పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే! | JD Vance joke on wife Usha sparks social media backlash | Sakshi
Sakshi News home page

పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!

Published Sun, Mar 16 2025 7:37 AM | Last Updated on Sun, Mar 16 2025 8:00 AM

JD Vance joke on wife Usha sparks social media backlash

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన భార్య ఉషా చిలుకూరిని ఉద్దేశించి చేసిన సరదా వ్యాఖ్యలు కాస్తా గురి తప్పి బెడిసికొట్టాయి. మిషిగాన్‌లో ఒక కార్యక్రమానికి ఆయన భార్యాసమేతంగా హాజరయ్యారు. తన భార్య అమెరికా సెకండ్‌ లేడీగా గొప్పగా బాధ్యతలు నిర్వర్తిస్తోందంటూ పొగడ్తలు కురిపించారు. పనిలో పనిగా..‘అయితే ఒక్కటి మాత్రం నిజం. నేనెంత అర్థంపర్థం లేని మాటలు మాట్లాడినా ఆమె నవ్వాల్సిందే పాపం! ఎందుకంటే చుట్టూ కెమెరాలుంటాయి! నవ్వుతూ నాతో శ్రుతి కలపాలి. మరో దారి లేదు’ అంటూ చెణుకులు విసిరారు.

అయితే, ఆయన కామెంట్లు విమర్శలకు దారితీశాయి. తనకు సెన్సాఫ్‌ హ్యూమర్‌ అస్సలు లేదని వాన్స్‌ మరోసారి నిరూపించుకున్నారంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. చౌకబారు వ్యాఖ్యలతో భార్యను చీర్‌లీడర్‌గా చిత్రించారంటూ తూర్పారబడుతున్నారు. హాస్యం అనుకుని వాన్స్‌ చేసే కామెంట్లు ఎప్పుడూ ఇలాగే గురి తప్పుతూ ఉంటాయంటూ ఎద్దేవా చేశారు.

ఇక, వాన్స్‌ ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూడా ఉష ఎప్పట్లాగే ఆయన వెనకాల నుంచుని నవ్వుతూ చూస్తుండిపోవడం విశేషం! గత ఉపాధ్యక్షునిగా వాన్స్‌ ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయనకేసి ఉష ఆప్యాయంగా, గర్వంగా, చిరునవ్వుతో చూస్తున్న ఫొటోలు, వీడియోలు వైరల్‌ కావడం తెలిసిందే. తెలుగు మూలాలున్న ఉష 2014లో వాన్స్‌ను పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు. వాన్స్‌ దంపతులు ఈ నెలాఖర్లో భారత్‌ రానున్నారు. సెకండ్‌ లేడీ హోదాలో ఉషకు ఇది తొలి భారత పర్యటన.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement