తున్నారు. దీంతో పోలీసులు నారాయణమూర్తి విచారించగా అతడు వారికి ఓ క్లూ ఇచ్చాడు. తనకు తన సమీప బంధువు శ్రీనివాసరావుపై అనుమానం ఉన్నట్టు తెలిపాడు. దీంతో వారు రంగంలోకి దిగి తమదైన శైలిలో శ్రీనివాసరావును విచారించగా... అసలు విషయం బయటపడింది. ఉత్తరాలు రాసింది తానేనని, ఫలానా డీటీపీ సెంటర్లో ఆ ఉత్తరాలు అచ్చువేయించినట్టు ఒప్పుకోవడంతో కథ క్లైమాక్స్ వచ్చింది. బంధువుల మధ్య గొడవలే... బంధువులైన నారాయణమూర్తి, శ్రీనివాసరావు కుటుంబాల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. నారాయణమూర్తిని ఎలాగైనా ఆస్పత్రి నుంచి బయటకు పంపించాలన్న అక్కసుతో శ్రీనివాసరావు ఆస్పత్రిలో యువతిపై లైంగిక దాడి అంటూ ఓ అజ్ఞాత తండ్రి రాసినట్టు ఉత్తరాల డ్రామాకు తెరతీశాడని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. యువతిపై లైంగిక దాడి జరిగిందన్న కోణంలో తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు దొరకలేదని, కేవలం వారి కుటుంబాల మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో నారాయణమూర్తిపై కక్ష తీర్చుకునేందుకే శ్రీనివాసరావు ఉత్తరాలు కలకలం సృష్టించాడని సీఐ శ్రీనివాసబాబు తెలిపారు. శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశామన్నారు. ఈ సంఘటనతో ఆస్పత్రి పరువుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న సిబ్బంది లైంగిక దాడి జరగలేదన్న సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు. -
తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షునిగా పాలమూరు బిడ్డ
పాలమూరు యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షునిగా పీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వెంకటాచ లంను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తంచేశారు. కె.వెంకటాచలం జిల్లాలోని అలంపూర్ తాలుకా మానవపాడు మండ లం జెల్లాపురం గ్రామంలో కె.వెంకటసుబ్బన్న, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. గతంలో ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఏపీ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా 1990 నుంచి 1994వరకు పనిచేశారు. 1994లో యూటీసీ యంగ్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే చీఫ్‌వార్డెన్‌గా 2005 నుంచి 2007 వరకు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా 2003 నుంచి 2006 వరకు కొనసాగారు. అపార అనుభవం ఉన్న ఆయన 2008లో పాలమూరు యూనివరిట్సీ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నేడు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం పట్ల పలువురు జిల్లా ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉన్నతవిద్యామండలికి ఉపాధ్యక్షునిగా నియమితులు కావడం వల్ల భవిష్యత్‌లో పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడతారని పీయూ విద్యార్థులు సంతోషం వ్యక్తంచేశారు. కె.వెంకటాచలం అత్యున్నత బాధ్యతలు స్వీకరించడం పట్ల పీయూ ప్రిన్సిపాల్ పిండి పవన్‌కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డి.మధుసూదన్‌రెడ్డి, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. -
సీఎం గారూ.. మీరు భలే సుందరాంగులు!!
ఒకళ్లు కారు.. ఇద్దరు కారు.. ఏకంగా ఐదు లక్షల మంది గత రెండు సంవత్సరాలలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు లేఖల మీద లేఖలు రాశారు. ఆయన జనతా దర్బార్, ముఖ్యమంత్రికి లేఖలు అనే కార్యక్రమాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ''ముఖ్యమంత్రి గారూ, మీరు చాలా అందంగా ఉంటారు. నన్ను పెళ్లి చేసుకుంటారా'' అని వాటిలో చాలా లేఖలున్నాయి. అలాగే ఇంకా.. ''ముఖ్యమంత్రి గారూ, నా దగ్గర బొలెరో వాహనం లేదు. మీరు ఇస్తారా?'' అని, ''నేను మిమ్మల్ని సోదరుడిగా భావిస్తున్నాను. మీకు రాఖీ కట్టచ్చా'' అని.. ఇలా లెక్కలేనన్ని ఉత్తరాలు అఖిలేష్ యాదవ్‌కు వచ్చాయి. ఈ ఉత్తరాలన్నింటికీ సమాధానాలు ఇవ్వడం కోసం ఈ దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించేందుకు ఓ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వాళ్లు ఓ డజను మంది కంప్యూటర్ నిపుణులను రంగంలోకి దించి, ప్రతిదానికీ బార్ కోడింగ్ చేసి, డిజిటైజేషన్ చేస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఓ ఆఫీసు ఏర్పాటు చేసింది. అందులో రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. దాదాపు 4.75 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో 65 వేలకు తప్పనిసరిగా సమాధానాలివ్వాలని గుర్తించి, వాటిని సీఎం వద్దకు పంపుతున్నారు. -
