మత విశ్వాసాల విషయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన భార్య ఉషా వాన్స్ హిందూ మతంలో పెరిగినప్పటికీ.. క్రైస్తవ మతం స్వీకరించాలని తనకు ఆశగా ఉందంటూ ఆయన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించడం తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మరోసారి స్పందించారు. ఆయన క్రిస్టియన్ కాదని.. ఆమెకు మతం మారే ఉద్దేశం ఏమాత్రం లేదని అన్నారాయన.
తాను చేసింది అసహ్యమైన వ్యాఖ్య అంటూ కొందరు నన్ను విమర్శించారు. నేను ప్రజల మనిషిని. వాళ్లు వేసే ప్రశ్న నుంచి తప్పించుకోలేను. అయినా మరోసారి స్పష్టత ఇస్తున్నా. ఆమెకు(ఉష) మతం మారే ఉద్దేశం లేదు. అయినా మతపరమైన విషయాలనేవీ వ్యక్తిగతం. కుటుంబం, స్నేహితులతో చర్చించాల్సిన అంశం అది. క్రిస్టియన్లు తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలనుకుంటారు. ఇది సాధారణమైన విషయం. నా వ్యాఖ్యలు కూడా అలాంటి సాధారణ ఆకాంక్షే అని ఎక్స్ పోస్ట్‌లో వివరించారాయన.
తనపై వస్తున్న విమర్శలను అసహ్యకరమైనవిగా అభివర్ణించిన ఆయన.. క్రిస్టియన్ మతంపై ద్వేషంతోనే వాళ్లు అలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నా భార్యను నేను ప్రేమగా చూస్తా. అలాగే ఆమె మతాన్ని కూడా గౌరవిస్తా. నేను ఆమె మతాన్ని తక్కువ చేసినట్లు మాట్లాడినట్లుగా భావించి విమర్శలు చేయడం సరికాదు అని అన్నారాయన.
What a disgusting comment, and it's hardly been the only one along these lines.
First off, the question was from a person seemingly to my left, about my interfaith marriage. I'm a public figure, and people are curious, and I wasn't going to avoid the question.
Second, my… https://t.co/JOzN7WAg3A— JD Vance (@JDVance) October 31, 2025
యూనివర్సిటీ ఆఫ్ మిసిసిప్పీలో జరిగిన ఓ ఈవెంట్‌లో జేడీ వాన్స్ ప్రసంగిస్తుండగా.. భారత మూలాలున్న ఓ యువతి ఆయనపై ప్రశ్నలు గుప్పించింది. వలసలు, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ ప్రభుత్వం అవలంభిస్తున్న కఠిన వైఖరిపై నిలదీస్తూనే.. మరోపక్క మతం గురించి ఒక ప్రశ్న సంధించారు. దానికి వాన్స్ స్పందిస్తూ.. తన భార్య ఉషా, హిందూ మతంలో పెరిగినవారిగా క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాలనే ఆశ తనకు ఉందని చెప్పారు. ఆమె చాలా ఆదివారాలు తనతో పాటు చర్చికి వస్తుందని, తాను అనుభవించిన ఆధ్యాత్మిక అనుభూతిని ఆమె కూడా అనుభవిస్తే బాగుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. అంతే.. ఆయన్ని తిట్టిపోస్తూ నెటిజన్లు మండిపడ్డారు.

ఉషా వాన్స్ నేపథ్యం..
జేడీ వాన్స్ సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా చిలుకూరి వాన్స్. ఈమె తెలుగు మూలాలున్న వ్యక్తి. ఉష తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి (Usha Chilukuri Vance) పుట్టిపెరిగారు. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు.
యేల్ లా స్కూల్‌లోనే ఉషా, జె.డి.వాన్స్ (JD Vance) తొలిసారి కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం. వీళ్లకు ముగ్గురు సంతానం. ఆమె న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్‌కు మేనేజింగ్ ఎడిటర్‌గా, యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద విధులు నిర్వర్తించారు. 2015 నుంచి ఆమె న్యాయ సంబంధిత సంస్థలు ముంగర్, టోల్స్, ఓస్లాన్‌లో కార్పొరేట్ లిటిగేటర్‌గా పనిచేస్తున్నారు.
విశేషం ఏంటంటే.. అమెరికాలో ఉష లెఫ్ట్-వింగ్, లిబరల్ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. 2014లో ఆమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకున్నారు. అయితే.. రిపబ్లికన్ అయిన భర్త జేడీ వాన్స్ విజయంలో ఉషా కీలక పాత్ర పోషించారు. ఆ మధ్య ఈ కుటుంబం భారత పర్యటనలోనూ సందడి చేశారు.


