పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు
భద్రాచలంటౌన్: ఒకే కవి 101 పుస్తకాలను రచించడం, వాటిని ముద్రించడం, ఒకే వేదికపై అన్నింటినీ ఆవిష్కరించడం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అరుదైన ఘట్టం. ఇది భద్రాచలం వాసి అయిన కవి చిగురుమళ్ల శ్రీనివాస్‌కు సాధ్యమైంది. ఈ పుస్తకాలను భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఇప్పటివరకు ఒకే కవి రాసిన వంద పుస్తకాలను ఒకేసారి ఆవిష్కరించిన దాఖలాలు లేవు. సుమారు ఐదేళ్ల కఠోరశ్రమ, దీక్షతో ఆయన ఈ పుస్తకాలను ముద్రించారు. ఒక్కో సామాజిక అంశంపై ఒక్కో పుస్తకం చొప్పున ప్రచురించడం విశేషం. అంతేకాక జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా 101 శతక పుస్తకాలను 101 వేదికలపై ఒకే రోజు ఆవిష్కరించబోతుండడం మరో విశేషం. శ్రీనివా స్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. మానవీయ విలువలు చాటి చెప్పడం కోసం అమ్మ శతకం, నాన్న శతకం, మేలుకొలుపు, చద్దిమాట వంటి శతకాలను రచించారు. సామాజిక రుగ్మతలపై కూడా తన కలాన్ని ఎక్కుపెట్టారు. మద్యపాన శతకం, ధూమపాన శతకం, గడ్డి శతకం, హారితహారంపై శతకాలు రాయడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. యువతలో దేశభక్తిని ప్రేరేపించేలా స్వాతంత్య్ర శతకం, భరతబిడ్డ, భరతవీర, వీరభారతి, వీరభూమి, జయభారతి, జాతీయ సమైక్య త, జై జవాన్ వంటి శతకాలను రచించారు. ఇవేకాకుండా అన్నదాత శతకం, పంట పొలము శతకం, సొంత ఊరు శతకం, ఆడపిల్ల శతకం, స్వచ్ఛభారత్ శతకం వంటి గొప్ప సామాజిక ప్రయోజనంతో కూడిన విషయాలపై ఆదర్శవంతమైన కవిత్వం రచించారు. కాగా, ఇంతటి మహోన్నత శతకాలను రచించిన శ్రీనివాస్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment