న్యూఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ రాసిన లేఖలను, మరికొన్ని పత్రాలను వెనక్కి ఇచ్చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని, ప్రధానమంత్రి సంగ్రహాలయం కోరింది. సోనియా గాంధీ వాటిని తీసుకెళ్లారని.. వాటిని తిరిగి ఇచ్చేయాలంటూ మ్యూజియం సభ్యుడొకరు ఆయనకు లేఖ రాశారు.
2008 యూపీఏ పాలనలో.. అప్పటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అప్పటి పీఎంఎంఎల్(Prime Ministers' Museum and Library) డైరెక్టర్ అనుమతితో ఆ పత్రాలన్నింటిని తీసకెళ్లారు. అయితే వాటిని ఇప్పుడు వెనక్కి ఇవ్వాలంటూ పీఎంఎంఎల్ సభ్యుడు రిజ్వాన్ ఖాద్రి, రాహుల్‌కు లేఖ రాశారు. ఒకవేళ ఒరిజినల్ లేఖలు ఇవ్వడం ఇష్టంలేని తరుణంలో ఫొటోకాపీలు లేదంటే డిజిటల్ కాపీలైనా ఇవ్వాలని కోరారు.
అయితే ఈ పత్రాల గురించి నెహ్రూ కుటుంబాన్ని కోరడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మ్యూజియం వార్షిక సమావేశం జరిగింది. అందులో.. నెహ్రూ సంబంధిత లేఖలు, ఇతరత్రా పేపర్లు కనిపించకుండా పోవడంపై చర్చ జరిగింది. చారిత్రకంగా అవి ఎంతో ప్రాధాన్యం పత్రాలుగా అభిప్రాయపడుతూ.. వాటిని ఎలాగైనా వెనక్కి రప్పించాలని పీఎంఎంఎల్ మండలి నిర్ణయించింది. ఈ విషయంలో అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావించింది.
ఈ మేరకు.. సెప్టెంబర్‌లో సోనియా గాంధీని కోరుతూ ప్రధాని మ్యూజియం ఓ లేఖ రాసింది. అయితే ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఇప్పుడు రాహుల్ గాంధీకి మరో లేఖ రాసింది.
నెహ్రూ ప్రధానిగా ఉన్న టైంలో పలు కీలక పత్రాలు సైతం.. ఆ సేకరణలో ఉన్నట్లు పీఎంఎంల్ భావిస్తోంది. అలాగే.. ఎడ్విన్ మౌంట్‌బాటెన్, అల్బర్ట్ ఐన్‌స్టీన్, జయప్రకాశ్ నారాయణ్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిట్, అరుణా అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, గోవింద్ వల్లభ్ పంత్ లాంటి ప్రముఖలతో నెహ్రూకు మధ్య జరిగిన ఉత్తర-ప్రత్యుత్తరాలు ఆ కలెక్షన్స్‌లో ఉన్నాయి.
నెహ్రూ దస్తూరితో ఉన్న ఈ లేఖలను 1971లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో(ఇప్పుడదే ప్రధానుల మ్యూజియంగా మారింది) భద్రపరిచారు. అయితే యూపీఏ హయాంలో వాటిని సుమారు 51 బాక్సుల్లో సోనియా గాంధీ నివాసానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పీఎంఎంల్ మండలి కాలపరిమితి ఈ నవంబర్‌లోనే ముగియాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో.. ఆ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగించడం గమనార్హం.
ఇదీ చదవండి: ‘తప్పులు కప్పిపుచ్చుకోవడానికే నెహ్రూ పేరు వాడుకుంటున్నారు’
Comments
Please login to add a commentAdd a comment