కమలా హ్యారిస్‌కు వచ్చిన ఉత్తరాలతో పెగ్గీ బ్రూక్స్ వేసిన పుస్తకం, రచయిత్రి పెగ్గీ బ్రూక్స్
‘ఒక్కగానొక్క ఆడబిడ్డ’ అన్నట్లుగా కమలా హ్యారీస్‌ను అమెరికాలో అందరూ తమ కుటుంబ సభ్యురాలిని చేసుకున్నారు! ఆమె ‘పరిపూర్ణమైన అమెరికన్’ అయుంటే ఇంకా బాగుండేదనే భావన తెల్లజాతి స్థానికుల్లో ఉన్నప్పటికీ, తమ దేశానికి వైస్ ప్రెసిడెంట్ అయిన తొలి మహిళగా ఆమెను గుర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు. మహిళలైతే ఆమెతో ఏమైనా చెప్పాలని ఉత్సాహపడుతున్నారు కూడా. ఆ ఉత్సాహం ఒక్క అమెరికన్ మహిళల్లోనే కాదు, యావత్ ప్రపంచ మహిళల్లో వ్యక్తం అవుతోంది. ఆ విషయాన్ని న్యూయార్క్‌లోని ఆఫ్రో–అమెరికన్ రచయిత్రి డాక్టర్ పెగ్గీ బ్రూక్స్ కనిపెట్టారు. కమలపై తనొక పుస్తకం వేస్తున్నాననీ, ఆమెకు ఏదైనా చెప్పదలచినవారు ఉత్తరం రాసి తనకు పంపిస్తే ఆ ఉత్తరాలను పుస్తకంగా వేస్తానని ప్రకటించారు. వేల ఉత్తరాలు వచ్చాయి. వాటిలోంచి 120 ఉత్తరాలు ఎంపిక చేసి పుస్తకంగా విడుదల చేశారు పెగ్గీ బ్రూక్స్.
పెగ్గీ బ్రూక్స్ వేసిన ఆ పుస్తకం పేరు ‘డియర్ కమల: ఉమెన్ రైట్ టు ది న్యూ వైస్ ప్రెసిడెంట్’. ఆ పుస్తకాన్ని ఒక వ్యక్తి తప్పకుండా చదవాలని బ్రూక్స్ కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరో అర్థమయ్యే ఉంటుంది. కమలా హ్యారిస్! ఇప్పటికే ఒక కాపీని ఆమె యూఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్‌కి పంపించారు కనుక కమల ఆ పుస్తకాన్ని చదివే అవకాశాలు ఉన్నాయి. పైగా అందులోనివి వివిధ మహిళలు తనకు రాసిన ఉత్తరాలు! నేడు, రేపట్లో కమల నుంచి బ్రూక్స్‌కి ఒక సందేశం వచ్చినా రావచ్చు..‘బ్రూక్స్.. మీ ప్రయత్నం నాకెంతగానో ఉపకరిస్తుంది’ అని. మంచి విషయానికి స్పందించకుండా ఉండలేకపోవడం కమల స్వభావం. పుస్తకంలో కేవలం ఉత్తరాలు మాత్రమే లేవు. ఆ ఉత్తరాలను సమన్వయం చేస్తూ కమలా హ్యారిస్‌తో ఒక రచనా ప్రక్రియగా రచయిత్రి బ్రూక్స్ పంచుకున్న మనోభావాలూ ఉన్నాయి. ‘‘ఉత్తరాల్లో ఎక్కువ భాగం.. సమాజంలోని స్త్రీ పురుష అసమానతలను తొలగించమని కోరుతూ చేసిన విజ్ఞప్తులే ఉన్నాయి’’ అంటున్నారు బ్రూక్స్.
∙∙
బరాక్ ఒబామా అధ్యక్షుడు అయినప్పుడు, ఆయన భార్య, ‘ఫస్ట్ లేడీ’ అయిన మిషెల్ ఒబామా మీద కూడా ఇదే విధంగా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు బ్రూక్స్. ఆ పుస్తకం పేరు ‘గో, టెల్ మిషెల్’. అయితే రాజకీయాల్లో ఉన్న మహిళలు, రాజకీయ నేతల భార్యల మీద మాత్రమే పుస్తకాలు రాసే స్పెషలిస్టు కారు బ్రూక్స్. ప్రధానంగా ఆమె ఆఫ్రో–అమెరికన్ మహిళల జీవిత వైవిధ్యాలకు, వారి జీవన వైరుధ్యాలకు ప్రామాణికత కల్పించే చరిత్రకారిణి. కవయిత్రి, నాటక రచయిత్రి. ఆమె రాసిన ‘వండర్‌ఫుల్ ఇథియోపియన్స్ ఆఫ్ ది ఏన్షియంట్ కుషైట్ ఎంపైర్’ గ్రంథం జగద్విఖ్యాతి చెందినది. కుషైట్‌లది ఈజిప్టులోని ఇరవై ఐదవ రాజవంశం.
డెబ్బై ఎనిమిదేళ్ల పెగ్గీ బ్రూక్స్ బాల్టిమోర్‌లో జన్మించారు. భర్త yð న్నిస్‌తో కలిసి 1986లో న్యూయార్క్ వెళ్లి స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలు. పుస్తకాలు, నాటికలు ఆమె జీవనాసక్తులు. ఆమె చదివేవీ, రాసేవీ అన్నీ కూడా స్త్రీల సంబంధ సామాజికాంశాలే. పొలిటికల్ సైన్స్ బి.ఎ. చదివారు. ప్రజారోగ్యంపై రెండు డాక్టరేట్‌లు చేశారు. అవి కూడా ఉమెన్ హెల్త్ పైనే. కుటుంబ బంధాలపై, ముఖ్యంగా తల్లీబిడ్డల అనుబంధాలపై ఆమె రచనలకు అవార్డులు కూడా వచ్చాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడితే సమాజం, సామాజిక సంబంధాలు మెరుగుపడితే స్త్రీల స్థితిగతులు మెరుగుపడతాయని బలంగా నమ్ముతారు పెగ్గీ బ్రూక్స్.
Comments
Please login to add a commentAdd a comment