అభిప్రాయాలు తెలిపిన తరువాతే అఖిలపక్షం: షిండే
ఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంపై అభిప్రాయాలు పంపాలని ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పక్షాలకు హొం శాఖ లేఖలు పంపింది. తెలంగాణపై కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం(జిఎంఓ) విధివిధానాలపై అభిప్రాయాలు పంపాలని ఆ లేఖలలో పేర్కొన్నారు. నవంబర్ 5కల్లా అభిప్రాయాలు పంపాలని హొం శాఖ విజ్ఞప్తి చేసింది. 7వ తేదీన జిఎంఓ సమావేశం కానున్నందున, ఆ లోపలే అభిప్రాయాలు పంపాలని హొం శాఖ కోరింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు పంపిన తరువాత అఖిలపక్ష సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు వచ్చే వారంలో రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు షిండే నిన్న చెప్పారు. జిఎంఓ సమావేరశానికి ముందే సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. మళ్లీ ఈరోజు వారి అభిప్రాయాలు తెలిపిన తరువాతే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
వేలానికి ఐన్‌స్టీన్ లేఖలు
న్యూయార్క్: ఐన్‌స్టీన్ 1938లో రాసిన రెండు లేఖలు వేలానికి పెట్టారు. దానిలో తన లెక్కల్లో తప్పు ఉందని అంగీకరిస్తూ ఐన్‌స్టీన్ ఒక స్టూడెండ్కు రాసిన లేఖ ఉండడంతో వాటికి భారీగా ధర పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ లేఖలకు వేలం నిర్వాహకులు రూ. 2 కోట్ల 43 లక్షల ధర నిర్ణయించే అవకాశం ఉంది. కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేస్తున్న సమయంలో హెర్బర్ట్ సాల్జర్ అనే విద్యార్థి 1938లో ఐన్‌స్టీన్‌కు ఒక లేఖ రాశాడు. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన దూర సమాంతర క్షేత్ర సిద్ధాంతం (డిస్టాంట్ పారలిజం ఫీల్డ్ థియరీ)లో తప్పును కనుగొని ఆయనకు లేఖ రాశాడు. ఆ లేఖకు ఐన్‌స్టీన్ రెండు సార్లు బదులిచ్చారు. 1938 ఆగస్టు 29న తొలుత బదులిస్తూ సాల్జర్ ప్రతిపాదన సాధ్యం కాదని చెప్పారు. రెండువారాల తర్వాత తన తప్పును అంగీకరిస్తూ సాల్జర్కు మరో లేఖ రాశారు. అందులో తనదే తప్పని ఒప్పుకొన్నారు. సాల్జర్కు ఐన్‌స్టీన్ రాసిన రెండు ఉత్తరాలు నవంబర్ 17న ఇక్కడి గ్యుయెర్సీస్ ఆక్షన్ హౌస్‌లో వేలం వేయబోతున్నారు. -
విభజనపై రాష్ట్రపతి, ప్రధానులకు లేఖలు రాశాం: శైలజానాథ్
రాష్ట్ర విభజన ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనల్ని పాటించాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు లేఖలు రాసినట్టు సమైక్యాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ ఎస్.శైలజానాథ్ చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని మంత్రి అన్నారు. అసెంబ్లీ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రాన్ని విభజించలేదని శైలజానాథ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి విభజన అంశం ఏ రూపంలో వచ్చినా వ్యతిరేకిస్తామని చెప్పారు. -
రిటర్నులపై మరో 35వేల మందికి ఐటీ లేఖలు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను బకాయిలు చెల్లించాలని, ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని ఆదేశిస్తూ మరో 35,000 మందికి ఆదాయ పన్ను విభాగం ఈ వారం లేఖలు రాసింది. దీంతో మొత్తం 2.45 లక్షల మందికి లేఖలు పంపినట్లయింది. దాదాపు 12 లక్షల మంది రిటర్నులు దాఖలు చేయడం లేదని గుర్తించిన ఆదాయ పన్ను శాఖ వారిపై చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ విభాగంలో ఇప్పటిదాకా 3,44,365 రిటర్నులు దాఖలయ్యాయి. అసెస్సీలు రూ. 577 కోట్ల మేర సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, రూ. 408 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కూడా చెల్లించినట్లు ఐటీ విభాగం తెలిపింది. ఈ ప్రయత్నం విజయవంతం అయిన నేపథ్యంలో 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరంలో భారీ లావాదేవీలు నిర్వహించిన వారిపైనా దృష్టి సారించాలని భావిస్తున్నట్లు వివరించింది. ఈ-రిటర్న్ కాపీలు తక్షణమే పంపాలి: ఐటీ విభాగం గడిచిన 2 అసెస్మెంట్ సంవత్సరాలకు ఐటీ రిటర్నుల కాపీలను పంపించని పక్షంలో, వాటిని సాధ్యమైనంత త్వరగా బెంగళూరు కేంద్రానికి పంపాలని ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫైలింగ్ చేసిన వారికి ఐటీ విభాగం సూచించింది. ఒకవేళ పంపించినప్పటికీ.. అక్నాలెడ్జ్మెంట్ అందని వారు సైతం మరోసారి పంపాలని పేర్కొంది. తద్వారా పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్నులను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఐటీ విభాగం తెలిపింది.