సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ నిన్న(శనివారం) లోక్‌సభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నెహ్రూ పేరును ప్రధాని మోదీ వాడుకుంటున్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో రాజ్యాంగబద్ధమైన పాలన ఉండేదన్న జైరాం.. ఎన్డీఏ పాలనలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. 2014కు ముందు కాంగ్రెస్ పాలనలో భారత్ సాధించిన విజయాలను మోదీ గుర్తుచేసుకోవాలంటూ జైరాం హితవు పలికారు.
కాగా, కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ లోక్‌సభ సాక్షిగా నిప్పులు చెరిగారు. ‘‘గాంధీ–నెహ్రూ కుటుంబం 50 ఏళ్లపాటు రాజ్యాంగం రక్తాన్ని కళ్లజూసింది. ఇప్పటికీ ఆ ఆనవాయితీని కాంగ్రెస్ కొనసాగిస్తూనే ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని పదేపదే గాయపరుస్తూనే ఉంది’’ అంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో రెండు రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు మోదీ శనివారం సమాధానమిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ గత ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు.
ఇదీ చదవండి: జమిలి ఎన్నికల బిల్లు వాయిదా?
‘‘అవి దేశ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు వంటి విషపు విత్తనాలు నాటాయి. దేశ ఐక్యతనే దెబ్బతీశాయి. ముఖ్యంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి నెహ్రూ–గాంధీ కుటుంబం చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతి స్థాయిలోనూ రాజ్యాంగాన్ని ఆ కుటుంబం సవాలు చేసింది. అందుకే 55 ఏళ్లు అధికారం వెలగబెట్టిన నెహ్రూ–కుటుంబాన్ని ఓడించి ఇంటిబాట పట్టించాం’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment