
లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
ఈనెల 20లోగా సభ ముందుకు రెండు బిల్లులు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ బిల్లు సోమవారం లోక్‌సభ ముందుకు రావడం లేదు. జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు–2024ను పార్లమెంట్ దిగువ సభలో నేడు ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో సైతం వీటిని చేర్చారు. కానీ, కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఆదివారం సవరించిన బిజినెస్ జాబితా నుంచి ఈ రెండు బిల్లులను తొలగించారు. సోమవారం నాటి లోక్‌సభ అజెండాలో వీటిని చేర్చలేదు. అయితే, రెండు బిల్లులను ఈ వారమే సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 20న ముగియనున్నాయి. ఆలోగానే బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లులను లోక్‌సభ స్పీకర్ అనుమతితో చివరి నిమిషంలోనైనా సప్లిమెంటరీ లిస్టు ఆఫ్ బిజినెస్ జాబితాలో చేర్చే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది.
నిధుల కేటాయింపులకు సంబంధించిన కొన్ని డిమాండ్లపై సోమవారం లోక్‌సభలో చర్చించాల్సి ఉందని, అందుకే జమిలి ఎన్నికల బిల్లులను వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన రెండు బిల్లుల వివరాలను నిబంధనల ప్రకారం గత వారమే లోక్‌సభ సభ్యులకు అందజేశారు. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లుకు కేంద్ర కేబినెట్ ఈ నెల 12న ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.
జమిలి బిల్లులకు మద్దతివ్వండి
లక్నో: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’విధానాన్ని బీఎస్‌పీ అధినేత మాయావతి సమర్థించారు. ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, సంక్షేమ కార్యక్రమాలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని ఆమె చెప్పారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే జమిలి బిల్లుకు మద్దతు పలకాలని ఇతర రాజకీయ పార్టీలను మాయావతి కోరారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఆలోచించాలన్నారు.

Comments
Please login to add a commentAdd a comment